Telangana Municipal Election 2020
-
ఓడించాడని చంపేశారు!
వేములవాడ: రాజకీయ కక్షలకు ఓ రౌడీ షీటర్ బలయ్యాడు. పట్టపగలు అందరూ చూస్తుండగానే వెంటాడి నడిరోడ్డుపై కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన సిరిసిల్ల జిల్లా వేములవాడలో బుధవారం చోటుచేసుకుంది. గత మున్సిపల్ ఎన్నికల్లో తమను ఓడించాడని కక్ష పెంచుకున్న ప్రత్యర్థులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో వేములవాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఐ సీహెచ్ శ్రీధర్ కథనం ప్రకారం.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన ముద్రకోల వెంకటేశ్ కౌన్సిలర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. స్థానికంగా వాటర్ ప్లాంటులో డ్రైవర్‌గా పని చేస్తున్న శివ తనకు మద్దతు ఇవ్వకుండా ప్రత్యర్థి గెలుపునకు సహకరించాడని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తన ఓటమికి కారణమైన అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించాడు. కక్షతో రగిలిపోతున్న వెంకటేశ్.. అదను చూసి దెబ్బ కొట్టాలని పథకం రచించాడు. ఈ నేపథ్యంలో ఉదయం బైక్‌పై వెళ్తున్న శివను తన సన్నిహితుడు శ్రీనివాస్‌తో కలసి వెంటాడారు. నడిరోడ్డుపై అటకాయించి కత్తులతో పొడిచి హత్య చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న శివను చూసిన స్థానికులు.. పోలీసులకు, 108కు సమాచారం అందించారు. వారు శివను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో శివ చికిత్స పొందుతూ చనిపోయాడు. కాగా శివపై మూడేళ్ల క్రితం రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు సీఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రకాంత్ పరిశీలించారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితులు ముద్రకోల వెంకటేశ్, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. కేసు దర్యాప్తులో ఉంది. -
ఓటు వేయలేదని.. కత్తి దించాడు!
-
వేములవాడలో భగ్గుమన్న రాజకీయ కక్షలు!
సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కోపంతో ముద్రకోల వెంకటేశ్ అనే మాజీ కౌన్సిలర్ శివ అనే యువకుడిపై కత్తితో దాడిచేశాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు..వేములవాడ మున్సిపాలిటీలోని 3వ వార్డు నుంచి వెంకటేశ్ టీఆర్ఎస్ తరపున పోటీచేశాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి దివ్య చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, తన ఓటమి కారణం శివే అని వెంకటేశ్ కక్ష పెంచుకున్నాడు. తనకు కాకుండా దివ్యకు ఓటు వేసిన శివను చంపుతానంటూ పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్‌తో అతనిపై కత్తితో దాడికి దిగాడు. నిందితుడు వెంకటేశ్, అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. -
కమలం ‘చెయ్యి’స్తే.. గులాబీ ముల్లు గుచ్చింది..!
సాక్షి, నల్గొండ : నల్గొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కమలనాథులు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. చైర్మన్ ఎన్నిక సమయంలో టీఆర్ఎస్తో చేసుకున్న లోపాయి కారి ఒప్పందం అమలుకాక పోగా.. బీజేపీ నవ్వులపాలైంది. అధికార పార్టీ వైస్ చైర్మన్ ఇవ్వకుండా బీజేపీకి మొండిచేయి చూపింది. దాంతో ముందుగా కాంగ్రెస్‌కు హ్యాండిచ్చిన కాషాయ నేతలకు ఇప్పుడు ‘గులాబీ’ నేతలు ముల్లు గుచ్చారు. నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా టీఆర్ఎస్కు చెందిన అబ్బగోని రమేష్ గౌడ్‌ను సభ్యులు సోమవారం ఎనుకున్నారు. టీఆర్ఎస్-బీజేపీ ఓ వైస్ చైర్మన్..! నల్గొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం ఇక్కడ 48 వార్డులుండగా కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరో 20 స్థానాల్లో గెలవగా, బీజేపీ 6 స్థానాలు, ఇండిపెండెంట్ ఒక స్థానం, ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందాయి. దీంతో ఛైర్మన్ పదవి దక్కించుకోవాలంటే బీజేపీ కీలకమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌కు చైర్మన్, బీజేపీకి వైస్ చైర్మన్ పదవి అని ఒప్పందం జరిగినట్టు తెలిసింది. అయితే, వైస్ చైర్మన్ పదవిని తామే ఇస్తామన్న టీఆర్ఎస్ బీజేపీని తమవైపునకు తిప్పుకోవడంలో సఫలం అయింది. టీఆర్ఎస్ హామీతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రోజున బీజేపీ తటస్థంగా వ్యవహరించింది. ఒక ఎంఐఎం, ఒక స్వతంత్ర కౌన్సిలర్ మద్దతుతో టీఆర్ఎస్ బలం బలం 22కు చేరగా.. ఎక్స్ అఫీషియో సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఓటుతో పాటు శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తేరా చిన్నపు రెడ్డి ఓట్లతో టీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. చివరికి వైఎస్ చైర్మన్ పదవిని కూడా అధికార పార్టీ దక్కించుకోవడంతో బీజేపీకి మొండి చేయ్యి మిగిలింది. వైస్ చైర్మన్ పదవికి సంబంధించి టీఆర్ఎస్ నేతలు పల్లారాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో సంప్రదింపులు జరిపినా వారు అంటీముట్టనట్లుగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. మొత్తంగా కాషాయ నేతల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాం.. మున్సిపల్ ఎన్నికల్లో తాము ఒంటరిగా వెళ్లామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నల్గొండలో బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే ఇక్కడికి కేసీఆర్ వస్తారని తెలిపారు. సెక్యులర్ పార్టీగా టీఆర్ఎస్ ఒక రాజకీయ విధానంతో ముందుకు వెళ్తోందని అన్నారు. నల్గొండలో మంచి పాలన చూపిస్తామని పేర్కొన్నారు. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అదనంగా ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదని తెలిపారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు అడ్రస్ లేకుండా పోయాయని ఎద్దేవా చేశారు. శంషాబాద్‌కు చెందిన టీడీపీ కౌన్సిలర్ గణేష్ గుప్తాతో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. తొలిస్థానంలో టీఆర్ఎస్ ఉంటే.. రెండో స్థానంలో టీఆర్ఎస్ ఇండిపెండెంట్లు ఉన్నారని తెలిపారు. 1200 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఫార్మ్ ఇస్తామన్న పోటీ చేసే అభ్యర్థులే లేరని అన్నారు. మొత్తం 120 మున్సిపాలిటీలు, పురపాలికల్లో విజయం సాధిస్తే అందులో ఎక్కువ శాతం బడుగు, బలహీనవర్గాలకే కేటాయించామని గుర్తుచేశారు. చైర్మన్, వైఎస్ చైర్మన్లలో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పొత్తుపై వీహెచ్ అసహనం వ్యక్తం చేశారని.. సిద్ధాంతాలకు విరుద్ధంగా ఆ రెండు పార్టీలు పొత్తుపెట్టుకున్నాయని కేటీఆర్ అన్నారు. గల్లీ ఎన్నికైనా.. ఢిల్లీ ఎన్నికైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిందని అన్నారు. అడ్డిమారిగుడ్డిదెబ్బలా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల్లో గెలిచిందని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ అన్యాయం జరిగిందని.. దమ్ముంటే బీజేపీ నేతలు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావాలని సవాలు విసిరారు. నీతిఆయోగ్ సిఫార్సు చేసిన కేంద్రం నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణ కొత్త పథకాలతో అభివృద్ధిలో ముందకు వెళ్తుందన్నారు. శంషాబాద్ వరకు మెట్రో రైలు పోడిగిస్తామని తెలిపారు. శంషాబాద్‌కు మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. -
ఒక్క పైసా అదనంగా ఇవ్వలేదు : కేటీఆర్
-
‘తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదు’
సాక్షి,న్యూఢిల్లీ : మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఎన్నికల అధికారులు, పోలీసులు టీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు నడుచుకున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు నిబంధనలకు విరుద్ధంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు వేశారని చెప్పారు. సాంకేతికంగా ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. తుక్కుగూడలో ఎంపీ కేశవరావు ఓటు చెల్లదని లక్ష్మణ్ అన్నారు. ఈమేరకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు ఆయన ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదును రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్టు లక్ష్మణ్ తెలిపారు. ఉప రాష్ట్రపతిని కలిసినవారిలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు,ఇంద్రసేనారెడ్డి ఉన్నారు. -
ఇక ఆ ఎన్నికలపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. దాదాపు ఏడాదికాలంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా ప్రజలను ఆకట్టుకునేందుకు అభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ పనులుపూర్తిచేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా మునిసిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు జీహెచ్ఎంసీ జోనల్‌కమిషనర్లు, తదితర ఉన్నతాధికారులతో శేరిలింగంపల్లి జోన్లో జీహెచ్ఎంసీ పనుల తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రజలకందే సేవలు పెరగాలని, అభివృద్ధి బాగా కనిపించాలని దిశానిర్దేశం చేశారు. ఫుట్‌పాత్‌లు, స్కైవేలు, బస్షెల్టర్లు, బస్ బేలు, జంక్షన్ల అభివృద్ధి పనులు, జీబ్రా క్రాసింగ్స్, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు,పార్కుల్లో పబ్లిక్ టాయ్లెట్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, శ్మశాన వాటికలు, రోడ్ల నిర్వహణ పనులు తదితరమైన వాటికి సంబంధించిన లక్ష్యాలు.. పురోగతి తదితరవివరాలను అధికారులనుఅడిగి తెలుసుకున్నారు. రోడ్ల పనుల వేగం పెరగాలి.. రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు ఇచ్చినప్పటికీ పనులు తగిన వేగంతో జరగడం లేవని అభిప్రాయపడ్డారు. చాలా స్లోగా ఉన్నాయని, ఈ పనుల వేగం పెరగాలని ఆదేశించారు. కొన్ని ఏజెన్సీలు ఇంకా బీటీ మిక్స్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోకపోవడం.. పనులు ప్రారంభించకపోవడాన్ని ప్రస్తావించారు. ఈపనుల వేగం పెరగాలని, ఎస్సార్డీపీ పనుల వేగం కూడా పెరగాలన్నారు. ఈ రెండు అంశాలపై శనివారం ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానన్నారు. మోడల్ మార్కెట్లను త్వరితంగా అందుబాటులోకి తేవాలన్నారు. అక్రమ నిర్మాణాలను త్వరితంగా కూల్చివేసేందుకు ఆధునిక ఉపకరణాలేమేమి ఉన్నాయి.. వాటి ధరలు.. పనితీరు..వాటిని జీహెచ్ఎంసీ సమకూర్చుకోవడానికి సంబంధించి చర్చించారు. గతంలో హైదరాబాద్ స్టాక్ ఎక్సే్ఛంజ్ భవనం కూల్చివేతకు వినియోగించిన యంత్రం ఈ సందర్భంగా ప్రస్తావనకొచ్చింది. అలాంటి ఒక యంత్రం అద్దెకు తీసుకుంటున్నట్లు, భారీ భవంతుల కూల్చివేతలకు దాన్ని వినియోగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎఫ్ఓబీల నిర్మాణంలో ఫుట్‌పాత్‌లకు భంగం కలుగకుండా స్థలం ఉంటే దాన్ని సేకరించాలని సూచించారు. తక్కువ స్థలంలో చిట్టడవుల పెంపకానికి ‘మియావాకి’ విధానాన్ని అనుసరించాలని సూచించారు. శేరిలింగంపల్లి జోన్లలో చేపట్టిన వివిధ పనులకు సంబంధించి జోనల్ కమిషనర్ హరిచందన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ప్లాస్టిక్ రీసైకిల్డ్ టైల్స్ ఫుట్‌పాత్‌లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు తదితరమైనవి బాగున్నాయని, మిగతా అన్ని జోన్లలోనూ వాటిని అమలు చేయాలని సూచించారు. ఖైరతాబాద్ జంక్షన్లో లైటింగ్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. వివిధ పనుల్లో నూతనత్వాన్ని, సృజనాత్మకంగా ఆలోచనలు చేయాలని సూచించారు. దుర్గంచెరువుపై ఏర్పాటు చేసే లైటింగ్ గురించి ప్రస్తావించారు. సమావేశంలో కమిషనర్ లోకేశ్‌కుమార్, జోనల్ కమిషనర్లు, సీసీపీ, సీఈలు తదితరులు పాల్గొన్నారు. -
మున్సి‘పల్టీలు’!
సాక్షి, మేడ్చల్ జిల్లా: గ్రేటర్ హైదరాబాద్ శివారు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గం కొంగొత్త ఆశలతో కొలువుదీరుతున్న వేళ..తమ సమస్యలకు మోక్షం లభించగలదని పట్టణ ప్రజలు ఆశిస్తున్నారు. మున్సిపల్ కొత్త చట్టం ఇందుకు మరింత దోహదం చేయగలదని వారు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా, గ్రేటర్ శివారులో ఏడు కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీల్లో పెరుగుతున్న కాలనీలు, జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించ లేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మెజార్టీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్య సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా మిషన్ భగీరథ పనుల నత్తనడకతో తాగునీరందడం లేదు. అండర్ డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. సామర్ధ్యం లేక పైప్లైన్ల లీకేజీలు, మరమ్మతులు లేక అధ్వాన్నంగా ప్రధాన అంతర్గత రోడ్లు, కబ్జాలకు గురైన చెరువులు, కుంటలకు తోడు, డంపింగ్ యార్డులతో విరజిమ్ముతున్న కాలుష్యం వెరసి భూగర్భ జలాలు విషపూరితంగా మారి జీవకోటికి సవాల్ విసురుతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పురపాలక సంఘాలకు మేయర్లుగా, చైర్మన్లు, చైర్పర్సన్లుగా పాలక వర్గాలు బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో ప్రధాన సమస్యలపై సాక్షి ఫోకస్... ♦ పీర్జాదిగూడ కార్పొరేషన్ఈ కార్పొరేషన్‌కు ఏటా రూ.40 కోట్ల ఆదాయం ఉంది. ♦ వర్షాకాలంలో శ్రీరామా ఆర్టీసీ కాలనీ, వినాయకనగర్, శ్రీపాద ఎన్క్లేవ్, గణేష్‌నగర్, విష్ణుపురి, శంంకర్నగర్, బండి గార్డెన్ తదితర ఏరియాల్లో వర్షాకాలంలో వరద సమస్య ఎదురవుతోంది. ♦ పర్వాతాపూర్, కార్పొరేషన్ కార్యాలయం వెనుక కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ♦ మేడిపల్లి సీపీఆర్ఐ నుంచి పర్వాతాపూర్ వరకు, వరంగల్ జాతీయ రహదారిలోని మైసమ్మ గుడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అంతర్గత రోడ్లన్నీ గుంతలతో నిండిఉన్నాయి. ♦ కాలుష్యం, పారిశుధ్య సమస్యలతో జనం రోగాలబారిన పడుతున్నారు. ♦ పీర్జాదిగూడలో 80 కాలనీల్లో 30 కాలనీలకు భగీరథ నీరు రావటం లేదు. నాలుగు రోజులు లేదా వారానికి ఒకసారి నల్లా నీరు సరఫరా అవుతున్నది. పీర్జాదిగూడలో 60 పార్కులకుగానూ 40 పార్కులు ఆక్రమణలకు గురయ్యాయి. బోడుప్పల్ .. ♦ ఈ కార్పొరేషన్‌కు ఏటా రూ.60 కోట్లు పన్నుల రూపేణా ఆదాయం ఉంది. ♦ చెంగిచర్ల వెంకటసాయినగర్, శ్రీసాయి రెసిడెన్సీ తదితర ప్రాంతాల్లో మురికి కాలువలు సరిగా లేక వర్షపు నీటితో వరద నీరు కలిసి రోడ్లన్నీ వరదమయంగా మారుతున్నాయి. ♦ 45 కాలనీల్లో మురికి కాలువలు, అంతర్గత రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయి. ♦ బోడుప్పల్‌లోని ‘రా’ చెరువు కాలుష్య కాసారంగా మారింది. వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్ పనుల జాప్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ♦ బోడుప్పల్లో 120 కాలనీలకుగానూ 40 కాలనీలకే మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. రెండవ దశ పనులు పూర్తి కాకపోవటం వల్ల వారానికి ఒక సారి నీరు సరఫరా చేస్తున్నారు. లక్ష్మీనగర్ హుడా కాలనీ, ఈస్ట్ బృందావనకాలనీ, అంబేద్కర్ చౌరస్తా, శ్రీనివాస కాలనీ, రాజశేఖర్ కాలనీల్లో, హనుమాన్‌నగర్, ఉదయ్‌నగర్‌లో పైప్లైన్లు పగిలి లీకేజీలవుతున్నాయి. ♦ 270 పార్కులకుగానూ, 150 పార్కులు ఆక్రమణకు గురయ్యాయి. జవహర్‌నగర్ .. ♦ ఈ కార్పొరేషన్లో దాదాపు రెండు లక్షల జనాభా, 40 వేలకు పైగా గృహాలు ఉన్నప్పటికీ పన్నుల ఆదాయం రూ.7 కోట్లు మాత్రమే వస్తోంది. ♦ జవహర్‌నగర్‌లో ప్రధానంగా డంపింగ్ యార్డు కాలుష్యం, దుర్గంధం, ప్రధాన, అంతర్గత రోడ్లు, మురుగు నీటి వ్యవస్థ, పారిశుధ్ద్య నిర్వహణ సరిగా లేదు. ఖాళీ స్థలాలు, ఇళ్ల క్రమబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. నిజాంపేట్ .. ♦ ప్రజల నుంచి ఏటా ఈ కార్పొరేషన్‌కు పన్నుల రూపంలో రూ.40 కోట్లు వస్తున్నా సమస్యలు తీరడం లేదు. ♦ నిజాంపేట్, ప్రగతి నగర్ మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఉంది. మిషన్ భగీరథ పనుల్లో జాప్యంతో నీటి ఇబ్బందులు తప్పటం లేదు. చెత్త డంపింగ్ యార్డును విస్తరింపజేసి, ఆధునీకరించాల్సి ఉంది. బండ్లగూడ .. ♦ బండ్లగూడకు ఏటా ప్రజల నుంచి వివిధ పన్నుల ద్వారా రూ.30 కోట్లు సమకూరుతున్నది. అనేక కాలనీల్లో తాగు నీటి సమస్య ఉంది. హైదర్‌గూడ పీఅండ్‌టీ కాలనీ మధ్య మూసీపై వంతెన నిర్మించాల్సి ఉంది. పీరం చెరువు కాలుష్యం, డంపింగ్ యార్డుతో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. బడంగ్పేట్ .. ♦ ఏటా ప్రజల నుంచి పన్నుల ద్వారా ముక్కు పిండి రూ.39 కోట్లు వసూలు చేస్తున్నారు. మురికి నీటి వ్యవస్థకు అవుట్ లేకపోవటంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ప్రధాన, అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. బస్తీలు, కాలనీల్లో నీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. మీర్పేట్ .. ♦ ఈ కార్పొరేషన్‌కు ఏటా పన్నుల ద్వారా రూ.24 కోట్ల ఆదాయం వస్తుండగా,....ప్రజలు మాత్రం తాగునీరు, తీవ్ర పారిశుధ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చెరువుల్లోకి నేరుగా మురికి నీరు కలిసి కాలుష్యంగా మారుతున్నాయి. ప్రధానంగా 60 కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మురికినీరు వ్యవస్థ బాగా లేకపోవటంతో రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది. 21 మున్సిపాలిటీల్లోనూ అంతే.. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని మేడ్చల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, నాగారం, దమ్మాయిగూడ, ఘట్కేసర్, పోచారం, దుండిగల్, పెద్దఅంబర్‌పేట్, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, మణికొండ, తుర్కుయాంజాల్, నార్సింగ్, ఆదిబట్ల, షాద్‌నగర్, ఆమనగల్లు తదితర మున్సిపాలిటీల్లో ఏటా లక్షలాది రూపాలు పన్నులను ప్రజల నుంచి ముక్కిపిండి వసూలు చేస్తున్న అధికారులు, పాలక వర్గం వారికి మౌలిక వసతులు కల్పించలేక పోతున్నది. నాగారం మున్సిపాలిటీలో ఏటా రూ.12 కోట్లు పన్నుల ద్వారా వస్తుండగా, చిన్న మున్సిపాలిటీలు అయిన తుక్కుగూడకు రూ.1.8 కోట్లు, పోచారానికి రూ.3 కోట్లు, గుండ్ల పోచంపల్లికి రూ.5 కోట్లు, మేడ్చల్‌కు రూ.2.3 కోట్ల ఆదాయం సమకూరుతున్నది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మున్సిపాలిటీల్లో ప్రజలు తాగునీరు, రోడ్లు, పారిశుద్ధ్యం, మురికి కాలువలు, డంపింగ్ యార్డు, చెరువుల, కుంటల కాలుష్యం, అక్రమ కట్టడాలు, పార్కులు, ప్రభుత్వ భూముల కబ్జా సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శశ్మాన వాటికలు, హరితహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంది. కొత్తగా బాధ్యతలు చేపడుతున్న పురపాలికలు ఈ ప్రధాన సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎన్నిక ఏదైనా మా ఓటు కారుకే అని నిరూపించారు
-
టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూర్యాపేట: తమ నాయకుడికి వైస్ చైర్మన్ పదవి దక్కలేదన్న బాధతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో సూర్యాపేట పట్టణం ఐదో వార్డు నుంచి స్థానిక టీఆర్ఎస్ నేత బాషా భాయ్ గెలుపొందారు. సూర్యాపేట మున్సిపాలిటీ టీఆర్ఎస్ వశం కావడంతో ఆయనకు వైస్ చైర్మన్ పదవి వస్తుందని భావించారు. అయితే, చివరి నిమిషంలో బాషాకు పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరుడైన యువకుడొకరు ఇంట్లోకి వెళ్లి ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటిచుకున్నాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. -
సునీల్ రావును వరించిన మేయర్ పీఠం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో ఎట్టకేలకు ఉత్కంఠ ముగిసింది. వెలమ సామాజిక వర్గానికి చెందిన యాదగిరి సునీల్‌రావుకు మేయర్ అధ్యక్ష పదవి దక్కింది. జనరల్ కేటగిరీలో రిజర్వు అయిన కరీంనగర్ మేయర్ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు కార్పొరేటర్లు ప్రయత్నించినప్పటికీ... సునీల్‌రావు, రాజేందర్రావు మధ్యనే చివరి వరకూ పోటీ నెలకొంది. అయితే అధిష్టానం సునీల్ రావు వైపే మొగ్గు చూపింది. (కరీంనగర్ పైనా గులాబీ జెండా) కాగా కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్ వంటి ముఖ్యమైన స్థానాలన్నీ బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల వారే ఉన్నారు. జిల్లాలో ఉన్నత వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. గతంలో ఎంపీగా ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ గత ఎన్నికల్లో ఓటమి చెందగా ప్రస్తుతం ఆయన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ మేయర్‌గా వెలమ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ 33 కార్పోరేషన్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. (ప్రముఖులకు షాకిచ్చిన మున్సిపల్ ఎన్నికలు..) సునీల్ రావుకే దక్కిన పీఠం కార్పొరేషన్ ఎన్నికల్లో 33వ డివిజన్ నుంచి పోటీ చేసిన యాదగిరి సునీల్‌రావు భారీ మెజా రిటీతో విజయం సాధించారు. ఆయన కరీంనగర్ కార్పొరేషన్ నుంచి కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా నాలుగుసార్లు విజయం సాధించారు. మంత్రి గంగుల కమలాకర్‌కు సమకాలీకుడైన సునీల్‌రావుకు ప్రణాళికాసంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్‌తో సాన్నిహిత్యం ఉంది. ఇక అదే సమయంలో మంత్రి గంగుల చిన్ననాటి స్నేహితుడైన వంగపల్లి రాజేందర్ రావు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి 56వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు. ఆయన పోటీ చేస్తున్నప్పటి నుంచే మేయర్ స్థానం రాజేందర్‌కే అనే ప్రచారం జరిగింది. గత అనుభవాల దృష్ట్యా మంత్రి గంగుల రాజేందర్రావుకే ప్రాధాన్యత ఇస్తారని పార్టీ నేతలు భావించారు. అయితే నిర్ణయాధికారం అధిష్టానం చేతుల్లోకి వెళ్లడంతో బుధవారం ఉదయం వరకు ఈ సస్పెన్స్ కొనసాగింది. ఆఖరికి పార్టీ అధినాయకత్వం సునీల్ రావు పేరును ఖరారు చేసింది. నేడు మేయర్ ఎన్నిక.. డిప్యూటీ మేయర్‌గా చల్లా స్వరూపరాణి కరీంనగర్ నగర పాలక మండలికి ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం బుధవారం మునిసిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగింది. ఉదయం 11 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మేయర్, డిప్యూటీ మేయర్లను లాంఛనంగా ఎన్నుకున్నారు. -
బీజేపీలో రచ్చ: ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీలో రచ్చ మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో ఈ పరిస్థితి నెలకొంది. తాజాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌పై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో పలువురు మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు కలిసి తిరుగుబావుటా ఎగురవేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టిక్కెట్లను అమ్ముకున్నారని ప్రధాన ఆరోపణ. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో 49 వార్డులు ఉండగా బీజేపీ 11 వార్డుల్లో మాత్రమే గెలుపొందింది. అయితే ఆదిలాబాద్‌లో మెజార్టీ స్థానాలు గెలుపొందే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ జిల్లా నాయకులు టీఆర్ఎస్తో కుమ్ముక్కై పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారన్నది ఆరోపణ. అంతకు ముందు జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా కోర్ కమిటీలో నిర్ణయం లేకుండానే టికెట్ల పంపిణీ జరిగిందని అంటున్నారు. పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే జిల్లా, మండల కమిటీ నాయకులు ముందుకు వచ్చామని పార్టీలోని కొందరు చెబుతుండగా, పాయల శంకర్ అధ్యక్షతనే జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వచ్చాయని, మున్సిపల్ ఎన్నికల్లో ఆదిలాబాద్‌లో 11 వార్డుల్లో కౌన్సిలర్లు గెలుపొందారని, అలాంటప్పుడు ఆరోపణలు అసమంజసమని పార్టీకి చెందిన మరికొంత మంది నేతలు జిల్లా అధ్యక్షుడికి వంత పాడుతున్నారు. అంతేకాకుండా త్వరలో జిల్లా అధ్యక్ష ఎన్నికలు ఉండడంతోనే వ్యూహాత్మకంగా ఇలాంటి ఆరోపణలు గుప్పిస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి మరి. ఒక్కరి చేతిలో పార్టీ నిర్ణయాలు జరుగుతున్నాయి జిల్లా పార్టీలో ఒక్కడి చేతిలో నిర్ణయాలు జరుగుతున్నాయి. కోర్ కమిటీ కూర్చోకుండానే బీ–ఫామ్‌ల కేటాయింపు జరుగుతోంది. ఏకపక్షంగా అందజేస్తున్నారు. ఏక వ్యక్తి పాలన.. పార్టీ ఆఫీసు నామమాత్రం.. సమష్టి నిర్ణయాలు లేవు. రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడి వ్యవహారంపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టీపట్టనట్లు వ్యవహారిస్తున్నారని, రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యనేత అండదండలతోనే జిల్లా నాయకుడు పార్టీ అంటే నేనే అనే విధంగా వ్యవహరిస్తున్నారని జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్‌పై పార్టీ సీనియర్ నేత, జెడ్పీమాజీ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మీడియా సమావేశంలో ఆరోపణలు చేశారు. నాకు అర్థం కావడం లేదు నాపై ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. దీనిపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. ఆదిలాబాద్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నాగురించి తెలుసు. – పాయల శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
‘తెలంగాణకు టీఆర్ఎస్ శ్రీరామరక్ష’
సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ముందు ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు గగ్గోలు పెట్టినా.. ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. దేశ చరిత్రలో ఇంతటి ఘనవిజయం ఏ పార్టీకి రాలేదని, ఇతంటి అద్భుత విజయాన్ని అందించిన ప్రజలకు తమ పార్టీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. చైర్మన్, మేయర్ల ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిందన్నారు. ప్రతిపక్షాలు జీవితంలో ఏ ఒక్క వర్గానికి అవకాశం ఇవ్వకపోగా, అనవసర ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. పార్టీలను, ప్రభుత్వం తిట్టడం వల్ల ఓట్లు పడవని, అభివృద్ధి పనులు చేస్తేనే అధికారంలోకి వస్తారని హితవు పలికారు. ప్రతి పక్షాలు ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీచరాజకీయాలు చేయడం ఆపేయాలని సూచించారు. తెలంగాణ ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడు టీఆర్ఎస్ను ఎదుర్కొనే సత్తా లేక జాతీయ పార్టీ లైన కాంగ్రెస్, బీజేపీ మున్సిపల్ ఎన్నికల్లో అపవిత్ర అవగాహన కుదుర్చుకున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటూ ప్రాంతీయ పార్టీని ఎదుర్కొలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్ల కోసమే కులాల మధ్య చిచ్చు పెట్టి.. ఎన్నికల తర్వాత పత్తాలేకుండా పోయారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఇకనైనా ఇలాంటి నీచ రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేయడం మానేసి ప్రజల పక్షాన పోరాడాలని హితవు పలికారు. సీఎం కేసీఆర్ పూలే వారసుడని, అన్ని వర్గాల ప్రజలను ఆయన న్యాయం చేస్తున్నారని ప్రశంసించారు. ఇలాంటి నాయకుడు దేశానికి కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. -
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
-
దేవుడున్నాడు.. నిన్ను వదలడు: కోమటిరెడ్డి
సాక్షి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. సమావేశానికి కావాల్సిన సరైన కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌కు చెందిన 20 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరవ్వగా. టీఆర్ఎస్, బీజేపీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు సమావేశానికి దూరంగా ఉన్నారు. ఈ విషయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ప్రకటన ముందే జిల్లా మంత్రులను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. దోచుకున్న డబ్బుతో మంత్రులు ఎమ్మెల్యేలు..ఇతర పార్టీలను భయభ్రాంతులకు గురిచేశారని, ఇవి నిజాయితీగా జరిగిన ఎన్నికలు కావని విమర్శించారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో యాదగిరిగుట్టను కాంగ్రెస్ కైవసం చేసుకుందని తెలిపారు. ఆదిభట్లలో తమకు మోజారిటీ వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్‌ను తీసుకుపోయి టీఆర్ఎస్ నుంచి ఛైర్మన్ పదవి ఇచ్చారని మండిపడ్డారు. (వీడిన సస్పెన్స్: నేరేడుచర్ల టీఆర్ఎస్దే) పెద్ద అంబర్‌పేటలో తమ కౌన్సిలర్లను చౌటుప్పల్‌లో ఎత్తుకు పోయారని ఆరోపించారు. గత 25 ఏళ్లలో ఇంత దరిద్రమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అన్నారు. రజకార్లకంటే దారుణంగా పోలీసులు వ్యవహరించారని, కేటీఆర్ సిరిసిల్లలో రెబల్స్ పోటీ చేస్తే వారిని సస్పెండ్ చేస్తానని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. నల్లగొండలో టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్లో చేరిన ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేటకు చెందిన తమ కౌన్సిలర్లపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళ్లే రోజు వస్తుందని. వీరు చేసిన స్కాంలపై ఆధారాలతో ఈడీకీ, విజులెన్స్‌కు ఇస్తానని హెచ్చరించారు. గజ్వేల్లోమునిసిపల్ ఛైర్మెన్ గా 74 ఏళ్ల నారాయణ రెడ్డిని చేస్తానని చెప్పి మోసం చేశారని అన్నారు. చదవండి : ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ దోపిడిని పార్లమెంటులో ఎండగడుతా. నా నియోజకవర్గం పరిదిలో 9 మున్సిపాలిటీ క్లియర్ మోజార్టీ వచ్చింది. కాని రెండే మాకు దక్కాయి. రెండు మూడు రోజుల్లో విద్యుత్తు చార్జీలు పెంచుతారు. చిన్న చిన్న గ్రామాలను మున్సిపాలిటీలు చేసారు. వాటిల్లో పన్నులు పెంచుతారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్ కేటీఆర్‌లకే మాత్రమే. ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. నాకు పీసీసీ పదవిస్తే చేస్తా. లేకుంటే కార్యకర్త గా పనిచేస్తా. కేటీఆర్ సిగ్గుందా. నీది నోరా తాటిమట్టానా. గతంలో మా ఎమ్మెల్యేలను తీసుకుంటే నీ బిడ్డ ఓడిపోయింది. పైన దేవుడున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో చేసింది వదిలిపెట్టడు. కేసీఆర్ కేటీఆర్‌లు సిగ్గు లేకుండా పనిచేస్తున్నారు. మిమ్మల్ని వదిలి పెట్టం..గ్రామ గ్రామాన తిరుగుతాం. మిమ్మల్ని ఎండ గడుతాం.’’ అంటూ ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే -
నా తాయెత్తు వల్లే ఎమ్మెల్యే గెలిచాడు
సాక్షి, హుజూర్నగర్: ‘ నేను ఇచ్చిన తాయత్తు కట్టుకుంటే కౌన్సిలర్ అవుతావ్. హుజూర్నగర్ ఎమ్మెల్యే కూడా నా తాయత్తు వల్లనే గెలిచాడు’ అంటూ ఓ స్వామిజీ స్థానిక టీఆర్ఎస్ అభ్యర్థితో జరిపిన మంతనాల ఆడియోటేపు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. హుజూర్నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలువడానికి తన తాయెత్తే కారణమని సదరు స్వామిజీ చెప్పడం గమనార్హం. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి బెల్లి సత్తయ్య ఎన్నికల్లో తన గెలుపు కోసం ఓ స్వామిజీని ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన స్వామిజీతో మాట్లాడిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సత్తయ్య ప్రత్యర్ధులైన కాంగ్రెస్ అభ్యర్ధి ఇబ్రహీం, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి ఏర్పుల పరమేశ్‌లను కట్టడి చేయడానికి ఒక తాయత్తు ఇస్తానని, ఆ తాయెత్తు ఉంటే గెలుపు తథ్యమని సదరు స్వామిజీ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గెలవడానికి తాను తాయత్తు ఇచ్చానని, ఇప్పటికీ ఆ తాయెత్తు ఆయన వద్ద ఉందని చెప్పారు. తన తాయెత్తుతో గెలిచిన తర్వాత తను అడిగింది ఇవ్వాలని షరతు పెట్టారు. సోషల్ మీడియాలో వైరలైన ఈ ఆడియోటేపుపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ యుగంలోనూ ఈ మూఢనమ్మకాలేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాటిని నమ్మే నేతులు ప్రజలకు ఏమి మేలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ ఆడియోటేపులో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడం.. ఆయన మెడలో తాయెత్తు ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
కారుకే నేరేడుచర్ల..
సాక్షి, సూర్యాపేట : తీవ్ర ఉత్కంఠ నడుమ సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీంతో చెర్మన్‌గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్‌గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. టీఆర్ఎస్కు ఎక్స్అఫీషియో సభ్యులతో 11 ఓట్ల బలం ఉంటే.. కాంగ్రెస్‌కు 10 ఓట్లు ఉండటంతో మెజార్టీ సభ్యులు ఉన్న టీఆర్ఎస్కే నేరేడుచర్ల సొంతమైంది. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని ఎక్స్ అఫీషియో ఓటుగా చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని వాకౌట్ చేసింది. కోరం ఉండటంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తంతు పూర్తి చేశారు. సుభాష్‌రెడ్డి ఓటుతో చైర్మన్ గిరి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో కాంగ్రెస్‌కు చెందిన కేవీపీ రామచందర్‌రావు ఓటుపై టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. ఆ తర్వాత మంగళవారం ఎన్నిక ఉంటుం దని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో టీఆర్ ఎస్ మరో ఎక్స్ అఫీషియో ఓటును పెట్టుకుని మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలన్న ఎత్తు ఫలించింది. ఎన్నిక వాయిదాకు ముందు కేవీపీ ఓటుతో కాంగ్రెస్‌కు 10 ఓట్లు, టీఆర్ఎస్కు 10 ఓట్లు ఉన్నాయి. దీంతో టాస్ వేస్తే ఎవరికి విజయం దక్కుతుందోనని భావించిన టీఆర్ఎస్.. తిరస్కరించిన కేవీపీ ఓటును మళ్లీ ఎలా జాబితా లో పెడతారని వేసిన పాచికతో ఎన్నిక వాయిదా పడింది. ఈ క్రమంలో ఇరుపార్టీలకు సమానంగా ఓట్లు ఉండటంతో శేరి సుభాష్‌రెడ్డి ఓటును నేరేడుచర్ల మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నమోదు చేయించింది. దీంతో ఆ పార్టీ సభ్యుల బలం 11కు చేరింది. సుభాష్‌రెడ్డి పేరును ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎన్నిక ప్రారంభానికి ముందు చేర్చారు. తొలి జాబితాతోనే ఎన్నిక చేపట్టాలి ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ అధికారి ప్రారం భిస్తూ ఓటు హక్కు జాబితాలో ఉన్న వారి పేర్లను సమావేశంలో వెల్లడించారు. దీంతో సుభాష్‌రెడ్డికి ఇప్పుడెలా ఓటు హక్కు కల్పిస్తారని ఉత్తమ్‌తో పాటు ఆ పార్టీ సభ్యులు పీఓను ప్రశ్నించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీ షియో సభ్యుడిగా ఓటు హక్కు పొందిన తొలి జాబితాతోనే చైర్మన్ ఎన్నిక చేపట్టాలని, ఆ తర్వాత నమోదు చేసిన సుభాష్‌రెడ్డి పేరును జాబితాలో నుంచి తీసివేయాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభమయ్యే ముందు వరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, అందకే సుభాష్‌రెడ్డి పేరును ఓటు జాబితాలో చేర్చామని పీవో వివరించారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈసీ ఆదేశాలనే తాము అనుసరిస్తామని పీఓ చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. కాంగ్రెస్ రాస్తారోకో శేరి సుభాష్‌రెడ్డికి ఓటు హక్కు కల్పించడాన్ని నిరసిస్తూ ఎంపీలు ఉత్తమ్, కేవీపీలు నేరేడుచర్లలో రాస్తారోకో చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికైన∙మెజార్టీ సభ్యులు బయట ఉన్నా.. ఎన్నిక కాని వారితో చైర్మన్ ఎన్నికను పూర్తిచేశారని విమర్శించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 12 గంటలలోపు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటుహక్కు నమోదు చేసుకున్న వారికే చైర్మన్ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుందన్నారు. ఇదే విషయాన్ని తనకు పురపాలక శాఖ డైరెక్టర్ శ్రీదేవి, ఈసీ చెప్పారన్నారు. ఈ ఎన్నికపై న్యాయ పోరాటం చేస్తామని ఉత్తమ్ తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ దోచుకున్న సొమ్మునంతా మున్సిపల్ ఎన్నికల్లో పంచారని ఆరోపించారు. -
దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా..
సాక్షి, హుస్నాబాద్: హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని మొట్ట మొదటిసారిగా బీసీ మహిళనే వరించింది. అందరి అంచనాలను తలకిందులయ్యాయి. మొదటి నుంచి చైర్ పర్సన్ మహిళకే దక్కుతుంది అనుకున్నప్పటికీ జనరల్ మహిళా స్థానంలో బీసీ మహిళకు కట్టబెట్టారు. వైస్ చైర్ పర్సన్ పదవిని పురుషుడికి అప్పగిస్తారని భావిస్తే అన్యూహంగా వైస్ చైర్ పర్సన్ పదవిని సైతం మహిళకు అప్పగించడం హుస్నాబాద్ చరిత్రలో ఇదే మొదటిసారి. దీంతో దాదాపు 30ఏళ్ల తర్వాత అతివలు పాలించే అవకాశం దక్కింది. 20 మంది వార్డు మెంబర్లకు ఇందులో 11 మంది మహిళలే కావడం, అందులో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులు మహిళలనే వరించడంతో మున్సిపల్లో మహిళా సాధికారత వెళ్లివిరియనుంది. మున్సిపల్ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. ఇక ముందుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, కాంగ్రెస్‌కు చెందిన 6 మంది, బీజేపీకి చెందిన ఇద్దరు సభ్యులు, ఇండిపెంటెండెంట్కు చెందిన ముగ్గురు సభ్యులచే ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియను ఆర్డీఓ ప్రారంభించారు. ఇంతలోనే బీజేపీ సభ్యులు దొడ్డి శ్రీనివాస్, మ్యాదరబోయిన వేణులు తమకు పూర్తి స్థాయి సంఖ్యా బలం లేదని, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ ఎన్నిక సమావేశాన్ని బహిష్కరించారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత... మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలో భాగంగా కోరం ఉన్నందున ఎన్నికల ప్రక్రియను ఆర్డీఓ జయచంద్రారెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ నుంచి చైర్ పర్సన్ అభ్యర్థిగా ఆకుల రజిత, కాంగ్రెస్ నుంచి చిత్తారి పద్మకు భీపాంలు అందటంతో ఆల్ఫా బెటికల్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీకి బలం నిరూపించుకునేందుకు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ అభ్యర్థిగా చిత్తారి పద్మను కాంగ్రెస్ సభ్యుడు మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ చైర్ పర్సన్‌గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించగా, మరో సభ్యుడు పెరుక భాగ్యరెడ్డి బలపరిచాడు. అలాగే ఇండిపెంటెండెంట్ చైర్పర్సన్ అభ్యర్థిగా జనగామ రత్నను కాంగ్రెస్ సభ్యురాలు పున్న లావణ్య ప్రతిపాదించగా, భూక్య స్వరూప బలపర్చారు. కాంగ్రెస్ అభ్యర్థి, ఇండిపెండెంట్ అభ్యర్థి చైర్ పర్సన్లుగా కాంగ్రెస్ సభ్యులే ప్రతిపాదించి బలపర్చగా, మొదటగా ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మనే పరిగణనలోకి తీసుకుంటామని ఆర్డీఓ స్ఫష్టం చేశారు. అనంతరం ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజితకు మద్దతుగా టీఆర్ఎస్కు చెందిన 9 మంది, ఇండిపెంటెండెంట్లు ఇద్దరు, ఎక్స్ అఫియోసభ్యుడు ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌లు మొత్తం 12 సభ్యులు చేతులు లేపి మద్దతు తెలిపారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మకు కాంగ్రెస్‌కు చెందిన 6గురు, ఇండిపెంటెండెంట్ అభ్యర్థి జనగామ రత్నలు చేతులెత్తి మద్దతు పలికారు. దీంతో రజితకు 12 మంది మద్దతు పలుకగా, పద్మకు 7గురు మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికల అధికారి ఆర్డీఓ అత్యధిక సభ్యులు రజితకు మద్దతు తెలుపడంతో మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత ఎన్నికైనట్లు ప్రకటించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా అయిలేని అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ముందుగా పార్టీని ఆహ్వానించగా, వైస్ చైర్మన్ అయిలేని అనితను టీఆర్ఎస్ సభ్యురాలు కొంకట నళినీదేవి ప్రతిపాధించగా, బొజ్జహరీశ్ బలపర్చారు. అలాగే కాంగ్రెస్ నుంచి చైర్ పర్సన్‌గా కోమటి స్వర్ణలతను మ్యాదరబోయిన శ్రీనివాస్ ప్రతిపాధించగా, వల్లపు రాజయ్య బలపరిచారు. అనంతరం ఎన్నిక నిర్వహించగా, టీఆర్ఎస్కు చెందిన అయిలేని అనితకు 9 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు ఇండిపెంటెండెంట్ సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిషియో సభ్యుడు మొత్తం 12 మంది సభ్యులు చేతులేత్తి మద్దతు పలికారు. కోమటి స్వర్ణలతకు కాంగ్రెస్ 6గురు సభ్యులు, ఇండిపెంటెండెంట్ ఒకరు చేతుతెత్తి మద్దతు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి అయిలేని అనితకు 12 మంది, కాంగ్రెస్ అభ్యర్థి కోమటి స్వర్ణలతకు 7గురు మద్దతు తెలిపారు. అత్యధికంగా సభ్యులు మద్దతు ఉన్న అనిత మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటించారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత, వైస్ చైర్‌పర్సన్‌గా అయిలేని అనితలచే ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. వాల సుప్రజా నవీన్‌రావును అభినందిస్తున్న ఎమ్మెల్యే సతీశ్‌బాబు అత్యధిక మెజార్టీ సాధించిన వాల సుప్రజ.. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు సత్తా చాటారు. ఇక మున్సిపాలిటీలోని 20వ వార్డు అభ్యర్థినిగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వాల సుప్రజా నవీన్‌రావు భారీ మెజార్టీ సాధించారు. ప్రత్యర్థి అభ్యర్థిపై ఏకంగా 84.5 శాతం మెజార్టీ సాధించి సిద్దిపేట జిల్లాలోనే అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థినిగా నిలిచారు. టీఆర్ఎస్ చైర్ పర్సన్‌గా అభ్యర్థిగా ఆకుల రజితను టీఆర్ఎస్ సభ్యురాలు వాల సుప్రజ ప్రతిపాదించారు. -
ఆ స్థానాల్లో ఫలించిన టీఆర్ఎస్ వ్యూహాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన క్షణం నుంచే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికలు జరిగిన 17 మున్సిపాలిటీల్లో కేవలం 8 స్థానాల్లోనే స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ మిగతా పీఠాలను సైతం కైవసం చేసుకునేలా వ్యూహాలు రచించింది. ఈ క్రమంలో మెజార్టీ సాధించని భూత్పూర్, కోస్గి, నారాయణపేట, అమరచింత, కల్వకుర్తి, కొల్లాపూర్, అయిజ పురపాలికలపై జెండా ఎగరవేసింది. గులాబీ పార్టీ ఎత్తుగడలతో గెలుపునకు ఆస్కారమున్న భూత్పూర్, నారాయణపేట పీఠాలను బీజేపీ పోగొట్టుకుంది. ఉమ్మడి జిల్లాలో కేవలం మక్తల్‌లో మాత్రమే కాషాయం జెండా ఎగిరింది. ఇటు నిన్నటి వరకు కోస్గి పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే పూర్తి ధీమాతో ఉన్న ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలింది. రెండ్రోజుల్లో చోటు చేసుకున్న పరిణామాలతో కోస్గి పీఠం ‘చే’జారింది. వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్ఎస్ అనూహ్యంగా పాగా వేసింది. చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు తమకున్న సభ్యుల బలగాన్ని రహస్య శిబిరాలకు తరలించి సోమవారం నేరుగా ఆయా మున్సిపాలిటీలకు తరలించారు. ముందుగా గెలిచిన అభ్యర్థులు కౌన్సిలర్లుగా ప్రమాణాస్వీకారం చేయగా.. తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్లను ఎనుకున్నారు. కొల్లాపూర్‌లో ‘గులాబీ’ని గెలిపించారు.. రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్ ‘పుర’పోరు కథ సుఖాంతమైంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వర్గీయులు 9 మంది గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున బరిలో దిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు. దీంతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పుర పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తమ ఎక్స్అఫీషియో ఓట్లతో ఆ పుర పీఠంపై గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి కొల్లాపూర్‌కు చేరుకున్నారు. ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలుపొందిన కౌన్సిలర్లు అనూహ్యంగా సమావేశ గది బయటికి వెళ్లిపోయారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఎక్స్అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ కొల్లాపూర్ పురంపై గులాబీ జెండా ఎగిరింది. మక్తల్‌లో రభస.. మక్తల్‌లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ల ఎంపిక ప్రక్రియలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరుకుంది. పట్టణంలో మొత్తం 16 వార్డులు ఉంటే.. టీఆర్ఎస్ 5, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ రెండు, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు గెలిచారు. పుర పీఠంపై పాగాకు వ్యూహం రచించిన బీజేపీ.. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరిని జత కలుపుకుంది. ఎన్నిక సమయంలో బీజేపీకి అనుకూలంగా ఓటేస్తే.. వైస్ చైర్పర్సన్ పదవి ఇస్తామని హామీ ఇస్తామని నమ్మించినట్లు కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా చైర్పర్సన్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి పావనికి అనుకూలంగా అందరూ చెయ్యి ఎత్తారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల వైస్చైర్పర్సన్కు బీజేపీ అభ్యర్థులు సహకరించకపోగా.. తమ పార్టీకి చెందిన అఖిలను వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. బీజేపీ నేతల తీరుపై కాంగ్రెస్ కౌన్సిలర్లు మండిపడ్డారు. తమను నమ్మించి మోసం చేశారని బీజేపీ నాయకత్వంపై ఆక్రోశం వ్యక్తం చేశారు. ► కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో స్థానిక ఎమెల్యే జైపాల్‌యాదవ్‌కు ముఖ్య అనుచరుడిగా ఉన్న షానవాజ్ ఖాన్‌కు వైస్ చైర్మన్ పదవి వరిస్తుందని అందరూ భావించారు. కానీ చైర్మన్‌గా ఎడ్మ సత్యం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత పాలకవర్గంలో వైస్ చైర్మన్‌గా పని చేసి.. ఈ సారి మరోసారి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి అనుచరుడు షాహీద్ పేరు తెరపైకి వచ్చింది. గెలిచిన అభ్యర్థులందరూ షాహీద్ వైపే మొగ్గుచూపడంతో అతను వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. దీంతో ఎమ్మెల్యే వర్గీయుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోంది. ► పుర ఎన్నికల ఫలితాల తర్వాత అమరచింతలో మారిన రాజకీయ సమీకరణాలు గులాబీ నేతలను కాస్త ఆందోళనకు గురి చేశాయి. అక్కడున్న పది వార్డుల్లో టీఆర్ఎస్ మూడు, సీపీఎం రెండు, బీజేపీ, టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందిన విషయం తెలిసిందే. తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్ కారెక్కారు. ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో పురపీఠం కైవసం చేసుకుందామని భావించిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి మద్దతు విషయంలో ఒక అభ్యర్థిపై అనుమానం వచ్చింది. ముందస్తు జాగ్రత్తగా ఎక్స్అఫీషియో ఓటు వేద్దామనే ఆలోచనతో అమరచింత మున్సిపాలిటీకి చేరుకున్నా.. సదరు అభ్యర్థి సైతం టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపడంతో చిట్టెం ఓటు అవసరం లేకుండానే గులాబీ అక్కడ జెండా ఎగరవేసింది. ► భూత్పూర్ మున్సిపల్ పరిధిలో పది వార్డులకు టీఆర్ఎస్, బీజేపీ నాలుగు చొప్పున స్థానాలు గెలుచుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థులు రెండు వార్డుల్లో గెలిచారు. దీంతో రంగంలో దిగిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో గెలిచిన బీజే పీ అభ్యర్థుల్లో ఇద్దరికి గులాబీ కండువా కప్పా రు. దీంతో గులాబీ బలం ఆరుకు చేరింది. సో మవారం ఉదయమే భూత్పూర్కు వచ్చిన బీజే పీ జిల్లా అధ్యక్షురాలు పద్మజా రెడ్డి విప్ జారీ చేసి వెళ్లినా.. ఆ పురంపై గులాబీ జెండా ఎగరడాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అయితే.. బీజేపీ నుంచి గెలిచి కారెక్కిన కెంద్యాల శ్రీనివాస్‌కు వైస్ చైర్మన్ పదవి వరించింది. చేజారుతూ.. చేజిక్కిన ‘కోస్గి’ అధికార పార్టీ అనూహ్యంగా కోస్గి పీఠం పాగా వేసింది. ఆ మున్సిపాలిటీ పరిధిలో 16వార్డులు ఉండగా.. టీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు చొప్పున గెలుచుకోగా.. ఇద్దరు స్వతంత్రులు గెలుపొందారు. స్వతంత్రుల్లో 4వ వార్డు నుంచి గెలుపొందిన జనార్దన్‌రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) కాంగ్రెస్‌కు మద్దతివ్వగా.. మరో అభ్యర్థి బెస్త ఎల్లమ్మ టీఆర్ఎస్కు మద్దతు తెలిపింది. దీంతో రెండు పార్టీలకు ఎనిమిది చొప్పున మెజార్టీ వచ్చింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలుపొందిన అనిత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ ఏడు, కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో మెజార్టీ సాధించింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ తరఫున స్థానిక ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటుకు దరఖాస్తు చేసుకున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు పుర పీఠం తమదేననే ధీమాతో ఉండిపోయారు. కానీ సోమవారం ఉదయం ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితో పాటు ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సైతం హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యే ఒక్కరే ఎక్స్అఫీషియో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారంటూ అధికారులు తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కౌన్సిలర్ల పదవికి ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర పార్టీ నేతలందరూ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పదవుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. దీంతో పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ నాయకులతో అధికారులు చైర్పర్సన్, చైర్మన్లను ఎన్నుకుని వారితో ప్రమాణస్వీకారం చేయించారు. గెలుపు కోసం వారి ఓట్లు.. హంగ్ ఉన్న పట్టణాల్లో ఎక్స్అఫీషియో ఓట్లు వేసి తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులందరూ కదిలారు. ముందుగా ఓటు అవసరం లేకుండా.. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో లాబీయింగ్ చేసిన నాయకులు ఆ ప్రయత్నాలు ఫలించని చోటుకు వెళ్లి ఓటేశారు. కోస్గిలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, కొల్లాపూర్‌లో నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, అయిజలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఓట్లేశారు. మక్తల్‌లో ఎమ్మెల్సీ రాంచందర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఓటేశారు. నీకొకటి.. నాకొకటి.. ‘పుర’ పీఠాలు కైవసం కోసం స్పష్టమైన మెజార్టీ రాని పార్టీలు కలిసి రెండు చోట్ల పాగా వేశాయి. పది వార్డులు ఉన్న అమరచింతలో టీఆర్ఎస్ 3, సీపీఎం 2, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ నుంచి ఒక్కొక్కరు గెలుపొందారు. దీంతో ఆ పీఠంపై పాగాకు ప్రయత్నించిన టీఆర్ఎస్.. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన రాజకుమార్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆరో వార్డు నుంచి గెలిచిన మాధవి, పదో వార్డు నుంచి గెలుపొందిన గోపి సీపీఎం అభ్యర్థులతో మంతనాలు జరిపిన స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి చైర్పర్సన్ పదవిని టీఆర్ఎస్ అభ్యర్థి మంగమ్మకు ఇచ్చి.. వైస్ చైర్మన్ పదవిని గోపికి ఇచ్చారు. ఇటు 20 వార్డులు ఉన్న ఆ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఆరు స్థానాల్లో, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందగా.. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ రెబెల్స్ పది మంది గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏఐఎఫ్బీ గెలిచిన పదిమంది టీఆర్ఎస్ రెబెల్స్ కావడం.. వారందరూ తాము టీఆర్ఎస్కే మద్దతు ఇస్తామని చెప్పడంతో ఇరువురి మధ్య సయోధ్య కుదిరింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన 16వ వార్డు అభ్యర్థి దేవన్నకు చైర్మన్.. తొమ్మిదో వార్డు నుంచి ఏఐఎఫ్బీ తరఫున గెలిచిన నర్సింహుడుకు వైస్ చైర్మన్ పదవి వరించింది. -
రాములోరి దర్శనం అయిన తర్వాతే...
సాక్షి, కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత చివరి ఘట్టమైన చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొత్తగూడెం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 6వ వార్డు నుంచి గెలుపొందిన కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్‌గా 2వ వార్డు నుంచి గెలిచిన వేలుపుల దామోదర్ ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సబ్‌కలెక్టర్ భవేశ్‌మిశ్రా ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా సీతాలక్ష్మిని 14వ వార్డు కౌన్సిలర్ అఫ్జలున్నీసా బేగం, 27వ వార్డు కౌన్సిలర్ వేముల ప్రసాద్‌బాబు ప్రతిపాదించారు. ముందుగా సబ్ కలెక్టర్ 36 మంది కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీఆర్ఎస్ సభ్యులు 25 మంది, సీపీఐ సభ్యులు 8 మంది, కాంగ్రెస్ సభ్యుడు ఒకరు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు ప్రమాణం చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ సభ్యులంతా ఒకే బస్సులో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి భద్రాచలం నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ముందురోజు వీరందిరినీ భద్రాచలం తీసుకెళ్లి అక్కడే బస చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేందర్రావు శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం చేయించుకుని టీఆర్ఎస్ సభ్యులను కొత్తగూడెం తీసుకొచ్చారు. ఆది నుంచి టీబీజీకేఎస్, టీఆర్ఎస్లో పనిచేస్తూ తెలంగాణ ఉద్యమకారుడిగా కాపు కృష్ణకు పేరుండడంతో ఆయన భార్య సీతాలక్ష్మికి ఎమ్మెల్యే వనమా ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలకు పెద్దపీట వేసే లక్ష్యంతో వేలుపుల దామోదర్‌కు వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించారు. అయితే చైర్పర్సన్ పదవికి పోటీపడిన ఆశావహులు ఎక్కువ మంది ఉండడంతో గొడవ, అలజడి తలెత్తే ప్రమాదం ఉందని భావించారు. కానీ ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. మున్సిపాలిటీ వద్ద పటిష్ట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ్యులు కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వచ్చిన అనంతరం టీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్‌గా 10వ వార్డు నుంచి గెలుపొందిన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్‌గా 17వ వార్డు నుంచి గెలిచిన ఎస్డీ.జానీ ఎన్నికయ్యారు. ఈ రెండు పదవులకు కూడా సింగిల్ నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఆర్డీఓ కనకం స్వర్ణలత వీరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. నామినేషన్ల స్వీకారం అనంతరం ఐదు నిమిషాల సమయమిచ్చారు. ఆ తర్వాత దమ్మాలపాటిని చైర్మన్‌గా ప్రకటించారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం నామినేషన్ వేసిన తర్వాత.. చేతులెత్తి మద్దతు ప్రకటించాలని ఆర్డీఓ సభ్యులను కోరగా.. 16 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతుగా చేతులెత్తారు. వైస్ చైర్మన్ పదవిని ఆశించిన కొక్కు నాగేశ్వరరావు, కొండపల్లి సరిత చేతులెత్తలేదు. ముందుగా కౌన్సిలర్లతో ఆర్డీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. 19 మంది టీఆర్ఎస్ సభ్యులు, ఇద్దరు స్వతంత్రులు, సీపీఐ కౌన్సిలర్ ఒకరు, న్యూడెమోక్రసీ కౌన్సిలర్ ఒకరు ప్రమాణ స్వీకారం చేశారు. టీఆర్ఎస్ రెబెల్‌గా గెలుపొందిన మడత రమ సమావేశానికి గైర్హాజరయ్యారు. శనివారం ఓట్ల లెక్కింపు అనంతరం టీఆర్ఎస్ సభ్యులు 19 మంది, రెబెల్స్‌గా గెలుపొందిన మరో ఇద్దరు.. మొత్తం 21 మంది సభ్యులను ప్రత్యేక బస్సులో ఖమ్మం తీసుకెళ్లి, అక్కడి నుంచి విజయవాడ తరలించారు. వీరందరినీ ఎన్నికకు ముందు నేరుగా మున్సిపల్ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం పట్టణంలో ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. తరువాత పట్టణ సమీపంలోని మామిడితోటలో అభినందన సభ నిర్వహించారు. -
క్యాంపు నుంచి నేరుగా చేరుకుని..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో సోమవారం నూతన పాలక వర్గాలు కొలువు దీరాయి. అత్యంత ఉత్కంఠ భరితంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు మున్సిపాలిటీల్లో ఘన విజయం సాధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ సొంత పార్టీలోనే అనేకమంది ఆశించడంతో ఎంపికకు తీవ్ర కసరత్తు చేశాక చివరకు అంతా ఏకగ్రీవమయ్యారు. వారంతా ప్రమాణ స్వీకారం చేశారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్‌గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన కూసంపూడి మహేష్, వైస్ చైర్‌పర్సన్‌గా అదే పార్టీకి చెందిన తోట సుజలరాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైరా మున్సిపల్ చైర్మన్‌గా సూతకాని జైపాల్, వైస్ చైర్మన్‌గా ముళ్లపాటి సీతారాములు, మధిర మున్సిపల్ చైర్‌పర్సన్‌గా మొండితోక లత, వైస్ చైర్‌పర్సన్‌గా యరమల విద్యాలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు చేతులు ఎత్తే పద్ధతి ద్వారా ఎన్నికను అధికారులు నిర్వహించారు. సత్తుపల్లి మినహా మధిర, వైరాల్లో టీఆర్ఎస్కు చెందిన కౌన్సిలర్లు ఉదయం 11 గంటల సమయంలో క్యాంప్ నుంచి నేరుగా చేరుకుని కౌన్సిలర్లుగా తొలుత పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ పడిన పార్టీ నేతల్లో కొందరు తమకు చేజారిపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు, పార్టీ నేతలు వారికి నచ్చచెప్పి భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మూడు చోట్లా ఎన్నిక, ప్రమాణ స్వీకారాలు ఇలా.. ► సత్తుపల్లి అధికార పార్టీ కౌన్సిలర్లు క్యాంప్‌నకు వెళ్లకపోవడంతో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్యాంప్ కార్యాలయం నుంచి నేరుగా మున్సిపల్ ఆఫీస్‌కు చేరుకుని పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12: 30గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పోటీ చేసే జాబితాను ఎన్నికల అధికారి, కల్లూరు ఆర్డీఓ శివాజీకి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అందించారు. ► వైరాలో వైరా మున్సిపల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి ఎమ్మెల్యే రాములు నాయక్ తమ పార్టీ తరఫున పోటీచేసే చైర్మన్, వైస్‌చైర్మన్ జాబితాను అందజేశారు. వైరా శాసనసభ్యులు రాములునాయక్, వైరా మున్సిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ► మధిరలో మున్సిపల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా రెవెన్యూ అధికారి శిరీషకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు అందజేశారు. మధిరలో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలను ఎన్నికల పరిశీలకులు, భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పర్యవేక్షించారు. ఎక్స్ అఫీషియో ఓటు అవసరం రాలే.. శాసనసభ్యుడి హోదాలో ఎక్స్ అఫీషియో సభ్యులకు సైతం మున్సిపాలిటీలో ఓటు వేసే హక్కు ఉన్నప్పటికీ వినియోగించుకునే అవసరం రాలేదు. సత్తుపల్లి, వైరాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, మధిరలో కాంగ్రెస్ శాసన సభ్యుడు మల్లు భట్టి విక్రమార్క వినియోగించుకోనున్నారని ప్రచారం జరిగింది. అయితే సత్తుపల్లి, వైరా, మధిరలో టీఆర్ఎస్ సంపూర్ణ మెజార్టీ సాధించడంతో శాసనసభ్యులు ఎక్స్ అఫీషియో హోదాలో ఓట్లు వేసే అవకాశం లేకుండానే చైర్మన్, వైస్ చైర్మన్లు పూర్తి మెజార్టీతో గెలుపొందారు. మధిరలో కాంగ్రెస్ కూటమికి మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసే సంఖ్యాబలం లేకపోవడంతో ఆ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనలేదు. దీంతో మల్లు భట్టి విక్రమార్కకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వేసే అవకాశం కలగలేదు. సత్తుపల్లిలో ‘కొత్తూరు’ అలక, సండ్ర కానుక సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ పదవిని చివరి వరకు ఆశించిన పార్టీ నేత కొత్తూరు ఉమామహేశ్వరరావు తీవ్ర నిరాశకు గురయ్యారు. సదరు నేతకు సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య నచ్చజెప్పి ప్రత్యామ్నాయంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి అవకాశం కల్పిస్తామని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అనంతరం కౌన్సిలర్ల సమావేశంలో ప్రకటించారు. అయితే మున్సిపల్ కౌన్సిలర్‌గా ప్రమాణం చేసిన కొత్తూరు ఉమామహేశ్వరరావు అనంతరం జరిగిన చైర్మన్, వైస్ చైర్పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. -
వరంగల్ : అన్ని మున్సిపాలిటీలు గులాబీవే
సాక్షి, వరంగల్ : వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరోసారి టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. అన్ని మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు ఆ పార్టీ సొంతమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నుంచి మండల, జెడ్పీ ఎన్నికల వరకు విజయ పరంపర కొనసాగించిన టీఆర్ఎస్... ‘పుర’ ఎన్నికల్లోనూ అదే ఊపు కనబర్చింది. మొత్తం తొమ్మిది మున్సి పాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ను సొంతం చేసుకోవడం ద్వారా అధికా ర టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేష న్ వెలువడిన రోజు నుంచి టీఆర్ఎస్ అధి ష్టానం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేసింది. గెలుపే లక్ష్యంగా అమలుచేసిన వ్యూహప్రతివ్యూహా లు, తీసుకున్న జాగ్రత్తలతో ఉమ్మడి జిల్లాలో ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. కొన్ని మార్పులు మినహా... మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్, నామి నేషన్ల ప్రక్రియ మొదలు.. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వరకు అంతా ఊహించి నట్లుగానే జరిగింది. ఈ ఎన్నికలు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటాయని ప్రచారం జరిగినప్పటికీ... టీఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అనుకూలించాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ముఖ్యులు, ఇన్చార్జీలు ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించగా.. ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ల విషయంలో అక్కడక్కడ ఉత్కంఠ నెలకొన్నా మొదటి నుంచి ప్రయత్నాల్లో ఉన్న వారినే పదవులు వరించాయి. వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల మున్సిపల్ చైర్మన్‌గా సోదా అనిత ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా రేగూరి జైపాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్ధన్నపేట కొత్త మున్సిపాలిటీ తొలి చైర్మన్‌గా అంగోతు అరుణ, వైస్ చైర్మన్‌గా కొమండ్ల ఏలందర్రెడ్డికి అవకాశం దక్కింది. నర్సంపేట మున్సిపల్ చైర్మన్‌గా మాత్రం మొదటి నుంచి రుద్ర మల్లేశ్వరి, నాగిశెట్టి పద్మ పేర్లు వినపడగా, ఆది నుంచి ఉద్యమంలో కలిసి నడిచిన గుంటి కిషన్ భార్య గుంటి రజనికి ఆ పీఠం అప్పగించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రజనికే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మరోసారి ఉద్యమం నుంచి వచ్చిన నేతగా తన నేపథ్యాన్ని చాటుకున్నారు. వైస్ చైర్మన్‌గా మునిగాల వెంకటరెడ్డి ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ చైర్మన్ గుగులోతు సింధూర, వైస్ చైర్మన్‌గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్‌గా మహ్మద్ ఫరీద్ ఎన్నికయ్యారు. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మన్‌గా వాంకుడోతు వీరన్న, వైస్ చైర్మన్‌గా కేశబోయిన కోటిలింగం, తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్‌గా జీనుగ సురేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్‌గా సెగ్గం వెంకటరాణి ఎన్నిక కాగా, వైస్ చైర్మన్ గండ్ర హరీష్‌రెడ్డి పేరు వినిపించింది. చివరి నిముషంలో వైస్ చైర్మన్‌గా కొత్త హరిబాబుకు అవకాశం కల్పించారు. జనగామపై కొంత ఉత్కంఠ నెలకొన్నా.. ఆ మున్సిపాలిటీ నుంచి చైర్మ్‌న్‌గా టీఆర్ఎస్కు చెందిన పోకల జమున ఎన్నిక కాగా, వైస్ చైర్మన్‌గా మేకల రాంప్రసాద్ ఎన్నికయ్యారు. ప్రశంసల జల్లు ఒక్కటి ఓడినా పదవి ఊడుతుంది.. అని హెచ్చరికలు వచ్చినా, ఫలితాల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ నేతలకు అధిష్టానం నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక్క జనగామ మున్సిపాలిటీ వార్డుల ఎన్నికల సందర్బంగా అక్కడి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, అందువల్లే ఫలితాలు ‘హంగ్’ దిశగా వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం చేసిన అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులనుపార్టీ ఖాతాలో వేసుకుంది. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల వరకు గెలుపు కోసం పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సీనియర్ ఎమ్మెల్యేలు డీఎస్.రెడ్యానాయక్, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో పని చేసిన ఇన్చారి్జలు, జెడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కేడర్‌కు అభినందన పత్రాలు కూడా పంపిస్తామని పేర్కొన్నట్లు సమాచారం. కాగా తొమ్మిది మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా సోమవారం పోలీసులు గట్టి బందోబస్తు, భద్రత ఏర్పాటు చేయగా, ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. -
యాదాద్రి మున్సిపాలిటీలు కారు కైవసం
సాక్షి,యాదాద్రి : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు సోమవారం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. ఆరు మున్సిపాలిటీలను, ఐదు వైస్ చైర్మన్లను ఆ పార్టీ గెలుచుకుంది. సీపీఎంకు ఒక చోట వైస్ చైర్మన్ దక్కింది. ఆలేరు, భూదాన్‌పోచంపల్లి, మోత్కూరులో సొంత బలంతో పదవులను కైవసం చేసుకోగా భువనగిరి, యాదగిరిగుట్టలో ఎక్స్ అఫిషియో, ఇండింపెండెంట్ల ఓట్ల ద్వారా చెర్మన్, వైస్‌చైర్మన్ పదవులను గెలుపొందారు. చౌటుప్పల్ కాంగ్రెస్ కూటమిలో చీలిక తెచ్చి సీపీఎం కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. సీపీఎంకు వైస్ చైర్మన్ దక్కింది. దీంతో జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి చైర్మన్ ఎంపిక వరకు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలపైనే మోపడంతో వారు సవాల్‌గా తీసుకుని విజయం సాధించారు. భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరులో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, చౌటుప్పల్‌లో మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ముందుండి నడిపించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన దిశానిర్దేశంతో క్లీన్ స్వీప్ చేశారు. క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు ఈ నెల 25న ఎన్నికల ఫలితాలు వెలువడగానే గెలిచిన కౌన్సిలర్లను ఎమ్మెల్యేలు క్యాంపులకు తరలించారు. క్యాంపుల్లోనే కౌన్సిలర్ల అభిప్రాయాలను సేకరించారు. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకుని గోప్యంగా ఉంచారు. దీంతో కౌన్సిల్ హాల్ లోకి వచ్చేవరకు ఎవరు చైర్మన్, వైస్‌చైర్మన్ అవుతున్నారో తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీ తరఫున విప్ జారీ చేసి ఎన్నికల అధికారులకు చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాలను అందజేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం అధికా రులు ప్రకటించిన పేర్లకు మద్దతుగా చేతులెత్తడం ద్వారా తమ సమ్మతిని తెలియజేసి ఎన్నుకున్నారు. అలాగే ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా చైర్మన్, వైస్‌చైర్మన్ అభ్యర్థులను పోటిలో నిలిపింది. సకాలంలో హాజరుకాని బీజేపీ 22 వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేశ్‌పై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు జిల్లా నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. భువనగిరిలో పోటాపోటీ.. 35 వార్డులున్న మున్సిపాలిటీలో టీ ఆర్ఎస్ కు ఇండిపెండెంట్లతో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అదనంగా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి ఎక్స్ ఆఫిషియో ఓట్లతో కలిసి టీఆర్ఎస్ బలం 19కి చేరింది. కాంగ్రెస్, బీజేపీల పొత్తుతో వారిబలం 18కి చేరినప్పటికీ బీజేపీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ బొర్ర రాకేష్ సకాలంలో హాజరు కాలేదు. దీంతో వారి బలం 17కు పడిపోయింది. టీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనబోయిన ఆంజనేయులు, కాంగ్రెస్ అభ్యర్థిగా పోత్నక్ ప్రమోద్‌కుమార్ పోటీ పడ్డారు. అయితే అంజనేయులకు 19 ఓట్లు రాగా ప్రమోద్‌కుమార్‌కు 17 ఓట్లు వచ్చాయి. దీంతో అంజనేయులు చైర్మన్‌గా గెలుపొందారు. కాగా వైస్ చైర్మన్ కోసం టీఆర్ఎస్ తరఫున చింతల కిష్టయ్య, బీజేపీ తరఫున మాయ దశరథ పోటీ పడ్డారు. అయితే చైర్మన్ తరహాలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది. ఆలేరులో : 12 వార్డులకు గాను టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 1, బీజేపీ 1, ఇండింపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇండిపెండెంట్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంతో బలం 9కి చే రింది. చైర్మన్‌గా వస్పరి శంకరయ్య, వైస్ చైర్మన్ మొరిగాడి మాధవి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూదాన్‌పోచంపల్లిలో: 13 వార్డులకు టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఇండిపెండెంట్ ఒకచోట విజయం సాధించాయి. పూర్తి మెజార్టీ ఉండడంతో టీఆర్ఎస్కు చెందినచిట్టిపోలు విజయలక్ష్మి చైర్మన్‌గా, బాత్కలింగస్వామి వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోత్కురులో ఏకగ్రీవం: మున్సిపాలిటీలో 12 వార్డులకు టీఆర్ఎస్ ఏడుగురు కౌన్సిలర్లను గెలుచుకోగా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఓటు నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ బలం 8కి చేరింది. కాంగ్రెస్ కౌన్సిలర్ల సంఖ్య ఐదు మాత్రమే ఉంది. దీంతో చైర్మన్ పదవికి టీఆర్ఎస్ తరఫున తీపిరెడ్డి సావిత్రి, కాంగ్రెస్ తరఫున గుర్రం కవిత పోటీ పడ్డారు. ఎన్నికల అధికారులు ఓటింగ్ నిర్వహించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి తీపిరెడ్డి స్వాతి చైర్మన్‌గా విజయం సా«ధించింది. వైస్ చైర్మన్‌గా బొల్లేపల్లి వెంకటయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చౌటుప్పల్‌లో టీఆర్ఎస్ ఏకగ్రీవం: చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగింది. ఎన్ని కను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ సభ్యులు బహిష్కరించారు. 20వార్డులు ఉండగా టీర్ఎస్ 8, కాంగ్రెస్ 5, బీజేపీ 3, సీపీఎం 3 ఇండిపెండెంట్లు ఒక చోట విజయం సా«ధించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం కూటమిగా పోటీ చేశాయి. అయితే టీఆర్ఎస్కు సీపీఎం మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్, సీపీఎం పొత్తును నిరసిస్తూ ఎన్నికనుఅడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయనను పోలీస్‌ల సహయంతో బయటకు పంపించారు. దీంతో కాంగ్రెస్, ఇండిపెండెంట్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయకుండానే బయటకువెళ్లిపోయారు. బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి సమావేశాన్ని బహిష్కరించారు. దీంతో సమావేశంలో టీఆర్ఎస్, సీపీఎంలకు చెందిన 11 మంది సభ్యుల కోరం ఉండడంతో చైర్మన్‌గా టీఆర్ఎస్కు చెందిన వెన్‌రెడ్డిరాజు, వైస్ చైర్మన్‌గా సీపీఎంకు చెందిన బ త్తుల శ్రీశైలంలను ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. యాదగిరిగుట్టలో ఉద్రిక్తత నడుమ.. ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తత నడుమ జరిగాయి. ఎక్స్అఫిషియో సభ్యుల బలంలో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. 12 వార్డులకు టీఆర్ఎస్ 4 చోట్ల గెలువగా, ఎక్స్ అఫిషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కర్రె ప్రభాకర్, కడియం శ్రీహరి, ఇండిపెండెంట్ సభ్యులతో కలిపి టీఆర్ఎస్ బలం 8 కి చేరింది. అయితే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్లు ఇద్దరు కౌన్సిలర్లతో బలం 7కు చేరింది. టీఆర్ఎస్ తరపున చైర్‌పర్సన్‌గా ఎరకల సుధ, కాంగ్రెస్ నుంచి గుండ్లపల్లి వాణి పోటీపడ్డారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఏడు ఓట్ల వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. వైస్ చైర్మన్‌గా టీఆర్ఎస్ కూటమిలో ఉన్న ఇండిపెండెంట్ కౌన్సిలర్ కాటంరాజు ఎన్నికయ్యారు. -
సీల్డ్ కవర్లో ఆమె పేరు!
సాక్షి, సూర్యాపేట: నాలుగు మున్సిపాలటీలు గులాబీ ఖాతాలో చేరాయి. చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలను స్పష్టమైన మెజార్టీతో ఆ పార్టీ దక్కించుకుంది. అలాగే సూర్యాపేటలో జనరల్ మహిళకు రిజర్వు అయిన చైర్మన్ పీఠంలో ఎస్సీ మహిళను కూర్చోబెట్టి టీఆర్ఎస్ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల పేర్లను ఎక్కడా ప్రకటించకుండా గోప్యత పాటించి సీల్డ్ కవర్లలో ఆపార్టీ నాలుగు మున్సిపాలిటీల ప్రిసైడింగ్ అధికారులకు అందజేసింది. మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగరండంతో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచాకాల్చి సంబరాలు చేసుకున్నాయి. ఊహలకు అందకుండా.. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సూర్యాపేట మున్సిపాలిటీ ఏలిక ఎవరోనని ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటి నుంచి అంతా ఉత్కంఠతో ఎదురుచూశారు. జనరల్ మహిళకు రిజర్వు కావడం.. పలువురి పేర్లు చర్చకు రావడంతో పాటు వారు చైర్మన్ పీఠం దక్కించుకుంటారని జోరుగా చర్చలు సాగాయి. అయితే అందరి ఊహలకు అందకుండా చైర్మన్ ఎన్నిక కావడం గమనార్హం. 9వ వార్డు నుంచి విజయం సాధించిన పెరుమాళ్ల అన్నపూర్ణ పేరు సీల్డ్ కవర్లో పీఓకు అందింది. అమెను ప్రతిపాదించడం, బలపరచడం, సభ్యుల ఓట్ల మద్దతుతో.. చైర్మన్‌గా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా టీఆర్ఎస్ వార్డు సభ్యులతో పాటు అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జనరల్ మహిళా స్థానంలో చైర్మన్‌గా అవకాశం కల్పించడంతో ఆమె కళ్ల నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. మున్సిపాలిటీలో కొత్త సంప్రదాయానికి ఇది దిక్సూచి అవుతుందని మంత్రి మీడియాతో మాట్లాడుతూ కళ్లు చమర్చారు. అన్నపూర్ణ 9 వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కుందమల్ల శేఖర్‌పై 374 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అలాగే వైస్ చైర్మన్‌గా 22వ వార్డు నుంచి గెలిచిన పుట్టా కిశోర్ విజయం సాధించారు. 24 మంది వార్డు సభ్యులు, మంత్రి ఎక్స్ అఫీషియో ఓటు, ముగ్గురు ఇండిపెండెంట్ వార్డు సభ్యుల మద్దతుతో అన్నపూర్ణ చైర్మన్‌గా, కిశోర్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. పేట మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో చేతులెత్తిన మంత్రి జగదీశ్‌రెడ్డి, కౌన్సిల్ సభ్యులు గులాబీ రెపరెపలు.. ఆపార్టీ గుర్తుపై గెలిచిన వార్డు సభ్యుల మద్దతుతో తొలిసారి కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీలపై టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేసింది. కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ఎక్స్ అఫీషియో ఓటు, 25 మంది వార్డు సభ్యుల బలంతో టీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలపై కూర్చుంది. మున్సిపాలిటీలో 2 వ వార్డు నుంచి గెలుపొందిన వనపర్తి శిరీష చైర్మన్‌గా, 23వ వార్డు నుంచి విజయం సాధించిన వెంపటి పద్మ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వనపర్తి శిరీష 833 ఓట్లు, పద్మ 237 ఓట్ల మెజార్టీ సాధించారు. హుజూర్నగర్ మన్సిపాలిటీలో 20 వార్డులు టీఆర్ఎస్ గెలవడంతో ఆపార్టీకి చెందిన గెల్లి అర్చనకు చైర్మన్, జక్కుల నాగేశ్వరరావుకు వైస్ చైర్మన్ పదవులు దక్కాయి. ఇక్కడ పార్టీ శ్రేణులు ఊహించిన వారే పుర పీఠంపై కొలువుదీరారు. అర్చన 27వ వార్డు నుంచి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై 761 ఓట్ల మెజార్టీ, నాగేశ్వరరావు 17 వ వార్డు నుంచి 225 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తిరుమలగిరి మున్సిపాలిటీలో 11 ఓట్ల బలంతో టీఆర్ఎస్ నుంచి చైర్‌పర్సన్‌గా పోతరాజు రజిని, వైస్ చైర్మన్‌గా సంకేపల్లి రఘునందరెడ్డి ఎన్నికయ్యారు. కోదాడ, హుజూర్నగర్, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఎక్కువ వార్డులు సాధించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ దక్కించుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆనందంలో ఎమ్మెల్యేలు.. తిరుగు లేని విజయంతో నాలుగు మున్సిపాలిటీల ఏలికలు టీఆర్ఎస్ పరం కావడంతో ఆపార్టీ ఎమ్మెల్యేల్లో ఆనందం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక అంతా ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. మెజార్టీ వార్డుల్లో గులాబీ జెండా ఎగరడంతో.. ఇక మున్సిపాలిటీల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు మరింత దృష్టిపెట్టనున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లు అధికారంలో ఉండనుండడంతో మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల ముందుకు తెచ్చిన మేనిఫెస్టోలోని పనులకు నిధుల వేట జరగనుంది. ఈ ఫలితాలతో మళ్లీ సాధారణ ఎన్నికల నాటికి మున్సిపాలిటీల్లో తిరుగులేని శక్తిగా పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నారు.