న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు జరిగాయి. కొలీజియం సిఫార్సుల ఆమోదంలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌ను కేంద్రం పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఆర్.ఎల్.ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కూడా కేంద్రం తిప్పి పంపుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా ఇది ఆందోళనకరమని పేర్కొంది. ‘‘ఇటీవల ఇలా పలు సిఫార్సులను రెండోసారీ తిప్పి పంపారు. పెండింగ్‌లో ఉన్న 22 పేర్లను కూడా వెనక్కు పంపారు. ఇంకా చాలా పేర్లు పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఈ సిఫార్సులపై కేంద్రానికి సొంత అభిప్రాయాలేవైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఎటూ తేల్చకుండా అట్టిపెట్టుకోజాలదు. తప్పుగానో, ఒప్పుగానో ఈ అంశాన్ని తేల్చాల్సిందే. కేంద్రం కావాలంటే కొలీజియం సిఫార్సులపై తన అభిప్రాయాలను మాకు పంపొచ్చు. వాటిని మేం పరిశీలిస్తాం. ఆ మీదట వాటిని పక్కన పెట్టడమో, తిరిగి సిఫార్సు చేయడమో చేస్తాం. కానీ ఒక పేరును కొలీజియం రెండోసారి కేంద్రానికి సిఫార్సు చేసిందంటే ప్రస్తుత నిబంధనల మేరకు సదరు నియామకాన్ని ఆపడానికి వీల్లేదు’’ అని గుర్తు చేసింది. కొలీజియం సిఫార్సులను సుదీర్ఘ కాలం పెండింగులో పెడుతుండటం వల్ల ప్రతిభావంతులైన పలువురు తమకు జడ్జి పదవే వద్దంటూ తప్పుకుంటున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది.
కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను మూడు నాలుగు వారాల్లోపు కేంద్రం ఆమోదించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 20న పొందుపరిచిన టైం లైన్‌లో స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను కూడా కేంద్రం దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం చాలా తప్పుడు సంకేతాలు పంపుతోందంటూ ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘కొంతకాలం క్రితం 10 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ బదిలీల విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితం. అయినా మా సిఫార్సుల్లో రెండింటిని గత సెప్టెంబర్లో, మిగతా వాటిని నవంబర్ చివర్లో ఆమోదించింది!
ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపుతోంది. న్యాయ వ్యవస్థ, కేంద్రం కాకుండా ఎవరో మూడో శక్తి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయం కలిగిస్తోంది’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. ‘‘ప్రతి వ్యవస్థలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక న్యాయమూర్తి బదిలీకి సిఫార్సు చేసేముందు కొలీజియం నిర్దిష్ట ప్రక్రియను తూచా తప్పకుండా అనుసరిస్తుంది. అవసరమైన వారినుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఆ తర్వాతే సిఫార్సు చేస్తుంది’’ అని చెప్పారు. కొన్నిసార్లు కేంద్రం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కొలీజియమే తాను సిఫార్సు చేసిన పలు పేర్లను వెనక్కు తీసుకుందని గుర్తు చేశారు.
ముగ్గురిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, ఐదుగురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం చేసిన సిఫార్సుల విషయం ఏమైందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటిని కేంద్రం పరిశీలిస్తోందని, స్పందించేందుకు సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి బదులిచ్చారు. ‘‘దీనిపై నిర్ణయానికి సమయమెందుకు? వారిప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సీనియర్ న్యాయమూర్తులు’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘పలు హైకోర్టుల్లో సీజే పదవులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మేం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే గానీ వీటిపై మేం నిర్ణయం తీసుకోలేం’’ అంటూ విచారం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సుల పరిశీలనలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌కు కట్టుబడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఏజీ పేర్కొన్నారు. హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫార్సుల్లో 44 పేర్ల పరిశీలన రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.
పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు..
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలై, పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపేసి, విచారణ నిమిత్తం తమకే బదిలీ చేసుకుంది. ఈ పిటిషన్లపై స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఫిబ్రవరి 15లోగా ఉమ్మడి వివరణ ఇవ్వాలని సూచించింది. మార్చి 13న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment