శకుని... అపశకుని
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్‌లుక్!
శకుని మామ చేతిలో పాచికలు ఆడిస్తూ ఆలోచిస్తున్నాడు. ‘మామా... ఏపీకి ప్రత్యేక హోదా రానట్లేనా’ అన్నాడు అపశకుని. శకుని ఆలోచనలోంచి బయట పడి ‘ఏంటో అన్నావ్’ అన్నాడు ప్రశ్నార్థకంగా. ‘ఏపీ... ప్రత్యేక హోదా’ నసిగాడు అపశకుని. ‘ఈ శకునిని మించిన శకుని ఏపీలో ఉంటే ప్రత్యేక హోదా ఎలా వస్తుంది?’ అన్నాడు శకుని. అపశకునికి అర్థం కాలేదు. ‘నిన్ను మించిన శకుని ఎవరు మామా?’ అని అడిగాడు. శకుని నవ్వి... ‘చంద్రబాబే ఏపీ శకుని. నేను కౌరవులతో ఉంటూ వారిని దివాళా తీయించా. చంద్రబాబేమో అయిదు కోట్ల మంది నెత్తిన శఠగోపం పెట్టాడు. నాకు మించిన మాయోపాయాలు ఉన్నాయి చంద్రబాబు దగ్గర. ప్రత్యేక హోదా కేంద్రానికి గుర్తుందో లేదో కానీ... చంద్రబాడు మాకు హోదా వద్దు ప్యాకేజీ చాలని వెంటపడ్డాడు. ఆయనకు వెంకయ్యనాయుడు తోడు. ఇద్దరూ కలిసి 5 కోట్ల ఆంధ్రులకు కుచ్చుటోపీ పెట్టారు’ అన్నాడు శకుని.
‘మరి అసెంబ్లీలో బాబు కేంద్రమంత్రులకు, ప్రధానికీ థ్యాంక్స్ చెప్పారు కదా ఎందుకు? అని అడిగాడు అపశకుని. ‘ఏపీని బాగా ముంచినందుకు వెంకయ్యకీ.. అరుణ్ జైట్లీకి థ్యాంక్స్ చెప్పారు’ అన్నాడు. ‘ముంచిన వాళ్లకి ఎవరన్నా థ్యాంక్స్ చెప్తారా ఏంటి మామా?’ అన్నాడు అపశకుని.‘అదే రాజకీయం. బాబు హోదా తేలేకపోయాడు. ప్యాకేజీనే లాభం అనుకున్నాడు. జనానికి అది తెలిస్తే తరిమి తరిమి కొడతారు. అందుకే ప్యాకేజీ మహాప్రసాదమని నటిస్తున్నాడు’ అన్నాడు శకుని. ‘దారుణం కాదా శకుని మామా?’
‘అంతకన్నా దారుణం ఇంకోటుందిరా. చంద్రబాబు భజన చేసే తోక పత్రిక ఉంది కదా... అదేమో ఏకంగా ప్రత్యేక ప్యాకేజీ కోసం అయిదు కోట్ల మంది ఆంధ్రులు మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారని కతలు చెప్పేసింది. వాళ్లంతా థ్యాంక్స్ చెప్తున్నారట. ఎవరు చెప్పారో, ఎవరికి చెప్పారో ఆ పత్రిక్కీ ఆ కండువాలకే తెలియాలి’ అన్నాడు శకుని.‘అందరూ అన్యాయంగా నీ గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు కానీ... మరీ దారుణంగా ఉన్నారన్నా’ అన్నాడు అపశకుని. ‘అవును మామా... నువ్వు కౌరవులపై ప్రతీకారం తీర్చుకోడానికి అలా చేశావు. మరి చంద్రబాబు నాయుడు అయిదు కోట్ల మంది ఆంధ్రులను ఎందుకు దెబ్బతీసినట్లు?’ అని అడిగాడు అపశకుని. శకుని బిగ్గరగా నవ్వేసి... 2004 నుండి 2014 వరకు ప్రజలు చంద్రబాబు నాయుణ్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. రెండుసార్లు వరుసగా వై.ఎస్.ఆర్.ను గెలిపించారు. అదే బాబు కోపం. ఆ కోపంతోనే చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలపై పగబట్టారు అన్నాడు. అపశకుని నోట మాట లేదు.
- నానాయాజీ