వెనకయ్య... సట్టం లేదు సుట్టం లేదు!
పంచ్ వేస్తే త్రివిక్రమ్ శ్రీనివాసే వేయాలంటారు. కానీ నామటుకు నేనైతే దాన్ని ఒప్పుకోను. అసలు పంచ్ అంటేనే మా వెనకయ్యనాయుడు గోరు. నా సిన్నప్పట్నుంచీ చూస్తున్నా... అబ్బ ఏం పంచ్‌లు వేస్తారో. ఆయన పంచ్‌లు తెగ నచ్చేయడం వల్లనేనండీ బాబూ వెనకయ్యనాయుడిగోరిని బిజెపి జాతీయ పెసిడెంట్ చేశారు. ఇంత వయసు వచ్చినా మా వెనకయ్య పంచ్‌లు మానలేదు.నిన్ననో మొన్ననో నెల్లూరులో వెనకయ్యగోరేమన్నారంటే... ‘‘అరేయ్! నా ఎనకమాల ఎవరూ నిలబడకండ్రా... ఎనకాల ఉన్నోళ్లు వెన్నుపోటు పొడిచేత్తారు’’ అని కొంచెం బయపడ్డారు.
1984లో ఎన్టీఆర్‌ని కూడా ఎనకమాల ఉన్నవారే వెన్నుపోటు పొడిచీశారని వెనకయ్య గుర్తు చేసుకున్నారు. ఈ ఇసయం మా నెల్లూరు పెద్దారెడ్డికి సెబితే ‘‘వెనకయ్యగోరికి 1984 గుర్తుంది కానీ, 1995 గుర్తులేదా’’ అని ఎటకారం ఆడాడు. చెప్పొద్దూ నాకు ఒళ్లు మండింది. ‘‘ఎదవ కూతలు కూస్తే గూబ్బగులుద్ది’’ అని సీరియస్ అయిపోనాను. దానికి మా పెద్దారెడ్డి మరింత సీరియస్ అయిపోయి... ‘‘ఏంట్రా... 1995లోనూ ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిసారుగా. మరది గుర్తునేదా వెనకయ్యనాయుడికి’’ అన్నాడు.
సమయానికి మా శేషాచలం వచ్చి... ‘‘1995ది వెన్నుపోటు కాదెహె! 1995లో సెందరబాబు ఎన్టీఆర్‌కి వెనకమాల లేడురా బాబూ... పక్కనే ఉండి గురి చూసి పొడిచేశాడు’’ అన్నాడు. వెనకయ్య 2014లో 1984 లోలా చేశారు’’ అన్నాడు. ‘‘అంటే’’ అని అడిగాను.‘‘అదేరా పెత్యేక హోదా ఇప్పిస్తానని రాజెసబలో పెమానికం చేశారు కదా. ఏపీ జెనమంతా వెనకయ్య వెనకమాలే ఫాలో అయిపోనారు. అధికారం లోకి వచ్చాక పెత్యేక హోదా లేదురా బాబూ నేను ఉత్తినే అన్నా అని మరో పంచ్ వేసి ఏపీ జెనానికి వెన్నుపోటు పొడిచినారు. అందుకే ఇపుడు తన వెనకమాల ఎవరూ ఉండద్దని ఆయనగారు చెబుతున్నారు’’ అన్నాడు.
శేషాచలానికి వెనకయ్య ఆట్టే నచ్చడు. అందుకే ఇట్టం వచ్చినట్లు మాట్లాడతాడు. అది పక్కన పెట్టేత్తే వెనకయ్య నాయుడిగోరి పంచ్ గురించి మాట్లాడుకుందారి. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి మంతిరి పదవులు ఇచ్చారని సెందరబాబుని అన్ని పార్టీలోళ్లూ ఆడిపోసుకుంటున్నారు. ఫిరాయింపులు ఆపడానికి ఏదన్నా సట్టం తెత్తారా అని జరనలిస్టులు అడిగారు. ఆయన... ‘ఓ పారిటీకి ఇబ్బంది వస్తుందని సట్టాలు సేయాలేంటి?’ అనేశారు. దాంతో జరనలిస్టులకు మాట పడిపోయింది. ఇదే ఇసయం మా శేషాచలానికి చెబితే.. ‘‘మాట పడిపోడం ఏట్రా, అలాంటి జవాబులు వింటే పేనాలే పోతాయి’’ అని ఎటకారంగా నవ్వాడు.సెందరబాబుకీ మా వెనకయ్యకి మంచి స్నేహితం ఉంది. అలాంటపుడు సెందరబాబు గోరిని ఇబ్బంది పెట్టడం నేయమా? అందుకే సట్టం నేదు.. సుట్టం నేదు అని బల్లగుద్ది సెప్పేసారు.