న్యూ ఇయర్ రెజల్యూషన్స్‌కు సంబంధించి లైఫ్‌స్టైల్ స్పోర్ట్స్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలినదేమిటంటే... ఈ ఏడాది అత్యధిక శాతం మంది తీసుకున్న తీర్మానాల్లో టాప్‌లో ఉంది ఎక్సర్‌సైజ్. అదే సమయంలో గత ఏడాది తీసుకున్న తీర్మానాలను విజయవంతంగా అమలు పరిచింది 8 శాతం మించలేదని కూడా తేలింది. నిర్ణయం తీసుకున్న తొలినాళ్లలో ఉన్న ఆసక్తి స్వల్పకాలంలోనే అటకెక్కడమే దీనికి కారణం. కొత్త ఏడాది ప్రారంభమై... ఇప్పటికే రెండు వారాలు కావస్తున్న నేపధ్యంలో... మనం తీసుకున్న ఆరోగ్యకరమైన తీర్మానాన్ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించడానికి ఉపకరించే కొన్ని సూచనలు ఇస్తున్నారు సిటీకి చెందిన ట్రైనర్ వెంకట్...
..:: ఎస్.సత్యబాబు
ఎప్పుడూ ఒకే రకమైన ఎక్సర్‌సైజ్ రొటీన్‌ను అలవాటు చేస్తే... రిజల్ట్స్ సరిగా కనపడక మధ్యలోనే ఆపేసే అవకాశం ఉంటుంది. విభిన్న రకాలైన వర్కవుట్స్, ఆ వర్కవుట్స్‌లో కూడా వైవిధ్యం అవసరం.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తుంటే... తరచు వెయిట్స్ మార్పు చేసుకోండి. ఒక రోజు జిమ్‌లో, మరొకరోజు అవుట్‌డోర్‌లో జాగింగ్, స్ట్రెచ్చింగ్, కిక్‌బాక్సింగ్, ఫ్లోర్ ఎక్సర్‌సైజ్, స్పిన్నింగ్, స్విమ్‌బాల్, డాన్స్ ఎరోబిక్స్... ఇలా చేంజ్ చేయండి. ఒకోసారి మనతో ఫ్యామిలీని లేదా కనీసం పెట్‌డాగ్‌ను తీసుకెళ్లడం, పిల్లలతో ఆటలాడడం... ఇలా ఫిట్‌నెస్ రొటీన్‌ను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దుకుంటే ఇక మీకు ఎక్సర్‌సైజ్ బోర్ కొట్టదు. తద్వారా... ఆసక్తి రోజు రోజుకూ పెరుగుతోంది.
తీరైన డ్రెస్సింగ్...
డిఫరెంట్ డ్రెస్సింగ్ కూడా వర్కవుట్ రొటీన్‌ను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తుంది. మరీ టైట్‌గా ఉండని, బాగా సౌకర్యవంతంగా, కుషనింగ్ ఉన్న షూస్ ఎంచుకోండి. శాటిన్, కాటన్... ఫ్యాబ్రిక్స్‌లో ట్రాక్ సూట్స్ ఆకర్షణీయమైనవి దొరుకుతున్నాయి. చేతులకు గ్లవ్స్, వెయిస్ట్ బెల్ట్స్, కేలరీ కాలిక్యులేటర్.... కాస్త ఖర్చయినా మంచివి ఎంచుకోవాలి. వీటన్నింటిని ధరించడం వల్ల వచ్చే స్పెషల్ లుక్ కూడా ఎక్సర్‌సైజ్ పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తుంది.
స్పీడ్ రిజల్ట్స్‌తో కిక్...
తొలిరోజుల్లో చెప్పుకోదగ్గ రిజల్ట్స్ వస్తే అదొక కిక్‌లాగా పనిచేసి వర్కవుట్స్ రెగ్యులర్ అవడానికి కారణమవుతుంది. వెయిట్ లాస్ లేదా మరేదైనా రిజల్ట్ త్వరితంగా కనపడాలని ఆశించడం సహజమే. అలా జరగకపోతే నిరుత్సాహం ఆవరిస్తుంది. తొలినాళ్లలో కాస్త వేగంగా ఫలితాలనిచ్చే వ్యాయామం ఎంచుకోవాలి. బ్రిస్క్‌వాకింగ్ వల్ల క్యాలరీలు బాగా ఖర్చువుతాయి. జాగింగ్ ఒక గంటలో 6-7 కిలోమీటర్లు, నడక 10-12 కి.మీ చేయగలిగితే... మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే ఎక్సర్‌సైజ్ రొటీన్ అందరికీ ఒకటే విధంగా నప్పదు. కాంబినేషన్ ఎక్సర్‌సైజ్‌లు చేయడం అనేది అన్ని వేళలా మంచిది.
డైట్ మారితే... రైట్ రైట్
వ్యాయామం ప్రారంభించడంతో పాటు తప్పనిసరిగా ఆహారంలోనూ మార్పు చేర్పులు చేసుకోవాలి. ప్రత్యేకమైన, శక్తిని పెంచే పోషకాలు నిండిన ఆహారాన్ని డైట్‌లో జతచేయాలి. టీ, కాఫీ, జంక్‌ఫుడ్ వంటి వాటిని తగ్గించేసి, వాటి స్థానంలో ప్రొటీన్‌లు, విటమిన్‌లను అందించే మంచి ఫుడ్‌ని చేర్చడం ద్వారా సరికొత్త షాపింగ్ అలవాటవుతుంది. ఇంట్లోనూ, ఒంట్లోనూ కొత్త హుషారు వస్తుంది. ఇలాంటి మార్పులు, టైమింగ్ వంటివి కొత్త కొత్త సరదాలను, ఆసక్తులను ప్రోది చేస్తాయి. తద్వారా వ్యాయామాన్ని క్రమబద్ధం చేస్తాయి. ఈ ఏడాది మీరు తీసుకున్న ఓ చక్కని హెల్దీ రిజల్యూషన్‌ని విజయవంతం అయ్యేలా చేస్తాయి.
కొన్ని టిప్స్:
ప్రారంభంలో వార్మప్, కూల్‌డవున్ స్ట్రెచెస్ బాగా ప్రాక్టీస్ చేయాలి
8 నుంచి 10రిపిటీషన్స్, 3లేదా 4 సెట్స్ ప్రయత్నించాలి. రిపిటీషన్స్‌కు మధ్య 3-4సెకన్లు, సెట్‌కి సెట్‌కి మధ్య అరనిమిషం నుంచి నిమిషం విరామం ఇవ్వాలి.
ఒక వ్యాయామం ఒక సెట్ చేయడానికి పట్టే సమయం చేస్తున్న కొద్దీతగ్గుతుంది. అంటే మీ సామర్ధ్యం పెరుగుతున్నట్టే.
ఏ వయసు వారైనా చేయదగింది యోగా. ఆరంభంలో సూర్యనమస్కారాలు ఎంచుకోవాలి.
స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో కొంతమందికి తక్కువ వెయిట్ ఎక్కువ రిపిటీషన్లు, మరికొంత మందికి ఎక్కువ వెయిట్ తక్కువ రిపిటీషన్లు... ఇలా బాడీ నేచర్‌ని బట్టి చేయాలి. బాడీబిల్డింగ్ సిద్ధాంతం ప్రకారం హెవీ వెయిట్ వల్ల సైజ్ వస్తుంది. దానికి కూడా మినిమం 8 లేదా 10రిపిటీషన్లు చేయాలి.
ఎం. వెంకట్, ఫిట్‌నెస్ ట్రైనర్
ఫిట్‌నెస్ రిజల్యూషైన్
Published Tue, Jan 13 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM
Advertisement
Advertisement