సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పురపీఠాలు గులాబీ పరమయ్యాయి. మొత్తం 118 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకుగాను సోమవారం జరిగిన చైర్మన్లు, మేయర్ల ఎన్నికల్లో 110 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లను టీఆర్‌ఎస్ దక్కించుకుంది. ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీతో పాటు ఎంఐఎంల ఖాతాలో 8 మున్సిపాలిటీలే పడ్డాయి. అందులో కాంగ్రెస్‌కు 4, బీజేపీ, ఎంఐఎంలకు రెండేసి మున్సిపల్ పీఠాల చొప్పున దక్కాయి. వాస్తవానికి, సోమవారమే 120 మున్సిపాలిటీల చైర్మన్ల ఎన్నిక జరగాల్సి ఉన్నా నేరేడుచర్లలో ఎక్స్‌అఫీషియో ఓటు వివాదం కారణంగా, మేడ్చల్‌లో కోరం లేని కారణంగా మంగళవారానికి ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది. ఈ రెండు మున్సిపాలిటీలు కూడా టీఆర్‌ఎస్‌కే దక్కే అవకాశం ఉండటంతో మొత్తం 112 మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరనుంది. ఇక, తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవులన్నీ అధికార టీఆర్‌ఎస్ పార్టీనే దక్కించుకోవడం విశేషం. సోమవారం కౌంటింగ్ జరిగిన కరీంనగర్ కార్పొరేషన్‌లోనూ మేజిక్ ఫిగర్‌ను దాటి 60కి 33 స్థానాలు టీఆర్‌ఎస్ గెల్చుకోవడంతో అక్కడ కూడా అధికార పార్టీ మేయర్ పీఠం దక్కించుకోవడం లాంఛనమే.
దీంతో రాష్ట్రంలోని 100 శాతం కార్పొరేషన్లు, 92 శాతం మున్సిపాలిటీల్లో పాగా వేయడం ద్వారా టీఆర్‌ఎస్ కొత్త రికార్డు సృష్టించింది. ఎక్స్‌అఫీషియో, స్వతంత్రుల మద్దతుతో ఈనెల 25న వెలువడిన మున్సిపోల్స్ ఫలితాల్లో 86 మున్సిపాలిటీలు, 4 కార్పొరేషన్లలో టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. పార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల మద్దతుతోనే పురపీఠాలు దక్కించుకునే స్థాయిలో స్థానాలను గెల్చుకుంది. మిగిలిన చోట్ల పార్టీకి ఉన్న ఎక్స్‌అఫీషియో సభ్యుల సహకారంతో వ్యూహాత్మకంగా పురపీఠాలను దక్కించుకుంది టీఆర్‌ఎస్. అవసరమైన చోట్ల స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు కూడా తీసుకోవడంలో జాగ్రత్తగా వ్యవహరించి ముందు నుంచీ చెబుతున్న విధంగా మెజార్టీ పురపాలికల్లో పాగా వేసింది. ముఖ్యంగా ఎక్స్‌అఫీషియో సభ్యుల బలాన్ని వినియోగించుకోవడంలో టీఆర్‌ఎస్ తనదైన రాజకీయ శైలిని ప్రదర్శించింది. మున్సిపల్ చైర్మన్లు, వైస్‌చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎంపికలో కూడా అన్ని సమీకరణలను పరిగణనలోకి తీసుకోవడంతో ఒకట్రెండు చోట్ల తప్ప పెద్దగా అభ్యంతరాలు కూడా వ్యక్తం కాలేదు. మొత్తం మీద మున్సిపోల్స్‌లో అధికార పక్షం వ్యూహంతో మరోసారి రాష్ట్రంలోని ప్రతిపక్షాలు చతికిలబడ్డాయి.
కొన్ని చోట్ల ఉద్రిక్తత
మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పక్షాలు ఘర్షణకు దిగేంత వరకు పరిస్థితులు వెళ్లాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిలు టీఆర్‌ఎస్ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. తుక్కుగూడలో బీజేపీ ఆందోళనకు దిగింది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ఎక్స్‌అఫీషియో ఓటు విషయంలో మెలిక పడటంతో ఎన్నిక వాయిదా పడింది. దీనిపై ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌పై విరుచుకుపడ్డారు. వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో స్వతంత్రులు, ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం, ఆయా పార్టీల నేతల నుంచి నిరసనలు వ్యక్తం కావడం లాంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇక, చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు నిర్వహించింది. ముందుగా ఎన్నికైన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించగా, ఆ తర్వాత వైస్‌చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహించారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్లు, మేయర్లు అనుచరులతో కలసి సంబురాలు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సోమవారమంతా కోలాహలం నెలకొంది.
మొత్తం మున్సిపాలిటీలు 120
చైర్మన్ ఎన్నిక జరిగినవి 118
ఎన్నిక వాయిదా పడినవి 2’
పార్టీలవారీగా విజయాలు..
టీఆర్‌ఎస్ 110
కాంగ్రెస్ 4
బీజేపీ 2
ఎంఐఎం 2
Comments
Please login to add a commentAdd a comment