షేర్‌ఖాన్ లోకేష్
పంచ్‌నామా
నారా లోకేష్‌బాబును మొదటి నుంచీ లోకులు... కాకులు కూడా తక్కువగానే అంచనా వేస్తున్నారు. ప్రతీ విషయానికీ లోకేష్ బాబుపై సెటైర్లు వేయడం వాళ్లకి ఓ వ్యసనంగా మారిపోయింది. కొందరైతే ఆయన్ని పండిత పుత్రుడని కూడా వెక్కిరిస్తూ ఉంటారు. ఆయన రాజకీయాలకు పనికిరారని నోటికొచ్చినట్లు కూసిన మిత్రులూ ఉన్నారు. అయితే లోకేష్‌బాబు గొప్పతనం ఎక్కడుందంటే... ఆయన ఇలాంటి విమర్శలను వినీ విననట్లే వదిలేశారు. దేవుడు రెండు చెవులు ఇచ్చింది ఎందుకంటే మనకి నచ్చని మాటలు ఎవరైనా మాట్లాడితే ఓ చెవి నుంచి విని రెండో చెవి నుంచి వాటిని బయటకు పంపేయడం కోసమేనని లోకేష్‌బాబు నమ్ముతారు. లోకేష్‌బాబు అందరూ అనుకుంటున్నంత అమాయకుడేమీ కాదు.
ఆయన నిజంగానే పెద్ద మేధావి. కొందరు చంద్రబాబు నాయుణ్ని రాజకీయ చాణక్యుడని అంటూ ఉంటారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలిసిన వారని అంటారు. అదే లోకేష్‌బాబు విషయానికి వస్తే... పాపం లోకేష్ రాజకీయాల్లో ఎలా రాణిస్తారో అని జాలిపడతారు. నిజానికి లోకేష్‌ను చూసి జాలిపడాల్సిందేమీ లేదు. మన అమాయకత్వాన్ని చూసి లోకేష్‌బాబే జాలిపడుతున్నారు. ఎందుకంటే మనమంతా అపరమేధావి అని కొనియాడే చంద్రబాబు నాయుడే తనకి ఏదన్నా సమస్య వచ్చినపుడు ఏం చేయాలా అని లోకేష్ బాబును అడుగుతూ ఉంటారు. ఈ విషయం బయటి ప్రపంచానికేకాదు... టిడిపి నేతలకు కూడా తెలీదు.
ఆ మధ్య చంద్రబాబు నాయుడే ఈ విషయాన్ని బయట పెట్టారు.తొంభైలలో థర్డ్ ఫ్రంట్‌లో చాలామంది పెద్దలు చంద్రబాబు నాయుణ్ని ప్రధానిగా ఉండమన్నారట. చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలుపోలేదట. అపుడు లోకేష్‌బాబుకి ఫోన్ చేసి ‘ఏం చేయమంటావు సన్... ప్లీజ్ బ్రీఫ్ మీ’ అని అడిగారట. కాస్త ఆలోచించిన లోకేష్ బాబు కాస్త నిలకడగా ఉండే ఉద్యోగమే బెటర్ నాన్నా ప్రధాని పదవి వద్దు సిఎంగానే కంటిన్యూ అయిపో అన్నారట. ఈ సలహా ఇచ్చేటప్పటికి లోకేష్‌బాబు వయసు ఓన్లీ పదిహేనో పదహారో.అంత చిన్న వయసులోనే లోకేష్‌బాబు అంతటి రాజకీయ పాండిత్యాన్ని ప్రదర్శించారంటే ఆయనకి ఎంత భవిష్యత్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంత తెలివైన వారు కాబట్టే లోకేష్ బాబంటే అందరికీ అసూయ.విదేశాల్లో చదివి వచ్చిన లోకేష్‌బాబుకు డబ్బును ఎలా పెంచాలో బాగా తెలుసు. మన దగ్గర బిజినెస్‌లో ఆరితేరిన మేధావులకు సైతం సాధ్యంకాని విజయాలను లోకేష్ బాబు సొంతం చేసుకున్నారు.గత ఏడాది అక్టోబరులో లోకేష్ బాబు తన ఆస్తులను వెల్లడించారు. తన పేరిట 14 కోట్ల ఆస్తులు ఉన్నాయన్నారు. కొద్ది రోజుల క్రితం మళ్లీ తన ఆస్తులు వెల్లడించారు. ఈ సారి లోకేష్ ఆస్తులు 330 కోట్లకి పెరిగాయి. డబ్బులను ఎలా సంపాదించాలో వాటిని ఎలా పెంచుకోవాలో లోకేష్ బాబును చూసైనా నేర్చుకోండిరా అని పార్టీ పెద్దలు తమ పిల్లలకు క్లాసులు పీకే పరిస్థితులు నెలకొన్నాయిపుడు. లోకేష్ అంటే అసూయతో రగిలిపోయే వారంతా ఇంత తక్కువ సమయంలో వేల రెట్లు ఆదాయం ఎలా పెరిగిందంటూ లోకేష్‌ని నిలదీస్తున్నారు.
అయితే దానికి లోకేష్ దీటుగానే బదులిచ్చారు.తాను గతంలో ఆస్తులు ప్రకటించినపుడు తన షేర్లను ఎంతకు కొన్నానో ఆ రేటు ప్రకారమే ఆస్తులను లెక్కకట్టి ప్రకటించానని... ఇపుడేమో మార్కెట్ విలువ ప్రకారం ఆస్తులు ప్రకటించానని చెప్పుకొచ్చారు. నేను అక్టోబరులో కొన్న షేర్లు ఇపుడు ఈ రేటు ఉన్నాయి నానేటి తప్పు చేసినాను? అని లోకేష్‌బాబు ధర్మాగ్రహం వ్యక్తం చేశారు. అయితే షేర్ల గురించి తెలిసిన బిజినెస్ పండితులందరూ ఏక కంఠంతో... ఆరు నెలల్లో షేర్ల ధరలు ఇన్ని వేల రెట్లు పెరగితే... సెన్సెక్స్ సూచి 70 వేల పాయింట్లు దాటి ఉండాలి కదా అంటున్నారు. ఇది ఫ్రాడ్, చీటింగ్, మోసం, కుట్ర అని నసుగుతున్నారు.
- నానాయాజీ