అధికార పార్టీలో అభద్రతా భావం | Telangana: Kishan Reddy Comments On TRS Party Over BJP Public Meeting | Sakshi
Sakshi News home page

అధికార పార్టీలో అభద్రతా భావం

Published Sat, Jul 2 2022 2:20 AM | Last Updated on Sat, Jul 2 2022 2:20 AM

Telangana: Kishan Reddy Comments On TRS Party Over BJP Public Meeting - Sakshi

ప్రధాన వేదిక వద్ద పార్టీ జెండా కడుతున్న కిషన్‌రెడ్డి. చిత్రంలో లక్ష్మణ్‌ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌:  బీజేపీ జాతీయ సమావేశాలు, ప్రధాని మోదీ బహిరంగ సభ అంటేనే బెంబేలెత్తిపోతూ ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ నాయకత్వం కొట్టుమిట్టాడుతున్నట్టుగా స్పష్టమవుతోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడి వ్యాఖ్యానించారు. సరిగ్గా ఈ సమావేశాలకు ముందే బీజేపీ కార్పొరేటర్లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం, మెట్రో పిల్లర్లను సైతం ముందుగానే బుక్‌ చేసుకుని భారీ వ్యయంతో పోటీ ప్రచారానికి దిగడం చూస్తే వారెంత అభద్రతా భావం, అసహనంతో ఉన్నారో అర్థమౌతోందన్నారు.

కేవలం బీజేపీ సమావేశాలను దృష్టిలో ఉంచుకునే.. రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము రూ.35–40 కోట్లు ఖర్చు పెట్టి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ ఫొటోలతో ప్రచారం చేసుకోవడం దీనిని స్పష్టం చేస్తోందన్నారు. ఈ చర్యలన్నీ అధికార టీఆర్‌ఎస్‌ దిక్కుతోచని స్థితిని ఎత్తిచూపుతున్నాయని చెప్పారు. తెలంగాణ ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని, తండ్రీకొడుకుల పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు.

బీజేపీ జాతీయ సమావేశాలు నిర్వహిస్తుంటే, ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే గౌరవంగా, హుందాగా వ్యవహరించాల్సింది పోయి ప్రభుత్వ ధనంతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వివిధ రూపాల్లో అడ్డుకునే ప్రయత్నం చేయడం టీఆర్‌ఎస్‌కు ఎంతమాత్రం మంచిదికాదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, మహాసభలు వంటివి పెట్టుకున్నప్పుడు బీజేపీ ఎప్పుడైనా, ఏవైనా విమర్శలు చేసిందా? అడ్డుకుందా? అని ప్రశ్నించారు.

ఇంతగా దిగజారి బీజేపీకి, మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, ఇతర రూపాల్లో ప్రచారమెందుకని నిలదీశారు. గతంలో అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తప్పులు చేశారో, ఇప్పుడు కేసీఆర్‌ అదే విధమైన పద్ధతులు, పంథాను అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ సమావేశాలు పురస్కరించుకుని కిషన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

అన్నిరకాలుగా సంసిద్ధులై ఉన్నాం 
రాబోయే రోజుల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రస్తుత విపరీత వైఖరినే కొనసాగించే అవకాశం ఉంది. అనేకరకాలుగా దౌర్జన్యాలు, ప్రజలను మభ్యపెట్టే చర్యలు, వై ఖరితో పాటు బీజేపీ, మోదీ ప్రభుత్వంపై చేసే విషప్రచారాన్ని ఎదుర్కొనేందుకు మానసికంగా, అన్ని విధాలా సంసిద్ధులై ఉన్నాం. సర్కార్‌ వైఖరిని సమ ర్థవంతంగా ఎదుర్కొనేందుకు పార్టీ కేడర్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో సహ నం, సంయమనంతో వ్యవహరించేలా చర్యలు తీ సుకుంటున్నాం. అయితే టీఆర్‌ఎస్‌ చర్యలన్నీ ప్రజ ల కళ్లు మరింతగా తెరిపించడానికి దోహదపడతాయి. 

అన్ని అంశాలపై చర్చిస్తాం 
వచ్చే రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలన్న దానిపై ఆలోచన చేస్తాం. ఈ సమావేశాల్లో 8 ఏళ్ల మోదీ నీతివంతమైన పాలన, దేశం సాధించిన అభివృద్ధి గురించి చర్చిస్తాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా వివిధ అభివృద్ధి చెందిన దేశాల ఆర్థికస్థితి దెబ్బతినగా, మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు సాగిస్తున్న కృషి, తదితరాలపై చర్చిస్తాం. టీకాలు కనుక్కోవడం, పలు దేశాలకు పంపిణీ వంటి అంశాలన్నీ చర్చకు వస్తాయి.  

తెలంగాణపై తీర్మానం 
రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, పరిస్థితులపై కార్యవర్గ భేటీలో చర్చిస్తాం. తెలంగాణపై ఒక తీర్మానం ఉంటుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు.   

క్షీణదశకు టీఆర్‌ఎస్‌..
దుబ్బాక ఉప ఎన్నికల్లో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చుచేసినా, జీహెచ్‌ఎంసీ ఎన్నికలపుడు ప్రభుత్వ డబ్బును ఇంటికి రూ.10 వేలు చొప్పున పంపిణీ చేసినా ఫలితం దక్కలేదు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వివిధ రూపాల్లో ప్రభుత్వ, పార్టీ అక్రమార్జన రూ.వేల కోట్లు ఖర్చు చేసినా, ఇతర ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు లొంగలేదు. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలోపేతమౌతోందనడానికి రెండు ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్‌ఎంసీలో 48 స్థానాల్లో విజయం సాధించడమే నిదర్శనం. ఆ మేరకు టీఆర్‌ఎస్‌ క్రమంగా బలహీనమవుతూ క్షీణదశకు చేరుకుంటోంది. 

తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చేలా..
ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న తర్వాత మొదటిసారి జరుగుతున్న జాతీయ సమావేశాలుగా వీటికి ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు తర్వాత వీటిని నిర్వహిస్తున్నందున, రెండేళ్ల కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల తర్వాత తొలిసారిగా ఢిల్లీ వెలుపల తెలంగాణలో జరగడం వంటి కారణాలతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

దేశవ్యాప్తంగా మరింత బలపడేలా భవిష్యత్‌ కార్యాచరణ రూపకల్పన ఈ భేటీలో జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్ర ప్రభుత్వం భరోసానిచ్చేందుకు, ఇక్కడ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ వల్ల కలగబోయే ప్రయోజనాలు, అభివృద్ధి గురించి చాటేందుకు భేటీ, సభ ఉపయోగపడనున్నాయి.  

తెలంగాణపై ప్రత్యేక దృష్టి
దక్షిణ భారతంలో బలం పెంచుకోవాలని చూస్తున్నాం. కర్ణాటక, పుదుచ్చేరి తర్వాత మూడో రాష్ట్రంగా తెలంగాణపై జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ అగ్రనేతలు, ముఖ్యులు వచ్చి మూడురోజులు ఒకేచోట ఉన్నపుడు స్థానిక కార్యకర్తల్లో ఉత్సాహం, ఉత్తేజం ఏర్పడతాయి. బీజేపీ భేటీ, ప్రధాని మోదీ పర్యటన కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్‌ సభలో మోదీ ప్రసంగాన్ని వినాలని ఉవ్విళ్లూరుతున్నారు. తెలంగాణలోని ప్రతి ఇంట్లో, ప్రతి ఆఫీసులో బీజేపీ సమావేశాలు, సభ గురించే చర్చిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement