ముసాయిదా సాధ్యంకాదు
జడ్జీల నియామకంపై సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి సంబంధించి నియమ, నిబంధనలతో ఒక ముసాయిదా(మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్-ఎంవోపీ)ను రూపొందించడం సాధ్యంకాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఎంవోపీని సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో అటార్నీ జనరల్ రోహత్గీ గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనానికి ఈ విషయం తెలియజేశారు. న్యాయ వ్యవస్థకు సంబంధించి ముసాయిదా నియమావళిని రూపొందించడం ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని, ఇది ప్రభుత్వంపై అనవసర భారం మోపుతుందని పేర్కొన్నారు. ఎంవోపీకి సంబంధించి రాజ్యాంగంలో ఎటువంటి విధానం లేదని, అందువల్ల దీనిని రూపొందించడం సాధ్యం కాదని వివరించారు. ముసాయిదాను రూపొందించడం కాకుండా...
కొలీజియం వ్యవస్థను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆయన ధర్మాసనాన్ని కోరారు. కొలీజియం వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకుగానూ వివిధ వర్గాల నుంచి న్యాయస్థానం సూచనలు, ప్రతిపాదనలు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వంతో పాటు న్యాయవాదులు, ఇతర వర్గాల నుంచి పలు సూచనలు అందాయి. వీటిని పరిశీలించిన అనంతరం న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై ఎంవోపీని రూపొందించాలంటూ న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం బుధవారం కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం కొలీజియం వ్యవస్థను మెరుగు పరచడానికి మూడంచెల ప్రక్రియను ప్రతిపాదించింది. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను నేరుగా నియమించాలని, కొలీజియం సమావేశాలకు సంబంధించిన మినిట్స్‌ను సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులు తాము ఏ రాజకీయ పార్టీ సభ్యత్వమైనా తీసుకున్నారా అనే విషయాన్ని కూడా వెల్లడించాలని పేర్కొంది.