Judiciary
-
విశ్వబంధు భారత్‌కు.. రాజ్యాంగమే పునాది
న్యూఢిల్లీ: రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ సామాన్య ప్రజల జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలిసికట్టుగా పని చేయాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థపై ఉందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. పౌరుల ప్రాథమిక విధులను రాజ్యాంగంలో స్పష్టంగా నిర్దేశించారని చెప్పారు. దేశ ఐక్యత, సమగ్రత, సమాజంలో సామరస్యంతోపాటు మహిళల గౌరవాన్ని కాపాడడం పౌరుల విధి అని చెప్పారు. కార్యనిర్వాహక వర్గం, శాసననిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థతోపాటు ప్రజలు కూడా కలిసి క్రియాశీలకంగా పనిచేస్తే రాజ్యాంగ ఆశయాలకు బలం చేకూరుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లలో పార్లమెంట్లో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందని గుర్తుచేశారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజల జీవితాలు మెరుగుపడుతున్నాయని, వారి పురోభివృద్ధికి నూతన అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని వివరించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పాత పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. కార్యక్రమానికి పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. మన రాజ్యాంగం ఒక ప్రగతిశీల పత్రం అని రాష్ట్రపతి పేర్కొన్నారు. దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆలోచనలను అందిపుచ్చుకొనే వ్యవస్థను అందించారని కొనియాడారు. సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధికి సంబంధించి రాజ్యాంగం ద్వారా మనం ఎన్నో ఘనతలు సాధించామని హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ముర్ము ఇంకా ఏం మాట్లాడారంటే.. విశ్వబంధు భారత్ ‘‘దేశ ఐక్యత, సమగ్రతతోపాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం, శాస్త్రీయ దృక్పథం పెంచుకోవడం, ప్రభుత్వ ఆస్తులను రక్షించుకోవడం, అభివృద్ధిలో దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం పౌరుల ప్రాథమిక విధులు. నూతన పథంలో పయనిస్తే అంతర్జాతీయ వేదికలపై మన దేశానికి నూతన గుర్తింపును సాధించిపెట్టగలం. అంతర్జాతీయంగా శాంతి భద్రతలను పెంపొందించేలా కీలక పాత్ర పోషించడానికి రాజ్యాంగ నిర్మాతలు భారత్‌కు మార్గనిర్దేశం చేశారు. నేడు మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. విశ్వబంధుగా ప్రపంచవ్యాప్తంగా చురుకైన పాత్ర పోషిస్తోంది. భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజ్యాంగమే బలమైన పునాది రాయి. ప్రజల సమ్మిళిత, వ్యక్తిగత గౌరవాన్ని రాజ్యాంగం కాపాడుతోంది. స్వాతంత్య్ర పోరాట ఫలితమే రాజ్యాంగం వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన 75వ గణతంత్ర వేడుకలు నిర్వహించుకోబోతున్నాం. ఇప్పటిదాకా సాగిన మన ప్రయాణాన్ని సమీక్షించుకోవడానికి, భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రయాణానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి ఇలాంటి వేడుకలు ఎంతగానో తోడ్పడతాయి. మన ఐక్యతను బలోపేతం చేస్తాయి. జాతీయ లక్ష్యాలను సాధించడంలో మనమంతా కలిసకట్టుగా ఉన్నామని తెలియజేశాయి. ఎందరో మహామహులు దాదాపు మూడేళ్లపాటు కృషి చేయడంతో రాజ్యాంగం మన చేతికి వచ్చింది. నిజానికి సుదీర్ఘంగా జరిగిన స్వాతంత్య్ర పోరాట ఫలితమే భారత రాజ్యాంగం. ఈ పోరాట స్ఫూర్తి, ఆశయాలను రాజ్యాంగం ప్రతిబింబిస్తోంది. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సమున్నత ఆశయలను రాజ్యాంగ పీఠికలో పొందుపర్చారు. ఇవే దశాబ్దాలుగా భారత్‌ను నిర్వచిస్తున్నాయి. స్వశక్తితో పైకి ఎదిగే, సమాజానికి సేవలందించే, తోటి మానవులకు సాయం అందించే వాతావరణాన్ని రాజ్యాంగ పీఠిక కల్పించింది. 2015 నుంచి సంవిధాన దివస్ జరుపుకుంటున్నాం. దీనివల్ల రాజ్యాంగంపై యువతలో అవగాహన పెరుగుతోంది. మీ ప్రవర్తనలో రాజ్యాంగ విలువలను, ఆశయాలను జోడించాలని ప్రజలందరినీ కోరుతున్నా. పౌరులంతా ప్రాథమిక విధులను నిర్వర్తించాలి. ‘2047 నాటికి వికసిత్ భారత్’ అనే లక్ష్యం దిశగా అంకితభావంతో ముందుకు సాగాలి’’ అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రకారం ప్రజలే అత్యున్నతం: జగదీప్ ధన్‌ఖడ్ రాజకీయ పార్టీలు దేశం కంటే మత విశ్వాసాలకు, స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే మన స్వాతంత్య్రం రెండోసారి ప్రమాదంలో పడుతుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పినట్లు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గుర్తుచేశారు. ఆయన పాత పార్లమెంట్ భవనంలో రాజ్యాంగ దినోత్సవంలో ఎంపీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలకు ప్రభావవంతంగా సేవలందించాలంటే చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు, నిర్మాణాత్మక సంవాదాలు జరగాలని చెప్పారు. మన ప్రజాస్వామ్య దేవాలయాల పవిత్రతను పునరుద్ధరించాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘భారతదేశ ప్రజలమైన మేము’ అని రాజ్యాంగ పీఠికలో ప్రారంభంలోనే పేర్కొన్నారని, ఇందులో లోతైన అర్థం ఉందని, ప్రజలే అత్యున్నతం అని తేల్చి చెప్పారు. ప్రజల గొంతుకగా పార్లమెంట్ పని చేస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనవర్గం, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ అనే మూడు మూలస్తంభాలను రాజ్యాంగం ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజ్యాంగ సంస్థలు కలిసి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరింత వెలుగులీనుతుందని సూచించారు. రాజ్యాంగం నిర్దేశించిన ప్రాథమిక విధులను ప్రజలంతా నిర్వర్తించాలని కోరారు. దేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వికసిత్ భారత్ అనే లక్ష్య సాధనకు గతంలో కంటే ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని జగదీప్ ధన్‌ఖడ్ వెల్లడించారు. రాజ్యాంగం ఒక ఉ్రత్పేరకం: ఓం బిర్లా చట్టసభల్లో నిర్మాణాత్మక, గౌరవప్రదమైన చర్చలు జరగాలని రాజ్యాంగ సభ సూచించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. ఇదే సంప్రదాయాన్ని చట్టసభల సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవంలో ఓం బిర్లా ప్రసంగించారు. మన స్వాతంత్య్ర పోరాట వీరుల త్యాగం, అంకితభావం, దార్శనికతకు రాజ్యాంగం ఒక ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. సామాజిక మార్పునకు, ఆర్థిక ప్రగతికి రాజ్యాంగమే ఒక ఉ్రత్పేరకం అని చెప్పారు. సాధారణ ప్రజల స్థితిగతుల్లో ఎన్నో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిందని, ప్రజాస్వామ్యం పట్ల వారి విశ్వాసాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. చట్టసభల్లో చక్కటి చర్చల ద్వారా రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎంపీలకు ఓం బిర్లా పిలుపునిచ్చారు. రాజ్యాంగ విలువల పట్ల మన తిరుగులేని అంకితభావం అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచుతుందని ఉద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి నిర్వహించాలని ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ సూచించారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
కస్టడీ కాలం పెంచడం సబబేనా?
కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలలో తెచ్చిన మార్పులు మంచివేనా? కొత్త చట్టాల వల్ల సమస్యలు తీరు తాయా? అనే ప్రశ్నలు న్యాయనిపుణులనే కాదు, సాధారణ పౌరులనూ వేధి స్తున్నాయి. అందుకే ఈ విషయాలపై లోతుగా పరిశోధించవలసిన అవసరం ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ ఎస్ఎస్)లోని సెక్షన్ 187 కింద నిందితుల కస్టడీ కాలాన్ని పాత చట్టం అనుమతిస్తున్న దానికన్నా కొన్ని రెట్లు పెంచుతారు. అంటే నిందితులు ఎక్కువ కాలం కస్టడీలో ఉండాలి అని దర్యాప్తు అధికారి భావిస్తే కస్టడీ కాలం పెరుగుతుందని దీనర్థం. అంటే పోలీసులు నిందితుడి జీవితాన్ని సాధ్యమైనంత వరకు లాకప్‌కు పరిమితం చేయాలనుకుంటే చేయ వచ్చన్నమాట. మరో సమస్య ఏమంటే ఎక్కువ కాలం పోలీసు కస్టడీ తర్వాత... కోర్టు కస్టడీ మొద లవుతుంది. కోర్టు కస్టడీ అంటే పోలీసు కస్టడీ కన్నా గొప్పది, సహించగలిగినది అనుకోవలసిన పనిలేదు. లాకప్‌లో ఉంటే పోలీసులు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. ఆ తరువాత జైలు కస్టడీ ప్రారంభమయితే పోలీసు అధికారుల బదులు, జైలు అధికా రులు పెట్టే బాధలు కొనసాగుతాయి. దర్యాప్తు కోసం మొదట ఒక రోజన్నా పోలీసు కస్టడీలో ఉండి తీరాల్సిందే. అయితే కచ్చితంగా దర్యాప్తు 24 గంటల్లో పూర్తవ్వదు. లెక్కబెట్టి 24 గంటలు కాగానే ఇంటికి పంపిస్తారని దీనర్థం కాదు. అబద్ధపు ఆరోపణలను భరిస్తూ, అక్రమ నిర్బంధాన్ని అనుభవిస్తూ చట్ట వ్యతిరేకంగా పోలీస్‌లు అను కున్నంత కాలం లాకప్‌లో ఉండవల్సిందే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం దర్యాప్తు సమయం లేక లాకప్‌లో ఉండే సమయం 40 రోజులు లేదా 60 రోజులకు పెరుగుతూ ఉంటుంది. అది గొప్ప సంస్క రణ అంటే... ఆలోచించాల్సిందే! చట్టం ప్రకారం 40 లేదా 60 రోజుల లాకప్ కస్టడీ తరువాత మరింత చట్ట వ్యతిరేక (అక్రమ) నిర్బంధం మొదలవుతుందన్న మాట. ఈ సంస్కరణ వల్ల పోలీసు అధికా రాలు విస్తారంగా పెరిగిపోయాయి. దీంతో అధికా రుల మధ్య నిందితుడు దిక్కులేని పక్షి అవుతాడు. దాని పర్యవసానం ఏమిటంటే మేజిస్ట్రేట్‌కి బెయిల్ ఇచ్చే అధికారం తగ్గిపోయింది. పోలీసులు నింది తుణ్ణి వదిలిపెట్టడం అనేది అతడి అదృష్టం తదితర అంశాల మీద ఆధారపడి ఉంటుంది. చట్టం ప్రకారం కస్టడీకి ఎంతో కొంత పరిమితి ఉంటుంది. కాని, పోలీసుల అక్రమ కస్టడీలపై ఏ పరిమితీ ఉండదు. నిందితుల అదృష్టం, దేవుడి దయ! 15 రోజుల కస్టడీ మంచిదా కాదా అని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చర్చించింది. ఎట్టి పరిస్థితిలో 15 రోజులు కస్టడీ (లాకప్ లేదా జైల్ నిర్బంధం) దాట డానికి వీల్లేదని అనుపమ్ కులకర్ణీ వర్సెస్ సీబీఐ కేసుకు సంబంధించిన తీర్పులో అత్యున్నత న్యాయ స్థానం పేర్కొంది. ఇప్పుడు పార్లమెంట్‌లోని ఉభయ సభలు తెచ్చిన కొత్త నేర చట్టాలు అమలులోకి వచ్చిన తర్వాత ఈ తీర్పు ఇక ఎంతమాత్రం చెల్లనే రదు. ఇదన్నమాట సంస్కరణంటే. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఎవ్వరూ చదవరు, అర్థం చేసుకోరు. పార్లమెంట్ సభ్యులు ఆ యా పార్టీల విప్ల ఆధారంగా చట్టసభల్లో ఓటింగ్‌లో పాల్గొని ఓటేస్తారు. ఇలా క్రిమినల్ చట్టాలు చేసుకుంటూ పోతే మరి పౌర హక్కుల మాటేమిటి? రాజ్యాంగానికి ఉన్న విలువెంత?బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 187 కింద అంత తీవ్రం కాని నేరాల పరిశోధనలో 40 రోజుల కస్టడీ సమయం ఉంటుంది. తీవ్రమైన నేరాల పరిశోధనకు 60 రోజుల సమయాన్ని ఇస్తున్నారు. 10 సంవత్స రాల జైలు శిక్ష విధించదగిన కేసులలో 40 రోజుల దర్యాప్తుకు అవకాశం ఇస్తారు. ఇంత కన్న తక్కువ శిక్షలు విధించే నేరాలకు ఇంతకు ముందు 15 రోజుల కస్టడీ ఉండేది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 167 కింద మొదటి కస్టడీ కాలం 15 రోజులతో మొదలయ్యేది. ప్రజాహిత స్నేహపూరిత సంస్కరణలంటే ఇవేనా? ఈ ప్రభుత్వం ప్రజల ప్రేమాభిమానాలను కోరుకునేదే అయితే... జనం లాకప్పులు, కోర్టు కస్టడీ కాలాన్ని పెంచడం ఎందుకు? ఇందులో సంస్కరణ ఏముంది? వికాస్ మిశ్రా వర్సెస్ సీబీఐ కేసులో అధికారులు లాకప్ లేదా కస్టడీ నిర్బంధ సమయం పెంచాలని కోరారు. లంచం ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ కస్టడీ పొడిగింపును కోరింది సీబీఐ. అప్పడికి ఏడురోజుల కస్టడీ పూర్తయింది. నిందితులు హాస్పిటల్‌కు రావలసి వచ్చింది. ఆ తరువాత బెయి ల్‌పై విడుదల చేశారు. సెంతల్ బాలాజీ కేసులో 15 రోజుల కస్టడీని విడి విడి భాగాలుగా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు వివరించింది. అప్పుడు ఈ లిటిగేషన్లు కొన సాగుతూ సుప్రీం కోర్టుదాకా పోవడానికి వీలవుతుంది. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో 40 నుంచి 60 రోజులు ఇచ్చే కస్టడీని మరింత దారుణంగా వాడుకుంటారనే విమర్శలు ఉన్నాయి. దీనివల్ల సుప్రీం కోర్టుదాకా లిటిగేషన్ నడుపుతూ ఉంటే 15, 40, 60 రోజులకు కస్టడీ పెంచుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఇదే రాజ్యాంగ వ్యతిరేకం అని ప్రశ్నించాల్సి ఉంది.మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త మహేంద్ర యూనివర్సిటీ‘స్కూల్ ఆఫ్ లా’లో ప్రొఫెసర్ -
న్యాయం మరింత బలోపేతం: చంద్రచూడ్
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు. సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు. -
అపవాదు వేస్తారా?
న్యూఢిల్లీ: బెంగాల్ న్యాయవ్యవస్థ మీద అపవాదులు మోపడం సరికాదంటూ సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని మందలించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతర హింస కేసులను బెంగాల్ బయటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ గత డిసెంబరులో కోరింది. ‘‘లేదంటే సాక్షులను భయపెట్టే అవకాశముంది. బెంగాల్ కోర్టులలో శత్రుత్వభావంతో కూడిన వాతావరణం నెలకొంది’’ అని పేర్కొంది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కేసుల బదిలీకి ఇదేం ప్రాతిపదిక? మొత్తం న్యాయవ్యవస్థపైనే అపవాదు వేస్తారా? బెంగాల్ కోర్టులన్నింటిలోనూ విరో«ధభావం నెలకొందన్నట్లుగా చూపుతున్నారు. ఒక రాష్ట్రంలోని న్యాయమూర్తులను సీబీఐ అధికారులు ఇష్టపడనంత మాత్రాన మొత్తం న్యాయవ్యవస్థే పనిచేయడం లేదనకండి. జిల్లా జడ్జిలు, సివిల్ జడ్జిలు, సెషన్స్ జడ్జిలు తమను తాము సమరి్థంచుకోవడానికి సుప్రీంకోర్టు దాకా రాలేరు’’ అని సీబీఐ తరఫున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజును ఉద్దేశించి పేర్కొంది. పిటిషన్లో వాడిన పదజాలాన్ని ఆయన సమరి్థంచుకోనే ప్రయత్నం చేశారు. కోర్టులపై అపవాదు వేసే ఉద్దేశం తమకు లేదని పేర్కొంటూ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. -
మన సమస్యకు మనమే పరిష్కర్తలం!
అరుదుగానైనా సరే, తలలు కూలుతున్న శబ్దం మధురంగా వినిపిస్తుంది. మలయాళ చలనచిత్ర పరిశ్రమలో మహిళలపై ప్రబలంగా జరుగుతున్న లైంగిక, ఇతర వేధింపులపై సంచలన నివేదిక విస్ఫోటనం తర్వాత మొదటి వేటు నటుడు సిద్ధిక్, నిర్మాత రంజిత్‌లపై పడింది. సిద్ధిక్‌పై లైంగికదాడి అభియోగాలు మోపారు. ఇకపోతే సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేష్ అరెస్టు నుండి తప్పించుకోవడానికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.కొందరు దీనిని మలయాళ చిత్రపరిశ్రమలో ‘మీ టూ’ ఉద్యమంగా అభి వర్ణిస్తున్నారు. కచ్చితంగా, మాలీవుడ్‌లో మహిళల పని పరిస్థితులపై జస్టిస్ కె.హేమ కమిటీ నివేదిక విడుదలైన తర్వాత నెలకొన్న సంఘటనలు పరిశ్రమ నియంత్రణను దాటిపోయాయి. 2019 డిసెంబరు నుండి నివేదికను తొక్కిపట్టి ఉంచిన పినరయి విజయన్ ప్రభుత్వం కూడా ఈ నివేదిక పేర్కొన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ప్రకటించింది.కోల్‌కతాలో ట్రెయినీ డాక్టర్ ఘోర హత్యాచారంపై చెలరేగుతున్న ఆగ్రహ జ్వాలలకు ప్రతిస్పందనగా కొచ్చిలో రణగొణధ్వనులు వినిపిస్తున్నప్పుడు మనం ఒక పెను మార్పు మలుపులో ఉన్నాము. బద్లాపూర్(మహారాష్ట్ర)లో ప్రజల ఆగ్రహం బాంబే హైకోర్టు విచారణకు దారితీసినప్పుడు, అబ్బాయిల లింగపరమైన సున్నితత్వంతో సహా కొన్ని సూచనలు చేయమని హైకోర్టు ఒక కమిటీని కోరింది.ఇదంతా స్వాగతించదగినదే. అయితే ఇదంతా మనం ఇంతకు ముందే విన్నాం. 2018లో, భారత దేశంలో మీ టూ ఉద్యమం సమయంలో, లైంగిక దాడి ఆరోపణలు తగ్గుముఖం పట్టడంతో మనం ఒక అవకాశాన్ని కోల్పోయాము అని ఉద్యమకారులు అంటారు. ఎందుకంటే ఆరోపణలకు సంబంధించి పెద్ద్ద పేర్లు ఎన్నడూ బయటపడలేదు. దానికి తోడుగా,లైంగిక దాడి గురించి మాట్లాడిన వారిపై క్రిమినల్ పరువు నష్టం దావాలు తీవ్ర ప్రభావం చూపాయి.2013లో, మగవారి మనస్తత్వాలను మార్చే పనిపై గట్టిగా కృషి చేయకుండా, కఠినమైన చట్టాన్ని ఆమోదించడం ఒక్కటే సమస్యను పరిష్కరిస్తుందని భావించిన ప్పుడు మనం మళ్లీ పోరాటాన్ని కోల్పోయాము. ఇప్పుడు మనకు మరో అవకాశం వచ్చింది. కానీ తరువాత ఏమి జరుగుతుందనేది ‘మన’పైనే ఆధార పడి ఉంటుంది. లైంగిక ఆరోపణలకు గురైన వారి సినిమాలను ప్రేక్షకుల్లోని ‘మన’వారే విమర్శనారహి తంగా ఆబగా చూస్తున్నారు. నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టి నోరెత్తే వారిని ట్రోల్ చేసి బెదిరించేవారు కూడా సోషల్ మీడియాలోని ’మన’వారే. శక్తిమంతులకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసే మహిళలను చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలో ఉన్న ‘మన’వారు కష్టపెడుతున్నారు. చలనచిత్ర విడుదలకు సంబంధించి సమయానుకూలంగా పీఆర్–ఆధారిత సమాచారాన్ని అందజేసే మీడియాలోని ‘మన’వారు జర్నలిజానికి సంబంధించిన క్లిష్టమైన ప్రశ్నలు వేటినీ అడగరు.మాట్లాడేవారు ఒంటరిగా లేరని తెలిసేలా, నిజం చెప్పే భారం మహిళలపై మాత్రమే పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ‘మన’పైనే ఉంది. అలాగే మహిళ లను లైంగికంగా వేటాడేవారిని జాతీయ చర్చల నుండి, బాక్సాఫీస్ నుండి, సాహిత్య వేడుకల నుండి మాత్రమే కాకుండా మన డ్రాయింగ్ రూముల్లో చర్చల నుండి కూడా దూరంగా ఉంచాలి. కోల్‌కతాలోని వైద్యులకు ఆగ్రహించే హక్కు ఉంది. అయితే నిరసనలు రాజకీయ రంగు పులు ముకున్నాయి. లైంగికదాడి చేసిన వారిని నెలాఖరులోగా ఉరిశిక్ష విధించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన ప్రకటనలు పరిష్కా రాన్ని కనుగొనే లక్ష్యంతో కాకుండా, ప్రజల ఆగ్రహాన్ని చల్లబర్చడం కోసమే చేసినట్లున్నాయి.తెగులు లేదా కుళ్లు అనేది వ్యవస్థాగతంగా ఉన్నప్పుడు, దానికి పరిష్కారం అనేది ‘ఇక్కడో రాజీనామా’, ‘అక్కడో కమిటీ ఏర్పాటు’ వంటి రూపాల్లో పాక్షికంగా, అవ్యవస్థీకృతంగా ఉండకూడదు. లైంగిక వేధింపులకు మనం ప్రత్యేకమైన, భిన్నమైన నేరాలుగా ప్రతిస్పందించడం మానేయాలి. మహిళలకు వ్యతిరేకంగా అసమానమైన శక్తి కొనసాగిస్తున్న విస్తృత దాడుల్లో భాగంగా వీటిని చూడాలి.మనకు అసమానతలపై పోరాడే ఉద్యమం అవసరం: బహిరంగ ప్రదేశాల్లో, పార్లమెంటులో, పోలీసు స్టేషన్లలో, పని ప్రదేశాల్లో, న్యాయవ్యవస్థలో ఎక్కువ మంది మహిళలు భాగం కావలసి ఉంది. సోదరీమణులు, కుమార్తెలుగా మాత్రమే ఉండిపోకుండా, మనం సమాన పౌరులం అనే ఆలోచనను సాధారణీకరించాల్సి ఉంది. మనకు ప్రస్తుతం ఒక అవకాశం ఉంది. దానిని స్వాధీనం చేసుకోవడం మనపైనే ఉంది. వ్యాసకర్త జెండర్ అంశాల రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
మహిళలపై నేరాల్లో... సత్వర తీర్పులు
న్యూఢిల్లీ: మహిళలపై అత్యాచారం, హత్య వంటి హేయమైన నేరాల విషయంలో తీర్పులు ఇవ్వడంలో కోర్టులు ఎంతమాత్రం జాప్యం చేయొద్దని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టం చేశారు. సత్వర తీర్పులతో బాధితులకు న్యాయం చేకూర్చాలన్నారు. ‘‘ఇలాంటి కేసుల్లో తీర్పులు ఆలస్యమైతే న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. న్యాయ వ్యవస్థ సున్నితత్వం కోల్పోయిందని భావించే ప్రమాదముంది’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ముర్ము ప్రసంగించారు. హేయమైన నేరాలకు సంబంధించి కూడా కొన్నిసార్లు ఒక తరం ముగిసిన తర్వాత తీర్పులు వస్తున్నాయని ఆక్షేపించారు. కోర్టుల్లో వాయిదాల సంస్కృతి మారాలని సూచించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు, బ్యాక్లాగ్ కేసులు న్యాయ వ్యవస్థకు పెను సవాలుగా నిలుస్తున్నాయన్నారు. వీటి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘తరచూ ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించాలి. ప్పారు. పెండింగ్ కేసులను తగ్గించడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి’’ అని సూచించారు. న్యాయం కోసం పోరాడితే మరిన్ని కష్టాలు: అంగ బలం, అర్థబలం కలిగిన కొందరు నేరగాళ్లు యథేచ్ఛగా బయట సంచరిస్తున్నారని రాష్ట్రపతి ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారికి సకాలంలో శిక్షలు పడడం లేదన్నారు. అలాంటి నేరగాళ్ల వల్ల నష్టపోయిన బాధితులు మాత్రం భయాందోళనల మధ్య బతుకుతున్నారు. గ్రామీణ పేదలు కోర్టులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే వారు కోర్టుల దాకా వస్తున్నారు’’ అన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. కోర్టుల్లో మహిళలకు వసతులు మెరుగుపడాలి: సీజేఐ జిల్లా స్థాయి కోర్టుల్లో మహిళలకు తగిన మౌలిక వసతులు లేవని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతున్నా కోర్టుల్లో వారికి సరిపడా సదుపాయాలు లేకపోవడం గర్హనీయమన్నారు. జిల్లా స్థాయి న్యాయస్థానాల్లోని మౌలిక సదుపాయాల్లో కేవలం 6.7 శాతమే మహిళలకు అనువుగా ఉన్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరముందని ఉద్ఘాటించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో న్యాయ నియామకాల్లో 70 శాతం మహిళలే ఉంటున్నారు. వారికి వసతులు మెరుగుపడాలి. కోర్టు ప్రాంగణాల్లో వైద్య సదుపాయాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు రావాలి. కక్షిదారుల కోసం ఈ–సేవా కేంద్రాలు, వీడియో కాన్ఫరెన్స్ వంటివాటితో న్యాయం సులువుగా అందుబాటులోకి వస్తుంది. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సురక్షితమైన, సానుకూల పరిస్థితులు కలి్పంచే చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ప్రధానంగా మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, అణగారిన వర్గాల సంక్షేమం న్యాయస్థానాల కర్తవ్యం కావాలి’’ అని పిలుపునిచ్చారు. -
‘పెండింగ్’కు మంచి దోవ!
న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల గురించి ఎవరికీ తెలియనిది కాదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినవారు గతంలో చాలాసార్లు మాట్లాడారు. రిటైరయ్యే రోజున కూడా ఆ మాట చెప్పి నిష్క్రమించేవారు. తమ పదవీకాలంలో పెండింగ్ బెడదను సాధ్యమైనంత తగ్గించేందుకు పలు విధానాలు అమలు పరిచేవారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచాలంటూ ప్రధానికి బహిరంగ వినతులు చేసినవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. ఈ శనివారం నుంచి వరసగా ఆరురోజులపాటు ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో సుప్రీంకోర్టులో లోక్ అదాలత్‌లు జరగకపోలేదు. కానీ ఎప్పుడో ఒకసారి జరిగే ఈ అదాలత్లకు పెద్దగా స్పందన ఉండేది కాదు. అందువల్లే ఈసారి వరసగా ఆరురోజులపాటు సాగించాలని ఆయన భావించారు. ఈ కార్యక్రమంలో పదివేల కేసుల్ని పరిష్కరించాలన్నది ఆయన లక్ష్యం. పైగా ఈ కేసుల పరిష్కారానికి లిటిగెంట్లకు పైసా ఖర్చుండదు. వీటిల్లో కార్మిక చట్టాలు, అద్దె, సేవలు, పరిహారం, కుటుంబ తగాదాలు, సాధారణ సివిల్ తగాదాలు, వినియోగదారుల కేసులు ఉంటాయి. జస్టిస్ చంద్రచూడ్ చెబుతున్న ప్రకారం సుప్రీంకోర్టులో ప్రస్తుతం 66,059 సివిల్ కేసులూ, 18,049 క్రిమినల్ కేసులూ ఉన్నాయి. రెండూ లెక్కేస్తే 84 వేల పైమాటే. ఇవిగాక వివిధ హైకోర్టుల్లో 44,03,152 సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ చెబుతోంది. క్రిమినల్ కేసుల సంఖ్య 17,55,946. మొత్తంగా చూస్తే దాదాపు 62 లక్షలు! హైకోర్టుల్లో ఏడాదిగా పెండింగ్‌లో ఉన్నవి పది లక్షల సివిల్ కేసులు. ఇవిగాక సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో రోజూ దాఖలయ్యే కేసులు, అప్పీళ్లు, కింది కోర్టుల్లో పెండింగ్ పడిన కోట్లాది కేసులు అదనం.న్యాయవ్యవస్థ పుట్టిన నాటినుంచీ అవతలి పక్షాన్ని కోర్టుకీడ్చి ఇరుకున పెట్టాలన్న యావ కక్షిదారులకు సహజంగా ఏర్పడివుంటుంది. రాచరికాల్లో ఇంత చేటు సాహసం ఉండేది కాదు. తప్పనిసరైతే తప్ప, తనవైపే న్యాయం ఉందన్న ధీమా ఉంటే తప్ప ఫిర్యాదు చేయడానికి జంకేవారు. తేడా వస్తే తల తీస్తారన్న భయమే అందుకు కారణం కావొచ్చు. చిత్రమేమంటే వర్తమాన కాలంలో ప్రభుత్వాలే పెద్ద లిటిగెంట్లుగా మారాయి. అసమ్మతి ప్రకటించేవారిపై ఎడాపెడా కుట్ర కేసులు బనాయించటం, ఇతరత్రా కేసుల్లో ఇరికించటం ఇప్పటికీ సాగుతూనే వుంది. ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవటం ఒకపక్క, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలను కోర్టుకీడ్చటం మరోపక్క సమాంతరంగా సాగుతుంటాయి. వలస పాలకుల నాటి చట్టాలనే ఇప్పటికీ నెత్తిన పెట్టుకోవటం, అవకతవకలు జరగలేదని తెలిసికూడా అధికార మదంతో వ్యతిరేకులను అక్రమ కేసుల్లో ఇరికించటం మితిమీరుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల పుణ్యమా అని యూపీ నుంచి ఏపీ దాకా బుల్డోజర్లు నడిపించే సంస్కృతి పెరిగింది. ప్రత్యర్థి పక్షాలకు చెందినవారి ఇళ్లపై, కార్యాలయాలపై దాడులు సరేసరి. సహజంగానే ఇలాంటి కేసులన్నీ న్యాయస్థానాలకు ఎక్కక తప్పదు. దానికితోడు పొలాలు, స్థలాలు, ఇళ్లు వగైరా స్థిరాస్తుల వారసత్వ హక్కుల కోసం దాయాదులు, తామే న్యాయమైన హక్కుదారులమంటూ వచ్చే కక్షిదారులు లెక్కలేనంతమంది. ఎన్డీఏ సర్కారు ఈమధ్య కాలం చెల్లిన చట్టాల్లో కొన్నిటిని రద్దుచేయటంతోపాటు ఐపీసీ, సీపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టం స్థానాల్లో కొత్త చట్టాలు తీసుకొచ్చింది. అవి ఏమేరకు మార్పు తీసుకురాగలవో ఆచరణ తర్వాతగానీ తెలియదు. నీతి ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా నిరుడు ఏపీలో జగన్ సర్కారు తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం కూడా వినూత్నమైనది. 130 ఏళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా తీసుకొచ్చిన ఈ చట్టం ఉద్దేశం నిజమైన హక్కుదారులను గుర్తించి వారి హక్కులు కాపాడటం, అనవసర వ్యాజ్యాలు నిరోధించటం. అధికార యావతో ప్రత్యర్థులు ఎన్నికల్లో వక్ర భాష్యాలు చెప్పి ప్రజలను పక్కదోవ పట్టించారు. చివరకు ఎన్డీఏ సర్కారు దాన్ని రద్దుచేస్తోంది. లోక్ అదాలత్‌ల పనితీరు భిన్నమైనది. ఇందులో సామరస్య పరిష్కారానికి ఇరుపక్షాలనూ ప్రోత్సహిస్తారు. ప్రధాన న్యాయమూర్తి నియమించిన న్యాయనిపుణులు ఆ కేసులో ఉన్న సమస్యను న్యాయమూర్తులకూ, లిటిగెంట్లకూ వివరిస్తారు. పిటిషనర్లు నేరుగా న్యాయమూర్తులతో మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. జస్టిస్ చంద్రచూడ్ తీసుకొచ్చిన మరో మార్పేమిటంటే... పిటిషనర్లు దీనికోసం ఢిల్లీ వరకూ వెళ్లనవసరం లేదు. వారికి హైకోర్టుల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. ఇది పెండింగ్ కేసులకు న్యాయవ్యవస్థ నుంచి వచ్చిన ఒక సృజనాత్మక పరిష్కారం. ఇప్పుడు తమ వంతుగా ఏం చేయవచ్చునో ప్రభుత్వాలు ఆలోచించాలి. ఎప్పటికప్పుడు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయటం తక్షణావసరం. వేరే దేశాలతో పోలిస్తే జనాభాకూ, న్యాయమూర్తుల సంఖ్యకూ మధ్య నిష్పత్తి మన దేశంలో చాలా అధికం. అలాగే చట్టాలు చేసేముందు వాటి పర్యవసానంగా ఎన్ని వ్యాజ్యాలు కోర్టు మెట్లెక్కే అవకాశమున్నదో ప్రభుత్వాలు అంచనా వేసుకోవాలి. చెక్ బౌన్స్ కేసులు ఇందుకు ఉదాహరణ. గతంలో సివిల్ తగదాగా ఉన్నదాన్ని శిక్షార్హమైన నేరంగా మార్చారు. దీనివల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగాయి. పెండింగ్ కేసులు తగ్గించటం కోసం సెలవు రోజుల్లోనూ పనిచేయక తప్పడం లేదని ఆ మధ్య ఒక న్యాయమూర్తి వాపోయారు. సుప్రీంకోర్టు తీసుకున్న తాజా చొరవకు ప్రభుత్వాల వివేకం కూడా తోడైతే ఈ సంక్లిష్ట సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుంది. -
Delhi CM Arvind Kejriwal: ప్రధాని కావాలని లేదు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రధాని కావాలన్న ఆశ తనకు అస్సలు లేదని ఆప్ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అయితే ఇండియా కూటమి గెలిస్తే న్యాయ వ్యవస్థను ఒత్తిళ్ల నుంచి విముక్తం చేస్తామన్నారు. తన భార్య సునీతకు రాజకీయాలు నచ్చవని వెల్లడించారు. బెయిల్‌పై విడుదలయ్యాక బుధవారం ఆయన తొలిసారి పీటీఐ వీడియోస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. సొంత రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్‌పై తన ఇంట్లోనే పీఏ బిభవ్ కుమార్ దాడి చేసిన ఉదంతంపై కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే... నియంతృత్వాన్ని నిలువరిస్తాం ‘‘బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే విపక్ష నేతలందర్నీ కట్టగట్టి జైలుకు పంపుతుంది. ఎన్నికలను హైజాక్ చేస్తుంది. రష్యా మాదిరే ఏకపక్ష ఎన్నికలుంటాయి. అక్కడ పుతిన్ విపక్ష నేతల్ని జైలుకు, కొందర్ని పైకి పంపారు. అందుకే తాజా ఎన్నికల్లో 87 శాతం ఓట్లు సాధించారు. పాకిస్థాన్‌లోనూ అంతే. ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపారు. సొంత పార్టీ గుర్తును కూడా ఎన్నికల్లో వాడుకోనివ్వలేదు. బీజేపీ మళ్లీ గెలిస్తే ఎవ్వరినీ వదలదు. కానీ మోదీ నియంతృత్వ పాలనను నిలువరిస్తాం. ఇండియా కూటమి 300 మార్కు దాటుతుంది. చక్కటి, సుస్థిర ప్రజాపాలన సాగిస్తాం. నాకు ప్రధాని కావాలనే ఆలోచనే లేదు. మాది (ఆప్) చాలా చిన్న పార్టీ. కేవలం 22 చోట్ల పోటీ చేస్తున్నాం. ప్రధానిగా రాహుల్‌ను నేను అంగీకరిస్తానా అన్నది ఊహాజనిత ప్రశ్న. అలాంటి అంశాలు చర్చకే గెలిచాక అందరం కలిసి కూర్చొని దీనిపై చర్చిస్తాం. సానుకూల పవనాలు ఊహించిందే ఆప్ 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 67 సీట్లు, 2020లో 62 సీట్లు సాధించింది. ఈసారి ఆప్–ఇండియా కూటమికి సానుకూల పవనాలు వీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. నన్ను అరెస్టు చేయడంతో ఢిల్లీ ఓటర్లు భావోద్వేగానికి గురయ్యారు. ఆ ప్రజాగ్రహం బీజేపీ ఓటమికి కారణం కాబోతోంది. నాకు బెయిల్ దొరకడం నిజంగా దేవుడి మాయ. నన్ను జైలుకు పంపితే ఆప్ ముక్కలుచెక్కలవుతుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోయింది. మలివాల్ ఉదంతంలో బాధితులకు న్యాయం జరగాలి మలివాల్‌పై దాడి కేసు విచారణ నిష్పాక్షికంగా జరగాలి. రెండు వైపుల వాదనలను ఆలకించి పోలీసులు సరైన మార్గంలో దర్యాప్తు జరపాలి. నిజమైన బాధితులకు న్యాయం జరగా>లి. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేను. న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లుండవ్ఇండియా కూటమి అధికార పగ్గాలు చేపడితే న్యాయవ్యవస్థపై రాజకీయ ఒత్తిళ్లు లేకుండా చేస్తాం. ఆ వ్యవస్థ స్వతంత్రంగా పని చేస్తుంది. అప్పుడు నాపై మోపిన కేసులన్నీ బోగస్ అని తేలుతాయి. అందుకే జూన్ 4 ఫలితాల తర్వాత విపక్షాల కూటమి గెలిచాక కేసుల నుంచి విముక్తుడినవుతా. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి బీజేపీ, ఈడీ ఆరోపించినట్లు నగదు అక్రమ బదిలీ జరగలేదు. ఈ కేసులో వాళ్లింతవరకు ఒక్క పైసా కూడా కనుక్కోలేకపోయారు. అవినీతి జరిగి ఉంటే ఆ నగదు అంతా ఎటు పోయినట్లు?సునీతది ధర్మాగ్రహం 2000 దశకంలో ఢిల్లీ మురికివాడల పరిధిలో ఐటీ కమిషనర్‌గా పని చేశా. పదవీ విరమణ చేసి ప్రజా జీవితంలోకి వచ్చా. సొంతంగా పార్టీ పెడతానని, ఎన్నికల్లో పోటీ చేస్తానని, ఏకంగా సీఎం అవుతానని అస్సలు ఊహించలేదు. నా భార్య సునీతకు రాజకీయాలపై ఆసక్తి లేదు. భవిష్యత్తులోనూ క్రియాశీల రాజకీయాల్లోకి రాదు. నన్ను అక్రమంగా అరెస్టు చేసినందుకే తను ఇల్లు దాటి బయటికొచ్చి ధర్మాగ్రహం చూపింది. సునీత భార్య కావడం నా అదృష్టం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ నాకు తోడుగా నిలిచింది. నేను జైల్లో ఉండగా నాకు, ఢిల్లీ ప్రజలకు వారధిగా నిలిచింది. కస్టడీ ముగిసి నేను జైలుకెళ్తే సీఎంగా బాధ్యతల నిర్వహణకు తగిన వసతులు కలి్పంచాలని కోర్టును కోరతా. -
న్యాయవ్యవస్థపై ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
నాగ్‌పూర్: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత జితేంద్ర అవద్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఆయన శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. ఈసారి ఆయన దేశంలోని న్యాయవ్యవస్థపై తాజాగా చేసిన వ్యాఖ్యలు మళ్లీ దుమారం రేపుతున్నాయి. ‘నాకు చాలా బాధగా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయవ్యవస్థలోనూ రిజర్వేషన్లు పెట్టాల్సింది. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల 80 శాతం సమాజానికి అన్యాయం జరుగుతోంది. న్యాయ వ్యవస్థ చేసే కొన్ని నిర్ణయాల్లో కుల వివక్ష వాసన వస్తోంది. ఇది న్యాయవ్యవస్థ నుంచి ఆశించ లేదు’ అని నాగ్‌పూర్‌లో జరిగిన ఎన్సీపీ సమతాపరిషద్ మీటింగ్‌లో అవద్ మాట్లాడారు. బహుజనులు ఇప్పుడిప్పుడే బార్ కౌన్సిల్లలో కనిపిస్తున్నారని అవద్ అన్నారు. తరాలుగా వారికి విద్య అందకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇదీచదవండి.. అమ్మాయి మీద వెకిలి జోకు.. ఒకరి బలి -
న్యాయం వేగంగా జరిగేనా?
కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్ఎస్ఎస్ ఊహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు విస్తృత అధికారాలా? బీఎన్ఎస్ఎస్కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్ఎస్ఎస్లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్ఎస్ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు. అయితే బీఎన్ఎస్ఎస్లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్ఎస్ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి. ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్ఎస్లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది. ‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్‌లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్ఎస్–2 కూడా ఉంది. అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన. చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్ఎస్ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం. కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్‌తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్‌లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము. మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది. – అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు. -
ఇన్నేళ్ళకు న్యాయం!
మూడు దశాబ్దాల పైచిలుకు క్రితం కేసులో బాధితులకు ఎట్టకేలకు కాసింత ఊరట దక్కింది. పోలీసుల దమనకాండకు ప్రతిరూపమైన తమిళనాడు వాచాత్తి ఘటనలో సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ఆ రకంగా చిరకాలం గుర్తుండిపోతుంది. మారుమూల గ్రామంలోని గిరిజనులపై దాడి చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణమైన కేసు అది. అటవీ, పోలీసు అధికారులతో సహా మొత్తం 269 మంది దోషులంటూ కింది కోర్టు ఏనాడో తీర్పు ఇచ్చింది. దోషులు పైకోర్టును ఆశ్రయించి, జాగు చేశారు. తాజాగా మద్రాస్ హైకోర్ట్ ఆ అప్పీళ్ళను కొట్టివేసింది. కింది కోర్ట్ తీర్పును హైకోర్ట్ సమర్థించడమే కాక, 215 మందినీ దోషులుగా తీర్మానిస్తూ, ఒక్కొక్కరికీ 1 నుంచి 10 ఏళ్ళ పాటు జైలు శిక్ష ఖరారు చేసింది. బాధితులకు ఇన్నాళ్ళకైనా న్యాయం దక్కిందనే భావన కలుగుతోంది. ప్రజాస్వామ్యం పట్ల, న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మిగులుతోంది. నిజానికి, తమిళనాట ధర్మపురి జిల్లాలో తూర్పు కనుమల్లో నెలకొన్న గిరిజన గ్రామం వాచాత్తి గురించి ముప్ఫయ్యేళ్ళ క్రితం ఎవరూ విననైనా విని ఉండరు. కేవలం 655 మంది, అందులోనూ 643 మంది మలయాళీ షెడ్యూల్డ్ తెగల వారున్న 200 గడపల గ్రామం అది. కానీ, ఆ రోజు జరిగిన ఆ దారుణ ఘటనతో ఒక్కసారిగా ఆ గ్రామం వార్తల్లో నిలిచింది. గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్ అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ, పోలీసులు, అటవీ అధికారులు గ్రామంపై దాడి చేశారు. అక్కడ గిరిజనులపై సాగించిన అమానుషం, బడికెళ్ళే ఓ చిన్నారి సహా 18 మంది మహిళలపై సామూహిక అత్యాచారం, తాగునీటిలో విషం కలిపిన తీరు, పశువుల్ని ఊచకోత కోసి ఊరి బావిలో పడేసిన వైనం... ఆ గ్రామం రూపురేఖల్నే మార్చేశాయి. ‘గంధపు చెక్కల స్మగ్లింగ్ గ్రామం’ అని ముద్రవేస్తూ అమాయకులపై అధికారులు సాగించిన ఆ దమనకాండ ఓ మాయని మచ్చ. కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సీబీఐ) లోతుగా విచారించి అధికారుల తప్పు తేల్చినా, ఏళ్ళ తరబడి వాయిదా పడుతూ వచ్చిన న్యాయం ఇన్నాళ్ళకు దక్కింది. బాధితులకు కాస్తయినా ఊరట దక్కింది. 1992 జూన్ 20 నుంచి మూడు రోజులు సాగిన అమానుష ఘటనలో మొత్తం 269 మంది నిందితులు కాగా, వారిలో 54 మంది న్యాయ విచారణ కాలంలోనే కన్నుమూశారు. మిగిలినవారికి ఇప్పుడు శిక్ష పడింది. ఈ కథ ఇక్కడి దాకా రావడం వెనుక న్యాయం కోసం సుదీర్ఘంగా సాగిన పోరాటం ఉంది. అప్పట్లో అధికారులపై కేసులు నమోదు కాకపోగా, గిరిజనులపైనే స్థానిక పోలీసులు ఎదురు కేసులు పెట్టిన పరిస్థితి. గిరిజనులు తమ ఇళ్ళను తామే ధ్వంసం చేసుకున్నారని అధికారులు బుకాయించారు. హైకోర్ట్ ఆదేశిస్తే గానీ చివరకు సీబీఐ దర్యాప్తు జరగలేదు. అంతరాయాలతో విచారణ సుదీర్ఘంగా 19 ఏళ్ళు సాగి, చివరకు 2011లో ధర్మపురి సెషన్స్ కోర్ట్ అధికారులను దోషులుగా తేల్చి, శిక్ష వేసింది. దోషులు మద్రాస్ హైకోర్ట్‌ను ఆశ్రయించడంతో మరో 11 ఏళ్ళ సుదీర్ఘ కాలం గడిచిపోయింది. ఈ కేసు విచారణ సత్వరమే పూర్తి చేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి ఒకరు ఈ ఏడాది మొదట్లో పట్టుబట్టడంతో ఇప్పటికైనా కథ ఓ కొలిక్కి వచ్చింది. చిత్రం ఏమిటంటే – వాచాత్తి దమన కాండపై అప్పట్లోనే ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైతే, ప్రభుత్వంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు అలాంటి నేరాలకు పాల్పడరంటూ జడ్జి దాన్ని కొట్టేయడం! జయలలిత సారథ్యంలోని అప్పటి అన్నాడీఎంకె పాలకులు, స్థానిక ఎమ్మెల్యే, మంత్రులు ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత అధికారంలో ఉన్న డీఎంకె, అన్నాడీఎంకె సర్కార్లూ తమ బ్యూరోక్రాట్లకు కాపు కాసేందుకే ప్రయత్నించాయి. కొందరు ఉద్యమకారులు, లాయర్లు, నిజాయతీపరులైన అధికారులు, జడ్జీల వల్ల చివరకు న్యాయం జరిగింది. అత్యాచార బాధితులు పట్టువిడవకుండా పోరాడడంతో ఇప్పటికైనా సత్యం గెలిచింది. కళ్ళకు గంతలు కట్టుకున్న న్యాయదేవత సాక్షిగా ధర్మం నిలిచింది. కేవలం 655 మంది ఆదివాసీలు బలమైన రాజ్యవ్యవస్థతో తలపడి, విజయం సాధించడం చరిత్రాత్మకం. ఆ రకంగా ఇది బలవంతులపై బలహీనుల గెలుపు. ఆదివాసీల హక్కుల గెలుపు. న్యాయవ్యవస్థ స్వతంత్రమనీ, పాలకుల తప్పులను సైతం సహించదనీ రుజువైంది. ఎస్సీ– ఎస్టీ చట్టం ఇప్పటికీ బలంగానే ఉందని తేలింది. అయితే, నేటికీ కొనసాగుతున్న అనేక దమనకాండ కేసుల్లో ఇంత సుదీర్ఘ పోరాటం, సత్యాన్ని వెలికితీసి దోషులకు శిక్షపడేలా బృహత్ యత్నం సాధ్యమేనా? న్యాయం దక్కడంలో ఆలస్యమైతే, న్యాయం చేయనట్టే! వాచాత్తి ఘటనలో అపరిమిత ఆలస్యమైంది. దోషుల్లో పలువురు బెయిల్‌పై బయట గడిపి, ఉద్యోగ ప్రయోజనాలన్నీ పొంది, హాయిగా రిటైరయ్యారు. ఇప్పటికైనా దోషులను శిక్షించడమే కాక, బాధితులకు తగిన న్యాయం చేయాలి. నష్టపరిహారాలిస్తే సరిపోదు. నలుగురిలో గౌరవంగా బతికేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. వలసవాద బ్రిటీషు పాలన లక్షణాలను పోలీసులు, అధికారులు ఇప్పటికైనా వదిలించుకొంటే మేలు. తమిళనాట గిరిజనులపై అమానుషాల నుంచి మిజోరమ్‌లో గ్రామాల దహనం, కశ్మీర్లో నిర సనకారులపై కాల్పుల దాకా దశాబ్దాలుగా చూస్తున్నవే. బ్రిటీషు దౌర్జన్యానికి మన భారతీయ పోలీ సులు వారసులుగా మారిన వైనానికి ఇవి ప్రతీకలు. పదే పదే సాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు సాక్ష్యాలు. అందుకే, ‘‘దాడుల పేరిట చట్టవ్యతిరేక చర్యలకు’’ పోలీసులు బరి తెగించడం దుస్సహమని కోర్ట్ అన్న మాట కీలకం. నిన్నటికి నిన్న కూడా వార్తల్లో కనిపిస్తున్న ఇళ్ళపై దుర్మార్గ దాడుల ధోరణిని వ్యవస్థ సత్వరమే వదిలించుకోవాలి. వాచాత్తి కేసు గుర్తుచేస్తున్న పాఠం అదే! -
నేర విచారణ ప్రక్రియ ఇలా...
ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే. పేదలు–ధనికులు, చిన్న–పెద్ద అనే తారతమ్యాలు ఉండవు. అందరూ చట్టాన్ని గౌరవిస్తూ పాటించాల్సిందే. చట్టాలు అమలు చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు, న్యాయవ్యవస్థలు పని చేస్తాయి. బాధ్యత గల పౌరులు ఎవరైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్య వాటాదారులు కాబట్టి, ప్రభుత్వ పరిపాలన ఎలా సాగుతోంది అనే అవగాహన కూడా వారికి ఉండాలి. ఆ అవగాహన వారికి ఉంటేనే ప్రజాప్రతినిధుల పనితీరును సరిగ్గా అవగతం చేసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడతారు. ఏదైనా కాగ్నిజబుల్ అఫెన్స్ (గుర్తించతగిన నేరం) జరిగితే పోలీసు వారికి ప్రజల నుంచి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. మూడు సంవ త్సరాలు అంతకు ఎక్కువ శిక్షపడే నేరాలను కాగ్నిజబుల్ అఫెన్స్‌లు అంటారు. ఇలాంటి కేసుల్లో పోలీసులు మేజిస్ట్రేట్ వారెంట్ లేకుండా ఇతర నిబంధనలకు లోబడి నిందితులను అరెస్టు చేయవచ్చు. కాగ్నిజబుల్ అఫెన్సులపై ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు దాని ఆధారంగా ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేసి సంబంధించిన మేజిస్ట్రేట్‌కు పంపిస్తారు. అది మొట్టమొదటి నివేదిక కాబట్టే దాన్ని ప్రాథమిక సమాచార నివేదిక అంటారు. మూడేళ్ళ కంటే తక్కువ శిక్షలు పడే నేరాలను నాన్–కాగ్నిజబుల్ అఫెన్సులు అంటారు. వీటిని కోర్టు ఉత్తర్వుల ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తారు. ప్రైవేట్ కంప్లైట్ ఆధారంగా కోర్టు ఇచ్చే ఉత్తర్వుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసి ముందుకు వెళ్ళవచ్చు. ఎఫ్ఐఆర్ అనేది కాగ్నిజబుల్ అఫెన్సు జరిగింది అనే విషయాన్ని తెలియజేసే పత్రం మాత్రమే. ఒక నేరం జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో సహజంగా నిందితుల పేర్లను పొందుపరచడం జరుగుతుంది. అయితే ఎఫ్ఐఆర్ ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. పోలీసుల దర్యాప్తులోనే అందులోని నిజానిజాలు, నిందితుల పాత్రలు నిర్ధారించడం జరుగుతుంది. ఫిర్యాదులో నిందితుల పేర్లు లేవు కదా అని దాన్ని స్వీకరించకపోడా నికీ, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉండటానికీ ఆస్కారం లేదు. ఉదాహరణకు దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్య కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో నిందితుల పేర్లు లేవు. పోలీసుల దర్యాప్తు లోనే ఆ పేర్లు, వారి పాత్రలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, ప్రజల సొమ్ము కొల్లగొట్టడం వంటి ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్లో నిందితుల అందరి పేర్లు ఎఫ్ఐ ఆర్‌లో చేర్చడం మామూలుగా జరగదు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అనేక పత్రాలను పరిశీలించడం, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడం జరుగుతుంది. ఆ తర్వాతే బాధ్యులైన నిందితుల పేర్లు వెలుగులోకి వస్తాయి. అరెస్టు అయిన వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయి. అరెస్టు చేసే సమయంలో పోలీసులు నిందితుడికి అందుకు కారణాలు చెప్పాలి. బెయిలబుల్ అఫెన్సు అయితే ఆ విషయం తెలియపరుస్తూ బెయిల్ బాండ్స్ ఇస్తే విడుదల చేస్తామనీ నిందితుడికి వివరించాలి. నింది తుడికి సంబంధించిన వ్యక్తికి అరెస్టు కార్డ్ ఇవ్వాలి. ఎలాంటి సాక్ష్యా ధారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లైతే 24 గంటల్లో న్యాయమూర్తి ఎదుట హాజరు పరచాలని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్‌లోని (సీఆర్పీసీ) సెక్షన్ 167 చెప్తుంది. అయితే ఆ అరెస్టు వేరే ప్రాంతంలో జరిగితే ప్రయాణ సమయాన్ని అదనంగా పరిగణించాలనే నిబంధనా ఉంది. నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని మేజిస్ట్రేట్ సంతృప్తి చెందితేనే 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిస్తారు. కేవలం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న వారినే పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ కూడా అరెస్టు చేసిన నాటి నుంచి 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నేరంలో నిందితుడి పాత్రపై కీలక విషయాలను రాబట్టడా నికి పోలీసు కస్టడీ దోహదం చేస్తుంది. జ్యుడీషియల్ రిమాండ్ కోరినప్పుడు నేరంలో నిందితుడి పాత్రపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయో లేదో నిర్ధారించే, కోర్టు తగిన ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆధారాలు లేకుంటే జ్యుడీషియల్ రిమాండ్‌ను మేజిస్ట్రేట్ తిరస్కరించవచ్చు. ఇలా తిరస్కరించినప్పుడు నిందితునికి బెయిల్ ఇచ్చి పంపించివేస్తారు. జ్యుడీషియల్ రిమాండ్ దశలో నిందితుడిని నేరం చేశారా, లేదా? అనే అంశాన్ని న్యాయమూర్తి అడగరు. కేవలం పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా, కొట్టారా? వంటివి మాత్రమే అడుగుతారు. పోలీసులు తనను కొట్టారని నిందితుడు వెల్లడిస్తే వెంటనే ఆస్పత్రికి పంపడానికీ, ఊండ్స్ సర్టిఫికెట్ తీసుకోవ డానికీ తగిన చర్యలు తీసుకుంటారు. పోలీసు కస్టడీలో నిందితుడిని కొట్టారని రుజువైతే సంబంధిత పోలీసులపై అదే కోర్టులో కేసు పెట్టడానికి ఆస్కారం ఉంది. పోలీసులు తమ దర్యాప్తులో భాగంగా సాక్షులను విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేస్తారు. సీఆర్పీసీలోని సెక్షన్ 161 కింద నమోదు చేసే ఈ వాంగ్మూలాల్లో సాక్షుల సంతకాలు తీసుకోకూడదు. ఈ వాంగ్మూలాలను సాక్ష్యాలుగానూ పరిగణించకూడదు. కేవలం వాటిని దర్యాప్తు నిమిత్తం, కోర్టులో సాక్షుల వాంగ్మూలాల కచ్చిత త్వాన్ని నిర్ధారణ చేయడానికి ఉపయోగించవచ్చు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింది సాక్షుల వాంగ్మూలాలను న్యాయమూర్తి నమోదు చేయ వచ్చు. ఆ వాంగ్మూలాల కింద సాక్షుల సంతకాలు తీసుకుంటారు. అందువల్ల ఈ వాంగ్మూలానికి విరుద్ధంగా సాక్షి కోర్టులో సాక్ష్యం చెబితే అందుకు అతడు బాధ్యుడు అవుతాడు. కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత అన్ని ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడు పోలీసులు కోర్టులో నిందితుల విచారణ నిమిత్తం అభియోగపత్రాలు దాఖలు చేస్తారు. కేసులో ప్రాథమిక ఆధారాలు ఉంటేనే కోర్టు సీఆర్పీసీలోని సెక్షన్ 190 కింద నేరాన్ని కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంటుంది. అభియోగం చేసిన నేరారోపణలపై ప్రాథమిక సాక్ష్యాలు లేకపోతే కోర్టు పరిగణనలోకి తీసుకోదు. ఈ దశలో సదరు కేసు విచారణ అదే మేజిస్ట్రేట్ పరిధిలో ఉంటే దానికి సీసీ నంబర్ ఇస్తారు. అందులోని సెక్షన్ల ప్రకారం కేసు సెషన్స్ న్యాయమూర్తి ట్రయల్ నిర్వహించాల్సి ఉంటే పీఆర్సీ నంబర్ ఇచ్చి ఫైల్‌ను సంబంధిత కోర్టుకు పంపిస్తారు. చార్జ్‌షీట్‌ను కోర్టు పరిగణన లోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయడం ద్వారా ఓ తేదీ ఖరారు చేసి నిందితులను న్యాయస్థానానికి పిలుస్తారు. నిందితుడు హాజరైన తర్వాత చార్జ్‌షీట్‌తో పాటు ప్రాసిక్యూషన్ వాళ్ళు కోర్టుకు సమర్పించిన ప్రతి డాక్యుమెంట్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ తర్వాత హియరింగ్ డేట్ ఇచ్చి, ఆపై ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ ప్రక్రియ చేపడతారు. ఈ సంద ర్భంలో చార్జ్‌షీట్‌లోని ఆరోపణలను నిందితుల ముందు చదువు తారు. ఈ దశలో ఏ నిందితుడైనా తనపై ప్రాసిక్యూషన్ ఆరోపించిన సెక్షన్లు చెల్లవని భావిస్తే డిస్చార్జ్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ పిటిషన్లు డిస్మిస్ అయిన తర్వాత మాత్రమే నిందితులపై చార్జెస్ ఫ్రేమింగ్ జరుగుతుంది. ఈ దశలో న్యాయమూర్తి నిందితులను ఉద్దేశించి నేరం అంగీకరిస్తావా? అని ప్రశ్నిస్తారు. అంగీకరిస్తే (ప్లీడెడ్ గిల్టీ) వెంటనే శిక్ష విధిస్తారు. అంగీకరించకపోతే (డినై) కేసు ట్రయల్ నిర్వహిస్తారు. కేసు ట్రయల్ దశలో న్యాయస్థానం సాక్షులకు సమన్లు జారీ చేస్తుంది. సాక్షుల విచారణ పూర్తయిన తర్వాత సీఆర్పీసీలోని సెక్షన్ 313 ప్రకారం నిందితులకు ఓ అవకాశం ఉంటుంది. ఏ నిందితుడిపై ఏ సాక్షి ఏం చెప్పాడనేది వారికి తెలియపరుస్తారు. దానిపై వాళ్లు ఏం చెప్పాలనుకున్నది తెలుసుకుని రికార్డు చేస్తారు. ఈ సందర్భంలోనే నిందితుల తరఫున ఎవరైనా సాక్షులు ఉన్నారా? అనేది న్యాయమూర్తి అడుగుతారు. అలాంటి వాళ్ళు ఉంటే లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ రూపొందించి, వారికి సమన్లు ఇచ్చి కోర్టుకు పిలుస్తారు. ఆపై వీరి వాంగ్మూలం నమోదు, ప్రాసిక్యూషన్ నిర్వహించే క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతాయి. ఇది పూర్తయిన తర్వాత నిర్ణీత సమయం ఇచ్చి, ఆపై వాదోపవాదాలు మొదలవుతాయి. నిందితుడికి తెలియకుండా న్యాయమూర్తి సాక్ష్యాలు రికార్డు చేయరు. ప్రతి సాక్ష్యమూ అతడి ప్రత్యక్షంలోనే చేస్తారు. సీఆర్పీసీ సెక్షన్ 317 ఆధారంగా దాఖలు చేసే పిటిషన్ ద్వారా నిందితుడు కోరితేనే అతడి న్యాయవాది సమక్షంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఏ దశలోనూ పౌరుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే చట్టంలో నిందితుడికి ఇన్ని సౌలభ్యాలు కల్పించారు. బాధ్యత గల పౌరులు ఎవ రైనా చట్టం తన పని తాను చేసుకుపోవడానికి సహకరించాలి. వాదోప వాదాలు విన్న తర్వాత కోర్టు వారు ఓ తేదీ ఇచ్చి తీర్పు వెలువరిస్తారు. – జస్టిస్ జి. కృష్ణ మోహన్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి -
హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లింక్ క్లిక్ చేస్తే... హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఛత్తీస్గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది. -
ఫలితం కోసం చూడకుండా అంకితభావంతో పనిచేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘ఫలితాల కోసం ఎదురుచూడకుండా అంకితభావంతో నీ పని నువ్వు చేసుకుపో.. అని భగవద్గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి..ఇది అర్బిట్రేషన్‌లో నిపుణులు ఎలాంటి కీలకపాత్ర పోషించాలో చెబుతుంది’అని హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఆధ్వర్యంలో ‘ఆర్బిట్రేషన్‌లో విలువను పెంపొందించడం–నిపుణుల సూచనలు’అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కర్మాణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’అనే భగవద్గీత శ్లోకాన్ని ఉటంకించారు.నిష్పక్షపాతానికి కట్టుబడి న్యాయమైన తీర్మానాలకు వేదికను ఏర్పాటు చేయడంతో నిపుణులకు ఈ సూత్రం ప్రతిధ్వనిస్తుందని చెప్పారు. ఐఏఎంసీ రిజిస్ట్రార్ ప్రారంభోపన్యాసం చేశారు. భారత్‌ను అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రంగా మార్చడంలో న్యాయవ్యవస్థ, ప్రభుత్వ పాత్ర కీలకమని అన్నారు. కార్యక్రమంలో జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి, జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ నంద, జస్టిస్ కాజ శరత్, జస్టిస్ పుల్లా కార్తీక్, సింగపూర్ ఇంటర్నేషనల్ కమర్షియల్ కోర్ట్ అంతర్జాతీయ మధ్యవర్తి, అంతర్జాతీయ న్యాయమూర్తి ప్రొఫెసర్ డగ్లస్ జోన్స్, లండన్, టొరంటో, సిడ్నీలోని లా ఛాంబర్స్‌తో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్ ప్రొఫెసర్ జానెట్ వాకర్, ఎఫ్టీఐ కన్సల్టింగ్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ లీ బేకర్, అర్బిట్రేటర్ భాగస్వామి విన్సెంట్ రోవాన్, ఎఫ్టీఐ కన్సల్టింగ్‌లో సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ కార్తీక్ బలిసాగర్ పాల్గొన్నారు. -
కింది కోర్టుల లాయర్లనూ హైకోర్టు జడ్జిలుగా నియమించాలి
సాక్షి, అమరావతి : హైకోర్టు జడ్జిలుగా కేవలం హైకోర్టు న్యాయవాదులనే కాక కింది కోర్టుల లాయర్లను సైతం పరిగణనలోకి తీసుకోవాలని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కోరారు. కింది కోర్టుల్లో కూడా ఎంతో మంది ప్రతిభావంతులైన న్యాయవాదులు ఉన్నారని తెలిపారు. కింది కోర్టుల్లో ఉన్న సీనియర్ లాయర్లకు సీనియర్ న్యాయవాది హోదా కల్పించాలన్నారు. శనివారం గుంటూరులో జరిగిన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) రాష్ట్ర మహాసభల్లో జస్టిస్ దేవానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉన్నత న్యాయవ్యవస్థలో ‘సామాజిక భిన్నత్వం’ లోపించిందని అన్నారు. అణగారిన వర్గాలు, మహిళల సంఖ్య పెరగాలని చెప్పారు. 2018 నుంచి 2023 వరకు హైకోర్టుల్లో 601 మంది న్యాయమూర్తుల నియామకాలు జరగ్గా, అందులో జనరల్ కోటా 457 మంది, ఎస్సీలు 18 మంది, ఎస్టీలు 9 మంది, ఓబీసీలు 72 మంది, మహిళలు 91 మంది, మైనారిటీలు 32 మంది, ఇతరులు 13 మంది ఉన్నారన్నారు. న్యాయవ్యవస్థలో రిజర్వేషన్ విధానం లేకపోయినప్పటికీ, న్యాయమూర్తుల నియామకాల్లో అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని చెప్పారు. న్యాయమూర్తుల నియామకాల్లో నా ణ్యతపై లా కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు చేసిన సిఫార్సులను కొలీజియం పరిగణనలోకి తీసుకో వాలని కోరారు. దేశంలోని కోర్టుల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి భారం చాలా తీవ్రమైన అంశమని చెప్పారు. న్యాయం అందించడంలో జాప్యం జరిగితే న్యాయం అందని పరిస్థితికి దారి తీస్తుందన్నారు. జాప్యం ఇలాగే కొనసాగితే విసిగిపోయిన కక్షిదారులు రాజ్యాంగేతర, అసాంఘిక శక్తులను ఆశ్రయించి తక్కువ ఖర్చుతో వేగవంతమైన న్యాయం పొందేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇది అంతిమంగా శాంతిభద్రతల సమస్యగా మారి, సమాజంలో అశాంతి, అరాచకానికి దారి తీస్తుందన్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయమూర్తులు, న్యాయవాదులపై ఉందని తెలిపారు. న్యాయవాదుల రక్షణకు చట్టం తెచ్చేలా తీర్మానం చేయాలని ఐలూ కార్యవర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్‌ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు విఘాతం పార్లమెంట్ చేసే చట్టాలను సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు రాజ్యాంగం ఇచ్చిందని, దీంతో న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేందుకు కార్యనిర్వాహక వ్యవస్థ చాలా గట్టిగా ప్రయత్నిస్తోందని ఐలూ జాతీయ కార్యదర్శి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వి.సురేంద్రనాథ్ చెప్పారు. అందులో భాగంగానే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. న్యాయమూర్తుల ఎంపికలో ఆధిపత్యానికి ఆరాటపడుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటే ప్రజాస్వామ్యం మరో విధంగా మారుతుందని, దేశం లౌకిక, సార్వభౌమ దేశంగా కొనసాగే పరిస్థితి ఉండదని చెప్పారు. దీనిని అడ్డుకోవాల్సిన బాద్యత న్యాయవాదులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, ఏపీ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణల స్వీయహననం!
ప్రజలు, ప్రతిపక్షాల నుంచి నెలల తరబడి నిరసన వ్యక్తమవుతున్నా, తాము అనుకున్నదే చేసే పాలకులు ప్రపంచమంతటా ఉంటారు. మొత్తం 93 లక్షల జనాభాలో, రెండున్నర లక్షల మందికి పైగా జనవరి నుంచి వీధికెక్కి నిరసనకు దిగుతున్నా, ఇజ్రాయెల్‌లోని బెంజమిన్ నెతన్యాహూ సర్కార్ తాను అనుకున్నదే చేసింది. దేశ చరిత్రలోనే కనివిని ఎరుగని అత్యంత భారీ నిరసనల్ని సైతం తోసి పుచ్చి, ఇజ్రాయెలీ పార్లమెంట్ వివాదాస్పద న్యాయసంస్కరణల్లో మరో కీలక అంశానికి సోమవారం ఆమోదముద్ర వేసింది. దేశంలో అధికార సమతూకాన్ని మార్చేసే ఈ చర్య సంచలనమైంది. మంత్రులు తీసుకొనే నిర్ణయాలు ‘నిర్హేతుకం’ అనిపించినప్పుడు వాటిని కొట్టివేసేందుకు సుప్రీమ్ కోర్ట్‌కు ఇప్పటి దాకా అధికారముంది. సరికొత్త సోకాల్డ్ ‘సహేతుకత’ బిల్లుతో దానికి కత్తెర పడనుంది. రాబోయే రోజుల్లో మరో ఓటింగ్‌లో న్యాయ నియామకాలపైనా ప్రభుత్వానికే మరిన్ని అధికారాలు కట్టబెట్టాలన్నది తదుపరి ఆలోచన. ఈ మార్పుల్ని కొందరు సమర్థిస్తున్నప్పటికీ, అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. కలిగే విపరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, అధిక శాతం ఇజ్రాయెలీలు లౌకికవాద, వామపక్ష, ఉదారవాదులు. కానీ, తీవ్ర మితవాద పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుతో అక్కడి ప్రభుత్వ విధానమూ మితవాదం వైపు మొగ్గుతోంది. ఆ ప్రభుత్వాలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య తరచూ ఘర్షణ తలెత్తుతోంది. దీనికి విరుగుడుగా కోర్టు కోరలు పీకేయాలనేది ఛాందస, జాతీయవాద నెతన్యాహూ సర్కార్ ప్రయత్నం. పాలకులపై ఉన్న ఏకైక అంకుశమైన కోర్ట్‌ను సైతం అలా ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తే, వ్యవస్థల పరంగా ఉన్న సమతూకం దెబ్బతినడం ఖాయం. అందుకే, ఇన్ని నెలలుగా దేశంలో ఈ భారీ ప్రజాందోళనలు. కార్యనిర్వాహక, శాసననిర్మాణ, న్యాయవ్యవస్థలు మూడింటికీ మధ్య అధికార విభజనలో అనేక అంశాలను మార్చాలని నెతన్యాహూ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన సారథ్యంలోని సాంప్రదాయవాద, మతతత్త్వ సంకీర్ణ ప్రభుత్వం అందుకు కంకణం కట్టుకుంది. అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కొంటున్న ఆయన కోర్టు భవిష్యత్ తీర్పులు తనపై ప్రభావం చూపకుండా ఉండేందుకే ఈ పని చేస్తున్నారని విమర్శకుల మాట. నిజానికి, ఇజ్రాయెల్‌లో రాజ్యాంగమంటూ లేదు గనక, పై మూడు వ్యవస్థల మధ్య వ్యవహారమంతా వ్యక్తిగత చట్టాలు క్రమబద్ధీకరిస్తుంటాయి. పార్ల మెంట్లో రెండో సభ లేదు గనక అది చేసే చట్టాలకు అవసరమైతే ముకుతాడు వేసేలా సుప్రీమ్ కోర్ట్‌కే బలమైన స్థానం ఉందక్కడ! ఇలా న్యాయవ్యవస్థకు అతిగా అధికారాలున్నాయనేది ప్రభుత్వ మద్దతుదార్ల భావన. ఎంపీల్లా జడ్జీలనేమీ ప్రజలు నేరుగా ఎన్నుకోవడం లేదనీ, ఇప్పుడీ ప్రతిపాదిత సంస్కరణలతో అధికార సమతూకం మెరుగై, ప్రజాస్వామ్యం పటిష్ఠమవుతుందనీ వారి వాదన. సంస్కరణల్ని వ్యతిరేకిస్తున్నవారు మాత్రం దీన్ని ప్రజాస్వామ్య విధ్వంసం అంటున్నారు. లింగ సమానత్వం, లైంగిక అల్పసంఖ్యాకుల రక్షణ లాంటి అంశాలను గతంలో సుప్రీం పదేపదే సమర్థించిందనీ, రేపు ఈ కొత్త సంస్కరణలతో అందుకు అవకాశం లేక సమాజం చీలిపోతుందనీ వాదిస్తున్నారు. తాజా సంస్కరణలు దేశంలో అతి సాంప్రదాయ వర్గాన్ని బలోపేతం చేస్తాయన్నది లౌకికవాదుల భయం. ఈ అంశం సైన్యం దాకా పాకింది. ఇప్పటికే స్త్రీ పురుషులిద్దరూ సైన్యంలో తప్పనిసరిగా సేవలందించాలన్న నిబంధన నుంచి అతి సాంప్రదాయ యూదులను ప్రభుత్వం మినహాయించింది. సుప్రీం దీన్ని తప్పుబట్టి, ఇది దుర్విచక్షణ అని పదే పదే ప్రకటించింది. ఇప్పుడీ న్యాయ సంస్కరణల్ని అమలుచేస్తే, స్వచ్ఛంద సేవ నుంచి వైదొలగుతామంటూ వెయ్యిమందికి పైగా ఇజ్రాయెలీ ఎయిర్ ఫోర్స్ రిజర్విస్టులు హెచ్చరించారు. గూఢచర్య సంస్థలు సహా అనేక ఇతర విభాగాల్లోని వారూ తమదీ ఆ మాటే అంటున్నారు. అదే జరిగితే ఆ దేశ భద్రతకు ముప్పే! మరోపక్క, పార్లమెంట్ ఆమోదించిన సంస్కరణ క్లాజుపై కోర్టుకెక్కనున్నట్టు పౌరసమాజ బృందాలు ప్రకటించాయి. అంటే తమ అధికారాలకు కత్తెర వేయడం సహేతుకమో, కాదో జడ్జీలే పరీక్షించాల్సి వస్తుంది. న్యాయమూర్తులు గనక ఈ సంస్కరణను అడ్డుకుంటే, ఇజ్రాయెల్ ఊహించని జాతీయ సంక్షోభంలో పడవచ్చు. ఒకవేళ దాన్ని నివారించేందుకు ప్రభుత్వం తాజా సంస్కరణను ఉపసంహరించుకుంటే, అది చివరకు పాలక సంకీర్ణం కుప్పకూలడానికి దారి తీయవచ్చు. ఏదైనా చిక్కే! మధ్యప్రాచ్యంలో ఏకైక ఆధునిక ప్రజాస్వామ్యంగా ఇజ్రాయెల్‌కున్న పేరు ఈ మొత్తం వ్యవహారంలో దెబ్బతింటుంది. దేశ ఆర్థికవ్యవస్థ, విదేశాంగ విధానం పైనా దెబ్బ పడుతోంది. న్యాయసంస్కరణల సంక్షోభంతో ఫిబ్రవరి నాటికి 400 కోట్ల డాలర్లు ఇజ్రాయెల్ నుంచి తరలి పోయాయట. అలాగే, దేశ శ్రామికశక్తిలో 11 శాతం మంది దాకా హైటెక్ రంగ ప్రవీణులు. వారిలో అధికశాతం సంస్కరణల్ని వ్యతిరేకిస్తూ, వీధికెక్కినవారే! ఈ సాంకేతిక ప్రతిభాశాలురు దేశం విడిచి పోవచ్చు. అలా జరిగితే అది మరో దెబ్బ. ఇక, న్యాయ ప్రక్షాళనకు బలమైన మద్దతుదారులంతా ప్రధానంగా ఇజ్రాయెల్ దురాక్రమణను సమర్థిస్తున్నవారే! మరోమాటలో ఈ తీవ్ర మితవాదులంతా దేశాన్ని నిరంకుశ మతరాజ్య వ్యవస్థగా మార్చి, ఆక్రమణలతో దేశాన్ని విస్తరించాలని కోరుకుంటున్న వారే. దశాబ్దాల కష్టంతో నిర్మాణమైన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థల సుస్థిరతకూ, అభివృద్ధికీ, భద్ర తకూ దేనికీ ఇది శ్రేయోదాయకం కాదు. ప్రజాస్వామ్య విలువల పునాదిపై ఎదిగి, పొరుగు దేశాలకు తనను కాస్తంత భిన్నంగా నిలిపిన ఆ మౌలిక సూత్రాన్నే కాలరాస్తానంటే అది ఇజ్రాయెల్‌కు ఆత్మ హననమే. బిల్లుతో నెతన్యాహూ బలోపేతులయ్యారేమో కానీ, ఇజ్రాయెల్ బలహీనమైపోయింది. -
ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
పరిహాసమైన ప్రజాస్వామ్యం
కంచే చేను మేస్తే? ధర్మం, న్యాయం కాపాడాల్సిన పాలకులే... అధర్మానికి కాపు కాస్తే? మాఫియా డాన్ల అడుగులకు మడుగులొత్తితే? పోలీసు, న్యాయవ్యవస్థలు దోషులుగా నిర్ధారించిన వారిని సైతం శిక్షాకాలం పూర్తి కాక ముందే రకరకాల సాకులతో బాహ్యప్రపంచంలోకి వదిలేస్తుంటే ఏమనాలి? ఎవరికి చెప్పాలి? పార్టీలు, పాలకుల మీద ఏవగింపు గలిగే ఇలాంటి చర్యల వరుసలో తాజా ఉదాహరణ – హంతకుడు ఆనంద్ మోహన్ సింగ్‌ను పాలకులు నిస్సిగ్గుగా జైలు నుంచి బయటకొదిలేసిన సంఘటన. ఐఏఎస్ అధికారి జి. కృష్ణయ్యను దారుణంగా చంపి, జైలు ఊచలు లెక్క బెడుతున్న ఈ బడా నేరస్థుడు గురువారం బిహార్‌లోని సహరసా జైలు నుంచి విడుదలైన తీరు నివ్వెరపరుస్తోంది అందుకే. నిరుడు బీజేపీతో బంధం తెంచుకున్నాక ఓట్ల పునాదిని విస్తరించుకొనేందుకు తంటాలు పడుతున్న బిహార్ సీఎం నితీశ్ బలమైన తోమర్ రాజ్‌పుత్ వర్గానికి చెందిన ఆనంద్‌లో అద్భుతమైన అవకాశాన్ని చూశారని ఆరోపణ వినిపిస్తోంది. స్వార్థ ప్రయోజనాలే పరమా వధిగా దోషుల్ని వదిలేసే దిగజారుడు పనిలో పార్టీలన్నీ పోటీ పడుతుండడం ఆగ్రహం రేపుతోంది. ఐఏఎస్ అధికారి, గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ అయిన కృష్ణయ్యను 1994లో దారుణంగా హత్య చేశాడీ ఆనంద్ మోహన్. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కృష్ణయ్య 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. దళితుడు. విధినిర్వహణలోని ఆయనను ముజఫర్‌పూర్‌లో ప్రభుత్వ వాహనం నుంచి లాగి, హేయంగా కొట్టి చంపడానికి 1994 డిసెంబర్ 5న అల్లరిమూకను రెచ్చగొట్టింది ఆనంద్ మోహన్. 2007లో ట్రయల్ కోర్ట్ దోషికి మరణశిక్ష విధించింది. ఏడాది తర్వాత పాట్నా హైకోర్ట్ దాన్ని జీవితకాల శిక్షగా తగ్గించింది. ఈ తీర్పును ఆనంద్ సుప్రీమ్‌లో సవాలు చేసినా, ఇప్పటి దాకా కోర్ట్›ఉపశమనమేమీ ఇవ్వలేదు. అలా 2007 నుంచి జైలులో ఉన్న వ్యక్తిపై బిహార్ సర్కార్ ఎక్కడ లేని అక్కర చూపింది. ఈ నెలలోనే ‘బిహార్ ప్రిజన్ మ్యాన్యువల్ 2012’లో 481వ రూల్‌ను మార్చింది. ‘విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వాధికారి హత్యలో దోషి అయిన ఖైదీని విడుదల చేయరాద’న్న నిబంధనను నిర్లజ్జగా తొలగించింది. ఫలితంగా – జైలులో 14 ఏళ్ళు, 20 ఏళ్ళు గడిపిన మరో 27 మంది ఖైదీలతో పాటు ఈ నేరస్థుడికీ అన్యాయంగా స్వేచ్ఛ లభించింది. పౌర సమాజం నుంచి ప్రతిపక్షాల దాకా అందరూ తీవ్రంగా వ్యతిరేకించినా, నితీశ్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. బిహార్‌లో రాజకీయాలకూ, నేరస్థులకూ మధ్య అనాదిగా పొడిచిన పొత్తుకు ఇది ప్రతీక. రాజకీయ నేతగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ పలుకుబడి సామాన్యమేమీ కాదు. శివ్‌హర్ లోక్‌సభా స్థానంలో గతంలో ఎంపీగా గెలిచాడు. కృష్ణయ్య హత్యతో జైలులో ఉంటేనేం, అతని భార్య లవ్లీ ఆనంద్ ఒకసారి ఎంపీ అయ్యారు. 2010 అసెంబ్లీ, 2014 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల పక్షాన పోటీ చేశారు. వారి కుమారుడు చేతన్ ఆనంద్ ప్రస్తుతం ఎమ్మెల్యే. తల్లీకొడుకులిద్దరూ బిహార్ అధికార సంకీర్ణ కూటమిలో భాగమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) సభ్యులే. కుమారుడి వివాహ నిశ్చితార్థం కోసం ఆనంద్ ఇటీవల 15 రోజులు పెరోల్ మీద బయటే ఉన్నాడు. సదరు నిశ్చితార్థానికి సాక్షాత్తూ బిహార్ సీఎం సహా అధికార కూటమి నేతలందరూ హాజరయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. పెరోల్ ముగిసిన ఆనంద్ ఏప్రిల్ 26న జైలుకు చేరాడో లేదో, సర్కార్ సవరించిన నిబంధనల పుణ్యమా అని మర్నాడే బయటకొచ్చేశాడు. వివిధ రాష్ట్రాల్లోని పాలకుల అవసరానికి తగ్గట్టు నియమ నిబంధనలు మారిపోతున్నాయి. వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి. వెరసి, జైళ్ళలోని దోషుల శిక్షాకాలాన్ని తగ్గించి బయటకు వదిలేస్తున్న లజ్జాకరమైన ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గత ఆగస్ట్‌లో బయటపడ్డ బిల్కిస్ బానో కేసులోని 11 మంది దోషుల నుంచి తాజా ఆనంద్ మోహన్ దాకా అన్ని వ్యవహారాలూ అలాంటివే. బీజేపీ నుంచి జేడీ–యూ దాకా అన్ని పార్టీలూ ఈ తిలా పాపంలో తలా పిడికెడు పంచుకున్నవే. ఓటు రాజకీయాలు, సమర్థకుల సంరక్షణ – ఇలా ఈ విడుదల వెనుక పైకి కనిపించని కారణాలు అనేకం. గద్దె మీది పెద్దల పరోక్ష సాయంతో బయటపడ్డ వీరికి సమర్థకుల నుంచి లభి స్తున్న స్వాగత సత్కారాలు, నీరాజనాలు మరింత ఆందోళన రేపుతున్నాయి. ఆనంద్ విడుదలతో జరిగిన బైక్ ర్యాలీలు, మిఠాయి పంపిణీలూ అచ్చంగా అలాంటివే. రేపిస్టులనూ, హంతకులనూ గౌరవించి, ఆరాధించే సంస్కృతికి అన్ని పార్టీలూ, అనుయాయులూ దిగజారుతున్న తీరు జుగుప్సా కరం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించే ఈ ఘటనల్లో వ్యవస్థలు భాగమైపోతూ ఉండడం శోచనీయం. చేసిన నేరం తాలూకు తీవ్రత, దోషుల వ్యక్తిగత చరిత్రలను బట్టి ఏ కేసుకా కేసు ప్రత్యేకమైనదే. కానీ, అన్నిటినీ ఒకే గాటన కడుతూ, కావాల్సినవారిని కాపాడుకొనే రీతిలో నిర్ణీత కాలవ్యవధి దాటి జైలులో ఉన్నవారందరినీ వదిలేయవచ్చని తీర్మానించడం సబబేనా? అలాంటప్పుడు బాధితులకు సరైన న్యాయం ఏ రకంగా జరిగినట్టు? పశ్చాత్తాపం, పరిణత సత్ప్రవర్తన లాంటివి శిక్షాకాలపు తగ్గింపునకు గీటురాళ్ళు కావాలి. కేవలం జైలులో గడిపిన రోజులే లెక్కలోకి తీసుకుంటే, బాజాప్తాగా బయటకొచ్చిన దోషి రేపు మరో నేరానికి పాల్పడడని నమ్మకం ఏమిటి? బాధిత కుటుంబాల కళ్ళెదుటే నేరస్థులు నిష్పూచీగా తిరుగుతుంటే, చట్టం, న్యాయం పట్ల సామాన్యుడు విశ్వాసం కోల్పోతే ఆ పాపం ఎవరిది? తాత్కాలిక ప్రయోజనాల కోసం హడావిడి పడుతున్న పార్టీలు, ప్రభుత్వాలు ఇవన్నీ లోతైన ప్రభావం చూపే పరిణామాలని ఇకనైనా తెలివిడి తెచ్చుకోవాలి. ఈ దేశంలో చట్టాలన్నీ అధికార బలగానికి చుట్టాలేనన్న భావన బలపడితే ప్రజాస్వామ్యానికే చేటు. -
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?!
...మళ్లీ వ్యవస్థను నడిపేది జడ్జీలే అనరు కదా..?! -
న్యాయ వ్యవస్థకు బాబు క్షమాపణ చెప్పాలి
సాక్షి, అమరావతి: కోర్టులను కూడా మేనేజ్ చెయ్యొచ్చంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు న్యాయవ్యవస్థకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేత చుండూరు సుందర రామశర్మ డిమాండు చేశారు. టీడీపీ అధినేతకు శవ రాజకీయాలు చేయడం బాగా ఆలవాటని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయవ్యవస్థలో గౌరవప్రదమైన వ్యక్తి నిరంజన్‌రెడ్డి అని.. అలాంటి ఆయనపైనా చంద్రబాబు హేయంగా విమర్శలు చేశారన్నారు. కోర్టులను కూడా ప్రభావితం చేస్తారని చంద్రబాబు అంటున్నారంటే అది బాబుకు ఎంత అలవాటో తెలుస్తోందన్నారు. రామశర్మ ఇంకా ఏమన్నారంటే.. తీవ్ర నిరాశ, నిస్పృహలో బాబు మతితప్పి మాట్లాడుతున్నారు. గౌరవ పార్లమెంటు సభ్యులపైనా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏ వ్యవస్థపైనా చంద్రబాబుకు గౌరవంలేదు. ఎంపీలపై చేసిన విమర్శలను వెంటనే వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలి. ఎంపీలు బ్రోకర్లా? ఏమిటా మాటలు? నిజానికి.. ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని, పార్టీని లాక్కున్న చంద్రబాబునాయుడు ఆ రోజు ఏ విధంగా వ్యవహరించాడో అందరూ చూశారు. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు చూశాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా దిగజారి వ్యవహరించాడు. అసలు వ్యవస్థలను మేనేజ్ చేసి పబ్బం గడుపుకోవడమే ఆయనకు బాగా తెలుసు. పార్లమెంటు, అసెంబ్లీ దేవాలయాలు లాంటివి. వాటికి ఎన్నికయ్యే వారిని గౌరవించాలి. కానీ, రాజ్యసభకు ఎన్నికైన వారిని చంద్రబాబు బ్రోకర్లు అంటున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటివరకు చేసిన పనులు చూస్తే అసలు బ్రోకర్ ఎవరో తెలుస్తుంది. పాదయాత్ర ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు ఇక లోకేశ్‌ది పాదయాత్ర కాదు.. అది ఒక బూతుమాటల యాత్ర. తన తండ్రిపైనా, ఎల్లో మీడియాపైనా ఆక్రోశంగా ఉన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌పై పిచ్చి విమర్శలు చేస్తున్నారు. లోకేశ్ అడుగులు వేయలేకపోతున్నారు. త్వరగా ముగించాలన్న ఆలోచనలో ఉన్నారు. చంద్రబాబూ అందుకు ఎదురుచూస్తున్నారు. పార్టీ శ్రేణుల్లోనూ అదే అభిప్రాయం ఉంది. మరోవైపు.. ఎంపీల ఎంపికలో సామాజిక న్యాయం పాటించిన పార్టీ వైఎస్సార్సీపీనే. పరిమళ్ నత్వానీతో రాష్ట్రానికి మేలు జరుగుతుందని సీఎం జగన్ భావించి ఆయనను రాజ్యసభకు పంపించారు. కానీ, చంద్రబాబు మాదిరిగా డబ్బులు తీసుకోలేదు. అలాగే, మా పార్టీ నుంచి తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుంటే, వారిలో నలుగురు బీసీలు. మరి నువ్వెప్పుడైనా అలా బీసీలకు పదవులు ఇచ్చావా చంద్రబాబూ? వర్ల రామయ్యకు మొండిచెయ్యి చూపించావు. అదే నీకు, వైఎస్ జగన్‌కు ఉన్న తేడా? అన్ని కులాల వారు బాబు నైజం తెలుసుకున్నారు. -
'దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ.. ఆయన చెప్పిందే వేదం..'
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో అనధికారిక ఎమర్జెన్సీ నడుస్తోందని ధ్వజమెత్తారు. ఒక వ్యక్తి చెప్పిందే వేదమని, నియంతృత్వ పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. మోదీ పాలనలో దేశ న్యాయవ్యవస్థ నిర్వీర్యం అవుతోందని ఆరోపించారు. జ్యుడీషియరీని కూడా ప్రధాని కార్యాలయంలో ఓ భాగం చేశారని మండిపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలు, స్వార్థ రాజకీయాల కోసం సమాజాన్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంతృత్వ రాజకీయాల గురించి ప్రజలకు తెలియజేసేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని జైరాం రమేశ్ మీడియా సమావేశంలో తెలిపారు. 'దేశంలో అనధికారిక ఎమెర్జెన్సీ ఉంది. ఒక వ్యక్తే శాసిస్తున్నారు. పార్లమెంటుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సభలో చర్చలు జరగనివ్వడం లేదు. రెండున్నరేళ్లుగా సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చకు అవకాశం ఇవ్వకపోవడమే ఇందుకు ఉదాహరణ. రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నారు. రాజ్యాంగ సంస్థలను బలహీనం చేస్తున్నారు. న్యాయవ్యవస్థను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.' అని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: మోదీ బీబీసీ డాక్యుమెంటరీపై రగడ.. ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్రిక్తత -
కేంద్రం తీరు ఆందోళనకరం
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు జరిగాయి. కొలీజియం సిఫార్సుల ఆమోదంలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌ను కేంద్రం పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఆర్.ఎల్.ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కూడా కేంద్రం తిప్పి పంపుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా ఇది ఆందోళనకరమని పేర్కొంది. ‘‘ఇటీవల ఇలా పలు సిఫార్సులను రెండోసారీ తిప్పి పంపారు. పెండింగ్‌లో ఉన్న 22 పేర్లను కూడా వెనక్కు పంపారు. ఇంకా చాలా పేర్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సిఫార్సులపై కేంద్రానికి సొంత అభిప్రాయాలేవైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఎటూ తేల్చకుండా అట్టిపెట్టుకోజాలదు. తప్పుగానో, ఒప్పుగానో ఈ అంశాన్ని తేల్చాల్సిందే. కేంద్రం కావాలంటే కొలీజియం సిఫార్సులపై తన అభిప్రాయాలను మాకు పంపొచ్చు. వాటిని మేం పరిశీలిస్తాం. ఆ మీదట వాటిని పక్కన పెట్టడమో, తిరిగి సిఫార్సు చేయడమో చేస్తాం. కానీ ఒక పేరును కొలీజియం రెండోసారి కేంద్రానికి సిఫార్సు చేసిందంటే ప్రస్తుత నిబంధనల మేరకు సదరు నియామకాన్ని ఆపడానికి వీల్లేదు’’ అని గుర్తు చేసింది. కొలీజియం సిఫార్సులను సుదీర్ఘ కాలం పెండింగులో పెడుతుండటం వల్ల ప్రతిభావంతులైన పలువురు తమకు జడ్జి పదవే వద్దంటూ తప్పుకుంటున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను మూడు నాలుగు వారాల్లోపు కేంద్రం ఆమోదించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 20న పొందుపరిచిన టైం లైన్లో స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను కూడా కేంద్రం దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం చాలా తప్పుడు సంకేతాలు పంపుతోందంటూ ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘కొంతకాలం క్రితం 10 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ బదిలీల విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితం. అయినా మా సిఫార్సుల్లో రెండింటిని గత సెప్టెంబర్‌లో, మిగతా వాటిని నవంబర్ చివర్లో ఆమోదించింది! ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపుతోంది. న్యాయ వ్యవస్థ, కేంద్రం కాకుండా ఎవరో మూడో శక్తి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయం కలిగిస్తోంది’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. ‘‘ప్రతి వ్యవస్థలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక న్యాయమూర్తి బదిలీకి సిఫార్సు చేసేముందు కొలీజియం నిర్దిష్ట ప్రక్రియను తూచా తప్పకుండా అనుసరిస్తుంది. అవసరమైన వారినుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఆ తర్వాతే సిఫార్సు చేస్తుంది’’ అని చెప్పారు. కొన్నిసార్లు కేంద్రం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కొలీజియమే తాను సిఫార్సు చేసిన పలు పేర్లను వెనక్కు తీసుకుందని గుర్తు చేశారు. ముగ్గురిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, ఐదుగురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం చేసిన సిఫార్సుల విషయం ఏమైందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటిని కేంద్రం పరిశీలిస్తోందని, స్పందించేందుకు సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి బదులిచ్చారు. ‘‘దీనిపై నిర్ణయానికి సమయమెందుకు? వారిప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సీనియర్ న్యాయమూర్తులు’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘పలు హైకోర్టుల్లో సీజే పదవులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మేం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే గానీ వీటిపై మేం నిర్ణయం తీసుకోలేం’’ అంటూ విచారం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సుల పరిశీలనలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌కు కట్టుబడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఏజీ పేర్కొన్నారు. హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫార్సుల్లో 44 పేర్ల పరిశీలన రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలై, పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపేసి, విచారణ నిమిత్తం తమకే బదిలీ చేసుకుంది. ఈ పిటిషన్లపై స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఫిబ్రవరి 15లోగా ఉమ్మడి వివరణ ఇవ్వాలని సూచించింది. మార్చి 13న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. -
ఆ వ్యాఖ్యలకు స్పందించకపోతే.. బాధ్యత పరంగా విఫలమైనట్లే: ధన్ఖర్
న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థను దెబ్బతీయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. న్యాయ వ్యవస్థపై సోనియా ఇలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. దీంతో సభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రమోద్ తివాయ్, సహచర సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే లేవనెత్తారు. "లోక్‌సభ సభ్యురాలు సోనియా గాంధీ బయట మాట్లాడిన అంశాన్ని రాజ్యసభలో చర్చించకూడదు. ఒకవేళ వ్యాఖ్యానిస్తే దురదృష్టకరం ఇలా ఎప్పుడూ జరగలేదు. దయచేసి ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి లేదా వెనక్కి తీసుకోండి లేదంటే ఒక చెడ్డ ఉదాహరణగా నిలుస్తుందంటూ కాంగ్రెస్ నేతలు రాజ్యసభ చైర్మన్‌ని అభ్యర్థించారు తాను సోనియా వ్యాఖ్యలకు ప్రతిస్పందించకపోతే తాను చేసిన ప్రమాణాన్ని ఒమ్ము చేసి రాజ్యంగా బాధ్యతలో విఫలమైనట్లేనని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామంపై విశ్వాసలేమిని సూచిస్తున్నాయన్నారు. తాను సరైన విధంగా స్పందించనట్లయితే పాలక పక్ష పార్టీని కించపరిచేలా తప్పుడూ పరిణామాలకు దారితీస్తుందని అన్నారు. అంతేగాదు న్యాయవ్యవస్థను చట్టవిరుద్ధంగా మార్చడం అంటే ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడనట్లేనని నొక్కి చెప్పారు. ఈ పక్షపాత పోరును అంతర్లీనంగంగా పరిష్కరించుకోవాలని అన్నారు. (చదవండి: పార్లమెంట్లో ‘సరిహద్దు’ రగడ.. లోక్‌సభ ఐదుసార్లు వాయిదా) -
సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచి
వరంగల్ లీగల్: దేశ ఆర్థిక, సామాజిక అంశాల పరిష్కారానికి రాజ్యాంగమే దిక్సూచిగా నిలుస్తోందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన జ్యూడీషియరీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలలపై జరుగుతున్న లైంగిక హింస కేసుల్లో బాధితులకు ఆర్థిక, శారీరక ఉపశమన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాధితులను భవిష్యత్ పౌరులుగా సమాజంలో భాగస్వాములను చేసే దిశగా బాలల హక్కుల పరి రక్షణ కోసం పని చేసే అన్ని వర్గాలు దృష్టి సారించా లని పిలుపు నిచ్చారు. నోబెల్ శాంతి బహుమతి గ్ర హీత కైలాశ్ సత్యార్థి మాట్లాడుతూ చిన్నారులపై వేధింపులు, లైంగిక దాడులు, బంధువులు, పరిచ య స్తుల ద్వారానే అత్యధిక శాతం జరుగుతున్నా య న్నారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు విస్తరించడం ద్వా రా బాధితులకు సత్వర న్యాయం అందించగలు గుతామని చెప్పారు. వరంగల్ పోక్సో కోర్టు ఈ దిశ గా చేస్తున్న ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్ర మంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కు మార్, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు కె.రాధాదేవి, ఎం.కృష్ణ మూర్తి, వ రంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు గోపి, రాజీ వ్‌గాంధీ హన్మంతు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం విన య్‌భాస్కర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆనంద్‌మోహన్, శ్రీనివాస్‌గౌడ్, బార్ కౌన్సిల్ సభ్యులు జనార్దన్, జయాకర్, ఇతర న్యా యమూర్తులు, లాయర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.