ఏం ఇప్పుడే నోరు లేస్తోందేం? | current political situation in a humorous outlook on the fun | Sakshi
Sakshi News home page

ఏం ఇప్పుడే నోరు లేస్తోందేం?

Published Fri, Apr 7 2017 11:39 PM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

ఏం ఇప్పుడే నోరు లేస్తోందేం? - Sakshi

ఏం ఇప్పుడే నోరు లేస్తోందేం?

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై  సరదాగా ఒక హ్యూమరస్‌ ఔట్‌లుక్‌!

ఓ సీనియర్‌ మంత్రి... దర్జాగా కారులో ఇంటికి బయలు దేరారు. ఇంటికి వెళ్లగానే రిలాక్సింగ్‌ చెయిర్‌ లో కూర్చుని ఏసీ గాలికి చల్లబడుతున్నారు. ఫోను మోగింది. మంత్రిగారు ఎత్తారు. ‘‘ఏవండీ! మా బామ్మర్దిని ట్రాన్స్‌ ఫర్‌ చేయిస్తామన్నారు. ఆరు నెలలు దాటిపోయింది. ఎప్పుడువుతుంది సార్‌?’’ అవతలి కంఠం ఫోనులో ఆరా తీసింది. మంత్రిగారికి మండుకొచ్చింది. ‘‘పిచ్చ పిచ్చగా ఉందా? అయినప్పుడు అవుతుంది. అయినా ఆ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసులు ఉంటే ఏనాడైనా మాట్లాడావా నువ్వు? ఇప్పుడు గొంతు లేస్తోందేం నీకు?’’ అని ఫోను పెట్టేశారు. పనిమనిషి చల్లటి ద్రాక్షరసం తెచ్చి ఇచ్చింది.

ద్రాక్షరసం తాగుతూ ఆలోచనలో పడ్డారు. పనిమనిషి ధైర్యం తెచ్చుకుని.. ‘‘అయ్యగారూ... ఏడాది క్రితమే జీతం పెంచుతామన్నారు. ఈ నెల అయినా...?’’ అని దయనీయంగా అడిగింది. మంత్రికి మళ్లీ కోపం వచ్చింది. ‘‘ఎప్పుడు పెంచాలో నాకు తెలుసు. అయినా ఆ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కేసులు ఎందుకున్నాయని ఎప్పుడైనా అడిగావా నువ్వు? నన్ను అడగడానికి మాత్రం నోరు లేస్తుందా?’’ అని జాడించేశారు. పనిమనిషి బిక్క చచ్చిపోయింది. ఓ గంట సేపు అలాగే కూర్చుని వరండాలోకి వెళ్లారు మంత్రిగారు. చాలా కాలం తర్వాత చూడ్డం చేత పెంపుడు కుక్క ఒక్కసారిగా మొరిగింది. మంత్రి సీరియస్‌ అయిపోయారు – ‘‘దొంగముండా... పీకల దాకా మాంసం దబ్బుకు తిని నామీదే అరుస్తావా? ఏం ఆ జగన్‌ని చూసి ఎప్పుడైనా మొరిగావా?’’ అని కోపంగా దాని తలని కాలితో తన్నబోయారు.

అపార్థం చేసుకున్న కుక్కగారు అమాంతం మంత్రిగారి పిక్క పట్టి కరిచేసింది. మంత్రిగారి అరుపులకు సతీమణిగారు వచ్చారు. అప్పటికే మంత్రిగారి కాలినుండి రక్తం బొట బొటా కారిపోతోంది. మంత్రిగారిని కారులో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు సతీమణిగారు. డాక్టర్‌ వెంటనే రేబిస్‌ రాకుండా ఇంజక్షన్లు పొడిచేశారు. మంత్రిగారు కాస్త కుదుట పడ్డారు. మంత్రి చిరునవ్వును చూసి ధైర్యం తెచ్చుకున్న డాక్టర్‌ ‘‘సార్‌! మా కార్పొరేట్‌ ఆసుపత్రికి స్థలం ఇస్తామన్నారు. లాంఛనాలన్నీ పూర్తి చేశాం. ఆపని కొంచెం తొందరగా... చేతులు నులుముకుంటూ నసిగారు. మంత్రి గారికి కోపం నషాళానికి అంటింది. ఆ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఎప్పుడైనా నిలదీశావా నువ్వు? మమ్మల్ని మాత్రం నిలదీస్తావా?’’ అని అగ్గి ఫైర్‌ అయిపోయారు. డాక్టర్‌ మాట పడిపోయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన మంత్రిగారు ఇంటికి వెళ్లి నేరుగా బెడ్‌ రూమ్‌కి వెళ్లి పడుకున్నారు.

అర్ధరాత్రి... నిద్రట్లో మాటలకు భార్యగారికి మెలకువ వచ్చింది. ‘ఏమయ్యా జగన్‌ మోహన్‌ రెడ్డిపై అన్ని కేసులు ఉంటే నన్ను విసిగిస్తావెందుకయ్యా’ అని కలవరిస్తున్నారు మంత్రిగారు. మంత్రిగారి భార్య కంగారు పడి ఫ్యామిలీ డాక్టర్‌కి ఫోను చేశారు.అంతా పూసగుచ్చినట్లు డాక్టర్‌కి వివరించారు. డాక్టర్‌ నవ్వేసి.. ‘‘ఏం ఫరవాలేదమ్మా... ఇది దానంతట అదే తగ్గిపోతుంది. కొద్ది రోజులు పార్టీ మీటింగ్‌లకు వెళ్లద్దని చెప్పండి’’ అని ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. ఉదయాన్నే ట్రస్ట్‌ కార్యాలయం నుండి ఫోను... మంత్రిగారు మూడు నిముషాలు మాట్లాడారు. ఇంతలో భార్యామణి కాఫీ తీసుకుని వచ్చారు. ‘‘ఇంట్లో సరుకులు నిండుకున్నాయి... కిరాణా సామాన్లు తెప్పించమని చెప్పి మూడు రోజులైంది.  తెప్పించారు కారు’’ అన్నారు భార్యగారు. మంత్రి కాఫీ గ్లాసును విసిరేసి.. ‘‘ఏం జగన్‌నిæ ఏరోజన్నా ఇలా నిలదీశావా? నీక్కూడా నేను లోకువగా కనిపిస్తున్నానా?’’ అని అరిచేశారు.
– నానాయాజీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement