సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్.. ఎప్పుడు ఎన్నికలు పెడతావో పెట్టు. ముందు పెడతావా. తర్వాత పెడతావా. ఎప్పుడు పెట్టిన సరే. తెలంగాణలో వచ్చేది కమలం పువ్వు సర్కారే’అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం ఇక్కడి పరేడ్ మైదానంలో జరిగిన విజయ్‌సంకల్ప సభలో ఆయన మాట్లాడారు.
‘తెలంగాణ కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదం ఇచ్చినా నేటికీ తెలంగాణ ప్రజలకు ఈ హామీల్లో ఏవీ నెరవేరలేదు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ అధికారంలో ఉన్నా తెలంగాణ యువతకు ఉద్యోగాలు రాలేదు. కేసీఆర్ ఉద్దేశంలో ఉద్యోగం అంటే కేవలం తన కొడుకును ముఖ్యమంత్రి చేయడమే. అందుకోసమే రాజకీయాలు చేస్తున్నారు.
తెలంగాణ ప్రజల సమస్యపట్ల కేసీఆర్‌కు ఎలాంటి బాధలేదు. మజ్లిస్ వైపు మొగ్గు చూపుతూ తన కొడుకును ఎలా ముఖ్యమంత్రిగా చేయాలన్నదే ఆయన బాధ. తెలంగాణలో వచ్చేసారి ఏర్పడే ప్రభుత్వం కేసీఆర్‌దో, ఆయన కొడుకు కేటీఆర్‌దో కాదు, కేవలం బీజేపీ సర్కార్ మాత్రమే ఏర్పడుతుంది’అని అమిత్ షా స్పష్టం చేశారు.
కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో..
‘తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షను బీజేపీ సమర్థించింది. ఏళ్ల తరబడి తెలంగాణ ఏర్పాటును పెండింగ్‌లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ 2014లో మోదీ అధికారంలోకి వస్తుందని కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఏపీ, తెలంగాణ నడుమ కొట్లాట పెట్టి రాష్ట్రాలుగా విడదీసింది’అని అమిత్ షా ఆరోపించారు. ‘టీఆర్‌ఎస్ పార్టీ గుర్తు కారు అయినా దాని స్టీరింగ్ మాత్రం ఒవైసీ చేతిలో ఉంది.
ఒవైసీ చేతిలో స్టీరింగ్ ఉంటే ప్రజలకు ఏం మేలు జరుగుతుంది. వల్లభాయ్ పటేల్ లేకుంటే హైదరాబాద్ భారతదేశంలో ఉండేది కాదు. తెలంగాణ ఉద్యమసమయంలో హైదరాబాద్ విమోచన దినం జరుపుతామని ప్రకటించి ప్రస్తుతం ఒవైసీకి భయపడి జరపడం లేదు. ఒక్కసారి మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే హైదరాబాద్ విమోచన దినం జరుపుతాం’అని పేర్కొన్నారు.
దేశం ముందుకు.. తెలంగాణ వెనక్కి..
‘ఎవరో తాంత్రికుడు చెప్పారని సీఎం కేసీఆర్ సచివాలయానికి వెళ్లడం లేదు. కేసీఆర్.. ఇకపై సచివాలయానికి వెళ్లకండి. వచ్చేది బీజేపీ సర్కారు కాబట్టి, మా ముఖ్యమంత్రి వెళ్తారు. దేశం అభివృద్ధి చెందుతున్నా తెలంగాణ వెనక్కి పోతోంది. మోదీ నాయకత్వంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మూడు నాలుగింతల అభివృద్ధి జరుగుతోంది.
ఇక్కడ ఉపాధి లేదు, పరిశ్రమలు రావడం లేదు, ఒక్కసారి తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తే టీఆర్‌ఎస్ సర్కార్‌ను కూకటివేళ్లతో పెకిలించి పారేస్తాం. టీఆర్‌ఎస్ అమలు చేయని హామీలను తెలంగాణలో ఏర్పడే బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుంది’అని అమిత్ షా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment