
తాడేపల్లి,సాక్షి : అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి మంత్రి నారా లోకేష్ అనుచితంగా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు హితువు పలికారు.
రెడ్ బూక్ చూసి ఒకరు కిందపడ్డారని, మరొకరికి గుండెపోటు వచ్చిందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అధికారం శాశ్వతం కాదని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజకీయాల్లో నేను ఎన్నోఎత్తుపల్లాలు చూశాను. అధికారం ఉంది కదా అని ఏనాడు హద్దు మీరలేదు. కానీ లోకేష్ అలా కాదు. అధికారం ఉందని వికటాట్టహాసం చేస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కళ్ళు నెత్తి మీదకి ఎక్కి వాపును బలం అనుకుని లోకేష్ మాట్లాడుతున్నారు. లోకేష్ నీ స్థాయి ఏంటో తెలుసుకో. 2019లో పార్టీ ఒకటి పోవడానికి మీరు కూడా ఒక కారణం అని గుర్తుంచుకోండి. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే మీరు ఓడిపోయారు. కూటమికి 164 సీట్లు వస్తే మీరు గెలిచారు.
అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు కన్నా లోకేష్ మించిపోయాడు. వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలను తానే తెచ్చానని లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారు. వైఎస్ జగన్ తెచ్చిన కంపెనీలకు లోకేష్ శంకుస్థాపన చేస్తున్నారు. దావుస్ వెళ్లి చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం కంపెనీలు తెచ్చారు.

చంద్రబాబు నాయుడు 52 రోజులు పాటు జైలుకి వెళ్ళిన ప్రిజనరి అని లోకేష్ గుర్తుపెట్టుకోవాలి. మీ సహచర మంత్రివర్గ సభ్యులు నీ గురించి ఏం చెప్పుకుంటున్నారో ముందు తెలుసుకో. జగన్‌కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చామని లోకేష్ చెప్తున్నారు. అదే వైఎస్ జగన్ మిర్చి యార్డుకు వచ్చినప్పుడు పోలీసులు సెక్యూరిటీని కల్పించలేదు.వైఎస్ జగన్ ప్రజల్లోకి వస్తే మీ సెక్యూరిటీ ఆపలేదు అది గుర్తుపెట్టుకోండి.మద్దతు ధరతో మిర్చి ఒక బస్తా ప్రభుత్వం కొనుగోలు చేస్తే నేను మీకు నమస్కారం చేస్తాను.మద్యపాన ప్రియులంతా చంద్రబాబుని తిట్టుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని అభివృద్ది చేయండి. పెట్టుబడులు తెచ్చే ప్రయత్నం చేయండి. లోకేష్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఆయన స్థాయేంటో ఆయన తెలుసుకోవాలి. అధికార మదంతో లోకేష్‌కు కళ్లు నెత్తికెక్కాయి’అని ధ్వజమెత్తారు.