జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు | SC vs Government: Law Minister Kiren Rijiju Blames Collegium System For High Pendency Of Cases, Judicial Vacancies | Sakshi
Sakshi News home page

జడ్జీల నియామకం ప్రభుత్వ హక్కు

Published Fri, Dec 16 2022 5:03 AM | Last Updated on Fri, Dec 16 2022 5:03 AM

SC vs Government: Law Minister Kiren Rijiju Blames Collegium System For High Pendency Of Cases, Judicial Vacancies - Sakshi

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ పట్ల ప్రభుత్వ అసహనం మరోసారి తేటతెల్లమయ్యింది. కొలీజియం విషయంలో ఇప్పటికే ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ రెండు వర్గాలుగా విడిపోయాయి. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకంలో ప్రభుత్వం పాత్ర పరిమితంగానే ఉండడం ఏమిటని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్‌ రిజిజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన గురువారం రాజ్యసభలో మాట్లాడారు. కోర్టుల్లో పెండింగ్‌ కేసుల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానామిచ్చారు. ఆయన ఏం చెప్పారంటే..  
 
పెండింగ్‌ కేసులు ఆందోళనకరం  

‘దేశవ్యాప్తంగా కోర్టుల్లో ఐదు కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండడం ఆందోళకరం. ఇందుకు ప్రధాన కారణం కోర్టుల్లో జడ్జి పోస్టులు ఖాళీగా ఉండడం. పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. కానీ, జడ్జి పోస్టుల భర్తీలో ప్రభుత్వం పాత్ర పరిమితమే. నియమించాల్సిన జడ్జీల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కొలీజియమే ప్రతిపాదిస్తుంది. అందులో ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు.  

మార్పులు చేయకపోతే..
న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు దేశ వైవిధ్యాన్ని, నాణ్యతను ప్రతిబింబించే పేర్లను ప్రతిపాదించాలని కొలీజియంకు ప్రభుత్వం తరచుగా విజ్ఞప్తి చేస్తూనే ఉంది. కానీ, ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ పార్లమెంట్, దేశ ప్రజల సెంటిమెంట్‌ను  ప్రతిబింబించడం లేదు. ఎక్కువ మాట్లాడితే న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం లేదు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం చూస్తే కోర్టుల్లో జడ్జీలను నియమించడం ప్రభుత్వ హక్కు. కానీ, 1993 తర్వాత ఈ పరిస్థితిని మార్చేశారు.

జడ్జిల అపాయింట్‌మెంట్లలో ప్రభుత్వానికి భాగస్వామ్యం కల్పిస్తూ 2014లో నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌(ఎన్‌జేఏసీ) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని 2015లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. జడ్జిలను నియమించే ప్రక్రియలో మార్పులు చేయకపోతే ఉన్నత న్యాయస్థానాల్లో ఖాళీల సమస్య తలెత్తూనే ఉంటుంది’ అని రిజిజు తేల్చిచెప్పారు. కొలీజియం అనేది దేశ ప్రజలు కోరుకుంటున్న వ్యవస్థ కాదని ఆయన కొన్ని వారాలుగా గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. కొలీజియంకు వ్యతిరేకంగా పలువురు ప్రస్తుత, మాజీ కేంద్ర మంత్రులు గళం విప్పుతున్నారు. కానీ, కొలీజియం వ్యవస్థను పట్టాలు తప్పించేలా ఎవరూ మాట్లాడొద్దని సుప్రీంకోర్టు ఇటీవలే హెచ్చరించింది.    

20 పేర్లను పునఃపరిశీలించండి
కొలీజియంకు తిప్పి పంపిన కేంద్ర ప్రభుత్వం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన 20 పేర్లను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపించింది. ఆ 20 పేర్లను మరోసారి పరిశీలించాలని కోరింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 9వ తేదీ నాటికి హైకోర్టుల్లో 331 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. మొత్తం శాంక్షన్డ్‌ పోస్టులు 1,108 కాగా, 25 హైకోర్టుల్లో ప్రస్తుతం 777 మంది జడ్జీలు ఉన్నారని తెలిపారు. 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పోస్టుల భర్తీ కోసం పలు హైకోర్టుల నుంచి అందిన 147 ప్రతిపాదనలు ప్రస్తుతం ప్రభుత్వం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 9 నాటికి వివిధ హైకోర్టుల్లో రికార్డు స్థాయిలో 165 మంది జడ్జిలను నియమించినట్లు కిరణ్‌ రిజిజు వివరించారు. ఒక సంవత్సరంలో ఇంతమందిని నియమించడం ఒక రికార్డు అని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement