వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం
హైదరాబాద్ వ్యవసాయ కమిషనరేట్ వద్ద ధర్నా.. ఉద్రిక్తత
ఏఈవోల విన్నపాన్నివినకుండానే వెళ్లిపోయిన వ్యవసాయశాఖ డైరెక్టర్
నేడు వందలాది మందితో కమిషనరేట్‌ను ముట్టడిస్తామని ఏఈవోల హెచ్చరిక..
మరోవైపు మూకుమ్మడి సెలవులో 2,600 మంది..
డిజిటల్ క్రాప్ సర్వేపై సహాయ నిరాకరణ చేస్తుండటం వల్లేసస్పెండ్ చేశారంటున్న ఏఈవోలు
రైతుబీమాలో రైతుల మరణాల వివరాల నమోదులో నిర్లక్ష్యమని ఉత్తర్వుల్లో పేర్కొన్న వైనం
సాక్షి, హైదరాబాద్/గన్‌ఫౌండ్రీ: గ్రామాల్లో పనిచేసే వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈవో)పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఏకంగా 165 మంది ఏఈవోలను సస్పెండ్ చేస్తూ వ్యవసాయశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ నేపథ్యంలో రగిలిపోయిన ఏఈవోలు మంగళవారం జిల్లాల నుంచి హైదరాబాద్ లోని వ్యవసాయ కమిషనరేట్‌కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాలుగు గంటల పాటు ధర్నా చేశారు.
పోలీసులు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా ధర్నా జరుగుతున్నా వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి ఏమాత్రం పట్టించుకోకుండానే పోలీసుల భద్రత నడుమ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో మరింత ఆగ్రహంతో ఉన్న ఏఈవోలు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని ప్రకటించారు.
కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. 2,600 మంది ఏఈవోలు సెలవుల్లో ఉంటామని వెల్లడించారు. నేతలు రాజ్‌కుమార్ రాజు, పరశురాములు, సుమన్, వెంకన్న శ్రీనివాస్ జానయ్య, వినోద్, సత్యంల నాయకత్వంలో ధర్నాలో పెద్ద సంఖ్యలో ఏఈవోలు పాల్గొన్నారు.
కక్ష సాధింపు ధోరణి
డిజిటల్ క్రాప్ సర్వే చేయకపోవడమే 165 మంది ఏఈవోల సస్పెన్షన్‌కు కారణమని ఏఈవోలు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మాత్రం రైతుబీమా నిబంధనల ప్రకారం మృతి చెందిన రైతుల వివరాల నమోదులో ఏఈవోలు నిర్లక్ష్యంగా వహించారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కక్ష సాధింపులో భాగంగానే ఈ సస్పెన్షన్లని ఉద్యోగులు మండిపడుతున్నారు.
వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి ఏఈవోలను సస్పెండ్ చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం ఉదయం నుంచి మొదలైన సస్పెన్షన్ల పరంపర సాయంత్రం వరకు కొనసాగింది. బుధవారం మరో కారణంతో మరికొంతమందిని సస్పెండ్ చేయడానికి రంగం సిద్ధం చేశారని వారు ఆరోపిస్తున్నారు.
నాలుగు రోజుల్లో ఎలా అప్‌లోడ్ చేయాలి?
నిబంధనల ప్రకారం రైతు చనిపోయిన తర్వాత నాలుగు రోజుల్లో మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు అన్ని రకాల పత్రాలను జత చేసి..సదరు ఏఈవో రైతుబీమా పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలి. అయితే రైతు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు కనీసం 11 రోజుల వరకు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు.
ఆ తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం పొందడానికి సమయం పడు తుంది. ఈ విధంగా కుటుంబ సభ్యులు వివరాలు అందించేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుందంటున్నారు. ఇది గతం నుంచి కొనసాగుతుందంటున్నారు. అలాంటప్పుడు కేవలం నాలుగు రోజుల్లో వివరాలు ఏ విధంగా అప్‌లోడ్ చేయాలని ఏఈవోలు ప్రశ్నిస్తున్నారు.
సస్పెండ్ చేయడం సరికాదు
డిజిటల్ క్రాప్ సర్వేను నిరాకరించినందుకు తనను సస్పెండ్ చేయడం సరికాదని హనుమకొండ జిల్లా శాయంపేట క్లస్టర్ ఏఈఓ అర్చన అన్నారు. 15వేల మందితో చేయించాల్సిన సర్వేని 2,600 మందితో చేయించాలని ప్రభుత్వాలు చూస్తున్నాయని అన్నారు. రైతు బీమాలో ఎటువంటి అవకతవకలు జరగకపోయినా సస్పెండ్ చేశారని తెలిపారు.
షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు
డిజిటల్ సర్వే చేసే విషయంలో భయభ్రాంతులకు, మానసిక ఒత్తిడికి గురిచేశారని వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ ఏఈఓ ప్రవళిక చెప్పారు. కనీస వసతులు లేకుండా సర్వే చేయలేమని విన్నవించినా, వినకుండా రైతు బీమా కారణం చూపించారన్నారు. కనీసం మెమో గానీ షోకాజ్ నోటీస్ గానీ ఇవ్వకుండా సస్పెండ్ చేశారని వాపోయారు.
పంట సర్వే ఏఈవోల ప్రాథమిక బాధ్యత
వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ
పంట నమోదు కార్యక్రమం ఏఈవోల ప్రాథమిక బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ గోపీ తెలిపారు. కొందరు ఏఈవోలు పంట పొలాన్ని సందర్శించకుండా సర్వే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 165 మంది ఏఈవోలను వ్యవసాయశాఖ సస్పెండ్ చేసిన నేపథ్యంలో సంచాలకుడు డాక్టర్ గోపీ స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రతి గుంటలో సాగైన పంట వివరాలు కచ్చితంగా తెలుసుకో వడానికి, పంటలకు కావాల్సిన ఉత్పాదకాలను అంచనా వేయడానికి, పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కొనుగోలు నిర్ణయాలు తీసుకోవడానికి, పంట బీమా అమలు, పంట రుణాలు పొందటానికి రైతు బీమా, రైతు భరోసా పథకాల అమలుకు సర్వే ఉపయోగపడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment