బతికి సాధిస్తా.. | Acquire survivors .. | Sakshi
Sakshi News home page

బతికి సాధిస్తా..

Published Mon, Feb 9 2015 6:40 AM | Last Updated on Sat, Sep 2 2017 9:02 PM

బతికి సాధిస్తా..

బతికి సాధిస్తా..

నేటి బాలికలే రేపటి మహిళలు. మరి ఆ రేపటి మహిళలు ఇప్పుడెంత సేఫ్‌గా ఉన్నారు?  దేశం మొత్తం బేటీ బచావో అంటోంది? మరి హైదరాబాద్ మాటేమిటి? రానున్న మార్చి 8 మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చిన్నారుల స్థితిగతులపై వరుస కథనాలు..
 
సైరా (పేరు మార్చాం) పదిహేనేళ్ల అమ్మాయి. పేదరికం, అమాయకత్వం ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నాయి. బాల్యాన్ని మాయం చేశాయి. ఇప్పుడిప్పుడే వాటి నుంచి కోలుకుంటూ బతుకుపై ఆశ పెంచుకుంటోంది. ఆ కథ ఈ బేటీ మాటల్లోనే..       ..:: సరస్వతి రమ
 
నాన్నకు అనారోగ్యం. అమ్మ ఉల్లిగడ్డలమ్మి ఇల్లు నడిపిస్తుంది. నాకో అక్క. కష్టమైనా.. అమ్మ మా ఇద్దరినీ మంచి స్కూల్లో జాయిన్ చేసింది. ఓసారి సమయానికి అమ్మ ఫీజ్ కట్టకపోయే సరికి మమ్మల్ని స్కూల్ నుంచి తీసేశారు. అప్పుడు నేను సెవెన్త్.. అక్క టెన్త్. ఎలాగో అక్క టెన్త్ కంప్లీట్ చేసింది. నేను ఏడుతోనే ఆపేశాను. ఆ టైమ్‌లోనే అక్కకు పెళ్లయింది. అప్పుడు నాకు పదమూడేళ్లు. బావ పేరు మొహినుద్దీన్ (మార్చాం). అక్కా, బావా మా ఇంట్లోనే ఉండేవారు. కొన్నాళ్లకి బావ వాళ్ల అన్నయ్య (జాఫర్) చుట్టపుచూపుగా వచ్చి మా ఇంట్లోనే ఉండసాగాడు. రోజూ నాకోసం చాక్లెట్లు, బిస్కట్లు తెస్తుండేవాడు. ‘జాఫర్ భయ్యా’ అని పిలుస్తూ నేనూ అతనితో చనువుగానే మాట్లాడేదాన్ని. చిన్నప్పటి నుంచి అన్నయ్య ఉంటే బాగుండనుకునే నాకు.. జాఫర్ రాగానే ఓ అన్నయ్య దొరికాడన్న ఫీలింగ్ కలిగింది.
 
ఒకరోజు...

ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. జాఫర్ నా పక్కన కూర్చోని అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. వెంటనే బయటకొచ్చేశాను. భయంతో ఎవరికీ చెప్పలేదు. కొన్ని రోజులకు నన్నిచ్చి పెళ్లిచేయాలని అమ్మనడిగాడు జాఫర్. అమ్మ అతనిని గట్టిగా తిట్టి పంపింది. అప్పటికే అతనికి 30 ఏళ్లు. కొన్నాళ్లకి అమ్మకి, అక్కకి గొడవైంది. అక్క, బావ వేరు కాపురం పెట్టారు. జాఫర్ మాత్రం మా ఇంట్లోనే ఉండేవాడు. నాన్న ఆరోగ్యం కాస్త మెరుగైంది. అమ్మకి సాయంగా మార్కెట్‌కీ వెళ్లసాగాడు. అమ్మా, నాన్న మార్కెట్‌కి వెళ్లిపోతే ఇంట్లో నేనొక్కదాన్నే ఉండేదాన్ని.
 
ఆ క్రమంలో..


ఓ రోజు జాఫర్ బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి గడియ వేశాడు. ‘నిన్ను నాకిచ్చి పెళ్లి చేయరా..’ అంటూ నాపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. కాళ్లుపట్టుకుని బతిమాలినా వదలే ్లదు. పరువు పోతుందని విషయాన్ని మనసులోనే దాచుకున్నాను. ఇదే అలుసుగా జాఫర్ నాపై ఓ నెల రోజులు పదే పదే దాడి చేశాడు. నెల తర్వాత నా శరీరంలో సహజంగా జరగాల్సిన ఓ ప్రక్రియ ఆగిపోయింది. అమ్మకి చెప్పాను. హాస్పిటల్‌కి తీసుకెళ్తే నేను ప్రెగ్నెంట్ అని తేలింది. అమ్మ నన్ను బరబర లాక్కుంటూ ఇంటికొచ్చింది. జాఫర్ గురించి ఆరా తీస్తే అప్పటికే వాడు గాయబ్. అమ్మ నాకు అబార్షన్ చేయించింది. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలా కాలం పట్టింది.
 
ఇంకో జాఫర్..

పాతగాయం నుంచి కొంత కోలుకున్నాక బయటివాళ్లతో కాస్త మాట్లాడేదాన్ని. మా ఇంటి కింద ఓ హోటల్ ఉండేది. బ్రెడ్, స్నాక్స్ కోసం నా కజిన్‌తో కలసి హోటల్‌కు వెళ్లేదాన్ని. అక్కడే ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. అతని పేరూ జాఫరే. ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. నాకో సిమ్‌కార్డ్ ఇచ్చాడు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అప్పటికి నాకు పదిహేనేళ్లు. జాఫర్ నన్ను పెళ్లి చేసుకుంటానని మా అమ్మను అడిగాడు. అమ్మానాన్న లేని అనాథనని చెప్పాడు. అమ్మ సరేనంది. అందరం కలసి ఒకే ఇంట్లో హ్యాపీగా ఉన్నాం.
 
ఓ రోజు...

అమ్మ కోపంతో అరుస్తూ నన్ను బాగా కొట్టింది. కోపమొచ్చి అక్క వాళ్లింటికి వెళ్లాను. అక్క పోలీస్ కంప్లయింట్ ఇవ్వమంది. అలాగే చేశాను. దాంతో పోలీసులు నన్ను హాస్టల్లో చేర్పించారు. వారం తర్వాత షాహీన్‌కొచ్చాను. జరిగింది ఆలోచిస్తే నేను చేసిన తప్పేంటో తెలిసింది. వెళ్లి అమ్మను క్షమాపణ అడిగాను. ఆ రోజు నన్నెందుకు కొట్టిందో అమ్మ అప్పుడు చెప్పింది. ఈ జాఫర్‌కి అంతకుముందే పెళ్లయి ఇద్దరు పిల్లలట. అది అమ్మకు తెలిసింది. అందుకే కొట్టింది. అలా తెలిసీ తెలియనితనంతో రెండుసార్లు దెబ్బతిన్నాను. బాధగా ఉంది. అయినా బతకాలన్న తపనుంది. ‘షాహీన్’ సంస్థ సాయంతో చదువుకుంటున్నాను. నా కాళ్లపై నేను నిలబడతాను. నాలాంటి అమ్మాయిలకు అండగా నిలుస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement