సాక్షి, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో దుమ్మురేపిన టీఆర్‌ఎస్.. మేయర్లు, చైర్‌పర్సన్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 106–111 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకెళ్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. స్వయంగా అభ్యర్థుల ఎంపిక కసరత్తును పరిశీలించారు. ఎన్నికల సమన్వయ కమిటీ సహకారంతో ఆదివారమంతా ఇదే పనిలో ఉన్న పార్టీ అధిష్టానం హైదరాబాద్ నుంచే చైర్మన్లు, మేయర్‌లను ఎంపిక చేయనుంది. అయితే, ఆయా పీఠాల మీద ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపై ఒక్కో పదవికి కనీసం రెండు పేర్ల చొప్పున స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల నుంచి ప్రతిపాదనలు స్వీకరించారు. వీటిని పరిశీలించిన అనంతరం ఉద్యమకారులు, సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు స్థానిక, సామాజిక సమీకరణాలకు అనుగుణంగా పుర పీఠాధిపతులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణ యించింది.
అవసరమైన చోట్ల ఎమ్మెల్యేలు, ఇంచార్జులు ఇచ్చిన పేర్లలో మార్పులను కూడా సూచించింది. ఈ మార్పుల అనంతరం టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవాలనుకుంటున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధ్యక్ష స్థానాల్లో కూర్చునే వారి పేర్లు దాదాపు ఖరారయ్యాయి. ఒకట్రెండు చోట్ల సమస్య ఉన్న స్థానాలతో సహా సోమవారం ఉదయం ఎన్నిక ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి అందరి పేర్లను కేసీఆర్ ఖరారు చేయనున్నారు. ఇబ్బంది లేని చోట మేయర్, చైర్‌పర్సన్ అభ్యర్థులను బహిరంగంగా ప్రకటించనుండగా, సమస్యలున్న చోట్ల పార్టీ అధిష్టానం మార్చిన పేర్లను ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నియమించిన ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు తెలియజేయనుంది. ఈ మేరకు వారి పేర్లను సీల్డ్ కవర్‌లో ఉంచి ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సోమవారం తీసుకెళ్లనున్నారు. ఈ పేర్లను మేయర్లు, చైర్‌పర్సన్ల ఎంపిక సమావేశంలోనే ఓపెన్ చేసి ప్రతిపాదిస్తారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
120 కైవసం చేసుకోవాల్సిందే..
మున్సి‘పోల్స్’ఫలితాలపై ఆదివారం కసరత్తు చేసిన టీఆర్‌ఎస్ అధిష్టానం 9 కార్పొరేషన్లతో పాటు 106–111 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో 4 కార్పొరేషన్లు, 86 మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే మేజిక్ ఫిగర్ కన్నా ఎక్కువ స్థానాలు దక్కాయి. మిగిలిన 5 కార్పొరేషన్లతో పాటు 20–25 మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫీషియో సభ్యులు, తిరుగుబాటు చేసి గెలిచిన వారు, స్వతంత్రులుగా నిలబడి విజయం సాధించిన వారి సహకారం తీసుకోనున్నారు. ఈ మేరకు చాలా మంది తిరుగుబాటు, స్వతంత్ర విజేతలు ఆదివారమే టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. అయితే, కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీల్లో మాత్రం పార్టీపై తిరుగుబాటు చేసి గెలుపొందిన వారి మద్దతు తీసుకోకూడదని, ఎక్స్‌అఫీషియో సభ్యుల మద్దతుతో వాటిని కైవసం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ రెండు చోట్లా తమ అభ్యర్థులను క్యాంపులకు తరలించారు.
ఇక, తాము భావించిన విధంగా మేయర్లు, చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకు ఎంత మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు అవసరమవుతారు? ఎక్కడెక్కడ ఎవరి ఓటు నమోదు చేయించాలనే దానిపై శనివారం రాత్రి నుంచే కేటీఆర్ కసరత్తు చేశారు. టీఆర్‌ఎస్‌కు మొత్తం 150 మందికి పైగా ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం ఉండగా, అందులో 70–75 మంది సహకారం అవసరమవుతుందనే అంచనా మేరకు వారి పేర్లను అవసరమైన మున్సిపాలిటీల్లో ఓటర్లుగా నమోదు చేశారు. ఎక్స్‌అఫీషియో సభ్యుల అవసరం లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల పేర్లను నమోదు చేసుకోకూడదని నిర్ణయించారు.
ఇబ్బంది ఉన్న చోట్ల స్పెషల్ ఫోకస్...
ఇదిలా ఉండగా కొన్నిచోట్ల కాంగ్రెస్, బీజేపీ కలవని పరిస్థితి వస్తే మరో 5 మున్సిపాలిటీలు తమ వశం అవుతాయని టీఆర్‌ఎస్ అంచనా వేస్తోంది. ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టి పుర పీఠాలను కైవసంచేసుకునేలా కసరత్తు చేస్తోంది. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్నది అనుకున్న విధంగా ఏర్పాట్లు జరిగిపోవాలని కేటీఆర్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. మేయర్లు, చైర్మన్లతో పాటు డిప్యూటీ మేయర్లు, వైస్‌చైర్మన్ల ఎన్నికలో కూడా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని, అంతా సజావుగా ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ భవన్‌లో సమీక్ష..
కాగా, సోమవారం జరగనున్న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నికపై కేటీఆర్ ఆదివారం తెలంగాణ భవన్‌లో సమీక్ష జరిపారు. స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఫోన్‌లో మాట్లాడి ఆయన స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. స్వతంత్రుల మద్దతును కూడగట్టడం కోసం ప్రయత్నించాలని, రానున్న నాలుగేళ్లు తామే అధికారంలో ఉంటాం కనుక తమకు మద్దతిస్తే మంచి అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించాలని వారికి సూచించారు. పార్టీ సూచించిన వారికే బీ–ఫారాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment