తప్పుకుంటే పదివేలు | current political situation in a humorous outlook on the fun! | Sakshi
Sakshi News home page

తప్పుకుంటే పదివేలు

Published Fri, Mar 17 2017 10:53 PM | Last Updated on Tue, Oct 9 2018 6:34 PM

తప్పుకుంటే పదివేలు - Sakshi

తప్పుకుంటే పదివేలు

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  సరదాగా ఒక హ్యూమరస్‌ ఔట్‌లుక్‌!

సప్త సముద్రాల్‌ పోటెత్తుతున్నాయి.ప్రళయ హోరుతో పదునాలుగు భువన భాండంబులు అల్లకల్లోలాలయ్యాయి. ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడం లేదు. భూగ్రహంపై ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. దేవుడా ఏంటీ బీభత్సం అని భక్తులు నిలదీస్తున్నారు.ప్రచండగాలుల తాకిడికి నారదుడే గాల్లో ఎగురుకుంటూ కైలాసాన్ని చేరుకున్నాడు. శివ పార్వతులు అప్పటికే ఏం జరుగుతోందా అని అయోమయంగా చూస్తున్నారు. ‘ఏం నారదా ఏం జరుగుతోంది? ఏంటీ వైపరీత్యం?’ అని ఆరా తీశారు.

‘ఏం చెప్పమంటావు పరమేశ్వరా? బ్రహ్మదేవుడు ఘోర తపస్సు చేస్తున్నారు. దాని ఫలితమే ఈ ప్రళయం’ అన్నాడు. ‘బ్రహ్మదేవుడు తపస్సా? ఎందుకోసం? ఎవరికోసం? అని శివుడు ప్రశ్నల వర్షం కురిపించాడు. నారదుడు చిరునవ్వు నవ్వి ‘భూలోకమున.. భరత ఖండంబున.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంబందు నారా చంద్రబాబు నాయుడనే ముఖ్యమంత్రి ఉన్నాడు దేవా. ఆయన కోసమే నాన్నగారి తపస్సు’ అని చెప్పి వైకుంఠానికి బయలు దేరాడు.అక్కడ పాలకడలిపై శ్వేత తల్పంబున పడుకున్న విష్ణుమూర్తి అదిరి పడి లేచి... ‘ఏంటీ నిద్రాభంగం? ఏం జరుగుతోంది?’ అని నారదుని అడిగాడు. నారదుడు శివుడికి చెప్పిందే చెప్పాడు.‘ముల్లోకాలూ వణికిపోతున్నాయి దేవా.

తమరు ఏదో ఒకటి చేయక తప్పదు’ అన్నాడు. విష్ణుమూర్తి కళ్లుమూసుకుని జరిగిందంతా తెలుసుకుని నారదుడి చెవిలో ఓ విషయం చెప్పారు. భూలోకంలో నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని తన కార్యాలయంలో సింగపూర్‌ ప్రతినిధులతో రాజధాని నిర్మాణ కాంట్రాక్టు ‘లావాదేవీ’ లు మాట్లాడుతున్నారు. సరిగ్గా అప్పుడే నారదుడు ప్రత్యక్షమయ్యాడు. చంద్రబాబు... సింగపూర్‌ ప్రతినిధులు ఉలిక్కిపడ్డారు. ‘ఎవరయ్యా నువ్వు? దేవీ నవరాత్రి నాటకోత్సవాలు అయిపోయాయి కదా ఇంకా మేకప్‌ తియ్యలేదా? నిన్ను నా ఆఫీసులోకి ఎవరు రానిచ్చారు?’ ఆశ్చర్యం... కోపం కలగలిసాయా గొంతులో.నారదుడు నవ్వి... ‘నారాయణ. నేను నాటకాల్లో నారదుణ్ని కాదు నాయనా... నిజం నారదుడినే. లోక కళ్యాణం కోసమే వచ్చా’     అన్నాడు.చంద్రబాబు ఒక్కసారి కళ్లు నులుముకుని– ‘అవును నిజం నారదుడే కావచ్చు. లేదంటే సెక్యూరిటీని దాటి ఎలా వస్తాడు?’ అని నిర్ధారించుకుని... ‘ఏం పని మీద వచ్చారు మహాశయా?’ అని అడిగారు.‘చూడు నాయనా... నీకోసం మా నాయన ఘోరంగా తపస్సు చేస్తున్నారు. ఓసారి దర్శనమిచ్చి ఆయన కోరినకోరిక తీర్చేస్తే ప్రపంచాన్ని ప్రళయం నుండి కాపాడిన వాడివవుతావు’ అని సెలవిచ్చాడు.

తన గురించి బ్రహ్మదేవుడే తపస్సు చేస్తున్నాడని తెలియగానే చంద్రబాబు మురిసిపోయారు. మీడియాకు ఈ వార్త వెంటనే తెలియజేయాల్సిందిగా పరకాల ప్రభాకర్‌ను ఆదేశించారు. మొత్తం మీడియాను వెంటబెట్టుకుని చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తోన్న చోటకు వెళ్లారు.బ్రహ్మదేవుడు తపస్సు చేస్తోన్న తీరును చూసి చంద్రబాబు మీడియా మిత్రులతో ‘బాగా కవర్‌ చేయండి. లైవ్‌లో చూపించేయండి’ అని ముచ్చటగా అడిగారు.అన్ని ఛానెళ్ల వారూ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేశారని నిర్ధారించుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి  ‘బ్రహ్మదేవా.. దేవుళ్ల గురించి మా మనుషులు తపస్సు చేయడం  తెలుసు కానీ.. మనిషి గురించి దేవుళ్లు తపస్సు చేయడం ఏంటి  దేవా? చాలా ఆశ్చర్యంగా ఉంది? అయినా మీరంతటి వారు తపస్సు చేశారు కాబట్టి నేను వచ్చేశాను. మీకేం కావాలి దేవా? రాజధాని ప్రాంతంలో మీకేమన్నా గుడి కట్టించమంటారా? లేకపోతే మీ అబ్బాయి నారదులుంవారికి గుడి కట్టించమంటారా సరదాగా?’ అని అడిగాడు.

బ్రహ్మదేవుడు కళ్లు తెరచి చంద్రబాబును చూడగానే ఉలిక్కిపడి ‘నాయనా.. నువ్వు ఇరగ్గొట్టిన గుడులు చాలు... నీకు చేతులెత్తి దండం పెడతా. నువ్వు ముందు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చెయ్‌. కావాలంటే దేవలోకానికి నిన్ను రాజుని చేస్తాను.. ఆంధ్రలోకాన్నుంచి నువ్వు తప్పుకోవాలి తప్పదు..!’ అని కోరాడు.చంద్రబాబు కంగారు పడి ‘ఏం మాట్లాడుతున్నావు దేవా.. ముఖ్యమంత్రి పదవిని ఎలా వదులుకుంటాం? అయినా ఇలాంటి కోరికలు కోరతారా ఎవరైనా? అయినా నేనెందుకు రాజీనామా చేయాలో చెప్పు’ అని అడిగారు చంద్రబాబు.

బ్రహ్మదేవుడు మొహం చిట్లించి ‘తమరి మొహం మండ... మీరు, మీ మంత్రులు.. మీ పరిపాలన.. నేను సృష్టించిన సకల జీవరాశులకూ నరకం చూపిస్తున్నారు. వాళ్లంతా మమ్మల్నెందుకు పుట్టించావు దేవుడా అని నన్ను తిట్టుకుంటున్నారు’ అన్నాడు. ‘మీరు సృష్టించిన ప్రాణులను నేనేం ఇబ్బంది పెడుతున్నాను దేవా?’ అని నాటకీయంగా అడిగారు చంద్రబాబు.

బ్రహ్మదేవుడు  కోపంగా చూసి ‘రైతులని బతకనివ్వడం లేదు నువ్వు. రుణమాఫీ చేస్తానన్నావు. ఆ హామీని పక్కన పెట్టావు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నావు. ఉద్యోగం ఇచ్చేవరకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. అదీ మాట తప్పావు.మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉంటానన్నావు. ఆడవాళ్లని వేపుకు తింటున్న మీ ఎమ్మెల్యేలు.. మంత్రుల పరివారాలను చూసీ చూడనట్లు వదిలేశావు. నీ పాలనలో ఏ ప్రాణీ కూడా సుఖంగా లేదు. చివరకు పశువులకు మేత లేదు. ఎవ్వరికీ జీవించాలని లేదు.

బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది కానీ.. నువ్వు తక్షణమే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకో... ఆ మరుక్షణమే నిన్ను ఇంద్రలోకానికి అధిపతిని చేసేస్తాను’ అని బ్రహ్మదేవుడు ఆఫర్‌ ఇచ్చారు.‘ఇంద్రలోకానికి రాజంటే ఇక ఆ తర్వాత ఎన్నికలుండవా?’ అని అడిగారు చంద్రబాబు.బ్రహ్మదేవుడు నవ్వి – ‘ఉండవు. కొన్ని వేల సంవత్సరాల పాటు నువ్వే రాజువి’ అన్నాడు.చంద్రబాబు తనతో పాటు వచ్చిన మీడియా మిత్రుల్లో తనకి కావల్సిన వారిని కౌగలించుకుని ‘ఇక నేనే ఇంద్రుణ్ని.. నేనే ఇంద్రుణ్ని’ అని ఆనందంగా ఎగిరి గంతేస్తున్నారు.అంతలో హఠాత్తుగా ఎవరో తలమీద కొట్టినట్లయ్యింది. తల దిమ్మెక్కేసింది. ఓర్నాయనో, ఓరి కొడుకో అని కుయ్యో మొర్రో అన్నాడు.కళ్లు తెరిచి చూసే సరికి మంచం పక్కన కింద పడి ఉన్నారు.

లోకేష్‌ బాబు చంద్రబాబు నెత్తిని పరీక్షిస్తూ, ‘నాన్నారూ?  ఏమన్నా పీడకలా? ఓటుకు కోట్లు కేసు లాంటి ఇంకేమైనా లీకులు బయటపడినట్టు కలొచ్చిందా నాన్నారూ?’ అని పరామర్శించారు.‘అన్నీ లీకులేరా! భూలోకం నుంచి బ్రహ్మలోకం దాకా అన్నీ లీకులే లీకులు. ఆ కడప బిడ్డ అంటూనే ఉన్నాడు – ‘దేవుడే మనకు మొట్టికాయలు వేస్తాడు’ అని! అదే నిజమైంది. నెత్తి బొప్పికట్టింది’ అంటూ తనలో తను గొణుక్కుంటూ మళ్లీ ముసుగుతన్నేశారు.

- నానాయాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement