
సాక్షి, ఏలూరు జిల్లా: రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో చెత్త కుప్పలు పేరుకుపోయి.. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన ఏలూరులోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్వచ్ఛతలో రాష్ట్రంలో కింద నుంచి మూడో స్థానంలో ఉందన్నారు.
వైఎస్ జగన్ హయాంలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధంగా క్లాప్ వెహికల్స్ పెట్టారని. నీతి ఆయోగ్ సైతం ప్రశంసించిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్వచ్ఛభారత్‌ను వైఎస్ జగన్ సమర్థవంతంగా అమలు చేశారన్నారు. స్వచ్ఛ భారత్ క్లాప్ వ్యాన్లను చంద్రబాబు ప్రభుత్వం మూలన పడేసిందని.. వాటిని తొలగించడంతో ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
‘‘చంద్రబాబు పర్యటనలో తణుకును దిగ్బంధం చేశారు. తేతలిలో పశువధ కర్మాగారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారు. పశువుల కర్మాగారం పక్కనున్న ఎఫ్‌సీఐ గోడౌన్లు సైతం ఖాళీ చేస్తున్నారు. కోర్టు స్టే ఇచ్చినా కానీ.. పశువధ కర్మాగారం వారికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. పశువధ కర్మాగారం ద్వారా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. టీడీపీ, జనసేన కార్యాలయాల చుట్టూ పశువధ కర్మాగారం బాధితులు తిరిగిన వారికి న్యాయం జరగలేదు. పశువధ దుర్గంధంతో తణుకు ప్రజలు అల్లాడిపోతున్నారు’’ అని కారుమూరి పేర్కొన్నారు.
‘‘ఆరుమిల్లి రాధాకృష్ణకు పావలా ఎమ్మెల్యే అని పేరు వచ్చింది. లిక్కర్, గంజాయిలో దాచుకో.. దోచుకో.. పంచుకో అన్న రీతిలో పాలన సాగుతుంది. వైఎస్ జగన్ బస్సులో వెళ్లేటప్పుడు ఎవరైనా వినతిపత్రం చూపిస్తే వెంటనే స్పందించేవారు. నిన్న స్వచ్ఛ ఆంధ్ర సభలో చంద్రబాబు భజనే సరిపోయింది. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారు అందులో ఐదు పూర్తయ్యాయి. 750 మెడికల్ సీట్లు మాకు వద్దు అని కేంద్రానికి లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబు. ప్రతి గ్రామంలో వైఎస్ జగన్ తీసుకొచ్చిన సచివాలయాలు రైతుభరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు దర్శనమిస్తాయి. 9 నెలలోనే చంద్రబాబు 1,50,000 కోట్లు అప్పు చేశాడు. వైఎస్ జగన్ పథకాలు కొనసాగించక పోగా మీరు ఇస్తానన్న సూపర్ సిక్స్ ఇవ్వలేదు.
17 లక్షల రైతులు వద్ద రెండు కోట్ల మెట్రిక్ టన్నులు ధాన్యం మీరు గతంలో కొంటే వైఎస్ జగన్ హయాంలో 37 లక్షల మంది రైతుల వద్ద మూడు కోట్ల 40 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొన్నాము. ఈ-క్రాప్, ఇన్సూరెన్స్ విధానాలు ఎత్తేశారు. చంద్రబాబు రైతుల నడ్డి విరిచేశారు. 45 ఏళ్ల ఇండస్ట్రీ అనే చంద్రబాబు ఒక్క హామీ నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలు బాధలతో అల్లాడిపోతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, తల్లికి వందనం ఊసే లేదు.. నీకు 15000 నీకు 18000 అన్నారు వాటి ఇప్పుడు ఆ 15 లేదు 18 లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గతంలో మీ హయాంలోనే వచ్చింది. పయ్యావుల కేశవ్ గతంలో ఇది చాలా మంచిదని అనలేదా..?. మేము దాన్ని అమలు చేస్తే బురదజల్లారు
రూ.75,000 ఉండే మెడికల్ కాలేజీ ఫీజు లక్ష ఇరవై వేలకు పెంచేశారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు పొలం బాట పడుతున్నారు. వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే ఆ పథకాలన్నీ నిలిపివేశారు. పేద ప్రజలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా?. సూపర్ సిక్స్ అని ఊదరకొట్టారు. గతంలో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందన్నారు. ఇప్పుడు ఒక్క హామీ అమలు చేయలేకపోతున్నారు’’ అని కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment