Defection of MLAs
-
సింగిల్ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లలో సింగిల్ జడ్జి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తే.. ఇక్కడ ఆశ్రయించొచ్చని స్పీకర్ కార్యదర్శికి సీజే ధర్మాసనం స్వేచ్ఛ ఇచ్చింది. ప్రతివాదుల వాదనలు వినకుండా సింగిల్ జడ్జి తీర్పును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. న్యాయ, చట్టసభ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, అసెంబ్లీ స్పీకర్, కేంద్ర ఎన్నికల కమిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, దానం నాగేందర్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వివేకానంద్, వెంకట్రావు, కడియం శ్రీహరిలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను అక్టోబర్ 24కు వాయిదా వేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నాలుగు వారాలకు గడువిస్తున్నామని.. ఆ లోగా వివరాలు అందజేయకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని గత నెల 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. సింగిల్ జడ్జి తీర్పులో ఇచ్చిన గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టును ఆశ్రయించారు. ‘స్పీకర్ అధికారాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేవని కిహోటో హలోహాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు దీనికి విరుద్ధంగా ఉంది. మణిపూర్ శాసనసభ స్పీకర్ కీషమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సింగిల్ జడ్జి ఆధారపడ్డారు. స్పీకర్ ఐదేళ్లపాటు మౌనంగా ఉండేందుకు ఇష్టపడితే కోర్టులు చూస్తూ ఉండలేవని చెప్పారు. బీఆర్ఎస్ కాలంలో అనేక అనర్హత పిటిషన్లు పదవీకాలం ముగిసే వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. పిటిషనర్లు స్పీకర్‌ను ఊపిరి తీసుకునే అవకాశమైనా ఇవ్వకుండా కోర్టును ఆశ్రయించారు’అని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయ సమీక్ష అధికారాలతో అనర్హత పిటిషన్లను నిర్ణీత గడువులోగా నిర్ణయించాలని శాసనసభ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయగలదో.. లేదో తేల్చాలని కోరారు. ఈ అప్పీల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఇచ్చిన గడువు సమీపిస్తోందని, ఏదైనా నిర్ణయం వెలువరించే అవకాశముందని చెప్పారు. సింగిల్ జడ్జి సుమోటోగా విచారణ చేపట్టకున్నా.. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఆదేశాలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఒకవేళ ఏదైనా ఉత్తర్వులు ఇస్తే వెంటనే ఇక్కడ (సీజే ధర్మాసనం) ఆశ్రయించే స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. దీనికి అనుమతించిన ధర్మాసనం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. సింగిల్ జడ్జి తీర్పు ఇది... ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్, దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా, స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎల్పీ మహేశ్వర్‌రెడ్డి వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ చెప్పేందుకు నాలుగు వారాలకు గడువిస్తున్నాం.. ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని గత నెల 9న స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్ల స్టేటస్ ఏమిటో చెప్పేందుకు నాలుగు వారాల గడువిస్తున్నాం.. ఆలోగా వివరాలు అందజేయకుంటే మేమే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది..’ అని స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు తేల్చిచెప్పింది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, వివేకానంద, మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను స్పీకర్ ముందుంచాలని, విచారణ షెడ్యూల్ రూపొందించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు వివరాలను హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)కు అందజేయాలని ఆదేశిస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ‘కైశమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్’ కేసులో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణీత గడువులోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేసింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం రిట్ అధికార పరిధి చాలా విస్తృతమైనది. తొందరపాటు చర్య అని, సాంకేతిక కారణాలతో కొట్టివేస్తే న్యాయం జరగదు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నీతి, తత్వశా్రస్తానికి రాజ్యాంగ అథారిటీలు కట్టుబడి ఉండాలి. న్యాయ సమీక్ష అన్నదే కాదు.. అసలు సమస్యకు పరిష్కారం ఎప్పుడనేది తేలాలి. శాసనసభ కాలపరిమితి పూర్తయ్యే ఐదేళ్ల వరకు స్పీకర్ వేచిచూస్తూ ఉంటే కోర్టులు చేతులు దులుపుకుంటూ ఉండలేవు. ఇది రాజ్యాంగ, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధం. అనర్హత పిటిషన్లలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ నిరాకరిస్తే పిటిషనర్లకు ఎటువంటి పరిష్కారం లభించదు. ‘కైశమ్ మేఘచంద్ర సింగ్’ కేసులోసుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. ఏజీ, అనధికార ప్రతివాదుల వాదనలను సమర్ధించదు..’ అని స్పష్టం చేసింది. మూడు పిటిషన్లపై విచారణ 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావును అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున విజయం సాధించిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. అలాగే నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి సుదీర్ఘ విచారణ చేపట్టారు. ఇరు పక్షాలకు చెందిన సీనియర్ న్యాయవాదుల వాదనలను కూలంకషంగా విన్నారు. గత నెల 10న రిజర్వు చేసిన తీర్పును సోమవారం వెలువరించారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, గండ్ర మోహన్‌రావు విన్పించిన వాదనలను న్యాయమూర్తి తన తీర్పులో నమోదు చేశారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే: పిటిషనర్లు ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు. ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు గతంలో తేల్చిచెప్పింది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్ అవుతారు కాబట్టి, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకుండా పదవీ కాలం ముగిసే వరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కైశమ్ మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్ కేసులో స్పీకర్ రాజకీయ విధేయత కారణంగా అనుసరించిన పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్ వద్ద ఉంచాలా.. వద్దా..? అనే దానిపై పార్లమెంటు పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది. అసెంబ్లీ కార్యదర్శి కూడా పబ్లిక్ సర్వెంటే. స్పీకర్‌పై అందరికీ గౌరవం ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఆయన నిర్ణయం తీసుకోవడం లేదని భావిస్తున్నాం. రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని రాజకీయ ఒత్తిళ్లకు లొంగడం సరికాదు. జిల్లా కోర్టులకు కూడా విచారణ ఇన్నిరోజుల్లో పూర్తి చేయాలని గడువు పెడుతున్నారు. అలాంటప్పుడు ట్రిబ్యునల్ చైర్మన్ (స్పీకర్) కింద ఆయన్ను ఆదేశించే అధికారం రాజ్యాంగ ధర్మాసనాలకు ఉంటుంది..’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలివ్వలేవు: ఏజీ ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసే అధికార పరిధి కోర్టులకు లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పది రోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రాజ్యాంగం స్పీకర్‌కు ఇచ్చింది. రిట్ పిటిషన్లు దాఖలు చేయడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది తొందరపాటు చర్య. టీఆర్ఎస్ హయాంలో వేసిన అనేక అనర్హత పిటిషన్లను అప్పటి స్పీకర్ పరిష్కరించలేదు. ఎర్రబెల్లి దయాకర్‌రావు కేసులో పిటిషన్ చెల్లదని ఇదే కోర్టు గతంలో చెప్పింది. తాజా పిటిషన్లను కొట్టేయాలి..’ అని ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి కోర్టును కోరారు. ఇదీ తీర్పు.. ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏప్రిల్‌లో ఒక పిటిషన్, జూలైలో ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఆగస్టు 10 తీర్పు రిజర్వు చేశాం. ఇప్పటివరకు అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. ఈ నేపథ్యంలో రిట్ పిటిషన్లలో ఉపశమనం పొందేందుకు పిటిషనర్లు అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. స్పీకర్ కార్యాలయానికి రాజ్యాంగ హోదా, గౌరవం ఉంది. అనర్హత పిటిషన్లను వెంటనే రాష్ట్ర శాసనసభ స్పీకర్ ముందు ఉంచాలని స్పీకర్ కార్యదర్శిని ఆదేశిస్తున్నాం. ఇరుపక్షాల వాదనలు, డాక్యుమెంట్లు, వ్యక్తిగత వాదనలకు సంబంధించి నేటి నుంచి నాలుగు వారాల్లోగా షెడ్యూల్ నిర్ణయించాలి. నాలుగు వారాల్లో ఏం తేల్చకపోతే సుమోటోగా విచారణ చేపడతాం. తగిన ఆదేశాలను మేమే ఇస్తాం..’ అని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి తీర్పు ఇచ్చారు. a -
TG: స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు గురువారం మరోసారి విచారణ జరిపింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలంటూ చేసిన ఫిర్యాదును స్పీకర్ తీసుకోలేదని హైకోర్టును ఆశ్రయించిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. స్పీకర్ తన ఫిర్యాదును స్వీకరించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. మహేశ్వర్‌రెడ్డి పిటిషన్‌ను తీసుకోవాలని, పిటిషనర్‌కు ధ్రువీకరణ రశీదు ఇవ్వాలని స్పీకర్ కార్యాలయాన్ని హైకోర్టు ఆదేశించింది.ఎమ్మెల్యేలు దానం, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై దాఖలు చేసిన పిటిషన్లపైనా కూడా ధర్మాసనం విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయం తీసుకోక ముందే పిటిషనర్లు కోర్టుకు వచ్చారంటూ ఏజీ తెలిపారు. 3 నెలలైనా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన సరైంది కాదన్న ఏజీ.. వివాదం కోర్టులో ఉన్నందున స్పీకర్.. పిటిషన్లను పరిశీలించలేదన్నారు. వాదనలు విన్న కోర్టు.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. -
Telangana: ఆ ‘ఎర’లపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్/ మొయినాబాద్: గత (2018) అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్లోకి వెళ్లిన 12 మంది ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ మరింత ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు తెరపైకి వచ్చిన నేపథ్యంలో, దాన్ని ఆసరాగా చేసుకుని తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో కార్యాచరణను ఉధృతం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్లో భాగంగా ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే 12 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు సంపత్‌కుమార్, బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, మల్లురవి, చల్లా నర్సింహారెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, టి.రామ్మోహన్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, చరణ్‌కౌశిక్ యాదవ్, నర్సారెడ్డి భూపతిరెడ్డి, మెట్టు సాయికుమార్ తదితరులు శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదు అందజేశారు. ఇందులో బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులను నిందితులుగా పేర్కొన్నారు. ఆర్థిక లబ్ధి చేకూర్చడంతో పాటు పదవులు ఇవ్వడం ద్వారా తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభపర్చుకున్నారని, అవినీతి నిరోధక చట్టం–1988లోని 7, 8, 13, 14 సెక్షన్లతో పాటు ఐపీసీ సెక్షన్లు 120–బీ, 171–బీ రెడ్‌విత్ 171ఏ, 34 సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతో నమోదు చేసిన కేసు (ఎఫ్ఐఆర్ నం.455/2022)తో తమ ఫిర్యాదును కూడా కలిపి విచారించాలని కోరారు. ఫిర్యాదులో ఏముందంటే.. ‘2014 నుంచి 2018 మధ్య కాలంలో నలుగురు ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్సీలు వివిధ రాజకీయ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లారు. 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపరుచుకునే ప్రయత్నాలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచే టీఆర్ఎస్తో పెద్దలతో టచ్‌లో ఉన్న మా పార్టీకి చెందిన 12 మంది, తమకు వివిధ రూపాల్లో లబ్ధి చేకూరగానే టీఆర్ఎస్లో చేరారు. అయితే ఈ 12 మందిలో ముగ్గురిని చేర్చుకునేందుకు బీజేపీ ఎర వేసిందనే ఆరోపణలపై రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. రోహిత్‌రెడ్డి కేసులో విచారణ పక్షపాత ధోరణిలో జరుగుతున్నందున ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎఫ్ఐఆర్ నం: 455కు సంబంధించిన రికార్డులను సీబీఐకి అప్పగించే సమయంలో మా ఫిర్యాదును కూడా సదరు దర్యాప్తు సంస్థకు బదిలీ చేయండి..’ అని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు అనంతరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో రేవంత్, భట్టి మీడియాతో మాట్లాడారు. ఈడీ, సీబీఐ డైరెక్టర్‌కూ ఫిర్యాదు చేస్తాం: రేవంత్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి ఆర్థిక, అధికార ప్రయోజనాల కోసం పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలపై ఫిర్యాదు అనంతరం భట్టితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి తన అధికారాన్ని పదిలం చేసుకోవాలనుకున్నారని, అందుకే వివిధ పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకున్నారని మండిపడ్డారు. సీఎల్పీ నేతగా దళిత నాయకుడు భట్టి విక్రమార్క ఉంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలను వివిధ సందర్భాల్లో టీఆర్ఎస్లో చేర్చుకుని ఆర్థిక, అధికార ప్రయోజనాలను కల్పించారని, కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా న్యాయబద్ధంగా వ్యవహరించలేదని విమర్శించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టాలి 2014 నుంచి ఇప్పటివరకు జరిగిన ఫిరాయింపులపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులోని ఆధారాలను కూడా పరిశీలించాలన్నారు. విచారణ వ్యవస్థలు సరిగా స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు మళ్లీ చట్టసభల్లో అడుగు పెట్టకుండా అవసరమైతే రాజకీయ పోరాటం చేయడానికీ వెనకాడబోమన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం: భట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని భట్టి విక్రమార్క విమర్శించారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో ఒకేసారి చేరలేదని.. విడతల వారీగా చేరిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడం ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. ఫిరాయింపులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు. ఇదిలావుండగా.. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు స్వీకరించి పరిశీలించామని, కోర్టు అనుమతి, న్యాయసలహా తీసుకుని కేసు నమోదుపై ముందుకెళ్తామని ఎస్సై లింగ్యానాయక్ తెలిపారు. 12 మంది ఎమ్మెల్యేలు వీరే.. హరిప్రియ బానోతు, పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాంతారావు రేగ, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, వనమా వెంకటేశ్వరరావు, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జాజుల సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్‌రెడ్డి. 12 మంది ఎమ్మెల్యేలకు జరిగిన లబ్ధి గురించి కాంగ్రెస్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలివే: ఎమ్మెల్యే పేరు లబ్ధి హరిప్రియ బానోతు నగదు లబ్ధి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి 08–09–2019 నుంచి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కందాల ఉపేందర్‌రెడ్డి నగదు లబ్ధితో పాటు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టు బిల్లుల మంజూరు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 08–02–2020 నుంచి మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రేగ కాంతారావు అసెంబ్లీ విప్ హోదా ఆత్రం సక్కు నగదు లబ్ధి చిరుమర్తి లింగయ్య నగదు లబ్ధి వనమా వెంకటేశ్వరరావు నగదు లబ్ధి, భూఅంశాల సెటిల్మెంట్ బీరం హర్షవర్ధన్‌రెడ్డి నగదు లబ్ధి (భూసేకరణ మొత్తం) జాజుల సురేందర్ నగదు లబ్ధి గండ్ర వెంకటరమణారెడ్డి నగదు లబ్ధి, భార్య జ్యోతికి భూపాలపల్లి జెడ్పీ చైర్మన్ పదవి రోహిత్ రెడ్డి నగదు లబ్ధి -
పదవి సత్యం... పార్టీ మిథ్య!
అవును... పదవి సత్యం... పార్టీ మిథ్య. దక్కిన అధికారం సత్యం... ఆడినమాట మిథ్య. గోవా రాష్ట్ర ఎమెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్నేళ్ళుగా ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఇదే తంతు. బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోవడం అచ్చంగా అందుకు మరో ఉదాహరణ. గోవా సహా అనేక రాష్ట్రాల్లో కమలనాథులు సాగిస్తున్న అధికార అశ్వమేధంలో ఇది మరో అంకం. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని తమలో కలిపేసుకొని, కాషాయ జెండా కప్పడం ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నదే. గతంలో 2018లో అరుణాచల్ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్... ఇలా ప్రతి చోటా అనర్హత వేటుకు దొరక్కుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. మన రాజకీయ వ్యవస్థలోని లోపానికీ, ముందే తెలిసినా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ప్రతిపక్షాల అసమర్థతకూ పరాకాష్ఠ. చిన్న చిన్న నియోజకవర్గాల గోవాలో ఒక పార్టీకీ, సిద్ధాంతానికే కట్టుబడే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం కనిపించదు. కొద్ది వేల ఓట్లను చేతిలో పెట్టుకున్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో, ఇన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు ఛీ కొడతారనే భయమూ వారికి లేదు. ఇక ఆరునూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్న బీజేపీ అజెండా పుణ్యమా అని ‘ఆయా రామ్... గయా రామ్’ సంస్కృతి ఇటీవల ప్రబలింది. క్రితం అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారు. ఈసారి గెలిచి ఆరు నెలలైనా కాక ముందే అధికార విరహం భరించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు. తాజా గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన గెలిచింది 11 మంది. వారిలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా 8 మంది వెళ్ళి బుధవారం బీజేపీలో చేరడంతో సాంకేతికంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. కానీ, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో దేవుడి ఎదుట పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? అదేమంటే, ‘గుడికి వెళ్ళి, దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను’ అంటూ హస్తం గుర్తుపై గెల్చిన దిగంబర్ కామత్ లాంటి వాళ్ళు నైతికమైన ఈ తప్పును సమర్థించుకోవడమే అమితాశ్చర్యం. ఢిల్లీ నుంచి ఏ దేవుడు చెబితే వీళ్ళు మారినట్టు? మారకపోతే జాగ్రత్తంటూ ఏ సీబీఐ, ఈడీల బెత్తం చూపి బెదిరిస్తే, మారినట్టు? ఆ దేవుడు ఏ వరాలు ప్రసాదిస్తే మారినట్టు? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలు. ప్యాకేజీలతోనో, పదవులతోనో, మాట వినకుంటే కేంద్ర సంస్థల దర్యాప్తులతోనో... ఎలాగైతేనేం ప్రతిపక్ష సభ్యుల్ని కంచె దాటి తమ వైపు వచ్చేలా చేసుకొనే కళలో కొన్నాళ్ళుగా ఆరితేరింది. బీజేపీ, దాని పెద్దలు అదే పనిగా ఇస్తున్న పిలుపు – ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’. కానీ, గత ఎనిమిదేళ్ళలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ‘ఆపరేషన్ కమలం’ చూస్తుంటే, ఎక్కడా ఏ ప్రతిపక్షమూ లేని ‘ప్రతిపక్ష ముక్త్ భారత్’ కాషాయ పార్టీ మనసులో కోరిక అని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ, అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏకపక్షంగా రాజ్యం చేయాలనుకోవడం వేరు. అప్పుడది ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యమైతే అనిపించుకోదు. వాజ్‌పేయి లాంటి నేతల హయాంలో కొన్ని విలువలకు పేరున్నపార్టీగా ఒకప్పుడు అందరూ అనుకున్న బీజేపీ దురదృష్టవశాత్తూ ఇప్పుడవన్నీ వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ప్రతిపక్షాల తప్పూ లేకపోలేదు. కమలనాథుల అధికారపు ఆకలి తెలిసీ, తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేక పోవడం పూర్తిగా ప్రతిపక్ష వైఫల్యమే. గోవాలో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ళు ఈ గట్టునే ఉంటారో చెప్పలేం. మాజీ సీఎం కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో – ఇద్దరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడక్కడ నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి, జూలైలోనే ఇదే కామత్ – లోబో జంట ఎమ్మెల్యేల మూకుమ్మడి వలసకు యత్నించింది. తీరా అంతా కలసి అయిదుగురే అవడంతో ఫిరాయింపుల నిరోధక వేటు పడుతుందని ఆఖరి నిమిషంలో అది ఆగింది. ఆ సంగతి తెలిసినా గత రెండు నెలల్లో ఈ ఎమ్మెల్యేల వేటను ఆపడంలో కాంగ్రెస్ విఫలమైంది. సంక్షోభ నివారణలో ఆ పార్టీ నేతల అసమర్థతకు ఇదో మచ్చుతునక. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ చేపట్టి వారం తిరగక ముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగే కొద్దీ మరిన్ని దొంగదెబ్బలను కాంగ్రెస్ కాచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్‌లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బీజేపీ ఈసారి దృష్టి పెట్టవచ్చు. ఈ దుష్ట ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట ఎలా వేయాలన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజాప్రాతినిధ్య, ఫిరాయింపుల నిరోధక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లొసుగులను సరిదిద్దాలని పార్టీలన్నీ పట్టుబట్టాలి. పార్టీ మారే ప్రబుద్ధులను రీకాల్ చేసే అవకాశం లేనందున, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధిచెప్పాలనే చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంతా సమంజసమే అనుకొంటేనే కష్టం. ఏ గుర్తుపై గెలిచామన్నది కాదు.... ప్రభుత్వంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారైతే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకు మించిన అపహాస్యం మరొకటి లేదు. గోవా ఉదంతం మరోసారి గుర్తు చేస్తున్న సంగతి అదే! -
ఫిరాయింపులను ప్రోత్సహించి రాజ్యాంగాన్ని అవమానించారు
సాక్షి, అమరావతి: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి చంద్రబాబు రాజ్యాంగాన్ని అవమానించారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. శాసనమండలిలో సోమవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని వారిపై అనర్హత వేటు పడనీయకుండా స్పీకర్ పదవికి కళంకం తెచ్చారని మండిపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చి గవర్నర్‌ను కూడా వేలెత్తి చూపే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించలేదన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్య విలువలకు మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు. నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీలో చేరే ముందు ఎమ్మెల్సీ పదవికి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాజీనామా చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల్లో నంద్యాల నుంచి వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే చంద్రబాబు టీడీపీ కండువా కప్పారన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరితే తమ సభ్యులను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టింది చంద్రబాబేనన్నారు. నిషే«ధిత ప్రాంతంలో నిర్మించిన ప్రజా వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు.. సీఎంకు లేఖ రాయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘హోదా’పై శాసనమండలిలో చర్చ ప్రత్యేక హోదాపై శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత చంద్రబాబు పోరాడుతుంటే సీఎం మాత్రం కేంద్రంలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినందున ప్రభుత్వ ఏర్పాటుకు మన అవసరం లేకుండా పోయిందంటూ మాట్లాడటం సరికాదని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రులు బొత్స, అవంతిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడినట్లు చంద్రబాబు ఏనాడైనా గట్టిగా మాట్లాడారా అని ప్రశ్నించారు. హోదాపై టీడీపీ సభ్యులు అలా మాట్లాడినట్లు చూపిస్తే సభలో తలవంచుకుని నిలబడతానంటూ బొత్స సవాల్ చేశారు. హోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు మనమూ చేద్దామంటూ తాను టీడీపీ ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే అందుకు ఆయన ఒప్పుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేసినట్లు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేదని చెప్పారు. హోదా విషయంలో వైఎస్ జగన్ తీరు మొదటి నుంచి ఒకేలా ఉందన్నారు. -
రాజ్జాంగం కంటే బాబే గొప్ప
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! గోపాత్రుడు: గురూ గోరూ... ఈ పెతిపక్షాలకి వేరే పనేటీ ఉండదేటండీ బాబూ. ఊరికే మా సెందరబాబుగోరి మీద పడతారు ? అసహనంగా అన్నాడు గోపాత్రుడు. గిరీశం: యామిటోయ్ గోపాత్రుడూ! పూటకూళ్లమ్మలా ఊరికే అలా అరుస్తావెందుకోయ్? గోపాత్రుడు: అదే గురూ గోరూ... ఇపుడు పెతిపెక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మా సెందరబాబుగోరూ అపుడెపుడో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇపుడు వాళ్లల్లో ఓ నలుగురికి మంతిరి పదవులు ఇచ్చారు. అదేదో పెద్ద నేరం అయినట్లు అందరూ మా బాబుపై పడిపోతున్నారు. ఇదేం ఘోరం? గిరీశం: ఒరేయ్ గోపాత్రుడూ... ఇక్కడ లా పాయింట్ ఉందోయ్. అంటే... వేరే పార్టీ ఎమ్మెల్యేలను మన పార్టీలో చేర్చుకోనే కూడదు. చేర్చుకోదలచుకుంటే వాళ్ల చేత రాజీనామా చేయించి చేర్చుకోవాలి. అలా చేయకుండా ఊరికే చేర్చుకుని... మంత్రి పదవి కానీ ఇచ్చావా వాళ్ల గోచీ గుడ్డ జారిపోద్దని రాజ్యాంగంలో రాశారోయ్. డాక్టర్ అంబేడ్కర్ గారు ఈ విషయాన్ని రాసేటపుడు పక్కనే ఉన్నాను. గోపాత్రుడు (ఆవేశంగా): రాజ్జాంగంలో ఏటి రాస్తే అదయిపోద్దా? రాజ్జాంగం రాసినోల్లకంటే మా సెందరబాబుగోరికే ఎక్కువ తెలుసు. గిరీశం: అవుననుకో... అయినా కూడా రాజ్యాంగం చెప్పినట్లే చెయ్యాలిరా. అది వదిలేయ్ కానీ. ఒకళ్లని పెళ్లి చేసుకుని మరొకరితో కాపురం చేస్తే ఏమంటార్రా? గోపాత్రుడు: సీసీ తప్పుడు పనులు నాసేత చెప్పించకండి గురూ గోరూ (బుర్ర గోక్కున్నాడు) గిరీశం: (నవ్వేసి) వాళ్లకీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకీ పెద్దగా తేడా లేదోయ్. అంచేత వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవలసిందేనని రాజ్యాంగంలో 60కి పైగా సెక్షన్లలో స్పష్టంగా రాసి ఉంది. (గోపాత్రుడికి ఉక్రోషం వచ్చింది.) గోపాత్రుడు: మీరెన్నయినా చెప్పండి గురూగారూ. ఈ విసయంలో నేను మీ అభిప్రాయాన్ని ఒప్పుకోను. మా సెందరబాబు ఏటి చేసినా కరెక్టే అవసరమైతే రాజ్జాంగాన్ని మా బాబు తిరగరాస్తారు. ‘‘నీ అంతటి మూర్ఖపు గాడిద మరొకడు ఉండడని నీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మాస్టారే చెప్పారు నాకు. నీకిక ఏం చెప్పినా వేస్ట్... పళ్లు లాగేస్తున్నాయి, మన దగ్గర కాపర్స్ ఎన్ని ఉన్నాయేంటి? మాంచి లంక పుగాకు చుట్టలు నాలుగు తెచ్చి పెట్టు’’ అని పురమాయించాడు గిరీశం. ‘మా సెందరబాబు చేసింది కరెక్టేనని చెప్పే దాక నేను చుట్టలు తేను గురూగారు’’ అని భీష్మించాడు గోపాత్రుడు. గిరీశం చిన్నగా నవ్వి... ‘‘అవసరమైతే మీ చెందరబాబు చేసింది నూటికి నూరు పాళ్లూ కరెక్టేనని సుప్రీంకోర్టులో కూడా చెప్పిస్తాను. లేదంటే ఇంటర్నేషనల్ కోర్టులోనూ వాదిస్తాను. మా పినతల్లిగారి భర్త మంచి వకీలు కూడానూ..’’ అని ధైర్యం చెప్పాడు. గోపాత్రుడి మొహం వెలిగిపోయింది. – నానాయాజీ -
ఎస్వీ మోహన్‌రెడ్డిపై అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శికి గురువారం ఫిర్యాదు చేశారు. తక్షణమే మోహన్‌రెడ్డితో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరిపై అనర్హత వేటు వేయాలని కోరారు. డిప్యూటీ కార్యదర్శిని కలిసిన వారిలో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయండి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి ఎన్నికై అనైతికంగా టీడీపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావును వైఎస్సార్సీపీ శాసనసభాపక్షం కోరింది. ఈమేరకు వైఎస్సార్సీపీ విప్ ఎన్.అమరనాథ్‌రెడ్డి శనివా రం స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ, పలువురు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి అమరనాథ్‌రెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలిశారు. ఎమ్మెల్యేలు ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన వారు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అనర్హులని వివరించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గుర్తుపై ఎన్నికైన ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి, చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, తిరువీధి జయరాములు, కలమట వెంకటరమణ, మణి గాంధీ, పాలపర్తి డేవిడ్‌రాజు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారని తెలిపారు. 1986, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారు మరో పార్టీలో చేరితే అనర్హులవుతారనే విషయాన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 2(1) ప్రకారం-191 (2) అధికరణను అనుసరించి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియమాల్లోని 6వ నిబంధన (ఫిరాయిస్తే అనర్హులుగా ప్రకటించడం) మేరకు ఈ ఫిర్యాదు చేశారు. ఫిరాయించిన వారికి ముఖ్యమంత్రి టీడీపీ కండువాలు కప్పడం, పత్రికల క్లిప్పింగ్‌లు, టీడీపీలో చేరినట్లు మీడియా ఎదుట ఎమ్మెల్యేలు ప్రకటించిన వీడియో క్లిప్పింగ్‌లతో పాటు రెండు లేఖలను స్పీకర్‌కు అందజేశారు. తమనోటీసు ఆధారంగా అనర్హతపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని స్పీకర్‌ను కోరగా... ‘మీరిప్పుడే కదా నోటీసు ఇచ్చారు. పరిశీలిస్తా’ అని బదులిచ్చారు. రెండు అవిశ్వాస తీర్మానాలపై పరిశీలన! స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టాలనే ఆలోచన తొలు త తమకు ఉన్నప్పటికీ ఒకే సమావేశాల్లో రెండు అవిశ్వాస తీర్మానాలు పెట్టవచ్చా? లేదా? అనే అంశాలను పరిశీలిస్తున్నామన్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పీకర్ కన్నా ముందుగా ప్రభుత్వంపైనే అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నామన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరిస్తే అవిశ్వాసం పెట్టే అవసరం కలుగకపోవచ్చన్నారు. అలా కాకపోతే అపుడు తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్పీకర్‌ను కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కళత్తూరు నారాయణస్వామి, కిలివేటి సంజీవయ్య, ముత్తిరేవుల సునీల్, వరుపుల సుబ్బారావు, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వై.విశ్వేశ్వర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యక్కలదేవి ఐజయ్య, ఎస్వీ మోహన్‌రెడ్డి ఉన్నారు. నోటీసును స్వీకరించిన స్పీకర్ దానిని అసెంబ్లీ కార్యదర్శి కె.సత్యనారాయణకు ఇచ్చి అందినట్లు ధ్రువీకరించాల్సిందిగా ఆదేశించారు. స్పీకర్ న్యాయబద్ధంగా వ్యవహరించాలి: జ్యోతుల ఎమ్మెల్యేల ఫిరాయింపునకు సంబంధించి తాము అన్ని సాక్ష్యాధారాలు స్పీకర్‌కు ఇచ్చామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఆలోచనలు మరొకరు చేయరన్నారు. స్పీకర్‌తో భేటీ అనంతరం ఆయన అమరనాథ్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలతో కలసి మీడియాతో మాట్లాడారు. తామిచ్చిన నోటీసుపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకుంటే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబుకు చెంప పెట్టు అవుతుందన్నారు. అనర్హులైన వారి స్థానాలన్నీ ఖాళీ అయితే ఉప ఎన్నికలొస్తాయన్నారు. ఆ ఎన్నికల్లో ప్రజల తీర్పును బట్టి వారి మనోభావాలేమిటో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. -
స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేం
- పార్టీ ఫిరాయింపులపై పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు - స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య - టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ వ్యాజ్యాలపై తీర్పు సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు హైకోర్టులో చుక్కెదురైంది. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను కోర్టు కొట్టేసింది. స్పీకర్ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఈ వ్యవహారంలో స్పీకర్ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. తీర్పు కాపీ సిద్ధం కాకపోవడంతో పూర్తిపాఠం అందుబాటులోకి రాలేదు. తమ పార్టీల నుంచి అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని టీడీపీ, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలపై టీడీపీ, రెడ్యా నాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్రెడ్డిలపై కాంగ్రెస్, మదన్‌లాల్‌పై వైఎస్సార్సీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఫిర్యాదును స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ ఆ పార్టీల నేతలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను మొదట విచారించిన సింగిల్ జడ్జి.. వీటికి విచారణార్హత లేదంటూ కొట్టేశారు. సింగిల్ తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు ఆయా పార్టీల నాయకులు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ఫిరాయింపుల ఫిర్యాదులు స్పీకర్ నిర్ణయం తీసుకునే దశలో ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో జోక్యం సరికాదని తెలంగాణ అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని 1992లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ఈ వాదనంతో ధర్మాసనం ఏకీభవించింది. ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం వెలువరించడానికి ముందే పిటిషనర్లు న్యాయస్థానాలను ఆశ్రయించడం సరికాదన్న ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించింది.