
అధికార దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టికాయ వేస్తారు
సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరిక
అబద్ధపు హామీలతో బాబు ప్రతి వర్గాన్ని మోసం చేశారు
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్వీర్యం
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకు సాకులు
ప్రశ్నించే స్వరం ఉండకూడదని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు..
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా దక్కదు
వైఎస్సార్‌సీపీకి బీజం కర్నూలులోనే
విలువలు, విశ్వసనీయతే మన పార్టీ సిద్ధాంతం.. చీకటి తర్వాత వెలుతురు తప్పకుండా వస్తుంది
వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు వణుకు
ప్రతి కార్యకర్తకు జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తా
ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుంది
కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ భేటీ
న్యూటన్ సూత్రం ప్రకారం చర్యకు ప్రతి చర్య ఉంటుంది..! చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడో.. అంతకు రెట్టింపు వేగంతో పైకి లేచి ఆయనకు తగులుతుంది – వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. మంచి చేసి వారి గుండెల్లో స్థానం సంపాదించుకుని ఒక నాయకుడు పాలన చేయాలి. అలా కాకుండా అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు, దేవుడు కచ్చితంగా మొట్టి కాయ వేస్తారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ఏపీ, తమిళనాడు ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈ పక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు.
కాబట్టి మనం అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాలి’ అని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు సూచించారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. పార్టీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, పార్టీ మండల అధ్యక్షులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతో పాటు, పార్టీ ముఖ్య నాయకులు దీనికి హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఆయన ఏమన్నారంటే..
విలువలు, విశ్వసనీయతే మన సిద్ధాంతం..
వైఎస్సార్‌సీపీకి బీజం కర్నూలు జిల్లా నల్ల కాలువలోనే పడింది. ఆ రోజు ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లిన పరిస్థితుల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. ఇవాళ బలమైన పార్టీగా ఎదిగింది. మన పార్టీ సిద్ధాంతం ఏమిటంటే.. విలువలతో కూడిన రాజకీయాలు, విశ్వసనీయత. రాష్ట్ర చరిత్రలో వీటికి అర్థం చెప్పిన పార్టీ వైఎస్సార్ సీపీనే. ఈ రెండు పదాలే పార్టీని నడిపించాయి. ఈ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మి ఒక నాయకుడిగా అడుగులు ముందుకు వేశా. నాలో ఈ గుణాలను చూసి మీరంతా నాకు తోడుగా ఇన్ని సంవత్సరాల పాటు అడుగులో అడుగు వేశారు.
రాజకీయాల అర్థాన్ని తిరగరాశాం..
రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజం. ఇవాళ్టికి కూడా వైఎస్సార్‌సీపీకి చెందిన ఏ నాయకుడైనా, కార్యకర్త అయినా జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు గర్వంగా కాలర్ ఎగరవేసుకుని ప్రజల వద్దకు ఏ ఇంటికైనా వెళ్లగలడు. ప్రతి కుటుంబాన్ని చిరునవ్వుతో పలకరించి ఆశీస్సులు తీసుకునే కెపాసిటీ, పరిస్థితి ఒక్క వైఎస్సార్‌సీపీ నాయకులకు మాత్రమే ఉందని గర్వంగా చెప్పగలం. రాజకీయాలకున్న అర్ధాన్ని మార్చి తిరగరాసిన చరిత్ర వైఎస్సార్ సీపీది. మనం రాక మునుపు మేనిఫెస్టో అనేది చెత్తబుట్టలో వేసే డాక్యుమెంటులా ఉండేది. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి హామీలను పక్కాగా అమలు చేసిన పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే. మాటకు కట్టుబడి 99 శాతం పైచిలుకు హామీలను నెరవేర్చాం.
ప్రతి ఇంటికీ బాబు మోసం..
ఇన్ని చేసినా కూడా మనం ఓటమి చెందాం. కారణం.. కొద్దో గొప్పో చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మారు. జగన్ వస్తే ఎంతమంది పిల్లలున్నా రూ.15 వేలే వస్తాయి..! కానీ చంద్రబాబు వస్తే మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు కాబట్టి రూ.45 వేలు వస్తాయని ఆశ పడ్డారు. 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు జగన్ రూ.18,750 ఇచ్చాడు.. కానీ చంద్రబాబు వస్తే 50 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.48 వేలు ఇస్తానన్నాడు...! ప్రతి ఇంటికీ కరపత్రాలు, బాండ్లు పంచారు.
ఇంట్లో పిల్లాడు కనిపిస్తే నీకు రూ.15 వేలు అని, వాళ్ల అమ్మ బయటకు వస్తే నీకు రూ.18 వేలు అని, ఆ పిల్లల అమ్మమ్మలు బయటకు వస్తే మీకు 50 ఏళ్లు కాబట్టి మీకు రూ.48 వేలు అని, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు రూ.26 వేలు అని, చదువుకున్న యువకుడు కనిపిస్తే నీకు రూ.36 వేలు.. అంటూ ప్రతి ఒక్కరినీ మోసం చేశారు. దీని వల్ల పది శాతం ప్రజలు చంద్రబాబును నమ్మారు. జగన్ చేశాడు కాబట్టి, చంద్రబాబు కూడా చేస్తాడని నమ్మారు. జగన్ చేసినవన్నీ నేను కూడా చేస్తా..! అది కాకుండా ఇంకా ఎక్కువే చేస్తానన్న చంద్రబాబు మాటలను నమ్మారు. చంద్రబాబు మారాడేమోనని కొద్దో గొప్పో ప్రజలు నమ్మారు. దాంతో గతంలో మనకు వచ్చిన 50 శాతం ఓట్ షేర్‌లో పది శాతం మంది ప్రజలు చంద్రబాబును నమ్మడంతో అటువైపు చెయ్యి అలా వెళ్లింది.
ప్రతి హామీ ఒక మోసం..
చంద్రబాబు వచ్చి 11 నెలలు గడుస్తోంది. రెండో ఏడాది బడ్జెట్ కూడా పెట్టారు. అదిగో చంద్రబాబు చేస్తారు..! ఇదిగో చేస్తారని పిల్లలు, మహిళలు, రైతులు, యువత ఎదురు చూస్తూ వచ్చారు. అప్పుడు మాట చెప్పా కానీ.. ఇప్పుడు భయం వేస్తోందని చంద్రబాబు అంటున్నారు. ఇక్కడ కూడా నిజాయితీ లేదు. ఎగ్గొట్టేందుకు అబద్ధాలు చెబుతున్నారు. రాష్ట్రానికున్న అప్పులు రూ.12 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.11 లక్షల కోట్లు అని ఒకసారి, రూ.10 లక్షల కోట్లు అని ఇంకోసారి అంటున్నారు. నాడు జగన్ పాలనలో నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లాయని ఇవాళ ప్రజలు అనుకుంటున్నారు. చంద్రబాబు వచ్చారు.. తింటున్న కంచాన్ని లాగేశాడని అంటున్నారు. చంద్రబాబు ప్రతి హామీ ఒక మోసంగా మిగిలిపోయింది.

తెగింపుతో విజయం సాధించాం..
సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తనకే కావాలని చంద్రబాబు రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం చంద్రబాబుకు కనిపించకపోవడంతో ఏడు చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మిగతా 50 చోట్ల అనివార్య పరిస్థితుల నడుమ ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. ఆ తెగింపు వైఎస్సార్‌సీపీ కేడర్ చూపించింది కాబట్టే.. చంద్రబాబు ఏమీ చేయలేకపోయారు. పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకున్నారు.
సరిదిద్దుకుని మంచి చెయ్..!
చంద్రబాబూ.. ! సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలిచ్చావ్..! ప్రజలకు మంచి చెయ్..! పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టావు. ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్‌లో పెట్టావు. రైతులకు కూడా అన్యాయం చేస్తున్నావ్. ఇవన్నీ సరిదిద్దుకో.. మంచి చెయ్.. ప్రజల మనసులో స్థానం సంపాదించుకో. పూర్వపు బిహార్‌లా తయారైంది మన రాష్ట్రం.
ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటా..
మీ అందరికీ ఒకటే చెబుతున్నా. కష్టాలు శాశ్వతంగా ఉండవు. చీకటి వచ్చిన తర్వాత కచ్చితంగా వెలుతురు వస్తుంది. ఈ మూడేళ్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టిగా నిలబడాలి. ప్రజలకు తోడుగా ఉండండి. మన పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈసారి జగన్ 2.0 పాలన కచ్చితంగా మీరు చూస్తారు. ప్రతి కార్యకర్తకు జగన్ తోడుగా ఉంటాడు. జగన్ 1.0 లో అనుకున్న మేరకు మీకు తోడుగా ఉండకపోవచ్చు. కోవిడ్ లాంటి విపత్తులతో పాటు ఆ తర్వాత కూడా ప్రజల ప్రతి అవసరంలో వారికి తోడుగా నిలబడాల్సి వచ్చింది. కానీ ఈసారి కార్యకర్తలకు జగన్ 2.0 లో జరిగే మేలు మరెవరికీ జరగని విధంగా చేస్తా.
అన్ని రంగాల్లో తిరోగమనమే..
⇒ ఈ రోజు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో పూర్తిగా తిరోగమనం కనిపిస్తోంది.
⇒ స్కూళ్ల వ్యవస్థను నాశనం చేశాడు. నాడు – నేడు, ఇంగ్లీషు మీడియం గాలికెగిరిపోయింది. మూడో తరగతి నుంచి టోఫెల్ చదువు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే పరిస్థితి కూడా గాలికెగిరిపోయింది. చివరకు డిగ్రీ, ఇంజనీరింగ్ పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ విద్యా దీవెన, వసతి దీవెన పూర్తిగా గాలికెగిరిపోయాయి.
⇒ వైద్య రంగం తీసుకుంటే.. ఆరోగ్యశ్రీలో నెట్‌వర్క్ ఆస్పత్రులకు 11 నెలలకు దాదాపు రూ.3500 కోట్లు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందని పరిస్థితి నెలకొంది. ఆరోగ్య ఆసరాను సైతం ఎగ్గొట్టారు.
⇒ రైతులకు పెట్టుబడి సాయం కింద అందుతున్న రైతు భరోసాను ఎగరగొట్టారు. చంద్రబాబు ఇస్తానన్న రూ.26 వేలు గాలికెగిరి పోయాయి. ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవు. ఉచిత పంటల బీమా తీసేశారు. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. పారదర్శకత పక్కకు పోయింది. అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. బెల్టు షాపులు లేని గ్రామాలు కనిపించడం లేదు. పేకాట క్లబ్బులు, మద్యం, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలు నడుస్తున్నాయి. ఏ పరిశ్రమ కొనసాగాలన్నా ఎమ్మెల్యేలకింత..! చంద్రబాబుకింత! అని డబ్బులు కడితేగానీ నడవని పరిస్థితిలో వ్యవస్థలన్నీ పూర్తిగా నాశనం అయిపోయాయి.
ఆరు నెలల్లోనే ఆ పరిస్థితి వచ్చింది
సాధారణంగా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమై ప్రజల తరపున నిలబడాలని పిలుపునిచ్చే కార్యక్రమం రెండేళ్ల తర్వాత వస్తుంది. కానీ మొట్ట మొదటి సారిగా చంద్రబాబు పాలనలో ఆరు నెలలు తిరక్కముందే ప్రజలకు తోడుగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజల తరఫున పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. చూస్తుండగానే 11 నెలలు పూర్తయ్యాయి. మూడేళ్లు ఇట్టే గడిచిపోతాయి. పార్టీ శ్రేణులు, నాయకులు కలసికట్టుగా నిలవాలి. ప్రతి సమస్యలోనూ ప్రజలకు తోడుగా నిలిచి ముమ్మరంగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది.
మన కార్యకర్త అంటే బాబుకు భయం..
అసలు చంద్రబాబు ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? సంఖ్యా బలం లేకపోయినా దౌర్జన్యాలు చేస్తూ ఇంత అప్రజాస్వామికంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కారణం.. వైఎస్సార్ సీపీ అంటే చంద్రబాబుకు భయం. వైఎస్సార్‌సీపీ కార్యకర్త అంటే చంద్రబాబుకు భయం. చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీల అమలులో, పాలనలో ఘోరంగా విఫలమయ్యారు. చంద్రబాబు పాలనలో వ్యవస్ధలన్నీ పూర్తిగా నీరుగారిపోయాయి. టీడీపీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు సహా కేడర్, నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు సైతం టీడీపీ కేడర్‌ను తిరగనిచ్చే పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తుండటంతో చంద్రబాబు క్యాడర్ ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. తమను ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.
రామగిరి ఉప ఎన్నికలో..
అనంతపురం జిల్లా రామగిరిలో పది ఎంపీటీసీలుంటే వైఎస్సార్ సీపీ తొమ్మిది గెలిచింది. టీడీపీ ఒకే ఒక్కటి గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. తొమ్మిది గెలిచిన వైఎస్సార్ సీపీనే ఆ ఉప ఎన్నికలో గెలుస్తుందని ఎవరికైనా అర్థమవుతుంది. కానీ ఫలితాన్ని తారుమారు చేసేందుకు యత్నించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసు ప్రొటెక్షన్‌తో ఎంపీటీసీలు ప్రయాణించాల్సి వచ్చింది. కానీ ఈ పోలీసులు ఎంత అన్యాయంగా తయారయ్యారంటే.. వారే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమం చేశారు. రామగిరి ఎస్సై ఎంపీటీసీల వాహనం ఎక్కి ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ వీడియో కాల్‌లో మాట్లాడించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా తలొగ్గలేదు.
దీంతో మన పార్టీ ఎంపీటీసీలను సమయం దాటిపోయే వరకు తిప్పుతూ ఎన్నిక జరిగే సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కోరమ్ లేదని ఎన్నిక వాయిదా వేశారు. పెనుగొండ తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్‌ఛార్జి మీద కేసులు పెట్టారు. ఉషమ్మ గట్టిగా ఉక్కు మహిళలా నిలబడి పోరాటం చేసింది. ధర్నా చేస్తే కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం చేశారు. రామగిరిలో ఎన్నిక జరపాల్సి వస్తుంది కాబట్టి భయానక వాతావరణం సృష్టించేందుకు.. చురుగ్గా పనిచేస్తున్న మన పార్టీ కార్యకర్త, బీసీ సామాజిక వర్గానికి చెందిన కురుబ లింగమయ్యను హాకీ స్టిక్‌లతో కొట్టి చంపేశారు. చాలా బాధ అనిపించింది. రాజకీయాలను ఎందుకు ఈ స్థాయికి దిగజారుస్తున్నారు?