సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్ | Womens are intrest on kick boxing | Sakshi
Sakshi News home page

సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్

Published Tue, Jun 23 2015 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్

సిటీలో సెన్సేషనల్ మిసైల్.. లెట్స్ మూవ్

కిక్ బాక్సింగ్‌కు మహిళలు ఫిదా
‘గిమ్మీ ఫైవ్’ అంటూ జిమ్స్‌కు పయనం
క్రేజీ వర్కవుట్స్‌తో ఉత్తేజం

నగరవాసులకు ఆరోగ్యపరమైన సూత్రాలను ఇప్పుడు బాగా వంటబట్టించుకుంటున్నారు. ‘వినదగు నెవ్వరు చెప్పిన’ అన్నట్టు.. ఇలాంటివి ఎవరు చెప్పినా ఆసక్తిగా పాటిస్తున్నారు. చెప్పేది  మిస్ ఇండియా అయినా మిషెల్ ఒబామా అయినా.. ‘ఫిట్‌నెస్’ అంటే సిటీ మహిళలు సై అంటున్నారు. అలాగే ‘లెట్స్ మూవ్’ అంటూ మిషెల్ సంధించిన మిసైల్ లాంటి పంచ్‌లకు ఫిదా అయిపోయి కిక్స్‌తో రఫ్ఫాడించేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రేజీగా మారిన వర్కవుట్ కిక్ బాక్సింగ్ విశేషాలవి..
 
గత నెలలో అమెరికా దేశపు ప్రధమ మహిళ మిషెల్ ఒబామా ఒక వర్కవుట్ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. స్వల్ప కాలంలోనే కోటి మందికి పైగా వీక్షకుల్ని సంపాదించిన ఆ వీడియోలో తన వర్కవుట్స్‌ని ఆమె పరిచయం చేశారు. మిషెల్ చేసిన 5 ఎక్సర్‌సైజ్‌ల్లో.. జంపింగ్ రోప్, మెడిసిన్ బాల్‌తో అబ్డామినల్ క్రంచెస్, బెంచ్ స్క్వాట్స్, డంబెల్ ప్రెసెస్, బాక్సింగ్.. ఉన్నాయి. కేవలం రెండు నిమిషాలు మించి లేని ఈ క్లిప్‌లో మిషెల్‌తో పాటు ఆమె ఫ్యామిలీ ట్రైనర్ కార్నెల్ మెకెల్లన్ కూడా  కనిపిస్తారు. స్క్వాట్స్, క్రంచెస్ అయిపోయాక మిషెల్ బ్లూ బాక్సింగ్ గ్లవ్స్ ధరించి కిక్స్ మొదలుపెట్టారు. ఆమె ఇందులో ఒక టు-పంచ్ కాంబోను చూపించి ఆ తర్వాత గిర్రున తిరుగుతూ బ్యాగ్‌పై ఓ రౌండ్ హౌజ్ కిక్ ఇచ్చారు. మిగతావి ఎలా ఉన్నా... ఆమె పంచ్  బ్యాగ్‌పై పంజా విసురుతూ ఇచ్చిన రౌండ్ హౌజ్ కిక్స్..ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. మిషెల్ వీడియో నగర మహిళల్లో కిక్ బాక్సింగ్ పట్ల అమాంతం క్రేజ్ పెంచేసింది.
 
మరెందరికో ‘కిక్’..
తను ఏం తిన్నా తనను ఫిట్‌గా ఉంచే శక్తి కిక్ బాక్సింగ్‌కి ఉన్నట్టు గ్రహించానని టాలీవుడ్ సినీనటి రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఫుడ్ డబుల్ అయినప్పుడు శాండ్‌బాగ్స్‌కి కిక్స్ ఇస్తూ రెట్టింపు సమయం గడుపుతానని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మిషెల్ ఒబామా అప్‌లోడ్ చేసిన ‘లెట్స్‌మూవ్’ వీడియో మహిళల్ని ఎక్సర్‌సైజ్‌ల వైపు మళ్లించేలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు సిటీ సోషలైట్ సుశీలా బొకాడియా. తాను రోజూ 2 గంటల పాటు వర్కవుట్ చేస్తానని, తన వర్కవుట్‌లో ఇప్పుడు కిక్ బాక్సింగ్ ప్రధానమైన భాగమని చెప్పారు. యోగా ట్రైనర్‌గా రోప్ యోగా వంటి వెరైటీ శైలుల్ని  పరిచయం చేసిన రినా హిందోచా కూడా తాను ఇటీవలే కిక్ బాక్సింగ్‌ను సాధన చేస్తున్నానన్నారు. ఇది మహిళల్ని శక్తివంతం చేయడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణకు కూడా ఉపకరిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
 
మిక్స్ చేస్తే మస్తు మస్తే..
చూడ్డానికి కష్టంగా అనిపించినా ఈ కిక్స్, పంచ్‌లు తేలిగ్గా చేయగలిగినవేనని జరీర్ చెప్పారు. ఇది మోకాలు, లోయర్ బ్యాక్‌లపై తక్కువ భారాన్ని వేసే వ్యాయామం. ఎప్పటికప్పుడు ఆసక్తిని పెంచుకునేందుకు వీలుగా దీనిని విభిన్న మార్గాల్లో చేయవచ్చు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్‌ను కూడా జత కలిపి చేయడం అలాంటి ఒక వైవిధ్యమార్గం. అయితే, కొత్తగా సాధన చేసేవారు తప్పనిసరిగా మంచి కార్డియో కిక్ బాక్సింగ్  ట్రైనర్‌ను ఎంచుకోవాలి. కొంత కాలం పాటు ట్రైనర్ శిక్షణలో కొనసాగి పరిణితి సాధించాక ఒక పంచ్ బ్యాగ్‌ను మాత్రం ఏర్పాటు చేసుకుని స్వయంగా సాధన కొనసాగించవచ్చు.
 
ఫటాఫట్.. బెని‘ఫిట్’

ఒక క్రీడగా చాలా మంది అభిమానించే బాక్సింగ్‌ను ఆరోగ్య సాధనంగా మార్చడం ద్వారా చక్కని ఫిట్- వర్కవుట్‌గా మార్చవచ్చు. ఇపుడు జిమ్‌లు, ఫిట్‌నెస్ సెంటర్లలో దీన్ని ‘కార్డియో కిక్ బాక్సింగ్’గా వ్యవహరిస్తున్నారు. కరాటే  కిక్‌లు, బ్లాక్స్ పంచ్‌లు వంటివి సంప్రదాయ ఎరోబిక్స్‌తో మిళితం చేసిన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్.. ఈ కార్డియో కిక్ బాక్సింగ్.  
కరాటే, బాక్సింగ్‌ను మేళవించిన ఏరోబిక్ వ్యాయామ శైలి ఇది. బాడీ బ్యాలెన్సింగ్‌కి ఉపకరిస్తుంది. దీని ద్వారా ప్రారంభంలో గంటకి 400 నుంచి 500 క్యాలరీలు, రెగ్యులర్‌గా చేసేవారికి 800-900 క్యాలరీల వరకూ ఖర్చవుతాయి. ఇది ఫ్యాట్‌ని కరిగించే అత్యుత్తమ సాధనగా నగరానికి చెందిన ఫిట్‌నెస్ గురు జరీర్ పటేల్ చెబుతున్నారు.
ఈ వర్కవుట్ కదలికల్లో చురుకుదనాన్ని పెంచుతుంది. పొట్ట భాగాన్ని సున్నితంగా బిగించి కిక్స్, పంచ్‌లు ఇవ్వడం ద్వారా అబ్డామినల్ మజిల్ బాగా పటిష్టమవుతుంది. అప్పర్ కట్, జాబ్, ఎల్బోహుక్, స్నాచ్, రివర్స్‌కిక్, రౌండ్ కిక్.. నేర్చుకుంటే స్వీయ రక్షణకూ ఉపకరిస్తుంది.
 
లెట్స్ మూవ్..

చిన్నారులు బయటకు వెళ్లాలి, యాక్టివ్‌గా మారాలి అనే ఉద్దేశంతో అమెరికా ఫస్ట్ లేడీ ప్రారంభించిన ‘లెట్స్ మూవ్’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓ వీడియోను మిషెల్ అప్‌లోడ్ చేశారు. దీనిలోనే ఆమె ప్రముఖులను, సాధారణ ప్రజలను ‘గిమ్మీ ఫైవ్’ అంటూ కోరుతున్నారు. అంటే ఫిట్-యాక్టివ్‌గా ఉండేందుకు 5 సూత్రాల మార్గం ఇవ్వమని అర్ధం. దీనికి స్పందనగా బరాక్ ఒబామా సైతం తన వీడియోను పోస్ట్ చేశారు. అందులో యాక్టివ్‌గా ఉండడానికి తాను చేసేవి జాగింగ్, కూర్చుని కాకుండా ‘వాక్ అండ్ టాక్’ మీటింగ్స్ వంటివి ఆయన పొందుపరచారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement