పట్టిసీమా... వట్టిసీమా?
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్‌లుక్!
‘‘ఎంతైనా సెందరబాబు గ్రేటురా’’ అన్నాడు ఏకాంబరం. ‘‘అది నిజవే కానీ... ఇపుడు హఠాత్తుగా ఆయనెందుకు గుర్తుకొచ్చాడు’’ అన్నాడు చిదంబరం. ‘‘పట్టిసీమతో నీళ్లిస్తానన్నాడా ఆ బాబు. ఇచ్చేశాడు. ఆ నీటితో రైతులంతా పంట పండించేసి... ఆ బియ్యంతో పరమాన్నం వండేసి సెందరబాబుకి ఓ గిన్నెలో తీసుకొచ్చి పెట్టార్రా... సెందరబాబంటే మజాకేంటి?’’ అన్నాడు ఏకాంబరం పూనకం వచ్చినట్లు.‘‘అరేయ్... నాకు తెలీక అడుగుతాను ఆ పాయసం వండిన బియ్యం పట్టిసీమ నీళ్లతోనే పండించారేట్రా?’’ అని ఆరా తీశాడు చిదంబరం.‘‘అరే వాళ్లే చెప్పారు కదరా బాబూ! నువ్వు టీవీల్లో చూడనేదా ఏటి?’’ అని ప్రశ్నించాడు ఏకాంబరం.
‘‘టీవీల్లో చాలా చూపిస్తార్రా బాబూ. అక్కడకొచ్చిన వాళ్లసలు రైతులో కాదో కూడా డౌటే’’ అన్నాడు చిదంబరం.‘అదేంట్రా నీకన్నీ అనుమానాలే... అయినా నీకెందుకొచ్చింది అనుమానం’’ అన్నాడు ఏకాంబరం.‘‘ఎందుకంటే... అసలు పట్టిసీమ ప్రాజెక్టే ఓ బొంగులో ప్రాజెక్టని కాగ్ చెప్పేసింది కదేటి. అసలు పట్టిసీమ నుండి తీసుకెళ్లిన నీళ్లని కృష్ణా నీటితో కలిపి సముద్రంలో కలిపేశారట. ఇంతోడి దానికి వందల కోట్లు ఉత్తి పుణ్యానికి తినేశారని కాగ్ ఏకి పారేసిందనుకో’’ అన్నాడు చిదంబరం. ‘‘ఏకాంబరానికి ఒళ్లు మండింది. అరే అపోజిషన్ వాళ్లు అలాగే చెబుతార్రా, అవి నమ్మద్దు’’ అన్నాడు.
చిదంబరం పగలబడి నవ్వి... ‘‘కాగ్ అంటే పెతిపక్షం కాదెహె... అది గౌర్మెంట్ సంస్థే. పెబుత్వం ఖర్చు పెట్టే పెతీ పైసాకీ లెక్కలూ గట్రా సరి చూసి ఎంత తగలేశారో... ఎంత తినేశారో వివరంగా చెబుతూ పుస్తకాలు రాస్తారన్నమాట వాళ్లు’’ అన్నాడు చిదంబరం.‘‘ఏకాంబరానికి ఓడిపోవడం ఇష్టం లేదు. అయితే కాగ్ వాళ్లు పెతి పక్షంతో కలిసిపోయి ఊరికే బురద జల్లుతున్నారేమో ఎవరికి తెలుసు?’’ అన్నాడు.‘‘ఛస్ ఊరుకోయేస్. ఎక్కువ తక్కువ మాట్లాడేవంటే పళ్లు రాలిపోతాయి నోటికెంతొస్తే అంతా వాగేయడమేనేటి?’’ అని చిదంబరం సీరియస్ అయ్యాడు. ఏకాంబరానికి ఏమనాలో అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు.