S.Satyababu
-
ఓ ముసుగు ముచ్చట
Protection 4 Fashion 8 స్కార్ఫ్.. ఒక రక్షణ కవచం. కాలుష్య రక్కసి నుంచి మాత్రమే కాదు కాటేసే చూపుల నుంచి కూడా. పొల్యూషన్‌కు సొల్యూషన్‌లా వచ్చిన ఈ స్కార్ఫ్ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా మారుతోంది. దీంతో అమ్మాయిలు వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. వీటి ట్రెండ్ ఊపందుకోవడంతో కొత్త కొత్త వెరైటీ స్కార్ఫ్‌లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. అయితే ఫ్యాషన్ మోజులో ఏవి పడితే అవి ఉపయోగించడం వల్ల చర్మవ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు సిటీకి చెందిన డెర్మటాలజిస్టులు. - ఎస్.సత్యబాబు నిజానికి స్కార్ఫ్‌లను స్టోల్ అని పిలుస్తారు. అయితే వాడుకలో స్కార్ఫ్ అంటున్నారు. సిటీలో కాలుష్యం బారి నుంచి తప్పించుకునేందుకు అమ్మాయిలు స్కార్ఫ్‌లను విరివిగా వినియోగిస్తున్నారు. బైక్, బస్సుల్లో, ఆఖరికి నడిచి వెళ్తున్నవారు కూడా విభిన్న రకాల స్కార్ఫ్‌లను వాడుతున్నారు. ప్రొటక్షన్‌గా వచ్చిన స్కార్ఫ్‌లు కాస్త ఫ్యాషన్‌గా మారిపోయాయి. అయితే స్కార్ఫ్ల ఫ్యాబ్రిక్ వల్ల కొత్త రకం చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదముందని సిటీకి చెందిన ప్రజ్ఞ ఆసుపత్రి డాక్టర్ పద్మావతి సూరపనేని హెచ్చరిస్తున్నారు. రక్షణ కోసం వాడేది సమస్యల కారకంగా మారకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు. వస్త్రం నుంచి వర్ణం దాకా కారణాలే.. దేహంతో పోలిస్తే మహిళల ముఖ చర్మం మరింత సున్నితం. కాలుష్యం నుంచి తమను తాము కాపాడుకునేందుకు స్కార్ఫ్‌లు వినియోగించినప్పటికీ తరచూ ముఖంపై రాషెస్ వస్తున్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారంటే కారణం... సదరు స్కార్ఫ్ల తయారీలో వినియోగించిన కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వారికి ఫ్యాబ్రిక్ అలర్జీ కారణంగా రాషెస్ రావచ్చు. ముఖ్యంగా నైలాన్, పాలిస్టర్, స్పాండెక్స్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్‌లు వినియోగిస్తే కాంటాక్ట్ డెర్మటైటిస్ (ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే చర్మవ్యాధి) సమస్య తప్పదు. అదే విధంగా కొన్ని ఫ్యాబ్రిక్స్ మెత్తగా, ముడతల్లేకుండా ఉండేందుకు వాడే ఐడొహైడ్ వంటి రసాయనాలు సైతం చర్మంపై దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. అలాగే కొన్ని రకాల రంగుల్లో వినియోగించే పారా-ఫెనిలెనెడియామైన్(పిపిడి) అజో, ఆంత్రాక్క్వైనోన్ ఆధారిత డైలు కూడా అలర్జిక్ డెర్మటైటిస్‌కు కారణమవుతాయి. కాటన్, ఫ్యాబ్రిక్, ప్యూర్ సిల్క్ వంటి వాటిలో కూడా వీటిని వినియోగిస్తారు. మేకప్పుకు పైకప్పుగా వద్దు.. కన్సీలర్స్ లేదా ఫౌండేషన్‌ను ముఖానికి వినియోగించినప్పుడు అదే సమయంలో సింథటిక్ స్కార్ఫ్స్ను ఎక్కువ సేపు అదిమిపెట్టి ఉంచితే గాలి సోకకపోవడంతో విపరీతమైన స్వేదం ఏర్పడి మొటిమలు వస్తాయి. స్కార్ఫ్స్ కొనేటప్పుడు సహజ సిద్ధంగా తయారైన ఫ్యాబ్రిక్ లేదా కాటన్ లేదా లెనిన్ ఫ్యాబ్రిక్మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం. రంగులు కూడా అత్యంత తక్కువ కలిసినవి మాత్రమే వినియోగించాలి. వీటిలో తక్కువ డై ఉంటుంది. ఎక్కువ సేపు స్కార్ఫ్ కట్టుకొని ఉండాల్సి వస్తే దానిని తొలగించిన వెంటనే ముఖాన్ని మంచినీటితో శుభ్రపరచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. డాక్టర్ పద్మావతి డెర్మటాలజిస్ట్, కాస్మొటాలజిస్ట్, ప్రజ్ఞ హాస్పిటల్,పంజాగుట్ట 040 23356070 / 9848367000 -
రాగాల అతిథులూ... రారండీ!
దేవుడు తనను తల్లిగా స్వీకరించనున్నాడనే సంతోషాన్ని సోదరితో పంచుకోవడానికి మేరీమాత ఒక పాటను ఎంచుకుందట. అయితే ముందే సోదరి సంగీతంతో మేరీమాతకు స్వాగతం పలికింది. ఇలా యేసు జన్మదిన సంబరాలకు, ఆట పాటల సందడికి ఉన్న అనుబంధం ఆ కథల్లో అడుగడుగునా ప్రస్ఫుటిస్తుంది. అందుకు తగ్గట్టే క్రిస్మస్ సమయంలో నివాసాలన్నీ సంగీత నిలయాలుగా మారతాయి. ప్రార్థనా మందిరాలన్నీ పాటల వేదికలవుతాయి. క్రీస్తు రాక గురించి సమాచారాన్ని దేవదూతల ద్వారా తెలుసుకున్న మూగ జీవాలు ఆనందంతో వీధుల్లో తిరుగుతూ అందరికీ ఈ విషయాన్ని రాగాలు తీస్తూ తెలియజేశాయట. ఈ కథను ఆధారం చేసుకుని ఆవిర్భవించినవే క్యారల్స్ సంబరాలు. డిసెంబరు రెండో వారం గడిచినప్పటి నుంచి క్రిస్మస్ అయ్యేవరకూ ఇవి కొనసాగుతాయి. రాగాల రాత్రి... ప్రతి చర్చిలోనివారూ బృందాలుగా ఏర్పడతారు. రాత్రి అయ్యాక విశ్వాసుల ఇళ్లకు వెళతారు. పాటలు పాడుతూ క్రీస్తు ఘనతను కొనియాడతారు. క్రిస్మస్ శుభ వార్త చెప్పడం, పాటలు పాడడం, కుటుంబీకుల క్షేమం గురించి ప్రార్థించడం, బైబిల్ ఇచ్చి వెళ్లడం... క్యారల్స్ బృందం చేసే సందడి అంతా ఇంతా కాదు. అయితే ఇది కేవలం మతపరమైన చర్యగానే చూడటం లేదు కొందరు. ‘‘ఇది మతపరమైన వేడుకగా పరిమితం చేయం. మా చర్చ్ మెంబర్స్ కాని వారి ఇళ్లకూ వెళతాం. ఒకింట్లో ఉన్న ప్పుడు పొరుగింటివాళ్లు అడిగితే వారిం టికి కూడా వెళతాం’’ అని ఒక క్యారల్ గ్రూప్ సభ్యురాలైన అమూల్య షెరాన్ చెప్పారు. ఒక్కో ఇంట్లో 15 నిమిషాలకు మించి గడపరు. రోజులో 10 నుంచి15 ఇళ్ల వరకూ చుట్టేస్తారు. అలా ఈ కార్యక్రమం తెల్లవారుఝామున 5 గంటల వరకూ కొనసాగుతుంది. అందరూ బంధువులే... అందర్నీ అను‘రాగ’ంతో పలకరించే క్యారల్స్ సంప్రదాయం... పండుగ అంటే సంతోషాన్ని పంచుకోవడమేననే గొప్ప సందేశాన్ని అందిస్తోంది. ఈ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణ కారణంగా కొందరు స్వచ్ఛంద బృందాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ బృందాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఐటీ ప్రొఫెషనల్స్... ఇలా విభిన్న రంగాలకు చెందినవారు సభ్యులుగా మారుతున్నారు. సింగర్స్, గిటారిస్ట్‌లు, కీబోర్డ్ ప్లేయర్స్, కాంగో ప్లేయర్స్... ఇలా విభిన్న రకాల ఇన్స్ట్రుమెంట్స్ను పలికించ గల నేర్పు ఉన్నవారు తమ టాలెంట్‌ను చూపించడానికి కూడా ఇదో అద్భుతమైన అవకాశంగా మారుతోంది. కులమతాలకు అతీతంగా సంగీతాభిమానులను, నలుగురితో కలిసి వేడుకలను ఆస్వాదించే వారిని ఆకట్టుకుంటోంది. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో కేరల్స్ గ్రూప్‌లలో సభ్యులవుతున్నారు. కొన్నిసార్లు ఈ కేరల్ గ్రూప్ సభ్యుల సంఖ్య ఎక్కువై తిరగడానికి మినీ బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది. ‘న్యూలైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్’ చర్చి తరపున కేర్‌సెల్ గ్రూప్స్ అని వ్యవహరిస్తాం. ప్యారడైజ్ కేర్‌సెల్. అల్వాల్ కేర్‌సెల్... అలా ఇవి లొకేషన్ వైజ్ డివైడ్ అవుతాయి. మా గ్రూప్‌లో 20 మంది ఉన్నాం. నేను 2012 నుంచి క్యారల్ గ్రూప్‌తో వెళుతున్నా. చలిలో అలా వెళ్లడం, కొత్త వ్యక్తుల్ని కలవడం, సంప్రదాయ వినోదాలను పంచడం, అందరి బాగు కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించడం... ఇవన్నీ గొప్ప ఫీలింగ్. కొంతమంది టీ, కాఫీ, బిస్కెట్స్ మాతో షేర్ చేసుకుంటారు’’ అంటూ చెప్పారు అమూల్య షెరాన్. - ఎస్.సత్యబాబు -
వైబోగం
చక్కగా సూటూ బూటూ వేసి డిగ్నిఫైడ్ లుక్‌తో పార్టీకి వెళ్లారు. అక్కడ మీ లుక్కు తగ్గట్టే స్టైల్‌గా బిహేవ్ చేస్తూ సూప్ సేవిద్దామనుకున్నారు. సూప్‌ని తీయడానికి వంగితే మీ కన్నా ముందు మీ టై సూప్‌ని టేస్ట్ చేసేసింది. అప్పుడెలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ కన్నా.. ఆల్టర్నేటివ్ ఎంచుకోవడం మిన్న అని నమ్మే స్టైల్ హంటర్స్ నెక్ టై స్థానంలో ‘బో’టైకు చోటు కల్పిస్తున్నారు. దీంతో పొడవాటి ‘టై’ కాస్తా ఇప్పుడు చిట్టి పొట్టి ‘బో’ విజృంభణతో విలవిల్లాడిపోతోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. సీన్‌కానరీ కాలం నాటి బో టై సరికొత్త ఫ్యాషన్ ఓషన్ సృష్టిస్తోంది. ..:: ఎస్.సత్యబాబు మెడ దగ్గర చొక్కా కాలర్‌ను అంటుకుని.. పడుకున్న 8 అంకెలా ఉండే ‘బో-టై’ సూటూ, బూటుకు సరిజోడు. సులువుగా ధరించే వీలుండటం, లెంగ్తీ టై తరహాలో అటూ ఇటూ కదులుతూ ఇబ్బంది కలిగించకపోవడం, పిల్లలు పట్టుకుని లాగడానికి గాని, ఎక్కడైనా చిక్కుకుపోవడానికి గాని అవకాశం లేకుండా.. సింపుల్, క్యూట్‌గా ఉండడం.. వంటి ప్రత్యేకతలతో నెక్ టై ప్రాభవానికి తాజాగా గండికొట్టేసింది. శతాబ్దాల క్రితం నాటి ఫ్యాషన్ బో టై.. అనే పురుషుల యాక్సెసరీకి మూలాలు 17వ శతాబ్దం నాటివి. బటన్స్ లేని చొక్కాల కాలంలో కింగ్ లూయిస్‌కి మద్దతుగా ఫ్రాన్స్‌కు ప్రయాణం చేసిన క్రోషియన్ సోల్జర్స్.. చల్లగాలి, వాన చినుకుల నుంచి రక్షించుకోవడానికి తమ చొక్కాని కలిపేందుకు ఒక క్లాత్ పీస్‌ను బో టై తరహాలో మెడ చుట్టూ కట్టేవారట. దీన్ని చూసి ఎంతో ముచ్చటపడిన కింగ్ లూయిస్ ప్యాలెస్ ఆవరణలో పనిచేసే తన ఉన్నత స్థాయి సిబ్బంది మొత్తం బో టై ధరించాలని ఆదేశాలు ఇచ్చాడు. కాలక్రమంలో వీటి ఫ్యాబ్రిక్‌లు వైట్ కాటన్ నుంచి సిల్క్ దాకా ఎదిగినట్టే హోదాకి ఐశ్వర్యానికి చిహ్నంగా విలసిల్లాయి. సినిమాలే ‘సీన్’ పెంచాయి.. జేమ్స్‌బాండ్ సినిమాల ద్వారా సీన్‌కానరీ, హంఫ్రే బొగార్ట్ వంటి హాలీవుడ్ యాక్టర్ల టైమ్‌లో ఓ వెలుగు వెలిగింది బో. హంఫ్రె బొగార్ట్, ఫ్రెడ్ ఎస్టైర్, ఫ్రాంక్ సినట్రా, చార్లీ చాప్లిన్, పీ-వీ హెర్మన్ తదితర హాలీవుడ్ నటులుతో పాటుగా ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, విన్స్టన్ చర్చిల్ వంటి ప్రముఖుల కారణంగా మరింతగా ఇవి ప్రాచుర్యం పొందాయి. ఆ తర్వాత... ఫ్యాషన్ వెల్లువలో ఈ నెక్‌వేర్ దశాబ్దాలుగా తెరమరుగైంది. అయితే మన దేశంలో సరిగ్గా ఇటీవలే వీటి కదలికలు తిరిగి మొదలయ్యాయి. ముంబై, ఢిల్లీ, న్యూయార్క్‌లలో జరిగే మెన్స్ ఫ్యాషన్ వీక్‌లకు సిటీ నుంచి అటెండవుతున్నవారికి బో టై కలె క్షన్స్ ఇన్స్పిరేషన్ అందించాయి. స్టైలిష్ యాక్టర్లు ఫరాఖాన్ అక్తర్, రణ్‌వీర్‌సింగ్, జానీడెప్, రాహుల్‌ఖన్నా వంటి వారంతా బో టై లవర్స్‌గా పేరొందారు. ‘బో’లెడన్ని వెరైటీలు... సంప్రదాయ నెక్ టై కష్టాలకు విరుగుడుగా మారడంతో సిటీలో సూటూ బూటూ వాలాలంతా ‘బో-టైకే ఓటేస్తున్నారు. దీంతో డిజైనర్లు తమ సృజనకు పదనుపెట్టి వెరైటీలను సృష్టిస్తున్నారు. సూట్స్ వినియోగించేవారు స్టిచ్చింగ్ టైమ్‌లోనే ‘బో’ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. పాతదే కొత్తగా... ఇప్పుడు బో టై పూర్తిగా రీ-డిజైన్డ్ అయింది. ఒకప్పుడు కేవలం ఉన్నత వర్గాలకు, ఫార్మల్ వేర్‌కు జతగా మాత్రమే పరిమితమైనా.. ఇప్పుడివి క్యాజువల్, సెమి ఫార్మల్ వేర్‌కు సైతం వినియోగిస్తున్నారు. షర్ట్స్, జీన్స్‌తో కలిపి ధరించడం ప్రింట్స్, కలర్స్‌తో ప్రయోగాలు సాగుతున్నాయి. షార్ట్ సూట్స్కూ జత చేస్తున్నారు. బ్లేజర్‌కు బదులుగా లెదర్ జాకెట్స్ దీనికి కలిపి వాడుతున్నారు. జస్టిన్ టింబర్లేక్, ఫారెల్ విలియమ్స్ వంటి పాప్ సింగర్లు తమ మ్యూజిక్ వీడియోల్లో ఈ బో టై యాక్సెసరీని వైవిధ్యంగా వినియోగిస్తూ యూత్‌కి సరికొత్త టిప్స్ అందిస్తున్నారు. ‘ధరించే విధానంలో స్వల్ప మార్పులతోనే దీన్ని క్యాజువల్‌గా, ఫార్మల్‌గానూ చూపొచ్చు. బోని దేనికి జత చేస్తున్నారనేది ప్రధానమైన విషయం’ అంటున్నారు సిటీ డిజైనర్ సాహిల్ గులాటి. జ్యువెలరీ పీస్‌లా ఉండే ఈ క్లాత్ యాక్సెసరీని ఇప్పుడు కాస్త స్టైల్ సెన్స్ ఉన్న ఎవరైనా ఏ విధానంలోనైనా ధరించవచ్చు. అయితే తొలి దశలో ధరించడంలో ఇబ్బంది ఉండొచ్చు. షూ లేస్ కట్టుకుంటున్న తరహాలోనే ఉండే దీనిని వినియోగించే విధానం తెలిపే ‘హౌ టు టై ఎ బో టై’ వంటి వీడియోలు సైతం ప్రస్తుతం యూ ట్యూబ్‌లో సందడి చేస్తున్నాయి. ఇక మార్కెట్లో బ్రాండెడ్ బో-టైలు రూ.500 నుంచి రూ.2,000 ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇ-బే వంటి షాపింగ్ వెబ్‌సైట్స్‌లో వీటి విక్రయాలు జోరందుకున్నాయి. వీటికే ప్రత్యేకించిన బోటైస్ డాట్‌కామ్ వంటి వెబ్సైట్లూ ఉన్నాయి. డిన్నర్ జాకెట్‌కు సరిజోడు ఇప్పుడు ‘బో టై’ లేటెస్ట్ ఫ్యాషన్ కావడంతో నా డిజైనర్‌తో ముందుగానే డిస్కస్ చేసి నా డ్రెస్సింగ్‌లో దాన్ని కూడా చేరుస్తున్నాను. దీన్ని ఫార్మల్ వేర్‌తో పాటు, ముఖ్యంగా డిన్నర్ జాకెట్‌కు తోడుగా ధరిస్తుంటాను. ప్రస్తుతం నా దగ్గర 6 రకాల డిఫరెంట్ కలర్స్, ఫ్యాబ్రిక్స్‌తో రూపొందినవి ఉన్నాయి. ‘బో-టై’ని స్ట్రిక్ట్‌గా ఈవెనింగ్ టైమ్‌లోనే యూజ్ చేయడం అనేది వెస్ట్‌లో అలవాటు. అయితే సిటీలో ఇప్పుడు అకేషన్స్‌తో సంబంధం లేకుండా క్రేజీగా యూజ్ చేస్తున్నారు. - అశిష్గుప్తా, వ్యాపారి సిటీ డిజైనర్ సాహిల్ గులాటి అందించే మరికొన్ని సూచనలివి... ‘బో’ వినియోగించే వారు కాన్ఫిడెన్స్‌తో క్యారీ చేయకపోతే దీని బ్యూటీ రివర్స్ అవుతుంది. షర్ట్+బో, వెయిస్ట్ కోట్+షర్ట్+బో కాంబినేషన్ కూడా బాగుంటుంది. రెడ్, టెక్చర్డ్ బ్లాక్, బ్లూ కలర్స్, ఫ్లోరల్ ప్రింట్స్.. ‘బో’ ఫ్యాషన్‌ను మెరిపిస్తాయి. ఈ ‘బో’ధరించేటప్పుడు షర్ట్ కాలర్స్ చిన్నవిగా ఉండేలా చూసుకోవాలి. శాటిన్, లైక్రా, సిల్క్.. ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన ‘బో’టైలు.. ఆకర్షణీయంగా అనిపిస్తాయి. కాక్టైల్ పార్టీస్, బిజినెస్ మీటింగ్స్.. వంటి సందర్భాలకు ఇవి అతికినట్టు సరిపోతాయి. బ్లాక్-వైట్ సూట్‌తో బ్లాక్ బో టై కలిపితే క్లాసీ లుక్ ఇస్తుంది. వైట్ జాకెట్, బ్లాక్ ల్యాపెల్స్, బ్లాక్ ట్రౌజర్స్, బ్లాక్ బో టై. కరెక్ట్ సేఫ్ కాంబినేషన్. చారల చొక్కాలు, బో టై అనేవి మంచి కాంబినేషన్. రెడ్ లేదా వైట్ చెక్స్ ఉన్న షర్ట్ ధరిస్తే రెడ్ లేదా బ్లాక్ బో టై ధరించాలి. మల్టీ కలర్డ్ షర్ట్ ధరిస్తే.. ప్రింటెడ్ బో టై ధరించకూడదు. -
ఫిట్నెస్ రిజల్యూషైన్
న్యూ ఇయర్ రెజల్యూషన్స్కు సంబంధించి లైఫ్‌స్టైల్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలినదేమిటంటే... ఈ ఏడాది అత్యధిక శాతం మంది తీసుకున్న తీర్మానాల్లో టాప్‌లో ఉంది ఎక్సర్సైజ్. అదే సమయంలో గత ఏడాది తీసుకున్న తీర్మానాలను విజయవంతంగా అమలు పరిచింది 8 శాతం మించలేదని కూడా తేలింది. నిర్ణయం తీసుకున్న తొలినాళ్లలో ఉన్న ఆసక్తి స్వల్పకాలంలోనే అటకెక్కడమే దీనికి కారణం. కొత్త ఏడాది ప్రారంభమై... ఇప్పటికే రెండు వారాలు కావస్తున్న నేపధ్యంలో... మనం తీసుకున్న ఆరోగ్యకరమైన తీర్మానాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించడానికి ఉపకరించే కొన్ని సూచనలు ఇస్తున్నారు సిటీకి చెందిన ట్రైనర్ వెంకట్... ..:: ఎస్.సత్యబాబు ఎప్పుడూ ఒకే రకమైన ఎక్సర్సైజ్ రొటీన్‌ను అలవాటు చేస్తే... రిజల్ట్స్ సరిగా కనపడక మధ్యలోనే ఆపేసే అవకాశం ఉంటుంది. విభిన్న రకాలైన వర్కవుట్స్, ఆ వర్కవుట్స్‌లో కూడా వైవిధ్యం అవసరం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంటే... తరచు వెయిట్స్ మార్పు చేసుకోండి. ఒక రోజు జిమ్‌లో, మరొకరోజు అవుట్‌డోర్‌లో జాగింగ్, స్ట్రెచ్చింగ్, కిక్‌బాక్సింగ్, ఫ్లోర్ ఎక్సర్సైజ్, స్పిన్నింగ్, స్విమ్బాల్, డాన్స్ ఎరోబిక్స్... ఇలా చేంజ్ చేయండి. ఒకోసారి మనతో ఫ్యామిలీని లేదా కనీసం పెట్‌డాగ్‌ను తీసుకెళ్లడం, పిల్లలతో ఆటలాడడం... ఇలా ఫిట్నెస్ రొటీన్‌ను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుకుంటే ఇక మీకు ఎక్సర్సైజ్ బోర్ కొట్టదు. తద్వారా... ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది. తీరైన డ్రెస్సింగ్... డిఫరెంట్ డ్రెస్సింగ్ కూడా వర్కవుట్ రొటీన్‌ను ఇంట్రెస్టింగ్గా మారుస్తుంది. మరీ టైట్‌గా ఉండని, బాగా సౌకర్యవంతంగా, కుషనింగ్ ఉన్న షూస్ ఎంచుకోండి. శాటిన్, కాటన్... ఫ్యాబ్రిక్స్‌లో ట్రాక్ సూట్స్ ఆకర్షణీయమైనవి దొరుకుతున్నాయి. చేతులకు గ్లవ్స్, వెయిస్ట్ బెల్ట్స్, కేలరీ కాలిక్యులేటర్.... కాస్త ఖర్చయినా మంచివి ఎంచుకోవాలి. వీటన్నింటిని ధరించడం వల్ల వచ్చే స్పెషల్ లుక్ కూడా ఎక్సర్సైజ్ పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. స్పీడ్ రిజల్ట్స్‌తో కిక్... తొలిరోజుల్లో చెప్పుకోదగ్గ రిజల్ట్స్ వస్తే అదొక కిక్లాగా పనిచేసి వర్కవుట్స్ రెగ్యులర్ అవడానికి కారణమవుతుంది. వెయిట్ లాస్ లేదా మరేదైనా రిజల్ట్ త్వరితంగా కనపడాలని ఆశించడం సహజమే. అలా జరగకపోతే నిరుత్సాహం ఆవరిస్తుంది. తొలినాళ్లలో కాస్త వేగంగా ఫలితాలనిచ్చే వ్యాయామం ఎంచుకోవాలి. బ్రిస్క్‌వాకింగ్ వల్ల క్యాలరీలు బాగా ఖర్చువుతాయి. జాగింగ్ ఒక గంటలో 6-7 కిలోమీటర్లు, నడక 10-12 కి.మీ చేయగలిగితే... మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఎక్సర్సైజ్ రొటీన్ అందరికీ ఒకటే విధంగా నప్పదు. కాంబినేషన్ ఎక్సర్సైజ్లు చేయడం అనేది అన్ని వేళలా మంచిది. డైట్ మారితే... రైట్ రైట్ వ్యాయామం ప్రారంభించడంతో పాటు తప్పనిసరిగా ఆహారంలోనూ మార్పు చేర్పులు చేసుకోవాలి. ప్రత్యేకమైన, శక్తిని పెంచే పోషకాలు నిండిన ఆహారాన్ని డైట్లో జతచేయాలి. టీ, కాఫీ, జంక్‌ఫుడ్ వంటి వాటిని తగ్గించేసి, వాటి స్థానంలో ప్రొటీన్లు, విటమిన్లను అందించే మంచి ఫుడ్‌ని చేర్చడం ద్వారా సరికొత్త షాపింగ్ అలవాటవుతుంది. ఇంట్లోనూ, ఒంట్లోనూ కొత్త హుషారు వస్తుంది. ఇలాంటి మార్పులు, టైమింగ్ వంటివి కొత్త కొత్త సరదాలను, ఆసక్తులను ప్రోది చేస్తాయి. తద్వారా వ్యాయామాన్ని క్రమబద్ధం చేస్తాయి. ఈ ఏడాది మీరు తీసుకున్న ఓ చక్కని హెల్దీ రిజల్యూషన్‌ని విజయవంతం అయ్యేలా చేస్తాయి. కొన్ని టిప్స్: ప్రారంభంలో వార్మప్, కూల్డవున్ స్ట్రెచెస్ బాగా ప్రాక్టీస్ చేయాలి 8 నుంచి 10రిపిటీషన్స్, 3లేదా 4 సెట్స్ ప్రయత్నించాలి. రిపిటీషన్స్కు మధ్య 3-4సెకన్లు, సెట్‌కి సెట్‌కి మధ్య అరనిమిషం నుంచి నిమిషం విరామం ఇవ్వాలి. ఒక వ్యాయామం ఒక సెట్ చేయడానికి పట్టే సమయం చేస్తున్న కొద్దీతగ్గుతుంది. అంటే మీ సామర్ధ్యం పెరుగుతున్నట్టే. ఏ వయసు వారైనా చేయదగింది యోగా. ఆరంభంలో సూర్యనమస్కారాలు ఎంచుకోవాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో కొంతమందికి తక్కువ వెయిట్ ఎక్కువ రిపిటీషన్లు, మరికొంత మందికి ఎక్కువ వెయిట్ తక్కువ రిపిటీషన్లు... ఇలా బాడీ నేచర్‌ని బట్టి చేయాలి. బాడీబిల్డింగ్ సిద్ధాంతం ప్రకారం హెవీ వెయిట్ వల్ల సైజ్ వస్తుంది. దానికి కూడా మినిమం 8 లేదా 10రిపిటీషన్లు చేయాలి. ఎం. వెంకట్, ఫిట్నెస్ ట్రైనర్ -
మాస్టర్ మదర్
పెరిగి పెద్దయి, పెళ్లయి, పిల్లల తల్లయ్యాక.. మహిళలు టెన్నిస్ బ్యాట్లు పట్టుకుంటున్నారు. చద‘రంగం’లోకి దిగుతున్నారు. హైలెస్సా అంటూ పడవలెక్కుతున్నారు, రా‘రన్’డంటూ పరుగు తీస్తున్నారు. సిటీ మహిళ ఇంట్లో అమ్మగా మాత్రమే కాదు రేపటి లిటిల్ మాస్టర్స్‌కు కోచ్లుగానూ మారుతున్నారు. ..:: ఎస్.సత్యబాబు పిల్లలు ఆడుతుంటే తల్లులకు ఆనందం వేస్తుంది. పిల్లలు ఓడిపోతుంటే ఆ అమ్మ పడే బాధ ఇంకెవరూ పడరేమో.. తమ చిన్నారులు ఓడిపోకూడదనుకుంటున్న తల్లులు పరోక్ష కోచ్‌లుగా మారుతున్నారు. తమ సమయాన్ని, స్వేదాన్ని ఖర్చు చేస్తూ పిల్లల విజయాలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. అన్నీ అమ్మే.. కోచ్ పాత్ర ఆటలో శిక్షణకే పరిమితమైతే.. అమ్మ మాత్రం టీచర్, గైడ్, కోచ్, మెంటర్, ఫిలాసఫర్.. ఇలా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘‘టెన్నిస్ గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే మా అమ్మాయి టెన్నిస్ ఎంచుకోవడంతో దాని గురించి నేనూ తెలుసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం మా అమ్మాయికి ఒక కౌన్సెలర్లా వ్యవహరిస్తాను. ఆట, చదువు రెండిటికీ ఉపకరించే సలహా సూచనలు ఇస్తుంటాను’ అని చెప్పారు సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో చదివే తనుషితారెడ్డి (10) తల్లి శ్రీలత. నిజమైన కోచ్‌లు కాకపోయినా, ఫిజికల్ ట్రైనింగ్ ఇవ్వలేకపోయినా.. పోటీలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి పిల్లల్ని సంసిద్ధుల్ని చేయడంలో సైకలాజికల్‌గా ట్రీట్ చేయడంలో తల్లులు ప్రధానపాత్ర పోషిస్తున్నారు. వెంటుండి.. వెన్ను తట్టి.. శిక్షణ తరగతులకు పిల్లలతో పాటు వెళ్తూ ప్రొఫెషనల్ కోచ్ పిల్లలను తీర్చిదిద్దుతున్న తీరుతెన్నులను నిశితంగా పరిశీలిస్తున్నారు. బలాబలాలను అంచనా వేస్తున్నారు. లోటు పాట్లను గమనిస్తున్నారు. తద్వారా కోచ్ అందుబాటులో లేని సందర్భాల్లో తాత్కాలిక కోచ్‌లుగా మారిపోతున్నారు. పిల్లల అలవాట్లు, పద్ధతుల గురించి కోచ్‌లకు అవసరమైన సమచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. మ్యాచ్‌లకు ముందు తమ పిల్లలు సరిపడా నిద్ర ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తరచుగా వీరితో కలసి క్యాంప్‌లకు వెళుతున్నారు. ఆడుతున్నప్పుడు స్టాండ్స్‌లో కూచుని పిల్లలను ఉత్సాహపరుస్తున్నారు. ‘టెన్నిస్‌లో వరల్డ్ చాంపియన్ కావాలనేది మా అమ్మాయి కల. అది నెరవేరేందుకు నా వంతుగా వీలైనంత సమయాన్ని కేటాయిస్తున్నా’నంటున్నారు డాక్టర్ రేఖ. తన కుమార్తె మాన్సి మునేశ్వర్‌ను అన్ని విధాలుగా గైడ్ చేయడానికి ఆమె ప్రతి టెన్నిస్ పోటీనీ టీవీలో చూడటం అలవాటు చేసుకున్నారు. పెద్దగా టెన్నిస్ కోర్ట్లు, కోచ్‌లు అందుబాటులో లేని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన వారవడంతో.. రేఖ తన కూతురు విషయంలో మరింత బాధ్యత తీసుకున్నారు. ‘నేను వృత్తిరీత్యా బిజీగా ఉంటే మా అమ్మగారైన జనాబాయిని మాన్సితో టోర్నమెంట్స్‌కు తోడుగా పంపుతుంటాను’అని రేఖ చెప్పారు. రీప్లేస్మెంట్ కాదు.. అయితే తల్లులు ఎంత మాత్రమూ అసలైన కోచ్‌లకు ప్రత్యామ్నాయం కాదనేది నిస్సందేహం.‘కోచ్‌లను రీప్లేస్ చేయలేం. కోచ్‌లకు సబ్‌స్టిట్యూట్ లేరు’ అని అండర్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఫయాజ్ మహ్మద్ తల్లి నస్యమ్ మహ్మద్ స్పష్టం చేస్తారు. ట్రైనింగ్‌లో కోచ్ పాత్ర ముగిసిన తర్వాతే తన కొడుకు విషయంలో తన పాత్ర మొదలువుతుంది అంటారామె. తల్లుల విషయంలో వస్తున్న ప్రధాన ఫిర్యాదు ఏమిటంటే పిల్లలపైన ఒత్తిడి పెంచుతున్నారని. టాలెంట్ లేకుండా ఎంత నెట్టినా ప్రయోజనం ఉండదని మోడ్రన్ మదర్స్ గుర్తించాలి. కొన్నిసార్లు పేరెంట్స్ తమతో ఉండటం వల్ల పిల్లలు ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు తమ సహజసిద్ధమైన ఆట ఆడుకునేందుకు వీలు కల్పించాలి. పిల్లలు మెడల్ విన్నింగ్ మెషిన్లు కారని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు కోచ్‌లు. తమ పనిలో తరచు జోక్యం చేసుకోవడం కూడా సరైంది కాదని చెబుతున్నారు. తోడు నీడ.. ‘మా అమ్మాయి టెన్నిస్ మూడేళ్లుగా ఆడుతోంది. గైడ్‌గా, మెంటర్‌గా, కంపానియన్‌గా, క్రిటిక్‌గా తోడుంటాను. అయితే ఆమెకు రోజువారీగా ఉండే ఒత్తిడిని పెంచాలనుకోను’ అంటారు శృతి భాసిన్. ఇటీవల జరిగిన ఏఐటీఏ అండర్ 12 స్పోర్ట్స్ కల్ట్ టెన్నిస్ టోర్నమెంట్లో గాళ్స్ సింగిల్స్ చాంపియన్‌గా గెలిచిన స్మృతిభాసిన్ తల్లి ఆమె. ఇటీవల నగరంలో నిర్వహించిన సెయిలింగ్ పోటీల్లోనూ తల్లులు కుమార్తెలకు తోడుగా వారితో పాటు పోటీల్లో పాల్గొని అబ్బురపరచారు. ‘మా అమ్మే నాకు యాచింగ్ పోటీలకు ఎంతో గెడైన్స్ ఇచ్చారు. ఆమె సహాయం లేకుంటే నేను ముందడుగు వేయలేపోయేదాన్ని’ అంటారు సిటీలో ఇటీవల జరిగిన మాన్సూన్ రెగెట్టాలో పాల్గొన్న జుహి. టెన్నిస్, సెయిలింగ్, చెస్, స్కేటింగ్.. ఆటేదైనా పిల్లల్ని అంటిపెట్టుకుని తిరిగే అమ్మలు ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నారు. ఆధునిక అమ్మ ఇప్పుడు ఆదిగురువు మాత్రమే కాదు ఆటల గురువు కూడా. చిన్నారి విజయాలే లక్ష్యంగా వ్యయప్రయాసలకు సిద్ధమవుతున్నారు. ఈ అమ్మల ఆరాటాలు, ఆకాంక్షలు నెరవేరడమంటే.. భారతీయ క్రీడారంగం ప్రపంచంలోనే మేటిగా వెలుగొందడమే. ఆ రోజు రావాలి. అమ్మ కల నెరవేరాలి. -
సక్సెస్... ఫెయిల్యూర్... జీవితంలో ఏదీ అంతిమం కాదు!
పీక్కుపోయిన చెంపలు... పాలిపోయిన శరీరం... చొక్కా లేనప్పుడు చూస్తేనేమో గ్రీకు శిల్పం! నిర్లక్ష్యపు చూపులు... నిర్విరామంగా చేతుల్ని వెలిగించే సిగరెట్... అందుకున్న విజయాల రికార్డు చూస్తేనేమో అద్భుతం! పాతికేళ్ల క్రితం ముంబయిలో అడుగుపెట్టిన ఒక సాధారణ వ్యక్తి పవరాఫ్ బాలీవుడ్‌కి ప్రతిరూపంలా మారడం ఓ సంచలన చరిత్ర! ఎందరినో ఇన్స్పైర్ చేసే సక్సెస్ స్టోరీ! అయితే సక్సెస్ అంటే ఇంతేనా? ... ఇంకేదో ఉందంటున్నారు బాలీవుడ్ బాద్షా! రెండున్నరగంటల ఎంటర్టైన్మెంట్ పీస్‌లా తాను మిగిలిపోదలచుకోలేదంటున్నారాయన. స్వయంగా నిర్మించి, నటించిన తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ షారుఖ్ ఖాన్ ‘సాక్షి’కి ముంబయ్‌లో ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలోని విశేషాలు... నేడు తన బర్త్‌డే సందర్భంగా... హాయ్ సర్... మీ మాతృభూమి నుంచి వస్తున్నాం ఎలా ఉన్నారు? షారుఖ్: హాయ్... వెరీ ఫైన్. అవును హైదరాబాద్ మా ‘మదర్’ ల్యాండ్. అక్కడ టోలీచౌకీలో మా అమ్మగారి ఇల్లు ఇప్పటికీ ఉంది. ఐలైక్ ద సిటీ వెరీ మచ్. అటు ప్రొడక్షన్... ఇటు యాక్షన్... బాగా హెవీ వర్క్. ఏమైతేనేం ‘హ్యాపీ న్యూ ఇయర్’ సినిమా సక్సెస్. ఇప్పుడు హ్యాపీగా రిలాక్సవుతున్నారా? షారుఖ్: జస్ట్ వన్ వీక్ గ్యాప్. అంతే! మళ్లీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఆల్రెడీ సూపర్‌స్టార్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్నారు. అయినా అటు క్రికెట్ టీమ్, ఇటు ప్రొడక్షన్, యాక్షన్... ఇలా కష్టపడుతూనే ఉన్నారు. ఇక కొంత విశ్రాంతి తీసుకోవాలని అనిపించడం లేదా? ఈ ప్రశ్నకు షారుఖ్ ఒక్కక్షణం ఆగారు... ఆలోచించారు. ఎదురుగా ఉన్న సిగరెట్ ప్యాకెట్లో నుంచి తన చిరకాల నేస్తాన్ని తీసి వెలిగించి, గట్టిగా ఒక దమ్ము లాగారు. అనంతరం ట్రాన్స్‌లోకి వెళ్లినట్టు మాట్లాడడం మొదలుపెట్టారు. మధ్య మధ్యలో అడుగుతున్న ప్రశ్నలకు, ఆయన ఇచ్చిన సమాధానాల సమాహారం ఆయన మాటల్లోనే... ఎవరికి నిరూపించుకోవాలి? షారుఖ్: నిజమే! జీవితం అందించిన వాటి గురించి చాలా హ్యాపీగా ఉన్నా... అయితే నేను పనిచేస్తోంది ఎగ్జయిట్మెంట్ కోసం! కొత్త విషయాలతోనే ఆ ఎగ్జయిట్మెంట్ వస్తుంది! ప్రొడ్యూసర్ని అయినా, కొత్త కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నా... ఇదంతా అందుకే! ఈ ప్రస్థానంలో... ఐ స్టార్టెడ్ ఫీల్ ఇంపార్టెంట్. అంతే తప్ప ఎవరికో ప్రూవ్ చేయడం కోసం కాదు. కాలం ఎప్పుడూ కొత్త కొత్త విషయాలు మోసుకొస్తోంది. వాటిని అందుకోవాలి. పొద్దున్నే ఎగ్జయిట్‌మెంట్‌తో లేవాలి. నేనెప్పుడూ నన్ను నేను నిరూపించుకోవడానికి పని చేయలేదు. అసలు నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? దాదాపు పదిహేనేళ్లుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి నా జీవితం ఒకలాగే ఉంది. లోయర్ మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ మాది. ఢిల్లీ నుంచి ముంబయికి వచ్చేటప్పటికి హిందీ సినిమా అంటేనే తెలీదు. కొన్ని సంవత్సరాల కెరీర్ తర్వాత...నేనొక స్టార్‌ని అనే విషయం నాకు అర్థమైంది. ముంబయిలో జాలర్లు నివసించే చిన్న కాలనీలో ఉన్న నేనే ఇప్పుడు అత్యంత ఖరీదైన ఇండియన్ మూవీని రూపొందించాను. ఒక్కోసారి నా భార్య, పిల్లలూ కూడా అంటుంటారు... ‘ఎందుకు ఇదంతా? అవసరమా?’ అని! కాని నేనేం చేయను? విశ్రాంతినీ, పని లేకపోవడాన్నీ ఊహించలేను. విచిత్రమేమిటంటే... కొన్ని రోజుల పాటు పని లేకపోతే... మా అమ్మాయే నన్ను అడుగుతుంది - ‘నువ్వు పనిచేయడం లేదేంటి’ అని! పని లేకపోతే ఏం చేయాలో నాకు తెలీదు. అవును. నేను పనికి ఎడిక్ట్ అయిపోయాను. పనిలోని ఒత్తిడిని బాగా ఎంజాయ్ చేస్తాను. నాకు స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. ఈ మధ్యే షోల్డర్ విరిగింది. షూస్ వేసుకోవడానికి కూడా చేయి సహకరించట్లేదు. అయినా పనిచేయడానికే ఇష్టపడతాను. తప్పక రెస్ట్ అంటూ తీసుకోవలసిన సందర్భం వస్తే... పుస్తకాలు బాగా చదువుతాను. బాత్రూమ్లో, కారులో కూడా చదువుతాను. ఐయామ్ ది బెస్ట్... షారుఖ్: ముంబయిలో 24 సంవత్సరాల క్రితం నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడే ‘ఐయామ్ ది బెస్ట్’ అనుకుంటూ ఉండేవాణ్ణి. ఇప్పటికీ అంతే! ఎప్పుడైనా మనల్ని మనం నమ్ముతూ నిద్ర లేస్తేనే పని చేయగలం. లేకపోతే లేదు. అప్పుడే హ్యాపీగా ఉంటుంది. ఆ ఫిలాసఫీని అనుసరించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి పనిని ఎంజాయ్ చేయగలుగుతున్నా. అక్కడ నుంచి ఇక ఒత్తిడి లేదు. ఐ ఫీల్ హ్యాపీ మీటింగ్ పీపుల్... ఐ ఫీల్ హ్యాపీ షేరింగ్ దిస్ వండర్ ఫుల్ లైఫ్ విత్ పీపుల్! దటీజ్ వై.. దేరీజ్ నో ప్రెషర్! ఇష్టపడి మాత్రమే చేశా..! షారుఖ్: అటు సినిమాలు, ఇటు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) విజయం, ఇంటర్నేషనల్ అవార్డ్స్... ఇవన్నీ ఈ ఏడాది నన్ను సక్సెస్ఫుల్ చేశాయి. అంత మాత్రాన అన్నీ బావున్నాయనీ, నేనిప్పుడు పని మానేయాలనీ అనుకోను. నేనేది చేసినా దాన్ని ఇష్టపడి చేశా. ఏది చేసినా నాకు ఇష్టమైన ప్రయత్నం అయితేనే చేశా. డబ్బు కోసం ఏదీ చేయలేదు. నిజానికి ఒక బిజినెస్ వెంచర్‌గా చూసినట్టయితే కెకెఆర్ సక్సెస్ అయ్యేది కాదు. ఈ వెంచర్లో సక్సెస్ చూడడానికి ఐదేళ్లు పట్టింది. రెండుసార్లు చాంపియన్‌షిప్‌లు గెలిచాక... ఎండార్స్మెంట్స్ వచ్చాయి. బిజినెస్పర్సన్గా అయితే ఈ వెయిటింగ్ చేసుండేవాణ్ణి కాను. నేను డబ్బు సంపాదించాలని క్రికెట్‌తో అనుబంధం పెట్టుకోలేదు. ప్రారంభంలో దెబ్బతిన్నా. తరువాత గెలిచా. ఆలస్యమైనా... విజయం అనేది ఒక స్వీటెస్ట్ థింగ్! విజయానికి గ్యారెంటీ ఇవ్వలేం! షారుఖ్: సక్సెస్ఫుల్ పర్సన్స్‌ను అడిగితే... చాలా మంది క్రాఫ్ట్ చెప్పగలరు. టెక్నిక్ చెప్పగలరు. అయితే అందులోని సారం మాత్రం చెప్పలేరు. నా సక్సెస్ విషయంలో ఐ రియల్లీ హ్యావ్ నో ఐడియా. కొన్నేళ్లు వెనక్కివెళ్లి, ‘నేను అలా చేశా కాబట్టి ఇలా అయింది. ఆ టైమ్‌లో ఇలా చేయకపోయుంటే...’ వంటి సూత్రాల్ని చెప్పలేను. నేను చేసిందే చెయ్యమంటూ నా పిల్లలకు కూడా చెప్పలేను. ఎందుకంటే సక్సెస్‌కు అస్యూరెన్స్ ఇవ్వలేం. ఏ మార్గాన్ని అనుసరిస్తే సక్సెస్ వస్తుందో కచ్చితంగా చెప్పలేం. చాలామంది తిరస్కరించిన ప్రాజెక్ట్స్ నేను ఓకె చేస్తే సూపర్‌హిట్ అయ్యాయి. కెకెఆర్ విషయంలోనూ చాలామంది అది నాకు అనవసరం అన్నారు. చేయలేను అన్నారు. అయితే నాకో మార్పు కావాలి. అంతే నేను యాక్సెప్ట్ చేశా. సరైన టైమ్‌కి అక్కడ ఉండడం ఇంపార్టెంట్. రైట్ ఫిల్మ్, రైట్ డెరైక్టర్, రైట్ టీమ్, ఐ వజ్ ఎ రైట్ గై ఫర్ రైట్ ప్లేస్! అంతే! నా స్టోరీ ఇతరులకు ఏం నేర్పుతుందో గానీ, దాని నుంచి నేను నేర్చుకున్నదేమిటంటే జీవితంలో ఏదీ అంతిమం కాదు! ఫెయిల్యూర్, సక్సెస్ - రెండూ అంతే! ప్రజలకు కావాల్సినదేదో చేయాలి! షారుఖ్: నాకో మంచి ఇల్లు, ఫ్యామిలీ, గ్రేట్ ఆఫీస్, సరిపడినంత డబ్బు... దేవుడు ఇచ్చాడు. అదృష్టం ఇచ్చింది. జనం ఇచ్చారు. అయితే ఇవి చాలని నేను అనుకోను. నేను ఇది మాత్రమే సక్సెస్ అనుకోను. ఇంకా ఎంతో చేయాలి. తీసుకున్నదానికి ప్రతిఫలంగా వెనక్కి ఇవ్వాలి. ఇక్కడ గొప్ప టెక్నాలజీ సృష్టించాలి. ఒక గొప్ప స్టూడియో కట్టాలి. సక్సెస్ అంటే నేనేదైనా కొత్తది కనుగొన్నప్పుడే! నా తర్వాత కూడా అది బతికుండాలి! సేఫ్టీ పిన్ని కనిపెట్టిన జంటిల్మన్ సక్సెస్ఫుల్ అని నేననుకుంటాను. జస్ట్... కేవలం రెండున్నరగంటల ఎంటర్టైన్మెంట్ పీస్‌లా మాత్రమే నేను ఉండదలచుకోలేదు. ప్రజలకు కావాల్సిందేదో నేను చేయగలగాలి. అదేమిటో నాకు స్పష్టత లేదు. అయితే చేయగలను అని నమ్మకం ఉంది. అలాగని రాజకీయాలంటే అంటే... నో! దానికి మరీ మంచితనం కావాలి. అది నా వల్ల కాదు (నవ్వులు). ఒక 20 సంవత్సరాల తర్వాత నా నటన గురించి కొత్తగా మీరు చెప్పుకునేందుకు ఏమీ ఉండదు. అదే నేను రంగుల సినిమాను కొత్తగా సృష్టించాననుకోండి... ‘అదిగో షారుఖ్స్ క్రియేషన్’ అంటారు. నా రంగంలో నేను మీకో కొత్త అనుభూతిని ఇవ్వాలనుకుంటున్నాను. క్రీడల విషయంలో కూడా నా వంతుగా ఏమైనా చేయాలనుకుంటున్నాను. కమర్షియలైజ్... అయితే తప్పేంటి? షారుఖ్: మనందరికీ మనం ఏం చేయగలమో తెలుసు. వరల్డ్ ఈజ్ బెస్ట్ ప్లేస్ టు లివ్. మంచి ఉద్దేశంతో కమర్షియలైజ్ చేయడంలో తప్పు లేదంటాను. మంచి ఫిల్మ్‌మేకర్ ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండాలి. కొందరు వారి వర్క్ చూడాలి. కొందరు కొనాలి. కొందరు వర్క్ ఇవ్వాలి. ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీలు. కాబట్టి, తప్పదు. కంఫర్టబుల్ ఎర్నింగ్ ఉంటేనే ఇదంతా చేయగలం. ముందు మీరు కంఫర్టబుల్‌గా ఉంటేనే అప్పుడు మీరు ఎవరికైనా సహాయం చేయగలరు. మీరనుకున్న మంచి పనులు చేయగలరు. సినిమాలైనా, స్పోర్ట్స్ అయినా అంతే! కమర్షియలైజ్ కాకపోతే వర్ధమాన క్రీడాకారులకు కెరీర్ ఎలా ఇస్తాం? నా మటుకు నేను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ను అవ్వాలనుకున్నా. కానీ, అవలేకపోయా. అందుకే, ఇలాంటివన్నీ చేస్తుంటా! అయినా, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా క్రీడలకు సరైన ప్రొఫెషనల్ స్కూల్స్ లేవంటే.. అర్థం ఏమిటి? కాబట్టి, మంచి చేయాలంటే కమర్షియలైజ్ చేయాల్సిందే! అయితే ఇదంతా క్యాపిటలిస్ట్‌గా నేను మాట్లాడడడం లేదు. ఆ సంగతి గ్రహించండి. గౌరి బెస్ట్ పార్ట్నర్! షారుఖ్: నా భార్య గౌరి మంచి పార్ట్నర్. ఆమె చాలా స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడామె ఇంటీరియర్ డిజైనర్‌గా మారి, స్టోర్ స్టార్ట్ చేసింది. బిజినెస్‌పరంగా తనకేమైనా టిప్స్ ఇస్తారా అంటే... ఇంట్లో ఇద్దరం ఉన్నప్పుడు నో బిజినెస్. చెప్పాను కదా... మాది చాలా మిడిల్‌క్లాస్ మెంటాలిటీ! చేతి నిండా పని వల్ల ఇంట్లో నేనెక్కువ సమయం గడపలేను. ఒంటరిగా, విసుగుపుడుతూ ఉండకుండా ఓ హాబీలా ఈ స్టోర్‌ను ప్రారంభించింది. అయితే అదేదో పెద్ద స్టోర్ కావాలనో, మరొకటో అనుకోవడం లేదు. షారుఖ్ కూడా ఇందులో భాగం కావాలనుకోవడం లేదు. ‘కోట్ల’ ఆటలో వాస్తవం లేదు! షారుఖ్: నిజంగా సినిమాలకు వందల కోట్ల వసూళ్ళ గురించి, 500 కోట్ల క్లబ్ గురించి మనలో ఎవరం ఆలోచించగలం? పత్రికల వాళ్ళు ఏదో రాస్తుంటారు. నిజానికి అందరూ మాట్లాడే ఈ వందల కోట్లు అనేది గ్రాస్ కలెక్షన్ గురించి! అందులో నుంచి 52 శాతం థియేటర్ ఛార్జీలు, 12 శాతం పన్నులు, అవికాక డిస్ట్రిబ్యూటర్ కమిషన్లు - ఇవన్నీ తీసేసి వాస్తవంగా లెక్కిస్తే... ఈ కోట్ల మూటలంతా డొల్లేనని తెలుస్తుంది. నా వరకూ నా లక్ష్యం ఏమిటంటే... అత్యధిక సంఖ్యాకులు వచ్చి, నా సినిమా చూస్తే చాలు. అంతే! ఈ నంబర్లు కాదు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ మాత్రమే నేను చూసుకోవాలి. దీన్ని చూడడానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 240 మంది పనిచేస్తున్నారు. మహిళలకు మర్యాద ఇవ్వాలి... షారుఖ్: ఐ ప్రిఫర్ టు వర్క్ విత్ ఉమెన్... ఎందుకంటే వాళ్లు బాగా హార్డ్ వర్కింగ్! బాగా డిటైల్డ్. ఒక గుమ్మం ముందు మహిళ నుంచుంటే వెంటనే తలుపు తీసి రమ్మంటాం. అదేదో వాళ్లు బలహీనమనో, సానుభూతితోనో కాదు. మన మనసుల్లో మహిళకు ఎప్పుడూ గౌరవం ఉంది. ఇవ్వాలి కూడా. నా తల్లి, సిస్టర్... వీళ్లందరితో నేనలాగే పెరిగాను. నా సినిమాల్లో హీరోతో పాటు తగినంత పాత్ర హీరోయిన్కీఉండాలనుకుంటాను. అలాగే నా ఆఫీస్‌లో, నాతో పనిచేసేవాళ్లలో చాలా మంది మహిళలున్నారు. మహిళలకు గౌరవం ఇవ్వడం అత్యవసరం. బయట జరిగే చాలా సంఘటనలు చూస్తున్నాం. ప్రపంచం మొత్తాన్నీ మార్చలేకపోయినా... మన వంతుగా వాళ్లకు గౌరవం ఇవ్వడాన్ని బాధ్యతగా భావించాలి. ప్యాక్... లుక్స్ వరకే! షారుఖ్: నిజంగా చెప్పాలంటే ఏ సినిమాకీ సిక్స్ ప్యాక్ అవసరం లేదు. ‘ఓం శాంతి ఓం’లో హీరో ముతకభాష మాట్లాడతాడు. బస్తీల్లో ఉంటాడు. హీరో అవ్వాలనుకుంటాడు. కరకుగా కనిపించాలి అని వర్కవుట్ చేశాను. అంతేకాకుండా నాకు స్పైన్ ప్రాబ్లమ్ ఉంది. దాని కోసం వర్కవుట్ చేస్తుంటే వెరీ స్ట్రాంగ్ యాబ్స్ వచ్చాయి. వర్కవుట్ టైమ్‌లో కొందరికి బైసప్స్, కొందరికి చెస్ట్ ఇలా... ఒక్కొక్కరికీ ఒక్కోటి బాగా స్పందిస్తాయి. అలాగే నాకు యాబ్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి. దాంతో ప్యాక్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో కూడా పాత్రకు తగ్గట్టుగా రఫ్‌గా కనపడే ప్రయత్నంలో ప్యాక్‌ను ప్రదర్శించా. పిల్లల కోసమే ప్రార్థిస్తుంటా..! షారుఖ్: ఫేమస్ అయిన పబ్లిక్ ఫిగర్ అంటే... అడ్వాంటేజ్‌లతో పాటు డిజెట్వాంటేజ్లూ ఉంటాయి. నాకు 14 మంది కాప్స్, ముగ్గురు సెక్యూరిటీ గార్డ్లు ఉన్నారు. నిజానికి నేను జనాన్ని ఇష్టపడతాను. వారిని ప్రేమిస్తాను. వారికి దూరంగా ఉండడం నచ్చదు. కానీ తప్పదు. ఒక్కోసారి గుంపును కంట్రోల్ చేయలేం కదా! నా పిల్లలు ఈ పరిస్థితుల మధ్య ఇబ్బంది పడతారు. వాళ్లు కూడా నా లాగా టీనేజ్‌లో ఒక సాధారణ జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలి. యుక్తవయసులో ఎలాగైతే సాధారణ జీవితాన్ని నేను అనుభవించానో వాళ్లు కూడా అదే అనుభవించాలి. బస్సుల్లో, రోడ్ల మీద స్వేచ్ఛగా నడవాలి. అందుకే దూరంగా విదేశాల్లో ఉంచి చదివిస్తున్నాను. దేవుడికి చేసే ప్రార్థన ఏదైనా ఉంటే, అది నా కోసం కాదు - నా పిల్లల కోసం మాత్రమే ప్రార్థిస్తాను. వాళ్లు బాగుంటే, వాళ్లు సంతోషంగా ఉంటే మనకు అన్నీ బాగున్నట్టే! ‘హ్యాపీ న్యూ ఇయర్’ చివరలో టైటిల్స్ వేస్తున్నప్పుడు వచ్చే చివరి పాటలో మొత్తం కాస్టింగ్ అంతా ఉంటుంది. పిల్లలూ ఉంటారు. అదే సమయానికి అక్కడ ఉండడంతో మా అబ్బాయి అబ్రామ్ (సరోగసీ ద్వారా కన్న బిడ్డ)ని కూడా పెడదామని (దర్శకురాలు) ఫరా (ఖాన్) అంటే ఓకె అన్నాను. ఇప్పుడా సీన్‌కు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. సిగరె ట్... బ్యాడ్ హ్యాబిట్... షారుఖ్: స్మోకింగ్ రియల్లీ... బ్యాడ్ హ్యాబిట్! నేను మానాలనుకున్నా మానలేకుండా పిల్లల దగ్గర సైతం రెగ్యులర్‌గా చేసే పని - స్మోకింగ్! పబ్లిక్ స్పేస్‌లలో కూడా నేను కంట్రోల్ తప్పుతున్నా. దీన్ని వదలకుండా నేనేం చెప్పినా లాభం ఏముంది? ఎప్పుడైతే నేను దీన్ని వదిలేస్తానో, అప్పుడు తప్పకుండా ‘సారీ’ చెబుతాను. ఇక ఆహారం విషయానికొస్తే, వేళ కాని వేళల్లో తింటాను. బాగా బ్లాక్ కాఫీ తాగుతాను. నా పనివేళలు కూడా కరెక్ట్ కాదు. అయినా ఇప్పటికీ, నేను రోజుకు తక్కువ గంటలు మాత్రమే నిద్రపోతూ హ్యాపీగా వర్క్ చేయగలుగుతున్నాను. చాలా యంగ్‌గా ఉన్నప్పుడే రాత్రిపూట నిద్రపోకుండా చదవడానికి వీలుగా బ్లాక్ కాఫీ తాగడం మొదలుపెట్టాను. అది ఇప్పటికీ వదలడం లేదు. చెయిన్స్మోకర్స్కు భిన్నంగా... చాలా ఆలస్యంగా, 26 ఏళ్ళ వయసులో తొలి సిగరెట్ తాగా! చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేవాణ్ణి. ఆరోగ్యంగా ఉండాలనుకునేవాణ్ణి. అందుకే తొలిరోజుల్లో సిగరెట్ ఆలోచన రాలేదేమో! ముంబయికి వచ్చాక, రంగస్థలంలో కాలుమోపాక... అప్పుడు స్మోకింగ్ స్టార్ట్ చేశా. సినిమాల విడుదలకు ముందు టెన్షన్ వల్ల స్మోకింగ్ మరీ తీవ్రంగా మారుతుందా అని అడిగితే, అప్పుడే కాదు... ఎప్పుడూ తీవ్రంగానే ఉంటుందని చెప్పగలను! (నవ్వులు) అవకాశం ఎప్పుడూ ఉంటుంది... షారుఖ్: ప్రేక్షకులకు చిన్న సందేశమైనా లేకుండా నేనే సినిమా చేయలేదు. కొన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ హోరులో మన సందేశం హైలెట్ కాక పోవచ్చు. జీవితంలో నువ్వు కొన్ని కోల్పోతూనే ఉన్నా... మరెన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఓర్పు ఉంటే జీవితం నీకు అవకాశం తప్పక ఇస్తుంది. నా తాజా చిత్రం, జీవితం చెప్పే సందేశం అదే! - ఎస్. సత్యబాబు ఇంటికెళితే స్విచ్చాఫ్... పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడు కరణ్ (జోహార్), సుస్మిత (సేన్) - ఇలా అందరూ సినిమా వాళ్లే వచ్చేవారు ఇంటికి. దాంతో మనుషులంతా సినిమావాళ్లే అనుకునేవారు నా పిల్లలు. నా కారు ఎక్కడ ఆగినా జనం వచ్చి గుమిగూడేవారు. దాంతో భయపడేవారు. స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్ళే సమయంలో మా అమ్మాయి ఒక మాట అడిగింది... ‘‘మా క్లాస్మేట్స్ వాళ్ళ ఫాదర్స్‌ను అంతా ‘రాహుల్స్ ఫాదర్, రాధికాస్ పాపా’ అని అంటారు. కానీ, నన్ను మాత్రం ‘షారుఖ్స్ డాటర్’ అంటారేమిటి? అని!’’ పిల్లలపై తల్లితండ్రుల సూపర్‌స్టార్ షాడో ఉండదా - అంటే ఉంటుంది. తప్పదు. ఆ ప్రభావంతో సహా బతకడం వాళ్లు నేర్చుకోవాల్సిందే! ఇలాంటి సమస్యకు పరిష్కారంగా ఇంటికి వెళ్లాక సినిమాకు దూరమవడం అలవాటు చేసుకున్నా. ఇంటి నుంచి పనిచేయను. సినిమాల గురించి, నా షూటింగ్ గురించి ఇంట్లో మాట్లాడను. నేనీ రోజు ఒక గొప్ప ఇంటర్వ్యూ ఇచ్చాననో, ఇంకేదో ఎక్స్పీరియన్స్ అంటూ వారితో పంచుకోను. ఎప్పుడైతే నేను నా కుటుంబంతో ఉంటానో అప్పుడు వారి మనిషిని. అంతే! ఇంక ఏమీ మనసులోకి రానీయను. నేనో స్టార్‌ని అనే భావనే రానీయను. -
చికెన్ ఇడ్లీ.. ఇదో సైబర్ ఫుడ్
చికెన్ ఇడ్లీ, సీతాఫలం ఐస్‌క్రీమ్, చికెన్ టిక్కారైస్, కుల్ఫీస్ విత్ ఫలూదా... పేర్లు వెరైటీగా ఉన్నాయి కదూ. రుచులూరుతున్నాయి కదూ. అవి టేస్ట్ చేయాలంటే మనూరి పక్కనే ఉన్న మరో ఊరు వెళ్లాలి. దాని పేరు సైబర్ సిటీ. అక్కడ ఉంటాయి ‘టేస్ట్రీ’ట్స్! పిజ్జా హట్లో టేస్ట్ వెతుక్కునే కార్పొరేట్ ఉద్యోగులను రుచులతో కట్టిపడేయాలంటే ఆషామాషీ కాదు. క్వాలిటీ బాగుండాలి.. హైజినిక్ కండిషన్స్ ఉండాలి. హైటెక్ స్పీడ్‌లో అందించాలి. ఇవన్నీ ఉంటేనే ఐటీ పీపుల్ ఆదరిస్తారు. దీని కోసమే రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ పోటీపడుతున్నాయి. అయితే సందట్లో సడేమియాలా యంగ్ టెకీలను కస్టమర్లుగా చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది స్ట్రీట్ ఫుడ్. అటు టేస్ట్‌లో, ఇటు కాస్ట్ ద్వారా కూడా ఆకట్టుకుంటున్న రోడ్ సైడ్ రుచులు.. సైబరాబాదీల జిహ్వలకు గాలం వేస్తున్నాయి. ఉల్లిపాయ పకోడీ ల నుంచి ఊతప్పం దాకా తెలిసిన వెరైటీలతో పాటు చికెన్ ఇడ్లీ నుంచి చిట్టి మొమోస్ పెద్దగా పరిచయం లేని పాకాలు ఇక్కడ పలకరిస్తున్నాయి. ఖరీదైన రెస్టారెంట్స్ కంటే మిన్నగా స్ట్రీట్ ఫుడ్‌కు ఆదరణ లభిస్తోంది. అందుబాటు ధరలో అదరహో అనిపిస్తుండటం ఈ ప్రాంతాలకు పేరు తెచ్చిపెడుతోంది. అలాంటి కొన్ని వీధుల్ని సందర్శిస్తే... డీఎల్ఎఫ్ స్ట్రీట్.. టెకీలకు టేస్టీ రుచులు అందించడంలో డీఎల్ ఎఫ్ ఏరియా టాప్‌లో ఉంటుంది. ఈ రోడ్లో ఉన్న పరివార్ గేట్‌వేలో దొరికే గులాబ్ జామూన్, కచోడి, సమోసాల రుచికి ఐటీ ఉద్యోగులు వావ్ అంటారు. ఇండియన్, చైనీస్ వంటకాలు కూడా అందించే ఈ గేట్‌వేలో ధరలు రూ.10 నుంచి రూ.120 మధ్యన ఉంటాయి. ఈట్ స్ట్రీట్.. ఐటీ కంపెనీలు ఒకటొకటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో గచ్చిబౌలి దగ్గర్లోని ఇంద్రానగర్ ఫుడీస్‌కి కేరాఫ్‌గా ఉండేది. ప్రపంచవ్యాప్త రుచుల్ని అందిస్తూ ఇక్కడ రెస్టారెంట్లు అత్యధికంగా వెలిశాయి. నిదానంగా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఈ వీధికి ఐటీ సర్కిల్లో పలువురు ‘ఈట్ స్ట్రీట్’ అని పేరు పెట్టాలని వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే వీధిలో ఓ చోట చెట్టినాడ్ విలాస్ ఉంటుంది. చెట్టినాడ్ రుచులు వడ్డించే మొబైల్ వ్యాన్ ఇది. రకరకాల ఇడ్లీలు, దోసెలు, ఇడియప్పం, అడాయి.. ఇలా ఎన్నో లభిస్తాయి. ధరలు కూడా రూ.40 నుంచి రూ.110 మధ్య ఉంటాయి. ఓ యువ వ్యాపారి ఆలోచనలకు పసందైన రూపం ‘విచ్ ప్లీజ్’. విభిన్న శాండ్విచ్లు రుచి చూడాలని అనుకునేవారికి ఇది సరైన ప్లేస్. విచ్ ప్లీజ్‌లో స్పెషల్ పనీర్ క్లబ్ శాండ్విచ్, న్యూటెల్లా టోస్ట్ శాండ్విచ్.. వంటివి ఇక ్కడ తప్ప సిటీలో మరెక్కడా కనిపించవంటారు టెకీలు. రూ.30 నుంచి రూ.120లోపు ఇవి లభిస్తున్నాయి. టేస్టీ ఏరియా.. ఒకప్పుడు టెలికం ఉద్యోగులకే పరిమితమైన టెలికం నగర్ ప్రాంతం.. ఇప్పుడు సువిశాలమైన రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయింది. ఇక్కడ రైస్‌బౌల్ పేరుతో ఉన్న కియోస్క్.. వెజ్, నాన్‌వెజ్ రైస్ బౌల్స్‌ను అందిస్తుంది. ఆలూ బట్టర్ రైస్, చికెన్ టిక్కా రైస్, బటర్ చికెన్.. వంటివి సాధారణ స్థాయిలో తినే వ్యక్తికి సరిపోయే క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. ధర రూ.50 నుంచి రూ.70 దాకా ఉంటుంది. జ్యూస్‌లు, మిల్క్‌షేక్స్, సలాడ్స్‌కు పేరొందింది యోస్తా. తాజా, న్యూట్రిషియస్ జ్యూస్‌లకు ఇది పేరొందింది. కలర్స్, ఫ్లేవర్స్ వినియోగించకుండా సహజసిద్ధమైన పద్ధతిలో తయారయ్యే జ్యూస్‌ల ధర రూ.50 నుంచి రూ.70 మధ్య ఉంటుంది. ఫలూదా పహాడ్.. సరికొత్తగా, శరవేగంగా స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్ వెలుస్తున్న ప్రాంతం కొండాపూర్. ఇప్పుడిప్పుడే ఇక్కడ లభించే వెరైటీలకు ప్రాచుర్యం లభిస్తోంది. ఫలూదా చాలా రుచికరంగా ఉంటుందని దాన్ని టేస్ట్ చేసిన వాళ్ల మాట. ఇక్కడి ‘శర్మా బోంబే ఫేమస్ ఫలూదా’ ఈ వెరైటీ టేస్టీకి కేరాఫ్‌గా నిలుస్తోంది. మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ, కేసర్ పిస్తా కుల్ఫీ, కాజు అంజీర్ కుల్ఫీ, స్పెషల్ బాదమ్ కుల్ఫీ.. లతో పాటుగా వాటితో రూపొందించే వెరైటీ ఫలూదా ఇక్కడ ప్రత్యేకం. ఇవి రూ.30 నుంచి రూ.60 ధర మధ్య లభిస్తాయి. ఈ సైబర్ స్ట్రీట్‌లో ఒక రౌండ్ కొడితే చాలు.. పొగలు కక్కే బజ్జీలు, సమోసా, కచోడి, బిర్యానీ, నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మొమోస్, చాట్స్, షావర్మ, కట్టి రోల్స్, మిల్క్ షేక్స్, ఫలూదా.. ఇంకా ఎన్నో చవులూరించే రచులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి. వీధి వీధి రుచుల విందు... విందు పేరేమి? అని పాట పాడుకుంటూ బాటసారులు ఆశ్చర్యపోతూనే.. ఆస్వాదించేస్తారు. - ఎస్.సత్యబాబు -
వినువీధి వి‘చిత్రం.. వెల్ డ్రోన్
రిమోట్ కంట్రోల్‌తో నడిచే బొమ్మ కార్లు, బుల్లి హెలికాప్టర్లు ఎప్పుడో నడిపేశాం. మారుతున్న కాలం బుల్లి విమానాలను ఫొటోలు, వీడియోలు తీసే అధునాతన సాధనంగా మార్చేసింది. అవుట్డోర్ సినిమా షూటింగ్ నుంచి ఇండోర్ భారీ వెడ్డింగ్‌ల వరకూ ఈ విహంగ నేత్రాలుకన్ను గీటుతున్నాయి. సిటీలో మెట్రో పరుగుల్ని సైతం వీటి సాయంతోనే చిత్రీకరించారు. గారడీ చేసినట్టు గాల్లో గింగిరాలు కొడుతూ ఆకట్టుకునే ఈ సరదా బొమ్మలే సీరియస్ ఫీల్డ్‌లోకి ఎంటరై ‘డ్రోన్’లుగా రూపాంతరం చెంది అద్భుతాలు చిత్రీకరిస్తున్నాయి. పలు రంగాలకు వినూత్న పాఠాలు నేర్పుతూ, సాంకేతిక సేవల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్న వినువీధి వి‘చిత్రం’ డ్రోన్. వీటి వాడకంలో వైవిధ్యానికి సంబంధించి దేశంలోని తొలి ఆరు నగరాల్లో హైదరాబాద్ ఒకటని ఇటీవల ఓ జాతీయ దినపత్రిక వెల్లడించిన నేపథ్యంలో ‘డ్రోన్’ వినియోగం అంతకంతకూ ఆసక్తి రేపుతోంది. వార్‌లో వెల్‘డ్రో’న్... డ్రోన్‌కు కెమెరా బిగించి చిత్రీకరించడం ఆర్మీ అవసరాలతో మొదలైంది. అట్నుంచి బాలీవుడ్లో ల్యాండ్ అయిన డ్రోన్.. లెజెండ్, ఆగడు, బాహుబలి లొకేషన్స్‌లో ఎగురుతూ.. సిటీలో పెళ్లిళ్లు, ఫ్యాషన్ షోలనూ ఓ చూపు చూస్తున్నాయి. తమ వెంచర్ విశేషాలను కస్టమర్లకు చూపడానికి సిటీ రియల్ ఎస్టేట్ సంస్థలు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. భారీ పరిశ్రమల ఏరియల్ ‘వ్యూ’కి సైతం ఇవి ఉపకరిస్తున్నాయి. నిన్నటి ఆడుకునే డ్రోన్ నేడు నమ్మకమైన నేస్తంగా వీడియోగ్రఫీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. చిత్రీకరణ (గ)ఘనం... పలు దేశ, విదేశీ కంపెనీలు ఈ డ్రోన్లను ఆక్టోకాప్టర్, డబుల్ ఆక్టోకాప్టర్ విభాగాల్లో అందిస్తున్నాయి. సినిమా వంటి అవసరాల కోసం డబుల్ ఆక్టోకాప్టర్లు వినియోగిస్తుంటే నగరంలో విభిన్న అవసరాల కోసం వాడేవి పరిమిత సామర్థ్యం ఉన్న ఆక్టోకాప్టర్లే. వీటి ధర రూ. లక్ష నుంచి రూ.7 లక్షల దాకా పలుకుతోంది. దాదాపు ఒకటిన్నర కేజీ ఆపైన బరువుండే వీటికి 400 నుంచి 800 గ్రాముల బరువుండే కెమెరాలను అమరుస్తున్నారు. ఇవి తక్కువ శబ్దుంతో, బ్యాటరీ ఆధారంగా నడుస్తాయి. ఒక బ్యాటరీ 20 నిమిషాల వరకు పనిచేస్తుంది. చేతిలో ఉన్న రిమోట్ సూచనలకు అనుగుణంగా తిప్పుతూ అవసరమైన సీన్లు షూట్ చేసుకునే చాన్స్ ఉంది. స్క్రీన్ మీద వీటి గమనాన్ని వీక్షిస్తూ.. ల్యాప్‌టాప్, ఐపాడ్, టాబ్లెట్స్, మొబైల్స్ ద్వారా సైతం కదలికల్ని నియంత్రించవచ్చు. క్రేన్స్‌కు చెక్... భారీ కార్యక్రమాలను చిత్రీకరించేందుకు కెమెరాను అమర్చేందుకు వాడుకలో ఉన్న క్రేన్స్ హవాకి డ్రోన్స్ చెక్ పెడుతున్నాయి. తక్కువ ప్లేస్‌లో ఇమిడిపోవడం, సులభంగా ఆపరేట్ చేయగలగడం, ఖర్చు పరంగా చూసినా లాభమే కావడంతో.. పలువురు వీడియో గ్రాఫర్లు డ్రోన్‌కు జై కొడుతున్నారు. ముందుకూ వెనక్కూ కదిలే సౌలభ్యం ఉండటంతో జూమ్ చేయాల్సిన అవసరం లేకుండానే చిత్రీకరణ సాగిపోతోంది. అయితే డ్రోన్ ప్రయోగానికి పోలీసుల అనుమతి తప్పనిసరి. ప్రముఖులు ఉన్న ప్రదేశాల్లో వీటి వినియోగానికి అనుమతి లభించదు. ఫ్యాషన్ పరేడ్‌లో డ్రోన్ ఇటీవల సిటీలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో డ్రోన్ వాడటం ద్వారా దేశంలోనే హైదరాబాద్ సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. నగరవాసులైన దీపికానాథ్ (ఖమ్మం), రాజేష్కట్టా (కరీంనగర్)లు తమ స్టార్టప్ కంపెనీ ‘పిక్సలిజం’ ద్వారా సిటీలో డ్రోన్ల వాడకంలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ‘బీటెక్ చదివి, చిన్న చిన్న ప్రమోషన్ల ద్వారా వచ్చిన డబ్బులే పెట్టుబడిగా ఈ కంపెనీ పెట్టాం. షార్ట్ టైంలో మా కంపెనీకి మంచి పేరొచ్చిందంటే దానికి ప్రధాన కారణం డ్రోన్స్‌ను వైవిధ్యంగా వినియోగించడమే. సిటీలోనే కాదు తెలంగాణ, ఏపీ నుంచి కూడా మాకు ఎంక్వయిరీలు వస్తున్నాయి. పెళ్లిళ్లు, విభిన్న రకాల వేడుకల్లో మరిన్ని సరికొత్త ధోరణులను ప్రవేశపెట్టనున్నాం’’ అని ఈ మిత్రద్వయం చెబుతోంది. మరిన్ని రంగాల్లో .. త్వరలో మరిన్ని రంగాలకు డ్రోన్స్ వాడకం విస్తరించనుంది. సిటీలో ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ట్రయిలర్ చూపించడానికి ప్రొజెక్టర్‌ను డ్రోన్‌కు బిగించి కొత్త స్టైల్‌కు తెర తీశారు. ఇప్పటికే ముంబైలో డామినోస్ సంస్థ పిజ్జా డెలివరీకి డ్రోన్‌ను ఉపయోగించగా, కొన్ని ప్రాంతాల్లో బంగాళదుంప పంటకు హానికరమైన తెగుళ్లను పట్టుకోవడానికి కూడా డ్రోన్స్‌ను వినియోగిస్తున్నారు. పలు రెస్టారెంట్స్ ఫుడ్ సర్వ్ చేయడానికి వెయిటర్స్ బదులు డ్రోన్స్‌ను వినియోగించేలా ప్లాన్స్ చేస్తున్నాయి. - ఎస్.సత్యబాబు -
ఫ్యాషన్ ఫ్రెండ్స్.. రాజ్‌దీప్ రణావత్
చిట్‌చాట్: ఫ్యాషన్ హబ్‌గా శరవేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌కు... స్టైలిష్ స్టేటస్‌లో 3వ స్థానం ఇస్తానని ఢిల్లీ డిజైనర్ రాజ్‌దీప్ రణావత్ అంటున్నారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా తన కలెక్షన్స్‌ను ప్రదర్శిస్తున్న ఈ యువ డిజైనర్... సిటీలోనే డిజైనింగ్ ఓనమాలు దిద్దడం విశేషం. బంజారాహిల్స్‌లోని అనహిత బొటిక్‌లో ఆటమ్/వింటర్, ఫెస్టివ్ కలెక్షన్స్‌ను లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే... ఫ్యాషన్ టేస్ట్ విషయంలో మెట్రో నగరాల్లో ఢిల్లీకి ఫస్ట్ ప్లేస్ ఇస్తా. తర్వాతి ప్లేస్‌లు వరుసగా ముంబయి, హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరుది. హెదరాబాద్ నిఫ్ట్‌లో డిజైనింగ్ ఓన మాలు దిద్దా. అప్పటితో పోలిస్తే ఫ్యాషన్ రంగంలో సిటీ బాగా ఇంప్రూవ్ అయింది. టాప్‌క్లాస్, టాప్ టేస్ట్ ఉన్న ఫ్యాషన్ లవర్స్ పెరుగుతున్నారిక్కడ. ఈ స్పీడ్ చూస్తూంటే మరింత ఫ్యూచర్ కనిపిస్తోంది. కొన్నేళ్లుగా క్రమంతప్పకుండా ఇక్కడే కలెక్షన్స్ లాంచ్ చేస్తున్నా. విదేశీ మోడల్స్ ఫ్రెండ్లీ... నేనే కాదు ఈ మధ్య చాలా మంది డిజైనర్స్ యూకే, రష్యా, అమెరికా... తదితర దేశాలకు చెందిన మోడల్స్‌తో పనిచేస్తున్నారు. దీనికి కారణం మనవారితో పోలిస్తే వీరు మరింత ఫ్లెక్సిబుల్‌గా ఉండడమే. వీరు చాలా ఫ్రెండ్లీగా, ఓపెన్ మైండ్‌తో ఉంటారు. బ్యాక్‌స్టేజ్‌లో ప్రాబ్లెమ్స్ ఉండవు. తాజా కలెక్షన్స్‌పై... ఈసారి ఫెస్టివ్ వింటర్ ఆటమ్ సీజన్‌కు నేను ప్రయోగాల మీదే కాన్సన్ట్రేట్ చేశాను. ట్రెండ్‌ను ఫాలో అవడం కంటే క్రియేట్ చేయడమే నాకు ఈజీగా అనిపిస్తుంది. ఈ కలెక్షన్లో ట్యునిక్స్, కుర్తాస్, అఫ్తాన్స్ ఉన్నాయి. నేచర్ ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ కలెక్షన్ డిజైన్ చేశా. గ్రీన్ విత్ పర్పుల్, ఎల్లో విత్ బ్రౌన్, రెడ్-బ్లాక్... ఇలా కలర్ మిక్సింగ్‌తో ప్రయోగాలు చేశా. ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ కూడా ఈ సారి కలెక్షన్లో హైలైట్. - ఎస్.సత్యబాబు -
రోటీ, కపడా ఔర్ మకాన్ దయతో నాస్తి దీనత్వం
కరుణ గల కళ్లల్లో అభయమిచ్చే శక్తి ఉంటుంది. సాయం చేసే చేతుల్లో అద్భుతదీపం ఉంటుంది. అన్నం పెట్టే ఆప్యాయతలో అక్షయపాత్ర ఉంటుంది. ఒళ్లు కప్పే ఆదరణలో మానవత్వం ఉంటుంది. దయగల హృదయం ఇవన్నీ చేస్తుంది. రేపు ‘ప్రపంచ దయార్ద్ర హృదయుల దినోత్సవం’. ఆ సందర్భంగా... అలాంటి హృదయాలను మీటే ప్రయత్నమే ఈవారం... ‘ప్రజాంశం’ కళ్లెదుట కూడు, గూడు, గుడ్డ కరవైన జీవితాలు ఇంకా కనపడుతూనే ఉన్నప్పుడు మనం సాధించిన అభివృద్ధికి అర్థం ఏమిటి? కొందరిని ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. కొందరికి తమదైన పరిధిలో సమాధానాలు దొరుకుతుంటాయి. అన్నం శరణం గచ్ఛామి ‘‘అన్నం దొరక్కపోతే మనిషి ఆత్మగౌరవానికే భంగం’’ అంటారు డాక్టర్ సూర్యప్రకాష్. ‘‘ఆశ్రమాలు కట్టించడం, వేలరూపాయలు ఖర్చు చేయడం లాంటి పెద్దపెద్ద పనులు చేయకపోయినా ఓ ముద్ద అన్నం పెట్టలేమా?’’ అని ఆయన ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్, దిల్‌సుఖ్‌నగర్‌లోని కొత్తపేటలో తాను ఏర్పాటుచేసిన ‘అందరి ఇల్లు (ఓపెన్ హౌస్)’ ద్వారా తాను కేవలం ప్రశ్నల మనిషిని మాత్రమే కానని ఆయన నిరూపించుకుంటున్నారు కూడా. గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ హౌస్ ఎందరో అన్నార్తుల కడుపు నింపింది. ఇంకా నింపుతోంది. దాదాపు 310 గజాల స్థలంలో నిర్మితమైన భవనంలో ఆయన నిర్వహిస్తున్న ఈ హౌస్‌కి ఎవరైనా వెళ్లవచ్చు. అక్కడ ఉన్న కూరగాయలు, దినుసులు ఉపయోగించి వంట వండుకుని కడుపునిండా తిని రావచ్చు. ఈ ఇంట్లో వండుకునేందుకు వంటసామానులతో పాటు చదువుకునేందుకు పుస్తకాలు, అత్యవసరంగా వినియోగించుకునేందుకు కొన్ని దుస్తులు కూడా ఉన్నాయి. ‘‘ఈ మహానగరానికి వచ్చినవారిలో ఎందరో నిరుద్యోగులు, వృద్ధులు, చిన్నారులు... ఒక్కోసారి కడుపునింపుకునే దారి కనపడక అల్లాడుతుంటారు. వారికోసమే ఈ ఓపెన్‌హౌస్’’ అని చెప్పారు సూర్యప్రకాష్. నీడనిచ్చిన మానవత్వం... చిన్న వయసులోనే జైలుపాలైన పిల్లలు విడుదలైన తర్వాత వారి పరిస్థితి ఏమిటి? మామూలు వారికే నీడ దొరకడం కష్టమైపోతోంది. అలాంటిది... జైలు నుంచి వచ్చిన పిల్లలను ఆదరించేవారెవరు? ‘క్రిస్టోస్’ ఆధ్వర్యంలో హైదరాబాద్, అల్వాల్‌లోని లోతుకుంటలో నిర్వహిస్తున్న ఓ హోమ్ ఇలాంటి పిల్లలను అక్కున చేర్చుకుంటోంది. ‘‘దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన కారాగారాలకు వెళ్లేందుకు నాకు అధికారిక అనుమతి ఉంది’’ అని ఈ సంస్థ నిర్వాహకుడు నాయర్ అంటున్నారు. ప్రస్తుతం ఆల్వాల్‌లో రెండు అద్దె భవనాలలో హోమ్‌ను నిర్వహిస్తున్నారు. ‘‘ఒకదాంట్లో పూర్తిగా ఆడపిల్లలు, మరో భవనంలో మగపిల్లలు, మా కుటుంబం ఉంటున్నాం’’ అని చెప్పారాయన. జైలుకు వెళ్లొచ్చినంత మాత్రాన ఆ పిల్లలు జీవితాంతం చెడ్డవారిగానే మిగిలిపోరనే తన అభిప్రాయం ఎంత గట్టిదో వారితో కలిసి జీవించడం ద్వారా చెప్పకనే చెబుతున్నారాయన. ప్రస్తుతం మానసికంగా ఎదగని పిల్లలు, కుష్ఠు వంటి తీవ్రవ్యాధులున్న చిన్నారులు సైతం హోమ్‌లో ఆశ్రయం పొందుతున్నారంటున్న నాయర్... గత పదిహేనేళ్లుగా ఈ హోమ్‌ను నిర్వహిస్తున్నానని చెప్పారు. బోలెడంత భవిష్యత్తున్న చిన్నారులకు నీడ కల్పించడం అనేది తనకు ఎంతో ఆనందాన్ని అందిస్తోందంటున్నారాయన. ఈ ఏడాది చంచల్‌గూడ జైలులో పిల్లలతో కలిసి తమ హోమ్ పిల్లలు చిన్నారుల దినోత్సవాన్ని జరుపుకోనున్నారని చెప్తున్నప్పుడు ఆయనలో ఆ ఆనందం ప్రస్ఫుటమైంది. దుస్తుల్లేని దుస్థితిని తప్పిస్తూ... తాజాగా విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్న అమ్మాయి రూ.లక్షలు ఖరీదు చేసే రెండు పీలికల బికినీ వేసుకుందనేది ఓ విశేషం. ఇంత సుసంపన్నమైన ప్రపంచంలోనే సిగ్గు దాచుకోవడానికి సరైన దుస్తులు కూడా లేని పరిస్థితిలో కోట్లాదిమంది జీవిస్తున్నారనేది ఓ కఠిన వాస్తవం. సరైన దుస్తులు ధరించేందుకు కూడా అవకాశంలేని నిరుపేదల కోసం షేర్ ఎ సర్వీస్ సంస్థ వస్త్రదాన దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వస్త్రాలను సేకరించి వాటిని అవసరార్థులకు పంపిణీ చేసేందుకు డిసెంబరు 31ని ‘వస్త్రదానదినం’ గా మార్చింది. ‘‘సేకరించిన దుస్తులను పంపిణీ చేసేందుకు మురికివాడలకు వెళుతున్నప్పుడు... మనిషికి అవసరమైన కనీస వసతులు కూడా ఎంత కరవైపోయాయో అర్థం అవుతోంది’’ అని ఈ సంస్థ నిర్వాహకులు గౌరీశంకర్ అన్నారు. పేరుకు ఏడాదికి ఒకసారి అనుకున్నా... ప్రజల నుంచి స్పందన బాగుండడంతో... ఈ వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని వీలున్నప్పుడల్లా నిర్వహిస్తున్నామన్నారాయన. - ఎస్.సత్యబాబు -
విలువలను బతికించుకోవాలి...
మనం పక్షిలాగ ఎగరడం, చేపలాగ ఈతకొట్టడం నేర్చుకున్నాం. కాని నడవడం, మనిషిలాగ బతకడం మర్చిపోతున్నాం. విలువలు అనేవి జీవితంలోని ప్రతి విషయానికి పునాది. అవి లేనప్పుడు జీవితం అనిశ్చితికి గురవుతుంది. భారతదేశం తరపున ఆధ్యాత్మిక సౌరభాలను ప్రపంచానికి వ్యాపింపజేస్తున్నారు మాతా అమృతానందమయి. కేరళ వాసి అయినప్పటికీ మన రాష్ట్రంలోని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈ ఆధ్యాత్మిక ప్రబోధకురాలు ఇటీవలే అరవై వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘అమృతవర్షం 60’ పేరుతో కేరళలోని కొల్లం గ్రామంలో నిర్వహించిన మూడు రోజుల వేడుకకు హాజరైన లక్షలాదిమంది భక్తులకు తన ఆలింగన భాగ్యం కలిగించిన మాతా అమృతానందమయి సమాజహితమైన సందేశాన్ని సైతం అందించారు. ఆమె సందేశంలోని ముఖ్యాంశాలివి... వీరులు కావాలి మన దేశానికి ఇప్పుడు వీరులు కావాలి. ప్రేమశక్తితో భయరహితంగా ధైర్యంతో ముందుకు వెళ్లేవారు కావాలి. అయితే దీని అర్థం ఒక వ్యక్తి తన శక్తితో మరొకర్ని ఓడించాలనో, ఇతరుల రాజ్యాలను గెలుచుకోవాలనో కాదు. నాణ్యమైన నాయకత్వాన్ని అందించాలని. ఆధ్యాత్మిక విలువలు అవసరం మనుషులు శాంతి, సామరస్యాలతో లేనప్పుడు అభివృద్ధి ఉన్నా ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అర్థం. అభివృద్ధితో పాటుగానే మనకు ఆధ్యాత్మిక సంస్కృతి, విశ్వవ్యాపితమైన విలువలు అవసరం. మనసుల మధ్య దూరం... సాంకేతిక పరిజ్ఞానం మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి మనసుల మధ్య దూరాన్ని రెట్టింపు జేస్తోంది. అవి మనం సృష్టించినవే అని మరిచిపోవద్దు. వీటినుంచి సంతోషాన్ని వెతుక్కోవడం సరైన విధానం కాదు. జీవితాన్ని ఆనందించే సమయం... ఇప్పుడు సమయాన్ని ఆదా చేసే ఉత్పత్తులు రోజుకొకటి వస్తున్నాయి. గతంలోలా జీవితాన్ని ఆనందించే సమయం, సందర్భాలు మనకు లేకుండా పోతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు చాలా ఉంటున్నాయి. కాని వారికి ఆడుకునే సమయం ఉండడం లేదు. మన చేతలకు, మన సాంస్కృతిక విలువలకు సంబంధం లేకపోతే అది ఒక పనిచేయని బ్యాటరీ కలిగిన మొబైల్‌ఫోన్‌ను వినియోగించడం లాంటిదే. అది కేవలం ఇతరులకు చూపించడానికి మాత్రమే తప్పితే మరెందుకూ పనికి రాదు. నిశ్చలమైన వేదిక నిర్మించుకోవాలి... మనం పక్షిలాగ ఎగరడం, చేపలాగ ఈతకొట్టడం నేర్చుకున్నాం. కాని నడవడం, మనిషిలాగ బతకడం మర్చిపోతున్నాం. విలువలు అనేవి జీవితంలోని ప్రతి విషయానికి పునాది. అవి లేనప్పుడు జీవితం అనిశ్చితికి గురవుతుంది. అది తరచు ఊగే వేదికలాగ మారకూడదంటే... మనలో అంతరాంతరాల్లో ఒక నిశ్చలమైన వేదికను నిర్మించుకోవాలి. విలువల్ని బతికించుకోవాలి. ఒంటరి మనసులకు కుటుంబ చికిత్స... ఒకప్పుడు కుటుంబం నుంచి ప్రతి ఒక్కరికీ భద్రత లభించేది. దాంతో సమస్యల్ని సులువుగా ఎదుర్కోగలిగేవారు. ఆధునిక సమాజంలో పరిమిత కుటుంబాల కారణంగా ఒంటరితనం అనే వ్యాధితో, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు పెరుగుతున్నారు. చిన్న విషయాలను కూడా భరించలేని వారు ఎక్కువయ్యారు. సామాజిక దృక్పథం ఉండాలి... మనం ఎప్పుడూ ఇతరుల తప్పులపైనే దృష్టిపెడతాం. ఇతరుల బలహీనతల విషయంలో మనం న్యాయమూర్తులం అవుతాం. అదే మన బలహీనతల విషయానికి వచ్చేసరికి మన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తాం. అది సరైంది కాదు. దీనిని అర్థం చేసుకుంటే ఎందరినో మనం చేరువ చేసుకోగలం. ఒకప్పటి రోజుల్లో ప్రతి వ్యక్తిగత నిర్ణయం సమాజ బాధ్యతను అనుసరించి ఉండేది. వ్యక్తిగత లబ్దికోసం మాత్రమే ఆలోచించడం అంతిమంగా అందరికీ కీడు చేస్తుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే..! రామాయణమైనా మహాభారతమైనా లేక గత 1000 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నా... ఎందరో నియంతలు, రారాజులు... మహిళల పట్ల, అమ్మదనం పట్ల అమర్యాద కారణంగా తమ సామ్రాజ్యాలను సర్వనాశనం చేసుకున్నారు. అందుకే మనం వెంటనే చేయాల్సిన పని మన పిల్లల్లో విలువల పట్ల ప్రేమను పెంచడం. అలాగైతేనే ఈ పరిస్థితుల్లో మార్పు తేగలం. - సేకరణ: ఎస్.సత్యబాబు