Nanayaji
-
వెనకయ్య... సట్టం లేదు సుట్టం లేదు!
పంచ్ వేస్తే త్రివిక్రమ్ శ్రీనివాసే వేయాలంటారు. కానీ నామటుకు నేనైతే దాన్ని ఒప్పుకోను. అసలు పంచ్ అంటేనే మా వెనకయ్యనాయుడు గోరు. నా సిన్నప్పట్నుంచీ చూస్తున్నా... అబ్బ ఏం పంచ్‌లు వేస్తారో. ఆయన పంచ్‌లు తెగ నచ్చేయడం వల్లనేనండీ బాబూ వెనకయ్యనాయుడిగోరిని బిజెపి జాతీయ పెసిడెంట్ చేశారు. ఇంత వయసు వచ్చినా మా వెనకయ్య పంచ్‌లు మానలేదు.నిన్ననో మొన్ననో నెల్లూరులో వెనకయ్యగోరేమన్నారంటే... ‘‘అరేయ్! నా ఎనకమాల ఎవరూ నిలబడకండ్రా... ఎనకాల ఉన్నోళ్లు వెన్నుపోటు పొడిచేత్తారు’’ అని కొంచెం బయపడ్డారు. 1984లో ఎన్టీఆర్‌ని కూడా ఎనకమాల ఉన్నవారే వెన్నుపోటు పొడిచీశారని వెనకయ్య గుర్తు చేసుకున్నారు. ఈ ఇసయం మా నెల్లూరు పెద్దారెడ్డికి సెబితే ‘‘వెనకయ్యగోరికి 1984 గుర్తుంది కానీ, 1995 గుర్తులేదా’’ అని ఎటకారం ఆడాడు. చెప్పొద్దూ నాకు ఒళ్లు మండింది. ‘‘ఎదవ కూతలు కూస్తే గూబ్బగులుద్ది’’ అని సీరియస్ అయిపోనాను. దానికి మా పెద్దారెడ్డి మరింత సీరియస్ అయిపోయి... ‘‘ఏంట్రా... 1995లోనూ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిసారుగా. మరది గుర్తునేదా వెనకయ్యనాయుడికి’’ అన్నాడు. సమయానికి మా శేషాచలం వచ్చి... ‘‘1995ది వెన్నుపోటు కాదెహె! 1995లో సెందరబాబు ఎన్టీఆర్‌కి వెనకమాల లేడురా బాబూ... పక్కనే ఉండి గురి చూసి పొడిచేశాడు’’ అన్నాడు. వెనకయ్య 2014లో 1984 లోలా చేశారు’’ అన్నాడు. ‘‘అంటే’’ అని అడిగాను.‘‘అదేరా పెత్యేక హోదా ఇప్పిస్తానని రాజెసబలో పెమానికం చేశారు కదా. ఏపీ జెనమంతా వెనకయ్య వెనకమాలే ఫాలో అయిపోనారు. అధికారం లోకి వచ్చాక పెత్యేక హోదా లేదురా బాబూ నేను ఉత్తినే అన్నా అని మరో పంచ్ వేసి ఏపీ జెనానికి వెన్నుపోటు పొడిచినారు. అందుకే ఇపుడు తన వెనకమాల ఎవరూ ఉండద్దని ఆయనగారు చెబుతున్నారు’’ అన్నాడు. శేషాచలానికి వెనకయ్య ఆట్టే నచ్చడు. అందుకే ఇట్టం వచ్చినట్లు మాట్లాడతాడు. అది పక్కన పెట్టేత్తే వెనకయ్య నాయుడిగోరి పంచ్ గురించి మాట్లాడుకుందారి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మంతిరి పదవులు ఇచ్చారని సెందరబాబుని అన్ని పార్టీలోళ్లూ ఆడిపోసుకుంటున్నారు. ఫిరాయింపులు ఆపడానికి ఏదన్నా సట్టం తెత్తారా అని జరనలిస్టులు అడిగారు. ఆయన... ‘ఓ పారిటీకి ఇబ్బంది వస్తుందని సట్టాలు సేయాలేంటి?’ అనేశారు. దాంతో జరనలిస్టులకు మాట పడిపోయింది. ఇదే ఇసయం మా శేషాచలానికి చెబితే.. ‘‘మాట పడిపోడం ఏట్రా, అలాంటి జవాబులు వింటే పేనాలే పోతాయి’’ అని ఎటకారంగా నవ్వాడు.సెందరబాబుకీ మా వెనకయ్యకి మంచి స్నేహితం ఉంది. అలాంటపుడు సెందరబాబు గోరిని ఇబ్బంది పెట్టడం నేయమా? అందుకే సట్టం నేదు.. సుట్టం నేదు అని బల్లగుద్ది సెప్పేసారు. -
పట్టిసీమా... వట్టిసీమా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘‘ఎంతైనా సెందరబాబు గ్రేటురా’’ అన్నాడు ఏకాంబరం. ‘‘అది నిజవే కానీ... ఇపుడు హఠాత్తుగా ఆయనెందుకు గుర్తుకొచ్చాడు’’ అన్నాడు చిదంబరం. ‘‘పట్టిసీమతో నీళ్లిస్తానన్నాడా ఆ బాబు. ఇచ్చేశాడు. ఆ నీటితో రైతులంతా పంట పండించేసి... ఆ బియ్యంతో పరమాన్నం వండేసి సెందరబాబుకి ఓ గిన్నెలో తీసుకొచ్చి పెట్టార్రా... సెందరబాబంటే మజాకేంటి?’’ అన్నాడు ఏకాంబరం పూనకం వచ్చినట్లు.‘‘అరేయ్... నాకు తెలీక అడుగుతాను ఆ పాయసం వండిన బియ్యం పట్టిసీమ నీళ్లతోనే పండించారేట్రా?’’ అని ఆరా తీశాడు చిదంబరం.‘‘అరే వాళ్లే చెప్పారు కదరా బాబూ! నువ్వు టీవీల్లో చూడనేదా ఏటి?’’ అని ప్రశ్నించాడు ఏకాంబరం. ‘‘టీవీల్లో చాలా చూపిస్తార్రా బాబూ. అక్కడకొచ్చిన వాళ్లసలు రైతులో కాదో కూడా డౌటే’’ అన్నాడు చిదంబరం.‘అదేంట్రా నీకన్నీ అనుమానాలే... అయినా నీకెందుకొచ్చింది అనుమానం’’ అన్నాడు ఏకాంబరం.‘‘ఎందుకంటే... అసలు పట్టిసీమ ప్రాజెక్టే ఓ బొంగులో ప్రాజెక్టని కాగ్ చెప్పేసింది కదేటి. అసలు పట్టిసీమ నుండి తీసుకెళ్లిన నీళ్లని కృష్ణా నీటితో కలిపి సముద్రంలో కలిపేశారట. ఇంతోడి దానికి వందల కోట్లు ఉత్తి పుణ్యానికి తినేశారని కాగ్ ఏకి పారేసిందనుకో’’ అన్నాడు చిదంబరం. ‘‘ఏకాంబరానికి ఒళ్లు మండింది. అరే అపోజిషన్ వాళ్లు అలాగే చెబుతార్రా, అవి నమ్మద్దు’’ అన్నాడు. చిదంబరం పగలబడి నవ్వి... ‘‘కాగ్ అంటే పెతిపక్షం కాదెహె... అది గౌర్మెంట్ సంస్థే. పెబుత్వం ఖర్చు పెట్టే పెతీ పైసాకీ లెక్కలూ గట్రా సరి చూసి ఎంత తగలేశారో... ఎంత తినేశారో వివరంగా చెబుతూ పుస్తకాలు రాస్తారన్నమాట వాళ్లు’’ అన్నాడు చిదంబరం.‘‘ఏకాంబరానికి ఓడిపోవడం ఇష్టం లేదు. అయితే కాగ్ వాళ్లు పెతి పక్షంతో కలిసిపోయి ఊరికే బురద జల్లుతున్నారేమో ఎవరికి తెలుసు?’’ అన్నాడు.‘‘ఛస్ ఊరుకోయేస్. ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పళ్లు రాలిపోతాయి నోటికెంతొస్తే అంతా వాగేయడమేనేటి?’’ అని చిదంబరం సీరియస్ అయ్యాడు. ఏకాంబరానికి ఏమనాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. -
రాజ్జాంగం కంటే బాబే గొప్ప
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! గోపాత్రుడు: గురూ గోరూ... ఈ పెతిపక్షాలకి వేరే పనేటీ ఉండదేటండీ బాబూ. ఊరికే మా సెందరబాబుగోరి మీద పడతారు ? అసహనంగా అన్నాడు గోపాత్రుడు. గిరీశం: యామిటోయ్ గోపాత్రుడూ! పూటకూళ్లమ్మలా ఊరికే అలా అరుస్తావెందుకోయ్? గోపాత్రుడు: అదే గురూ గోరూ... ఇపుడు పెతిపెక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మా సెందరబాబుగోరూ అపుడెపుడో కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇపుడు వాళ్లల్లో ఓ నలుగురికి మంతిరి పదవులు ఇచ్చారు. అదేదో పెద్ద నేరం అయినట్లు అందరూ మా బాబుపై పడిపోతున్నారు. ఇదేం ఘోరం? గిరీశం: ఒరేయ్ గోపాత్రుడూ... ఇక్కడ లా పాయింట్ ఉందోయ్. అంటే... వేరే పార్టీ ఎమ్మెల్యేలను మన పార్టీలో చేర్చుకోనే కూడదు. చేర్చుకోదలచుకుంటే వాళ్ల చేత రాజీనామా చేయించి చేర్చుకోవాలి. అలా చేయకుండా ఊరికే చేర్చుకుని... మంత్రి పదవి కానీ ఇచ్చావా వాళ్ల గోచీ గుడ్డ జారిపోద్దని రాజ్యాంగంలో రాశారోయ్. డాక్టర్ అంబేడ్కర్ గారు ఈ విషయాన్ని రాసేటపుడు పక్కనే ఉన్నాను. గోపాత్రుడు (ఆవేశంగా): రాజ్జాంగంలో ఏటి రాస్తే అదయిపోద్దా? రాజ్జాంగం రాసినోల్లకంటే మా సెందరబాబుగోరికే ఎక్కువ తెలుసు. గిరీశం: అవుననుకో... అయినా కూడా రాజ్యాంగం చెప్పినట్లే చెయ్యాలిరా. అది వదిలేయ్ కానీ. ఒకళ్లని పెళ్లి చేసుకుని మరొకరితో కాపురం చేస్తే ఏమంటార్రా? గోపాత్రుడు: సీసీ తప్పుడు పనులు నాసేత చెప్పించకండి గురూ గోరూ (బుర్ర గోక్కున్నాడు) గిరీశం: (నవ్వేసి) వాళ్లకీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకీ పెద్దగా తేడా లేదోయ్. అంచేత వాళ్ల ఉద్యోగాలు ఊడిపోవలసిందేనని రాజ్యాంగంలో 60కి పైగా సెక్షన్లలో స్పష్టంగా రాసి ఉంది. (గోపాత్రుడికి ఉక్రోషం వచ్చింది.) గోపాత్రుడు: మీరెన్నయినా చెప్పండి గురూగారూ. ఈ విసయంలో నేను మీ అభిప్రాయాన్ని ఒప్పుకోను. మా సెందరబాబు ఏటి చేసినా కరెక్టే అవసరమైతే రాజ్జాంగాన్ని మా బాబు తిరగరాస్తారు. ‘‘నీ అంతటి మూర్ఖపు గాడిద మరొకడు ఉండడని నీకు చిన్నప్పటి నుంచి చదువు చెప్పిన మాస్టారే చెప్పారు నాకు. నీకిక ఏం చెప్పినా వేస్ట్... పళ్లు లాగేస్తున్నాయి, మన దగ్గర కాపర్స్ ఎన్ని ఉన్నాయేంటి? మాంచి లంక పుగాకు చుట్టలు నాలుగు తెచ్చి పెట్టు’’ అని పురమాయించాడు గిరీశం. ‘మా సెందరబాబు చేసింది కరెక్టేనని చెప్పే దాక నేను చుట్టలు తేను గురూగారు’’ అని భీష్మించాడు గోపాత్రుడు. గిరీశం చిన్నగా నవ్వి... ‘‘అవసరమైతే మీ చెందరబాబు చేసింది నూటికి నూరు పాళ్లూ కరెక్టేనని సుప్రీంకోర్టులో కూడా చెప్పిస్తాను. లేదంటే ఇంటర్నేషనల్ కోర్టులోనూ వాదిస్తాను. మా పినతల్లిగారి భర్త మంచి వకీలు కూడానూ..’’ అని ధైర్యం చెప్పాడు. గోపాత్రుడి మొహం వెలిగిపోయింది. – నానాయాజీ -
ఏం ఇప్పుడే నోరు లేస్తోందేం?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ఓ సీనియర్ మంత్రి... దర్జాగా కారులో ఇంటికి బయలు దేరారు. ఇంటికి వెళ్లగానే రిలాక్సింగ్ చెయిర్ లో కూర్చుని ఏసీ గాలికి చల్లబడుతున్నారు. ఫోను మోగింది. మంత్రిగారు ఎత్తారు. ‘‘ఏవండీ! మా బామ్మర్దిని ట్రాన్స్ ఫర్ చేయిస్తామన్నారు. ఆరు నెలలు దాటిపోయింది. ఎప్పుడువుతుంది సార్?’’ అవతలి కంఠం ఫోనులో ఆరా తీసింది. మంత్రిగారికి మండుకొచ్చింది. ‘‘పిచ్చ పిచ్చగా ఉందా? అయినప్పుడు అవుతుంది. అయినా ఆ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు ఉంటే ఏనాడైనా మాట్లాడావా నువ్వు? ఇప్పుడు గొంతు లేస్తోందేం నీకు?’’ అని ఫోను పెట్టేశారు. పనిమనిషి చల్లటి ద్రాక్షరసం తెచ్చి ఇచ్చింది. ద్రాక్షరసం తాగుతూ ఆలోచనలో పడ్డారు. పనిమనిషి ధైర్యం తెచ్చుకుని.. ‘‘అయ్యగారూ... ఏడాది క్రితమే జీతం పెంచుతామన్నారు. ఈ నెల అయినా...?’’ అని దయనీయంగా అడిగింది. మంత్రికి మళ్లీ కోపం వచ్చింది. ‘‘ఎప్పుడు పెంచాలో నాకు తెలుసు. అయినా ఆ జగన్ మోహన్ రెడ్డిపై కేసులు ఎందుకున్నాయని ఎప్పుడైనా అడిగావా నువ్వు? నన్ను అడగడానికి మాత్రం నోరు లేస్తుందా?’’ అని జాడించేశారు. పనిమనిషి బిక్క చచ్చిపోయింది. ఓ గంట సేపు అలాగే కూర్చుని వరండాలోకి వెళ్లారు మంత్రిగారు. చాలా కాలం తర్వాత చూడ్డం చేత పెంపుడు కుక్క ఒక్కసారిగా మొరిగింది. మంత్రి సీరియస్ అయిపోయారు – ‘‘దొంగముండా... పీకల దాకా మాంసం దబ్బుకు తిని నామీదే అరుస్తావా? ఏం ఆ జగన్‌ని చూసి ఎప్పుడైనా మొరిగావా?’’ అని కోపంగా దాని తలని కాలితో తన్నబోయారు. అపార్థం చేసుకున్న కుక్కగారు అమాంతం మంత్రిగారి పిక్క పట్టి కరిచేసింది. మంత్రిగారి అరుపులకు సతీమణిగారు వచ్చారు. అప్పటికే మంత్రిగారి కాలినుండి రక్తం బొట బొటా కారిపోతోంది. మంత్రిగారిని కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు సతీమణిగారు. డాక్టర్ వెంటనే రేబిస్ రాకుండా ఇంజక్షన్లు పొడిచేశారు. మంత్రిగారు కాస్త కుదుట పడ్డారు. మంత్రి చిరునవ్వును చూసి ధైర్యం తెచ్చుకున్న డాక్టర్ ‘‘సార్! మా కార్పొరేట్ ఆసుపత్రికి స్థలం ఇస్తామన్నారు. లాంఛనాలన్నీ పూర్తి చేశాం. ఆపని కొంచెం తొందరగా... చేతులు నులుముకుంటూ నసిగారు. మంత్రి గారికి కోపం నషాళానికి అంటింది. ఆ జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడైనా నిలదీశావా నువ్వు? మమ్మల్ని మాత్రం నిలదీస్తావా?’’ అని అగ్గి ఫైర్ అయిపోయారు. డాక్టర్ మాట పడిపోయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మంత్రిగారు ఇంటికి వెళ్లి నేరుగా బెడ్ రూమ్‌కి వెళ్లి పడుకున్నారు. అర్ధరాత్రి... నిద్రట్లో మాటలకు భార్యగారికి మెలకువ వచ్చింది. ‘ఏమయ్యా జగన్ మోహన్ రెడ్డిపై అన్ని కేసులు ఉంటే నన్ను విసిగిస్తావెందుకయ్యా’ అని కలవరిస్తున్నారు మంత్రిగారు. మంత్రిగారి భార్య కంగారు పడి ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోను చేశారు.అంతా పూసగుచ్చినట్లు డాక్టర్‌కి వివరించారు. డాక్టర్ నవ్వేసి.. ‘‘ఏం ఫరవాలేదమ్మా... ఇది దానంతట అదే తగ్గిపోతుంది. కొద్ది రోజులు పార్టీ మీటింగ్‌లకు వెళ్లద్దని చెప్పండి’’ అని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. ఉదయాన్నే ట్రస్ట్ కార్యాలయం నుండి ఫోను... మంత్రిగారు మూడు నిముషాలు మాట్లాడారు. ఇంతలో భార్యామణి కాఫీ తీసుకుని వచ్చారు. ‘‘ఇంట్లో సరుకులు నిండుకున్నాయి... కిరాణా సామాన్లు తెప్పించమని చెప్పి మూడు రోజులైంది. తెప్పించారు కారు’’ అన్నారు భార్యగారు. మంత్రి కాఫీ గ్లాసును విసిరేసి.. ‘‘ఏం జగన్‌నిæ ఏరోజన్నా ఇలా నిలదీశావా? నీక్కూడా నేను లోకువగా కనిపిస్తున్నానా?’’ అని అరిచేశారు. – నానాయాజీ -
మీకన్నా నారాయణే నయం
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! గిరీశం: యామివాయ్ గోపాత్రుడూ... నీ దగ్గర కాపర్స్ ఏమన్నా ఉంటే.. పోయి మాంచి హవానా సిగార్ ఒకటి పట్రావోయ్. గోపాత్రుడు: అలాగే గురూగోరూ. ఆలాగే గురూగోరూ. తెస్తాలే కానీ... నాకు కాస్త చదువు చెప్పండి సారూ. గిరీశం: అదేవిటోయ్... అందుకే కదా నిన్ను నా దగ్గర ఉంచుకుని ఇంగ్లీషు... జింగ్లీషు... జాగ్రఫీ... గాగ్రఫీ అవీ ఇవీ నేర్పుతోంది. గోపాత్రుడు: ఏం నేర్పుతున్నారో ఏమోనండీ. నాకు ఒక్క ముక్క వచ్చి చావలేదు. చుట్టలు కాల్చడం తప్ప నాకు ఇంకేమీ నేర్పలేదు మీరు. గిరీశం: ఇదేనోయ్ నాకు ఒళ్లు మండేది. చుట్టలు కాల్చడం కూడా ఒక ఆర్టే. అది నేర్పిన కృతజ్ఞత కూడా లేదు నీకు కంట్రీ ఫెలో. గోపాత్రుడు: తిట్టకండి ఒక్క నిముషంలో చుట్ట తెచ్చుకొని వస్తా. (గిరీశం వార్తా పత్రికలు తిరగేస్తున్నాడు) గోపాత్రుడు: ఇదిగో గురూ గారూ చుట్ట!(గిరీశం చేతికిచ్చి అగ్గి పెట్టి వెలిగించాడు గోపాత్రుడు. చుట్ట అంటించి మనస్ఫూర్తిగా పొగ పీల్చి వదిలి తన్మయత్వంలో మునిగిపోయాడు గిరీశం) గోపాత్రుడు: గురూ గోరూ... మీ దగ్గర నాలుగేళ్లుగా చదువుతున్నా. నాలుగేళ్ల నుంచి టెన్త్ క్లాస్ పాస్ అయి చావడం లేదు. ఇక ఈసారన్నా పాస్ కాకపోతే మానాన్న గారు నా వీపు విమానం మోత మోగిస్తారు. మీరేమో ఏమీ పట్టించుకోవడం లేదు. గిరీశం: (పేపర్లోంచి బయట పడి) కూల్... కూల్... కంగారు పడకోయ్. నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి వాణ్ని చేద్దామనుకుంటే నువ్వూరికే కంగారు పడతావు. గోపాత్రుడు: బెనర్జీని చేస్తారో ఛటర్జీని చేస్తారో తెలీదు కానీ... మీ కన్నా ఆ నారాయణ గోరిని నమ్ముకున్నా బాగుండేది. గిరీశం: డామిట్. ఇటీజ్ ఇన్సల్ట్ టు మీ. హూ ఈజ్ నారాయణ? నాలా అన్నీ చదువుకున్నాడా ఏంటి? (చాలా సీరియస్‌గా అడిగాడు గిరీశం) గోపాత్రుడు: అదేమో నాకు తెలీదు కానీ... నారాయణ గారి కాలేజీలో చేరి ఉంటే చక్కగా క్వశ్చన్ పేపర్‌తో పాటు జవాబులు కూడా వాళ్లే రాసి ఇచ్చేవారు. నేను ఫస్ట్ ర్యాంక్‌లో పాస్ అయ్యేవాణ్ని. మిమ్మల్ని నమ్ముకుని మట్టికొట్టుకుపోయాను. గిరీశం: ఆ నారాయణ... నారాయణ ఎవరనుకున్నావోయ్... మన దగ్గర చదువుకున్నోడే. మనమే నారాయణ చేత కాలేజీలు స్కూళ్లూ పెట్టించాం. గోపాత్రుడు: మరయితే నా గురించి ఓ ముక్క చెప్దురు. ఈసారైనా నన్ను పాస్ చేయించారంటే మీ రుణం అట్టే పెట్టుకోను. గిరీశం: ష్యూర్. నీ దగ్గర మిగిలి ఉన్న కాపర్లతో ఓ శేరు కావీ మిఠాయి తీసుకురా నేను నారాయణతో ఫైసల్ చేస్తా నీ సంగతి. (గోపాత్రుడు హుషారుగా బజారులోకి పరిగెత్తాడు) – నానాయాజీ -
శకుని... అపశకుని
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! శకుని మామ చేతిలో పాచికలు ఆడిస్తూ ఆలోచిస్తున్నాడు. ‘మామా... ఏపీకి ప్రత్యేక హోదా రానట్లేనా’ అన్నాడు అపశకుని. శకుని ఆలోచనలోంచి బయట పడి ‘ఏంటో అన్నావ్’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘ఏపీ... ప్రత్యేక హోదా’ నసిగాడు అపశకుని. ‘ఈ శకునిని మించిన శకుని ఏపీలో ఉంటే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది?’ అన్నాడు శకుని. అపశకునికి అర్థం కాలేదు. ‘నిన్ను మించిన శకుని ఎవరు మామా?’ అని అడిగాడు. శకుని నవ్వి... ‘చంద్రబాబే ఏపీ శకుని. నేను కౌరవులతో ఉంటూ వారిని దివాళా తీయించా. చంద్రబాబేమో అయిదు కోట్ల మంది నెత్తిన శఠగోపం పెట్టాడు. నాకు మించిన మాయోపాయాలు ఉన్నాయి చంద్రబాబు దగ్గర. ప్రత్యేక హోదా కేంద్రానికి గుర్తుందో లేదో కానీ... చంద్రబాడు మాకు హోదా వద్దు ప్యాకేజీ చాలని వెంటపడ్డాడు. ఆయనకు వెంకయ్యనాయుడు తోడు. ఇద్దరూ కలిసి 5 కోట్ల ఆంధ్రులకు కుచ్చుటోపీ పెట్టారు’ అన్నాడు శకుని. ‘మరి అసెంబ్లీలో బాబు కేంద్రమంత్రులకు, ప్రధానికీ థ్యాంక్స్ చెప్పారు కదా ఎందుకు? అని అడిగాడు అపశకుని. ‘ఏపీని బాగా ముంచినందుకు వెంకయ్యకీ.. అరుణ్ జైట్లీకి థ్యాంక్స్ చెప్పారు’ అన్నాడు. ‘ముంచిన వాళ్లకి ఎవరన్నా థ్యాంక్స్ చెప్తారా ఏంటి మామా?’ అన్నాడు అపశకుని.‘అదే రాజకీయం. బాబు హోదా తేలేకపోయాడు. ప్యాకేజీనే లాభం అనుకున్నాడు. జనానికి అది తెలిస్తే తరిమి తరిమి కొడతారు. అందుకే ప్యాకేజీ మహాప్రసాదమని నటిస్తున్నాడు’ అన్నాడు శకుని. ‘దారుణం కాదా శకుని మామా?’ ‘అంతకన్నా దారుణం ఇంకోటుందిరా. చంద్రబాబు భజన చేసే తోక పత్రిక ఉంది కదా... అదేమో ఏకంగా ప్రత్యేక ప్యాకేజీ కోసం అయిదు కోట్ల మంది ఆంధ్రులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారని కతలు చెప్పేసింది. వాళ్లంతా థ్యాంక్స్ చెప్తున్నారట. ఎవరు చెప్పారో, ఎవరికి చెప్పారో ఆ పత్రిక్కీ ఆ కండువాలకే తెలియాలి’ అన్నాడు శకుని.‘అందరూ అన్యాయంగా నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు కానీ... మరీ దారుణంగా ఉన్నారన్నా’ అన్నాడు అపశకుని. ‘అవును మామా... నువ్వు కౌరవులపై ప్రతీకారం తీర్చుకోడానికి అలా చేశావు. మరి చంద్రబాబు నాయుడు అయిదు కోట్ల మంది ఆంధ్రులను ఎందుకు దెబ్బతీసినట్లు?’ అని అడిగాడు అపశకుని. శకుని బిగ్గరగా నవ్వేసి... 2004 నుండి 2014 వరకు ప్రజలు చంద్రబాబు నాయుణ్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రెండుసార్లు వరుసగా వై.ఎస్.ఆర్.ను గెలిపించారు. అదే బాబు కోపం. ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలపై పగబట్టారు అన్నాడు. అపశకుని నోట మాట లేదు. - నానాయాజీ -
తప్పుకుంటే పదివేలు
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! సప్త సముద్రాల్ పోటెత్తుతున్నాయి.ప్రళయ హోరుతో పదునాలుగు భువన భాండంబులు అల్లకల్లోలాలయ్యాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. భూగ్రహంపై ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. దేవుడా ఏంటీ బీభత్సం అని భక్తులు నిలదీస్తున్నారు.ప్రచండగాలుల తాకిడికి నారదుడే గాల్లో ఎగురుకుంటూ కైలాసాన్ని చేరుకున్నాడు. శివ పార్వతులు అప్పటికే ఏం జరుగుతోందా అని అయోమయంగా చూస్తున్నారు. ‘ఏం నారదా ఏం జరుగుతోంది? ఏంటీ వైపరీత్యం?’ అని ఆరా తీశారు. ‘ఏం చెప్పమంటావు పరమేశ్వరా? బ్రహ్మదేవుడు ఘోర తపస్సు చేస్తున్నారు. దాని ఫలితమే ఈ ప్రళయం’ అన్నాడు. ‘బ్రహ్మదేవుడు తపస్సా? ఎందుకోసం? ఎవరికోసం? అని శివుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. నారదుడు చిరునవ్వు నవ్వి ‘భూలోకమున.. భరత ఖండంబున.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంబందు నారా చంద్రబాబు నాయుడనే ముఖ్యమంత్రి ఉన్నాడు దేవా. ఆయన కోసమే నాన్నగారి తపస్సు’ అని చెప్పి వైకుంఠానికి బయలు దేరాడు.అక్కడ పాలకడలిపై శ్వేత తల్పంబున పడుకున్న విష్ణుమూర్తి అదిరి పడి లేచి... ‘ఏంటీ నిద్రాభంగం? ఏం జరుగుతోంది?’ అని నారదుని అడిగాడు. నారదుడు శివుడికి చెప్పిందే చెప్పాడు.‘ముల్లోకాలూ వణికిపోతున్నాయి దేవా. తమరు ఏదో ఒకటి చేయక తప్పదు’ అన్నాడు. విష్ణుమూర్తి కళ్లుమూసుకుని జరిగిందంతా తెలుసుకుని నారదుడి చెవిలో ఓ విషయం చెప్పారు. భూలోకంలో నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన కార్యాలయంలో సింగపూర్ ప్రతినిధులతో రాజధాని నిర్మాణ కాంట్రాక్టు ‘లావాదేవీ’ లు మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే నారదుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబు... సింగపూర్ ప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. ‘ఎవరయ్యా నువ్వు? దేవీ నవరాత్రి నాటకోత్సవాలు అయిపోయాయి కదా ఇంకా మేకప్ తియ్యలేదా? నిన్ను నా ఆఫీసులోకి ఎవరు రానిచ్చారు?’ ఆశ్చర్యం... కోపం కలగలిసాయా గొంతులో.నారదుడు నవ్వి... ‘నారాయణ. నేను నాటకాల్లో నారదుణ్ని కాదు నాయనా... నిజం నారదుడినే. లోక కళ్యాణం కోసమే వచ్చా’ అన్నాడు.చంద్రబాబు ఒక్కసారి కళ్లు నులుముకుని– ‘అవును నిజం నారదుడే కావచ్చు. లేదంటే సెక్యూరిటీని దాటి ఎలా వస్తాడు?’ అని నిర్ధారించుకుని... ‘ఏం పని మీద వచ్చారు మహాశయా?’ అని అడిగారు.‘చూడు నాయనా... నీకోసం మా నాయన ఘోరంగా తపస్సు చేస్తున్నారు. ఓసారి దర్శనమిచ్చి ఆయన కోరినకోరిక తీర్చేస్తే ప్రపంచాన్ని ప్రళయం నుండి కాపాడిన వాడివవుతావు’ అని సెలవిచ్చాడు. తన గురించి బ్రహ్మదేవుడే తపస్సు చేస్తున్నాడని తెలియగానే చంద్రబాబు మురిసిపోయారు. మీడియాకు ఈ వార్త వెంటనే తెలియజేయాల్సిందిగా పరకాల ప్రభాకర్‌ను ఆదేశించారు. మొత్తం మీడియాను వెంటబెట్టుకుని చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తోన్న చోటకు వెళ్లారు.బ్రహ్మదేవుడు తపస్సు చేస్తోన్న తీరును చూసి చంద్రబాబు మీడియా మిత్రులతో ‘బాగా కవర్ చేయండి. లైవ్‌లో చూపించేయండి’ అని ముచ్చటగా అడిగారు.అన్ని ఛానెళ్ల వారూ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారని నిర్ధారించుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి ‘బ్రహ్మదేవా.. దేవుళ్ల గురించి మా మనుషులు తపస్సు చేయడం తెలుసు కానీ.. మనిషి గురించి దేవుళ్లు తపస్సు చేయడం ఏంటి దేవా? చాలా ఆశ్చర్యంగా ఉంది? అయినా మీరంతటి వారు తపస్సు చేశారు కాబట్టి నేను వచ్చేశాను. మీకేం కావాలి దేవా? రాజధాని ప్రాంతంలో మీకేమన్నా గుడి కట్టించమంటారా? లేకపోతే మీ అబ్బాయి నారదులుంవారికి గుడి కట్టించమంటారా సరదాగా?’ అని అడిగాడు. బ్రహ్మదేవుడు కళ్లు తెరచి చంద్రబాబును చూడగానే ఉలిక్కిపడి ‘నాయనా.. నువ్వు ఇరగ్గొట్టిన గుడులు చాలు... నీకు చేతులెత్తి దండం పెడతా. నువ్వు ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్. కావాలంటే దేవలోకానికి నిన్ను రాజుని చేస్తాను.. ఆంధ్రలోకాన్నుంచి నువ్వు తప్పుకోవాలి తప్పదు..!’ అని కోరాడు.చంద్రబాబు కంగారు పడి ‘ఏం మాట్లాడుతున్నావు దేవా.. ముఖ్యమంత్రి పదవిని ఎలా వదులుకుంటాం? అయినా ఇలాంటి కోరికలు కోరతారా ఎవరైనా? అయినా నేనెందుకు రాజీనామా చేయాలో చెప్పు’ అని అడిగారు చంద్రబాబు. బ్రహ్మదేవుడు మొహం చిట్లించి ‘తమరి మొహం మండ... మీరు, మీ మంత్రులు.. మీ పరిపాలన.. నేను సృష్టించిన సకల జీవరాశులకూ నరకం చూపిస్తున్నారు. వాళ్లంతా మమ్మల్నెందుకు పుట్టించావు దేవుడా అని నన్ను తిట్టుకుంటున్నారు’ అన్నాడు. ‘మీరు సృష్టించిన ప్రాణులను నేనేం ఇబ్బంది పెడుతున్నాను దేవా?’ అని నాటకీయంగా అడిగారు చంద్రబాబు. బ్రహ్మదేవుడు కోపంగా చూసి ‘రైతులని బతకనివ్వడం లేదు నువ్వు. రుణమాఫీ చేస్తానన్నావు. ఆ హామీని పక్కన పెట్టావు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు. ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. అదీ మాట తప్పావు.మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉంటానన్నావు. ఆడవాళ్లని వేపుకు తింటున్న మీ ఎమ్మెల్యేలు.. మంత్రుల పరివారాలను చూసీ చూడనట్లు వదిలేశావు. నీ పాలనలో ఏ ప్రాణీ కూడా సుఖంగా లేదు. చివరకు పశువులకు మేత లేదు. ఎవ్వరికీ జీవించాలని లేదు. బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది కానీ.. నువ్వు తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో... ఆ మరుక్షణమే నిన్ను ఇంద్రలోకానికి అధిపతిని చేసేస్తాను’ అని బ్రహ్మదేవుడు ఆఫర్ ఇచ్చారు.‘ఇంద్రలోకానికి రాజంటే ఇక ఆ తర్వాత ఎన్నికలుండవా?’ అని అడిగారు చంద్రబాబు.బ్రహ్మదేవుడు నవ్వి – ‘ఉండవు. కొన్ని వేల సంవత్సరాల పాటు నువ్వే రాజువి’ అన్నాడు.చంద్రబాబు తనతో పాటు వచ్చిన మీడియా మిత్రుల్లో తనకి కావల్సిన వారిని కౌగలించుకుని ‘ఇక నేనే ఇంద్రుణ్ని.. నేనే ఇంద్రుణ్ని’ అని ఆనందంగా ఎగిరి గంతేస్తున్నారు.అంతలో హఠాత్తుగా ఎవరో తలమీద కొట్టినట్లయ్యింది. తల దిమ్మెక్కేసింది. ఓర్నాయనో, ఓరి కొడుకో అని కుయ్యో మొర్రో అన్నాడు.కళ్లు తెరిచి చూసే సరికి మంచం పక్కన కింద పడి ఉన్నారు. లోకేష్ బాబు చంద్రబాబు నెత్తిని పరీక్షిస్తూ, ‘నాన్నారూ? ఏమన్నా పీడకలా? ఓటుకు కోట్లు కేసు లాంటి ఇంకేమైనా లీకులు బయటపడినట్టు కలొచ్చిందా నాన్నారూ?’ అని పరామర్శించారు.‘అన్నీ లీకులేరా! భూలోకం నుంచి బ్రహ్మలోకం దాకా అన్నీ లీకులే లీకులు. ఆ కడప బిడ్డ అంటూనే ఉన్నాడు – ‘దేవుడే మనకు మొట్టికాయలు వేస్తాడు’ అని! అదే నిజమైంది. నెత్తి బొప్పికట్టింది’ అంటూ తనలో తను గొణుక్కుంటూ మళ్లీ ముసుగుతన్నేశారు. - నానాయాజీ -
పక్షిపాతం
హైదరాబాద్‌లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఓ చారిత్రక గోడ గడియారం ఉంది.అందులో ఓ సైనికుడు ఉంటాడు. ఆసైనికుడు ప్రతీ గంటకీ ఓసారి బయటకు వచ్చి ఎన్నిగంటలైందో అన్నిసార్లు గంట కొట్టి మళ్లీ లోపలికి వెళ్లిపోతాడు.సరిగ్గా ఆ సైనికుడిలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అప్పుడప్పుడు సినీ గడియారంలోంచి బయటకు వచ్చి ఏదో ఒకటి చెప్పి మళ్లీ లోపలికి వెళ్లిపోతూ ఉంటారు. తాను అలా వచ్చి వెళ్లకపోతే ప్రజలకు టైమ్ ఎంత అయ్యిందో చెప్పేవాళ్లే ఉండరని పవన్ అభిప్రాయం. బయటకు వచ్చే టైమ్ లేనపుడు ఆయన ట్విట్టర్లో తన మనసులో మాటలు పెట్టేసి ఊరుకుంటారు. ట్వీటువు పిట్టలా. ప్రత్యేక హోదా కోసం యువత పోరాడాలని అనే పవన్ కళ్యాణ్ తాను మాత్రం పోరాడరట. ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు రాష్ట్రాన్ని మోసం చేశారని ఓ పక్క అంటూనే... వాళ్లంటే తనకి చాలా గౌరవమని ఒకటికి పది సార్లు గుర్తు చేస్తూ ఉంటారు పవన్. అది గౌరవమా లేక భయమా అన్నది అర్థం కాక జనం అయోమయానికి గురవుతూ ఉంటారు. అయితే అనుభవజ్ఞులు మాత్రం అది భయమే అని అంటున్నారు. పల్లెటూరి కోడి పుంజులు (నగరాల్లో కనపడ్డం లేదనుకోండి) తాము కొక్కొరోకో అనకపోతే లోకానికి తెల్లారదని అనుకుంటూ ఉంటాయి. అందుకే ఎంత ఆలస్యంగా పడుకున్నా లోకం మీద జాలితో తెల్లారగట్టే లేచి కొక్కొరోకో అని కూస్తూ ఉంటాయి. ఈ కోడి పుంజు లాంటి వారే మన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. విభజన సమయంలో రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కావాలని తాను అడిగి ఉండకపోతే అసలు ప్రత్యేక హోదా అనేది ఒకటి ఉంటుందని ఎవరికీ తెలీదని ఆయన కొన్ని వందల సార్లు చాలా అమాయకంగా (కొండొకచో గడుసుగా) అంటూ వచ్చారు. ఎవరికీ తెలీదు కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఎవరూ అడగరులే అని ఆయన అనుకున్నారు. కానీ ప్రతిపక్షాలు... యువత ప్రత్యేక హోదా కోసం గట్టిగా నినదిస్తూ ఉంటే వెంకయ్యనాయుడు కళ్లు మూసుకుని ‘పాపం అంతా కాంగ్రెస్‌దే’ అంటున్నారు. కొంగ చెరువులో ఒంటికాలిపై నిలబడి తన ముక్కు గేలానికి అందే దూరంలో చేప వచ్చేంత వరకు జపం చేస్తున్నట్లు మౌనంగా నిరీక్షిస్తూ ఉంటుంది. చేప పిల్ల అటుగా వచ్చిన వెంటనే అమాంతం దాన్ని ఒడిసి పట్టుకుని భోంచేసి... మళ్లీ జపంలో పడిపోతుంది. సరిగ్గా ఈ కొంగలాగే మన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఎవరైనా తన గేలానికి పడే ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు కనిపిస్తే వారిని అమాంతం కొనేసి తన వైపు లాగేసుకుని... తాను నిజాయితీకి మారు పేరని... నిప్పులాంటివాడినని స్వయం కితాబునిచ్చుకుంటూ ఉంటారు. ఈ జపంలో నిమగ్నమైపోవడం వల్లనే ఆయనకు ప్రత్యేక హోదా కోసం జరుగుతోన్న ఉద్యమ ఘోష వినపడదు. ఆందోళనలు కనపడవు. చిలుక జోస్యం చెప్పేవాళ్ల చక్కటి తర్ఫీదు వారి పంజరంలోని చిలుకలను చూసి తెలుసుకోవచ్చు. చిలుక జోస్యం చెప్పేవారి దగ్గరకు జోస్యం చెప్పించుకునేందుకు వచ్చిన వారి పేరు మీద కార్డు తీయమని యజమాని చెప్పడమే తరువాయి... ఉన్న కార్డుల్లోంచి ఓ కార్డును ముక్కుతో తీసి పక్కన పెడుతుంది. ఆ కార్డును చూసి చిలుక జ్యోతిష్కుడు తనకు నచ్చింది చెప్పుకు పోతాడు. ఈ రామ చిలుక మాదిరిగానే మన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చిలుక జ్యోతిష్కుడు వెంకయ్యనాయుడు చెప్పినప్పుడల్లా ప్రత్యేక హోదా బదులు కేంద్రం రాష్ట్రానికి ఏమేమి ఇస్తుందో అప్పచెప్పేసి పంజరంలోకి వెళ్లిపోతున్నారు. ఉష్ట్ర పక్షి (ఆస్టిచ్ర్) ఏదన్నా ప్రమాదం ముంచుకొచ్చినపుడు తన తలను ఇసుకలోకి దింపి చాలాసేపు అలాగే ఉండిపోతుంది. ప్రధాని నరేంద్ర మోదీ సరిగ్గా అలాగే తన నిర్ణయాలపైనా తన విధానాలపైనా నిరసనతో ఎవరైనా ప్రశ్నలు సంధించడం మొదలు పెడితే ఏమీ మాట్లాడకుండా తలను మౌనంలోకి దూర్పేసి అలాగే ఉండిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి యూత్ ప్రత్యేక హోదా కోసం ఉద్యమించి నినదించినప్పుడల్లా కాకులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ కాకిగోల భరించలేక ఆయన స్పెషల్ స్టేటస్ ‘హూష్కాకి’ అని, స్పెషల్ ప్యాకేజ్ బెస్ట్ బ్రీఫ్‌కేస్ డీల్ అని యూత్‌ని లాఠీలతో తరిమికొట్టిస్తున్నారు.చెదిరిన తన గూడు ఏ చెట్టుమీద ఉందో మర్చిపోయిన వడ్రంగి పిట్టలా లోక్ సత్తా అధ్యక్షుడు జయ ప్రకాష్ నారాయణ్ ప్రత్యేక హోదా కోసం ఇపుడు సోషల్ మీడియాలో తెగ ఆరాట పడుతున్నారు. పాల నుండి నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే తాగే హంసలా జనం పాలకులు... పార్టీల నేతల చిత్ర విచిత్ర విన్యాసాలను నిశితంగా గమనిస్తున్నారు. ఎవరివి వేషాలో... ఎవరివి వెధవ్వేషాలో వాళ్లు తేలిగ్గానే పోల్చుకుంటున్నారు. ట్వీటువు పిట్టల... దొంగకొంగల... పంజరపు రామచిలుకల బలాలు... దౌర్బల్యాలను జనం బేరీజు వేసుకుంటున్నారు.పక్షులన్నీ ఇలా ఉంటే ఓ పంది మాత్రం ప్రత్యేక హోదాపై జోకులేసుకుంటూ వెళ్లిపోయింది. ఆ బురద జోకు భరించలేక జనం ముక్కులు మూసుకుని దూరంగా పరుగులు తీశారు. – నానాయాజీ -
షేర్‌ఖాన్ లోకేష్
పంచ్‌నామా నారా లోకేష్‌బాబును మొదటి నుంచీ లోకులు... కాకులు కూడా తక్కువగానే అంచనా వేస్తున్నారు. ప్రతీ విషయానికీ లోకేష్ బాబుపై సెటైర్లు వేయడం వాళ్లకి ఓ వ్యసనంగా మారిపోయింది. కొందరైతే ఆయన్ని పండిత పుత్రుడని కూడా వెక్కిరిస్తూ ఉంటారు. ఆయన రాజకీయాలకు పనికిరారని నోటికొచ్చినట్లు కూసిన మిత్రులూ ఉన్నారు. అయితే లోకేష్‌బాబు గొప్పతనం ఎక్కడుందంటే... ఆయన ఇలాంటి విమర్శలను వినీ విననట్లే వదిలేశారు. దేవుడు రెండు చెవులు ఇచ్చింది ఎందుకంటే మనకి నచ్చని మాటలు ఎవరైనా మాట్లాడితే ఓ చెవి నుంచి విని రెండో చెవి నుంచి వాటిని బయటకు పంపేయడం కోసమేనని లోకేష్‌బాబు నమ్ముతారు. లోకేష్‌బాబు అందరూ అనుకుంటున్నంత అమాయకుడేమీ కాదు. ఆయన నిజంగానే పెద్ద మేధావి. కొందరు చంద్రబాబు నాయుణ్ని రాజకీయ చాణక్యుడని అంటూ ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలిసిన వారని అంటారు. అదే లోకేష్‌బాబు విషయానికి వస్తే... పాపం లోకేష్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారో అని జాలిపడతారు. నిజానికి లోకేష్‌ను చూసి జాలిపడాల్సిందేమీ లేదు. మన అమాయకత్వాన్ని చూసి లోకేష్బాబే జాలిపడుతున్నారు. ఎందుకంటే మనమంతా అపరమేధావి అని కొనియాడే చంద్రబాబు నాయుడే తనకి ఏదన్నా సమస్య వచ్చినపుడు ఏం చేయాలా అని లోకేష్ బాబును అడుగుతూ ఉంటారు. ఈ విషయం బయటి ప్రపంచానికేకాదు... టిడిపి నేతలకు కూడా తెలీదు. ఆ మధ్య చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని బయట పెట్టారు.తొంభైలలో థర్డ్ ఫ్రంట్‌లో చాలామంది పెద్దలు చంద్రబాబు నాయుణ్ని ప్రధానిగా ఉండమన్నారట. చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలుపోలేదట. అపుడు లోకేష్‌బాబుకి ఫోన్ చేసి ‘ఏం చేయమంటావు సన్... ప్లీజ్ బ్రీఫ్ మీ’ అని అడిగారట. కాస్త ఆలోచించిన లోకేష్ బాబు కాస్త నిలకడగా ఉండే ఉద్యోగమే బెటర్ నాన్నా ప్రధాని పదవి వద్దు సిఎంగానే కంటిన్యూ అయిపో అన్నారట. ఈ సలహా ఇచ్చేటప్పటికి లోకేష్‌బాబు వయసు ఓన్లీ పదిహేనో పదహారో.అంత చిన్న వయసులోనే లోకేష్‌బాబు అంతటి రాజకీయ పాండిత్యాన్ని ప్రదర్శించారంటే ఆయనకి ఎంత భవిష్యత్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంత తెలివైన వారు కాబట్టే లోకేష్ బాబంటే అందరికీ అసూయ.విదేశాల్లో చదివి వచ్చిన లోకేష్‌బాబుకు డబ్బును ఎలా పెంచాలో బాగా తెలుసు. మన దగ్గర బిజినెస్‌లో ఆరితేరిన మేధావులకు సైతం సాధ్యంకాని విజయాలను లోకేష్ బాబు సొంతం చేసుకున్నారు.గత ఏడాది అక్టోబరులో లోకేష్ బాబు తన ఆస్తులను వెల్లడించారు. తన పేరిట 14 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. కొద్ది రోజుల క్రితం మళ్లీ తన ఆస్తులు వెల్లడించారు. ఈ సారి లోకేష్ ఆస్తులు 330 కోట్లకి పెరిగాయి. డబ్బులను ఎలా సంపాదించాలో వాటిని ఎలా పెంచుకోవాలో లోకేష్ బాబును చూసైనా నేర్చుకోండిరా అని పార్టీ పెద్దలు తమ పిల్లలకు క్లాసులు పీకే పరిస్థితులు నెలకొన్నాయిపుడు. లోకేష్ అంటే అసూయతో రగిలిపోయే వారంతా ఇంత తక్కువ సమయంలో వేల రెట్లు ఆదాయం ఎలా పెరిగిందంటూ లోకేష్‌ని నిలదీస్తున్నారు. అయితే దానికి లోకేష్ దీటుగానే బదులిచ్చారు.తాను గతంలో ఆస్తులు ప్రకటించినపుడు తన షేర్లను ఎంతకు కొన్నానో ఆ రేటు ప్రకారమే ఆస్తులను లెక్కకట్టి ప్రకటించానని... ఇపుడేమో మార్కెట్ విలువ ప్రకారం ఆస్తులు ప్రకటించానని చెప్పుకొచ్చారు. నేను అక్టోబరులో కొన్న షేర్లు ఇపుడు ఈ రేటు ఉన్నాయి నానేటి తప్పు చేసినాను? అని లోకేష్‌బాబు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. అయితే షేర్ల గురించి తెలిసిన బిజినెస్ పండితులందరూ ఏక కంఠంతో... ఆరు నెలల్లో షేర్ల ధరలు ఇన్ని వేల రెట్లు పెరగితే... సెన్సెక్స్ సూచి 70 వేల పాయింట్లు దాటి ఉండాలి కదా అంటున్నారు. ఇది ఫ్రాడ్, చీటింగ్, మోసం, కుట్ర అని నసుగుతున్నారు. - నానాయాజీ