ఇందూరు పీఠంపై వీడని ఉత్కంఠ..! | BJP And TRS Plans For Nizamabad Corporation | Sakshi
Sakshi News home page

28 స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ 

Published Sun, Jan 26 2020 10:55 AM | Last Updated on Sun, Jan 26 2020 10:59 AM

BJP And TRS Plans For Nizamabad Corporation - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్‌ స్థానం ఎవరికి దక్కుతుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పీఠం దక్కుతుందా.. లేక ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్‌ అధికారం కైవసం చేసుకుంటుందా? అన్న దానిపై ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బల్దియాల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించగా, నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఫలితాలు ఇందుకు భిన్నంగా వచ్చాయి. టీఆర్‌ఎస్‌ ఇక్కడ మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 60 డివిజన్లలో 28 స్థానాల్లో గెలుపొంది బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. టీఆర్‌ఎస్‌కు 13 స్థానాలు దక్కగా, ఎంఐఎం 16, కాంగ్రెస్‌ రెండు, స్వతంత్ర అభ్యర్థి మరో డివిజన్‌లో గెలుపొందారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో మేయర్‌ పీఠం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మద్దతిస్తే మాకేంటి..?
అయితే, టీఆర్‌ఎస్, ఎంఐఎం (13+16) కలిసి ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో మేయర్‌ పీఠాన్ని అధికార పార్టీ దక్కించుకోవాలని చూస్తోంది. తమకు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం మద్దతుతో మేయర్‌ స్థానాన్ని కైవసం చేసుకుంటామని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ శనివారం హైదరాబాద్‌లో ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు కార్పొరేటర్ల ప్రమాణం, 12:30 నుంచి మేయర్ ఎన్నిక ప్రక్రియ, తర్వాత డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభ కానుంది. దీంతో మేజిక్ ఫిగర్‌కు స్వల్ప ఓట్ల తేడాతో నిజామాబాద్‌ పీఠం ఉత్కంఠ రేపుతోంది.అయితే నిజామాబాద్‌లో మద్దతు ఇస్తే తమకు బోధన్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఎంఐఎం పట్టుపడుతోంది. దీనితో పాటు ఎంఐఎం నుంచి మరికొన్ని ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. (షెహర్‌ కా షేర్‌)

ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో.. 
జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య అదనపు బలంగా మారింది. అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి కూడా కార్పొరేషన్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కొనసాగే అవకాశం ఉంది. వీరికి తోడు జిల్లా ఎమ్మెల్సీలు వీజీ గౌడ్‌ (ఎమ్మెల్యే కోటా), ఆకుల లలిత (ఎమ్మెల్యే కోటా), రాజేశ్వర్‌రావు (గవర్నర్‌ కోటా) ఉన్నారు. ఎంఐఎం (16) సభ్యులకు తోడు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కలిపితే టీఆర్‌ఎస్‌ బలం 35కు చేరుతుంది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ స్థానాలను టీఆర్‌ఎస్‌ గానీ, ఎంఐఎం గానీ కైవసం చేసుకునే వీలుంటుంది. అయితే, మిత్రపక్షాల ఒప్పందంలో మేయర్‌ పదవి టీఆర్‌ఎస్‌కు దక్కుతుందా.. లేక ఎంఐఎంకు ఇస్తారా..? అన్న ఉత్కంఠ నెలకొంది. మేయర్‌ స్థానం ఎట్టిపరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌కే ఉంటుందని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పీఠం కోసం బీజేపీ యత్నాలు.. 
మరోవైపు, బీజేపీ కూడా మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవడంపై దృష్టి సారించింది. ఇండిపెండెంట్‌గా విజయం సాధించిన మరాఠి యమునా (బీజేపీ రెబల్‌), ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు కార్పొరేటర్లు బీజేపీతో జతకట్టిన పక్షంలో వీరి బలం 31 (28 +2+1)కు చేరుతుంది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఓటుతో బీజేపీ బలం 32కు చేరుతుంది. అయినా ఎంఐఎం, టీఆర్‌ఎస్, ఎక్స్‌అఫీషియో సభ్యుల కంటే తక్కువ ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే, ఎలాగైనా మేయర్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement