Congress party will complaint on 12 MLAs joined in TRS - Sakshi
Sakshi News home page

Telangana: ఆ ‘ఎర’లపై చర్యలేవీ?

Published Sat, Jan 7 2023 3:51 AM | Last Updated on Sat, Jan 7 2023 9:04 AM

Congress Party Has Focused Taking Action-On 12 MLAs Joined TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ మొయినాబాద్‌: గత (2018) అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్‌ పార్టీ మరింత ఫోకస్‌ పెట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో, దాన్ని ఆసరాగా చేసుకుని తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కార్యాచరణను ఉధృతం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్‌లో భాగంగా ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ నేతలు సంపత్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, మల్లురవి, చల్లా నర్సింహారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, టి.రామ్మోహన్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చరణ్‌కౌశిక్‌ యాదవ్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, మెట్టు సాయికుమార్‌ తదితరులు శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు.

ఇందులో బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. ఆర్థిక లబ్ధి చేకూర్చడంతో పాటు పదవులు ఇవ్వడం ద్వారా తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకున్నారని, అవినీతి నిరోధక చట్టం–1988లోని 7, 8, 13, 14 సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్లు 120–బీ, 171–బీ రెడ్‌విత్‌ 171ఏ, 34 సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు (ఎఫ్‌ఐఆర్‌ నం.455/2022)తో తమ ఫిర్యాదును కూడా కలిపి విచారించాలని కోరారు. 

ఫిర్యాదులో ఏముందంటే..
‘2014 నుంచి 2018 మధ్య కాలంలో నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు వివిధ రాజకీయ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. 2018లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే టీఆర్‌ఎస్‌తో పెద్దలతో టచ్‌లో ఉన్న మా పార్టీకి చెందిన 12 మంది, తమకు వివిధ రూపాల్లో లబ్ధి చేకూరగానే టీఆర్‌ఎస్‌లో చేరారు.

అయితే ఈ 12 మందిలో ముగ్గురిని చేర్చుకునేందుకు బీజేపీ ఎర వేసిందనే ఆరోపణలపై రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. రోహిత్‌రెడ్డి కేసులో విచారణ పక్షపాత ధోరణిలో జరుగుతున్నందున ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎఫ్‌ఐఆర్‌ నం: 455కు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించే సమయంలో మా ఫిర్యాదును కూడా సదరు దర్యాప్తు సంస్థకు బదిలీ చేయండి..’ అని కాంగ్రెస్‌ నేతలు ఆ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు అనంతరం పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో రేవంత్, భట్టి మీడియాతో మాట్లాడారు. 

ఈడీ, సీబీఐ డైరెక్టర్‌కూ ఫిర్యాదు చేస్తాం: రేవంత్‌
కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచి ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అనంతరం భట్టితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని, అందుకే వివిధ పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని మండిపడ్డారు. సీఎల్పీ నేతగా దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉంటే ఓర్వలేక కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను వివిధ సందర్భాల్లో టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఆర్థిక, అధికార ప్రయోజనాలను కల్పించారని, కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయబద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు.  

పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి
2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తమ ఫిర్యాదులోని ఆధారాలను కూడా పరిశీలించాలన్నారు. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా అవసరమైతే రాజకీయ పోరాటం చేయడానికీ వెనకాడబోమన్నారు. 

ప్రజాస్వామ్యం అపహాస్యం: భట్టి 
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో ఒకేసారి చేరలేదని.. విడతల వారీగా చేరిన ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించడం ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. ఫిరాయింపులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు స్వీకరించి పరిశీలించామని, కోర్టు అనుమతి, న్యాయసలహా తీసుకుని కేసు నమోదుపై ముందుకెళ్తామని ఎస్సై లింగ్యానాయక్‌ తెలిపారు.

12 మంది ఎమ్మెల్యేలు వీరే..
హరిప్రియ బానోతు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాంతారావు రేగ, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, వనమా వెంకటేశ్వరరావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్‌రెడ్డి.

12 మంది ఎమ్మెల్యేలకు జరిగిన లబ్ధి గురించి కాంగ్రెస్‌ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలివే:
ఎమ్మెల్యే పేరు            లబ్ధి
హరిప్రియ బానోతు            నగదు లబ్ధి
పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి        08–09–2019 నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు
కందాల ఉపేందర్‌రెడ్డి            నగదు లబ్ధితో పాటు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు బిల్లుల మంజూరు
దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి            08–02–2020 నుంచి మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి
రేగ కాంతారావు            అసెంబ్లీ విప్‌ హోదా
ఆత్రం సక్కు                నగదు లబ్ధి
చిరుమర్తి లింగయ్య            నగదు లబ్ధి
వనమా వెంకటేశ్వరరావు        నగదు లబ్ధి, భూఅంశాల సెటిల్‌మెంట్‌
బీరం హర్షవర్ధన్‌రెడ్డి            నగదు లబ్ధి (భూసేకరణ మొత్తం)
జాజుల సురేందర్‌            నగదు లబ్ధి
గండ్ర వెంకటరమణారెడ్డి        నగదు లబ్ధి, భార్య జ్యోతికి భూపాలపల్లి జెడ్పీ చైర్మన్‌ పదవి
రోహిత్‌ రెడ్డి                నగదు లబ్ధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement