సాక్షి, నిజామాబాద్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిప్పులు చెరిగారు. మిషన్ భగీరథ స్కీమ్ విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్, కేటీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారని ఆయన విమర్శించారు. లక్ష్మణ్ ఆదివారమిక్కడ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..‘పేదలకు ప్రధాని ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. టీఆర్‌ఎస్ సర్కార్ పేదలకు ఇచ్చే అన్ని నిధులు దుర్వినియోగం చేసింది. నిజామాబాద్‌కు ఇచ్చిన అమృత్ పథకం, గ్రీన్ సిటీకి ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేశారు. గత ఆరేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. నిజామాబాద్‌లో రూ.800 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని చెప్తున్నా, ఎక్కడా అది కనిపించడం లేదు. జాతీయ రహదారుల నిర్మాణం కేంద్రం చేపట్టింది. లక్కంపల్లిలో ఫుడ్ ప్రొసెసింగ్ ఫ్లాంట్ ఏర్పాటు చేశాం. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో పీజీ సీట్లు పెంచాం.’ అని తెలిపారు.
ఎంఐఎంతో కలిసి టీఆర్‌ఎస్ కుట్రలు పన్నుతోందని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రెండు పార్టీలు అంతర్గత ఒప్పందం చేసుకున్నాయని అన్నారు. ఎన్నార్సీ బిల్లు ఏ భారతీయ ముస్లింలకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎంకు భారతీయుల మీద ప్రేమలేదని, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఎంఐఎం చేస్తున్న ఆందోళనలకు టీఆర్‌ఎస్ మద్దతు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. టీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీ అని, నిజామాబాద్ ఎమ్మెల్యే నిస్సహాయుడు, ఎంఐఎం చేతిలో కీలుబొమ్మ అంటూ విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment