విమర్శలు శ్రుతిమించుతున్నాయి.. తిప్పికొట్టండి  | Minister Amit Shah Comments On CM KCR and Minister KTR | Sakshi
Sakshi News home page

విమర్శలు శ్రుతిమించుతున్నాయి.. తిప్పికొట్టండి 

Published Sun, Sep 18 2022 1:27 AM | Last Updated on Sun, Sep 18 2022 1:27 AM

Minister Amit Shah Comments On CM KCR and Minister KTR - Sakshi

జాతీయ పోలీస్‌ అకాడమీలో విధి నిర్వహణలో అసువులు బాసిన  ఐపీఎస్‌ అధికారులకు నివాళులు అర్పిస్తున్న కేంద్ర హోం మంత్రి  అమిత్‌ షా.అనంతరం పోలీస్‌ అకాడమీ కార్యకలాపాలు,  శిక్షణపై డైరెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ, బీజేపీలపై టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని మరింత దీటుగా తిప్పికొట్టాలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాష్ట్ర నాయకులను ఆదేశించారు. ఇటీవల కాలంలో ఈ విమర్శలు శ్రుతిమించుతున్నందున సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు.

శనివారం టూరిజం ప్లాజాలో రాష్ట్ర కోర్‌కమిటీతో షా భేటీ అయ్యారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌–ఎంఐఎం, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు ఒకటేనని ప్రచారం చేయాలని నిర్దేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారుతోందని, అందువల్ల టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. 

మునుగోడులో కచ్చితంగా గెలవాలి
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నందున కచ్చితంగా గెలిచేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అమిత్‌షా ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని సూచించారు. మునుగోడులో కమిటీలను రెండ్రోజుల్లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతినెలా తాను రెండురోజులపాటు తెలంగాణలో పర్యటిస్తానని, ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు కొద్ది దూరంలోనే ఉన్నామని అమిత్‌షా వ్యాఖ్యానించినట్టు సమాచారం. పార్టీలో ఐక్యత కొరవడటంపై నేతలకు క్లాస్‌ తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ మొత్తం ప్రజల్లోనే ఉంటూ పటిష్టమయ్యేలా కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. 

ఎప్పుడు ఎన్నికలొచ్చినా... 
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదు­ర్కొనేందుకు సంసిద్ధమై.. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలను వేగవంతం చేయా­లని, అన్ని నియోజకవర్గాల్లో పట్టు సాధించాలని ఆమిత్‌షా ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ద్వారా వివిధవర్గాల పేదలకు అందే ప్రయోజనాలపై విస్తృ­తంగా ప్రచారం చేయాలని సూచించారు.

ఈ సమా­వేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్రపార్టీ సహ ఇన్‌చార్జి అరవింద్‌ మీనన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలాఉంటే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యుడు జి.వివేక్‌లతో జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్‌చుగ్‌ (రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జి), సునీల్‌ బన్సల్‌ (రాష్ట్రపార్టీ సంస్ధాగత ఇన్‌చార్జి) విడిగా సమావేశమయ్యారు. 

ఢిల్లీకి వెళ్లిన అమిత్‌షా 
శంషాబాద్‌: హైదరాబాద్‌ పర్యటన ముగించుకున్న కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షా తిరిగి శనివారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. రాత్రి 9 గంటల సమయంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరి ఆయన ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ నాయకురాలు డి.కె.అరుణ, సీనియర్‌ నాయకులు ఇంద్రసేనారెడ్డి, తదితరులు ఆయనకు వీడ్కోలు తెలిపారు. కాగా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి, పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.      
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement