Appointment of Judges
-
కొలీజియం సిఫార్సులను అమలు చేయాల్సిందే
న్యూఢిల్లీ: కొలీజియం అంటే సెర్చ్ కమిటీ కాదని సుప్రీంకోర్టు తేలి్చచెప్పింది. సుప్రీంకోర్టులో, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి అర్హుల పేర్లను సిఫార్సు చేసే కొలీజియంపై కీలక వ్యాఖ్యలు చేసింది. దానికి సెర్చ్ కమిటీ హోదా మాత్రమే ఉంటుందని వెల్లడించింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కేంద్రంతప్పనిసరిగా ఆమోదించాల్సిందేనని స్పష్టంచేసింది. కొలీజియం సిఫార్సుల్లో ఇంకా పెండింగ్‌లో ఉన్న పేర్ల జాబితాను విడుదల చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. వాటి ఆమోదానికి ఇబ్బంది ఏమిటో చెప్పాలని పేర్కొంది. కొలీజియం సిఫార్సులను నోటిఫై చేయడానికి కేంద్రానికి స్పష్టమైన గడువు నిర్దేశించాలంటూ హర్ష సింఘాల్ అనే లాయర్ పిల్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావును నియమించాలన్న కొలీజియం సిఫార్సును కేంద్రం పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. వీటిపై సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫా ర్సుల ఆమోదంపై కేంద్రానికి కాలావధి నిర్దేశించాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆలోగా స్పందించకపోతే వాటిని ఆమోదించినట్లుగానే భావించేలా నిబంధన తీసుకురావాలని చెప్పారు. «కొలీజియం రెండోసారి సిఫార్సుల్లో పెండింగ్‌లో ఉన్నవాటి వివరాలివ్వాలని అటార్నీ జనరల్‌ను దర్మాసనం ఆదేశించింది. -
‘పరిపూర్ణత్వానికి దగ్గరగా కొలీజియం’
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థ ప్రస్తుతం పరిపూర్ణత్వానికి(పర్ఫెక్ట్ మోడల్) దగ్గరగా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. న్యాయ వ్యవస్థలో నియామకాలు, సంస్కరణలపై సీజేఏఆర్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో జడ్జీల నియామకం కోసం పేర్లను ప్రతిపాదించడం వెనుక కఠినమైన ప్రక్రియ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థ ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కొలీజియంను కాపాడుకొనేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొలీజియంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వర్గాల మధ్య వివాదం రగులుతున్న నేపథ్యంలో జస్టిస్ యు.యు.లలిత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఆకాంక్షలను నెరవేర్చండి
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో జడ్జీల నియామకం, బదిలీల విషయంలో కొలీజియం ఆకాంక్షలను(సిఫార్సులను) చాలావరకు నెరవేర్చాలని(ఆమోదించాలని) కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. కొలీజియం సిఫార్సులను ఆమోదించకుండా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోందని ఆరోపిస్తూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు ధర్మాసనం వ్యాఖ్యానించింది. విచారణకు అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరు కాలేదు. కొలీజియం సిఫార్సులను చాలావరకు ఆమోదించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని అటార్నీ జనరల్‌కు తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేసింది. -
కేంద్రం తీరు ఆందోళనకరం
న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకంపై కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య కొనసాగుతున్న వివాదంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు జరిగాయి. కొలీజియం సిఫార్సుల ఆమోదంలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌ను కేంద్రం పాటించడం లేదంటూ దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తులు ఎస్.కె.కౌల్, ఆర్.ఎల్.ఓకా ధర్మాసనం విచారణ జరిపింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను కూడా కేంద్రం తిప్పి పంపుతోందని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించగా ఇది ఆందోళనకరమని పేర్కొంది. ‘‘ఇటీవల ఇలా పలు సిఫార్సులను రెండోసారీ తిప్పి పంపారు. పెండింగ్‌లో ఉన్న 22 పేర్లను కూడా వెనక్కు పంపారు. ఇంకా చాలా పేర్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సిఫార్సులపై కేంద్రానికి సొంత అభిప్రాయాలేవైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఎటూ తేల్చకుండా అట్టిపెట్టుకోజాలదు. తప్పుగానో, ఒప్పుగానో ఈ అంశాన్ని తేల్చాల్సిందే. కేంద్రం కావాలంటే కొలీజియం సిఫార్సులపై తన అభిప్రాయాలను మాకు పంపొచ్చు. వాటిని మేం పరిశీలిస్తాం. ఆ మీదట వాటిని పక్కన పెట్టడమో, తిరిగి సిఫార్సు చేయడమో చేస్తాం. కానీ ఒక పేరును కొలీజియం రెండోసారి కేంద్రానికి సిఫార్సు చేసిందంటే ప్రస్తుత నిబంధనల మేరకు సదరు నియామకాన్ని ఆపడానికి వీల్లేదు’’ అని గుర్తు చేసింది. కొలీజియం సిఫార్సులను సుదీర్ఘ కాలం పెండింగులో పెడుతుండటం వల్ల ప్రతిభావంతులైన పలువురు తమకు జడ్జి పదవే వద్దంటూ తప్పుకుంటున్నారంటూ ఆవేదన వెలిబుచ్చింది. కొలీజియం రెండోసారి సిఫార్సు చేసిన పేర్లను మూడు నాలుగు వారాల్లోపు కేంద్రం ఆమోదించాలని సుప్రీంకోర్టు 2021 ఏప్రిల్ 20న పొందుపరిచిన టైం లైన్లో స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ సిఫార్సులను కూడా కేంద్రం దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం చాలా తప్పుడు సంకేతాలు పంపుతోందంటూ ధర్మాసనం ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘కొంతకాలం క్రితం 10 మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. ఈ బదిలీల విషయంలో కేంద్రం పాత్ర చాలా పరిమితం. అయినా మా సిఫార్సుల్లో రెండింటిని గత సెప్టెంబర్‌లో, మిగతా వాటిని నవంబర్ చివర్లో ఆమోదించింది! ఇది చాలా తప్పుడు సంకేతాలు పంపుతోంది. న్యాయ వ్యవస్థ, కేంద్రం కాకుండా ఎవరో మూడో శక్తి జోక్యం చేసుకుంటోందన్న అభిప్రాయం కలిగిస్తోంది’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. ‘‘ప్రతి వ్యవస్థలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయి. ఒక న్యాయమూర్తి బదిలీకి సిఫార్సు చేసేముందు కొలీజియం నిర్దిష్ట ప్రక్రియను తూచా తప్పకుండా అనుసరిస్తుంది. అవసరమైన వారినుంచి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఆ తర్వాతే సిఫార్సు చేస్తుంది’’ అని చెప్పారు. కొన్నిసార్లు కేంద్రం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటూ కొలీజియమే తాను సిఫార్సు చేసిన పలు పేర్లను వెనక్కు తీసుకుందని గుర్తు చేశారు. ముగ్గురిని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా, ఐదుగురిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం చేసిన సిఫార్సుల విషయం ఏమైందని ధర్మాసనం ప్రశ్నించింది. వాటిని కేంద్రం పరిశీలిస్తోందని, స్పందించేందుకు సమయం కావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి బదులిచ్చారు. ‘‘దీనిపై నిర్ణయానికి సమయమెందుకు? వారిప్పటికే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు. సీనియర్ న్యాయమూర్తులు’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. ‘‘పలు హైకోర్టుల్లో సీజే పదవులు ఖాళీగా ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా మేం చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదిస్తే గానీ వీటిపై మేం నిర్ణయం తీసుకోలేం’’ అంటూ విచారం వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సుల పరిశీలనలో సుప్రీంకోర్టు విధించిన టైం లైన్‌కు కట్టుబడేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్టు ఏజీ పేర్కొన్నారు. హైకోర్టుల కొలీజియం చేసిన 104 సిఫార్సుల్లో 44 పేర్ల పరిశీలన రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందన్నారు. విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది. పిటిషన్లన్నీ సుప్రీంకోర్టుకు.. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో దాఖలై, పెండింగ్‌లో ఉన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు కలిపేసి, విచారణ నిమిత్తం తమకే బదిలీ చేసుకుంది. ఈ పిటిషన్లపై స్పందించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఫిబ్రవరి 15లోగా ఉమ్మడి వివరణ ఇవ్వాలని సూచించింది. మార్చి 13న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. -
జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే.. పెండింగ్ కేసులు ఆందోళనకరం ‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు. మార్పులు చేయకపోతే.. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్‌ను ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు. జడ్జిల అపాయింట్మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది. 20 పేర్లను పునఃపరిశీలించండి కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు. -
న్యాయమూర్తుల నియామకంలో ఏమిటీ జాప్యం?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం కోసం కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తుండడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీరు విసుగు తెప్పించేలా ఉందని ఆక్షేపించింది. జడ్జీల నియామకాల ప్రక్రియకు భంగం కలిగించవద్దని సూచించింది. జడ్జీలను నిర్దేశిత గడువులోగా నియమించాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్ 20న టైమ్‌లైన్ ప్రకటించింది. ఈ టైమ్‌లైన్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ కౌల్, జస్టిస్ ఓజాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుటికప్పుడు ప్రకటించడం లేదని అటార్నీ జనరల్ వెంకటరమణికి ధర్మాసనం తెలియజేసింది. వ్యవస్థ పనిచేసేది ఇలాగేనా అని ప్రశ్నించింది. తమ అసహనాన్ని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేసింది. త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన టైమ్‌లైన్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. కొలీజియం ఒకసారి ఒక పేరును సిఫార్సు చేసిందంటే, అక్కడితో ఆ ఆధ్యాయం ముగిసినట్లే. వాటిపై ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరిపే పరిస్థితి ఉండకూడదు’’ అని ఉద్ఘాటించింది. కొన్ని పేర్లు ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంటున్నాయని తెలిపింది. జడ్జీలుగా పదోన్నతి పొందాల్సిన వారు ప్రభుత్వం చేస్తున్న ఆలస్యం కారణంగా వెనక్కి తగ్గుతున్నారని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ కేసులో ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తున్నాం. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లండి’’ అని ఏజేకు సూచించింది. తాము చట్టపరంగా నిర్ణయం తీసుకొనే పరిస్థితి తేవొద్దని కేంద్రానికి సూచించింది. నియామకాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఉన్నత పదవుల్లో ఉంటూ అనుచిత వ్యాఖ్యలా? కేంద్ర న్యాయ మంత్రి కిరణ్ రిజిజుపై ధర్మాసనం ఆగ్రహం కొలీజియం వ్యవస్థ పట్ల కేంద్ర న్యాయ శాఖ కిరణ్ రిజిజు ఇటీవల చేసిన వ్యా్ఖ్యలపై మీడియాలో వచ్చిన వార్తలను సీనియర్ అడ్వొకేట్ వికాస్ సింగ్ సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిజిజు వ్యాఖ్యలపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు అలా మాట్లాడడం సమంజసం కాదని పేర్కొంది. నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం కార్యరూపం దాల్చకపోవడం పట్ల కేంద్రం బహుశా అసహనంగా ఉన్నట్లు కనిపిస్తోందని జస్టిస్ ఎస్కే కౌల్ అన్నారు. కానీ న్యాయమూర్తుల నియామకంలో చట్ట నిబంధనలను పాటించకపోవడానికి అది కారణం కారాదని స్పష్టం చేశారు. ఆ పేర్లపై అభ్యంతరాలున్నాయి: కేంద్రం హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ‘‘ఆ పేర్లపై చాలా గట్టి అభ్యంతరాలున్నాయి. కనుక మీ సిఫార్సులను పునఃపరిశీలించండి’’ అని సూచించింది!! కేంద్రం తిప్పి పంపిన ఈ 20 పేర్లలో 11 కొలీజియం రెండోసారి సిఫార్సు చేసినవి కావడం విశేషం! మిగతా తొమ్మిదేమో కొత్త పేర్లు. తాను స్వలింగ సంపర్కినని బాహాటంగా ప్రకటించిన అడ్వకేట్ సౌరభ్ కృపాల్ పేరు కూడా తిప్పి పంపిన జాబితాలో ఉంది. ఆయన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బి.ఎన్.కృపాల్ కుమారుడు. ఢిల్లీ హైకోర్టు కొలీజియం ఆయన పేరును 2017లో కొలీజియానికి సిఫార్సు చేసింది. దానిపై కొలీజియం మూడుసార్లు విభేదించింది. జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే సీజేఐగా ఉండగా కృపాల్ గురించి ప్రభుత్వం నుంచి మరింత సమాచారం కోరారు. అనంతరం 2021లో జస్టిస్ రమణ సీజేఐగా కృపాల్ పేరును ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సిఫార్సు చేశారు. -
కొలీజియం పరాయి వ్యవస్థ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు మరోసారి విమర్శలు గుప్పించారు. అది మన రాజ్యాంగానికి పరాయి వ్యవస్థ అన్నారు. 1991 కంటే ముందు న్యాయమూర్తులను ప్రభుత్వమే నియమించేదని గుర్తుచేశారు. కొలీజియం వ్యవస్థను తీర్పు ద్వారా సుప్రీంకోర్టే సృష్టించుకుందని శుక్రవారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ఆయనన్నారు. రాజ్యాంగం దేశంలో అందరికీ, ముఖ్యంగా ప్రభుత్వానికి మత గ్రంథం వంటిదే. కోర్టులు, కొందరు న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయానికి మొత్తం దేశం మద్దతున్నట్టు ఎలా భావిస్తాం? కొలీజియం వ్యవస్థను ఏ నియమం కింద నిర్వచిస్తారో చెప్పాలి. అయితే జడ్జీల నియామకానికి మరో ఉత్తమ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేదాకా కొలీజియంను ప్రభుత్వం గౌరవిస్తూనే ఉంటుంది’’ అన్నారు. ఆ ఉత్తమమైన వ్యవస్థ ఏమిటన్న దానిపై తాను చర్చించలేనన్నారు. -
న్యాయమూర్తుల నియామకంలో జాప్యమా?
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి చేసిన సిఫార్సులను కేంద్రం పెండింగ్‌లో పెట్టడం పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కొలీజియం సిఫార్సులపైనా నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. జడ్జీలుగా చేరకుండా నిరుత్సాహపర్చేలా వ్యవహరించవద్దని సూచించింది. పేర్లను చాలాకాలం పెండింగ్‌లో పెట్టడం ద్వారా వారి అంగీకారాన్ని బలవంతంగా వెనక్కి తీసుకొనేలా చేయడం సమంజసం కాదంది. ఉన్నత న్యాయ స్థానాల్లో ఖాళీలను నిర్దేశిత గడువులోగా భర్తీ చేయడానికి టైమ్‌ఫ్రేమ్ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై స్పందించాలని ఆదేశిస్తూ కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి నోటీసు జారీ చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన 11 పేర్లు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే నాలుగు వారాల్లోగా న్యాయమూర్తులుగా నియమించాలని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది. -
కొలీజియంలో విభేదాలు!
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త జడ్జీల నియామకప్రక్రియలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మధ్య సర్వామోదం సన్నగిల్లింది. నూతన జడ్జీల ఎంపికకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ చేపట్టిన ‘సర్కులేషన్’ పద్ధతిపై కొలీజియంలోని ఇద్దరు జడ్జీలు భిన్న స్వరం వినిపించడం తెలిసిందే. ఆ ఇద్దరి పేర్లను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించడం గమనార్హం. 11 మంది నూతన జడ్జీల నియామకం కోసం సెప్టెంబర్ 26న సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల కొలీజియం భేటీ జరిగింది. జస్టిస్ చంద్రచూడ్ హాజరుకాలేదు. 10 మంది జడ్జీల నియామక ప్రక్రియ కోసం నలుగురు జడ్జీలకు సీజేఐ లేఖలు రాశారు. తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ జస్టిస్ కిషన్ అక్టోబర్ ఒకటిన, జస్టిస్ జోసెఫ్ అక్టోబర్ ఏడున సీజేఐకు ప్రతిలేఖలు రాశారు. లేఖలు రాసే పద్ధతిపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. అభిప్రాయం తెలపాలని అక్టోబర్ రెండున మరోసారి కోరినా స్పందించలేదు. సాధారణంగా కొలీజియంలో వ్యక్తమయ్యే బేధాభిప్రాయాలు, అభ్యంతరాలు తెలిపిన జడ్జీల పేర్లను వెల్లడించరు. కానీ జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ నజీర్ పేర్లను బయటపెడుతూ కొలీజియం ప్రకటన విడుదలచేసింది. ఇక నవంబరు 9న కొత్త సీజేఐ వచ్చాకే కొలీజియం సమావేశం కానుంది. జస్టిస్ దీపాంకర్ గుప్తాను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలంటూ ఇప్పటికే కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం విదితమే. -
16 మందికి న్యాయమూర్తులుగా పదోన్నతి!
న్యూఢిల్లీ: దేశంలో నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి గాను సుప్రీంకోర్టు కొలీజియం 16 పేర్లను సూచించింది. బాంబే, గుజరాత్, ఒడిశా, పంజాబ్–హరియాణాల హైకోర్టుల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సమావేశమై 16 మంది పేర్లను సూచించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్ ఆఫీసర్లు కాగా, మరో 10 మంది అడ్వొకేట్లు ఉన్నారు. వీరికి పదోన్నతి కల్పించి, హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కొలీజియం పేర్కొంది. ఈ మేరకు గురువారం ఆ జాబితాను తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. నలుగురు జ్యుడీషియల్ అధికారులు ఎల్.పన్సారే, ఎస్.సి.మోరె, యూ.ఎస్.జోషి ఫాల్కే , బి.పి.దేశ్‌పాండేలను బాంబే హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదించింది. అడ్వొకేట్లు ఆదిత్యకుమార్ మహాపాత్రా, మృగాంక శేఖర్ సాహూ, జ్యుడీషియల్ ఆఫీసర్లు రాధాకృష్ణ పట్నాయక్, శశికాంత్ మిశ్రాలకు ఒడిశా హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసింది. గుజరాత్ హైకోర్టుకు అడ్వొకేట్లు మౌన మనీష్ భట్, సమీర్ జె.దేవ్, హేమంత్ ఎం.పృచ్ఛక్, సందీప్ ఎన్.భట్, అనిరుద్ధ ప్రద్యుమ్న, నీరల్ రష్మీకాంత్ మెహతా, నిషా మహేంద్రభాయ్ ఠాగూర్ పేర్లను సూచించింది. పంజాబ్–హరియాణా హైకోర్టుకు అడ్వొకేట్ సందీప్ మౌడ్గిల్ పేరును సూచించింది. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణతోపాటు జస్టిస్ యు.యు.లలిత్, ఎ.ఎం.ఖాన్వి ల్కర్లతో కూడిన కొలీజియం హైకోర్టుల్లో జడ్జీ పోస్టుల ఖాళీల భర్తీకి సత్వర చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 100 మంది పేర్లను సూచించారు. సుప్రీంకోర్టులో ఉన్న తొమ్మిది ఖాళీలను భర్తీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 25 హైకోర్టుల్లో 1,080 మంది న్యాయమూర్తులు ఉండాల్సి ఉండగా, ఈ ఏడాది మే నాటికి 420 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఖాళీలని్నంటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కొలీజియం కృషి చేస్తోంది. -
జడ్జీల నియామకం మాకొదిలేయండి: సుప్రీం
న్యూఢిల్లీ: జడ్జీల నియామకం అంశాన్ని తమకు విడిచిపెట్టాలని సుప్రీంకోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థకు సంబంధించి దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. సీజేఐ జస్టిస్ మిశ్రా అభిశంసన తీర్మానంపై సంతకాలు చేసిన న్యాయవాదులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం విచారించింది. ‘ఇది జడ్జీల నియామకానికి సంబంధించిన అంశం. దీనిని మాకు విడిచిపెట్టండి. ఆ విషయాన్ని మేం చూసుకోగలం. ఇలాంటి పిటిషన్లను మేం పరిగణనలోకి తీసుకోం’ అంటూ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. -
నా వల్ల జడ్జీల నియామకం ఆగిపోలేదు
దేవులపల్లి అమర్ ‘సూటిమాట’ పుస్తకావిష్కరణలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సాక్షి, అమరావతి: తన వల్ల హైకోర్టుల్లో జడ్జి పోస్టుల నియామకం జరగకుండా ఆగిపోయిందనడంలో వాస్తవం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ చెప్పారు. తాను కొలీజియం సమావేశాలకు వెళ్లకపోవడం వల్లే పలు హైకోర్టుల్లో జడ్జీల ఖాళీలు భర్తీ కాకుండా ఆగిపోయాయని కొద్దిరోజుల క్రితం ఒక వార్త ప్రచురితమైందని, అది సరికాదన్నారు. విజయవాడలోని ఒక హోటల్లో శనివారం ప్రముఖ జర్నలిస్టు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ సాక్షి దినపత్రికలో డేట్లైన్ హైదరాబాద్–2 పేరుతో రాసిన వ్యాసాల సంకలనం ‘సూటిమాట’ పుస్కకాన్ని జస్టిస్ చలమేశ్వర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల క్రితం కొలీజియం సమావేశాలకు వెళ్లకూడదని తాను నిర్ణయం తీసుకున్నప్పుడు అలజడి రేగిందని, ఆ సమయంలో అవుట్‌లుక్ పత్రికలో ఒక ప్రముఖ వ్యక్తి.. చలమేశ్వర్ కొలీజీయంకు వెళ్లకపోవడం వల్లే వివిధ హైకోర్టుల్లోని 450 జడ్జీల ఖాళీలు భర్తీ కాలేదని, ఇది దేశానికి మంచిది కాదని రాశారన్నారు. ఆధారం లేకుండా ఆరోపణలు.. ఒక జడ్జీని బదిలీ చేస్తే తన కొడుక్కి లాభం ఉంటుందని, అందుకనే తాను తిరుగుబాటు చేశానని ఒక పాత్రికేయుడు రాశాడని, ఇది ఎవరో చెప్పి రాయించి ఉంటారని అభిప్రాయపడ్డారు. కానీ అదే కొలీజియంలోని ఇద్దరు జడ్జీల సంతానం ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్నారని, కానీ తన కుమారుడు హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పారు. ఆ విషయాన్నీ రాసి ఉంటే బాగుండేదన్నారు. న్యాయవ్యవస్థలేని రాజ్యవ్యవస్థ ఊహించలేం.. అన్ని వ్యవస్థల్లో లోపాలున్నట్లే న్యాయ వ్యవస్థలోనూ లోపాలున్నా దానివల్ల ప్రజలకు ఎంతోకొంత ఉపయోగం ఉంటుందని తాను నమ్ముతానని, న్యాయ వ్యవస్థలేని రాజ్య వ్యవస్థను ఊహించుకోవడానికే భయం వేస్తుందని తెలిపారు. అమర్ తనకు 32 ఏళ్లుగా తనకు తెలుసని విషయాన్ని సూటిగానే కాకుండా నిష్కర్షగా, కర్కశంగా కూడా చెబుతాడని అందుకే వృత్తిరీత్యా అతన్ని గౌరవిస్తానని చలమేశ్వర్ తెలిపారు. తాను తెలుగు వార్తల కోసం సాక్షి, ఈనాడు దినపత్రికలు చదువుతానన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. పుస్తకాల ద్వారా చారిత్రక సంఘటనలు ఎలా తెలుస్తాయో వివరించారు. ప్రముఖ జర్నలిస్టు, విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారి మాట్లాడుతూ.. ప్రజల్లో వస్తున్న మార్పును గమనించి అందుకు అనుగుణంగా వార్తలు రాయాలన్నారు. పుస్తక రచయిత దేవులపల్లి అమర్ మాట్లాడుతూ.. రాజకీయ నేతల్లో అసహనం తీవ్రమవుతోందని, తాము తప్ప ఇంకెవరూ అధికారంలో ఉండకూడదనే దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. పాత్రికేయ వ్యవస్థ ఉండడం వారికిష్టం లేదన్నారు. ఎంతో చరిత్ర ఉన్న హైదరాబాద్ సచివాలయాన్ని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు శ్మశానంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ , ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు ప్రభాత్ దాస్, ఐజేయు ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, దేవులపల్లి పబ్లికేషన్స్ నిర్వహకుడు అజయ్ పాల్గొన్నారు. -
రాష్ట్రాల నిబంధనలకు ఢోకా ఉండదు
‘న్యాయాధికారుల’పై సుప్రీం న్యూఢిల్లీ: సబార్డినేట్ కోర్టుల్లో న్యాయాధికారుల నియామకం కోసం ప్రతిపాదిం చిన కేంద్రీకృత ఎంపిక యంత్రాంగం వల్ల సంబంధిత నియామకాల కోసం రాష్ట్రాలు అనుసరిస్తున్న నిబంధనలకు విఘాతం కలగదని సుప్రీం కోర్టు భరోసా ఇచ్చింది. దేశవ్యాప్తంగా సబార్డినేట్ కోర్టు ల్లో క్రమం తప్పకుండా నియామకాలు జరిపేందుకు ఈ ప్రతిపాదన ముందుకొచ్చిందని చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ సోమవారం పేర్కొంది. ‘ప్రస్తుతం ఒక అభ్యర్థి సంబంధిత రాష్ట్రం నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కేంద్రీకృత యంత్రాంగం వస్తే అభ్యర్థులు ఒకే నిబం« దనలున్న పలు రాష్ట్రాల పరీక్ష లకు దరఖాస్తు చేసుకోవచ్చు’ అని చెప్పిం ది. దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకో ర్టు, ఉత్తరాఖండ్, కేరళ, గుజరాత్ హైకో ర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయంది. -
సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకం
ఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కొత్త జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ మోహన్ శాంతన గౌండర్, జడ్జి ఎస్ అబ్దుల్ నజీర్‌ను జడ్జీలుగా నియమించారు. ఐదుగురు కొత్త జడ్జీల నియామకంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి చేరింది. వీరిలో నలుగురు పలు రాష్ట్రాల హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌లు కాగా, ఒకరు కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఐదుగురు జడ్జీలు త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో ముగ్గురు జడ్జీలు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. -
జడ్జీల నియామకం ప్రభుత్వ విధి
పార్లమెంటరీ కమిటీ స్పష్టీకరణ ► రాజ్యాంగ వక్రీకరణలను మార్చాలని ప్రభుత్వానికి సిఫారసు న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కార్యనిర్వాహక విధిలోకి వస్తుందని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. రాజ్యాంగ ఆదేశాలను సుప్రీంకోర్టు వివిధ తీర్పుల ద్వారా వక్రీకరించిందని.. ఫలితం గానే కొలీజియం వ్యవస్థ తెరపైకి వచ్చిందని పేర్కొంది. ఈ ‘వక్రీకరణల’ను రాజ్యాంగ ఆదేశాలకు అనుగుణంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. జడ్జీల నియామకాలపై ప్రభుత్వానికి, సుప్రీం కోర్టుకు మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యం లో పార్లమెంటరీ కమిటీ ఈ మేరకు పలు సిఫార్సులతో కూడిన నివేదికను గురువారం విడుదల చేసింది. న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే కొలీజి యాన్ని రద్దు చేయాలంటూ తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు కిందటేడాది రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణ చెల్లుబాటుకు సంబంధించిన కేసులను ఐదుగురు కాకుండా 11 మంది సుప్రీం జడ్జీలు విచారించాలని కమిటీ సూచించింది. రాజ్యాంగానికి భాష్యం చెప్పే కేసులను ఏడుగురు సుప్రీం న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనమే విచారించాలని కమిటీ సిఫారసు చేసింది. సీజేలకు కనీస పదవీకాలం ఉండాలి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తు (సీజే)లకు ‘కనీస పదవీకాలం’ఉండేలా చూడాలని కోరింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), హైకోర్టు చీఫ్ జస్టిస్‌ల పదవీకాలం అత్యంత తక్కువగా ఉంటోందని ఆక్షేపించింది. గత 20 ఏళ్లలో 17 మంది సీజేఐలు నియమితులైతే.. వారిలో కేవలం ముగ్గురికి మాత్రమే రెండేళ్ల పదవీకాలం ఉందంది. చాలామంది పదవీకాలం ఏడాది కంటే తక్కువగానే ఉంటోందని తెలిపింది. చాలామంది హైకోర్టు సీజేల పదవీకాలం కూడా రెండేళ్ల కంటే తక్కువగానే ఉంటోందని పేర్కొంది. సీజేలకు కనీస పదవీకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని న్యాయ మంత్రిత్వ శాఖను కోరింది. హైకోర్టుల్లో ఖాళీల భర్తీకి తీవ్ర జాప్యం జరగడంపై ప్రభుత్వంతో పాటు న్యాయవ్యవస్థనూ తప్పుబట్టింది. జడ్జీల నియామక ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా చూడాలంది. -
ప్రతిపాదనలే రాలేదు
జడ్జిల నియామకాలపై కేంద్రం న్యూఢిల్లీ: హైకోర్టుల్లో పెరుగుతూ పోతున్న జడ్జి ఖాళీల సంఖ్యపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) విమర్శలు చేయడంతో ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. జడ్జిల నియామకాలపై గణాంకాలను ఉటంకించి నిర్లక్ష్యం సుప్రీం కోర్టు కొలీజియందే అని చెప్పేందుకు ప్రయత్నించింది. సుప్రీంలో ప్రస్తుతం ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ, వాటిలో ఒకటి ఖాళీ అయి ఏడాది అయినా, నియామకానికి కొలీజియం నుంచి ఒక్క ప్రతిపాదన కూడా రాలేదని ఒక ప్రభుత్వాధికారి చెప్పారు. 24 హైకోర్టుల్లో కలిపి 430 జడ్జి స్థానాలు ఖాళీగా ఉండగా 279 పోస్టులకు ఒక్క ప్రతిపాదనా రాలేదన్నారు. 2015-16 మధ్య హైకోర్టుల్లో నియామకాల కోసం 370 ప్రతిపాదనలు రాగా వాటిని తనిఖీ చేసి 328 ప్రతిపాదనలను ప్రభుత్వం కొలీజియానికి పంపిందని, కొలీజియం 290 పేర్లను ప్రాసెస్ చేసి వాటిలో 99 పేర్లను తిరస్కరించిందని తెలిపారు. 1990ల నుంచి హైకోర్టుల్లో నియమించిన జడ్జిల సంఖ్య సగటున ఏడాదికి 80 కాగా, ఈ ఏడాది ఇప్పటికే తాము 120 మంది జడ్జిలను నియమించామని అధికారి పేర్కొన్నారు. -
జడ్జీల నియామకం మాటేదీ?
ప్రధాని ప్రసంగంపై సీజేఐ అసంతృప్తి * దేశ ప్రజల న్యాయం గురించి ఆలోచించాలని మోదీకి సూచన న్యూఢిల్లీ: పంద్రాగస్టు ప్రసంగంలో ప్రధాని మోదీ జడ్జీల నియామక అంశాన్ని ప్రస్తావించకపోవడంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్(సీజేఐ) టి.ఎస్. ఠాకూర్ పెదవి విరిచారు. ‘ప్రజాకర్షణగల ప్రధాని గంటన్నరపాటు చేసిన ప్రసంగాన్ని విన్నాను. జడ్జీల నియామకాన్నీ ప్రస్తావిస్తారని ఆశించా. ప్రధానికి ఒకే ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. మీరు పేదరికాన్ని నిర్మూలించండి. ఉపాధి కల్పించండి...పథకాలు ప్రవేశపెట్టండి. అదే సమయంలో దేశ ప్రజల న్యాయం గురించీ ఆలోచించండి’ అని ఢిల్లీలో ఓ కార్యక్రమంలో సీజేఐ అన్నారు. వృత్తిరీత్యా తాను అత్యున్నతస్థాయికి చే రుకున్నందు వల్ల...ఇక జీవితంలో ఆశించేది ఏమీ లేనందువల్ల నిర్మొహమాటంగా నిజం మాట్లాడుతున్నానన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చే శారు. కోర్టులపై ఎన్నో రెట్లు పనిభారం... కేసుల సంఖ్య పెరగడంతో కోర్టులపై పనిభారమూ ఎన్నో రెట్లు పెరిగిందని, దీంతో సత్వర న్యాయం అందించలేకపోతున్నామని సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ ఓ ఉర్దూ ద్విపదను ఉటంకించారు. ‘గుల్ ఫేంకే ఔరో పర్, సమర్ భీ...ఏ అబర్-ఏ కరమ్, ఏ బెహర్-ఎ-సఖా...కుచ్ తో ఇధర్ భీ’(నువ్వు ఇతరులకు పండ్లు, పూలు ఇచ్చావు...ఓ కృపా మేఘమా, స్నేహ కెరటమా...మాపైనా ఏదో ఒకటి వర్షించు) అని పేర్కొన్నారు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లు, జడ్జీల బదిలీలు, నియామకాల్లో కొలీజియం నిర్ణయాన్ని కేంద్రం అమలు చేయకపోవడాన్ని సీజేఐ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తప్పుబట్టిన నేపథ్యంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సీజేఐ సూచనను మోదీ పట్టించుకోవాలని కాంగ్రెస్ సూచించింది. -
ఇది పద్ధతి కాదు!
న్యూఢిల్లీ: వివిధ హైకోర్టులకు జడ్జీల నియామకం, బదిలీలపై కొలీజియం తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు మండిపడింది. దీనివల్ల న్యాయవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని, ఇప్పటికైనా స్పందించకపోతే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. న్యాయసేవలకు ఆటంకం కలిగేలా జడ్జీల నియామకంలో ప్రతిష్టంభన సహించేది లేదని చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్ ఠాకూర్... కొలీజియంకు కూడా నేతృత్వం వహిస్తున్నారు. 8 నెలల కిందటి నిర్ణయం... దేశంలోని 24 హైకోర్టుల్లో 478 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉందని, వాటిల్లో 39లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని రాజ్యసభకు ప్రభుత్వం తెలపడంపై బెంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. 8 నెలల కిందట తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ ఆచరణలో పెట్టకపోవడాన్ని తప్పుపట్టింది. జడ్జీల నియామకానికి సంబంధించిన మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ (ఎంఓపీ)లో న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్యనున్న భిన్నాభిప్రాయాలను సాకుగా చూపి ఖాళీల భర్తీ ప్రక్రియను పక్కన పెట్టడం సరైంది కాదని పేర్కొంది. ‘ఎందుకీ జాప్యం? ఎందుకంత అపనమ్మకం? కొలీజియం 75 మంది పేర్లను ప్రతిపాదించింది. కానీ కేంద్రం నేటికీ స్పందించలేదు. హైకోర్టుల చీఫ్ జస్టిస్‌ల నియామకమూ పెండింగ్‌లోనే ఉంది. బదిలీలు లేవు. బదిలీ అయినవారూ కదల్లేదు. ఒకవేళ జాబితాలో ఏవైనా అభ్యంతరాలుంటే వారి పేర్లను కొలీజియానికి పంపండి, పునఃపరిశీలిస్తాం. జాప్యాన్ని సహించం’ అని తేల్చి చెప్పింది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భాన్ని ప్రస్తావించిన జస్టిస్ ఠాకూర్... ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం 40% సిబ్బందితోనే పనిచేస్తోందన్నారు. విచారణలో తీవ్ర జాప్యం వల్ల 13-14 ఏళ్ల నుంచి బాధితులు జైళ్లలో మగ్గుతున్నారన్నారు. ఈ అంశంపై 4 వారాల్లోగా దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏజీని ఆదేశించింది. కోర్టుల్లో అనేక కేసులు విచారణకు నోచుకోవడం లేదని, దీనిపై జోక్యం చేసుకోవాలంటూ మాజీ సైన్యాధికారి కల్నల్ అనిల్ కబోత్రా వేసిన పిల్‌ను కోర్టు విచారించింది. -
ముసాయిదా సాధ్యంకాదు
జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి నియమ, నిబంధనలతో ఒక ముసాయిదా(మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్-ఎంవోపీ)ను రూపొందించడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఎంవోపీని సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో అటార్నీ జనరల్ రోహత్గీ గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి ఈ విషయం తెలియజేశారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ముసాయిదా నియమావళిని రూపొందించడం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని, ఇది ప్రభుత్వంపై అనవసర భారం మోపుతుందని పేర్కొన్నారు. ఎంవోపీకి సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి విధానం లేదని, అందువల్ల దీనిని రూపొందించడం సాధ్యం కాదని వివరించారు. ముసాయిదాను రూపొందించడం కాకుండా... కొలీజియం వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన ధర్మాసనాన్ని కోరారు. కొలీజియం వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకుగానూ వివిధ వర్గాల నుంచి న్యాయస్థానం సూచనలు, ప్రతిపాదనలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పాటు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి పలు సూచనలు అందాయి. వీటిని పరిశీలించిన అనంతరం న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ఎంవోపీని రూపొందించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను మెరుగు పరచడానికి మూడంచెల ప్రక్రియను ప్రతిపాదించింది. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నేరుగా నియమించాలని, కొలీజియం సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులు తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వమైనా తీసుకున్నారా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని పేర్కొంది. -
వారిని వారే ఎలా నియమించుకుంటారు?
జడ్జీల నియామకాలపై రాజ్యసభలో ఎంపీల ప్రశ్న ఎన్‌జేఏసీపై శాసన న్యాయవ్యవస్థల మధ్య ముదురుతున్న వివాదం న్యూఢిల్లీ: జాతీయ న్యాయ నియామకాల కమిషన్ చట్టం(ఎన్‌జేఏసీ)పై న్యాయ వ్యవస్థ అనుసరిస్తున్న తీరును రాజ్యసభలో ఎంపీలు తీవ్రంగా తప్పుపట్టారు. న్యాయమూర్తులు వాళ్లను వారే ఎలా నియమించుకుంటారని ప్రశ్నించారు. శాసన న్యాయ మంత్రిత్వశాఖల పనితీరుపై రాజ్యసభలో జరిగిన చర్చలో సభ్యులు మాట్లాడుతూ శాసన వ్యవస్థ పనితీరులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటోందని ఆరోపించారు. న్యాయమూర్తులే న్యాయమూర్తులను నియమించుకునే అధికారాన్ని ఇస్తే.. తమ అన్నాచెల్లెళ్లను, సంతానాన్ని.. మనవలను కూడా వారసత్వంగా నియమించుకుంటూ పోతారని సభ్యులు అభిప్రాయపడ్డారు. శాసన కార్యనిర్వాహక వ్యవస్థల్లో ఇలా నియమించుకునే అధికారాలు కానీ, హక్కులు కానీ లేవని.. న్యాయవ్యవస్థకు మాత్రం మినహాయింపు ఎందుకని ప్రశ్నించారు. ఎన్‌జేఏసీని అమలు చేసే విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయరాదని రాజ్యాంగంలో పార్లమెంటే అన్ని వ్యవస్థల్లోనూ సుప్రీం అని కాంగ్రెస్ సభ్యుడు సుదర్శన నాచియప్పన్ అన్నారు. గత 15 సంవత్సరాలలో న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థను వివిధ అంశాలలో నియంత్రించే ప్రయత్నం చేస్తూ వస్తోందని సమాజ్‌వాదీ పార్టీ అభిప్రాయపడింది. ఆరుగురు సభ్యుల ఎన్‌జేఏసీ పానెల్ సభ్యుల నియామకాన్ని ఖరారు చేసే త్రిసభ్య కమిటీ సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాననటంపై కూడా రాజ్యసభలో విమర్శలు వచ్చాయి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు తీసుకురావలసిన అవసరాన్ని సీపీఎం ప్రస్తావించింది. ఎన్డీఏ రాజకీయం చేస్తోంది: రాం జెఠ్మలానీ ఎన్‌జేఏసీ చట్టాన్ని ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ తీవ్రంగా విమర్శించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై ఎన్డీఏ ప్రభుత్వం రాజీపడుతోందని, న్యాయ నియామకాలను రాజకీయం చేయాలని చూస్తోందని ఆయన సుప్రీం కోర్టులో వాదించారు. ఎన్‌జేఏసీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రాతినిథ్యం న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ జోక్యానికి నిదర్శనమన్నారు. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్నే ఈ చట్టం దెబ్బతీస్తోందని ఆరోపించారు. -
‘ప్రయోజనాల ఘర్షణ’ కొట్టివేత
న్యూఢిల్లీ: జడ్జీల నియామకంపై కొలీజియం స్థానంలో తేవడానికి ఉద్దేశించిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చట్టం చెల్లుబాటును పరిశీలించేందుకు ఏర్పాటైన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి.. ఈ కేసు విచారణ ప్రారంభించటంలో ఎదురవుతున్న ప్రయోజనాల సంఘర్షణ, పక్షపాతం సిద్ధాంతం అవరోధాలకు అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది. ఈ కేసు విచారణ నుంచి ధర్మాసనానికి వహిస్తున్న జస్టిస్ జె.ఎస్.ఖేహర్ తప్పుకోబోరని జస్టిస్ జె.చలమేశ్వర్ బెంచ్ తరఫున బుధవారం స్పష్టంచేశారు. జస్టిస్ ఖేహర్ నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ బెంచ్ మంగళవారం విచారణ ప్రారంభించగానే.. కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు.. జస్టిస్ ఖేహర్ జడ్జీల కొలీజియంలో సభ్యుడిగా ఉన్నందున ఈ కేసు విచారణలో ప్రయోజనాల సంఘర్షణ, పక్షపాతానికి అవకాశముంటుందని అభ్యంతరాలు లేవనెత్తారు. వారి అభ్యంతరాలను ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. ఎన్‌జేఏసీ చట్టం చెల్లుబాటు కేసుపై ఈ నెల 27 నుంచి విచారణ ప్రారంభిస్తామంది. కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది.