మాస్టర్ మదర్ | Master Mother | Sakshi
Sakshi News home page

మాస్టర్ మదర్

Published Wed, Jan 7 2015 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

మాస్టర్ మదర్

మాస్టర్ మదర్

పెరిగి పెద్దయి, పెళ్లయి, పిల్లల తల్లయ్యాక.. మహిళలు టెన్నిస్ బ్యాట్‌లు పట్టుకుంటున్నారు. చద‘రంగం’లోకి దిగుతున్నారు. హైలెస్సా అంటూ పడవలెక్కుతున్నారు, రా‘రన్’డంటూ పరుగు తీస్తున్నారు. సిటీ మహిళ ఇంట్లో అమ్మగా మాత్రమే కాదు రేపటి లిటిల్ మాస్టర్స్‌కు కోచ్‌లుగానూ మారుతున్నారు.
 ..:: ఎస్.సత్యబాబు
 
పిల్లలు ఆడుతుంటే తల్లులకు ఆనందం వేస్తుంది. పిల్లలు ఓడిపోతుంటే ఆ అమ్మ పడే బాధ ఇంకెవరూ పడరేమో.. తమ చిన్నారులు ఓడిపోకూడదనుకుంటున్న తల్లులు పరోక్ష కోచ్‌లుగా మారుతున్నారు. తమ సమయాన్ని, స్వేదాన్ని ఖర్చు చేస్తూ పిల్లల విజయాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
 
అన్నీ అమ్మే..

కోచ్ పాత్ర ఆటలో శిక్షణకే పరిమితమైతే.. అమ్మ మాత్రం టీచర్, గైడ్, కోచ్, మెంటర్, ఫిలాసఫర్.. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘టెన్నిస్ గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే మా అమ్మాయి టెన్నిస్ ఎంచుకోవడంతో దాని గురించి నేనూ తెలుసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మా అమ్మాయికి ఒక కౌన్సెలర్‌లా వ్యవహరిస్తాను. ఆట, చదువు రెండిటికీ ఉపకరించే సలహా సూచనలు ఇస్తుంటాను’ అని చెప్పారు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో చదివే తనుషితారెడ్డి (10) తల్లి శ్రీలత. నిజమైన కోచ్‌లు కాకపోయినా, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వలేకపోయినా.. పోటీలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పిల్లల్ని సంసిద్ధుల్ని చేయడంలో సైకలాజికల్‌గా ట్రీట్ చేయడంలో తల్లులు ప్రధానపాత్ర పోషిస్తున్నారు.
 
వెంటుండి.. వెన్ను తట్టి..


శిక్షణ తరగతులకు పిల్లలతో పాటు వెళ్తూ ప్రొఫెషనల్ కోచ్  పిల్లలను తీర్చిదిద్దుతున్న తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తున్నారు. బలాబలాలను అంచనా వేస్తున్నారు. లోటు పాట్లను గమనిస్తున్నారు. తద్వారా కోచ్ అందుబాటులో లేని సందర్భాల్లో తాత్కాలిక కోచ్‌లుగా మారిపోతున్నారు. పిల్లల అలవాట్లు, పద్ధతుల గురించి కోచ్‌లకు అవసరమైన సమచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మ్యాచ్‌లకు ముందు తమ పిల్లలు సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తరచుగా వీరితో కలసి క్యాంప్‌లకు వెళుతున్నారు. ఆడుతున్నప్పుడు స్టాండ్స్‌లో కూచుని పిల్లలను ఉత్సాహపరుస్తున్నారు. ‘టెన్నిస్‌లో వరల్డ్ చాంపియన్ కావాలనేది మా అమ్మాయి కల. అది నెరవేరేందుకు నా వంతుగా వీలైనంత సమయాన్ని కేటాయిస్తున్నా’నంటున్నారు డాక్టర్ రేఖ. తన కుమార్తె మాన్సి మునేశ్వర్‌ను అన్ని విధాలుగా గైడ్ చేయడానికి ఆమె ప్రతి టెన్నిస్ పోటీనీ టీవీలో చూడటం అలవాటు చేసుకున్నారు. పెద్దగా టెన్నిస్ కోర్ట్‌లు, కోచ్‌లు అందుబాటులో లేని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వారవడంతో.. రేఖ తన కూతురు విషయంలో మరింత బాధ్యత తీసుకున్నారు. ‘నేను వృత్తిరీత్యా బిజీగా ఉంటే మా అమ్మగారైన జనాబాయిని మాన్సితో టోర్నమెంట్స్‌కు తోడుగా పంపుతుంటాను’అని రేఖ చెప్పారు.
 
రీప్లేస్‌మెంట్ కాదు..

అయితే తల్లులు ఎంత మాత్రమూ అసలైన కోచ్‌లకు ప్రత్యామ్నాయం కాదనేది నిస్సందేహం.‘కోచ్‌లను రీప్లేస్ చేయలేం. కోచ్‌లకు సబ్‌స్టిట్యూట్ లేరు’ అని అండర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఫయాజ్ మహ్మద్ తల్లి నస్యమ్ మహ్మద్ స్పష్టం చేస్తారు. ట్రైనింగ్‌లో కోచ్ పాత్ర ముగిసిన తర్వాతే తన కొడుకు విషయంలో తన పాత్ర మొదలువుతుంది అంటారామె. తల్లుల విషయంలో వస్తున్న ప్రధాన ఫిర్యాదు ఏమిటంటే పిల్లలపైన ఒత్తిడి పెంచుతున్నారని.  టాలెంట్ లేకుండా ఎంత  నెట్టినా ప్రయోజనం ఉండదని మోడ్రన్ మదర్స్ గుర్తించాలి.  కొన్నిసార్లు పేరెంట్స్ తమతో ఉండటం వల్ల పిల్లలు ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు తమ సహజసిద్ధమైన ఆట ఆడుకునేందుకు వీలు కల్పించాలి. పిల్లలు మెడల్ విన్నింగ్ మెషిన్లు కారని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు కోచ్‌లు. తమ పనిలో తరచు జోక్యం చేసుకోవడం కూడా సరైంది కాదని చెబుతున్నారు.
 
తోడు నీడ..

‘మా అమ్మాయి టెన్నిస్ మూడేళ్లుగా ఆడుతోంది. గైడ్‌గా, మెంటర్‌గా, కంపానియన్‌గా, క్రిటిక్‌గా తోడుంటాను. అయితే ఆమెకు రోజువారీగా ఉండే ఒత్తిడిని  పెంచాలనుకోను’ అంటారు శృతి భాసిన్. ఇటీవల జరిగిన ఏఐటీఏ అండర్ 12 స్పోర్ట్స్ కల్ట్ టెన్నిస్ టోర్నమెంట్‌లో గాళ్స్ సింగిల్స్ చాంపియన్‌గా గెలిచిన స్మృతిభాసిన్ తల్లి ఆమె. ఇటీవల నగరంలో నిర్వహించిన సెయిలింగ్ పోటీల్లోనూ తల్లులు కుమార్తెలకు తోడుగా వారితో పాటు పోటీల్లో పాల్గొని అబ్బురపరచారు. ‘మా అమ్మే నాకు యాచింగ్ పోటీలకు ఎంతో గెడైన్స్ ఇచ్చారు.

ఆమె సహాయం లేకుంటే నేను ముందడుగు వేయలేపోయేదాన్ని’ అంటారు సిటీలో ఇటీవల జరిగిన మాన్‌సూన్ రెగెట్టాలో పాల్గొన్న జుహి. టెన్నిస్, సెయిలింగ్, చెస్, స్కేటింగ్.. ఆటేదైనా పిల్లల్ని అంటిపెట్టుకుని తిరిగే అమ్మలు ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నారు. ఆధునిక అమ్మ ఇప్పుడు ఆదిగురువు మాత్రమే కాదు ఆటల గురువు కూడా. చిన్నారి విజయాలే లక్ష్యంగా వ్యయప్రయాసలకు సిద్ధమవుతున్నారు. ఈ అమ్మల ఆరాటాలు, ఆకాంక్షలు నెరవేరడమంటే.. భారతీయ క్రీడారంగం ప్రపంచంలోనే మేటిగా వెలుగొందడమే. ఆ రోజు రావాలి. అమ్మ కల నెరవేరాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement