
చిత్తూరు జిల్లాలో చంద్రబాబు వ్యాఖ్యలపై ‘మండలి’లో బొత్స ఫైర్
లబ్ధిదారులకు రాజకీయాలు, పార్టీలు అంటగడతారా? వ్యవస్థలే సిగ్గుపడాలి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడూ మా పార్టీ వాళ్లకే సాయం చేయమని చెప్పలేదు
ఆ ఐదేళ్లు రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సాయంచేశాం
బాబు వ్యాఖ్యలపై సీఎంఓ వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదా?
తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదికన్న మంత్రి అచ్చెన్నాయుడు
అయితే, సీఎం మాటలు తప్పా అంటూ బొత్స నిలదీత
సాక్షి, అమరావతి: రెండ్రోజుల క్రితం సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు పర్యటనలో మాట్లాడిన మాటలు సోమవారం శాసనమండలిలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే వ్యవస్థలే సిగ్గుపడాలి అంటూ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు చిన్న పనిచేసి పెట్టినా ఊరుకునేది లేదు. అది అధికారులైన సరే ప్రజాప్రతినిధులైన సరే. వైఎస్సార్‌సీపీ వాళ్లకు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఏ ఉపకారమూ చెయ్యొద్దు.
వాళ్లకు ఉపకారం చేస్తే పాముకు పాలుపోసినట్లే..’ అంటూ చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘మండలి’లో సోమవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్న సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై బొత్స ఘాటుగా స్పందించారు. ‘మా ప్రభుత్వంలో మా సీఎం ఎప్పుడు మా పార్టీ వాడికే సహాయం చేయమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూస్తే ఈ వ్యవస్థ సిగ్గుపడాలి.
లబ్ధిదారులకు పార్టీలు అంటగడతారా? అర్హులందరికీ ప్రతి పథకం దక్కేలా చూడాల్సిన బాధ్యత గలవారు.. రాజ్యాంగబద్ధంగా, రాగద్వేషాలకు, పార్టీలకతీతంగా, కార్యక్రమాలు చేస్తామని చెప్పాల్సిన వారు మాట్లాడే మాటలేనా ఇవి? పార్టీ మీటింగ్‌లో సీఎం మాటలు వైరల్ అవుతుంటే ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇవ్వాల్సిన అవసరంలేదా. మంత్రిని (అచ్చెన్నాయుడ్ని ఉద్దేశించి) కోరుతున్నా.. లబ్ధిదారుల విషయంలో రాజకీయాలు ఉండకూడదని చెప్పండి. ఇదేమన్నా మన సొంత ఆస్థా? ప్రజల డబ్బు, వారి మద్దతుతో ప్రభుత్వాలను నడుపుతున్నాం. సీఎం ఆ మాటలు ఎలా మాట్లాడతారు? గత ఐదేళ్లూ రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలతో సంబంధంలేకుండా, అర్హులందరికీ సాయం చేశాం.
అంతేగానీ.. పార్టీల గురించి ఆలోచించలేదు’ అంటూ బొత్స మాట్లాడారు. బొత్స వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. తమ ప్రభుత్వానికి పేదలే ప్రాతిపదిక అని చెప్పారు. అర్హులెవరికైనా పథకాలు అందకపోతే, అది తమ దృష్టికి తీసుకొస్తే వారికీ ఇస్తామన్నారు. బొత్స మళ్లీ జోక్యం చేసుకుంటూ.. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు వారి మాటలా? లేక పార్టీ తరఫున లేదా సీఎం తరఫున మాట్లాడుతున్నారా స్పష్టం చేయాలన్నారు.
దీనిపై అచ్చెన్నాయుడు మళ్లీ వివరణ ఇస్తూ.. తాను చెప్పింది అచ్చెన్నాయుడుగా కాదు.. టీడీపీ తరఫున కాదు.. ఎన్డీయే ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నా అని చెప్పగా బొత్స మళ్లీ స్పందిస్తూ.. అయితే, సీఎం మాటలు అబద్ధమా అని ప్రశ్నించారు. ఇంతలో మండలి చైర్మన్ మరో మంత్రి పార్థసారథికి అవకాశం ఇవ్వడంతో ఈ అంశానికి అక్కడితో బ్రేక్ పడింది. అనంతరం.. మీడియా పాయింట్ వద్ద కూడా బొత్స మాట్లాడారు.
అమరావతిపై ఒక విధానం లేదు
అమరావతి రాజధాని విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఒక విధానమంటూ లేదని, 2014–19 మధ్య ఇదే టీడీపీ హయాంలో రాజధాని నిర్మాణానికి రూ.లక్ష కోట్లకు పైగా అవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లే ఖర్చుచేసిందని.. పైగా అవి తాత్కాలిక భవనాలని చెప్పారని, ఇప్పుడు శాశ్వత భవనాలంటూ టెండర్లు పిలిచారని శాసనమండలిలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సోమవారం ‘మండలి’లో టీడీపీ విప్ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో బొత్స మంత్రిగా ఉన్నప్పుడు అమరావతిని స్మశానం అన్నారంటూ విమర్శించారు. దీనిపై బొత్స స్పందిస్తూ.. తాను మంత్రిగా ఉన్నప్పుడు రాజధానిని చూడటానికి రావాలని కొందరు కోరడంతో.. అమరావతి నిర్మాణానికి నాటి టీడీపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పి కేవలం రూ.6వేల కోట్లతో భవనాలు కట్టారని, అంతకుమించి అక్కడ చూడడానికి ఏం అభివృద్ధి జరిగిందని మాత్రమే అన్నానని బదులిచ్చారు.
వాస్తవానికి.. అమరావతిలో కట్టింది తాత్కాలిక భవనాలేనని అప్పటి టీడీపీ ప్రభుత్వమే స్వయంగా ప్రకటించిందని, పైగా దానికి కూడా ఏకంగా అడుగుకి ఏకంగా రూ.10,500 వెచ్చించారన్నారు. ఇప్పుడు మళ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచారని, ఇది చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు తంతు కాదు కదా అని బొత్స ఎద్దేవా చేశారు.
అవి తాత్కాలికమని చెప్పలేదు
మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ఇవి తాత్కాలిక భవనాలు అని తామెక్కడా చెప్పలేదని, కొత్తగా శాశ్వత భవనాలు కట్టేవరకు వీటిని వాడుకుంటామని మాత్రమే చెప్పామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని వదిలేశారని, విశాఖ రుషికొండ నిర్మాణాల్లో ఎంతో దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. రుషికొండ కాంట్రాక్టర్‌కు వేరే పనులకు సంబంధించిన బిల్లులు ఇచ్చామన్నారు.
ఈ వ్యాఖ్యలపై బొత్స స్పందిస్తూ.. అప్పట్లో మూడు రాజధానులనేది తమ ప్రభుత్వ విధానంగా తీసుకున్నామని.. శాసన రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పామన్నారు. వాస్తవాలను మరుగుపరిచి మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్నారని విమర్శించారు. రుషికొండలో నిర్మించిన భవనాలు ఎవరివని.. ప్రభుత్వానికి ఆ భవనాలను వాడుకోవడం చేతగాక విమర్శలు ఎందుకని బొత్స ప్రశ్నించారు.
రుషికొండలో టూరిజానికి చెందిన పాత భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించామని, అందులో అవినీతి, అక్రమాలు అంటూ గగ్గోలు పెట్టిన ఇప్పుడా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లించారని కూడా ఆయన నిలదీశారు. ఇదే విషయం వారి గెజిట్ వచ్చిందని.. అంటే రుషికొండ నిర్మాణాలు సక్రమమే కదా అని అన్నారు. ఏ విచారణకైనా తాము సిద్ధమని, తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడతామని బొత్స ఘాటుగా బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment