survey
-
బందోబస్తు మధ్య ‘ఫ్యూచర్’ రోడ్డుకు సర్వే
కందుకూరు/ఇబ్రహీంపట్నం రూరల్: ఫ్యూచర్ సిటీ ఏర్పాటులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు సర్వే పనులను మంగళవారం పోలీసు బందోబస్తు మధ్య చేపట్టారు. ఈ సందర్భంగా భూములు ఇచ్చి తామెక్కడికి వెళ్లాలంటూ రైతులు ఆవేదన వెలిబుచ్చారు. భూములు కోల్పోతున్న వారికి ఎంత పరిహారం ఇస్తారు? ఎలా న్యాయం చేస్తారో చెప్పకుండా పోలీసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు సర్వే చేస్తుండగా.. కొంగరకలాన్‌లో కలెక్టరేట్ వెనక వైపు చేపట్టిన సర్వే పనులను అడ్డుకుని మహిళలు నిరసన తెలిపారు. రాజు అనే యువ రైతు తమ భూమి తీసుకుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు అతన్ని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. 330 అడుగుల రహదారి రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాల్లో గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం సేకరించిన భూముల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని నిర్మించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. అక్కడికి చేరుకునేలా ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి మీర్ఖాన్పేట వరకు 330 అడుగుల రహదారి నిర్మాణానికి ప్రతిపాదించింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్, మహేశ్వరం మండలం కొంగరకుర్దు, కందుకూరు మండలం లేమూరు, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్ట్, పంజగూడ, మీర్ఖాన్పేటలో కలిపి మొత్తం 449.27 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది.ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం ఇటువైపు కందుకూరు మండలం రాచులూరుతోపాటు అటువైపు ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌లో అధికారులు ఏకకాలంలో సర్వే పనులు ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి, కందుకూరు తహసీల్దార్ గోపాల్, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో సీఐలు సీతారామ్, వెంకట్‌తోపాటు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే నిర్వహించారు. అక్కడి రైతులు అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంత పెద్ద రోడ్డు నిర్మిస్తే పొలాలు మొత్తం పోయి, రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. సమావేశం ఏర్పాటు చేసి తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పి అధికారులు సర్వేను కొనసాగించారు. -
తెలంగాణలో కులగణన... లక్ష్యం స్పష్టమేనా?
తెలంగాణలో కులగణన మొదలైంది. విజయవంతం అవుతుందా లేదా అన్న అనుమానాలున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ రెండూ దీనిపై పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శమవుతుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఈ జోష్‌లోనే రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసురుతూ ‘‘ఇక కాచుకోండి’’ అంటూ ఓ ట్వీట్ కూడా చేశారు. రిజర్వేషన్లపై ఉన్న ఆంక్షలను కూడా బద్ధలు కొడతామని రాహుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.దేశంలో ప్రస్తుతం అమలవుతున్న రిజర్వేషన్లు వాస్తవ పరిస్థితులకు దగ్గరగా లేవన్నది కాంగ్రెస్ భావన. రాజకీయ కోణం ఉండనే ఉంది. కులగణన వల్ల బలహీన వర్గాల వారికి మరింత లబ్ధి చేకూరుతుందని, సామాజిక, ఆర్థిక ప్రయోజనాలతోపాటు రాజకీయ అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని కాంగ్రెస్ ఆలోచన. ఇవన్నీ వినేందుకు బాగానే ఉన్నా సర్వే పూర్తి కావాలంటే మాత్రం ఎన్నో అవరోధాలను అధిగమించాల్సి ఉంటుందన్నది మాత్రం నిజం. ఇప్పటికే బీహార్‌లో కులగణన చేశారు.అయితే ఇది న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా ఒక చట్టం చేయకుండా కులగణన చేయడం వల్ల దానికి చట్టబద్ధత ఎలా వస్తుందన్నది ప్రశ్న. సర్వేలో అందే వివరాలు సమగ్రంగా ఉంటాయా? వాస్తవాలేనా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పాలకులు మారినప్పుడల్లా ఇలాంటి కార్యక్రమాలు పెట్టడంవల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుందన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే ఒకదాన్ని నిర్వహించారు. ఒకే రోజు రాష్ట్రమంతటా చేపట్టే ఈ సర్వేలో అందరూ కచ్చితంగా పాల్గొనాలని చెప్పడంతో అప్పట్లో జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. దూర ప్రాంతాల్లోని వారు వేలకు వేలు ఖర్చుపెట్టుకుని సొంతూళ్లకు రావాల్సి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ సర్వే ద్వారా సేకరించిన వివరాలు ఏమయ్యాయి అన్నది ఎవరికీ తెలియదు. ఎందుకు సర్వే చేశారు? అందిన సమాచారాన్ని ఎలా వాడారో ఎవరికీ చెప్పలేదు. దీంతో అదంతా వృథా ప్రయాసే అన్న అభిప్రాయం ఏర్పడింది.2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో తామిచ్చిన హామీల అమలుకుగాను.. ఆయా పథకాలను కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలన కార్యక్రమం కింద కోరారు. ఇందుకో అధికశాతం మంది క్యూల్లో నిలవాల్సి వచ్చింది. దరఖాస్తులు పెట్టుకోవడానికి నానా పాట్లు పడ్డారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వాటి ఊసే ఎత్తడం లేదు. దీని ప్రభావం కాస్తా ప్రస్తుతం జరుగుతున్న కులగణనపై పడుతోంది. ముందు అప్పటి సమాచారం సంగతేమిటో తెల్చమని కొందరు సర్వే అధికారులను నిలదీస్తున్నారు. అక్కడితో ఆగడం లేదు.అసలు కుల గణన దేనికి? మా ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, మా రుణాలు తదితర వివరాలతో ఏమి చేస్తారు? అంటూ పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ఎన్యుమరేటర్లు పై అధికారులు ఇచ్చిన సమాచారాన్ని వివరిస్తున్నా ప్రజలకు సంతృప్తి కలగడం లేదు. అందుకే ఒక ఎన్యుమరేటర్.. ‘‘ఏమో సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడగండి’’ అంటే.. ‘‘అయితే ఆయన్నే సర్వేకు రమ్మనండి’’ అని ఒక పౌరుడు చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా సర్వేలో భాగంగా బ్యాంకు ఖాతాల వివరాలు అడగడం వివాదాస్పదమైంది. చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. దాంతో ప్రభుత్వం విరమించుకుంది. ఇప్పుడు మళ్లీ అదేరకంగా బ్యాంకు ఖాతాల వివరాలు, ఇంటి స్థలం జాగా, ఆదాయ వనరులు మొదలైన వాటి గురించి సుమారు 75 పాయింట్లపై ప్రశ్నలు వేస్తున్నారు. వాటన్నిటికి జవాబు చెప్పడానికి చాలా టైమ్ పడుతుంది.నిజానికి ఏ సర్వే అయినా సింపుల్ గా ఉండాలి. తక్కువ ప్రశ్నలతో ఎక్కువ సమాచారం రాబట్టేలా చేయగలిగితే ఉపయుక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల వ్యక్తిగత ఆదాయ, ఆస్తి వివరాలు అడగడం ఆరంభించారో, అప్పుడే అనుమానాలు ప్రబలుతాయి. ఉదాహరణకు ఒక ఇంటి వద్దకు వచ్చి ఆ ఇల్లు ఎంత విస్తీర్ణంలో ఉంటుందని అడగగానే ఆ ఇంటి యజమానికి సందేహాలు వస్తాయి.ప్రభుత్వం ఏమైనా పన్నులు పెంచడానికి ఈ ప్రశ్న వేస్తోందా, వస్తున్న ప్రభుత్వ పథకాలు ఆపడానికా? అన్న భావన కలుగుతుంది. నిజానికి పట్టణాలు,నగరాలు, గ్రామ పంచాయతీలు ఎక్కడైనా స్థానిక సంస్థలలో ఇళ్లు, విస్తీర్ణం తదితర వివరాలు ఉంటాయి. దానికి అనుగుణంగానే పన్నులు కడుతుంటారు. ఒక వేళ స్థలం యజమాని మారినా, ఆ వివరాలు కూడా నమోదు అవుతాయి. అలాంటప్పుడు ఈ తరహా వివరాలు స్థానిక సంస్థల నుంచి తెలుసుకోవచ్చు కదా! ఇళ్ల యజమానులు సర్వేలో నిజాలు చెబితే ఓకే. కాని వారికి ఉండే సంశయాలతో వాస్తవాలు చెప్పకపోతే ఏమి అవుతుందన్న ప్రశ్న కూడా వస్తుంది. చట్టబద్దత లేకపోవడం వల్ల ఈ సమస్య రావచ్చు. కేవలం ఎవరు ఏ కులం అన్నది తెలుసుకోవడమే లక్ష్యమైతే ఇన్ని పాయింట్లతో సమగ్ర సర్వే అవసరమా? అని కొందరు అడుతున్నారు.నిజమే! ప్రభుత్వాల వద్ద ప్రజలందరి సమాచారం ఉంటే, దానిని విశ్లేషించుకుని, వివిధ స్కీములు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కులాల వారిగా జాబితా ఉంటే రిజర్వేషన్ ల విషయంలో నిర్దిష్ట విధానం అవలంబించడానికి వీలు అవుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో వీటి ఆధారంగా ఆయా పార్టీలు టిక్కెట్లు కేటాయించే అవకాశం పెరుగుతుంది. కాని కేవలం కులాల ఆధారంగానే రాజకీయాలు అన్నిసార్లు నడవవన్న విషయాన్ని కూడా విస్మరించలేం. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలలో తక్కువ శాతం ఉన్న అగ్రకులాల నేతలే ఎందుకు రాజకీయంగా అధిక శాతం పదవులు పొందుతున్నారు? కులాల సర్వేతోనే పరిస్థితి మారుతుందా? అంటే పూర్తిగా అవునని చెప్పలేం.ఆయా నియోజకవర్గాలలో కులాల బలబలాలను కూడా చూసుకునే టిక్కెట్లు ఇవ్వడం ఇప్పటికే జరుగుతోంది. ఆ విషయాన్ని కూడా కాదనలేం. ఆదాయ వివరాలు ఉంటే దానికి తగ్గట్లుగా పేదలను ఆర్ధికాభివృద్ది చేయవచ్చు. మధ్య తరగతి, ఉన్నతాదాయ వర్గాల వారు తమ ఆదాయ వివరాలను బహిర్గతం చేయడానికి ఆసక్తి చూపకపోవచ్చు. ముఖ్యంగా పేదలతో పాటు దిగువ మధ్య తరగతివారు వివిధ ప్రభుత్వ స్కీముల కింద ప్రయోజనం పొందుతుంటారు. తమ ఆదాయం నిర్దిష్ట పరిమితికన్నా కాస్త ఎక్కువగా ఉన్నా వాటిని తొలగిస్తారేమో అన్న భయం వారిలో ఉంటుంది. దానిని ఎలా పొగొడతారో తెలియదు. ఆదాయ పన్ను శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల వద్ద ప్రజల ఆదాయ వివరాలు దొరుకుతాయి. వాటిని తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదో ఆలోచించాలి.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదేళ్లకు ఒకసారి నిర్వహించే జనాభా గణనలో ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారం సేకరిస్తుంది. అలాగే బీసీ జనాభాను కూడా గుర్తించవచ్చు. రాజకీయ, ఉపాధి అవకాశాలలో బీసీలకు రిజర్వేషన్ లు పెంచుతామంటూ రాజకీయ పార్టీలు హడావుడి చేయడం, కమిషన్లు వేయడం, చివరికి అవన్ని ఉత్తుత్తిగానే మిగిలి పోవడం చూస్తూనే ఉన్నాం. =అసలు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా కులగణన సర్వేలు చేయగలుగుతాయా? రిజర్వేషన్లు యాభై శాతం దాటి పెంచాలని సంకల్పించినా కేవలం రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సరిపోదు కదా! రాజకీయ పార్టీలకు ఈ అంశంలో ఉన్న చిత్తశుద్ది ఎంత అన్నది కూడా వస్తుంది.ఒకపక్క బలహీన వర్గాలు అంత శాతం ఉన్నారు.. ఇంత శాతం ఉన్నారని చెబుతారు. కాని అధికార పంపిణీలో మాత్రం ఏ వర్గం ఆధిపత్యంతో ఉంటుందో, దానికే అధిక వాటా లభిస్తోంది. అంతెందుకు యాభై శాతం మించి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారంలో అన్యాయం జరుగుతోందని రాహుల్ గాందీ మొదలు రేవంత్ రెడ్డి వరకు అంటున్నారు కదా! కాని సీఎం పదవి వచ్చేసరికి ఎందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికే ఇచ్చింది? మల్లు భట్టి విక్రమార్కను ఉప ముఖ్యమంత్రి పదవికి ఎందుకు పరిమితం చేశారు?ఇక్కడే కాదు.. పలు ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ఇందులో అనేక అంశాలు ఇమిడి ఉంటాయి. రేవంత్‌కు సీఎంపదవి రావడాన్ని తప్పుపట్టడం లేదు. పీసీసీ అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసి పదవి సంపాదించుకున్నారు. కాని కులాల పంచాయతీ పెట్టినప్పుడే ఇలాంటి ప్రశ్నలు కూడా తలెత్తుంటాయి. సమాజంలో ఎంత కాదన్నా ఆధిపత్య కులాల, వర్గాల పెత్తనం ఇంకా పోలేదు. కులాల ప్రాతిపదికన అన్నీ జరిగిపోవు. అలా అని కులాలను విస్మరించాలని ఎవరూ చెప్పరు. వీటన్నిటికి మూల కారణం ఎక్కడ వస్తోంది? రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేస్తుంటాయి.అర్హతలతో నిమిత్తం లేకుండా హామీలు ఇచ్చి, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత షరతులు పెట్టడం ఆరంభిస్తారు.దానిపై ప్రజలలో మండుతుంది. ఉదాహరణకు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సూపర్ సిక్స్ అని, గ్యారంటీలు అని ఎన్నికల మానిఫెస్టోలలో పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళకు రూ.నెలకు 2500 చొప్పున ఇస్తామని చెబితే, ఏపీలో ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని టీడీపీ ప్రకటించింది. అలాగే ఏపీలో తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్ధికి రూ.15 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలలో ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఇవే కాదు. వందల కొద్ది హామీలను గుప్పించారు.తీరా ఎన్నికయ్యాక వాటిని ఎలా అమలు చేయలో తెలియక, ఆర్థిక వనరులు ఎక్కడనుంచి వస్తాయో అర్థం కాక, నేతలు తల పట్టుకుని కూర్చుంటున్నారు. అక్కడ నుంచి ప్రజలను ఎలా మోసం చేయాలా,డైవర్షన్ రాజకీయాలు ఎలా చేయాలా అన్నదానిపై దృష్టి పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కుల గణన అనండి, సమగ్ర కుటుంబ సర్వే అనండి.. ఏది చేసినా ప్రజలకు మేలు చేయడానికే అయితే స్వాగతించాల్సిందే. కానీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు గేమ్ ఆడుతుంటే ప్రజలు హర్షించరు. దీనిపై దేశ వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి చిత్తశుద్దితో చేస్తే తప్ప, ఒక్క తెలంగాణలోనో, మరో రాష్ట్రంలోనో చేస్తే పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది సందేహమే.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘సర్వే’ను బహిష్కరించిన ఐలాపూర్ ఆదివాసీలు
కన్నాయిగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ఆదివాసీ గ్రామమైన ఐలాపూర్‌లో ప్రజలు బహిష్కరించారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేసి సర్వేకు వచి్చన అధికారులకు అందజేశారు. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఉన్న తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని, ప్రభుత్వాలు, పాలకులు మారినా ఇప్పటి వరకు తమ గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేద ని ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఐటీడీఏ నుంచి కూడా గ్రామానికి మేలు జరగలేదని మాజీ సర్పంచ్ మల్లెల లక్ష్మయ్య అన్నారు.అర్హులైన రైతుల పొలాల్లో బోర్లు వేసి సుమారు ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యుత్ లైన్ వేయలేదని, వేసిన బోర్లు నిరుపయోగంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఏటూరు నాగారానికి మధ్యలో ఉన్న సుమారు 10 కిలోమీటర్ల రోడ్డు మార్గానికి 2018లో ప్రభుత్వం నిధులు ఇచ్చినా అటవీ శాఖ అనుమతులు లేవంటూ పనులను నిలిపివేశారని లక్ష్మయ్య మండి పడ్డారు. గ్రామానికి రోడ్డు, విద్యుత్, తాగు, సాగు నీరు, వైద్య సదుపాయాలు అందించాకే సమగ్ర కులగణన చేయాలని డిమాండ్ చేశారు. -
ఈ గందరగోళమేంటి ‘సర్వే’శా!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ సర్వే గ్రేటర్లో పరిధిలో అయోమయంగా మారింది. ఇంటింటికీ వెళ్తున్న ఎన్యుమరేటర్లకు ప్రజల నుంచి ఎదురవుతున్న యక్ష ప్రశ్నలతో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ‘ఈ సర్వేకో దండం.. మేం చేయలేం సార్’ అంటూ ఉన్నతాధికారులకు కొందరు ఆవేదన వెళ్లబుచ్చుతున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లను కనీసం గేట్లు కూడా తీయనియ్యలేదు. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఇంకొందరు కుక్కల్ని కూడా ఉసిగొల్పుతున్నారని ఎన్యుమరేటర్లు వాపోతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అందించిన దరఖాస్తులకే ఇప్పటి వరకు దిక్కులేదు.. అప్పుడు రెండు రోజులపాటు పడిగాపులు కాసి ఇచి్చనా, వాటితో మాకెలాంటి ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు ఈ సర్వేలో మీకెందుకు వివరాలివ్వాలంటూ ముఖం మీదే కుండబద్దలు కొడుతున్నారు. స్టిక్కర్లతోనే చుక్కలు కనిపిస్తున్నాయి.. వాస్తవానికి నగరంలో సర్వే నామమాత్రంగానే ప్రారంభమైంది. శుక్రవారం నాటికి పూర్తి కావాల్సిన స్టిక్కర్లు అంటించే కార్యక్రమం పూర్తికానందున శనివారం కూడా ఆ పనిలోనే ఉన్నారు. స్టిక్కర్లు అంటించేటప్పుడే కుటుంబ యజమాని పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు. కానీ.. చాలామంది తమ ఫోన్ నంబర్లు ఇవ్వడం లేదు. పేర్లు చెప్పేందుకు కూడా పలువురు యక్ష ప్రశ్నలు వేస్తున్నా రు. అసలు ఈ సర్వేతో తమకేంటి లాభం? అంటూ విసురుతున్న ప్రశ్నలతో ఎన్యూమరేటర్లుగా వ్యవహరిస్తున్న ఆశావర్కర్లు తెల్లబోతున్నారు. ఆర్థిక పరిస్థితి వంటివి తెలుస్తుంది సార్ అంటే.. మా ఆర్థిక పరిస్థితి నీకెందుకు చెప్పాలి? నువ్వేం చేస్తావ్ ? అంటున్నారని.. ఫారాలు నింపాక పై అధికారులకిస్తాం అంటే.. వారేం చేస్తారు ? వంటి ప్రశ్నలు సంధిస్తున్నారని పలువురు ఎన్యుమరేటర్లు వాపోయారు. స్టిక్కర్ల నాడే పరిస్థితి ఇలా ఉంటే.. అసలు సర్వే ఎలా చేయాలని వాపోతున్నారు. ఎన్యుమరేటర్లుగా వ్యవహరిస్తున్న టీచర్లు మాత్రం వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, వారిని తృప్తిపరచలేకపోతున్నామన్నారు. ప్రజల నుంచి ఎదురవుతున్న ఈ పరిస్థితిని తట్టుకోలేక కాబోలు చాలా ప్రాంతాల్లో స్టిక్కర్లను చడీచప్పుడు కాకుండా ఇంటి బయట గోడలకు అంటించి పోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంటించకుండానే గేటు బయట నుంచే ఇంటి ఆవరణలోకి విసిరి వేశారు.సీఎంపై తిట్ల దండకం.. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే తిడుతున్నారని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో విధుల్లో ఉన్న ఓ మహిళా ఎన్యుమరేటర్ పేర్కొన్నారు. సీఎంను తిడుతున్న వారిలో మహిళలు, వృద్ధులు సైతం ఉన్నారని ఆమె ఆన్నారు. ఆరు గ్యారంటీల్లో సబ్సిడీ గ్యాస్, ఇళ్లు, పెన్షన్లు, మహిళలకు రూ.2500 ఏవీ రావడం లేదని, ఇప్పుడు మీకు మా వివరాలు చెబితే ఉన్న రేషన్ కార్డు కూడా పోతుందేమోనని అంటున్నవారూ ఉన్నారని మరో ఎన్యుమరేటర్ తనకెదురైన అనుభవాన్ని వివరించారు. వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు అడగొద్దని తిప్పి పంపిస్తున్నవారూ ఉన్నారు. చెరువుల్లో ఉన్నాయని ఇళ్లు కూలుస్తున్నారని హైడ్రాను ప్రస్తావిస్తూ.. తమ ఇంటి వివరాలిస్తే మా ఇల్లు కూడా కూలుస్తారేమోననే భయాన్ని వ్యక్తం చేసిన వారు కూడా ఉన్నారని ఎన్యుమరేటర్లు అంటున్నారు. కోడ్లు నింపడానికి ఎంతో సమయం.. ఒక్కో ఇంటికి 45 నిమిషాల నుంచి గంట సమయం పడుతోందని చెబుతున్నారు. సమాధానాల్ని సంబంధిత కోడ్‌తో సూచించాల్సి ఉన్నందున అన్నీ అర్థం చేసుకొని భర్తీ చేసేందుకు సమయం పడుతోందంటున్నారు. చాలామంది వివరాలు ఇచ్చేందుకు నిరాకరిస్తుండగా, కొందరు మాత్రం తమ జంతువుల వివరాలు సైతం చెబుతున్నారు. ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులతోనూ స్టిక్కర్లు అంటిస్తున్నట్లు తెలిసింది. -
సమగ్ర కుటుంబ సర్వే: ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి ఓనర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. శనివారం సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు వెళ్లిన అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఎన్యుమరేటర్లపై ఓ ఇంటి యజమాని కుక్కలను వదిలారు.ఈ ఘటన బంజారాహిల్స్ ఆరోరా కాలనీలో చోటుచేసుకుంది. సర్వే పేరుతో తమ టైం వేస్ట్ చేస్తున్నారని ఎన్యుమరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమకు సెక్యూరీటీ కావాలని ఎన్యుమరేటర్లు కోరుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే.. నవంబర్ 6న ప్రారంభం కాగా.. ఈ నెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామం (ఆవాసం) పేర్లను కోడ్ రూపంలో సేకరిస్తారు. వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా హౌస్ లిస్టింగ్‌లో నమోదు చేసి ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటిస్తారు. -
అది ఫేక్ సర్వే: తాజా పోల్‌పై మండిపడ్డ ట్రంప్
వాషింగ్టన్:అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు ఒకే రోజు సమయముందనగా తనకు వ్యతిరేకంగా వెల్లడైన ఒక పోల్ సర్వేను రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు. అయోవా డెమోక్రాట్ అభ్యర్థి కమలాహారిస్ తనకంటే లీడింగ్‌లో ఉందని తెలిపిన సర్వేను ట్రంప్ మండిపడ్డారు. ఆ సర్వే ఫేక్ అని కొట్టిపారేశారు.అయోవా రాష్ట్రంలో కమలాహారిస్‌కు 47 శాతం, ట్రంప్‌నకు 44 శాతం మంది మద్దతిస్తున్నారంటూ తాజా పోల్ ఒకటి వెల్లడైంది. దీనిపై ట్రంప్ స్పందించారు. ప్రత్యర్థులు కావాలనే ఇలాంటి ఫేక్ సర్వేను సృష్టించారని మండిపడ్డారు.‘ఐయామ్ నాట్ డౌన్’ అని ధీమా వ్యక్తం చేశారు. అయితే సెప్టెంబర్‌లో అయోవాలో ట్రంప్ లీడింగ్‌లో ఉన్నట్లు అదే సర్వే సంస్థ అంచనాలు వెల్లడించింది. ఇప్పుడు పరిస్థితి మారిపోయి కమల లీడ్‌లోకి వచ్చినట్లు తెలిపింది. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు అయోవాలో 9 పాయింట్ల ఆధిక్యం లభించడం గమనార్హం.మంగళవారం(నవంబర్ 5) అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇదీ చదవండి: అబార్షన్ మా హక్కు -
దేశంలో కుటుంబ సగటు పరిమాణం 4.3
సాక్షి, అమరావతి: గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గుతోంది. 2016–17తో పోల్చితే 2021–22లో గ్రామీణ భారతంలో కుటుంబ సగటు పరిమాణం తగ్గినట్లు ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ సర్వే 2021–22 వెల్లడించింది. 2016–17లో గ్రామీణ భారతంలో 4.5 ఉండగా 2021–22లో 4.3 ఉందని సర్వే వెల్లడించింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల పరిమాణం, కుటుంబ పెద్ద విద్యార్హతలపై నిర్వహించిన సర్వేను నాబార్డు విడుదల చేసింది. 2021–22లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాల సగటు పరిమాణం ఎక్కువగా ఉందని సర్వే పేర్కొంది. వ్యవసాయేతర కుటుంబాల్లో 4.0గా ఉండగా వ్యవసాయ కుటుంబాల్లో 4.5గా ఉంది. రాష్ట్రాల మధ్య గృహ పరిమాణాలలో వైవిధ్యాలను సూచిస్తున్నాయని సర్వే పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్, హరియాణ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, గోవా, కేరళ, మహారాష్ట్ర, సిక్కిం, త్రిపుర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో తక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో కుటుంబానికి సగటున నలుగురు కంటే తక్కువగా ఉన్నారని సర్వే పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో 2016–17తో పోల్చితే 2021–22లో స్వల్పంగా పెరిగింది. ఏపీలో 2016–17లో 3.5 ఉండగా 2021–22లో 3.7గా ఉంది. ఇక దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబాల్లో 30 శాతం పెద్దలు నిరక్షరాస్యులుగా ఉండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 28 శాతం ఉన్నట్లు సర్వే తెలిపింది. -
మీరే అసిస్టెంట్లు మీకెందుకు అసిస్టెంట్లు!
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్‌రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు. -
కొత్త హోదాలతోనే ఉద్యోగాలు.. ఇదే సరికొత్త ట్రెండ్
టెక్నాలజీ ఎంత వేగంగా మారుతుందో.. దానికి తగ్గట్లే వ్యాపార ధోరణి మారుతోంది. ముఖ్యంగా ఉత్పత్తి, సేవా రంగాల్లో పుట్టగొడుగుల్లా కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. అలాగే.. ఉద్యోగాలలోనూ విపరీతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2024లో పలు ఉద్యోగాలలో నియామకాలు పొందిన ప్రతి 10 మందిలో ఒకరు.. గత పాతికేళ్లలో వినిఎరుగని కొత్త హోదాలతో ఉద్యోగాలు పొందినట్లు లింక్డ్ఇన్ సర్వే వెల్లడించింది. గత 25 ఏళ్లలో ఏనాడూ వినని పొజిషన్లను పలువురు ఉద్యోగులకు ఆ కంపెనీలు అప్పగించాయని, వాటిల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇంజనీర్, సస్టైనబిలిటీ మేనేజర్.. లాంటివి ఉన్నాయని లింక్డ్ఇన్ విభాగం ‘వర్క్ చేంజ్ స్నాప్‌షాట్’ తెలిపింది.‘‘ఉద్యోగాలలో మార్పులు వేగంగా పెరుగుతున్నాయని యూకేకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొత్త పొజిషన్లు, నైపుణ్యాలు, సాంకేతికతలకు ఎక్కువ డిమాండ్ ఉందని.. ప్రతీ నలుగురిలో ముగ్గురు ఉద్యోగులు నమ్ముతున్నారు. అలాగే కంపెనీలు సైతం ఆ కొత్త హోదా ఉద్యోగులపైనే అధికంగా అంచనాలు పెంచుకుంటున్నాయి’’ అని ఆ నివేదిక తెలిపింది. ఇందుకోసం చేపట్టిన అధ్యయనంలో.. సుమారు 51 శాతం మంది హెచ్ఆర్ నిపుణులు ఈ అభిప్రాయం వెల్లడించారట. ఇక ఏఐతో సహా కొత్త టెక్నాలజీల వేగంగా అభివృద్ధి చెందటంతో.. యూకే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు 2016 నుంచి 2030 వరకు 65 శాతం వరకు మారవచ్చని లింక్డ్ఇన్ సర్వే డేటా తెలియజేస్తోంది. ఏఐని ఉపయోగిస్తూ బిజినెస్ చేయడానికి సిద్ధమైనవారికి భారీ అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తమ సర్వేలో పాల్గొన్న యూకే వ్యాపారవేత్తల్లో అత్యధికులు (80 శాతం) మంది టీం పనితీరును మెరుగుపరచటంలో ఏఐ సామర్థ్యాన్ని గుర్తించారని తెలిపింది. అయితే.. కేవలం 8 శాతం కంపెనీలను మాత్రామే ఏఐ తమను ముందువరసలో ఉంచుతోందని అభిప్రాయపడినట్లు పేర్కొంది. మరోవైపు.. హెచ్ఆర్ నిపుణులపై ఒత్తిడి మేరకు ప్రతి ముగ్గురిలో ఒకరి కంటే ఎక్కువ మంది ఉద్యోగస్తులు ప్రతిరోజూ వారు తీసుకోవలసిన నిర్ణయాల పట్ల నిరుత్సాహంగా ఉన్నారని తెలిపింది. 15శాతం మంది.. వారంలో పావు వంతు వరకు అవసరమైన తమ పని చేస్తున్నారని వెల్లడించింది.‘‘ప్రస్తుతం సమయంలో వర్క్ ప్లేస్‌లో మార్పులు వస్తున్నాయి.నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఏఐ వంటి కొత్త సాంకేతికతలు మన రోజువారీ వర్క్‌ను మెరుగుపరచడానికి గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ సామర్థ్యాన్ని వాడుకోవటం ఎలా పెంచుకోవాలో కొన్ని బిజినెస్‌లు పరిశీలన చేస్తున్నాయి’ అని లింక్డ్ఇన్ (యూకే) మేనేజర్ జానైన్ చాంబర్లిన్ అభిప్రాయడ్డారు. -
బంగారమంటే అంత నమ్మకం!
ధగధగమంటూ కాంతులీనే బంగారం అంటే ఎవరికి ఇష్టముండదు?.. ప్రతిఒక్కరికీ పసిడిపైన మక్కువే. మరి ఆ బంగారాన్ని ఎవరు, ఎలా చూస్తున్నారన్నదే ఆసక్తికరం. ఇదే అంశంపైనే ఓ సంస్థ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ విశేషాలను ఈ కథనంలో మీకందిస్తున్నాం..మనీవ్యూ సర్వే ప్రకారం, 3,000 మంది ప్రతివాదులలో 85 శాతం మంది బంగారాన్ని సంపద పరిరక్షణకు విలువైన ఆస్తిగా పరిగణిస్తున్నారు. అద్భుతంగా పెరుగుతన్న దాని విలువ, చారిత్రికంగా ఉన్న విశిష్టత వినియోగదారుల్లో విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాయి.ముఖ్యంగా 25-40 ఏళ్ల వయస్సున్నవారు పదవీ విరమణ, ఇతర దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సంపదను నిర్మించడానికి వారి సాధారణ ఆర్థిక వ్యూహంలో భాగంగా భౌతిక, డిజిటల్ మార్గాల ద్వారా బంగారంలో పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది.70 శాతం మంది భారతీయులు అంటే 10 మందిలో ఏడుగురు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించడం వారి పొదుపు అలవాట్లను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. డిజిటల్ యుగంలో బంగారంపై ఉన్న ఆసక్తి డిజిటల్ గోల్డ్ వైపు ఎక్కువగా నడిపిస్తోంది.ఇదీ చదవండి: బంగారు ఆభరణాలే ఎక్కువ..సర్వే డేటా ప్రకారం.. 35 ఏళ్లలోపు వారిలో 75 శాతం మంది భౌతిక బంగారం కంటే కూడా డిజిటల్ బంగారాన్ని ఇష్టపడుతున్నారు. దానికి లిక్విడిటీ, సౌలభ్యం ప్రధాన కారకాలుగా ఉన్నాయి. సర్వేలో పాల్గొన్నవారిలో 50 శాతానికి పైగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్షిక మొత్తాలలో బంగారాన్ని కొనుగోలు చేయగల సామర్థ్యం తమ పెట్టుబడి అలవాట్లను మార్చుకునే దిశగా అత్యంత లాభదాయకమైన లక్షణాలలో ఒకటి అని నమ్ముతున్నారు. -
జనరేషన్ జెడ్.. ఖర్చులో జెట్ స్పీడు
సాక్షి, అమరావతి: తరాలు మారుతున్నకొద్దీ అలవాట్లు, అభిరుచులు, అవసరాలు మారిపోతుంటాయి. కొత్త తరం కొంగొత్త ఆశలతో ముందుకు సాగిపోతుంటుంది. సమాజంలో వేగంగా వస్తున్న మార్పులు, అవకాశాలను అంతే వేగంతో అందిపుచ్చుకుంటుంది. ఆదాయమూ పెరుగుతోంది. చేతిలో డబ్బు ఆడుతున్నకొద్దీ పెట్టే ఖర్చూ పెరుగుతుంది. ఇప్పుడు ‘జనరేషన్ –జెడ్’ చేస్తున్న పని కూడా ఇదే. ఫ్యాషన్, ఫుడ్, ట్రావెల్.. ఇలా అన్ని రంగాల్లోనూ వీరు పెడుతున్న ఖర్చు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఖర్చు పెట్టడంలో ‘జెడ్’ తరాన్ని మించిన వారు లేరని అంతర్జాతీయ సంస్థలైన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ), స్నాప్‌చాట్ షోస్ చెబుతున్నాయి. ఖర్చు చేయడంలో మిలీనియల్స్ జనరేషన్ (1981–96 మధ్య పుట్టిన వారు)ను దాటుకొని జెనరేషన్–జెడ్ (1997–2012 మధ్య పుట్టిన వారు) దూసుకుపోతున్నట్లు ఈ సంస్థల సంయుక్త అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం భారత దేశ ప్రజలు ఏటా పెడుతున్న ఖర్చులో 43 శాతం జనరేషన్–జెడ్‌దే అని, వచ్చే పదేళ్లల్లో వీరు ఖర్చు 50 శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జనరేషన్–జెడ్ ఏటా చేస్తున్న ఖర్చు అక్షరాలా రూ.74,70,000 కోట్లు. ఇది 2035 నాటికి రూ.1,66,00,000 కోట్లకు చేరుతుందని ఆ సర్వే అంచనా వేసింది. స్నాక్స్ నుంచి సెడాన్ కార్ల వరకు దేశ ప్రజలు పెడుతున్న ఖర్చులో ప్రతి రెండో రూపాయి జనరేషన్–జెడ్ నుంచే వస్తోంది. ప్రస్తుతం దేశ జనాభాలో 1997–2012 మధ్య పుట్టిన ‘జెడ్’ తరం జనాభా 37.7 కోట్లు. అమెరికా మొత్తం జనాభా కంటే మన దేశంలో వీరి సంఖ్యే ఎక్కువ. ప్రస్తుతం జనరేషన్ ‘జెడ్’లో 25 శాతం మంది (ప్రతి నలుగురిలో ఒకరు) మాత్రమే సంపాదించడం మొదలు పెట్టారని, ఇది 2035 నాటికి 47 శాతానికి (దాదాపు సగం మంది) చేరుతుందని సర్వే అంచనా వేసింది.విహారయాత్రలకే పెద్దపీట జెడ్–జనరేషన్ ప్రయాణాలు, విహారయాత్రలకే అత్యధికంగా ఖర్చు చేస్తున్నట్లు సర్వే తెలిపింది. ఈ ఏడాది (2024 సంవత్సరం)లో విహార యాత్రల కోసం వీరు చేసే ఖర్చు రూ.6,62,500 కోట్ల నుంచి రూ.6,64,000 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ట్రావెల్స్ సంస్థలు వీరికి ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆ తర్వాత అత్యధికంగా ఫ్యాషన్ –లైఫ్‌స్టైల్ వస్తువుల కొనుగోలుకు ఖర్చు పెడుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ పానియాలతో పాటు రెస్టారెంట్లకూ వీరు భారీగానే ఆదాయాన్ని అందిస్తున్నట్లు సర్వేలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే.. ‘జెడ్’ తరానికి వంట చేయడమంటే మహా చిరాకు.సింపుల్‌గా ప్యాకేజ్డ్ ఫుడ్ లేదా బయట నుంచి తెప్పించుకొని ఆరగించడమే ఇష్టం. ఇలా వీరు ప్యాకేజ్డ్∙ఫుడ్ కోసం రూ.2,90,500 కోట్లు, ఆహారం కోసం రెస్టారెంట్లకు మరో రూ.2,90,500 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు బీసీజీ సర్వే పేర్కొంది. ఏమిటీ జనరేషన్లు..అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఒక జనరేషన్ అంటే 16 సంవత్సరాల కాలం. దీని ప్రకారం 1981–96 మధ్య పుట్టిన వారిని మిలీనియల్స్‌గా పేర్కొన్నారు. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ –జెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2012 నుంచి జన్మింస్తున్న వారు ఆల్ఫా జనరేషన్గా పరిగణిస్తున్నారు. ఈ తరాల మధ్య అంతరాలను అంతర్జాతీయంగా కొన్ని సంస్థలు అంచనా వేస్తుంటాయి. అందులో భాగంగానే బీసీజీ, స్నాప్ చాట్ షో సంస్థలు జనరేషన్–జెడ్ పై అధ్యయనం చేసి, వారి ఖర్చులపై నివేదిక ఇచ్చాయి. -
దూసుకొస్తున్న ట్రంప్.. తాజా సర్వేలో సంచలనం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. ఎన్నికలకు మరో పది రోజులే సమయముందనగా న్యూయార్క్ టైమ్స్, సియెనా కాలేజ్ సంయుక్తంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే శుక్రవారం(అక్టోబర్ 25) ఆసక్తికర విషయం వెల్లడించింది. అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి హారిస్ పట్ల ప్రజలు సమానంగా మొగ్గు చూపుతున్నారని సర్వే తెలిపింది. ఇద్దరికీ సరిగ్గా చెరో 48 శాతం పాపులర్ ఓట్ రానుందని తేలినట్లు ప్రకటించింది. అక్టోబర్ మొదటి వారంలో హారిస్‌కు 49 పాపులర్ ఓట్ అనుకూలంగా ఉండగా ట్రంప్‌కు 46 శాతం మంది మదతిచ్చారు. అయితే క్రమంగా ట్రంప్ పుంజుకొని హారిస్ రేసులో సమాన స్థాయికి రావడం గమనార్హం. ఏది ఏమైనా నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో అమెరికాకు కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది తేలనుంది.ఇదీ చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఎందుకింత గందరగోళం.. అందరికీ అర్థమయ్యే రీతిలో -
మహారాష్ట్ర ఎన్నికలు: ఆర్ఎస్ఎస్ సర్వేలో ఏం తేలింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది. మహాయుతికి చెందిన పార్టీలు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాయి. ఉద్ధవ్ వర్గం 65 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ విజయావకాశాలను తెలుసుకునేందుకు ఆర్ఎస్ఎస్ అంతర్గత సర్వే నిర్వహించింది. దీనిలో మహాయుతికి 160 సీట్లు వస్తాయని వెల్లడయ్యింది.ఆర్ఎస్ఎస్ సర్వే ప్రకారం లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ కూటమికి వ్యతిరేకంగా వచ్చిన ట్రెండ్ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి పూర్తి మెజారిటీ రానుంది. సంఘ్ వర్గాలు రహస్యంగా అంతర్గత సర్వే నిర్వహించి, ఆ నివేదిక ఆధారంగా ఎన్నికలకు వ్యూహరచన చేస్తున్నాయి. అక్టోబర్ రెండో వారంలో మొత్తం 288 సీట్లపై సంఘ్ సర్వే నిర్వహించింది. సంఘ్ సర్వేలో మహాయుతికి ఎన్నికల్లో 160కి పైగా సీట్లు వస్తాయని తేలింది.బీజేపీకి 90 నుంచి 95 సీట్లు, షిండే సేనకు 40-50 సీట్లు, అజిత్ పవార్ ఎన్సీపీకి 25-30 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. యూపీ, రాజస్థాన్, బెంగాల్‌లలో ఆ పార్టీ ఘోరంగా ఓటమి పాలయ్యింది. బీజేపీ వరుసగా సొంతంగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అయితే ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. -
రైతే 'రాజు'
సాక్షి, అమరావతి: భారత దేశంలో వ్యవసాయ రంగానిదే అగ్రస్థానం. గ్రామాల్లో రైతే రాజు. గ్రామీణులకు అధిక ఆదాయాన్ని సమకూరుస్తోంది వ్యవసాయమే. పంట పండించిన వాడికే ఎక్కువ ఆదాయం వస్తోంది. మిగతా రంగాల వారి ఆదాయం రైతు కుటుంబాలకంటే తక్కువే. నాబార్డు విడుదల చేసిన ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే–2021–22 ఈ విషయాన్ని వెల్లడించింది. 2021–22 సంవత్సరంలో దేశంలోని రైతు కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.13,661గా ఈ సర్వే తేల్చింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.11,348గా తెలిపింది. 2016–17తో పోలిస్తే 2021–22లో వ్యవసాయ కుటుంబాల నెలవారీ ఆదాయం రూ. 4,558 పెరిగింది. వ్యవసాయేతర కుటుంబాల ఆదాయం రూ.4,488 పెరిగింది. అన్ని కుటుంబాల్లో సగటు ఆదాయం రూ. 4,616 పెరిగింది. గ్రామీణ ప్రాంతాల కుటుంబాల నెలవారీ మొత్తం వ్యయంలో 47 శాతం ఆహార వస్తువులపైనే ఉందని, 53 శాతం ఆహారేతర వస్తువులపై ఉందని సర్వే తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌లో 2021–22లో వ్యవసాయ కుటుంబాల సగటు నెలవారీ ఆదాయం రూ.12,294 అని ఈ సర్వే తెలిపింది. ఈ ఆదాయం 2016–17తో పోల్చితే 2021–22లో రూ. 5,195 పెరిగింది. 2016–17లో రాష్ట్రంలో గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం రూ.5,842 కాగా నెలవారీ ఖర్చు రూ.5,746 ఉంది. నెలవారీ మిగులు కేవలం 96 రూపాయలు మాత్రమే. 2021–22లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 11,037 రూపాయలుండగా నెలవారీ వినియోగ వ్యయం 10,448 రూపాయలు ఉంది. నెలవారీ మిగులు 589 రూపాయలుగా ఉంది. సర్వేలో తీసుకున్న అంశాలివీ.. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర, మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయం, వినియోగ వ్యయంపై తొలిసారి 2016–17లో ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ సర్వే జరిగింది. మళ్లీ 2021–22లో సర్వే చేసినట్లు నాబార్డు తెలిపింది. ఈ వివరాలను ఇటీవల విడుదల చేసింది. వ్యవసాయ కుటుంబాలతో పాటు వ్యవసాయేతర కుటుంబాలు, గ్రామాల్లోని మొత్తం కుటుంబాల నెలవారీ ఆదాయాన్ని లెక్కించింది. సాగుతో పాటు పశువుల పెంపకం, తోటల పెంపకం, కూలీ, ఇతర వాణిజ్య, వ్యాపారాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు, అటవీ ఉత్పత్తులు, తయారీ కార్యకాలపాలు, ఉపాధి హామీ, వ్యవసాయ కార్మికులు తదితర కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. నెలవారీ వినియోగ వ్యయాన్ని ఆహార, ఆహారేతర వ్యయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. -
ఏఈవోల్లో చీలిక!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరిస్తున్న వ్యవసాయ విస్తరణాధికారుల్లో చీలిక ఏర్పడింది.ప్రభుత్వం 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేయడంతో అనేకమంది వెనక్కి తగ్గినట్టు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపితో బుధవారం జరిగిన చర్చల్లో కొందరు ఏఈవోలు సానుకూలత వ్యక్తం చేశారు. వారి సమస్యలపై వచ్చే సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో చర్చలు జరిపేందుకు అవకాశం కల్పిస్తానని డైరెక్టర్ హామీ ఇవ్వడంతో ఏఈవోలు తమ సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటున్నామని, డిజిటల్ క్రాప్ సర్వే చేసేందుకు సిద్ధమేనని ఆయనకు తెలిపారు. వచ్చే వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరిస్తామని, ఏఈవోల సస్పెన్షన్‌ను కూడా ఎత్తివేస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు ఏఈఓలు డిజిటల్ సర్వేలో పాల్గొంటారంటూ డైరెక్టర్ గోపీ ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో కొందరు ఏఈవో సంఘం నేతలు గురువారం నుంచి డిజిటల్ క్రాప్ సర్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తామని తెలిపారు. మొత్తంగా సగం మంది ఏఈఓలు సర్వే చేస్తామని చెబుతుండగా, సగంమంది సర్వే చేసేది లేదని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా మహిళా ఏఈఓలు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వే చేయమని చెబుతున్నట్టు తెలిసింది.దీంతో ఏఈవోలు రెండు వర్గాలుగా చీలిపోయినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా, బుధవారం జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చిన ఏఈవోలు వ్యవసాయ కమిషనరేట్ వద్ద నిరసనకు దిగారు. సర్వేలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, సస్పెండ్ చేసిన ఏఈవోలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక దశలో కమిషనరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు ముందస్తుగా పోలీసులను మోహరించారు. ఏఈవోల సస్పెన్షన్‌తో వ్యవసాయ కార్యక్రమాలపై ప్రభావం కక్ష సాధింపు చర్య వల్లే సస్పెండ్ చేశారని ఏఈవోలు మండిపడుతున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే విషయంలో ఇంతమందిని సస్పెండ్ చేయడం వల్ల అనేక పథకాలు, వ్యవసాయశాఖ చేపట్టే కార్యక్రమాలకు విఘాతం కలగనుంది. ఇప్పుడు గ్రామాల్లో ధాన్యం, పత్తి మార్కెట్లోకి వస్తుంది. ఈ సమయంలో ఏఈవోలు కీలకంగా వ్యవహరిస్తారు. కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు తలెత్తితే, రైతులకు అందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సింది కూడా ఏఈవోలే. ఇలాంటి కీలక సమయంలో ఏఈవోలపై ఉక్కుపాదం మోపడం పట్ల వ్యవసాయ ఉద్యోగులు మండిపడుతున్నారు. కాగా, ఏఈవోలు దారికొస్తే సరేసరి లేకుంటే మరికొందరిపైనా కఠిన చర్యలు చేపడతామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు. ఏఈవోలకు ప్రత్యేక భారం ఏమీ ఉండదని, వారం పది రోజులపాటు నిర్వహించే డిజిటల్ క్రాప్ సర్వేను బహిష్కరించాల్సిన అవసరం ఏంటని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. కావాలని ఏఈవోలు ఇదంతా చేస్తున్నారని, వారిని ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొడుతున్నాయని అంటున్నారు. మరోవైపు సమ్మెకు సిద్ధమైన ఏఈవోలకు కొన్ని ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటిస్తుండగా, మరోవైపు పేరొందిన పలు ఉద్యోగ సంఘాల నేతలు బెదిరింపులకు దిగినట్టుగా తెలిసింది. ఏ విధంగానైనా సరే ఏఈవోలను సమ్మెకు వెళ్లకుండా వారు తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. -
165 మంది ఏఈవోల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు. కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.కక్ష సాధింపు ధోరణిడిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు. వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల్లో ఎలా అప్లోడ్ చేయాలి?నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు. సస్పెండ్ చేయడం సరికాదు డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు. షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీపంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు. -
How India Borrows 2024: ఆన్లైన్ రుణం.. యస్ బాస్
హైదరాబాద్: తక్కువ, మధ్యాదాయ వర్గాల వారు సాధారణంగా తక్షణ జీవన అవసరాల కోసమే రుణం తీసుకుంటారని అనుకుంటాం. ఇది ఒకప్పుడు. కానీ, నేడు తమ ఆకాంక్షల కోసం, వ్యాపారవేత్తగా ఎదిగేందుకు, దీర్ఘకాల పెట్టుబడుల కోసం రుణాలను వినియోగించుకే దిశగా వారిలో మార్పు కనిపిస్తోంది. వినియోగదారులు తమ జీవన నాణ్యతను పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. యాప్ ఆధారిత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి రావడం, ఈఎంఐ తదితర రూపాల్లో డిజిటల్ రుణ లభ్యత మార్గాలు పెరగడం ఇందుకు మద్దతునిస్తోంది. హోమ్ క్రెడిట్ ఇండియా నిర్వహించిన వార్షిక కన్జ్యూమర్ సర్వే ‘హౌ ఇండియా బారోస్’లో ఈ ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ మేరకు ఒక నివేదికను హోమ్ క్రెడిట్ ఇండియా విడుదల చేసింది. వేటి కోసం రుణాలు.. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఉత్పత్తుల కొనుగోలుకే ఎక్కువగా రుణాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వ్యాపారాలు, గృహ నవీకరణ కోసం తీసుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్, గృహోపకరణాలకు తీసుకునే రుణాలు 2020లో ఒక శాతంగా ఉంటే, 2024కు వచ్చే సరికి 37 శాతానికి చేరాయి. స్టార్టప్‌లు, వ్యాపార విస్తరణ కోసం తీసుకుంటున్న రుణాలు 2020లో మొత్తం రుణాల్లో 5 శాతంగా ఉంటే, 2024 నాటికి 21 శాతానికి చేరాయి. వ్యాపారవేత్తలుగా అవతరించేందుకు, కొత్త ఆదాయ వనరులు, అవకాశాల కోసం యువత అన్వేíÙస్తుందన్న దానికి ఇది నిదర్శనమని ఈ నివేదిక పేర్కొంది. కరోనా తర్వాత మారిన పరిస్థితులు, ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం నుంచి మద్దతు సానుకూల అంశాలని తెలిపింది. గృహ నవీకరణ, నిర్మాణం కోసం తీసుకునే రుణాలు 2022లో 9%గా ఉంటే, 2024 నాటికి 15 శాతానికి పెరిగాయి. అంటే మెరుగైన నివాస వసతులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, దీర్ఘకాల ఆస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విద్యా రుణాల్లో పెద్దగా మార్పు లేదు. 2020లో మాదిరే 2024లోనూ 4%వద్దే ఉన్నాయి. వివాహాల కోసం రుణాలు తీసుకోవడం 2021లో ఉన్న 3% నుంచి 2024 నాటికి 4 శాతానికి పెరిగింది. ఇక వైద్య అత్యవసరాల కోసం తీసుకునే రుణాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపించింది. 2020 లో 7%గా ఉంటే, 2024లో 3 శాతానికి తగ్గింది. నాడు కరోనా విపత్తుతో వైద్యం కోసం భారీగా ఖ ర్చు చేయాల్సి రావడం తెలిసిందే. ఆ తర్వాత నుంచి హెల్త్ ఇన్సూరెన్స్‌కు ప్రాధాన్యం పెరిగింది. ఇది కూడా వ్యయాలను తగ్గించడంలో సాయపడింది. వాట్సాప్, చాట్‌బాట్ పాత్ర 27 శాతం మధ్య తరగతి రుణ గ్రహీతలకు చాట్‌బాట్ సేవలపై అవగాహన ఉంది. ఇది గతేడాది 4 శాతంగానే ఉంది. జెనరేషన్ జెడ్‌లో ఇది 30 శాతం ఉండడం గమనార్హం. కస్టమర్ సేవల కోసం చాట్బాట్లు సులభంగా ఉంటున్నాయని 38 శాతం రుణగ్రహీతలు భావిస్తున్నారు. ఇక వాట్సాప్ కీలక వారధిగా పనిచేస్తోంది. 59 శాతం రుణ గ్రహీతలు వాట్సాప్ ద్వారా రుణ ఆఫర్లను అందుకుంటున్నారు. ఈఎంఐ కార్డుల వినియోగం సైతం పెరుగుతోంది. అలాగే ఎంబెడెడ్ ఫైనాన్స్ (డిజిటల్ రూపాల్లో రుణ సదుపాయాలు) పట్ల 50 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. దీని ద్వారా వేగంగా రుణాలు పొందొచ్చని, ఈ కామర్స్ షాపింగ్ సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. 64 శాతం మంది అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో తదితర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల సానుకూలంగా ఉంటే, 21 శాతం ట్రావెల్ బుకింగ్ యాప్‌లు మేక్మైట్రిప్, క్లియర్‌ట్రిప్, 23 శాతం ఫుడ్ డెలివరీ యాప్‌లు జొమాటో, స్విగ్గీ సేవలను వినియోగించుకుంటున్నారు.పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు.. వినియోగదారులు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల సేవల వైపు మొగ్గు చూపిస్తుండడం కనిపిస్తోంది. 65 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలకు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రౌజర్ ఆధారిత బ్యాంకింగ్‌కు 44 శాతం మందే సానుకూలత చూపిస్తున్నారు. మిలీనియల్స్‌లో 69 శాతం మంది యాప్ ఆధారిత బ్యాంకింగ్‌కు మొగ్గు చూపిస్తుండగా, జెనరేషన్ జెడ్‌లో 65 శాతం మంది, జెన్ ఎక్స్‌లో 58 శాతం చొప్పున వినియోగించుకుంటున్నారు. మరీ ముఖ్యంగా మెట్రోల్లో వీటిని వినియోగించుకునే వారు 71 శాతంగా ఉంటే, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 69 శాతంగా ఉన్నారు. ఆన్లైన్లో షాపింగ్ సాధారణ స్థాయికి చేరింది. కరోనా అనంతర లాక్డౌన్లతో 2021లో ఆన్లైన్ షాపింగ్ 69 శాతానికి పెరగ్గా, 2023లో 48 శాతానికి దిగొచి్చంది. 2024లో మరింత తగ్గి 53 శాతంగా ఉంది. హైదరాబాద్‌లో 64 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు మొగ్గు చూపిస్తున్నారు. కోల్‌కతాలో ఇది 71 శాతంగా ఉంది. -
ఖర్చులు పెరుగుతున్నాయి!
సాక్షి, అమరావతి: దేశంలో జనాలు అప్పటికప్పుడు పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు పెట్టే ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయని కేంద్ర ఎన్ఎస్ఎస్ సర్వే రిపోర్టు నివేదిక వెల్లడించింది. రోజు రోజుకీ కొత్త కొత్త అలవాట్లకు ఆకర్షించబడడమే ఇందుకు కారణమని తెలిపింది. ఇంటిల్లపాది తిండి సహా పిల్లల చదువులు, దుస్తులు, కొత్త వస్తువుల కొనుగోలు, కారు, మోటర్ సైకిల్ వాహనాలు, వైద్య ఖర్చులు.. ఇలా ఒక్కో కుటుంబం ప్రతి నెలా పెట్టే మొత్తం ఖర్చులో గ్రామాల్లో అయితే 7.6 శాతం మేర ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త ఖర్చులకే వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో అయితే ఈ తరహా ఖర్చులు సరాసరి 8.6 శాతం మేర ఉంటున్నాయి. కేంద్ర గణాంకాల శాఖ 2022 ఆగస్టు నుంచి 2023 జూలై మధ్య దేశవ్యాప్తంగా కుటుంబాల వారీగా వినియోగ ఖర్చులపై నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వే నివేదికను ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 8,723 గ్రామాల్లో 1,55,014 కుటుంబాల నుంచి, పట్టణ ప్రాంతాల్లో 6,115 మున్సిపల్ వార్డుల్లో 1,06,732 కుటుంబాల నుంచి వివరాలు సేకరించినట్లు కేంద్రం ఆ నివేదికలో వివరించింది.దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే మొత్తం ఖర్చులో 2009–10లో కేవలం 3.5 శాతం మాత్రమే ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులకు వినియోగించిన పరిస్థితి ఉండగా.. 2022–23 నాటికి ఆ తరహా ఖర్చులు రెట్టింపు స్థాయికి పెరిగి 7.6 శాతానికి చేరుకున్నాయి. పట్టణ ప్రాంతాల్లోనూ 2009–10లో 5.6 శాతంగా ఉన్న ఈ తరహా కొత్తగా పుట్టుకొచ్చే ఖర్చులు 2022–23 నాటికి 8.6 శాతానికి పెరిగాయి.దేశ సగటు కంటే ఏపీలో వినియోగ స్థాయి ఎక్కువ.. సర్వే నివేదిక ప్రకారం మన ఆంధ్రప్రదేశ్‌లో సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,871 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ. 6,782 చొప్పున ఖర్చు పెడుతున్నారు. గ్రామీణ–పట్టణ ప్రాంతాల్లో సగటు సరాసరిన ఒక్కో వ్యక్తి 30 రోజుల వ్యవధిలో పెట్టే ఖర్చులు దేశ సగటుతో పోల్చితే దేశమంతటా పట్టణ ప్రాంత వ్యక్తుల సరాసరి వినియోగ స్థాయిలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగ స్థాయి సగం మేర ఉండగా... మన రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు కాస్త దగ్గరగానే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల వినియోగ స్థాయి ఉండడం గమనార్హం. దేశమంతటా గ్రామీణ ప్రాంత వ్యక్తుల 30 రోజుల వినియోగస్థాయి కంటే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత వ్యక్తుల వినియోగస్థాయి రూ.1,098 అదనంగా ఉండగా, అదే పట్టణ ప్రాంతాల్లో దేశ సగటు, రాష్ట్ర సగటు వ్యత్యాసం కేవలం రూ. 324గా ఉంది. » దేశంలో మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంత ప్రజల వినియోగస్థాయిలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కన్నా మన రాష్ట్రం గ్రామీణ ప్రజల వినియోగస్థాయి అధికంగా ఉంది. » ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో వ్యక్తి 30 రోజుల సరాసరి తమ మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో 44.13 శాతం చొప్పున, పట్టణ ప్రాంతాల్లో 38.58 చొప్పున రకరకాల తిండి అవసరాలకు ఖర్చు పెడుతున్నారు. » రాష్ట్రంలో అప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే కొత్త అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి 7.83 శాతం , పట్టణ ప్రాంతాల్లో 8.37 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువే..దేశమంతటా పట్టణ ప్రాంతాల్లో సరాసరిన ఒక్కో వ్యక్తి తిండి అవసరాలకు 39.17 శాతం, తిండేతర అవసరాలకు 60.83 శాతం ఖర్చు పెడుతుండగా, గ్రామీణ ప్రాంతాల్లో తిండి అవసరాలకు 46.38 శాతం , తిండేతర అవసరాలకు 53.62 శాతం ఖర్చు పెడుతున్నారు.దేశమంతటా ఒక్కో వ్యక్తి సరాసరి 30 రోజుల్లో పెట్టే మొత్తం ఖర్చులో గ్రామీణ ప్రాంతాల్లో రూ.285 చొప్పున, పట్టణ ప్రాంతాల్లో రూ.383 చొప్పున కొత్తగా పుట్టుకొచ్చే అలవాట్లకే ఖర్చు పెడుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ సర్వే నివేదిక ప్రకారం.. దేశంలో ఒక్కో వ్యక్తి సరాసరిన 30 రోజుల వ్యవధిలో పట్టణ ప్రాంతాల్లో తిండి, సంబంధిత ఖర్చులకు రూ. 2,529 చొప్పున, ఇతర అవసరాలకు రూ.3,929 చొప్పున మొత్తం రూ. 6,458 ఖర్చు పెడుతున్నట్లు నిర్ధారించారు. అదే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి సరాసరిన తిండి సంబంధిత అవసరాలకు రూ.1,749 చొప్పున, ఇతర అవసరాలకు రూ.2,023 చొప్పున ఒక్కొక్కరు మొత్తం రూ. 3,773 ఖర్చు పెడుతున్నారు. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
నెటిజన్లలో మన ‘సిటి’జన్లు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ యువతలో 93.7 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తుండటం విశేషం. అదేవిధంగా రాష్ట్రంలో పురుషులు, మహిళలు కూడా దేశ సగటును మించి రాష్ట్రంలో ఇంటర్నెట్ వాడుతున్నారు. ఈ విషయాలు జూలై–2022 నుంచి జూన్–2023 వరకు నిర్వహించిన సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వేలో వెల్లడైనట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. ప్రధానంగా 15 నుంచి 24 సంవత్సరాల వయసు గల యువతీ, యువకులు ఇంటర్నెట్ వినియోగంపై రాష్ట్రాల వారీగా సర్వేను నిర్వహించారు. ఆ సర్వే ప్రకారం మన రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత దేశ సగటును మించి ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు తేలింది. ఈ కేటగిరీలో దేశంలో సగటున 84.8 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... ఆంధ్రప్రదేశ్‌లో 91.1 శాతం మంది వాడుతున్నారు. 15 నుంచి 24 ఏళ్ల మధ్య పురుషులకు సంబంధించి దేశంలో సగటున 89.1 శాతం మంది, మన రాష్ట్రంలో 94.6 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. దేశంలో సగటున మహిళలు 80.0 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తుండగా... రాష్ట్రంలో 87.3 శాతం మంది మహిళలు వినియోగిస్తున్నట్లు సర్వే స్పష్టంచేసింది. ఈ కేటగిరీలో దేశ సగటుకన్నా అత్యల్పంగా ఉత్తరప్రదేశ్‌లో 75.6 శాతం, బిహార్‌లో 76.4 శాతం, ఒడిశాలో 80.6 శాతం ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
దేశ సగటును మించి రాష్ట్రంలో వేతన జీవులు
దేశ సగటు కన్నా మన రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విషయం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘లేబర్ ఫోర్స్ సర్వే–2023–24’లో వెల్లడైంది. దేశంలో సగటు వేతన పురుషులు 24.9 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 25.4 శాతం ఉన్నారు. దేశంలో సగటు వేతన మహిళలు 15.9 శాతం కాగా, రాష్ట్రంలో 17.3 శాతం ఉన్నారు. ఢిల్లీలో అత్యధికంగా వేతన మహిళలు 70.2 శాతం ఉండగా, పురుషులు 53.0 శాతమే ఉండటం విశేషం. గోవాలో వేతన మహిళలు 61.3 శాతం ఉండగా, పురుషులు 51.7 శాతం ఉన్నారు. కేరళలో వేతన మహిళలు 41.2 శాతం ఉండగా, పురుషులు 31.3 శాతమే ఉన్నారు. దేశంలో అత్యల్పంగా బిహార్‌లో వేతన మహిళలు 4.8 శాతమే ఉన్నారు. ఛత్తీగఢ్‌లో 9.7 శాతం, జార్ఖండ్‌లో 7.3 శాతం, మధ్యప్రదేశ్‌లో 6.6 శాతం, ఒడిశాలో 8.8 శాతం, రాజస్థాన్‌లో 8.5 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.6 శాతమే వేతన మహిళలు ఉన్నట్లు సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి ఆధారం: లేబర్ ఫోర్స్ సర్వే–2023–24 -
‘ఫిట్‌లెస్’ బ్యాండ్స్!
సాక్షి, హైదరాబాద్: కారణాలేవైనా జీవన శైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఉరుకుల పరుగుల జీవితాల్లో తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇంత హడావుడిలో మన ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించడం ఒకింత కష్టం. అందుకే అంతా ఇందుకోసం సాంకేతికతను వాడుతున్నారు. ఏ రోజు ఎంత దూరం నడిచారు...పల్స్రేట్ ఎంత ఉంటోంది..నిర్ణీత సమయంలో ఎన్ని కిలోమీటర్లు నడిచారు..సైక్లింగ్, స్విమ్మింగ్ యాక్టివిటీ ఎలా ఉంది..ఇలా ప్రతిదీ రికార్డు చేసి, మనల్ని అప్రమత్తం చేసేందుకు మార్కెట్లో ఎన్నో రకాల ఫిట్నెస్ బ్యాండ్స్ / వాచీలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది వీటిని ధరించడం సర్వసాధారణంగా కనిపిస్తోంది. ఒక్కో కుటుంబంలో ఐదుకు మించి కూడా ఈ ఫిట్నెస్ బ్యాండ్లు, వాచీలు ఉంటున్నాయి. అయితే ఫిట్నెస్ బ్యాండ్లను కొనుగోలు చేసినప్పుడు ఉన్నంత ఆసక్తి వాటిని వాడటంలో ఉండటం లేదు. కొన్న తర్వాత చాలామంది వాటిని పూర్తి స్థాయిలో వినియోగించడం లేదు. కేవలం సమయం, తేదీ చూసుకు నేందుకు, ఫోన్‌కాల్స్ మాట్లాడేందుకు, మెసేజ్‌లు చూసుకునేందుకు వాడుతున్న వారే ఎక్కువ ఉంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఇటీవల దేశవ్యాప్తంగా 278 జిల్లాల్లో 33,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో సర్వే నివేదికను రూపొందించారు. -
వచ్చే ఏడాది ఎవరి జీతాలు పెరుగుతాయి?
వచ్చే ఏడాది ఏ ఉద్యోగుల జేబులు నిండుతాయి.. ఏ రంగంలో జీతాలు ఎక్కువగా పెరుగుతాయి? దేశంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 2025 ఏడాదిలో జీతాలు ఎంత మేర పెరుగుతాయన్న దానిపై ప్రముఖ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ అయాన్ సర్వే నిర్వహించింది.30వ వార్షిక వేతన పెంపు, టర్నోవర్ సర్వే 2024-25 మొదటి దశ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో 40కి పైగా పరిశ్రమల నుండి 1,176 కంపెనీల డేటాను ఈ అధ్యయనం విశ్లేషించింది. దీని ప్రకారం 2025లో అన్ని రంగాల్లో సగటు వేతన పెంపు 9.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కాగా ఈ ఏడాది వాస్తవిక పెంపు 9.3 శాతంగా ఉంది.డబుల్ డిజిట్ ఈ రంగాలదే..ఇంజనీరింగ్, తయారీ, రిటైల్ పరిశ్రమలు 2025లో అత్యధికంగా 10 శాతానికి పైగా వేతనాలు పెంచుతాయని అంచనా వేశారు. 9.9 శాతంతో తర్వాత స్థానంలో ఆర్థిక సంస్థలు ఉన్నాయి. టెక్నాలజీ సెక్టార్‌కు ఈ సంవత్సరం జాగ్రత్తగా ప్రారంభమైనప్పటికీ వచ్చే ఏడాది ఆశాజనకంగా కనిపిస్తోంది.ఇదీ చదవండి: గూగుల్ హిస్టరీ ప్రింట్ తీసి.. జాబ్ నుంచి తీసేసిన కంపెనీగ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, టెక్నాలజీ ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్‌లు 9.9 శాతం, 9.3 శాతం వేతనాల పెంపును ఆశిస్తున్నాయి. అయితే టెక్నాలజీ కన్సల్టింగ్ అండ్ సర్వీస్ రంగ సంస్థలు 8.1 శాతమే ఇంక్రిమెంట్‌ను అందించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. అధ్యయనం రెండో దశలో భాగంగా వచ్చే డిసెంబర్, జనవరిలో డేటాను సేకరించి 2025 ప్రారంభంలో వెల్లడించనున్నారు. -
‘రెడ్ మార్క్’ గోబ్యాక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ నది గర్భంలో, బఫర్‌జోన్‌లో నిర్మాణాలను గుర్తించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తత రేపుతోంది. నివాసాల కూల్చివేత కోసం మార్కింగ్ చేయడానికి వెళ్తున్న అధికారులకు అడుగడుగునా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఏళ్లకేళ్లుగా కష్టపడి సంపాదించుకుని కట్టుకున్న ఇళ్లను వదిలిపొమ్మనడం ఏమిటంటూ పరీవాహకంలోని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం రెండోరోజు శుక్రవారం వివిధ ప్రాంతాలకు వెళ్లిన అధికారులను స్థానికులు అడుగడుగునా అడ్డుకున్నారు.రోడ్లపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేసిన పోలీసులపైనా తమ ఆక్రోశం వెళ్లగక్కారు. అభివృద్ధి అంటే ప్రజలకు మంచి జరగాలని.. తమను ముంచి చేసే అభివృద్ధి ఎందుకంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు మహిళలు బాధతో శాపనార్థాలు పెట్టారు. మరికొన్ని ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే బృందాలు ఇళ్ల మార్కింగ్ కొనసాగిస్తున్నాయి. మూసీ పరీవాహకంలో తాత్కాలికంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కొన్ని కుటుంబాలు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే తరలివెళ్లేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినా.. పక్కా ఇళ్లు కట్టుకున్నవారు కూల్చివేతను, తరలిపోవడాన్ని అత్యంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం కష్టపడి కట్టుకున్న ఇంటిని కూల్చేస్తే ఎలా బతకాలంటూ చైతన్యపురి వినాయక్‌నగర్ కాలనీలో మహేశ్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇంటికి మార్కింగ్ చేసేందుకు వచ్చిన అధికారుల ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య 9 నెలల గర్భిణి అని, తన ఇల్లు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లాలంటూ.. ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు. స్థానికులు, పోలీసులు వెంటనే అతడిని అడ్డుకున్నారు. అదే ప్రాంతంలో మరో మహిళ తమ ఇల్లు పోతే ఎలాగనే కలతతో రోదిస్తూ స్పృహతప్పి పడిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చైతన్యపురిలో బాధితులకు మద్దతుగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తహసీల్దార్ ఆఫీసును ముట్టడించి.. మూసీ పరీవాహకంలో లంగర్‌హౌస్‌లోని వివిధ బస్తీల్లోని ఇళ్లకు అధికారులు గురువారం రాత్రి మార్కింగ్స్ వేశారు. అలా మొఘల్‌నగర్ రింగ్‌రోడ్డు వైపు వెళ్లే ప్రయత్నం చేయగా.. అక్కడి బాధితులు రాళ్లు పట్టుకొని ఉన్నారన్న హెచ్చరికలతో వెళ్లలేదు. అప్పటికే స్థానికులు ఆందోళనకు సిద్ధమయ్యారు. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ అక్కడికి చేరుకుని.. రాత్రివేళ ఆందోళనలు వద్దని చెప్పడంతో వెనక్కి తగ్గారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లారు. తహసీల్దార్ లేకపోవడంతో ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. మూడు గంటలు దిగ్బంధం కార్వాన్‌లోని జియాగూడ, పరిసర ప్రాంతాల వారు.. సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకుని భారీ ఆందోళనకు దిగారు. ఇక్కడి ప్రధాన రహదారిని మూడు గంటల పాటు దిగ్బంధించారు. సీఎం రేవంత్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేసి.. అధికారులు గోబ్యాక్ అంటూ నిరసన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను కూల్చనివ్వబోమని, ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. దీనితో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కంటిమీద కునుకు కరువు! మూసీ పరీవాహక ప్రాంతాల్లోని నివాసితులకు కంటిమీద కునుకు కరువైంది. జీవితకాలం సంపాదించి కట్టుకున ఇళ్లను కూల్చేస్తారనే ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తమ ఇళ్లను కూల్చివేసి పాపం ముటగట్టుకోవద్దంటూ వేడుకుంటున్నారు. ఉదయం ఆరేడు గంటల నుంచే బస్తీల్లో అలజడి కనిపిస్తోంది. పెద్దలు పనులకు వెళ్లకుండా, పిల్లలను బడులకు పంపకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. ఎవరెవరు బస్తీలోకి వస్తున్నారు, అధికారులు వస్తున్నారా అని ఆందోళనగా చూస్తూ ఉండిపోతున్నారు. ఇంటిని ఖాళీ చేసే మాటేలేదు 30ఏళ్లుగా ఉంటున్నాం. ఇప్పడు కూలగొడతామంటూ ఊరుకునే మాటే లేదు. ఎక్కడికి వెళ్లాలి? మా పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడే పెరిగారు. మేం అన్ని పన్నులు కడుతున్నాం. ఇక్కడే బతుకుతాం. – నవనీత, కమలానగర్ (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి02) భవిష్యత్తు ఆశలను కూల్చేస్తారా? పైసా పైసా కూడబెట్టి చిన్న ఇల్లు కట్టుకున్నాం. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతున్నాం. ఆకస్మాత్తుగా ఇల్లు కూల్చేస్తే.. ఇల్లు మాత్రమేకాదు. భవిష్యత్తు ఆశలూ పోయినట్టే. మా బతుకులను బజారున పడేయొద్దు. – స్వప్న, గోల్నాక (ఫోటోఫైల్ నేం: 27ఏఎంబి03 ) అనుమతులు తీసుకుని ఇళ్లుకట్టుకున్నాం ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు తీసుకుని బ్యాంకు లోన్‌తో ఇళ్లు కట్టుకున్నాం. 70–80 ఏళ్ల వయసున్న వృద్ధ తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఇల్లు కూల్చివేస్తామని నోటీసులు ఇస్తున్నారు. ఇదేం న్యాయం? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? – లక్షి్మ, న్యూమారుతీనగర్ 56 ఏళ్లుగా ఉంటున్నాం.. ఎక్కడికి వెళ్లాలి? 1968 నుంచి అంటే 56 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాం. ఇక్కడివారంతా బ్యాంకు రుణాలు తీసుకుని ఇళ్లు కట్టుకుంటున్నారు. హైటెక్ సిటీ కంటే సేఫ్‌గా ఉంటున్నాం. ఏ ఇబ్బందులూ తలెత్తలేదు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట రోడ్ల పాలు చేస్తున్నారు. మేమేం కబ్జా చేసి ఇళ్లు కట్టుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లు కూల్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? న్యాయం కోసం పోరాడుతాం. – ఉపేందర్, న్యూమారుతీనగర్ -
హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ మూసీ కార్యక్రమంలో రెండో రోజు కొనసాగుతోంది. రెవెన్యూ అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. దీంతో, అక్కడ ఉద్రికత్త చోటుచేసుకుంది. బాధితులు.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను సర్వే చేస్తూ రెవెన్యూ అధికారులు రెండో రోజు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ చేస్తున్నారు. కూల్చివేయబోయే ఇళ్లకు నెంబరింగ్ ఇస్తూ మార్క్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులు సర్వేను ముమ్మరం చేశారు. గురువారం దాదాపు 12 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ క్రమంలో తమ ఇళ్లకు మార్క్ చేయకుండా అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లను కూల్చే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. దీంతో, పలు చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి.మరోవైపు.. శని, ఆదివారాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా ప్లాన్ చేసింది. అక్కడ నిర్మించిన అక్రమ నిర్మాణాలను రెండు రోజుల్లో కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమవుతున్నారు. దీని కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. ఇది కూడా చదవండి: నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్