
ఏపీలో ఎవరి మనోభావాలు ఎప్పుడు గాయపడతాయో తెలియడం లేదు. దారిన పోతున్న వాళ్లకు బుర్రలో ఓ ఆలోచన పుడుతుంది.. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదూ చేస్తారు. సదరు వ్యక్తి టీడీపీ, జనసేనలకు చెందిన వాడైతే.. యాక‌్షన్ తక్షణం మొదలవుతుంది కూడా. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు ఐపీఎస్ అధికారులుసహా అంతా వాయువేగంతో స్పందిస్తారు. అదే వైఎస్సార్‌సీపీ వాళ్లు ఫిర్యాదు చేస్తే..
దాన్ని పక్కన పడేయాల్నది రెడ్ బుక్(Red Book) ఆదేశం. ప్రముఖ నటుడు, రాజకీయాలకు దూరంగా ఉంటున్న పోసాని కృష్ణ మురళీ విషయంలో ఇదే జరిగింది. ఎప్పుడో 2017లో పోసాని తనకు ఇచ్చిన నంది అవార్డును తిరస్కరిస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలలో ఒకటి, రెండు కులాల ప్రస్తావన ఉందట. దాన్ని ఆయన 2023లో గుర్తు చేశారట. ఆ విషయం జనసేన నేతగా చెప్పుకుంటున్న మణి అనే వ్యక్తికి సడన్‌గా గుర్తుకొచ్చింది. ఇంకేముంది.. ఫిర్యాదు రెడి.. పోలీసులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లడం.. ఎవరో ఒక బందిపోటును, ఉగ్రవాదిని, తీవ్రమైన నేరాలకు పాల్పడిన వ్యక్తిపట్ల వ్యవహరించినట్లు ఆయన్ను అరెస్టు చేసి 15 గంటలు ప్రయాణించి మరీ తిరుపతి సమీపంలోని రైల్వేకోడూరు వద్ద ఒక పోలీస్ స్టేషన్‌కు తరలించడం... చకచకా జరిగిపోయాయి.
అక్కడితో ఆగిపోయిందా.. ఊహూ లేదు. ఒక పెద్ద ఐపీఎస్ అధికారి మిగిలిన కేసులన్నిటిని పక్కన పడేసి మరీ పోసానిని తొమ్మిది గంటలపాటు విచారించారు. ఈ రకమైన ఫిర్యాదు.. వ్యవహారం రెండూ రికార్డు బుక్కులకు ఎక్కేస్తాయి. పక్కాగా!
అరవై ఆరేళ్ల పోసానిని హింసించడం ద్వారా పోలీసులు రెడ్ బుక్ సృష్టికర్తలను సంతోషపెట్టి ఉండవచ్చు. కానీ.. ఆత్మ పరిశీలన చేసుకుంటే మాత్రం మనోవేదనకు గురి కాక తప్పదు. పోలీసు అధికారులందరిని తప్పు పట్టడం లేదు.పోసాని మీద పెట్టిన కేసులో సెక్షన్లు చూడండి.. సెక్షన్ 111ను న్యాయాధికారి ఆమోదిస్తే నిందితుడికి బెయిల్ రావడం కూడా కష్టం అవుతుంది. ఈ సెక్షన్ ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని పలుమార్లు ఉన్నత న్యాయ స్థానాలు హెచ్చరించాయి కూడా.
పోసాని ఒక ప్రముఖ కళాకారుడు. వందకుపైగా సినిమాలకు కథలు, సంభాషణలు రాసి పేరు తెచ్చుకున్న వ్యక్తి. రాజకీయంగా కొంతకాలం ప్రజారాజ్యంలోను, ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ లోనూ ఉన్నారు. కొంత ఆవేశపరుడు కూడా. రాజకీయ ప్రత్యర్థుల ఘాటు విమర్శలకు బదులిచ్చే క్రమంలో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. కానీ.. చిత్రంగా ఆయన ఎవరిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారో వారి మనోభావాలు గాయపడినట్లు ఫిర్యాదులు రాలేదు. వారి అభిమానులో, పార్టీ కార్యకర్తలెవరికో మనోభావాలు గాయపడ్డాయట. దానిపై వారు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ గొడవలు ఎందుకులే.. అని పోసాని అసలు రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించి, ఇంటికే పరిమితం అయ్యారు. అయినా రెడ్ బుక్ టార్చర్ ఆగదట. ఆ విషయాన్ని ఆ బుక్ సృష్టికర్తలే చెప్పారు.
పోసానిపై ఆ కేసులు కాకుండా, మరో కొత్త కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ కేసు వివరాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 2017లో నంది అవార్డును తిరస్కరించి తన అభిప్రాయాలు చెప్పడం ఏమిటి? దానిపై జనసేన నేత ఎవరికో ఇప్పుడు బాధ కలగడం ఏమిటి? అసలు ఆయనకు ఈ కేసుతో ఏమి సంబందం? అంతేకాదు.. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవరెడ్డి చెబితే ఆ భాష వాడారని ఎల్లో మీడియాకు లీక్. దీనిని ఎవరైనా నమ్ముతారా? కేవలం వైసీపీ ముఖ్యనేతలను వేధించాలన్న తలంపు కాకపోతే. టీడీపీ, జనసేన, బీజెపి కూటమి కొత్త ట్రెండ్ సృష్టించింది. వచ్చే ఎన్నికలలో కూటమి ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వస్తే కేసులు ఎలా పెట్టవచ్చు.. ఒకటికి పది పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎలా తిప్పవచ్చు? పిచ్చి కేసులనైనా ఎలా హ్యాండిల్ చేయవచ్చు? ఒక కేసులో బెయిల్ వస్తే, మరో కేసులో ఎలా అరెస్టు చేయవచ్చు? అన్నది నేర్పినట్లుగా ఉంది.
రెడ్ బుక్ అంటే ఈ పిచ్చి యవారాలు చేయడమా అన్న భావన కలిగినా మనం చేయగలిగింది లేదు. ఎప్పుడో నంది అవార్డులపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం మీద ఒక ఐపీఎస్ అధికారి తొమ్మిది గంటలు విచారణ చేశారంటే ఏమని అనుకోవాలి. కేవలం పోసానిని హింసించడం తప్ప మరొకటి అవుతుందా? పోసాని రిమాండ్ పై తెల్లవారుజాము వరకు గౌరవ న్యాయాదికారి వద్ద వాదనలు జరిగాయి. న్యాయాధికారి ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదని చెప్పడం సమంజసంగానే ఉన్నా, ఆ తర్వాత రిమాండ్ కు పంపడం ఎందుకో అర్దం కాదు. ఏడేళ్ల శిక్ష పడే కేసులు అయితేనే రిమాండ్ కు పంపాలన్నది ఉన్నత న్యాయ స్థానం ఇచ్చిన గైడ్ లైన్ అని వైఎస్సార్‌సీపీ తరపు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి చెప్పారు. దానిని గౌరవ కోర్టు పట్టించుకోలేదని ఆయన చెబుతున్నారు. దీనిపై పై ఏమి చేయాలో ఆలోచిస్తున్నామని అన్నారు. లీగల్ పండితుల సంగతేమో కాని, సాధారణ పౌరులకు మాత్రం ఇక్కడే కొన్ని విషయాలు అర్థం కాలేదు.
గతంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ పైన, ఆయన కుటుంబంపైన, మంత్రులపైన ఎవరైనా నీచమైన వ్యాఖ్యలు చేసినప్పుడు అరెస్టులు జరిగితే ఆ కేసుల్లో నిందితులలో కొందరిని రిమాండ్ కు పంపకుండా బెయిల్ ఇచ్చి పంపించిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బండారు సత్యనారాయణమూర్తి అప్పటి మంత్రి రోజాను ఉద్దేశించి దారుణమైన అవమానకర వ్యాఖ్య చేస్తే పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడితే ఆయనకు వెంటనే బెయిల్ లభించింది. మరికొందరి విషయంలోను అలాగే జరిగింది. అంటే ఆనాటి పోలీస్ వ్యవస్థ గట్టి సెక్షన్ల కింద కేసులు పెట్టలేదా? పెట్టినా న్యాయ వ్యవస్థ సీరియస్ గా తీసుకోలేదా? లేక ఆనాటి ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రచారాల నేపథ్యంలో ఆయా వ్యవస్థలు ఉదాసీనంగా పనిచేశాయా? టీడీపీ లాయర్ల మాదిరి వైఎస్సార్‌సీపీ లాయర్లు న్యాయ వ్యవస్థను ఒప్పించలేకపోతున్నారా? ఇలా పలు సందేహాలు వస్తాయి. కాని వీటికి సమాధానం ఇప్పట్లో దొరకకపోవచ్చు.
ఇదేకాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు లేదా మరెవరైనా టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెడుతున్న తీరు కూడా భవిష్యత్తులో ప్రభుత్వాలకు మార్గదర్శకం అయ్యే అవకాశం ఉంది. వారు కూడా తమ నేతలను అవమానించడంతో మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రం అంతటా కేసులు పెట్టవచ్చు. ఒక కేసులో బెయిల్ వస్తే,వెంటనే అదుపులోకి తీసుకుని మరిన్ని స్టేషన్ ల చుట్టూ తిప్పవచ్చు. ఇప్పుడు పోసాని విషయంలో కూడా అలాగే చేస్తున్నారు.
ఆయనను రాజంపేట నుంచి నరసరావుపేటలో నమోదైన కేసులో అరెస్టు చేసి అక్కడకు తరలించారు. 16 కేసులు నమోదు చేసినందున ఇంకెన్ని జైళ్లకు తిప్పుతారో చూడాలి. ఆయనకు ఆరోగ్య సమస్య వస్తే దానిని అవహేళన చేసేలా ఒక సీఐ స్థాయి అదికారి మాట్లారంటే, ఈ ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు. గతంలో అవినీతి కేసులో చంద్రబాబు అరెస్టు అయితే అప్పటి జగన్ ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా చూసుకుంది? ఆయన అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఏఐజీ ఆస్పత్రి ఇచ్చిన సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ వచ్చింది. కాని చిత్రంగా ఆయన బెయిల్ వచ్చిన వెంటనే గంటల తరబడి ఊరేగింపు చేయగలిగారు. ఇప్పుడు ఆ విషయాలను వైఎస్సార్‌సీపీ నేతలు ప్రస్తావించి పోసాని విషయంలో ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
పోసాని కులాల పేరుతో దూషించారట. ప్రజలలో వర్గ విభేదాలు సృష్టించారట.ఆ కేసు వివరాలు చదివితే ఎవరైనా నమ్ముతారా? ఫలానా కమిటీలో ఫలానా కులం వారే ఉన్నారని చెబితే దూషించడం ఎలా అవుతుందో పోలీసులకే తెలియాలి. దానివల్ల ప్రజలలో వర్గ విభేదాలు వచ్చి ఉంటే అప్పుడే గొడవలు అయి ఉండాలి కదా! ఒకాయన ఢిల్లీలో చెట్టు కింద కూర్చుని కులాలు, మతాల గురించి ప్రస్తావించి దూషణలకు దిగితే.. ఆయనపై కేసు పెడితే భావ స్వేఛ్చ అని, ఇంకేదో అని టీడీపీ, జనసేన వారు, ఎల్లో మీడియా గుండెలు బాదుకున్నారే. పైగా ఆయనకు అధికారంలోకి వచ్చాక మంచి పదవి కూడా ఇచ్చారే. అంతెందుకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లు తమ సభలలో దూషణలతో పాటు కొన్నిసార్లు బూతు పదాలు వాడిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రభుత్వం వాటిని పట్టించుకోకపోవడం తప్పని ఈ అనుభవాలు చెబుతున్నట్లుగా ఉంది. అంతెందుకు.. ప్రధాని మోదీని టెర్రరిస్టు అని, దేశంలోనే ఉండడానికి అర్హుడు కాదని.. ఇంకా అంతకన్నా ఘాటైన వ్యాఖ్యలు 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు చేస్తే బీజేపీ వారి మనోభావాలు ఎందుకు దెబ్బ తినలేదో తెలియదు!
అసలు మోదీ మనోభావాలు గాయపడలేదా? ఇక పవన్ కల్యాణ్ తనను తెలుగుదేశం పార్టీవారు ఎన్ని రకాలుగా అవమానించింది స్వయంగా ఆయా సభలలో చెప్పారే. అప్పుడు కూడా జనసేన వారి మనోభావాలకు ఏమీ కాలేదా? మళ్లీ అంతా ఒకటయ్యారే! అలాంటిది నంది అవార్డులపై ఏడేళ్ల క్రితం పోసాని చేసిన వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయిందా? కోర్టులలో ఏమవుతుందన్నది వేరే విషయం. కాని ప్రజల కోర్టులో మాత్రం కూటమి ప్రభుత్వం ఇలా అక్రమ కేసులు పెడుతున్నందుకు దోషిగానే ఎప్పటికైనా నిలబడుతుంది. మరో సంగతి చెప్పాలి. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీపై ఒక కల్పిత కేసు పెట్టి అరెస్టు చేయడమే కాకుండా, జైలులో మరో మనిషితో సంబంధం ఉండని సెల్‌లో పెట్టడం దారుణంగా ఉంది. ఇది కూడా కొత్తగా సృష్టించిన చెడు సంప్రదాయంగానే కనిపిస్తుంది. పోసాని, తదితర వైఎస్సార్‌సీపీ నేతలను ఈ తరహాలో వేధించడం చంద్రబాబు ప్రభుత్వ డైవర్షన్ రాజకీయాలలో భాగమా? లేక లోకేష్ రెడ్ బుక్ లో ఒక ఛాప్టరా? లేక పవన్ కూడా ఆ రెడ్ బుక్‌లో వాటా తీసుకున్నారా? అనేదానిపై రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి.
శాసనమండలిలో వైసీపీ అడిగిన ప్రశ్నలకు టీడీపీకి సౌండ్ లేకపోవడం, ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా ఉదంతం, పవన్‌ను సంతృప్తిపరచడం ,సూపర్ సిక్స్ హామీల గురించి జనం మాట్లాడుకోకుండా.. ఈ కేసుల గురించి చర్చించుకోవాలనుకోవడం, వైఎస్సార్‌సీపీని అణగతొక్కడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ఈ రెడ్ బుక్ ను ప్రయోగిస్తోందన్న భావన వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో వంశీ, పోసాని తదితర బాధిత కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ నైతిక స్థైర్యం చెప్పడమే కాకుండా, న్యాయపరంగా పూర్తిగా అండగా నిలడడం సబబుగా ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసానిని రెడ్ బుక్ పేరుతో గిల్లీ మరీ తిరిగి రాజకీయ రంగంలోకి తీసుకు వస్తున్నారేమో! ఇప్పటికే వందలు, వేల సంఖ్యలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు కూటమి రెడ్ బుక్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కూటమి సర్కార్ ప్రతీకార రాజకీయాలతో వారంతా రాటుతేలి పార్టీకి మరింత గట్టిగా పని చేసేవారుగా తయార అవుతున్నారనిపిస్తోంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు,
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment