సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో సోమవారం కొత్త పాలక మండళ్లు కొలువుదీరనున్నాయి. శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో విజయఢంకా మోగిం చిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నికైనట్లుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మధ్యాహ్నం మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక ఉండనుంది. ఈ ఎన్నిక ముగిశాకే డిప్యూటీ మేయర్లు, వైస్ చైర్‌పర్సన్లను ఎన్నుకోవాలి. ఈ ఎన్నికలకు సంబంధించిన మార్గదర్శకాలను ఎస్‌ఈసీ విడుదల చేసింది. మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికపై ఆదివారం ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. సోమవారం తమ సభ్యులకు జారీ చేసిన విప్‌పై వివరాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించనున్నారు. మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు గెజిటెడ్ హోదా గల అధికా రిని జిల్లా కలెక్టర్ నియమించారు.
ఎన్నికైన సభ్యు లు, ఎక్స్‌అఫీషియో సభ్యులతో మున్సిపాలిటీ ప్రత్యేక భేటీని నిర్వహిస్తారు. సోమవారం ఉద యం 11 గంటలకు మున్సిపాలిటీల పరిధిలో కౌన్సిలర్లు, కార్పొరేషన్ల పరిధిలో కార్పొరేటర్లతో అధికారులు ప్రమాణస్వీకారం చేయిస్తారు. తర్వాత వారు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 తర్వాత వీరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. మున్సిపాలిటీ కౌన్సిల్‌లోని మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది సమావేశానికి హాజరై ఉంటేనే కోరం ఉందని నిర్ధారించి మేయర్ /చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్‌పర్సన్ స్థానా లకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆపై ఎన్నికైన వారికి ధ్రువీకరణ పత్రాలు అందించి, ఎన్నిక ప్రక్రియను ముగిస్తారు.
సగం సగం వస్తే లాటరీ..
మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికలపై ఎస్‌ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎన్నిక వాయిదా పడితే తమకు సమా చారం ఇవ్వాలని పేర్కొంది. వీరి ఎన్నిక వాయిదా పడితే మరుసటి రోజున ఎన్నిక నిర్వహించాలని సూచించింది. మరుసటి రోజు సెలవు రోజైనప్పటికీ.. పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నిక నిర్వహించాలని, రెండోసారి మధ్యాహ్నం 3 వరకు ఎన్నిక పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు తెలిపింది. రెండోసారీ వాయిదా పడితే మాత్రం మరుసటి ఎన్నిక తేదీ ప్రకటించకుండా ఎస్‌ఈసీకి నివేదించాలని, దానిపై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. మునిసిపల్ చైర్‌పర్సన్/మేయర్, వైస్‌చైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పార్టీ విప్‌కు కట్టుబడే ఓటు వేయాలి. పార్టీ విప్‌ను ధిక్కరించిన కౌన్సిలర్లు/కార్పొరేటర్లపై అన ర్హత వేటు పడుతుందని ఎస్‌ఈసీ హెచ్చరించింది. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీల చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో చైర్‌పర్సన్/మేయర్, వైస్‌చైర్‌పర్సన్/డిప్యూటీ మేయర్ల ఎన్నికల నిర్వహణకు ఈ నెల 16న మున్సిపల్ శాఖ ఉత్తర్వులిచ్చింది.
పార్టీ ధ్రువీకరణ తప్పనిసరి..
గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీ కౌన్సిలర్లు/కార్పొరేటర్లలో ఎవరైనా మేయర్/చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్/వైస్ చైర్‌పర్సన్ స్థానాలకు పోటీ చేయాలనుకుంటే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు/ప్రధాన కార్యదర్శి నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. సోమవారం ఉదయం 10లోగా జిల్లా కలెక్టర్ నియమించిన అధికారికి ఈ పత్రాన్ని సమర్పిస్తే వారి అభ్యర్థిత్వాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ పదవులకు ఓ సభ్యుడిని మరో సభ్యుడు ప్రతిపాదించగా, ఇంకో సభ్యుడు బలపరిచినా సరిపోనుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే ఓటింగ్ నిర్వహిస్తారు. చేతులెత్తడంద్వారా సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని ఎన్నికల అధికారి విజేతగా ప్రకటిస్తారు. మేయర్/చైర్‌పర్సన్ ఎన్నికలు పూర్తయిన తర్వాతే డిప్యూటీ మేయర్/వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
విప్ ధిక్కరిస్తే వేటు!
గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు తమ పార్టీ విప్‌ను నియమించి, ఆ ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ నియమించిన ఎన్నికల అధికారికి సోమవారం ఉదయం 11లోగా సమర్పించాలి. విప్‌గా నియమితులైన వ్యక్తి తమ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులకు విప్ జారీ చేసి, వారి నుంచి ధ్రువీకరణ తీసుకోవాలి. విప్ స్వీకరించినట్లు సభ్యుల నుంచి తీసుకున్న ధ్రువీ కరణ పత్రాలను విప్‌గా నియమితులైన వ్యక్తి ఎన్నికల అధికారికి భేటీ ప్రారంభం కావడానికి ముందు ఇవ్వాలి. కౌన్సిల్ సభ్యులు పార్టీ విప్‌ను ధిక్కరిస్తే అతడి సభ్యత్వాన్ని రద్దు చేస్తారు. తమ సభ్యుడు విప్ ధిక్కరించాడని పేర్కొంటూ ఎన్నికలు జరిగిన 3 రోజుల్లోగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తే, సదరు సభ్యుడికి నోటిసులు జారీ చేసి సంజాయిషీ ఇచ్చుకోవడానికి వారం గడువు ఇస్తారు. విప్‌ను ధిక్కరించినట్టు నిర్ధారిస్తే వివరణ అందిన 2 రోజుల్లోగా అనర్హత వేటు వేస్తారు. వివరణ ఇవ్వకపోతే అనర్హత వేటుకు మార్గం సుగమం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment