అశోక్ కుమార్, కృష్ణచైతన్య, íసీహెచ్ రామారావు, వెంకయ్యనాయుడు, సీహెచ్ ఫణి, ఆర్. నారాయణమూర్తి
‘‘ఘంటసాలగారిని శతాబ్ది గాయకుడు (సింగర్ ఆఫ్ సెంచరీ) అంటారు. ఆయన్ను నేను అమర గాయకుడు అంటాను. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం సంగీతంతో సాగుతూ... స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా, సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాను’’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దివంగత ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల: ది గ్రేట్’.
ఈ చిత్రంలో ఘంటసాలపాత్రలో కృష్ణచైతన్య నటించారు. ఘంటసాల భార్య సావిత్రిపాత్రలో కృష్ణచైతన్య భార్య మృదుల నటించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో సీహెచ్ ఫణి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌పోస్టర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారిపై సినిమా తీసినందుకు ఫణిగారిని అభినందిస్తున్నాను. కృష్ణచైతన్య, మృదులలను మెచ్చుకుంటున్నాను.
సదుద్దేశంతో తీసిన ఈ సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం’’ అన్నారు. మరో అతిథి దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి. ఉత్తరాది గాయకులకు ఇచ్చి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్‌కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘ఘంటసాలగారిపాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం కొందరికే తెలుసు. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది’’ అని తెలిపారు సీహెచ్ రామారావు.
Comments
Please login to add a commentAdd a comment