MIM
-
GHMC మేయర్ Vs MIM ఎమ్మెల్సీ.. అధికారుల్లో టెన్షన్!
సాక్షి, హైదరాబాద్: నగరంలో జీహెచ్ఎంసీ మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చికెన్, మటన్ షాపులు విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది.వివరాల ప్రకారం..‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతూ చికెన్ మార్కెట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్ మార్కెట్‌ను సీజ్ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్ ఆదేశాల మేరకు చికెన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే ప్రయత్నం చేశారు.మరోవైపు.. మేయర్ ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు.దీంతో, మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది. మేయర్ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్ విషయంలోనూ మేయర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్ మేయర్ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. -
ఎంఐఎం కేన్సర్లాంటిది
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.వక్ఫ్‌బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు. -
MIM MLA Vs ఫిరోజ్‌ఖాన్.. అసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎంఐఎం నేతల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్‌పై వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌పై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలను అదుపు చేశారు. -
జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ‘హైడ్రా’ కూల్చివేతల అంశం హాట్ టాపిక్‌గా మారింది. డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల హైదరాబాద్ కట్టడాల కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తరుణంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ మరోసారి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొన్ని ప్రభుత్వ భవనాలను ఎఫ్టీఎల్లో కట్టారు.. కూల్చేస్తారా? అని ప్రశించారు. నెక్లెస్ రోడ్డు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది తొలగిస్తారా? జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం,సెక్రటేరియట్లు, ప్రముఖుల ఘాట్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి వాటిని కూల్చేస్తారా? అంటూ అసదుద్దీన్ ప్రశ్నించారు. దీంతో, అసద్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
మా టార్గెట్ పాతబస్తీ...
నయీంనగర్ (హనుమకొండ): ‘మా టార్గెట్ పాతబస్తీ. ఓల్డ్ సిటీని న్యూ సిటీగా మార్చాలని పోరాడుతున్నాం... ఎంఐఎం ఆనవాళ్లు లేకుండా చేస్తాం. పాతబస్తీని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సంఘ విద్రోహులకు అడ్డాగా మారిన పాతబస్తీని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని మైనారిటీ మోర్చా నాయకులంతా ముస్లింలకు వివరించాలని సూచించారు. హనుమకొండలో శనివారం జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అబద్ధాలు, మోసాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్‌ను మించిపోయిందన్నారు. ‘వెయ్యి ఎకరాల్లో జూ ఏర్పాటు చేస్తారట. మరో వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటు చేస్తారట. వేలాది ఎకరాల్లో ఫోర్త్ సిటీని నిర్మిస్తారట. అసలు ఉన్న భూములన్నీ కేసీఆర్ అమ్ముకున్నడు... మరి ఈ ప్రభుత్వం యాడ నుండి తీసుకొస్తది.?’అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో బీజేపీ కార్యకర్తలపై చేసిన అరాచకాలను మర్చిపోలేమని, బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈపాటికే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేసే వాళ్లమని చెప్పారు. రాక్షస పార్టీ బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఇదంతా కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారమన్నారు. కాంగ్రెస్‌లోనే బీఆర్ఎస్ విలీనం ఖాయమని, మాట ముచ్చట కూడా పూర్తయ్యిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. -
హైడ్రాపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ‘హైడ్రా’కూల్చివేత అంశం హాట్ టాపిగ్గా మారింది. కట్టడాల కూల్చివేతలపై ప్రతిపక్ష నేతలు మండిపడతున్నారు. తాజాగా హైడ్రాపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చేస్తారన్న వార్తలపై అక్బరుద్దీన్ స్పందించారు. నాపై బుల్లెట్ల వర్షం కురిపించండి. కత్తులతో దాడి చేయండి. కానీ నేను పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని’ అక్బరుద్దీన్ కోరారు. -
‘ఎంఐఎం’ అంటే గోడ మీద పిల్లి.. బండి సంజయ్ సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో ఎంఐఎం గోడ మీద పిల్లిలాంటిది.. ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో అక్బరుద్దీన్ ఒకవేళ అక్కడి నుంచి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాగా, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆదివారం చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలి. కొన్ని ప్రాంతాల్లో బోనాలను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలి. గత పాలకులు ఇదే తరహాలో చేస్తే ఏమైందో అందరూ చూశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మవారి టెంపుల్‌ను గోల్డెన్ టెంపుల్‌గా మార్తుస్తామన్నారు. నేను హిందువుల తరపున పక్కా మాట్లాడుతా. అలా అని వేరే మతానికి వ్యతిరేకం కాదు.ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ గోడ మీద పిల్లిలాంటిది. ఎవరు అధికారంలో ఉంటే వారి పార్టీ పక్కన చేరుతారు. అధికారంపోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటారు. అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్, అక్బరుద్దీన్ అన్నదమ్ములయ్యారు. దమ్ముంటే అక్బరుద్దీన్ కొడంగల్ నుంచి పోటీ చేయాలి. ఒకవేళ ఆయన అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాకుండా చేస్తాం అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
డిప్యూటీ సీఎం చేస్తా..! అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.‘‘కాంగ్రెస్ బీ ఫామ్‌పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్‌లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. -
Lok Sabha Election 2024: బీజేపీ.. కాంగ్రెస్‌కు చెరో '8'
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకొంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరఫున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీచేయగా.. వారిలో ఐదుగురు ఓటమి పాలయ్యారు. ఓడినవారిలో నామా నాగేశ్వర్రావు, మాలోతు కవిత, రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకొన్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పట్టు.. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో తన పట్టును నిలుపుకోగా.. ఉత్తర తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఉన్న మొత్తం 5 లోక్‌సభ సీట్లనూ కాంగ్రెస్ గెలుచుకుంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ మూడింటిని గెలుచుకుని ఆ ప్రాంతాల్లో ఆధిపత్యం చాటింది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత, సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించడంతో పాత నగరంపై ఆ పార్టీ పట్టు నిలుపుకొంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు లోక్‌సభ సీట్లు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ చెరో మూడు సీట్లను దక్కించుకున్నాయి. అదీ ప్రతి జిల్లాలో చెరో సీటు సాధించడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని రెండు సీట్లనూ బీజేపీ కైవసం చేసుకుంది. పట్టుపెంచుకున్న ఇరు పార్టీలు.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 4 స్థానాలను గెలిచిన బీజేపీ.. ఈసారి తన బలాన్ని 8 సీట్లకు పెంచుకుంది. కాంగ్రెస్ కూడా 3 సీట్ల నుంర్టీచి 8 సీట్లకు బలాన్ని పెంచుకుంది. గత ఎన్నికల్లో 9 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ ఈసారి ఖాతా తెరవలేకపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. ఆ ఎన్నికల్లో కేవలం 8 అసెంబ్లీ స్థానాలే గెలిచిన బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చి సమ ఉజ్జీగా నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్ ఒక్క లోక్‌సభ సీటు గెలవలేదు. గత, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లివీ.. పార్టీ 2014 2019 2024 కాంగ్రెస్ 2 3 8 బీజేపీ 1 4 8 ఎంఐఎం 1 1 1 బీఆర్ఎస్ 11 9 0 నల్లగొండ: రికార్డు స్థాయి మెజారిటీ నల్లగొండ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తమ పట్టు నిలుపుకొంది. కౌంటింగ్ ఆద్యంతం ఆ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డి స్పష్టమైన ఆధిక్యత చూపారు. చివరికి ఏకంగా రికార్డు స్థాయిలో 5,59,906 ఓట్ల మెజారిటీ సాధించారు. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు. భువనగిరి: అంతా తొలిసారి ఎంపీలే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తమకు ఉన్న పట్టును కాంగ్రెస్ పార్టీ మరోసారి నిలుపుకొంది. భువనగిరి లోక్‌సభ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌పై 2,22,170 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారి లోక్‌సభలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సెగ్మెంట్లో ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తొలిసారిగా ఎంపీలు అయినవారే కావడం విశేషం. నాగర్ కర్నూల్: మళ్లీ ‘చేతి’కి.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి 94,414 ఓట్ల మెజారిటీతో సమీప బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్‌పై గెలుపొందారు. మల్లు రవి 1991, 1998 ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎంపీగా గెలవడం గమనార్హం. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత విజయం సాధించారు. ఇక ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. పెద్దపల్లి: మళ్లీ కాంగ్రెస్ ఖాతాలోకి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే జి.వివేక్ తనయుడే గడ్డం వంశీకృష్ణ. ఈయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మూడోస్థానానికి పరిమితం అయ్యారు. వరంగల్: పార్టీ మారి పోటీచేసినా.. 2009లో జరిగిన పునర్విభజనలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కాంగ్రెస్ గెలవగా తర్వాత వరుసగా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. మళ్లీ ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య గెలిచారు. ఆమె బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్‌పై 2,20,339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. కానీ ఆమె కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అరూరి రమేష్ కూడా ఎన్నికల ముందే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి పోటీ చేయడం గమనార్హం. మహబూబాబాద్: సెగ్మెంట్ చరిత్రలో అధిక మెజారిటీ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పి.బలరాంనాయక్ 3,49,165 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితపై విజయం సాధించారు. 1957 నుంచీ కొనసాగిన మానుకోట పాత పార్లమెంట్ స్థానంలోగానీ, 2009 తర్వాత కొత్తగా ఏర్పడిన మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలోగానీ.. ఇదే అత్యధిక మెజారిటీ కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ తరఫున ఇదే లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన బలరాంనాయక్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014, 2019 ఎంపీ ఎన్నికల్లో ఓటమి పాలైన ఆయన.. ఈసారి మళ్లీ గెలిచారు. ఖమ్మం: ఆద్యంతం కాంగ్రెస్ ఆధిక్యమే.. తొలి రౌండ్ నుంచి చివరిదాకా కాంగ్రెస్ ఆధిక్యమే కొనసాగింది. చివరికి 4,67,847 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయం సాధించారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వియ్యంకుడు కావడం గమనార్హం. బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్రావు రెండో స్థానంలో నిలిచారు. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 18 ఎన్నికల్లో.. ప్రస్తుతం రామసహాయం రఘురాంరెడ్డి సాధించిన మెజారిటీయే రికార్డు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ పెంచుకుంది. ఇక్కడ 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 20,488 ఓట్లే రాగా.. ఈసారి ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు 1,18,636 ఓట్లు సాధించారు. జహీరాబాద్: ఇక్కడా హస్తం హవా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ 46,174 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్ధి/సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌పై విజయం సాధించారు. సురేశ్ షెట్కార్ ఇదే సెగ్మెంట్ నుంచి 2009లో ఎంపీగా గెలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ అయిన బీబీ పాటిల్ ఎన్నికల ముందే బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున బరిలోకి దిగారు. రెండు జాతీయ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టిపోటీనే జరిగింది. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. నిజామాబాద్: పోటాపోటీ మధ్య కమలానికి.. ఇందూరు గడ్డపై మళ్లీ కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కొనసాగిన నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 1,09,241 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకుగాను.. అరవింద్‌కు బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, నిజామాబాద్ రూరల్‌లలో ఆధిక్యత వచ్చింది. జీవన్‌రెడ్డికి జగిత్యాల, నిజామాబాద్ అర్బన్, బోధన్ సెగ్మెంట్లలో ఆధిక్యత వచ్చింది. కరీంనగర్: పట్టు పెంచుకున్న జాతీయ పార్టీలు తొలి నుంచీ బీఆర్ఎస్కు ఆయువుపట్టుగా ఉన్న కరీంనగర్ లోక్‌సభ స్థానంలో జాతీయ పార్టీలు పట్టుపెంచుకున్నాయి. ఇక్కడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 4,98,276 ఓట్లు, బీఆర్ఎస్కు 4,08,768 ఓట్లు, కాంగ్రెస్‌కు 1,79,258 ఓట్లు రాగా.. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 5,85,116 ఓట్లతో విజయం సాధించారు. క్రితంసారితో పోలిస్తే 86,840 ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు 3,59,907 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే కాంగ్రెస్‌కు 1,80,649 ఓట్లు అదనంగా వచ్చాయి. ఈసారి బీఆర్ఎస్కు 2,82,163 ఓట్లు వచ్చాయి. 1.25 లక్షలకుపైగా ఓట్లు తగ్గాయి. మహబూబ్‌నగర్: కౌంటింగ్ ఆద్యంతం ఉత్కంఠ మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి డీకే అరుణ 4,500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. గతంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించిన డీకే అరుణ లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అయితే ఈ లోక్‌సభ ఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం పరిధిలో కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. మల్కాజిగిరి: దేశంలోనే పెద్ద సెగ్మెంట్.. తొలిసారి బీజేపీ విజయం దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్‌సభ సెగ్మెంట్ మల్కాజిగిరిలో తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్‌రెడ్డిపై 3,91,475 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్లో ప్రముఖ నేతగా కొనసాగి, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన ఈటల తొలిసారి ఎంపీ అయ్యారు. చేవెళ్ల: కొండా వశం చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్లో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన 2014లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచారు. 2019లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. చేవెళ్ల సెగ్మెంట్లో ఏకంగా 43 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. మెదక్: గులాబీ కంచుకోటలో కమలం బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ కంచుకోటగా ఉన్న మెదక్‌లో బీజేపీ విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 39,139 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌పై గెలిచారు. ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన రఘునందన్‌రావు తొలిసారిగా ఎంపీ అయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి కంటే సుమారు 35 వేల ఓట్లు తక్కువగా వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఆదిలాబాద్: మళ్లీ కమలమే! ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో కమలం పార్టీ మళ్లీ వికసించింది. ఆ పార్టీ అభ్యర్థి గొడం నగేశ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణపై 90,652 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచిన ఆయన.. ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ ఇక్కడ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ కౌంటింగ్ తొలుత ఉత్కంఠగా సాగింది. బీజేపీ అభ్యర్థి తొలి నుంచీ ఆధిక్యంలో ఉన్నా.. కొన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఆధిక్యత సాధించారు. చివరికి నగేశ్ గెలిచారు. హైదరాబాద్: ఐదోసారి లోక్‌సభకు అసదుద్దీన్ హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వరుసగా ఐదోసారి విజయం సాధించారు. ఆయన సమీప బీజేపీ అభ్యర్థి కె.మాధవీలతపై 3,38,087 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్నికల్లో తన ప్రచార, వ్యవహార శైలితో జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన మాధవీలత ఊహించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయ్యారు. 2019లో 2.82 లక్షల ఓట్ల మెజారిటీతో అసదుద్దీన్ గెలవగా.. మెజారిటీ మరో 50వేలకుపైగా పెరిగింది. సికింద్రాబాద్: ఓట్లు మరింత పెంచుకున్న బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్లో బీజేపీ తన ఓట్లశాతాన్ని మరింత పెంచుకుంది. బీజేపీ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై 49,944 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో బీజేపీకి 42.05 శాతం ఓట్లురాగా.. ఈసారి 45.15శాతం వచ్చాయి. -
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్‌గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్‌గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్‌గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్‌లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
హైదరాబాద్‌లో అసదుద్దీన్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం మరోసారి ఘన విజయం సాధించింది. 3.38 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మాధవీ లతపై గెలుపొందారు. దీంతో ఆయన ఈ స్థానంలో 5వసారి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన కొంపెల్లి మాధవీలత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మహ్మద్ వలీవుల్లా సమీర్ ఓటమిపాలు అయ్యారు. -
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అమరావతి అభ్యర్థి (సిట్టింగ్ ఎంపీ) నవనీత్ కౌర్.. గతంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలకు, ఎంఐఎం అధినేత, హైదరాబాద్ లోక్‌సభ మజ్లిస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పాతబస్తీలో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం నిర్వహించిన నవనీత్ కౌర్.. దాదాపు పన్నెండేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ‘పోలీసులు 15 నిమిషాలు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని చిన్నోడు అన్నాడని, కానీ వాళ్లకు 15 నిమిషాలేమో..మాకు 15 సెకన్లు చాలు..’అంటూ వ్యాఖ్యానించారు. కాగా గురువారం పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న అసద్ వద్ద.. నవనీత్ కౌర్ వాఖ్యలను మీడియా ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఆయన తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే చేసి చూపించండి ‘నరేంద్ర మోదీజీ 15 సెకన్లు కాదు.. గంట.. 15 గంటలు సమయం ఇవ్వండి.. అధికారం మీ చేతిలో ఉంది...ముస్లింలను ఏం చేస్తారో చేయండి.. మీలో మానవత్వం మిగిలి ఉందా? లేదా? అని మేము కూడా చూడాలని అనుకుంటున్నాం..అంతా మీదే.. అధికారం మీదే అయినప్పుడు ఎవరు ఆపుతున్నారు? మేం భయపడేది లేదు.. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం... దుమ్ముంటే చేసి చూపించాలి..’అంటూ అసదుద్దీన్ సవాల్ చేశారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు హైదరాబాద్‌ను ఎంఐఎంకు లీజుకు ఇచ్చాయంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై కూడా అసదుద్దీన్ స్పందించారు. హైదరాబాద్ ప్రజలు పశువులు కాదని, వారు పౌరులని, రాజకీయ పార్టీల ఆస్తులు కాదని వ్యాఖ్యానించారు. నలభై ఏళ్లుగా హైదరాబాద్ హిందుత్వ దుష్ట భావజాలాన్ని ఓడిస్తూ ఎంఐఎంకు అప్పగిస్తోందన్నారు. హిందుత్వం మళ్లీ ఓడిపోతుందని చెప్పారు. ముస్లింలను ద్వేషించడమే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానమని, అందుకే మరోమారు బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
హైకమాండ్ ఆదేశిస్తే అసదుద్దీన్ గెలుపుకోసం పనిచేస్తా -ఫిరోజ్ ఖాన్
-
ఆరు గ్యారంటీల అమలుకు రూ.2.15 లక్షల కోట్లు కావాలి: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పథకాల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఈ పథకాలకు నిధులు ఏ విధంగా సమకూరుస్తారో ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది’అని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడ్జెట్‌పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఇప్పటికే రెండు పథకాలు అమలు చేయడం అభినందనీయమేనన్నారు. మిగతా నాలుగు పథకాలు వందరోజుల్లో అమలు చేయాలని చెప్పారు. ఈ ఆరు పథకాలకు బడ్జెట్లో రూ.53,196 కోట్లు కేటాయించారు..రాష్ట్ర ఆర్థిక రాబడి రూ. 2,74,185.7 కోట్లు, ఖర్చు 2,75,890.69 కోట్లుగా బడ్జెట్లో అంచనా వేశారు. రాష్ట్ర రాబడులు, అప్పులకు చెల్లించే వడ్డీలు, నెలవారీ చెల్లింపులకు మధ్య పొంతన కుదరడం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆరు గ్యారంటీలు, ఐదు డిక్లరేషన్లు, 300 హామీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీపీఎల్ కుటుంబాలకు మహాలక్ష్మి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.26,990 కోట్లు కావాలని, గ్యాస్ సిలిండర్‌కు రూ.2,699.70 కోట్లు, ఉచిత బస్సు పథకానికి రూ.3,600 కోట్లు, కౌలు రైతులకు రూ. 23,160.8 కోట్లు, మన్రేగా కింద 32 లక్షల వ్యవసాయ కూలీలు ఉంటారని, వీరికి ఏడాది రూ.3,840 కోట్లు, వరికి రూ. 500 చొప్పున బోనస్ ఇస్తే ఏడాదికి రూ.7500 కోట్లు, పంటరుణాలకు రూ.36 వేల కోట్లు కావాలని చెప్పారు. గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు ఏడాదికి రూ.4800 కోట్లు, అంబేడ్కర్ ఆర్థికచేయూత పథకానికి నిధులెన్నో చెప్పలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థిక చేయూతకు రూ.25 వేల కోట్లు, యువభరోసా, విద్యాభరోసా కార్డు అమలుకు రూ.38,894.22 కోట్లు, విద్యాజ్యోతి పథకానికి రూ.6,476 కోట్లు.. ఇంకా పింఛన్ల పెంపు ఇతర హామీలకు ఇలా కలిపి మొత్తం రూ.2,15,568.54 కోట్లు కావాలని, ఈ నిధులు ఎలా సమకూరుస్తారో చెప్పాలన్నారు. కొన్నేళ్లుగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ డబ్బులు పెండింగ్‌లో ఉంచారని, దీనివల్ల కాలేజీల్లో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ధరణి స్థానంలో భూమాత తెచ్చేందుకు నియమించిన నిపుణుల కమిటీ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుందో చెప్పాలన్నారు. బడ్జెట్లో మైనార్టీలకు కేటాయింపులు నిరాశ పరిచాయని, ముస్లిం మైనార్టీ సంస్థలకు మంజూరైన నిధులు దారి మళ్లడంపై విచారణ జరిపించాలని, రాష్ట్రానికే ఆదాయం తెచ్చి పెడుతున్న హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీకి ఇవ్వాల్సిన నిధులు సరిగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేసవి తీవ్రంగా ఉంటుందనే సంకేతాలు వస్తున్నాయని, గోదావరి, కృష్ణా జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదముందని, రంజాన్ మాసం సమీపిస్తున్నందున పాతబస్తీలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఈ సమస్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: బాలూనాయక్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా సాగు,తాగునీటి ఇబ్బంది కలిగించినందుకు మాజీ సీఎం కేసీఆర్ నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలూనాయక్ డిమాండ్ చేశారు. అన్ని విభాగాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించదని, దీనిని జీర్ణించుకోలేక బీఆర్ఎస్ విమర్శలు చేస్తోందన్నారు. ఎన్నికల ముందే కేసీఆర్‌కు దళితులు గుర్తుకొస్తారని, అంబేడ్కర్‌కు కనీసం నివాళులు అర్పించని సీఎంగా కేసీఆరే మిగిలిపోతారన్నారు. -
ఎంబీటీతో ఎంఐఎంకు చెక్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం)కు మజ్లిస్ బచావో తెహ్రీక్ (ఎంబీటీ)తో చెక్ పెట్టే దిశలో అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన ఎంఐఎంను కట్టడి చేసేందుకు ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహంలో భాగంగా ఎంబీటీతో కలిసి వెళ్లాలని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ కొన్ని సమీకరణల నేపథ్యంలో ఇది సాధ్యం కాలేదని, ఇప్పుడు ఆ ప్రతిపాదన అమల్లోకి వచ్చేలా రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానాన్ని ఎంబీటీకి కేటాయించాలనే ప్రతిపాదన అధిష్టానం పెద్దల వరకు చేరింది. అంతకంటే ముందే జాతీయ స్థాయిలోని ఇండియా కూటమిలో ఎంబీటీని చేర్చుకోవాలని, తద్వారా ఎంఐఎంకు దీటుగా ఎంబీటీని దేశ స్థాయిలో ప్రోత్సహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కూటమి సమావేశాల్లో ఎంబీటీని భాగస్వామిని చేయడంతో పాటు ఎన్నికల ప్రచార సభలకు ఆహా్వనించడం ద్వారా ఎంఐఎం ద్వారా బీజేపీకి కలుగుతున్న లబ్ధి, ఆ రెండు పార్టీల దోస్తీని ముస్లిం మైనార్టీలకు అర్థమయ్యేలా పాతబస్తీ పార్టీ అయిన ఎంబీటీతోనే చెప్పించాలనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ‘బస్తీ’మే సవాల్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన ఎంఐఎం రాష్ట్ర ఏర్పాటు తర్వాత మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా తయారయింది. పాతబస్తీలో తనకున్న బలాన్ని, బలగాన్ని వేదికగా చేసుకుని అన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తూ నిలబడింది. దాదాపు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు మిత్రపక్షంగా వ్యవహరించిన ఎంఐఎం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పంథాను కొనసాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందూ ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పట్ల ఎంఐఎం వైఖరిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్కు అదనపు బలంగా, తమకు వైరిపక్షంగా మారిన ఎంఐఎంకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించుకుంది. పార్లమెంటు ఎన్నికలు మొదలుకుని ఇక ముందు జరిగే అన్ని ఎన్నికల్లోనూ పాతబస్తీలో ఒవైసీ సేనకు సవాల్ విసిరేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ అంచనాలతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని రెండు నియోజకవర్గాల్లో ఎంబీటీ (యాకుత్‌పుర), కాంగ్రెస్ (నాంపల్లి) ఢీ అంటే ఢీ అనేలా ఎంఐఎంతో తలపడ్డాయి. చాలా తక్కువ తేడాతో ఓడిపోయాయి. అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిన నేపథ్యంలో ఎంబీటీని ముందుంచడం ద్వారా ఆ రెండింటితో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీల ఓట్లను కొల్లగొట్టవచ్చనే అంచనాల్లో కాంగ్రెస్ నాయకులున్నారు. ఈ ప్రయత్నంలోనే విజయం సాధిస్తామని, ఒకవేళ లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎంను కొంతమేర నిలువరించగలిగినా, జీహెచ్ఎంసీ ఎన్నికల సమయానికి మరింత సమర్థవంతంగా ఎంఐఎంను ఢీ కొట్టగలుగుతామనేది అటు ఎంబీ టీ, ఇటు కాంగ్రెస్‌ల భావనగా కనిపిస్తోంది. ఈ విషయమై కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతూ ‘అధికారంలో ఉన్నప్పుడే ఎంఐఎంను కట్టడి చేయగలం. ఇందుకు ఎంబీటీని వేదికగా చేసుకుని ముందుకెళితే మంచి ఫలితాలు రాబట్టగలుగుతాం. లోక్‌సభ ఎన్నికలే కాదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ మా రెండు పార్టీలు అవగాహనతో వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది.’అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ ఎన్నికలకు ముందే వాస్తవానికి, ఎంబీటీతో పొత్తుపై అసెంబ్లీ ఎన్నికలకు ముందే చర్చలు జరిగాయి. అప్పట్లో ఏఐసీసీ పరిశీలకురాలిగా వచ్చిన ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ, ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ రెండు, మూడుసార్లు భేటీ అయి చర్చలు కూడా జరిపారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరిగిన చర్చల అనంతరం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఎంబీటీతో స్నేహం నష్టం చేస్తుందనే భావనతో వెనక్కు తగ్గినట్టు తెలిసింది. ఇప్పుడు ఇదే స్నేహం ద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టే దిశలో ముందుకెళుతోంది. ఇందుకు ఎంబీటీ నేత అంజదుల్లాఖాన్ కూడా సుముఖంగా ఉన్నారు. పాతబస్తీలోని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ సానుభూతిపరులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి ఈ రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. -
ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిచింది..
‘పాలమూరు’లో కాంగ్రెస్ హవా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరులో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో 12 గెలుపొంది సత్తా చాటింది. బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం రెండు స్థానాలకే పరిమితమయ్యారు. మహబూబ్‌నగర్, వనపర్తి నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డికి చుక్కెదురైంది. దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జీఎమ్మార్ మధ్య రౌండ్ రౌండ్‌కూ హోరాహోరీ పోరు కొనసాగింది. రౌండ్‌రౌండ్‌కు ఉత్కంఠగా సాగిన లెక్కింపులో చివరి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డికి 907 ఓట్ల మెజార్టీ రాగా.. పోస్టల్ బ్యాలెట్‌తో కలుపుకుని మొత్తం 1,392 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. తొలిసారిగా 9 మంది.. ఉమ్మడి పాలమూరులో తొమ్మిది మంది తొలిసారి గా శాసనసభలో అడుగుపెట్టనున్నారు. కాంగ్రెస్‌కు సంబంధించి జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, వనపర్తి అభ్యర్థులు జనంపల్లి అనిరు«ద్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజే శ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డితో పాటు బీఆర్ఎస్ అలంపూర్ అభ్యర్థి విజయుడు తొలిసారిగా విజయం సాధించారు. ఇందులో అందరూ యువతే కావడం విశేషం. వనపర్తిలో గలాటా.. వనపర్తిలో చిట్యాల శివారులోని మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాల్ నుంచి వెనుతిరిగి వెళ్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి కారు అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు ధ్వంసం చేయడంతో దుమారం చెలరేగింది. పోలీసులు వారిని చెదరగొట్టి మంత్రిని అక్కడి నుంచి పంపించి వేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకోకు దిగడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. రోడ్డుపైనే సుమారు గంటన్నర సేపు ఆందోళనకు దిగగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులకు వారికి నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. మంత్రులకు తప్పని ఓటమి.. మహబూబ్‌నగర్‌లో మంత్రి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి 18,738 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అదేవిధంగా వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తూడి మేఘారెడ్డి 25,320 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒక్కటి మినహా. అన్నింటా హస్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలకుగాను 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి జగదీ‹Ùరెడ్డి గెలుపొందారు. మిగతా నియోజకవర్గాలైన నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నకిరేకల్‌లో వేముల వీరేశం, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దేవరకొండలో నేనావత్ బాలునాయక్, నాగార్జునసాగర్ లో కుందూరు జయవీర్‌రెడ్డి, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి లో మందుల సామేల్, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి, ఆలేరులో బీర్ల అయిలయ్య, భువనగిరిలో అనిల్‌కుమార్‌రెడ్డి గెలుపొందారు. ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ ఆధిక్యం.. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10స్థానాల్లో బీఆర్ఎస్ గెలు పొందగా, రెండు స్థానాల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఈసారి అంతకుమించి 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే, ఒకే ఒక్క స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందింది. ప్రస్తుత విజయంతో కాంగ్రెస్ ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా తమ పట్టును సాధించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా తమ ప్రత్యర్థులైన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపైనే ఈ విజయాన్ని సాధించారు. ప్రతి అభ్యర్థికి భారీ మెజారిటీని ఇచ్చి ఓటర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వైపు నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు అధిక్యాన్ని కనబరచడం విశేషం. గిరిజన ఖిల్లాలో‘కమలం’ బోణీ! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఓటర్లు విభిన్న తీర్పు ఇచ్చారు. తొలిసారిగా ఈ ప్రాంతం నుంచి నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కొత్త రికార్డు సృష్టించారు. ఈ ప్రాంతం నుంచి కమలనాథులు శాసనసభకు ఎన్నికకావడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపూరావు బీజేపీ నుంచి గెలిచి సంచలనం సృష్టించారు. తాజాగా ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించి ఇక్కడి ఓటర్లు అనూహ్య తీర్పునిచ్చారు. బీఆర్ఎస్పై అదే దెబ్బ.. గిరిజనుల రిజర్వేషన్లు 6 నుంచి పది శాతం పెంచుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆదివాసీ, గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్(అటవీ భూమి హక్కు పత్రాలు) 48వేల మందికి లక్ష ఎకరాల అటవీ భూములపై హక్కులు కల్పించారు. కానీ ఇవేమీ బీఆర్ఎస్కు ఫలితం ఇవ్వలేకపోయాయి. ఆదివాసీ లంబాడా మధ్య వైరం, గిరిజనేతరులకు ఏజెన్సీ సమస్యలు బీఆర్ఎస్ను దెబ్బతీశాయి. మూడు ఎస్టీ స్థానాల్లో ఆసిఫాబాద్, బోథ్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులు కోవ లక్ష్మి అనిల్ జాదవ్ గెలుపొందగా, ఖానాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలిచారు. నిర్మల్ నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, మంచిర్యాలలో నడిపెల్లి దివాకర్‌రావు, సిర్పూర్లో కోనేరు కోనప్ప, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, చెన్నూరులో బాల్క సుమన్ ఘోర ఓటమి పాలయ్యారు. కేటీఆర్ స్నేహితుడైన భూక్యా జాన్సన్‌నాయక్ ఖానాపూర్‌లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు గెలుపొందారు. మొదటి నుంచి ఈ స్థానంలో త్రికోణ పోటీగా ఉంది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, సీనియర్ నాయకులు రమేశ్‌రాథోడ్, ఇటు జాన్సన్ నాయక్, వెడ్మ బొజ్జు బరిలో ఉండగా, చివరకు ఆదివాసీ నాయకుడికే పట్టం కట్టారు. ఇక్కడ 1984లో మాజీ మంత్రి కోటా్నక భీంరావు కాంగ్రెస్ నుంచి గెలవగా, మళ్లీ 40ఏళ్ళ తర్వాత ఓ ఆదివాసీకి విజయం వరించింది. ఓరుగల్లులో కాంగ్రెస్ హోరు సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మూడోసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓరుగల్లులో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 10 చోట్ల గెలిచి అనూహ్య ఫలితాలను రికార్డు చేయగా, బీఆర్ఎస్ రెండు స్థానాలకే పరిమితమైంది. రాజకీయ ఉద్దండులుగా పేరొందిన నాయకులు, వరుస విజయాలను నమోదు చేసిన నేతలు కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలయ్యారు. వరంగల్ పశ్చిమనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి, తూర్పులో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ, పరకాలలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వర్ధన్నపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్‌పై కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు విజయం సాధించారు. అదేవిధంగా భూపాలపల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు, ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతిపై కాంగ్రెస్ నుంచి ములుగు సీతక్క గెలుపొందారు. నర్సంపేటనుంచి బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి, పాలకుర్తిలో మంత్రి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్వినిరెడ్డి, మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్‌నాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మురళీనాయక్, డోర్నకల్‌లో రెడ్యానాయక్‌పై కాంగ్రెస్ అభ్యర్థి రాంచంద్రునాయక్ విజయం సాధించారు. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డిపై బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఇందిరపై బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపొందారు. విలక్షణం.. ఇందూరు తీర్పు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఇందూరు జిల్లా మరోసారి విలక్షణ తీర్పు తో తన ప్రత్యేకతను చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముఖా ముఖి పోరు జరగగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. దీంతో నిజామాబాద్ జిల్లాలోని ఉన్న 9 స్థానాలకు గాను కాంగ్రెస్ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ 2 చోట్ల విజయం సాధించాయి. సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీపడిన కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెయింట్ కిల్లర్ రేంజ్లో విజయం సాధించారు. నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్‌రెడ్డి విజయం సాధించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుతం భూపతిరెడ్డి 21,963 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్రావు ప్రస్తుతం 24,001 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మదన్మోహన్ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి కేవలం 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మినహా నిజామాబాద్ రూరల్ నుంచి విజయం సాధించిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి గెలుపొందిన మదన్మోహన్రావు, జుక్కల్ నుంచి గెలిచిన లక్ష్మీకాంతరావు సైతం శాసనసభలో తొలిసారి అడుగుపెట్టనున్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి కేవలం 3,062 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. 1999, 2004, 2009లో బోధన్ నుంచి గెలిచిన సుదర్శన్‌రెడ్డి వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో పనిచేశారు. 2014, 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌పై పోటీ చేసి ఓటమి చెందారు. ప్రస్తుతం షకీల్‌పై విజయం సాధించారు. పోచారం వరుసగా 5వ సారి, ప్రశాంత్‌రెడ్డి వరుసగా 3వ సారి విజయంబాన్సువాడ నుంచి బీఆర్ఎస్ తరపున గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో 8 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలుపొందగా, 2009, 2011(ఉప ఎన్నిక), 2014, 2018, 2023లలో వరుసగా 5 సార్లు విజయం సాధించడం గమనార్హం. స్పీకర్‌గా పనిచేసిన వారు తదుపరి ఎన్నికల్లో ఓటమి చెందుతారన్న సెంటిమెంట్‌ను పోచారం బ్రేక్ చేశారు. పోచారం 23,464 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇక బాల్కొండ నుంచి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 2014, 2018, 2023లో వరుసగా మూడుసార్లు గెలు పొందారు. ప్రశాంత్‌రెడ్డి కేవలం 4,533ఓట్లతో గెలుపొందారు. నిజామాబాద్ రూరల్ నుంచి ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ ప్రస్తు తం 21,963 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. -
బీఆర్ఎస్ కే ఎంఐఎం మద్దతు..
-
మలక్‌పేటలో మళ్లీ మజ్లిస్ ?
దిల్సుఖ్నగర్/చంచల్‌గూడ: ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాతంగా ముగిశాయి. మలక్‌పేట నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు రణరంగంలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యలో నెలకొంది. గత మూడు పర్యాయాల నుంచి ఎంఐఎం సిట్టింగ్ సీటు కావడంతో ఈసారి కూడా అభ్యర్థి అహ్మద్ బలాలా నాలుగోసారి విజయం నమోదు చేస్తానని గట్టి నమ్మకంతో ఉన్నాడు. మైనార్టీ ఓట్లు, అభివృద్ధి, హిందువుల ఓట్లపై నమ్మకం పెట్టుకున్న బలాలా మెజార్టీ పెంచుకోవడంపై దృష్టి సారించాడు. బీజేపీ అభ్యర్థి ప్రాంతానికి చెందిన పలు కుల సంఘాలు ఎంఐఎం అభ్యర్థికి మద్దతు పలకడం గమనర్హం. బీజేపీ మేకపోతు గాంభీర్యం... ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తుంది. కానీ ఆశించిన స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయామని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. గెలుస్తామనే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ రెండో స్థానం వచ్చినా పర్వాలేదని క్యాడర్ ఆశిస్తోంది. బీజేపీ సీటుకై ప్రస్తుత అభ్యరి్థతో పాటు సైదాబాద్ కార్పొరేటర్ భర్త కొత్తకాపు రవీందర్‌రెడ్డి సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి ఎన్నికల ప్రచారం సాధనాలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఆఖరి నిమిషంలో సీటు సంరెడ్డి సురేందర్‌రెడ్డిని వరించడంతో రవీందర్‌రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎన్నికల మెనేజ్మెంట్లో దిట్ట అయిన రవీందర్‌రెడ్డికి సీటు ఇస్తే ఎంఐఎం ఎమ్మెల్యే సీటుకు గురి పెట్టడం ఖా యమని బీజేపీ క్యాడర్లో గట్టిగా ఉండే. ఒక వేళ రవీందర్‌రెడ్డికి సీటు కేటాయిస్తే ఇబ్బంది కలగవచ్చని సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం తర్జనభర్జన పడ్డాడు. మలక్‌పేటలో చాలా మంది సీనియర్ నేతల తో పా టు ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఎవరికీ ఎన్నికల కీలక బాధ్యతలు అప్పగించకుండా అభ్యర్థి అన్నీ తానై వ్యవహరించడం తో బీజేపీ క్యాడర్ గందరగోళానికి గురైంది. మైనార్టీ ఓట్లు గెలిపిస్తాయని కాంగ్రెస్.. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే రియల్టర్ వ్యాపారి షేక్ అక్బర్ కూడా మైనార్టీ ఓట్లపై ఆశలు పెట్టుకున్నాడు. టీడీపీ పోటీలో లేకపోవడంతో ఆ పార్టీ ఓట్లతో పాటు కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో గట్టెకొచ్చని ధృడ నమ్మకంతో ఉన్నాడు. ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య స్నేహపూర్వక పోటీ ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి తనకు విజయం సాధించి పెడతాయని గులాబీ పార్టీ అభ్యర్థి తీగల అజిత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. డిసెంబర్ 3వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో వేసి చూద్దాం. -
కేసీఆర్ లక్ష్యం కేటీఆర్‌ను సీఎం చేయడమే!: అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం 1200 మంది బలిదానంతో ఏర్పడితే.. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి తప్ప మరేం చేయలేదని బీజేపీ అగ్రనేత అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మిగులు ఆదాయం ఉన్న ఈ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో దివాలా తీసింది. ఈ పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. లక్ష రుణమాఫీ చేయలేదు. నిరుద్యోగ భృతికి యువత నోచుకోలేదు. కేజీ టూ పీజీ ఉచిత విద్య గాలికి వదిలేశారు. ప్రతీ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి హామీ నెరవేరలేదు. గ్రానైట్ కుంభకోణంలో వందల కోట్ల అవినీతి జరిగింది. సెప్టెంబర్ 17 నిర్వహణపై మాట ఇచ్చి తప్పారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. తెలంగాణలో పేదలు, రైతులు, విద్యార్థులు నిరాశలో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని బలంగా అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం.. ఈ మూడు ఒక్కటే. ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారు.. ఎన్నికలయ్యాక కలిసిపోతారు. కాంగ్రెస్‌కు ఓటేసినా.. బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటేసినట్లే. బీజేపీ పాలనలో అవినీతి ఉండదు. గత తొమ్మిదేళ్లలో బీజేపీ నెరవేర్చిన హామీలను చూడండి. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. దేశంలో ఎక్కడా లేని విధంగా మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చాక ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం. బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తాం. విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తాం. డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం. మీ ఓటు మీ ఎమ్మెల్యేను ఎన్నుకోవడం కోసం మాత్రమే కాదు.. భారత దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని గుర్తించాలి అని తెలంగాణ ఓటర్లను అమిత్ షా కోరారు. హలాల్ బ్యాన్పై నిషేధం తీసుకోలేదు హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం విధించేందుకు కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో అమిత్ షా మాట్లాడుతూ.. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. కొల్లాపూర్‌లో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో బీజేపీ ప్రచార సభలో అమిత్ షా మాట్లాడుతూ.. వాల్మీకి బోయలను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిర్వాసితులకు పరిహారం, భూమి ఇస్తాం. మాదిగ రిజర్వేషన్ సమస్యకు పరిష్కారం చూపిస్తాం. బీజేపీ చెప్పిన ప్రకారం.. హమీలన్నీ నెరవేరుస్తాం. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్‌కు యువతపై ప్రేమ లేదు. ఆయన ప్రేమంతా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడంపైనే. కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపిస్తే.. వాళ్లు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే.. వాళ్లు రేపు బీఆర్ఎస్లోకే వెళ్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకేజీ కారకులపై చర్యలు తీసుకుంటాం. -
మజ్లిస్ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ
హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మజ్లిస్ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్ పారీ్టకి చారి్మనార్ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీజేపీ..ఇటూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్ పారీ్టకి ధీటుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీ ఎన్నికల బరిలో ఉండగా..బీజేపీ నుంచి మెఘారాణి, కాంగ్రెస్ పార్టీ నుంచి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ పోటీ చేస్తున్నారు. అన్ని డివిజన్లలో మజ్లిస్ కార్పొరేటర్లు.. ఈసారి చార్మినార్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు టికెట్ లభించ లేదు. ఆయన స్థానంలో మాజీ మేయర్ మీర్ జులీ్ఫకర్ అలీకి స్థానం దక్కింది. స్థానికంగా నివాసం ఉండడంతో పాటు గత అనుభవం దృష్ట్యా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చారి్మనార్ నియోజకవర్గంలోని ఘాన్సీబజార్, పత్తర్‌గట్టి, మొఘల్‌పురా, పురానాపూల్, శాలిబండ తదితర ఐదు డివిజన్లలో మజ్లిస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఓటర్లందరినీ సంబంధిత కార్పొరేటర్లు క్రమం తప్పకుండా కలుస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. ఘాన్సీబజార్ నుంచి .. నియోజకవర్గంలోని ఇరువర్గాల ఓటర్లను తమకు మద్దతుగా చేసుకోవడంలో బీజేపీ అభ్యర్థి మెఘారాణి అహరి్నషలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఘాన్సీబజార్ డివిజన్ అండగా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు కొనసాగుతున్నారు. డివిజన్లోని అన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడే విధంగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, ఇదే డివిజన్లో కొంత మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పురానాపూల్ డివిజన్లో సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన టీపీసీసీ కార్యదర్శి మహ్మద్ ముజీబుల్లా షరీఫ్ అన్ని స్థాయిల నాయకులను, కార్యకర్తలను పొగేసి తన గెలుపు కోసం ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలోని మత పెద్దలతో పాటు స్థానిక నాయకులను కలిసి వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ.. మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం ఉండడంతో చారి్మనార్‌లో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థితో స్థానికంగా కొంత మంది సీనియర్ నాయ కులు, కార్యకర్తలతో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఏకంగా అభ్యరి్థని మార్చాలంటూ సమావేశాలు నిర్వహించి పార్టీ అధిష్టానానికి ఫిర్యా దులు చేశారు. వీటన్నింటిని పక్కన పెట్టిన ఆయన పాదయాత్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. -
హిందువులు ఓటుబ్యాంకుగా మారాలి
నిర్మల్: రాష్ట్రంలో 12 శాతం మంది ఓట్లను బీఆర్ఎస్, ఎంఐఎం నమ్ముకున్నాయని, కాంగ్రెస్ మతపెద్దలను నమ్ముకుందని, ఇక హిందువులు ఓటు బ్యాంకుగా మారి సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో ముధోల్ నియోజకవర్గ అభ్యర్థి రామారావు పటేల్ తరఫున శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు బండి సంజయ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి జనం నవ్వుకుంటున్నారని, వాళ్ల మేనిఫెస్టో చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఇచ్చే హామీలకు విలువ లేదని కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ 1,400 మందిని బలితీసుకుందని, నాటి బీజేపీ నేత సుష్మాస్వరాజ్ పార్లమెంటులో పోరాడిన తర్వాతే అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని సంజయ్ గుర్తుచేశారు. భైంసాను మైసాగా మారుస్తాం.. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం భైంసాను మైసాగా మారుస్తామని, ముధోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామని బండి సంజయ్ తెలిపారు. నాందేడ్ నుంచి భైంసా–నిర్మల్ మీదుగా మంచిర్యాల వరకు రైల్వేలైన్ వేయిస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో భైంసాలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ముధోల్‌లో గత ఎన్నికల సభకు వచ్చిన కేసీఆర్ మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎన్నికల సభకే వచ్చారని, నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. భైంసాలో ఎంఐఎం గూండాలు చేసిన అరాచకాలు కళ్లముందు ఇంకా మెదులుతున్నాయని... అల్లర్ల బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలను దాచిపెట్టింది ఎవరని ప్రశ్నించారు. ముస్లిం సమాజం ఆలోచించాలి... ‘కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఓట్ల కోసమే మీ వద్దకు వస్తున్నారు. టోపీలు పెట్టుకొని నమాజ్ పేరుతో మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ముస్లిం సమాజం ఒక్కసారి ఆలోచించాలి. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో ఎక్కడా అల్లర్లు జరగలేదు. ఎక్కడా మతకలహాలు జరగలేదు’అని బండి సంజయ్ గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మితే మోసపోతారని హెచ్చరించారు. టవర్ సర్కిల్ వద్దకు రా... కరీంనగర్‌టౌన్: ‘ముస్లిం ఓట్ల కోసం సిగ్గులేకుండా టోపీ పెట్టుకుని మసీదుల్లోకి వెళ్లి నమాజ్ చేస్తున్న గంగుల, కేసీఆర్‌లు నిజమైన హిందువులైతే ఒవైసీ సోదరులను హనుమాన్ ఆలయానికి తీసుకొచ్చి చాలీసా చదివించే దమ్ముందా?’అంటూ బండి సంజయ్ మరోసారి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తనను అవినీతిపరుడినంటూ గంగుల చేసిన ఆరోపణలపైనా తీవ్రంగా స్పందించారు. ‘నేను ఎటువంటివాడనో కరీంనగర్ ప్రజలకు తెలుసు. నేను నోరు విప్పితే నువ్వు, కేసీఆర్ బిస్తర్ సర్దుకుని రాష్ట్రం విడిచిపోతారు జాగ్రత్త’అంటూ హెచ్చరించారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాష్ట్రానికి కేసీఆర్, కరీంనగర్‌కు గంగుల కమలాకర్ చేసిందేమీ లేదన్నారు. గంగుల.. కేసీఆర్‌ను ఒప్పించి కరీంనగర్‌కు ఎన్ని నిధులు తెచ్చారో సమాధానం చెప్పాలన్నారు. టవర్ సర్కిల్ వద్దకు రా.. స్మార్ట్‌సిటీ నిధులు ఎవరు ఇచ్చారో తేల్చుకుందాం’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగులకు టిక్కెట్ ఇవ్వకపోతే దారుస్సలాం వెళ్లి మోకరిల్లితే ఎంఐఎం సాయంతో టిక్కెట్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. -
గోషామహల్, జూబ్లీహిల్స్ పోటీపై ఎంఐఎం ఆంతర్యం ఏమిటి?
హైదరాబాద్: ముస్లిం గొంతును వినిపించే ఆల్ ఇండియా మజ్లిస్–ఏ– ఇత్తేహదుల్ ముస్లిమీన్‌న్ (ఏఐఎంఐఎం) పార్టీ ‘గోషామహల్ –జూబ్లీహిల్స్’ అసెంబ్లీ స్థానాలపై వ్యవహరిస్తున్న తీరు ముస్లిం సామాజిక వర్గంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పాతబస్తీ పరిధిలోకి వచ్చే గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి, కరడుగట్టిన హిందుత్వవాది రాజాసింగ్‌పై పోటీకి దిగకపోవడం, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి, భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్‌పై పోటీకి దింపడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ‘రెండింటి అపవాదు’ తలనొప్పిగా తయారై మజ్లిస్ ఆత్మరక్షణలో పడింది. ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ విమర్శలు, బీజేపీ సవాళ్లు ఎదురవతుండగా, సొంత పార్టీలో సైతం తీవ్ర అసంతృప్తి నివురుగప్పిన నిప్పుగా మారింది. గోషామహల్, జూబ్లీహిల్స్ స్థానాలపై మజ్లిస్ అధిష్టానం తీరును తప్పుబడుతూ ఆ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ రాజీనామా చేశారు. ఏకంగా మజ్లిస్ లక్ష్యం గోషామహల్లో రాజాసింగ్‌ను గెలిపించడమా? జూబ్లీహిల్స్‌లో అజహరుద్దీన్‌ను ఓడించడమా? అంటూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేయడం మరింత చర్చనీంశంగా మారంది. మజ్లిస్ పార్టీ అగ్ర నేతలు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిసూ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాల్లో మునిగిపోయారు. గోషామహల్పై ఆంతర్యమేమిటో? ఈసారి కూడా గోషామహల్ అసెంబ్లీ స్ధానంలో ఎంఐఎం పోటీకి దిగలేదు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 82 వేల మందికిపైనే ఓటర్లు ఉండగా, అందులో 79 వేల వరకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయినప్పటికీ ఎన్నికల బరిలో దిగకపోవడానికి ఆంత్యరేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్టుకోవడమే తమ లక్ష్యంగా పేర్కొనే మజ్లిస్ గోషామహల్ నియోజకవర్గంలో ఎందుకు అడ్డుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే ప్రశ్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేవనెత్తారు. గతంలో మహరాజ్ గంజ్‌లో ఉన్న నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా గోషామహల్‌గా రూపాంతరం చెందింది. ► 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, ఆ తర్వాత వరుసగా రెండు పర్యాయాలుగా బీజేపీ గెలుపొందింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి గోషామహల్ సెగ్మెంట్ వస్తున్నప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉంటుంది. రాజకీయ మిత్ర పక్షం కావడంతో గతంలో కాంగ్రెస్‌కు, ఆ తర్వాత బీఆర్ఎస్కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే.. ఇక్కడి నుంచి వరుసగా రెండు పర్యాయాలు బీజేపీ పక్షానా గెలుపొందిన రాజాసింగ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండయ్యారు. కానీ టికెట్ల ప్రకటనకు ముందు సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాజాసింగ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది. ► ఇస్లాంపై విషం చిమ్ముతున్న రాజాసింగ్‌ను ఓడిస్తామని మజ్లిస్ ప్రకటించింది. ఈ నియోజవర్గంలోని ఆరు డివిజన్లలో రెండింటికి మజ్లిస్ పాతినిధ్యం వహిస్తోంది. మిగతా డివిజన్లలో సైతం పట్టు ఉంది. దీంతో పోటీ చేసేందుకు మజ్లిస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు నేతలు ముందుకు వచ్చారు. కానీ.. బీఆర్ఎస్ అభ్యర్థికి సహకరించేందుకు మజ్లిస్ పోటీలో దిగకపోవడాన్ని పార్టీతో పాటు ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ► ముస్లిం సామాజిక వర్గం గర్వించ దగ్గ భారత క్రికెట్ దిగ్గజం అజహరుద్దీన్ ఓటమే లక్ష్యంగా మజ్లిస్ ఎన్నికల బరిలో దిగిందా? అనే ప్రశ్నకు సమాధానం అవుననే వస్తోంది. గతంలో జూబ్లీహిల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో దిగని మజ్లిస్ ఈసారి దిగడాన్ని ముస్లిం వర్గాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ► ఈ నియోజకవర్గంలో 1.20 లక్షల మందికి పైగా మైనారిటీ ఓటర్లు ఉన్నారు. గత రెండు పర్యాయాల క్రితం మజ్లిస్ పార్టీ పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. ఈసారి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై పోటీ దిగింది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థి, ముస్లిం సామాజిక వర్గానికి చెందిన అజహరుద్దీన్‌ను ఓడించేందుకు మజ్లిస్ ఎన్నికల బరిలో దిగడాన్ని మింగుడుపడని అంశంగా తయారైంది. దీంతో మజ్లిస్ తీరుతో ముస్లిం ఓటర్లు దూరమయ్యే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది. -
అగ్నిప్రమాదంపై ఫిరోజ్ ఖాన్ మాటల్లో..!
-
ఆ రెండింటిపై వ్యూహమేంటి?
హైదరాబాద్ అధికార పక్షం దోస్తీ కోసం పాతబస్తీకే పరిమితమై ఎన్నికల బరిలో దిగే మజ్లిస్ పార్టీ ఈసారి అదనంగా మరో రెండు స్థానాల్లో అభ్యర్థులను పోటీలోకి దింపడం వెనుక వ్యూహమేంటి? గెలుపు కోసమా? మిత్ర పక్షమైన బీఆర్ఎస్కు లాభం చేకూర్చేందుకా? అనే చర్చ సర్వత్రా సాగుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలైన జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో ఎన్నికల బరిలో దిగింది. జూబ్లీహిల్స్ స్థానానికి షేక్‌పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్, రాజేంద్రనగర్ స్థానానికి లంగర్‌హౌజ్ మాజీ కార్పొరేటర్ బి.రవియాదవ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేసింది. రెండు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన తర్వాత మజ్లిస్ వ్యూహంపై ముస్లిం మేధావి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్షాన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఎన్నికల బరిలో దిగారు. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. మజ్లిస్ అభ్యర్థి రంగంలోకి దింపిన కారణంగా మైనారిటీ ఓట్లు చీలిపోయే ప్రమాదం లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో పరోక్షంగా అధికార బీఆర్ఎస్ కాని బీజేపీ కాని లాభపడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. -
కారుకు...నో ఎంట్రీ
రాష్ట్ర సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసింది. ప్రస్తుతం ఐదో పర్యాయం భారత్ రాష్ట్ర సమితి పేరిట శాసనసభ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004, 2009 ఎన్నికల్లో ఇతర పార్టీలతో ఎన్నికల అవగాహన కుదుర్చుకుని పోటీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర అవతరణ నేపథ్యంలో 2014లోనూ ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది. ఇలా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చినా నేటికీ కొన్ని సెగ్మెంట్లలో మాత్రం పట్టు సాధించలేకపోతోంది. కొరకరాని కొయ్యలుగా మిగిలిన ఆ సెగ్మెంట్లపై ఇప్పుడు సీరియస్‌గా దృష్టి సారించిన బీఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా ఈసారైనా పాగా వేయాలని భావిస్తోంది. నేటికీ గెలుపు తీరాలకు చేరని నియోజకవర్గాలివే.. ఉమ్మడిఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, మధిర, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందలేదు. వీటితో పాటు హైదరాబాద్ పాతబస్తీలోని బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట, ఎల్బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పాగా వేయలేకపోయింది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత విపక్ష పార్టీలకు చెందిన అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా, ఇల్లందు, పినపాక, ఎల్బీనగర్, మహేశ్వరం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. వీరిలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మినహా మిగతా ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎన్నికలో బీఆర్ఎస్ నుంచే బరిలోకి దిగుతున్నారు. ♦ 2004లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంల కూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది. ♦ 2009లో టీడీపీ, సీపీఐలతో కూడిన మహాకూటమితో బీఆర్ఎస్ ఎన్నికల అవగాహన కుదుర్చుకుంది ♦ 2014, 2018లో రాష్ట్ర ఆవిర్భావం నేపథ్యంలో 119 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆయా చోట్ల ఇలా... 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 17 చోట్ల ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది. మరో 39 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు కేవలం ఒక్కసారే గెలుపొందగా, 37 నియోజకవర్గాల్లో రెండేసి పర్యాయాలు విజయం సాధించారు. మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు 26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుతీరాలకు చేరారు. 2001 నుంచి జరిగిన సాధారణ, ఉప ఎన్నికల గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్ అభ్యర్థులు సిద్దిపేటలో అత్యధికంగా ఎనిమిది పర్యాయాలు, హుజూరాబాద్‌లో ఆరు పర్యాయాలు, వరంగల్ పశ్చిమలో ఐదుసార్లు గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంతో దోస్తీ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 29 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో పాతబస్తీలో పరిమిత సీట్లలో పోటీ చేసినా 2014, 2018 ఎన్నికల్లో మాత్రం అన్ని సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే మజ్లిస్ పార్టీతో మిత్రబంధం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో బీఆర్ఎస్ స్నేహపూర్వక పోటీ పేరిట నామమాత్ర పోటీకి పరిమితమవుతోంది. అక్కడ ఈసారీ నామమాత్రపు పోటీనే? ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాలతో పాటు ఆ పార్టీ బలంగా ఉన్న మరో రెండు సీట్లు నాంపల్లి, గోషామహల్లో ఈసారి కూడా బీఆర్ఎస్ నామమాత్ర పోటీకీ పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సుమారు రెండున్నర నెలల క్రితమే హైదరాబాద్ పాత బస్తీలోని ఏడు స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినా, వారికి ఇప్పటికీ బీ ఫారాలు ఇవ్వలేదు. మరోవైపు నాంపల్లి, గోషామహల్ అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ నేటికీ ఖరారు చేయలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై చిక్కని పట్టు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా బీఆర్ఎస్కు పట్టు చిక్కడం లేదు. 2014లో కొత్తగూడెంలో మాత్రమే పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావు ఒక్కరే గెలుపొందారు. పాలేరుకు జరిగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరఫున తుమ్మల నాగేశ్వరరావు గెలవడంతో పార్టీ బలం రెండుకు చేరింది. ఆ తర్వాత చేరికల ద్వారా బలపడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గూటికి చేరుకున్నా 2018లో జరిగిన ఎన్నికల్లోనూ ఒక్క ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధ్యమైంది. చేరికల వ్యూహంతో మరోమారు కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని లోటును పూడ్చుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అయితే చేరికల వ్యూహం వికటించి ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు చెందిన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లితో పాటు ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్‌నగర్ నియోజకవర్గాల్లో చేరికల ద్వారా బలపడేందుకు అనుసరించిన వ్యూహం 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్కు సానుకూల ఫలితాన్ని ఇచ్చిందనే చెప్పాలి. -కల్వల మల్లికార్జున్‌రెడ్డి