
ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వారు పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. అందరికీ ఉపయోగపడే పనులు చేయాలి. ఎన్నికలు ముగిసిన తరువాత రాజకీయాల వద్దని, అందరూ సమానమేనని అనాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేస్తున్నదేమిటి? సీఎం హోదాలో ఉంటూనే.. వైఎస్సార్‌సీపీ వారికి ఎలాంటి పనులూ చేయవద్దని చెబుతున్నారంటే.. ఏంటి అర్థం?.
ఈ రకమైన వ్యాఖ్యలకు బాధ పడాల్సింది... సిగ్గుపడాల్సింది వైఎస్సార్‌సీపీ(YSRCP) వాళ్లు కాదు.. టీడీపీ మిత్రపక్షాల వారే. భవిష్యత్తులో ఏ కారణం వల్లనైనా బాబుతో పొత్తు లేకుండా పోతే.. ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుందో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గతంలో.. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అమలు గురించి బహిరంగంగానే ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం గద్దెనెక్కిందే తడవు.. తమది రాజకీయ పాలనేనని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. ఆపై రాక్షస పాలనకు శ్రీకారం చుట్టారు. చివరకు ఇందుకు ఆయన తన కుమారుడు లోకేష్ తాలూకూ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం బాబుకొచ్చిన దుస్థితి అని అనుకోవాల్సిందే.
అధికారులైనా.. పార్టీ నాయకులైనా సరే.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు వీసమెత్తు పని చేసినా ఊరుకోనని చంద్రబాబు హూంకరిస్తున్నారు. ఒకవేళ అలా చేస్తే పాముకు పాలు పోసినట్లేనని ఆయన దుర్మార్గంగా, బహిరంగంగా మాట్లాడుతున్నారు. మాటల విషం కక్కుతూ YSRCP వాళ్లను పాములతో పోల్చుతున్నారు. ఎన్నికలతోనే రాజకీయాలు మరచిపోవాలన్నది చాలామంది చెప్పే మాట. కానీ చంద్రబాబులా(Chandrababu) ఎవరూ ఇంత బరితెగించి మాట్లాడరు.
సీఎం చెప్పినదాని ప్రకారం ఇకపై అధికారులు తమ వద్దకు వచ్చేవారు టీడీపీ వారా? లేక వైఎస్సార్‌సీపీ వారా? అన్నది తెలుసుకుని పనులు చేయాలా? చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అంతా ఒకసారి గత ముఖ్యమంత్రుల గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
ఉదాహరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి(YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు, ప్రస్తుత ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వంటి వారు వైఎస్‌ను కలిసి నియోజకవర్గాలకు సంబంధించి పనులకు నిధులు పెద్ద ఎత్తున తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సీపీఎం నేత నోముల నరసింహయ్య ఒకసారి అసెంబ్లీలో వైఎస్‌ను తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత నియోజకవర్గ పనులపై వైఎస్‌ను కలిశారు. ఆ సందర్భంలో అసెంబ్లీ చర్చను నోముల ప్రస్తావించినా, అదేమీ తప్పు కాదని చెప్పడమే కాకుండా ఆయన కోరినట్లు నిధులు మంజూరు చేసి పంపించారు. ఆ రకంగా వైఎస్సార్ పేరు తెచ్చుకుంటే, ఆయన కుమారుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పార్టీలు, కులాలు, మతాలు వంటివాటి జోలికి వెళ్లకుండా తనకు ఓటు వేయని వారికి సైతం పనులు చేయాలని పథకాలు అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించి మరింత మంచి ఖ్యాతి సాధించారు.
చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. వైఎస్సార్‌సీపీలో ఉండడానికి భయం కల్పించి, టీడీపీలోకి వారిని లాక్కొవడానికి చేస్తున్న కుట్రలలో ఇదొకటని తెలుస్తూనే ఉంది. అంతమాత్రాన వైఎస్సార్‌సీపీ వారంతా భయపడరని పలు అనుభవాలు చెబుతున్నాయి. చివరికి బంధువులు, స్నేహితుల మధ్య కూడా విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందాలన్న యావకు వెళ్లినట్లు అనిపిస్తుంది.
గతంలో చంద్రబాబు నాయుడు మాట వరసకు ఒకటి చెప్పేవారు. ‘‘ఎన్నికలయ్యాక రాజకీయాలు ఉండవద్దు.. అంతా అభివృద్దే ఉండాలి’’ అని సుద్దులు చెప్పేవారు. కాని చేసేది చేసేవారు. 2014 టర్మ్‌లో తన పార్టీలో చేరితేనే పనులు చేస్తానని బెదిరించి, ఇతర ప్రలోభాలు పెట్టి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఇప్పుడు మరీ ఓపెన్ అయి ఇలా మాట్లాడారు కాని, ఆయన అసలు తత్వం అదేనని అంటారు. తెలుగుదేశం పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చారన్న విమర్శను ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నారు.
చంద్రబాబు ఎప్పుడూ ప్రజలను నమ్ముకుని రాజకీయాలు చేయలేదనే చెప్పాలి. వ్యూహాలు పన్నడం, వర్గాలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారానే రాజకీయాలు సాగించారన్న భావన ఉంది.పైకి మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకునేవారు. కాకపోతే ఈసారి మరీ బహిరంగం అయిపోయారు.
1978లో చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యాక కాంగ్రెస్‌లో గ్రూపులు నడిపారు. ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ కూడా అయినట్లు గుర్తు. 1983లో ఓటమి తర్వాత మామ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి పార్టీలో చేరిపోయారు. తదుపరి మళ్లీ వర్గ రాజకీయాలను జోరుగా నడిపారు. మామను మాయ చేసి కర్షక పరిషత్ చైర్మన్ పదవి తీసుకున్నారు. విశేషం ఏమిటంటే కర్షక పరిషత్ చైర్మన్ పదవి అంటే అదేదో సూపర్ సీఎం మాదిరి ఆయా శాఖల మంత్రులకన్నా తానే పవర్ పుల్ గా కనిపించే యత్నం చేసేవారు. తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రాబల్యాన్ని తగ్గించడానికి అన్ని వ్యూహాలు అమలు చేసేవారు. ట్విస్టు ఏమిటంటే దగ్గుబాటి వెంకటేశ్వర రావును కూడా అలాగే ప్రలోభపెట్టి తనవైపు లాక్కుని మామ ఎన్.టి.రామారావునే శంకరగిరి మాన్యాలు పట్టించగలిగారు. ఆ తర్వాత కొంతకాలం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది. చంద్రబాబును విమర్శిస్తూ అనేక సంచలన విషయాలను బయటపెట్టిన దగ్గుబాటి తాజాగా ఆయన ఇంటికి వెళ్లి తన మరో పుస్తకావిష్కరణ సభకు రావాలని ఆహ్వానించడం విశేషం. అది వేరే సంగతి.
చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) తొలిసారి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ప్రజలు కాదు. ఎమ్మెల్యేలలో తెచ్చిన చీలిక. అప్పట్లో ఎవరైనా ఎన్టీఆర్ వర్గంలో ఎమ్మెల్యేలు ఉంటే వారిని రకరకాలుగా ప్రలోభాలు పెట్టేవారని వార్తలు వచ్చేవి. లొంగకపోతే ఇతర మార్గాలు ఎటూ ఉంటాయి. పోలీసు వ్యవస్థతో బెదిరించడం, పనులు చేయకపోవడం వంటివి చేస్తుంటారు. అప్పటి నుంచే ఆయనకు ఈ వ్యూహం తెలుసు. టీడీపీ వారికే పనులు అయ్యేలా జాగ్రత్త పడేవారు. కొంతమంది కాంట్రాక్టర్లను కూడా తనతో ఉండేలా చేసుకునేవారు. వారికి ముఖ్యమైన కాంట్రాక్టులు ఇచ్చి పార్టీకి ఆర్థికంగాఅండగా ఉండేలా చేసుకుంటారు.
2004 ఎన్నికలకు ముందు కేంద్రం నుంచి ఏభైలక్షల టన్నుల బియ్యాన్ని పనికి ఆహారం పథకం కింద తీసుకు వచ్చారు. దానిలో అధిక భాగం టీడీపీ కార్యకర్తలే అమ్ముకున్నారన్న విమర్శలను అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ చేసేది. దాని ప్రభావం కూడా ఎన్నికలలో కనిపించింది. చంద్రబాబు ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తితోపాటు, కార్యకర్తల దోపిడీని కూడా భరించలేక 2004లో టీడీపీని ఇంటికి పంపించారు. జన్మభూమి కమటీల వ్యవస్థను చంద్రబాబు తీసుకు వచ్చారు. మొదట అదేదో మంచి కార్యక్రమమేమో అనే భావన కల్పించారు. ఈనాడు వంటి ఎల్లో మీడియా అచ్చంగా అదే పనిలో ఉండేది.
2014-19 టర్మ్‌లో ప్రజలు దాని విశ్వరూపాన్ని చూడవలసి వచ్చింది. ప్రజలకు ఏ అవసరం ఉన్నా, ఏ స్కీమ్ కావాలన్నా ఆ కమిటీలలో ఉన్న టీడీపీ కార్యకర్తలకు లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని చెబుతారు. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ తదితర వందలాది హామీలుకు నోచుకోకపోవడం, టీడీపీ కార్యకర్తల ఆగడాలతో జనంలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అంతేకాదు. కార్యకర్తల ఆర్థిక పుష్టి కోసమే కొన్ని స్కీములను వాడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు చెట్టు-నీరు పధకం కింద సుమారు రూ.13 వేల కోట్లు టీడీపీ కార్యకర్తలు దోచేశారని అప్పట్లో బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న సోము వీర్రాజు ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి పలువురిపై కేసులు పెట్టడం, బిల్లులు నిలుపుదల చేసింది. ఈసారి అధికారంలోకి వచ్చాక వారి బిల్లలుకు ఈ మధ్యే రూ.900 కోట్లు విడుదల చేసేయడమే కాకుండా, కేసులు కూడా ఎత్తేవేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం, నానా పాట్లు పడి ప్రధాని నరేంద్ర మోదీని ప్రసన్నం చేసుకోవడం, పవన్ కల్యాణ్ ద్వారా ఒక సామాజికవర్గ ఓట్లుకు గాలమేసే ప్రయత్నం చేయడం.. ఈవీఎంల ప్రభావం తదితర కారణాలతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024లో అధికారంలోకి వచ్చింది. మళ్లీ యథా ప్రకారం ఆయన పాత పాట మొదలు పెట్టారు.
లోకేష్ రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, హామీల అమలును ప్రశ్నించే సోషల్ మీడియా వారిని వేధిస్తుండడం ఒక సమస్యగా ఉంటే, ఇంకోవైపు చంద్రబాబు అసలు వైఎస్సార్‌సీపీ వారికి ఏ పని చేయవద్దని చెబుతున్నారు. ఇంతలా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్న ప్రభుత్వం దేశ చరిత్రలో మరొకటి ఉండకపోవచ్చు. అయినా వివిధ వ్యవస్థలను మేనేజ్ చేయడంలో సిద్దహస్తుడుగా పేరొందిన చంద్రబాబు జోలికి ఎవరు వెళ్లినా ఏమీ కాదనే ధైర్యం టీడీపీలో ఉందని చెబుతారు. ఈ నేపథ్యంలో యథేచ్ఛగా కార్యకర్తల అడ్డగోలు దోపిడీకి పచ్చజెండా ఊపారన్న భావన ఉంది.
ఇప్పటికే ఇసుక దందాతో లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. మద్యం షాపులన్నీ తన వారికే కట్టబెట్టారు. జగన్ టైమ్ లో ఆయన వీటిని ప్రభుత్వపరం చేసి ఆదాయం పెంచడానికి ప్రయత్నించారు. దాంతో కార్యకర్తలకు పెద్దగా ఆదాయ వనరు లేకుండా పోయిందని భావిస్తారు. అలాగే జగన్ సర్కార్ వలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీలకు అతీతంగా స్కీములు, వివిధ సేవలను అందించడంతో కార్యకర్తలు, వైసీపీ నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. వలంటీర్ తెలిస్తే చాలు..వైసీపీ వారితో పని లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది. పైగా టీడీపీ వారికి కూడా అన్ని సదుపాయాలు సమకూరాయి. చంద్రబాబేమో కార్యకర్తల ఆర్జనకు అన్ని అవకాశాలు కల్పించి, ఆ తర్వాత వారితో ఎన్నికలలో ఖర్చు పెట్టించే వ్యూహంతో పని చేయిస్తుంటారని చెబుతారు. అంటే టీడీపీని గెలిపిస్తే, పెత్తనంతోపాటు తాము ఇష్టారాజ్యంగా సంపాదించుకోవచ్చనే ధైర్యాన్ని వారికి కల్పించారన్నమాట.
టీడీపీ విజయానికి కార్యకర్తల దోపిడీ తోడ్పడదని పలుమార్లు రుజువైంది. టీడీపీ కార్యకర్తల వేధింపులు, ధనార్జనను భరించలేక ప్రజలంతా ఒక్కటై టీడీపీని పలుమార్లు ఓడించారు. ప్రస్తుతం కూడా రెడ్ బుక్ పేరుతో పోలీసులతో వైఎస్సార్‌సీపీ వారిని వేధిస్తుంటే, మరో వైపు టీడీపీ కార్యకర్తల దౌర్జన్యాలు, అరాచకాలు, అడ్డగోలు సంపాదనకు అదుపు, ఆపు లేకుండా పోయింది. ఈ దశలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే వారి అవినీతికి లైసెన్స్ ఇచ్చేసినట్లు, వైసీపీ వారిని వేధించండని పిలుపు ఇచ్చినట్లు మాట్లాడితే జనం వారికి గుణపాఠం చెప్పకుండా ఉంటారా?

:::కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment