జగన్‌ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం | Kumbha Ravi Babu fires on TDP Govt | Sakshi
Sakshi News home page

జగన్‌ది ప్రగతి రథం.. బాబుదే విధ్వంసం

Published Tue, Mar 4 2025 7:50 AM | Last Updated on Tue, Mar 4 2025 11:22 AM

Kumbha Ravi Babu fires on TDP Govt

కూటమి తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులు

సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోను గత ప్రభుత్వ విధ్వంసం అంటూ ప్రజల మనస్సుల్లో కాలకూట విషం నింపే ప్రయత్నం చేస్తోందని.. ఎవరిది విధ్వంసం అనేది ప్రజలకు తెలుసునని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు నిప్పులు చెరిగారు. బడ్జెట్‌పై మండలిలో చర్చ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దు్రష్పచారాలను తూర్పారబట్టారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సాధించిన ప్రగతిని అంకెలు, రుజువులతో సహా వివరించారు. రవిబాబు ఏమన్నారంటే..  

అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు కలిసి రాష్ట్ర ప్రజలకు సూపర్‌ సిక్స్‌తోపాటు అనేక హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఎప్పటిలాగే తన మేనిఫెస్టోను ఏ చెత్తబుట్టలో వేశారో ప్రజలు గమనిస్తున్నారు.

విశాల తీర ప్రాంతాన్ని వినియోగించుకుని ఏడు పోర్టులు నిర్మించి రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేయడం విధ్వంసమా? ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు విప్లవాత్మక చర్యలు తీసుకోవడమే విధ్వంసమా? ఇక కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ.32­వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రాథమిక విద్యలో మౌలిక వసతులు కల్పించడం విధ్వంసమా? నవరత్నాల ద్వారా డీబీటీ పద్ధతిలో రూ.2.70 లక్షల కోట్లకు పైగా ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేయడం విధ్వంసమా? ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనం నుంచి ధాన్యం సేకరణ వరకు సేవలు అందించడం విధ్వంసమా?

ఏకంగా 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మాణం చేపట్టడం విధ్వంసమా? 2.36 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప వద్దకే అందించడం విధ్వంసమా?.. లేక  ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బడ్జెట్‌లో కోత­లు పెట్టిన చంద్రబాబు విధ్వం­స­కారుడా? ఎవ­రు విధ్వంసకారుడు? ఎవరు విధ్వంసం సృష్టిస్తున్నారో అనేది ప్రజలు ఇప్పటికే గుర్తించారు.  

సమీక్షలకు ఐదేసి గంటలు పడుతోంది
టీడీపీ విప్‌ పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ.. 2019 నుంచి 2024 వరకు వైఎస్‌ జగన్‌ ఆర్థిక అరాచకాన్ని సృష్టిస్తే.. అందులోంచి బయ­టకు రావడానికి చంద్రబాబు అధ్యక్షతన ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ రాష్ట్ర వ్యవస్థను గాడిలో పెట్టేలా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్‌ పెట్టారన్నారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని విధ్వంసం చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వ అరాచకాలను సరిదిద్దడానికి చంద్రబాబు సమీక్షలు పెడితే ఐదేసి గంటలు పడుతోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement