ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు.
బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి.
అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు.
జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు?
నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment