
పౌరుల స్వేచ్ఛను హరిస్తుంటే చూస్తూ ఊరుకోం: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు, 45 ఏళ్ల చరిత్రలో నాపై హత్యా రాజకీయాల మరక లేదు.. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించం.. కక్ష రాజకీయం చేయను: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. పై రెండు వార్తలు ఒకే రోజూ పత్రికల్లో వచ్చాయి. వీటిల్లో ఒకటి ఏపీలో ప్రస్తుత అరాచక పరిస్థితులకు అద్దం పడుతూంటే... రెండోది వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజలను ఏమార్చే ప్రయత్నానికి మచ్చు తునకలా కనిపిస్తుంది.
చంద్రబాబుకు పేరు ప్రతిష్టలు మెండని.. వ్యవస్థలపై పట్టున్న రాజకీయవేత్త అని అంటూంటారు. అయితే ప్రజాస్వామ్యంలో అందరిని అన్నిసార్లూ మోసం చేయలేరు అనేందుకు హైకోర్టు తాజా వ్యాఖ్యలు ఒక నిదర్శనం. నిజానికి గౌరవ న్యాయమూర్తులు రఘునందనరావు, మన్మధరావులకు మనం నమస్కారం చేయాలి. తమ వ్యాఖ్యలతో వీరు పది నెలలుగా ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచక పర్వానికి(Red Book Atrocities) కొంతైనా బ్రేక్ వేశారని అనిపిస్తుంది. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్త, ఆ పార్టీ అధికార ప్రతినిది అవుతు శ్రీధర్ రెడ్డి కేసులో కాని, మాదిగ మహాసేన నాయకుడు కె.ప్రేమ్ కుమార్ కేసులో కాని హైకోర్టు పరిశీలన ఏ ప్రభుత్వానికైనా కనువిప్పు కలిగించాల్సినవే. కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ వైఖరి మార్చుకున్నట్లు కనిపించదు.
ప్రముఖ నటుడు 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali)పై పెట్టిన ఆయా కేసులలో బెయిల్ వచ్చినా, కుట్రపూరితంగా సీఐడీ మళ్లీ పీటీ వారంట్ తీసుకుని ఆయనను ఇబ్బంది పెట్టే యత్నం చేస్తోంది. ఇదంతా రెడ్‌బుక్ దారుణాల కిందకే వస్తుంది. కక్ష రాజకీయాలే అవుతాయి. వైఎస్సార్‌సీపీ వాళ్లపై దౌర్జన్యాలు, ఆస్తుల విధ్వంసం, తప్పుడు కేసుల బనాయింపు వంటి అకృత్యాలు పది నెలలుగా సాగుతున్నా న్యాయ వ్యవస్థ సైతం వీటిని పూర్తి స్థాయిలో పట్టించుకోలేదన్న అభిప్రాయం ఉండేది. దాంతో ఏపీలో పౌరులు ప్రత్యేకించి విపక్షం కాని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారు కానీ జీవించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
👉సూపర్‌సిక్స్ పేరుతో ఇష్టారీతిన ఎన్నికల హామీలిచ్చి.. వాటి అమలు చేతకాక ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ హింసాకాండకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. హైకోర్టు తాజా తీర్పు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తోంది. పౌరులను ఆధారాల్లేకుండా.. కేవలం ఊహలపై ఆధారపడి అరెస్టులు చేస్తారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసులు తమని తాము చట్టానికి అతీతులుగా భావిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. ఇందులో వాస్తవం ఉంది.
సోషల్ మీడియా, ఇతర చిన్న కేసుల్లోనూ నోటీసులివ్వకుండా హైదరాబాద్‌సహా ఎక్కడ ఉన్నా ఆకస్మికంగా అరెస్టులు చేయడం.. వారిని క్రిమినల్స్ మాదిరిగా ట్రీట్ చేస్తూండటాన్ని గౌరవ హైకోర్టు గుర్తించడం మంచి పరిణామం. 'రేపు కోర్టుల్లోకి వచ్చి కూడా అరెస్టులు చేస్తారా?".. అనే తీవ్రమైన వ్యాఖ్యలను న్యాయమూర్తులు చేశారంటే పరిస్థితి ఏమిటన్ని అర్థమవుతుంది. అదే సమయంలో చిన్న చిన్న కేసుల్లోనూ మేజిస్ట్రేట్లు పోలీసులు తీసుకొచ్చిన నిందితులను రిమాండ్‌కు ఆదేశించడం కూడా ఆందోళన కలిగించే విషయమే. కొంతమంది మెజిస్ట్రేట్లు యాంత్రికంగా రిమాండ్లు విధిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
👉గతంలో ముఖ్యమంత్రి, మంత్రులను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలకు చకచకా బెయిల్ వచ్చిన తీరు, కొన్ని కేసులలో అసలు రిమాండ్‌కే పంపకుండా వదలివేసిన వైనాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పరిణామాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మాజీ మంత్రి రోజాపైన దారుణమైన దూషణకు దిగిన టీడీపీ మాజీ మంత్రి ఒకరికి కోర్టు రిమాండ్ విధించకుండా వదలిపెట్టింది. అదే.. పోసాని కృష్ణ మురళీకి మాత్రం వరస రిమాండ్లు విధిస్తున్నారు. పోసాని, అవుతు శ్రీధర్ రెడ్డిలు టీడీపీ, జనసేనల వారు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు స్పందిస్తూ జవాబు ఇచ్చారు. అందులో అభ్యంతరం ఉంటే, అసలు ప్రేరేపించిన వారిపై కూడా కేసులు పెట్టాలి కదా! ఆ పని చేయకుండా ఒక పక్షంపైనే కేసులు పెడుతున్నారు.
👉చట్టంలోని కొన్ని సెక్షన్ 111ను ఎంతగా దుర్వినియోగం చేస్తున్నది హైకోర్టు గమనించింది. సోషల్ మీడియాలో పోస్టు పెడితే బలవంతపు వసూళ్ల కింద అమలు చేయవలసిన సెక్షన్‌లో కేసు పెట్టారని హైకోర్టు తెలిపింది. లోకేష్ బృందానికి ఈ రెడ్ బుక్ ఏదో సరదాగా ఉండవచ్చు. ప్రస్తుతం అధికారం ఉంది కనుక తాము ఏమి చేసినా చెల్లుతుందని విర్రవీగవచ్చు. అధికారాన్ని ఇలా అరాచకాలకు ఉపయోగించుకుంటే అదే రెడ్ బుక్ వారి పాలిట పాముగా మారే ప్రమాదం ఉంటుంది. ఇక చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) చేసేది చేస్తూనే సుద్దులు చెబుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలను రెచ్చగొడతారు. నేతలు తన సమక్షంలోనే బూతులు మాట్లాడినా, సోషల్ మీడియా యాక్టివిస్టులు బూతు పోస్టులు పెట్టినా దానికి స్వేచ్ఛ అనే కవరింగ్ ఇస్తారు. వైఎస్సార్‌సీపీ వాళ్లు స్పందిస్తే మాత్రం దానినే ఫోకస్ చేస్తూ ప్రచారం చేస్తుంటారు.
కావలి గ్రీష్మ అనే ఒక చిన్న స్థాయి నేత తన సమక్షంలోనే బూతులు మాట్లాడితే నవ్వుతూ విన్నారే తప్ప వారించలేదు. ఆ తర్వాత ఆమెను శాసనమండలి సభ్యురాలిని చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబాన్ని టీడీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసిందీ అందరికి తెలుసు. అయినా చంద్రబాబు దానిని ఖండించినట్లు కనిపించలేదు. అంతెందుకు చంద్రబాబుసహా లోకేష్, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి వంటి కూటమి నేతలు వాడిన బూతు పదజాలానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
👉ఇప్పుడు అధికారం రాగానే తాను బూతులను అరికట్టానని ఆయన సభలలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నదంతా టీడీపీ కక్ష రాజకీయమే అయినా, తాము ఏమీ ఎరగనట్లు మాట్లాడారు. అంతేకాదు. నలభై ఐదేళ్ల చరిత్రలో తనపై హత్య రాజకీయాల మరక లేదని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఈ ప్రస్తావన తేవలసిన అవసరం ఏమిటో తెలియదు. రాజకీయం ముసుగులో నేరాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మంచిదే. కాని నిజంగా టీడీపీని అలాగే నడుపుతున్నారా? లేక కేవలం ప్రత్యర్ధి పార్టీలపై అభియోగాలు మోపడానికి ఇలా మాట్లాడుతున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది.
👉చంద్రబాబు తోడల్లుడు, ఈ మధ్యే కలిసిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యలు రాసిన పుస్తకాలలో చంద్రబాబు నేరపూరిత రాజకీయాలపై ఏమి రాశారో అందరికి తెలిసిన విషయమే. వాటిపై ఏనాడైనా వివరణ ఇచ్చి ఉంటే చంద్రబాబును ఒప్పుకోవచ్చు. ఎవరు తనపై ఏ ఆరోపణ చేసినా ఏమి పట్టనట్లు ఉండడం ఆయన ప్రత్యేకత. అందుకే వైఎస్సార్‌సీపీ నేతలు తరచూ వంగవీటి రంగా, పింగళి దశరథ్‌రామ్, మల్లెల బాబ్జీ తదితరుల హత్య కేసులలో వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే కేసులు పెట్టించుకోండని తన కార్యకర్తలకు చెబుతారు. అధికారంలోకి రాగానే ఎదుటి పక్షంపై కేసులు పెట్టండని చెబుతారు. నిజంగా ఈ వయసులో చంద్రబాబు తన కక్ష రాజకీయాలను మానుకుని మంచి పేరు తెచ్చుకునేలా పాలన చేయడమే కాకుండా.. తన కుమారుడు లోకేష్ రెడ్ బుక్ గోలకు అడ్డుకట్ట వేయకపోతే వారికే నష్టం జరుగుతుందని చెప్పక తప్పదు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment