చికెన్ ఇడ్లీ.. ఇదో సైబర్ ఫుడ్ | Cyber food: corporate employees will get good food | Sakshi
Sakshi News home page

చికెన్ ఇడ్లీ.. ఇదో సైబర్ ఫుడ్

Published Thu, Sep 25 2014 12:02 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

చికెన్ ఇడ్లీ.. ఇదో సైబర్ ఫుడ్ - Sakshi

చికెన్ ఇడ్లీ.. ఇదో సైబర్ ఫుడ్

చికెన్ ఇడ్లీ, సీతాఫలం ఐస్‌క్రీమ్, చికెన్ టిక్కారైస్, కుల్ఫీస్ విత్ ఫలూదా... పేర్లు వెరైటీగా ఉన్నాయి కదూ. రుచులూరుతున్నాయి కదూ. అవి టేస్ట్ చేయాలంటే మనూరి పక్కనే ఉన్న మరో ఊరు వెళ్లాలి. దాని పేరు సైబర్ సిటీ. అక్కడ ఉంటాయి ‘టేస్ట్రీ’ట్స్!
 
 పిజ్జా హట్‌లో టేస్ట్ వెతుక్కునే కార్పొరేట్ ఉద్యోగులను రుచులతో కట్టిపడేయాలంటే ఆషామాషీ కాదు. క్వాలిటీ బాగుండాలి.. హైజినిక్ కండిషన్స్ ఉండాలి. హైటెక్ స్పీడ్‌లో అందించాలి. ఇవన్నీ ఉంటేనే ఐటీ పీపుల్ ఆదరిస్తారు. దీని కోసమే రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ పోటీపడుతున్నాయి. అయితే సందట్లో సడేమియాలా యంగ్ టెకీలను కస్టమర్లుగా చేజిక్కించుకుంటూ దూసుకుపోతోంది స్ట్రీట్ ఫుడ్. అటు టేస్ట్‌లో, ఇటు కాస్ట్ ద్వారా కూడా ఆకట్టుకుంటున్న రోడ్ సైడ్ రుచులు.. సైబరాబాదీల జిహ్వలకు గాలం వేస్తున్నాయి.  ఉల్లిపాయ పకోడీ ల నుంచి ఊతప్పం దాకా తెలిసిన వెరైటీలతో పాటు చికెన్ ఇడ్లీ నుంచి చిట్టి మొమోస్ పెద్దగా పరిచయం లేని పాకాలు ఇక్కడ పలకరిస్తున్నాయి. ఖరీదైన రెస్టారెంట్స్ కంటే మిన్నగా స్ట్రీట్ ఫుడ్‌కు ఆదరణ లభిస్తోంది. అందుబాటు ధరలో అదరహో అనిపిస్తుండటం ఈ ప్రాంతాలకు పేరు తెచ్చిపెడుతోంది. అలాంటి కొన్ని వీధుల్ని సందర్శిస్తే...
 
 డీఎల్‌ఎఫ్ స్ట్రీట్..
టెకీలకు టేస్టీ రుచులు అందించడంలో డీఎల్ ఎఫ్ ఏరియా టాప్‌లో ఉంటుంది. ఈ రోడ్‌లో ఉన్న పరివార్ గేట్‌వేలో దొరికే గులాబ్ జామూన్, కచోడి, సమోసాల రుచికి ఐటీ ఉద్యోగులు వావ్ అంటారు. ఇండియన్, చైనీస్ వంటకాలు కూడా అందించే ఈ గేట్‌వేలో ధరలు రూ.10 నుంచి రూ.120 మధ్యన ఉంటాయి.
 
 ఈట్ స్ట్రీట్..
 ఐటీ కంపెనీలు ఒకటొకటిగా రంగప్రవేశం చేసిన తొలి రోజుల్లో  గచ్చిబౌలి దగ్గర్లోని ఇంద్రానగర్ ఫుడీస్‌కి కేరాఫ్‌గా ఉండేది.  ప్రపంచవ్యాప్త రుచుల్ని అందిస్తూ ఇక్కడ రెస్టారెంట్లు అత్యధికంగా వెలిశాయి. నిదానంగా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ పుంజుకోవడం ప్రారంభమైంది. ఈ వీధికి ఐటీ సర్కిల్‌లో పలువురు ‘ఈట్ స్ట్రీట్’ అని పేరు పెట్టాలని వ్యాఖ్యానిస్తుంటారు. ఇదే వీధిలో ఓ చోట చెట్టినాడ్ విలాస్ ఉంటుంది. చెట్టినాడ్ రుచులు వడ్డించే మొబైల్ వ్యాన్ ఇది. రకరకాల ఇడ్లీలు, దోసెలు, ఇడియప్పం, అడాయి.. ఇలా ఎన్నో లభిస్తాయి. ధరలు కూడా రూ.40 నుంచి రూ.110 మధ్య ఉంటాయి. ఓ యువ వ్యాపారి ఆలోచనలకు పసందైన రూపం ‘విచ్ ప్లీజ్’. విభిన్న శాండ్‌విచ్‌లు రుచి చూడాలని అనుకునేవారికి ఇది సరైన ప్లేస్. విచ్ ప్లీజ్‌లో స్పెషల్ పనీర్ క్లబ్ శాండ్‌విచ్, న్యూటెల్లా టోస్ట్ శాండ్‌విచ్.. వంటివి ఇక ్కడ తప్ప సిటీలో మరెక్కడా కనిపించవంటారు టెకీలు. రూ.30 నుంచి రూ.120లోపు ఇవి లభిస్తున్నాయి.
 
 టేస్టీ ఏరియా..
 ఒకప్పుడు టెలికం ఉద్యోగులకే పరిమితమైన టెలికం నగర్ ప్రాంతం.. ఇప్పుడు సువిశాలమైన రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోయింది. ఇక్కడ రైస్‌బౌల్ పేరుతో ఉన్న కియోస్క్.. వెజ్,  నాన్‌వెజ్ రైస్ బౌల్స్‌ను అందిస్తుంది. ఆలూ బట్టర్ రైస్, చికెన్ టిక్కా రైస్, బటర్ చికెన్.. వంటివి సాధారణ స్థాయిలో తినే  వ్యక్తికి సరిపోయే క్వాంటిటీలో సర్వ్ చేస్తారు. ధర రూ.50 నుంచి రూ.70 దాకా ఉంటుంది. జ్యూస్‌లు, మిల్క్‌షేక్స్, సలాడ్స్‌కు పేరొందింది యోస్తా. తాజా, న్యూట్రిషియస్ జ్యూస్‌లకు ఇది పేరొందింది. కలర్స్, ఫ్లేవర్స్ వినియోగించకుండా సహజసిద్ధమైన పద్ధతిలో తయారయ్యే జ్యూస్‌ల ధర రూ.50 నుంచి రూ.70 మధ్య ఉంటుంది.
 
 ఫలూదా పహాడ్..
 సరికొత్తగా, శరవేగంగా స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్ వెలుస్తున్న ప్రాంతం కొండాపూర్. ఇప్పుడిప్పుడే ఇక్కడ లభించే వెరైటీలకు ప్రాచుర్యం లభిస్తోంది. ఫలూదా చాలా రుచికరంగా ఉంటుందని దాన్ని టేస్ట్ చేసిన వాళ్ల మాట. ఇక్కడి ‘శర్మా బోంబే ఫేమస్ ఫలూదా’ ఈ వెరైటీ టేస్టీకి కేరాఫ్‌గా నిలుస్తోంది. మలాయ్ కుల్ఫీ, పిస్తా కుల్ఫీ, మ్యాంగో కుల్ఫీ, స్ట్రాబెర్రీ కుల్ఫీ,  కేసర్ పిస్తా కుల్ఫీ, కాజు అంజీర్ కుల్ఫీ, స్పెషల్ బాదమ్ కుల్ఫీ.. లతో పాటుగా వాటితో రూపొందించే వెరైటీ ఫలూదా ఇక్కడ ప్రత్యేకం. ఇవి రూ.30 నుంచి రూ.60 ధర మధ్య లభిస్తాయి.  ఈ సైబర్ స్ట్రీట్‌లో ఒక రౌండ్ కొడితే చాలు.. పొగలు కక్కే బజ్జీలు, సమోసా, కచోడి, బిర్యానీ, నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మొమోస్, చాట్స్, షావర్మ, కట్టి రోల్స్, మిల్క్ షేక్స్, ఫలూదా.. ఇంకా ఎన్నో చవులూరించే రచులు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయి.  వీధి వీధి రుచుల విందు... విందు పేరేమి? అని పాట పాడుకుంటూ బాటసారులు ఆశ్చర్యపోతూనే.. ఆస్వాదించేస్తారు.
- ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement