
చెన్నై: శైవ, వైష్ణవాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి కె.పొన్ముడిని డీఎంకే అధిష్టానం పార్టీ పదవి నుంచి తొలగించింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. పొన్ముడిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
అయితే, శైవ, వైష్ణవాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే క్రమంలో మహిళలను కూడా అవమానించేలా పొన్ముడి మాట్లాడారు. పలువురు మహిళలను ఉదహరిస్తూ ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యల తాలూకు వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. వాటిపై ఇంటాబయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పొన్ముడి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావని డీఎంకే ఎంపీ కనిమొళి ఖండించారు.
మరోవైపు.. ఆయనను మంత్రి పదవి నుంచి కూడా వెంటనే తొలగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిమాండ్ చేశారు. హిందూ ధర్మంపై దాడులు చేస్తున్న డీఎంకే వ్యవస్థ ఆసాంతం అసభ్యకరంగా తయారైందన్నారు. పొన్ముడికి వివాదాలు కొత్తేమీ కాదు. హిందీ మాట్లాడే వారినుద్దేశించి పానీపురీ అమ్ముకుంటారంటూ గతంలోనూ ఆయన అత్యంత అభ్యంతరకరంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తమిళనాడు మరోసారి రాజకీయంగా వేడెక్కింది.
This is DMK’s standard of political discourse in Tamil Nadu. Thiru Ponmudi was once the Higher Education Minister of Tamil Nadu & now Minister for Forests and Khadi, and the youth of Tamil Nadu are expected to tolerate this filth? Not just this Minister, the entire DMK ecosystem… pic.twitter.com/ENMq47hiPf
— K.Annamalai (@annamalai_k) April 11, 2025
కాగా.. పొన్ముడి ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చడం విమర్శలకు దారితీసింది. ఇక, ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న అభియోగాలపై ఆయనకు మద్రాసు హైకోర్టు జైలుశిక్ష కూడా విధించింది. దీంతో ఆయన శాసనసభ్యత్వంపై అనర్హత వేటు కూడా పడింది. అనంతరం శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో తిరిగి మంత్రిమండలిలో చోటు దక్కించుకున్నారు.