కాంగ్రెస్‌ ‘కుదేలు’ | Congress Party Loses In Telangana Municipal Elections 2020 | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ‘కుదేలు’

Published Sun, Jan 26 2020 2:07 AM | Last Updated on Sun, Jan 26 2020 11:03 AM

Congress Party Loses In Telangana Municipal Elections 2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పురపోరు కాంగ్రెస్‌ పార్టీకి నిరాశే మిగిల్చింది. పట్టణ ప్రాంతాల్లో అధికార టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత ఉందనే అంచనాతో మున్సిపల్‌ ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి మరో సారి పరాభవమే ఎదురైంది. 120 మున్సిపాలిటీలకు గాను ఏడు చోట్ల మాత్రమే చైర్మన్‌ స్థానాలను దక్కించుకునే స్థాయిలో మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఎక్కువ సీట్లు గెలుపొందింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 శాతం స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక, ఒక్క మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కూడా చెప్పుకోదగినన్ని సీట్లు సాధించలేకపోయిన కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేషన్లలో బీజేపీ కన్నా వెనుకబడటం గమనార్హం. ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో పాటు పలువురు ముఖ్యులు ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నించినా ఫలితం రాక కుదేలయింది. బీజేపీ దెబ్బకు ప్రతిపక్ష పార్టీల ఓట్లలో వచ్చిన చీలికతో కాంగ్రెస్‌ పార్టీ కంగుతిందని మున్సిపోల్స్‌ రిజల్ట్స్‌ చెపుతున్నాయి. ముగ్గురు ఎంపీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి లోక్‌సభ పరిధిలో మాత్రమే మెరుగైన ఫలితాలొచ్చాయి.

కాంగ్రెస్‌ గెలిచిన 6 మున్సిపాలిటీల్లో 4 ఈ లోక్‌సభ పరిధిలోనే ఉండగా, మరో 3 చోట్ల గట్టిపోటీ ఇచ్చింది. స్థానాల వారీగా పరిశీలిస్తే.. కాంగ్రెస్‌ గెలిచిన 7 స్థానాలతో పాటు మరో 20 చోట్ల మాత్రమే టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వగలిగింది. పెద్దఅంబర్‌పేట, తుర్కయాంజాల్, ఆదిభట్ల, చండూరు, నేరేడుచర్ల, వడ్డేపల్లి, నారాయణ్‌ఖేడ్‌ మున్సిపాలిటీల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఎక్కువ స్థానాలు సాధించి గెలుపొందింది. కొన్ని స్థానాల్లో ఖాతా కూడా తెరవలేకపోయింది. మున్సిపల్‌ కార్పొరేషన్ల విషయానికొస్తే ఇండిపెండెంట్ల కన్నా తక్కువ స్థానాలతో నాలుగో స్థానానికి పడిపోయింది. నిజాం పేట కార్పొరేషన్‌ పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలుపొందకపోవడం విశేషం.

ఇక, ఇతర పార్టీలు స్వతంత్రులతో కలిస్తే మూడునాలుగు స్థానాలు పురపీఠాలు దక్కించుకునే అవకాశముండగా, భూత్పూరులో కాంగ్రెస్‌ మద్దతిస్తే బీజేపీకి చైర్మన్‌గిరి దక్కే అవకాశాలున్నాయి.  పలుచోట్ల తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న కారణంగా కాంగ్రెస్‌ పార్టీ మరోసారి నష్టపోయింది. కాగా, పోల్‌ మేనేజ్‌మెంట్‌లో తమ పార్టీ అభ్యర్థులకు సరైన సహకారం లభించలేదని, ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులను శక్తిమేరా ఎదుర్కోగలిగామని సర్దిచెప్పుకుంటున్నారు. ముఖ్య నేతలకు కూడా ఎక్కువ మున్సిపాలిటీల్లో ప్రచారం చేయాల్సి రావడంతో కొన్ని చోట్ల సరైన సమయం ఇవ్వలేకపోయారని, ఎమ్మెల్యేల కూడా లేకపోవడంతో చాలా చోట్ల పట్టించుకున్న వారు లేరని, అయినా తాము 500కు పైగా స్థానాలు సాధించడం చిన్న విషయమేమీ కాదని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement