
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్‌ఎస్, ఎంఐఎం నిరసనకు దిగాయి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదని ఆందోళన చేపట్టాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై నిరసన చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరసనను విరమించుకోవాలి సభకు సహకరించాలి. అసెంబ్లీ నిబంధనలను ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు తెలుసుకోవాలని శ్రీధర్‌బాబు అన్నారు.
మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో కేసు నడుస్తుండగా సీఎం రేవంత్ సభలో మాట్లాడారని.. అది రూల్స్‌కు వ్యతిరేకమన్నారు. కోర్టులో కేసు నడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తీర్పు ఇచ్చారు. తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందా? రేవంత్ ఇస్తారా?. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి ప్రివిలేజ్ కిందికి వస్తది. సీఎం వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేశాం. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. మాకు అవకాశం ఇవ్వనందున సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు.
‘‘సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సూచనల కోసం మైక్ ఇవ్వాలని సీఎం సూక్తులు చెప్పారు. సూచనలు చెప్తాం.. అంటే మైక్ ఇవ్వడం లేదు. బెట్టింగ్ యాప్‌ను గతంలోనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ పదిహేను నెలల్లో బ్యాటింగ్ యాప్స్‌ను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 50 శాతం సీసీటీవీలు పనిచేయడం లేదు. పోలీస్ వాహనాలకు డీజీల్ కోసం ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.