
సాక్షి, హైదరాబాద్:‘మీరే అసిస్టెంట్లు.. మీకెందుకు అసిస్టెంట్లు’అని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు మాట్లాడటంపై ఏఈవోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే సందర్భంగా తమకు అసిస్టెంట్లు కావాలని వారు కోరుతున్న నేపథ్యంలో రఘునందన్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు బుధవారం వ్యవసాయ విస్తరణ అధికారులతో రఘునందన్‌రావు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల్లో భాగంగా ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఏఈఓలు చర్చలను మధ్యలోనే బహిష్కరించి వచ్చేశారు. డిజిటల్ క్రాఫ్ట్ సర్వే చేయడం లేదనే కారణంగా ఉన్నతాధికారులు వేధింపులకు చేస్తున్నారని ఏఈఓలు విమర్శించారు.
మహిళల భద్రతపై కనీసం కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 30 రోజులుగా శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై ఉన్నతాధికారుల ఏకపక్ష వైఖరిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టనున్నట్లు తెలిపారు. దీపావళి తర్వాత స్పష్టమైన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ క్రాఫ్ట్ సర్వే మూలన పడింది. వారం రోజుల కిందట 160 మంది ఏఈఓలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వారి సస్పెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఇప్పటివరకు చర్చలు జరపలేదు.