
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాజ్యాంగం కాకుండా... తెలుగుదేశం నేతల రెడ్‌బుక్ రాజ్యాంగమే అమలవుతోందని హైకోర్టు సాక్షిగా మరోసారి స్పష్టమైంది. పోలీసుల శాఖ పనితీరును చూసి హైకోర్టే నిర్ఘాంతపోయిందంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు.. ఆంధ్రప్రదేశ్‌లో హింస, విధ్వంసం, అక్రమ అరెస్ట్‌లు కొనసాగుతున్న తీరును.. రాష్ట్ర ప్రజలు కళ్లారా చూస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ నేతలు, సోషల్‌మీడియా కార్యకర్తలే లక్ష్యంగా కూటమి నేతలు చెలరేగిపోతున్నారు. వీరిపైకి పోలీసులను ఉసిగొల్పుతూ రాక్షసానందం పొందుతున్నట్లు విమర్శలున్నాయి. పోలీసులు కేసులు పెట్టకుండా ఇష్టారాజ్యం అరెస్టులు చేసి పౌర హక్కులు, మానవహక్కులను హరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి లోకేష్ గొప్పగా చెప్పుకుంటున్న రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వైఎస్సార్సీపీ ‘పిచ్చికుక్క’తో పోలుస్తున్నది! ఈ తరహా పాలన వల్ల రాష్ట్రానికి జరిగే నష్టం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అర్థం చేసుకోవడం లేదు.
పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకుంటున్న వారిపై కేసులు పెట్టడం లేదు. నిబంధనల ప్రకారం కోర్టుల్లోనూ ప్రవేశపెట్టడం లేదు. దీంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ ఎనిమిది నెలల పాలనలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగినా, న్యాయ వ్యవస్థ సైతం ఆశించిన స్థాయిలో స్పందించినట్లు కనబడదు. సోషల్ మీడియా కార్యకర్తలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే వారిపై చర్య తీసుకున్నా ఫర్వాలేదు. కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్న తీరును న్యాయ వ్యవస్థ గమనిస్తే బాగుంటుంది. కొంతమందిపై పది, ఇరవై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న సంగతిని గౌరవ న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది.
న్యాయ వ్యవస్థ(Judicial System) దృఢంగా ఉండకపోతే పోలీసు శాఖ ఎలా ధమ్కీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందో హైకోర్టు వారికి స్వయంగా అనుభవం అవడం విశేషం. పల్నాడు జిల్లా మాచవరం పోలీసులు చేసిన అక్రమ అరెస్టులపై కొద్దిరోజుల క్రితం వచ్చిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్య చేసింది. పోలీసులకు తమ ఆదేశాలంటే గౌరవం లేదని, సీసీటీవీ ఫుటేజి సమర్పించాలని కోరినప్పుడే అది మాయమవడం ఏమిటి? అని గౌరవ న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ ఫుటేజీ ఎలా మిస్టీరియస్‌గా కనిపించకుండా పోతోందని హైకోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన గౌరవ న్యాయమూర్తులకు ప్రజలు ధన్యవాదాలు తెలపాలి.
ఈ మాత్రం అన్నా స్పందించకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం మరింతగా పెట్రేగిపోతుంది. పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ ఫుటేజీ మిస్ అవుతుంటే ఉన్నతాధికారులు ఏమి చర్య తీసుకున్నారని కూడా హైకోర్టు అడిగింది. చిత్రమేమిటంటే కోతుల కారణంగా సీసీటీవీ సర్క్యూట్ కాలిపోయిందని పోలీసులు చెప్పడం.. ‘ఇది మేం నమ్మాలా?’ అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. కాలిపోయిన సీసీటీవీ పరికరాలను తామే చూస్తామని న్యాయమూర్తులు ప్రకటించారు. విశేషం ఏమిటంటే ఈ కేసులో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లాయర్ చెప్పగా, పిటిషనర్‌కు ఏమైనా హాని ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. ఇందులో చాలా వాస్తవం ఉందని చెప్పాలి.
అనేక చోట్ల బాధితులు కోర్టులకు వెళ్లకుండా పోలీసులు వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి నిందితులను ఉంచి వేధిస్తున్నారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 3వ తేదీన ఒక వ్యక్తిని మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవంబర్ 7వ తేదీన కాని అతని అరెస్టు చూపలేదు. ఈ నాలుగు రోజులు అతని పట్ల ఎలా వ్యవహరించారో తెలుసుకోవడానికి సీసీటీవీ పుటేజీ కోరుతూ అతని సోదరులు కోర్టుకు ఎక్కారు. ఈ కేసులో సంబంధిత పోలీసు స్టేషన్ అధికారికి ఇంక్రిమెంట్లు కట్ చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? అతను తప్పు చేసినట్లు అంగీకరించినట్లే కదా!
చేసే అరాచకం చేసి, సీసీటీవీ ఫుటేజి మిస్ చేస్తే ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం పోలీసు శాఖలో ఏర్పడిందని భావించాలి. దీనికి కారణం పోలీసు శాఖ నిబంధనలు కాకుండా ఎక్కడికక్కడ టీడీపీ నేతల రెడ్‌బుక్ ఫాలో అవడమే కారణం అని వేరే చెప్పనవసరం లేదు. కొందరు రిటైర్డ్ పోలీసు అధికారులను పెట్టుకుని టీడీపీ ముఖ్యనేతలు వైఎస్సార్‌సీపీ వారిని భయపెట్టి లొంగదీసుకోవడానికి యత్నిస్తున్నారని చెబుతున్నారు.
👉ఈ మధ్య సోషల్ మీడియాలో పనిచేసే మిత్రుడు ఒకరిపై తప్పుడు కేసు పెట్టారు. ఆయన ఎప్పుడూ అసభ్య పోస్టులు పెట్టలేదు. కోర్టును ఆశ్రయించగా, బెయిల్ వచ్చింది కాని, వారం, వారం సంబంధిత పోలీస్ స్టేషన్‌కు హాజరవ్యాలని షరతు పెట్టింది. దాంతో ఆ మిత్రుడు నిత్యం అక్కడికి వెళ్లవలసి వస్తోంది. తీరా అక్కడకు వెళ్లాక పోలీసు అధికారులు అందుబాటులో ఉండకుండా గంటల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారట!. అదేమని అడిగితే పైనుంచి ఒత్తిడి ఉందని వారు చెబుతున్నారట. రెడ్ బుక్(Red Book) పేరుతో యాతనలకు గురి చేస్తున్నారన్నమాట.
👉కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma)ను ఒంగోలు పోలీసులు తొమ్మిది గంటలపాటు విచారణ చేశారని వార్తలు వచ్చాయి. ఆయన ఎప్పుడో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై ఏదో పోస్టు పెట్టారని చెప్పి, ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ ఎవరో టీడీపీ కార్యకర్త కేసు పెట్టగానే పోలీసులు వాయువేగంతో స్పందించి విచారణకు పిలిచారు. వర్మకు ముందస్తు బెయిల్ వచ్చింది కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనను ఈపాటికి జైలులో ఉంచేవారేమో తెలియదు.
👉రఘురామ కృష్ణరాజు(Raghurama Krishna Raju) పెట్టిన మరో కేసులో గుంటూరు ప్రభుత్వ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతిని కూడా అలాగే తొమ్మిది గంటలు విచారించారు. రఘురామ కృష్ణంరాజు కులాలు, మతాల మధ్య ద్వేషం రెచ్చగొట్టేలా నిత్యం మాట్లాడారన్న కేసు ఎటు పోయిందో కాని, తనను హింసించారన్న ఆయన చేసిన ఆరోపణపైనే పోలీసులు ఇప్పుడు శ్రద్ధ పెట్టారని అనుకోవాలి.
👉ముంబైకి చెందిన జత్వాని అనే నటికి పట్టుకువచ్చి నలుగురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. జిందాల్ అనే పారిశ్రామిక వేత్తపై కూడా అక్రమ కేసు పెట్టడంతో ఏపీకి రావల్సిన పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా పోతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
👉మరో ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవికిరణ్ పై ఇరవైకి పైగా కేసులు పెట్టి తీవ్రంగా వేధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు.
👉మరో వైపు తమ కుటుంబాలపై అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని పలువురు YSRCP నేతలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా అతిగతీ లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై ఎంత నీచంగా పోస్టులు పెట్టారో తెలిసిందే!. మాజీ మంత్రి అంబటి రాంబాబు తన కుమార్తెలపై దారుణంగా పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆయన హైకోర్టుకు వెళ్లి తన కేసును వాదించుకుంటున్నారు.
👉గన్నవరం లో జరిగిన ఒక ఘటనలో పోలీసులు తనతో బలవంతంగా వైఎస్సార్‌సీపీ వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని టీడీసీ ఆఫీస్‌లో పనిచేసే సత్యవర్దన్ అనే వ్యక్తి కోర్టులో చెప్పి కేసును ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రతిగా సత్యవర్ధన్ సోదరుడితో బలవంతంగా కేసు పెట్టించి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలులో పెట్టి వేధిస్తున్నారు.
టీడీపీ కార్యకర్తలు, నేతలు ఎంత విధ్వంసానికి పాల్పడుతున్నా పోలీసులు వారి జోలికే వెళ్లడం లేదు. కూటమికి చెందిన పార్టీల వారు ఎన్ని అరాచకాలకు పాల్పడినా, చివరికి మహిళలను వేధింపులకు గురి చేసినా, పోలీసులు వారిపై కేసులు పెట్టడానికి వెనుకాడుతున్నారు. ఉదాహరణకు.. తిరుపతిలో కిరణ్ రాయల్ అనే స్థానిక జనసేన నాయకుడుపై ఒక మహిళ కేసు పెడితే ఇంతవరకు ఆయనపై చర్యే తీసుకోలేదు. పైగా ఆ మహిళపైనే ఎదురు కేసు పెట్టి రెడ్ బుక్‌ను రాజస్థాన్‌కు కూడా పంపించి, హడావుడిగా ఆమెను అరెస్టు చేయించిన తీరు ఏపీలో మహిళలకు ఉన్న భద్రత ఏమిటో తెలియచేస్తుంది.
అనేక చోట్ల మహిళలపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. సుగాలి ప్రీతి మృతి విషయమై సీబీఐ దర్యాప్తు చేయిస్తానని ఎన్నికల ముందు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీలో మహిళలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితిపై వార్తలు వచ్చాయి.
గతంలో ప్రసంగాలు చేస్తూ మహిళల జోలికి ఎవరైనా వెళితే తోలు తీస్తామని భారీ ప్రకటనలు చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఇప్పుడు నోరు విప్పడం లేదు. మరో వైపు మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గౌరవ న్యాయస్థానం ఈ మాత్రం గట్టిగా ఉండడం సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పాలి. ఏది ఏమైనా ఏపీలో ప్రజల హక్కులకు ఏ స్థాయిలో విఘాతం కలుగుతున్నదో వివరించడానికి ఇవే పెద్ద నిదర్శనం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment