రాజ్జాంగం కంటే బాబే గొప్ప
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్‌లుక్!
గోపాత్రుడు: గురూ గోరూ... ఈ పెతిపక్షాలకి వేరే పనేటీ ఉండదేటండీ బాబూ. ఊరికే మా సెందరబాబుగోరి మీద పడతారు ?
అసహనంగా అన్నాడు గోపాత్రుడు.
గిరీశం: యామిటోయ్ గోపాత్రుడూ! పూటకూళ్లమ్మలా ఊరికే అలా అరుస్తావెందుకోయ్?
గోపాత్రుడు: అదే గురూ గోరూ... ఇపుడు పెతిపెక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మా సెందరబాబుగోరూ అపుడెపుడో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇపుడు వాళ్లల్లో ఓ నలుగురికి మంతిరి పదవులు ఇచ్చారు. అదేదో పెద్ద నేరం అయినట్లు అందరూ మా బాబుపై పడిపోతున్నారు. ఇదేం ఘోరం?
గిరీశం: ఒరేయ్ గోపాత్రుడూ... ఇక్కడ లా పాయింట్ ఉందోయ్. అంటే... వేరే పార్టీ ఎమ్మెల్యేలను మన పార్టీలో చేర్చుకోనే కూడదు. చేర్చుకోదలచుకుంటే వాళ్ల చేత రాజీనామా చేయించి చేర్చుకోవాలి. అలా చేయకుండా ఊరికే చేర్చుకుని... మంత్రి పదవి కానీ ఇచ్చావా వాళ్ల గోచీ గుడ్డ జారిపోద్దని రాజ్యాంగంలో రాశారోయ్. డాక్టర్ అంబేడ్కర్ గారు ఈ విషయాన్ని రాసేటపుడు పక్కనే ఉన్నాను.
గోపాత్రుడు (ఆవేశంగా): రాజ్జాంగంలో ఏటి రాస్తే అదయిపోద్దా? రాజ్జాంగం రాసినోల్లకంటే మా సెందరబాబుగోరికే ఎక్కువ తెలుసు.
గిరీశం: అవుననుకో... అయినా కూడా రాజ్యాంగం చెప్పినట్లే చెయ్యాలిరా. అది వదిలేయ్ కానీ. ఒకళ్లని పెళ్లి చేసుకుని మరొకరితో కాపురం చేస్తే ఏమంటార్రా?
గోపాత్రుడు: సీసీ తప్పుడు పనులు నాసేత చెప్పించకండి గురూ గోరూ (బుర్ర గోక్కున్నాడు)
గిరీశం: (నవ్వేసి) వాళ్లకీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకీ పెద్దగా తేడా లేదోయ్. అంచేత వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవలసిందేనని రాజ్యాంగంలో 60కి పైగా సెక్షన్లలో స్పష్టంగా రాసి ఉంది. (గోపాత్రుడికి ఉక్రోషం వచ్చింది.)
గోపాత్రుడు: మీరెన్నయినా చెప్పండి గురూగారూ. ఈ విసయంలో నేను మీ అభిప్రాయాన్ని ఒప్పుకోను. మా సెందరబాబు ఏటి చేసినా కరెక్టే అవసరమైతే రాజ్జాంగాన్ని మా బాబు తిరగరాస్తారు. ‘‘నీ అంతటి మూర్ఖపు గాడిద మరొకడు ఉండడని నీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మాస్టారే చెప్పారు నాకు. నీకిక ఏం చెప్పినా వేస్ట్... పళ్లు లాగేస్తున్నాయి, మన దగ్గర కాపర్స్ ఎన్ని ఉన్నాయేంటి? మాంచి లంక పుగాకు చుట్టలు నాలుగు తెచ్చి పెట్టు’’ అని పురమాయించాడు గిరీశం. ‘మా సెందరబాబు చేసింది కరెక్టేనని చెప్పే దాక నేను చుట్టలు తేను గురూగారు’’ అని భీష్మించాడు గోపాత్రుడు.
గిరీశం చిన్నగా నవ్వి... ‘‘అవసరమైతే మీ చెందరబాబు చేసింది నూటికి నూరు పాళ్లూ కరెక్టేనని సుప్రీంకోర్టులో కూడా చెప్పిస్తాను. లేదంటే ఇంటర్నేషనల్ కోర్టులోనూ వాదిస్తాను. మా పినతల్లిగారి భర్త మంచి వకీలు కూడానూ..’’ అని ధైర్యం చెప్పాడు.
గోపాత్రుడి మొహం వెలిగిపోయింది.
– నానాయాజీ