transparency
-
పారదర్శకంగా ఎన్పీఏల గుర్తింపు
న్యూఢిల్లీ: వసూలు కాని రుణాన్ని నిరర్థక ఆస్తిగా (ఎన్పీఏలు) గుర్తించే విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వరంగ బ్యాంక్‌లను (పీఎస్‌బీలు) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, బలమైన రిస్క్ నిర్వహణ విధానాలను అనుసరించాలని సూచించారు. వృద్ధి, లాభదాయకత విషయంలో ఇక ముందూ మంచి పనితీరు చూపించాలని కోరారు. ఆర్థిక మంత్రి అన్ని పీఎస్‌బీల సీఈవోలతో ఢిల్లీలో గురువారం సమావేశమయ్యారు. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, స్టాండప్ ఇండియా, ప్రధానమంత్రి ముద్రా యోజన, అటల్ పెన్షన్ యోజన, అత్యవసర రుణ వితరణ పథకం తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల పరిధిలో నిర్ధేశించిన లక్ష్యాలను ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఏ మేరకు చేరాయన్నది మంత్రి పరిశీలించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. రుణ వితరణలో వృద్ధి, ఆస్తుల నాణ్యత, తదుపరి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యంక్‌ల నిధుల అవసరాలను సమీక్షించినట్టు తెలిపాయి. రుణాల పంపిణీ, లాభదాయకత, ఆస్తుల నాణ్యత, క్యాపిటల అడెక్వెసీ తదితర గణాంకాలన్నీ పీఎస్‌బీల పనితీరు ఎంతో మెరుగుపడినట్టు తెలియజేస్తుండడాన్ని మంత్రి పరిగణనలోకి తీసుకున్నట్టు పేర్కొన్నాయి. త్వరలో గ్రామీణ బ్యాంక్‌ల వంతు.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌ల పనితీరును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి త్వరలోనే సమీక్షించనున్నారు. ఇందుకోసం గ్రామీణ బ్యాంక్‌ల అధినేతలతో ఆమె భేటీ కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రుణ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుండడం తెలిసిందే. సాగు రంగం, దాని అనుబంధ విభాగాలకు కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ)ల జారీని ఆర్థిక మంత్రి సమీక్షించనున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి. వీలైనంత ఎక్కువ సంఖ్యలో రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణాలు అందేలా చూడాలన్నది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లక్ష్యంగా ఉంది. బలహీనంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లకు నిధుల అవసరాలను కూడా మంత్రి పరిశీలించనున్నారు. టెక్నాలజీ పెంపు, ఎప్పీఏల తగ్గింపు విధానాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
SEBI: అన్ని వివరాలూ వెల్లడించాలి
న్యూఢిల్లీ: పెట్టుబడి సలహాలిచ్చే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, పరిశోధనా అనలిస్టులకు సంబంధించి పారదర్శకత పెంచే దిశగా సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. తమ ప్రకటనల్లో సెబీ రిజిస్ట్రేషన్ నంబర్, పూర్తి పేరు, లోగో, పూర్తి చిరునామా, టెలిఫోన్ నంబర్లను వెల్లడించాలని పేర్కొంది. సెబీ ఇచ్చిన రిజిస్ట్రేషన్ కానీ, బీఎస్ఈ అడ్మినిస్ట్రేషన్ అండ్ సూపర్విజన్ సభ్యత్వం కానీ, రాబడులు, పనితీరుకు భరోసాగా, హామీగా చూడొద్దంటూ విధిగా ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుందని సెబీ ఆదేశించింది. వారు ప్రచురించే పబ్లికేషన్లు, కేవైసీ పత్రాలు, క్లయింట్లతో చేసుకునే ఒప్పంద పత్రాలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే అన్ని రకాల సంప్రదింపుల్లోనూ ఈ వివరాలు ఉండాలని సెబీ స్పష్టం చేసింది. దీనికి అదనంగా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, రీసెర్చ్ అనలిస్టులు ఇచ్చే ప్రకటనల్లో సెబీ లోగో వాడకుండా నిషేధం విధించింది. కొంత మంది పెట్టుబడుల సలహాదారులు, పరిశోధనా విశ్లేషకులు తమ ప్రకటనలు, ఇన్వెస్టర్లతో నిర్వహించే సంప్రదింపులు, ఒప్పందాల సమయంలో సెబీ వద్ద నమోదు చేసుకున్న పేరు, రిజిస్ట్రేషన్ నంబర్‌కు బదులు బ్రాండ్ లేదా లోగోను వాడుతున్నట్టు సెబీ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశించింది. -
ఆభరణాల స్వచ్చతలో మరింత పారదర్శకత
న్యూఢిల్లీ: పసిడి ఆభరణాల స్వచ్చత విషయంలో మరింత పారదర్శకతను కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తీసుకువస్తోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ (యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్) సంఖ్యతో హాల్‌మార్క్ అయిన బంగారు ఆభరణాలు, కళాఖండాలను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ప్రకటించింది. అంటే హెచ్‌యూఐడీ నంబర్ లేకుండా నాలుగు లోగోలతో కూడిన పాత హాల్‌మార్క్ ఉన్న ఆభరణాల విక్రయానికి మార్చి 31 తర్వాత అనుమతి ఉండదు. సంబంధిత వర్గాలతో చర్చల అనంతరం ఏప్రిల్ 1 నుంచి కొత్త హాల్‌మార్కింగ్ విధానం తప్పనిసరి చేయాలని జనవరి 18న నిర్ణయించారు. ఆరు అంకెల హెచ్‌యూఐడీ సంఖ్య అమలుకు ముందు (2023 ఏప్రిల్ 1కి ముందు) పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్ నాలుగు లోగోలతో అమల్లో ఉంది. ఇందులో ఒకటి ఆర్టికల్ ప్యూరిటీని సూచిస్తూ ఉండే బీఐఎస్ లోగో ఒకటి. నగల వ్యాపారి, స్వచ్చత(అస్సేయింగ్), హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోలు మిగిలినవి. పాత విధానాల ప్రకారం వినియోగదారుల వద్ద ఉన్న ఆభరణాల హాల్‌మార్క్ చెల్లుబాటు అవుతుందని కూడా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. -
కొలీజియంలో పారదర్శకత లేదు.. న్యాయవ్యవస్థలో రాజకీయాలు
ముంబై: సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థలో పారదర్శకత లేదని కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు అభిప్రాయపడ్డారు. పూర్తి అర్హతలున్న వారిని మాత్రమే న్యాయమూర్తులుగా నియమించాలే తప్ప కొలీజియంకు తెలిసిన వారినెవరినో కాదంటూ పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పైగా ఈ పద్ధతి న్యాయవ్యవస్థలోనూ రాజకీయాలకు తావిస్తోంది. న్యాయమూర్తులు బయటికి చెప్పకపోవచ్చు. కానీ అక్కడ లోతైన రాజకీయాలే ఉన్నాయి’’ అంటూ సునిశిత విమర్శలు కూడా చేశారు. బుధవారం ఇండియాటుడే కాంక్లేవ్‌లో న్యాయవ్యవస్థను సంస్కరించే అంశంపై మంత్రి మాట్లాడారు. ‘‘నేను న్యాయవ్యవస్థను గానీ, న్యాయమూర్తులను గానీ విమర్శించడం లేదు. కానీ ప్రస్తుత కొలీజియం వ్యవస్థ పట్ల మాత్రం నాకు చాలా అసంతృప్తి ఉంది. కొలీజియంలోని న్యాయమూర్తులు తమకు తెలిసిన సహచరుల పేర్లనే సిఫార్సు చేస్తున్నారు. ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే కాదు. లాయర్లతో పాటు కొందరు న్యాయమూర్తుల్లో కూడా ఉన్న అభిప్రాయాలనే చెబుతున్నాను. ఏ వ్యవస్థా పరిపూర్ణం కాదు. నిత్యం మెరుగు పరుచుకుంటూ పోవాలి. ప్రతి వ్యవస్థలోనూ జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి. అలా లేనప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ సంబంధిత మంత్రి కాక ఇంకెవరు మాట్లాడతారు?’’ అని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థ కార్యనిర్వాహక పాత్ర పోషించరాదని కుండబద్దలు కొట్టారు. ‘‘నియామక ప్రక్రియలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే ఎలా ఉంటుంది? ఎందుకంటే న్యాయమూర్తుల కొలీజియం సిఫార్సు చేసే పేర్లను ఆమోదించేముందు వాళ్లను గురించి అన్నిరకాల సమాచారం సేకరించే స్వతంత్ర యంత్రాంగం ప్రభుత్వం సొంతం. న్యాయవ్యవస్థకు, న్యాయమూర్తులకు ఈ వెసులుబాటు లేదు. పైగా, వాళ్లు దృష్టి పెట్టాల్సింది న్యాయమూర్తుల నియామకాల వంటి పాలనపరమైన పనుల పైనా, లేక ప్రజలకు న్యాయం అందించడం మీదా?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. జడ్జిలూ... వ్యాఖ్యలెందుకు? నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ ఏర్పాటును సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని రిజిజు ప్రస్తావించారు. ఈ చర్యపై కేంద్రం తన వైఖరిని ఇంకా స్పష్టం చేయలేదని గుర్తు చేశారు. ‘‘నిజానికి వాళ్లలా కొట్టేసినప్పుడు కేంద్రం కావాలనుకుంటే ఏదో ఒకటి చేసేది. కానీ న్యాయవ్యవస్థ పట్ల గౌరవమున్న కారణంగా ఆ పని చేయలేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలన్నది మోదీ సర్కారు అభిప్రాయం’’ అన్నారు. అంతమాత్రాన తామెప్పుడూ మౌనంగానే ఉంటామని అనుకోవద్దంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలను కూడా రిజిజు తప్పుబట్టారు. ‘‘ఏం చెప్పినా తీర్పుల ద్వారానే చెప్పాలి తప్ప అనవసర వ్యాఖ్యలు చేసి విమర్శలు కొనితెచ్చుకోవద్దు’’ అని సూచించారు. -
ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక చార్టర్: సెబీ
న్యూఢిల్లీ: సెక్యూరిటీల మార్కెట్లో పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకతను మరింతగా పెంచే దిశగా ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక విధానాలపై (చార్టర్) కసరత్తు చేస్తున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ అజయ్ త్యాగి తెలిపారు. ఇన్వెస్టర్ల హక్కులు, బాధ్యతలతో పాటు వారి ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు సెబీ 2020–21 వార్షిక నివేదికలో ఆయన వివరించారు. పెట్టుబడుల ప్రక్రియలో పారదర్శకత పెంచడంతో పాటు మరింత అవగాహన పెంచుకుని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలా మదుపుదారులను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడగలదని ఆయన తెలిపారు. గోల్డ్ స్పాట్ ఎక్సే్చంజీ, సోషల్ స్టాక్ ఎక్సే్చంజీల ఏర్పాటు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు.. ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్లాంటి వాటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించడం, పాసివ్ ఫండ్స్ అభివృద్ధి మొదలైన అంశాలపై సెబీ కసరత్తు చేస్తున్నట్లు త్యాగి పేర్కొన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సెక్యూరిటీల మార్కెట్ కీలకపాత్ర పోషిస్తోందనడానికి 2020–21లో మార్కెట్ పరిణామాలు, ధోరణులు నిదర్శనమని ఆయన తెలిపారు. 2021 మార్చి ఆఖరు నాటికి స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 200 లక్షల కోట్ల స్థాయికి చేరిందని, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 103 శాతమని త్యాగి పేర్కొన్నారు. -
పారదర్శకత లోపించిన పాలసీ
వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేత ప్రక్రియ వేగం పుంజుకుంది. కానీ వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకునే సమయం కాదిది. ఇంతవరకు వైరస్ కట్టడివైపుగా సాగిన ప్రయాణాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడానికి ప్రస్తుత వెసులుబాటును మంచి అవకాశంగా తీసుకోవాలి. భారత్‌లో కరోనా వైరస్‌పై ప్రభుత్వ స్పందనను పద్ధతి ప్రకారం ప్రజలు సమీక్షించిన అనుభవం మనకు ఇంతవరకు లేదు. పౌరుల ప్రాణాలను ప్రభావితం చేస్తున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పార్లమెంటరీ సభా కమిటీలు అంచనా వేసి ప్రభుత్వాన్ని, విధాన నిర్ణేతలను నిలదీసినప్పుడు మాత్రమే వ్యాక్సినేషన్, వైరస్ సంబంధిత విధానాలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది. కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్‌లో రోజువారీ కొత్త కేసులు 37 వేలకు పడిపోయాయి. మే నెలలో సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు దీనికి పది రెట్లకు మించిన కేసులు నమోదయ్యాయి. అనేక నగరాల్లో కరోనా అదుపు తప్పిపోవడం కూడా చూశాం. సవరించిన విధానం ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేత ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాల పునరుద్ధరణ మొదలైపోయింది. ఇంతవరకు భారత్‌లో మహమ్మారి పట్ల ప్రభుత్వ స్పందనను నిశితంగా అంచనావేయడానికి, మరింత ముందుకు సాగిపోవడానికి ఇదే తగిన సమయం. ఇప్పటికీ వైరస్ వ్యాపిస్తూనే ఉంది. భవిష్యత్తులోనూ ఇది మరింతగా వ్యాపించే అవకాశాన్ని తోసిపారేయలేం. వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టిందని సంబరాలు చేసుకునే సమయం కాదిది. ఇంతవరకు వైరస్ కట్టడివైపుగా సాగిన ప్రయాణాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించడానికి ప్రస్తుత వెసులుబాటును మంచి అవకాశంగా ఉపయోగించుకోవాలి. విలువైన గుణపాఠాలు తీసుకుని ఇకముందు ఎలా ముందుకెళ్లాలో కార్యాచరణను రూపొందించుకోవడానికి ఇలాంటి సమీక్ష దోహదం చేస్తుంది. మహమ్మారికి సంబంధించి రెండు వేవ్‌లను మనం అధిగమించాం. ఫస్ట్ వేవ్‌లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడం, రాబోతున్న వైరస్ దూకుడుకు తట్టుకునే విధంగా ఆరోగ్య వ్యవస్థను మలుచుకునే చర్యలు చేపట్టిన కారణంగా వైరస్‌పై ప్రభుత్వ స్పందన పటిష్టంగా కనిపించింది. ఫస్ట్ వేవ్ దశలోనే వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి చర్యలను ప్రారంభించారు. 2021 ప్రారంభానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వ్యాక్సిన్ పంపిణీ నిదానంగా సాగింది. ఈలోపు సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టుముట్టింది. ఇది మన ఆరోగ్యవ్యవస్థలోని లోటుపాట్లను, మన సన్నాహాల్లోని డొల్లతనాన్ని స్పష్టంగా ఎత్తి చూపింది. మొదట్లోనే వ్యూహాత్మకంగా వ్యాక్సిన్ ప్రక్రియను చేపట్టడం, రాజకీయ, మతపర సమావేశాలను నిరోధించడం, జన్యుపరమైన నిఘాను సమర్థంగా నిర్వహించడం వంటివి సెకండ్ వేవ్ కాలంలో సంభవించిన తీవ్ర విషాదాన్ని తగ్గించగలిగేవి. గత కొద్ది వారాలుగా, కొన్ని నెలలుగా మహమ్మారి సెకండ్ వేవ్ పట్ల ప్రభుత్వం స్పందించిన తీరును ప్రజానీకం తనిఖీ చేయవలసిన అవసరం వుంది. జాతీయ స్రవంతి మీడియాలో, సోషల్ మీడియాలో సెకండ్ వేవ్ కట్టడిలో ఎక్కడ తప్పు జరిగింది అనే అంశంపై ఆరోపణలు, ప్రత్యారోపణలు మోతాదుకు మించి చోటు చేసుకున్నాయి కానీ భారత్‌లో కరోనా వైరస్‌పై ప్రభుత్వ స్పందనను పద్ధతి ప్రకారం ప్రజలు సమీక్షించిన అనుభవం మనకు ఇంతవరకు లేదు. జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ప్రజల అభిప్రాయం ఏమిటనే చర్చకు తావిచ్చిన దాఖలాలు కనపడటం లేదు. జైరాం రమేష్ నేతృత్వంలో శాస్త్ర సాంకేతిక వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ కమిటీ వ్యాక్సిన్లపై, జీనోమ్ విశ్లేషణపై ఇటీవలే చర్చను ప్రారంభించింది కానీ అధికార పక్షంలోని సభ్యులు దీన్ని వ్యతిరేకించారు. భారత్‌లో మహమ్మారి సంబంధిత విధాన స్పందన చాలా అస్పష్టంగా ఉంటూ వచ్చింది. కీలకమైన విధానాలు నిరంకుశ ధోరణితో ఉన్నట్లు కనిపించాయి. ప్రభుత్వం చేసిన ప్రకటనలకు భిన్నంగా ఆధారాల సాక్షిగా స్పష్టమైన విధానం కొనసాగినట్లు కనిపించలేదు. ఉదాహరణకు సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిన తర్వాతే వ్యాక్సిన్ సేకరణపై ప్రభుత్వ విధానం వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్ పాలసీపై ప్రభుత్వ విధానం నిరంకుశత్వంతో ఉందనే తీవ్ర పదజాలాన్ని కూడా న్యాయస్థానం ఉపయోగించాల్సి వచ్చింది. న్యాయస్థానంలోనూ, సమాజంలోనూ తీవ్ర విమర్శ రావడంతో 2021 డిసెంబర్ 31 నాటికి దేశంలోని వయోజనులందరికీ వ్యాక్సిన్ ప్రక్రియను కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆకస్మికంగా ప్రకటించేసింది. ఈ సంవత్సరం ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కాలంలో భారత్ 216 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను సేకరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్ధన్ ప్రకటించారు. అయితే, ఈ వారం కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన రెండో అఫిడవిట్లో అంతకుముందు ప్రకటించిన 216 కోట్ల డోస్‌లకు బదులుగా 186 కోట్ల డోస్‌లను మాత్రమే సేకరించగలమని పేర్కొంది. దేశంలో 18 సంవత్సరాలకు పైబడిన భారతీయులందరికీ ఇవి సరిపోతాయని కేంద్రం పేర్కొంది. దీంట్లో భాగంగా జూలై 31 నాటికి 51 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని, డిసెంబర్ 31 నాటికి మిగిలిన 135 కోట్ల డోసులను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది. వీటిలో 50 కోట్ల డోస్‌లు కోవిషీల్డ్, 40 కోట్లు కోవాగ్జిన్, 10 కోట్ల డోసులు స్పుత్నిక్ వి కి సంబంధించి ఉంటాయని, మిగిలిన 35 కోట్ల డోసుల కోసం ఇప్పటికి వృద్ధి దశలోనే ఉంటున్న బయోలాజికల్ ఇ, జైడస్ కాడ్లియా వ్యాక్సిన్లపై ఆధారపడతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపోతే వ్యాక్సిన్ల ఉత్పత్తి విషయంలోనూ పరస్పర విరుద్ధమైన లెక్కలు ముందుకొచ్చాయి. 2021 మే నెలలో కేంద్రప్రభుత్వం అదే న్యాయస్థానానికి ఇచ్చిన సమాచారం ప్రకారం జూలై నెల నాటికి 6.5 కోట్ల కోవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేయగలమని తెలిపింది. కానీ జూన్ నెలలో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఉత్పత్తి సామర్థ్యం 50 కోట్లకు చేరుకుంటుందని అతిశయించి చెప్పింది. అదేవిధంగా ఈ రెండు అఫిడవిట్లు దాఖలు చేసిన మధ్య కాలంలో 33 కోట్ల నుంచి 40 కోట్ల మేరకు కోవిషీల్డ్ డోసులను పెంచి చూపించడం గమనించాలి. ఈ జూన్ చివరినాటికి దేశంలో పూర్తిగా వ్యాక్సినేషన్ వేయించుకున్న భారతీయుల సంఖ్య జనాభాలో 4 శాతానికి పైబడి ఉంది. ఈ లెక్కన చూస్తే ఈ సంవత్సరం చివరినాటికి 100 కోట్ల డోసుల ఉత్పత్తి సాధ్యం కాదని స్పష్టమవుతోంది. కోర్టు ముందు ప్రకటించిన ప్రకారం అన్ని కంపెనీల వ్యాక్సిన్ డోసులను కలిపినా ఈ స్థాయికి చేరుకోవడం అసాధ్యం. వచ్చే కొన్ని నెలల్లో వ్యాక్సిన్ల లభ్యత పుంజుకుంటుంది కానీ రెండు డోసుల మధ్య అంతరం బాగా పెరుగుతుంది. 2021 చివరి త్రైమాసికంలో కోవిషీల్డ్ వేయించుకున్న ప్రజలు రెండో డోసును 2022 తొలి త్రైమాసికంలో మాత్రమే పొందగలరు. దీంతోపాటుగా వ్యాక్సిన్ ఉత్పత్తి, పరీక్షలు, సేకరణ, ధరల నిర్ణయం, అందరికీ సమానంగా అందుబాటులోకి తీసుకురావడంపై చాలా అనుమానాలు కూడా బయలుదేరుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్లలో ఆరోగ్య అధికారులు, శాస్త్ర సాంకేతిక సలహాదార్లు, వ్యాక్సిన్ కంపెనీలతో ముడిపడి ఉన్న సభా సంఘాలు ప్రజలకు జవాబుదారీగా ఉంటున్నాయి. బ్రిటన్‌లో ప్రతినిధుల సభకు చెందిన కోవిడ్ 19 కమిటీ ఆర్థిక వ్యవస్థపై మహమ్మారి కలిగించే సుదీర్ఘ ప్రభావాలను అంచనా వేస్తోంది. ఇక అమెరికాలో కరోనా వైరస్ సంక్షోభంపై నియమించిన సెలెక్ట్ కమిటీ పూర్వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన ఆపరేషన్ రాప్ స్పీడ్ పథకంలోని వైఫల్యాలపై దర్యాప్తు చేస్తోంది. పైగా ఉపశమనం కోసం కేటాయించిన నిధుల విషయంలో జరిగిన మోసం, దుర్వినియోగంపై ప్రజలనుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇక యూరోపియన్ పార్లమెంటుకి చెందిన పర్యావరణ సభ్యులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత కమిటీ యూరప్ ఖండంలో వ్యాక్సిన్ సమస్యలను అధ్యయనం చేస్తున్నాయి. భారతదేశంలో పార్లమెంటరీ ప్యానెళ్లు నకిలీ వార్తల ప్రచారం, తదితర అంశాలపై సోషల్ మీడియా కంపెనీలను ప్రశ్నించవచ్చు. పౌరుల ప్రాణాలను ప్రభావితం చేస్తున్న ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఇవి సమర్థంగా అంచనా వేయవచ్చు. ఇలాంటి అభ్యాసాలు ప్రభుత్వాన్ని, విధాన నిర్ణేతలను తమ తమ చర్యలకు నేరుగా జవాబుదారీని చేసి నిలదీయవచ్చు. అలా మాత్రమే వ్యాక్సినేషన్, వైరస్ సంబంధిత విధానాలపై ప్రజల విశ్వాసం పెరుగుతుంది. వ్యాసకర్త సైన్స్ వ్యాఖ్యాత (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో పారదర్శకతను మరింతగా పెంచేందుకు ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఒక పనికి పరిపాలన ఉత్తర్వులు, సాంకేతిక అనుమతి జారీ చేసినప్పటి నుంచి.. అది పూర్తయ్యేదాకా బిల్లుల చెల్లింపులను ‘ఈఎంబుక్’–డిజిటల్(ఎలక్ట్రానిక్) మెజర్మెంట్ బుక్ ద్వారా చేయాలని నిర్ణయించింది. కర్నూలు జిల్లాలో ఆర్నెల్ల క్రితం ప్రయోగాత్మకంగా జలవనరుల శాఖ సారథ్యంలో చేపట్టిన పనులకు ఈ–ఎంబుక్ ద్వారా బిల్లుల చెల్లింపును చేపట్టింది. అది విజయవంతం కావడంతో ఏప్రిల్ 1 నుంచి జలవనరుల శాఖలో చేపట్టే అన్ని పనులకూ ఈ విధానాన్నే వర్తింపజేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా మిగిలిన ఇంజనీరింగ్ శాఖల్లో అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే టెండర్ వ్యవస్థ ప్రక్షాళన 2014–2019 మధ్య రాష్ట్రంలో ఇంజనీరింగ్ పనుల్లో గత టీడీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఇంజనీరింగ్ పనుల టెండర్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం కలిగిన పనులకు జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూళ్లతోనే టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ అంచనా వ్యయం ఉన్న పనులకు రివర్స్ టెండరింగ్ (ఈ–ఆక్షన్) నిర్వహించాలని సూచించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండర్ల వ్యవస్థ కట్టుదిట్టంగా తయారయ్యింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఒక్క జలవనరుల శాఖలోనే ఇప్పటిదాకా రూ.1,141.89 కోట్లు ఆదా అయ్యాయి. ఇక కొత్తగా చేపట్టిన పనులకు రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక్క ఈ శాఖలోనే ఇప్పటిదాకా రూ.223.94 కోట్లు మిగలడం గమనార్హం. టీడీపీ హయాంలో వందల కోట్ల దోపిడీ గత ప్రభుత్వ హయాంలో ఎం–బుక్ (సాధారణ నోట్‌బుక్) ఉపయోగించేవారు. పనులు చేయకుండానే చేసినట్లు నమోదు చేయడం, చేసిన పనినే మళ్లీ కొత్తగా చేసినట్లు రికార్డు రాయడం, చేసిన పని పరిమాణం కంటే ఎక్కువ చేసినట్లు చూపించడం చేశారు. తద్వారా భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. పోలవరంలో మట్టి తవ్వకం పనులు చేయకుండానే చేసినట్లు చూపి రూ.109 కోట్లు దోచేశారు. ఉపాధి హామీ పథకం కింద గతంలో చేసిన పనులనే 2015–19 మధ్య నీరు–చెట్టు కింద మళ్లీ చేసినట్లు చూపి భారీ ఎత్తున దోచేశారు. ఈ అక్రమాల బాగోతం విజిలెన్స్ విచారణలో బట్టబయలైంది. దీంతో ఈ తరహా అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ–ఎంబుక్ ద్వారా బిల్లులు చెల్లించాలని నిర్ణయించి, సీఎఫ్ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సర్వీస్)లో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయించింది. దీనిద్వారా కర్నూలు జిల్లాలో జలవనరుల శాఖ సీఈ మురళీనాథ్‌రెడ్డి నేతృత్వంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టిన ఈ–ఎంబుక్ విధానం పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అందువల్ల దీనిని పూర్తి స్థాయిలో అమల్లోకి తేవాలని నిర్ణయించారు. ఈ–ఎంబుక్ ఏం చేస్తుందీ.. ♦గతంలో చేపట్టిన పనిని మళ్లీ కొత్తగా చేపట్టడానికి, ఈ–ఎంబుక్ విధానంలో బిల్లులు చెల్లించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పనిని నమోదు చేయడానికే ఈ–ఎంబుక్ సాఫ్ట్వేర్ అనుమతించదు. ♦పనులను పర్యవేక్షించే జేఈ క్షేత్రస్థాయిలో ఏ రోజు చేసిన పనుల పరిమాణాన్ని ఆ రోజే కొలిచి, వారికి ఇచ్చిన ట్యాబ్‌లోని ఈ–ఎంబుక్‌లో పొందుపరుస్తారు. అగ్రిమెంట్ నిబంధనల మేరకు15 రోజులు లేదా నెలకు ఒకసారి కాంట్రాక్టర్ చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లును ఈ–ఎంబుక్ సాఫ్ట్వేర్ దానంతటదే సిద్ధం చేస్తుంది. ♦వాటిని ఆన్లైన్లో డీఈ, ఈఈలకు పంపుతుంది. ఈ–ఎంబుక్‌లో పొందుపరిచిన పనుల పరిమాణం సక్రమంగా ఉందో లేదో పరిశీలించేందుకు డీఈ, ఈఈలు మరోసారి క్షేత్ర స్థాయిలో పనులను కొలిచి, లోపాలు ఏవైనా ఉంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు. ఆ తర్వాత లోపాలను సరిదిద్ది ఎస్ఈ, సీఈల ద్వారా బిల్లు చెల్లించాలని పీఏవో (పే అండ్ అకౌంట్స్ ఆఫీస్)కు ఆన్లైన్లో ప్రతిపాదన పంపుతారు. తర్వాత కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లిస్తారు. ♦దీనివల్ల చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. బిల్లులు చెల్లించడానికి కమీషన్లు ఇవ్వాల్సిన అగత్యం ఉండదు. ♦జేఈ, డీఈ, ఈఈలు రోజు వారీగా క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి ఈ–ఎంబుక్‌లో పొందుపర్చాల్సి ఉండటంతో, వారు రోజూ క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారా లేదా అన్నది బయటపడుతుంది. రోజూ పనులను పర్యవేక్షించడం వల్ల పనుల్లో నాణ్యత మరింత పెరుగుతుంది. పారదర్శకతకు అత్యున్నత ప్రామాణికం ఇంజనీరింగ్ పనుల్లో పారదర్శకతకు అత్యున్నత ప్రమాణికం ఈ–ఎంబుక్ విధానం. ప్రస్తుతం ఒక పని పూర్తయ్యేవరకూ బిల్లులను చెల్లించాలంటే పదుల కొద్దీ పనులు ఎం–బుక్‌లలో రికార్డు చేయాల్సి వస్తోంది. అంతేకాకుండా అనేకరకాల అవకతవకలకు అవకాశం ఉంది. అదే ఈ–ఎంబుక్ విధానంలో జేఈ రోజూ క్షేత్ర స్థాయికి వెళ్లి తనకు కేటాయించిన పనుల పరిమాణాన్ని కొలిచి ఈ–ఎంబుక్‌లో రికార్డు చేస్తారు. ఒకసారి ఈ–ఎంబుక్‌లో కొలతలను నమోదు చేసిన తర్వాత వాటిని మార్చడానికి అవకాశం ఉండదు. ఇతర అవకతవకలకు తావుండదు. తద్వారా ప్రజాధనం వృథా కాదు. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా ప్రాజెక్ట్స్ (చదవండి: 274 పంచాయతీల్లో ఎన్నికల్లేవు!) పోలవరంలో కీలక ఘట్టం పూర్తి -
3 కోట్ల టిక్‌టాక్ వీడియోల తొలగింపు..
ముంబై: భారత్ చైనా సరిహద్దు వివాదాల నేపథ్యంలో వీడియో షేరింగ్ యాప్ టిక్‌టిక్‌ను భారత్ నిషేధించిన విషయం తెలిసిందే. కాగా 2020 సంవత్సరం మొదటి అర్ధభాగంలో టిక్‌టాక్ తన మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు, భారత్ నుంచి 3.7 కోట్లకు పైగా వీడియోలను తొలగించినట్లు యాజమాన్యం తన పారదర్శక నివేదికలో పేర్కొంది. ప్రతి సంవత్సరం టిక్‌టాక్ సంస్థ పారదర్శక నివదేక విడుదల చేస్తుంది. అయితే 2020 మొదటి అర్ధభాగంలో భారత్ నుంచి 3,76,82,924 వీడియోలు, ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల పైగా వీడియోలు మార్గాదర్శకాలు పాటించనందుకు తొలగించామని సంస్థ పేర్కొంది. అయితే అనేక ఫిర్యాదులు, కంటెంట్ల విషయంలో ప్రభుత్వ సంస్థల నుంచి కొన్ని అభ్యర్థనలు వచ్చాయని, వాటిని పరిశీలించి వీడియోలను తొలగించినట్లు నివేదిక తెలిపింది. మార్గదర్శకాలను అధ్యయనం చేయడానికి సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నామని, అయితే భారత్. ఇటలీ, జపాన్. స్పేన్, యూకే దేశాల నుంచి కోవిడ్ సబ్కెటీగరీలో కంటెంట్‌కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని సంస్థ తెలిపింది. మరోవైపు యూనిసెఫ్ ఇండియా, యునెస్కో, యుఎన్ ఉమెన్, యుఎన్‌డీపీ ఇండియా, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీల భాగస్వామ్యంతో టిక్‌టాక్ పనిచేస్తున్నట్లు సంస్థ నివేదిక పేర్కొంది. (చదవండి: డీల్ నచ్చలేదు.. సంతకం చేయను : ట్రంప్) -
సీఎస్టీ యాప్.. ట్యాక్స్‌లో టాప్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పన్నుల శాఖ దేశంలోనే తొలిసారిగా సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ (సీఎస్టీ) విధానానికి శ్రీకారం చుట్టింది. అంతర్రాష్ట అమ్మకాల పన్ను వసూళ్లకు ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. దేశ పన్ను వసూళ్ల వ్యవస్థకు ఆదర్శంగా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, కమిషనర్ అనిల్ కుమార్ మార్గదర్శకాలతో ఉన్నత అధికారుల రూపొందించిన సీఎస్టీ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ ఎంతో సులభతరమైందని అధికారులు చెబుతున్నారు. యాప్‌లో అంతర్రాష్ట అమ్మకాలు, డీలర్లకు సంబంధించిన వివరాలతో పాటు వారు సమర్పించాల్సిన సీ, ఎఫ్, ఐ ఫారాలతో పాటు బిల్ ఆఫ్ ల్యాండింగ్‌కు సంబంధించిన దస్తావేజులను ఉంచారు. దీంతో పాటు డీలర్లు పన్ను మినహాయింపునకు అందించాల్సిన ఫారాలు సమర్పించారా..? అమ్మకాలకు తక్కువ ధరల కోసం నివేధికలు అందింOచారా..? అనే సమాచారం యాప్‌లో పొందుపర్చారు. పన్ను వసూళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు యాప్‌లో ఉండడంతో అధికారులకు విధులు సులభతరమయ్యాయి. యాప్‌తో అన్ని ప్రక్రియలూ సులువు.. సీఎస్టీ యాక్ట్ కింద ఈ ఏడాది జూన్ వరకు అంతర్రాష్ట్ర అమ్మకాలపై డీలర్లు కోరిన పన్ను మినహాయింపులు, తక్కువ ధరలకు సంబంధించి సీ, ఎఫ్, ఐ ఫారాల బిల్ ఆప్ ల్యాండింగ్ దస్తావేజులు సమర్పించాల్సి ఉంటుంది. ఒక త్రైమాసికంలో జరిగిన అమ్మకాలపై కోరిన మినహాయింపులు, అంతర్రాష్ట్ర, తక్కువ పన్ను రేట్లను తర్వాత త్రైమాసికం లోపు దస్తావేజులు రుజువులు, పత్రాలు వాణిజ్య పన్నుల శాఖకు డీలర్లు సమర్పించాలి. ఒకవేళ వారు సమర్పించని పక్షంలో.. సమర్పించని అమ్మకాల వివరాలను సాధారణ అమ్మకాలుగా పరిగణించి పన్ను మదింపు చేస్తారు. దీనికిగాను వాణిజ్య పన్నుల శాఖకు నాలుగేళ్లలోపు మదింపు చేయాల్సి ఉంటుంది. కానీ వాణిజ్య పన్ను శాఖ మదింపు చేయడానికి ఎక్కువ మంది సిబ్బంది, సమయం కావాల్సి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఉన్నతాధికారులు సాంకేతిక పరిజ్ఞానంతో సీఎస్టీ యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా అన్ని సీఎస్టీ నోటీసులు గత సంవత్సరాలకు సంబంధించినవన్నీ డీలర్ల నమోదు చేసిన ఈ మెయిల్ అడ్రస్‌కు ఒకే క్లిక్‌తో వెళ్లిపోయే వెసులుబాటు కలిగింది. ఈ ప్రక్రియతో వాణిజ్య పన్నుల శాఖకు సమయం ఆదా అవుతుంది. సిబ్బంది కూడా ఎక్కువ మంది అవసరం ఉండదు. నోటీస్ అందిన డీలర్లు వాటిలో ఉన్న ఒక లింక్ ద్వారా అభ్యంతరాలు, రుజువులు, పత్రాలను, ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. అలా సమర్పించిన తర్వాత డీలర్లు ఈ– మెయిల్ ద్వారా వ్యక్తిగత వివరణ పత్రం చేరుతుంది. దీనిని ఆన్లైన్లో పూర్తి చేసి అధికారులు ఇచ్చిన తేదీల్లో వ్యక్తిగతంగా హాజరై అందజేయాలి. పారదర్శకతకు అవకాశం.. సీఎస్టీ పన్ను వసూళ్లకు సంబంధించిన ప్రక్రియ మొత్తం కంప్యూటర్, ఆన్లైన్ ద్వారా కొనసాగుతుంది. ఇటు శాఖ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న కార్యకలాపాలు, అటు డీలర్లు సమర్పిస్తున్న వివరాలు అన్ని ఆన్లైన్లో జరుగుతున్నాయి. డీలర్లు సమర్పించాల్సిన పత్రాలు, రుజువులు, వివరాలు అన్ని ఆన్లైన్ ద్వారా సమర్పించడంతో ఎలాంటి అక్రమాలకు తావు ఉండదు. ఒకవేళ ఏవైనా దస్తావేజు పత్రాలు సమర్పించకపోతే ఆన్లైన్లో తెలిసిపోతుంది. దీంతో పన్ను వసూళ్ల ప్రక్రియా మొత్తం పారదర్శంగా కొనసాగుతోంది. ఈ యాప్‌తో పన్ను వసూళ్ల ప్రక్రియ సులభంగా మారింది. ఒక్కో అధికారికి 50 మంది డీలర్లు లక్ష్యంగా.. సీఎస్టీ పన్ను వసూళ్ల కోసం కేంద్ర కార్యాలయం ద్వారా సర్కిల్లోని ఒక్కో అధికారికి 50 మంది డీలర్ల పన్ను వసూళ్లకు టార్గెట్ ఇస్తున్నారు. దీంతో కేంద్ర కార్యాలయం సీ, ఎఫ్, ఐ ఫారాలు, నివేదికలు అందజేసే డీలర్ల వివరాలను అధికారులకు టార్గెట్‌గా ఇస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు తొలుత ఫోన్ ద్వారా సమాచారం తీసుకుంటున్నారు. డీలర్ల వివరాలు అందజేయనివారికి నోటీసులు జారీ చేస్తున్నారు. నోటీసులు అందుకున్న డీలర్లు వివరాలను ఆన్లైన్లో అందించి పన్నులు చెల్లిస్తున్నారు. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.2వేల కోట్ల ఆదాయం సమకూర్చేందుకు ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్దేశించుకుని ముందుకెళ్తున్నారు. -
పార్టీలను పోషిస్తున్నది నల్లడబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అతి గొప్పగా చెప్పుకుంటాం. కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నది ఆర్థిక శక్తే అన్నది ఒప్పుకోం. ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా దేశ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది మాత్రం ప్రధానంగా డబ్బే. ఎవరు ఎక్కువ డబ్బిస్తే అంటే, ఎవరు ఎక్కువ ఎన్నికల నిధులను విరాళంగా ఇస్తే వారికే మన దేశ రాజకీయ పార్టీలు ఊడిగం చేస్తాయి. అంటే, వారి ప్రయోజనాలకు అనుగుణంగానే పార్టీల విధానాలు ఉంటాయి. అధికారంలోకి వస్తే ఆ విధానాలనే అమలు చేస్తాయి. వారి కోసం ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతాయి. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఎన్నికల విరాళాల్లో పారదర్శకత లేకపోవడం. అమెరికా, యూరప్ దేశాల్లో ఎన్నికల నిధుల్లో పారదర్శకత కొనసాగుతోంది. ఎవరు, ఏ పార్టీకి ఎక్కువ విరాళాలు ఇచ్చారో ఓటరుకు తెలిసిపోతుంది. ఏ పార్టీ విరాళాలు ఇచ్చిన వారి ప్రయోజనాలకు ప్రాముఖ్యత ఇస్తున్నదో, ఏ పార్టీ ప్రజల ప్రయోజనాలకు ప్రాముఖ్యతనిస్తుందో ఆయా దేశాల్లోని ఓటరు బేరేజు వేసుకొని ఓటు వేయగలరు. దేశ, విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వెలికి తీసుకరావడమే కాకుండా పార్టీలకు విరాళాల రూపంలో వస్తున్న నల్లడబ్బును కూడా అరికడతామని అధికారంలోకి వచ్చిన కొత్తలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో నల్లడబ్బును ఏ మాత్రం అరికట్టలేక పోగా, కట్టలు తెంచుకొని నల్లడబ్బు పారేలాగా వెయ్యి, పదివేలు, లక్షా, పది లక్షలు, కోటి రూపాయల ఎన్నికల బాండులను 2017 బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా ప్రవేశపెట్టింది. 2017–18 సంవత్సరానికి ఏయే పార్టీకి ఏయే రూపంలో ఎన్ని విరాళాలు వచ్చాయో ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ సంస్థ ఇటీవల ఓ జాబితాను విడుదల చేసింది. 20 వేల రూపాయలకు లోపయితే ఎవరైనా 20 వేల రూపాయలు, అంతకులోపు విరాళాలు ఇస్తే వారు తమ గుర్తింపును వెల్లడించాల్సి అవసరం లేదు. గతంలో అన్ని పార్టీలకు 20 వేల రూపాయలే ఎక్కువగా వచ్చేవి. లక్ష రూపాయలు ఇవ్వదల్చిన దాతలు కూడా దాన్ని ఐదు భాగాలుగా విడగొట్టి 20 వేల రూపాయల చొప్పున ఇచ్చేవాళ్లు. 2017–18 సంవత్సరానికి ఆశ్చర్యంగా భారతీయ జనతా పార్టీకి 20 వేల రూపాయలకు మించిన విరాళాలు 93 శాతం, అంటే 437.04 కోట్ల రూపాయలు అందాయి. రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 5. 67 శాతం చొప్పున కేవలం 26.66 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇందులో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఎన్నికల బాండుల రూపంలో వచ్చినవే ఎక్కువ. అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 20 వేల రూపాయలకు మించని విరాళాలు 51 శాతం వచ్చాయి. ఆ తర్వాత 31 శాతంతో ఎన్నికల బాండులు ఉన్నాయి. ఎన్నికల బాండుల్లో బేజేపీకే 95 శాతం 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొదటి తొమ్మిది నెలల కాలానికే 834.7 కోట్ల రూపాయల ఎన్నికల బాండులు విక్రయించినట్లు బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. 2017–18 సంవత్సరం కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. 2019–2020 సంవత్సరానికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్క సీపీఎం మినహా ఆరు జాతీయ పార్టీలకు కలిపి 2017–18లో 53 శాతం అంటే, 689.44 కోట్ల రూపాయలు గుర్తు తెలియని దాతల నుంచి వచ్చాయి. 36 శాతం అంటే 467.13 కోట్ల రూపాయలు తెల్సిన దాతల నుంచి వచ్చాయి. ఇక్కడ గుర్తుతెలియని దాతలంటే బ్యాంకులకు, రాజకీయ పార్టీలకు గుర్తు తెలియని వారు కాదు. కేవలం ప్రజలు లేదా ఓటర్లకు గుర్తుతెలియని వారే. భారతీయ స్టేట్ బ్యాంకుల నుంచి ఎవరైనా వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఎన్నికల బాండులను కొనుక్కోవచ్చు. వారి వివరాలను బ్యాంకు లావాదేవీల అవసరార్థం బ్యాంకు బ్రాంచులు నమోదు చేసుకోవచ్చు లేదా వదిలేయవచ్చు. ఆ బాండ్‌ను ఏ పార్టీకి ఇచ్చేది ఆ దాత వెల్లడించాల్సిన అవసరం అస్సలు లేదు. దాత ఆ బాండును తీసుకెళ్లి ఏ పార్టీకి ఇస్తే ఆ పార్టీ ఆ దాత వివరాలను నమోదు చేసుకుంటుంది. అయితే ఇటు బ్యాంకులుగానీ, రాజకీయ పార్టీలుగానీ ఎన్నికల బాండుల దాతల వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు. కనుక ప్రజలకు ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రజలకు తెలిసే విధంగా ఉండాలనే ఉద్దేశంతోనే మొదట బీజేపీ ప్రభుత్వం ఈ బాండుల దాతల వివరాలను విధిగా వెల్లడించాలనే నిబంధన తీసుకరావాలనుకుంది. నల్లడబ్బుకే ప్రాధాన్యత దాతల వివరాలను వెల్లడిస్తే అధికారంలో ఉన్న తమ పార్టీకి ఎక్కువ విరాళాలు రాకపోవచ్చని, ముఖ్యంగా నల్లడబ్బుకు అవకాశం లేకపోయినట్లయితే నిధులు బాగా తగ్గి పోతాయని మోదీ ప్రభుత్వం భావించి ఈ మోసపు విధానానికే మొగ్గు చూపింది. నల్లడబ్బుకు ముసుగు వేయడానికే ఎన్నికల బాండులను తీసుకొచ్చారని మాజీ ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం. -
గూగుల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో వచ్చే రాజకీయ ప్రకటనలపై పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఆ ప్రకటనలను ఎవరు ఇచ్చారు? దీనికి వారు వెచ్చించిన ఖర్చు ఎంత? వంటి వివరాలను సైతం వెల్లడించనున్నట్లు తెలిపింది. ‘ఇండియా పొలిటికల్ యాడ్స్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్’ పేరిట నూతన పాలసీని తీసుకువచ్చినట్లు వెల్లడించింది. దీని ప్రకారం ప్రకటనదారులు ఇకపై తమ ప్రకటనలకు సంబంధించి భారతీయ ఎలక్షన్ కమిషన్ (ఈసీఐ) లేదా ఈసీఐ అధికారులు అనుమతినిస్తూ జారీ చేసిన సర్టిఫికెట్లు తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ప్రకటనదారుల గుర్తింపును ధ్రువీకరించిన తర్వాతనే రాజకీయ ప్రకటనలు ఇస్తామని పేర్కొంది. దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెడతామని తెలిపింది. ఈ ప్రకటనలు మార్చి నుంచి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో ప్రజలను ప్రభావితం చేసేలా ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐటీ చట్టంలో పలు సవరణలు సైతం చేసింది. దీంతో అప్రమత్తమైన సామాజిక మాధ్యమాలు.. ప్రకటనల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ట్విటర్, ఫేస్బుక్ ప్రకటనల విషయంలో నిబంధనలు విధించగా.. తాజాగా గూగుల్ కూడా ప్రకటనదారులకు నిబంధనలు విధించింది. -
వ్యాపారాలనూ వదలని అవినీతి
న్యూఢిల్లీ: లంచాలు, అక్రమార్జన అనేవి భారత్ సహా వర్ధమాన మార్కెట్లలో అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నిర్వహించిన సర్వేలో తేలిసింది. వ్యాపారాల్లో అవినీతి, లంచాలు తారస్థాయిలో ఉన్నాయని ఈవై సర్వేలో 52 శాతం మంది చెప్పడం గమనార్హం. మన దేశంలోనూ 40 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో 40 శాతం మంది ఎగ్జిక్యూటివ్‌లు వ్యాపారాల్లో అవినీతి అక్రమార్జన విధానాలు విస్తృతంగా ఉన్నాయని చెప్పారు. 12 శాతం మంది గత రెండేళ్లలో తమ కంపెనీ పెద్ద ఎత్తున మోసాలను చవిచూసినట్టు చెప్పారు. 20 శాతం మంది నగదు చెల్లింపులు అన్నవి వ్యాపారం నిలదొక్కుకునేందుకు అవసరమన్నారు’’ అని ఈవై నివేదిక తెలియజేసింది. భారత్‌లో కార్పొరేట్ పరిపాలన, పారదర్శకతను పెంపొందించేందుకు... అవినీతి నిరోధక చట్టం 2018, కంపెనీల చట్టం 2017, ఐబీసీ, నిబంధనలు పాటించకపోతే జరిమానాల వంటి పలు ప్రయ త్నాలు జరిగినట్టు ఈవై తెలిపింది. ‘‘అయినప్పటికీ మోసం, అవినీతి అనేవి వృద్ధికి ప్రధాన అడ్డంకులు. మీడియాలో తరచుగా అవినీతికి సంబంధించి పెద్ద కేసులను చూపించడం వల్ల సంబంధిత ప్రాంతంలో వ్యాపారాలను నిర్వహించే కంపెనీల ప్రతిష్టకు రిస్క్ ఉంటుంది’’ అని ఈవై అభిప్రాయం వ్యక్తం చేసింది. చాలా వర్ధమాన దేశాల్లో కొత్త చట్టాల అమలు, నిఘాను పెంచడం, మోసాల నివారణకు కంపెనీల స్వీయ కార్యాచరణ వంటివి చేపట్టినాగానీ సెంటిమెంట్ బలహీనంగానే ఉందని ఈవై తెలిపింది. అక్రమాలను ముందే గుర్తించి నిరోధించేందుకు ఫోరెన్సిక్ డేటా అనలిటిక్స్ వినియోగం వంటి చర్యలు అవసరమని సూచించింది. ఈవై ఫోరెన్సిక్ అండ్ ఇంటెగ్రిటీ సర్వీసెస్ ఈ సర్వేను నిర్వహించింది. భారత్‌తోపాటు జపాన్, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ సహా 33 వర్ధమాన మార్కెట్లకు సంబంధించి 1,450 ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాలను సేకరించింది. ఆసక్తికర అంశాలు ►వ్యాపారానికి మోసాలు, అవినీతి అతిపెద్ద ముప్పు అని 42% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 29 శాతమే. ►కంపెనీ మనుగడ సాగించాలంటే కొంత మేర ప్రోత్సాహకాలు ఇవ్వక తప్పని పరిస్థితిగా చాలా సంస్థలు చెప్పడం గమనార్హం. ► కాంట్రాక్టుల కోసం లంచాలు సాధారణమేనని 16% మంది చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలా చెప్పిన వారు 5 శాతం మంది ఉన్నారు. ► వ్యాపార ప్రయోజనాల కోసం నగదు రూపేణా ప్రోత్సాహకం ఇవ్వడం ఆమోదనీయమేనని వర్ధమాన మార్కెట్లలో 19% మంది చెప్పారు. దీన్ని సమర్థించే విషయంలో 33 వర్ధమాన దేశాల్లో భారత్ 12, చైనా 6వ స్థానంలో ఉన్నాయి. -
‘రాఫెల్ వివాదం’లో పారదర్శకత ఎక్కడ?
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా 126 రాఫెల్ యుద్ధ విమానాలకు బదులుగా 36 యుద్ధ విమానాలనే కొనుగోలు చేయాలని నిర్ణయించడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఈ విషయంలో మా ప్రభుత్వం పూర్తి పారదర్శకంగాను, నియమ నిబంధనల ప్రకారమే వ్యవహరించింది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పోల్చడానికే వీల్లేదు. ఎందుకంటే మా ఎన్డీయే ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు సరళంగా, సజావుగా, వేగంగా ఉండడమే కాకుండా అన్నింటికన్నా పారదర్శకంగా ఉంటాయి’ అని రాఫెల్ యుద్ధ విమానాల వివాదంపై కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ నవంబర్ 17, 2017 నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారత భాగస్వామి పార్టీగా అంబానీకి చెందిన రిలయెన్స్ డెఫెన్స్ను భారత ప్రభుత్వమే ఎంపిక చేసిందని, రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే కంపెనీ డాస్సూకు తనకు ఇష్టమైన భాగస్వామిని ఎంపిక చేసుకునే అధికారం ఉన్నప్పటికీ భారత్ సూచించిన రిలయెన్స్ కంపెనీని ఎంపిక చేయక తప్పలేదని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయీస్ హొలాండే చేసిన ఆరోపణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎందుకు సూటిగా, పారదర్శకంగా సమాధానం ఇవ్వడం లేదు? రాఫెల్ ఒప్పందంపై సంతకం చేసిన హొలాండేనే స్వయంగా ఆరోపణలు చేసినప్పుడు, ఆ ఒప్పందంపై సంతకం చేసిన నరేంద్ర మోదీ ఎందుకు నోరు విప్పడం లేదు? ఆయన తరఫున ఆయన మంత్రులు ఒకదానికి ఒకటి పొంతనలేని డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకు ఇస్తున్నారు? రాహుల్ గాంధీ, హొలాండే, పాకిస్థాన్‌ను కలిసి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నాయని, రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందాన్ని రాహుల్ గాంధీ తన బావైన రాబర్ట్ వాద్రాకు ఇప్పించాలని చూస్తున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చేసిన ఆరోపణల్లో ఏమైనా అర్థం ఉందా? రాఫెల్ ఒప్పందానికి పాకిస్థాన్‌కు సంబంధం ఏమిటీ? ఆ ఒప్పందంలో రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీ తప్పుకుంటే, ఆ ఒప్పందంలో రాబర్ట్ వాద్రా కంపెనీని చేర్చే అవకాశం ఎలా ఉంటుంది? ఎందుకు ఉంటుంది? ఉంటుందనుకుంటే దీనిపై ఇంత రాద్ధాంతం చేస్తున్న రాహుల్ గాంధీ, వాద్రాకు ఎలా ఇప్పించుకుంటారు? హొలాండే ఆరోపణల బాంబు పేల్చిన దాదాపు 24 గంటల పాటు మౌనం పాటించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ మరుసటి రోజు హొలాండే ఇదే విషయమై మరోసారి చేసిన వ్యాఖ్యల్లో సగ భాగాన్నే తీసుకొనే అర్ధరహితంగా ఎందుకు స్పందించింది? ఆ రెండో భాగాన్నే తీసుకున్న ప్రభుత్వ అనుకూల మీడియాలోని ఓ భాగం మోదీ ప్రభుత్వానిది తప్పులేదని తేల్చగా మిగతా మీడియా ‘ఇది మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్’ అని పేర్కొన్నాయి. ఫ్రాన్స్‌లోని ‘మీడియా పార్ట్’ వెబ్‌సైట్‌తో శుక్రవారం హొలాండే మాట్లాడుతూ రిలయెన్స్ విషయంలో మోదీ ప్రభుత్వం ప్రమేయం గురించి వెల్లడించిన విషయం తెల్సిందే. ఆ మరుసటి రోజు ‘ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ (ఏఎఫ్‌పీ) ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. ‘రాఫెల్ ఒప్పందంపై జరిగిన చర్చల్లో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం కొత్త ఫార్ములా కింద రిలయెన్స్ గ్రూపు పేరును తీసుకొచ్చింది’ అని హొలాండే అన్నారు. డాస్సూతో పనిచేసేందుకు రిలయెన్స్ గ్రూప్ విషయంలో భారత ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందని మీరు భావిస్తున్నారా? అని ఏఏఫ్‌పీ నొక్కి ప్రశ్నించగా ‘అది నా కంతగా తెలియదు. ఈ విషయంలో సమాధానం ఇవ్వగలిగిందీ డాస్సూ కంపెనీయే’ అంటూ హొలాండే వ్యాఖ్యానించారు. మొదటి ప్రశ్నకు మోదీ ప్రభుత్వమే రిలయెన్స్ గ్రూప్‌ను తీసుకొచ్చిందంటూ స్పష్టం చేసిన హొలాండే రెండో ప్రశ్నకు కొద్దిగా మార్చి తనకంటే డాస్సూకే ఎక్కువ తెలుసునని చెప్పారు. భారత వివాదంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం ఎందుకనే ఉద్దేశంతోనే ఆయన అలా సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే భారత్‌లోని పాలకపక్ష మీడియా రెండో ప్రశ్నకు హొలాండే ఇచ్చిన సమాధానాన్నే ప్రచురించి మోదీ ప్రభుత్వానికి క్లీన్చిట్ ఇచ్చింది. 126 రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కాస్త 36 విమానాలకే ఎందుకు పరిమితం అయింది? డాస్సూ కంపెనీకి భారత భాగస్వామ్య కంపెనీగా ప్రభుత్వ రంగ సంస్థ ‘హిందుస్థాన్ ఎరోనాటిక్స్ కంపెనీ’ స్థానంలో రిలయెన్స్ డిఫెన్స్ కంపెనీ ఎలా వచ్చింది? 16 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ కాస్త 51వేల కోట్ల రూపాయలకు ఎందుకు చేరుకుంది? వీటిల్లో ఏ ప్రశ్నకు కూడా మోదీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన సమాధానం లేదు. ఇక పారదర్శకత ఎక్కడ? -
అవినీతి నిరోధకచట్టం.. పారదర్శకత
సందర్భం ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమిలో ఐఏఎస్ ఆఫీసర్ల శిక్షణ రెండు భాగాలుగా జరుగుతుంది. తొమ్మిది నెలల మొదటి భాగం శిక్షణ తరువాత జిల్లాలలో శిక్షణకు వెళ్లి తిరిగి మూడు నెలల రెండో భాగం శిక్షణకు అధికారులు ముస్సోరికి వస్తారు. మా శిక్షణ సమయంలో రెండో భాగం శిక్షణకు వచ్చినప్పుడు అకాడమి పరిపాలనాధికారిగా అప్పు గారు ఉండేవారు. ఆయన ఆధ్వర్యంలో శిక్షణ చాలా ఉత్సాహపూరితంగా నడిచింది. చిన్న చిన్న గ్రూపులలో చాలా అంశాలు చర్చించేవాళ్ళం. అందులో ఒక అంశం నాకు బాగా గుర్తు. సమర్థవంతమైన అవినీతి అధికారి లేదా అసమర్థుడైన నిజాయితీపరుడైన అధికారులలో ఎవరు మెరుగు అనే అంశం. తర్వాత మెల్లగా తెలిసిన విషయం ఏమిటంటే అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని సెక్షన్ల మూలంగా నిజాయితీపరుడైన సమర్థవంతమైన అధికారిని అవినీతిపరుడిగా చిత్రీకరించే అవకాశాలున్నాయని. నిర్ణయాలు తీసుకోని అధికారులు, అవినీ తిపరులైన, ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకునే అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదవుల్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయని. చాలామంది నిజాయితీపరులు, సమర్థులు అయిన అధికారులకు ఇబ్బంది కలిగించిన సెక్షన్ 13(1)డి(జీజీ)(జీజీజీ). ఒక ప్రభుత్వ అధికారి తన అధికారిక స్థానాన్ని దుర్వినియోగపరిచి ఎవరికైనా మేలు చేకూర్చినా లేక తన చర్యల ద్వారా ఇంకెవరికైనా మేలు కలగజేసినా.. అది ప్రజాహితానికి అనుగుణంగా లేకపోతే దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు. న్యాయస్థానాలు తమ తీర్పుల ద్వారా అధికార దుర్వినియోగానికి విస్తృత నిర్వచనాన్ని ఇచ్చారు. తనకు అధికారం లేకపోయినా నిర్ణయం తీసుకోవటం నుంచి హేతుబద్ధంగా లేని నిర్ణయాల వరకు, అవసరం లేని అంశాలు పరిగణనలోకి తీసుకోవటం, అవసరమైన అంశాలు పరిగణలోకి తీసుకోకపోవటం అన్నీ అధికార దుర్వినియోగ నిర్వచనం కిందికి తీసుకొని రావడం జరిగింది. కానీ, అధికారులు తీసుకునే ఏ నిర్ణయాన్నయినా అధికార దుర్వినియోగంగా చిత్రీకరించి నేరపూరితమైన దుష్ప్రవర్తన కింద చర్య ప్రారంభించవచ్చు. అలాగే ప్రతి పరిపాలనాపరమైన చర్య ఎవరో ఒకరికి మేలు చేకూరుస్తుంది. ఇక ప్రజాహితం అనేది కోర్టుల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సమయంలో ఉన్న సమాచారానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో పరిశీలిస్తే మరొకరకంగా గోచరించవచ్చు. ఈ రెండు సెక్షన్ల కనుగుణంగా పరిశోధనా సంస్థలు నిజాయితీపరులైన సమర్థ అధికారులపై చర్యలు ప్రారంభించాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు విధివిధానాలను సరిగ్గా పాటించలేదు అనే ఒకే నెపం మీద నేరపూరిత చర్యలు వీరిపై మోపారు. ఎటువంటి అవినీతిగానీ, ఆర్థికంగా లాభపడ్డారని గానీ ఆధారాలు లేకపోయినా కేవలం నిర్ణయం తీసుకునేటప్పుడు జరిగిన విధాన లోపాలను నేరపూరిత లోపాలుగా పరిగణించి చర్యలు ప్రారంభించారు. దీనితో అధికారులలో నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఈ అంశాలను గుర్తించే ఈనాడు ప్రభుత్వం అవినీతి నిరోధక చట్టంలో మౌలికమైన మార్పు తీసుకొచ్చింది. ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరి చినా, ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినా నేరపూరితమైన చర్యగా పరిగణిస్తారు. అంతకు ముందు చట్టంలో ఉన్న 13 సెక్షన్ సమూలంగా మార్చడం జరిగింది. అధికారులు తీసుకున్న చర్యల మూలంగా ఎవరికైనా లబ్ధి జరిగితే వారు నేరపూరిత చర్య జరిపినట్టుగా భావించే విధానాన్ని పూర్తిగా తొలగించారు. నిజాయితీగా, సమర్థవంతంగా నిర్ణయాలు తీసుకోవాలనుకునే అధికారులకు భవిష్యత్తులో దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఉంటాయని భావించకుండా పనిచేసుకునే అవకాశాన్ని ఈ మార్పులు కల్పిస్తాయి. కానీ పరిశోధనా సంస్థలు ఏ ప్రభుత్వ ఉద్యోగిపై అయినా విచారణ చేయాలంటే ప్రభుత్వ అనుమతి ఈ చట్ట సవరణ ద్వారా తప్పనిసరి చేశారు. ఈ మార్పులు పరిశోధనా సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి ప్రతిబంధకం కావచ్చు. దీనికి బదులు నిరంతరంగా అనుమతినిచ్చే అధికారాన్ని ఒక అధికారుల కమిటీకి అప్పగించి ఉంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉండేది. ఏ అవినీతి నిరోధక చట్టమైనా ఒక్క నిజాయితీపరుడైన అధికారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. కొందరు అవినీతిపరులు తప్పించుకున్నా ఫర్వాలేదు. నిజాయితీపరుడైన అధికారి ఇబ్బందికి గురైతే అధికారుల మనోసై్థర్యం దెబ్బతింటుంది. దీనితో నిర్ణయాలు తీసుకోవటానికి జంకుతారు. దీని దుష్ప్రభావం అభివృద్ధి కార్యక్రమాల అమలు మీద ఉంటుంది. వ్యాసకర్త ఐవైఆర్ కృష్ణారావు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి iyrk45@gmail.com -
పారదర్శకతను పక్కన పెట్టిన ‘ఆప్’
సాక్షి, న్యూఢిల్లీ : పలు ఉన్నత ఆశయాలతో ప్రజల ముందుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ఎన్నికల రాజకీయ రంగంలో వాటిని నిలబెట్టుకోలేక ఒక్కొక్కదాన్ని వదిలేస్తూ వస్తోంది. ఈ వైఖరి నచ్చక ఉన్నత ఆశయాలతో పార్టీలోకి వచ్చిన వారు ఒక్కొక్కరే పార్టీకి దూరం కూడా అవుతున్నారు. ముందుగా పార్టీ వెబ్సైట్లో పార్టీకి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను పెట్టిన ఆప్ ఆ తర్వాత వాటిని తొలగించింది. తమ పార్టీకి విరాళాలిచ్చిన భారతీయులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్న కారణంగా వారి వివరాలను వెబ్సైట్లో పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకుడు, ఢిల్లీ కార్మిక మంత్రి గోపాల్ రాయ్ మీడియాకు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా ఇందుకు పూర్తి భిన్నంగా మాట్లాడారు. ‘ఈ విషయంలో బీజేపీ నుంచి వేధింపులు ఉన్నాయనడం అబద్ధం. వాస్తవానికి పార్టీతోపాటు దాతలు కూడా వారి పేర్లను వెబ్సైట్ ద్వారా వెల్లడించాలనే కోరుకుంటున్నారు. ఆ సమాచారాన్ని ప్రజలు నేరుగా వీక్షించేందుకు వీలుండాలిగానీ దుర్వినియోగం చేయడానికి వీలు ఉండకూడదు. అయితే అందుకు వెబ్‌సైట్‌ను మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. దానికి బ్రాండ్ విడ్త్ సరిపోవడంలేదు. మా సాంకేతిక బృందం సాంకేతిక పరిష్కారం కనుగొనే పనిలో ఉన్నారు. పార్టీ దాతల వివరాలను ఎలాగూ ఎన్నికల కమిషన్‌కు ఇస్తాం కదా!. 98 శాతం దాతలు తెల్సిన వారే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంటే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశాక దాతల వివరాలను మళ్లీ వెబ్సైట్లో పెడతామన్నట్లుగా ఆయన మాట్లాడారు. 2016 సంవత్సరంలో కూడా డోనర్ల పేర్లను ఆప్ వెబ్సైట్లో పెట్టి ఆ తర్వాత తొలగించింది. ఆ తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో మళ్లీ దాతల పేర్లను పెట్టింది. ఈసారి అలాంటి స్పందన ఉంటుందా అన్నది అనుమానమే! 2014–15 ఆర్థిక సంవత్సరానికి పార్టీకి అందిన వాస్తవ వివరాలకు, ఆదాయం పన్ను శాఖకు సమర్పించిన వివరాలకు పొంతన కుదరడం లేదంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఇచ్చిన నివేదికను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ వారం క్రితం అంటే, సెప్టెంబర్ 11వ తేదీనే ఆప్ పార్టీకి నోటీసు ఇవ్వడం, 20 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా అందులో కోరడం గమనార్హం. వచ్చిన మొత్తం విరాళాల్లో 13 కోట్ల రూపాయలను ఆప్ తక్కువ చేసి చూపించిందన్నది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆరోపణ. బోర్డే ఆదాయాన్ని లెక్కించడంలో తప్పు చేసిందని, తాము సమర్పించిన రిటర్న్స్‌లో అంకెలు సరిగ్గా ఉండగా, ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసులోనే తప్పుడు అంకెలు ఉన్నాయంటూ ఆప్ పార్టీ అధికార పార్టీ ప్రతినిధులు సమర్థించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టడం వల్లనే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమను వేధిస్తున్నాయని వారంటున్నారు. ప్రాంతీయ పార్టీలకు వస్తున్న విరాళాలను, అవి ప్రభుత్వ విభాగాలకు సమర్పిస్తున్న రిటర్న్స్‌ను ‘ది అసోసియేషన్ ఆఫ్ ది డెమోక్రటిక్ రిఫామ్స్’ లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. కొన్ని పార్టీలు ఇప్పటికీ ఈ విషయంలో పారదర్శకతను పాటిస్తుండగా, ఎక్కువ పార్టీలు పాటించడం లేదని సంస్థ సహ వ్యవస్థాపకుడు, బెంగళూరులోని ఐఐఎం ప్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి తెలిపారు. 2016–2017 సంవత్సరానికి ఆదాయం పన్ను శాఖ నివేదిక ప్రకారం ఆప్ పార్టీ ఆదాయం 30.8 కోట్ల రూపాయలు. కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత విరాళాలు, పార్టీ కార్యకర్తల నుంచి వచ్చినట్లు ఆ పార్టీ చూపించిన విరాళాలు 24.7 కోట్ల రూపాయలు. రెండింటి మధ్య వ్యత్యాసం 6.1 కోట్ల రూపాయలు. వాటిలో వ్యక్తుల నుంచి వచ్చిన విరాళాల మొత్తం 20.8 కోట్ల రూపాయలు కాగా, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన విరాళాలు 3.8 కోట్ల రూపాయలు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 20 వేల రూపాయలకు మించి వచ్చిన విరాళాల వివరాలను విధిగా వెల్లడించాలి. కానీ ఈరోజుల్లో చాలా రాజకీయ పార్టీలు పారదర్శకంగా వ్యవహరించడం లేదని శాస్త్రి ఆరోపించారు. నేడు అన్ని రాజకీయ పార్టీలు విరాళాలు వచ్చిన సోర్స్ వెల్లడించకుండా దాచాలని కోరుకుంటున్నాయని, అంటే అందులో దాచాల్సిన అంశమేదో కచ్చితంగా ఉన్నట్లేనని, ఏదిఏమైనా పారదర్శకత అత్యవసరమని డెమోక్రటిక్ రిఫామ్స్ సంస్థ వ్యవస్థాపకులు, అహ్మదాబాద్‌లోని ఐఐఎం మాజీ డీన్ జగధీప్ ఛోకర్ వ్యాఖ్యానించారు. అంటే, ఆప్ పార్టీ కూడా విరాళాల సోర్స్‌ను వెల్లడించకుండా ఏదో దాచేందుకు ప్రయత్నిస్తుందన్నది సుస్పష్టం. -
జీవోల గోప్యత.. ఏదీ పారదర్శకత!
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో నిర్ణయాల అమలుకు ఉద్దేశించి వెలువరించే జీవోల గోప్యత రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం జీవో రూపంలో ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే సంప్రదాయం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వం 2016లో వెలువరించిన జీవోల్లో 56 శాతాన్నే వెబ్సైట్లో పెడితే, 2017లో 42 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం పోరాడుతున్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద సేకరించిన జీవోల వివరాలను శుక్రవారం వెల్లడించింది. జీవోలన్నింటినీ ప్రభుత్వ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలన్న డిమాండ్‌ను ఇప్పటికే ప్రభుత్వం, గవర్నర్, న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లింది. అయినా ప్రభుత్వం మాత్రం గత రెండేళ్లలో మొత్తం 44,329 జీవోలకు గాను 21,869 అంతర్గత (ఇంటర్నల్) జీవోలను వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదని సమాచారహక్కు చట్టం ద్వారా ఐటీశాఖ తేల్చిచెప్పింది. జీవోలన్నీ పెట్టేదాకా పోరాటం ప్రభుత్వం ఇప్పటికే అంతర్గత జీవోల పేరుతో ఏసీబీ కేసుల విత్‌డ్రా, ప్రాజెక్టుల అంచనాలు పెంచడం, న జరాల ప్రకటనలకు సంబంధించిన నిర్ణయాల జీ వోలను ‘ఇంటర్నల్’పేరుతో వెబ్సైట్లో ప్రజలకు అం దుబాటులో ఉంచకపోవటం సరైన నిర్ణయం కాదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి అన్నారు. తాము ఇప్పటికే గవర్నర్‌ను కలిశామని, హైకోర్టును కూడా ఆశ్రయించామని తెలిపారు. వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్న జీవోలు అధికారుల టూర్లు, అలవెన్సులకు సంబంధించినవే ఉంటున్నాయని, దీని వల్ల ప్రజల కు ఏమీ ఉపయోగం ఉంటుందని ప్రశ్నించారు. ప్రజల నిధులు, వారి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు వెల్లడించకపోవటం దారుణమైన పరిణామమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకత కోసం కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని పద్మనాభరెడ్డి చెప్పారు. -
పోలీసు అభ్యర్థులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్
సాక్షి, హైదరాబాద్ : భారీ స్థాయి ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. నియామకాల్లోని దేహదారుఢ్య పరీక్షలు, పరుగు, లాంగ్‌జంప్, షాట్‌పుట్ వంటి పరీక్షల్లో కచ్చితత్వం కోసం టెక్నాలజీ వినియోగించేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటివరకు మౌఖిక పద్ధతిలోనే లక్ష్యా న్ని చేరుకున్న అభ్యర్థులను గుర్తించేవారు. గతంలో అభ్యర్థి పరుగు ప్రారంభించిన సమయంలో స్టాప్‌వాచ్ ద్వారా ఎన్ని సెకన్లు, ఎన్ని నిమిషాల్లో చేరారో లెక్కగట్టేవారు. ఇలా అయితే అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దూకిన దూరం.. షాట్ పుట్ విసిరిన దూరాలను కచ్చితత్వంతో గుర్తించేందుకు తొలిసారిగా టెక్నాలజీని ఉపయోగించుకోవాలని బోర్డు ఉన్నతాధికారులు నిర్ణయించారు. లేజర్‌తో స్కానింగ్..! దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా నిర్వహించే పరుగు పందెంలో అభ్యర్థులకు ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వె న్సీ ఐడెంటిఫికేషన్)చిప్‌ను అమరుస్తారు. పరుగు ప్రారంభించిన క్షణం నుంచి లక్ష్యాన్ని చేరుకునే వరకు కంప్యూటర్లలో ఆటోమెటిక్‌గా రికార్డయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. అభ్యర్థి లక్ష్యాన్ని చేరుకునే స్థానంలో లేజర్ బీమ్స్ ఏర్పాటు చేయడం ద్వారా లక్ష్యాన్ని ఎవరు ముందు చేరుకున్నారో తెలిసిపోతుందని అధికారులు చెబుతున్నారు. షాట్‌పుట్‌లో ఎంత దూరం విసిరారన్నదానికి, లాంగ్‌జంప్‌లో దూరాన్ని లేజర్ బీమ్స్ ద్వారా లెక్కగట్టేలా ఏర్పాట్లు చేయనున్నారు. 41 వేల మంది దరఖాస్తు.. పోలీస్, ఫైర్, జైళ్ల విభాగాల్లో భర్తీ చేయనున్న 18 వేల పోస్టులకు ఈ నెల 9 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అయితే అధికారులు ఊహిం చిన దరఖాస్తులకు, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ తదితర పోస్టులన్నింటికీ కలిపి 41 వేల దరఖాస్తులే వచ్చినట్లు తెలిసింది. అధికారులు మాత్రం మొదటి వారంలోనే కనీసం లక్ష నుంచి 2 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని భావించినట్లు సమాచారం. చివరి వారంలో దరఖాస్తుల సంఖ్య ఒకేసారి పెరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం ప్రిపరేషన్‌పై అభ్యర్థులు దృష్టిసారించి ఉంటారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
మరింత పారదర్శకత అవసరం
న్యూఢిల్లీ: కొలీజియం సమావేశాల్లో మరింత పారదర్శకత అవసరమని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ అన్నారు. హైకోర్టు జడ్జీల్ని సుప్రీంకోర్టుకు ప్రమోట్ చేసే సమయంలో పనితీరు సరిగా అంచనావేయడం అరుదుగా జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ‘భారతదేశ అత్యున్నత న్యాయవ్యవస్థ: వివాదాంశాలు, భవిష్యత్తు అంచనాలు’ అంశంపై నిపుణుల బృందంతో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ‘మున్ముందు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎంపిక ప్రక్రియలో పాల్గొనేవారు.. వారి అభిప్రాయాల్ని అధికారికంగా నమోదు చేయాలి’ అని సూచించారు. సుప్రీంకోర్టులో అవసరమైన సంస్కరణలపై మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్య 31. ఆ సంఖ్య ప్రకారం చూస్తే.. సుప్రీంలో తమకు ప్రాతినిధ్యం ఉండడాన్ని ప్రతి రాష్ట్రం హక్కుగా భావిస్తోంది’ అని చెప్పారు. సుప్రీంకోర్టులో శాశ్వత రాజ్యాంగ ధర్మాసనం ఉండాల్సిన అవసరంపై ఆయన స్పందిస్తూ.. దీనిపై మళ్లీ దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. -
ఖజానాలో ఆన్లైన్ లావాదేవీలు
నెల్లూరు(పొగతోట) : ప్రభుత్వ ఖజానా కార్యాలయాల్లో ఆన్లైన్ చెల్లింపుల ప్రక్రియ ఈ నెల రెండు నుంచి ప్రారంభమైంది. ఉద్యోగుల వేతనాలు, ఇతర బిల్లులు, పింఛన్లను ఖజానాల ద్వారా చెల్లిస్తున్నారు. ఇక నుంచి ఉద్యోగుల వేతనాలను ఈ – కుబేర్ విధానంలో చెల్లించనున్నారు. గతంలో సంబంధిత శాఖల డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారులు ఖజానా కార్యాలయాల్లోని ఎస్టీఓలకు బిల్లులు సమర్పించే వారు. వారు పరిశీలించి ఏటీఓలకు, అక్కడ ఆమోదించిన అనంతరం బిల్లులను బ్యాంకులకు పంపించేవారు. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగేది. ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వస్తే వేతనాల చెల్లింపు నాలుగైదు రోజుల పాటు జాప్యం జరిగేది. ఈ – కుబేర్‌తో అక్రమాలకు చెక్ తాజాగా చేపట్టిన ఈ – కుబేర్ విధానంలో అక్రమాలకు చెక్ పెట్టే అవకాశం ఉంది. దీని వల్ల డీడీఓలకు జవాబుదారీతనం పెరగనుంది. గతంలో బిల్లుల మంజూరు కోసం ప్రభుత్వోద్యోగులు రోజుల తరబడి ఖజానా కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. అయితే ప్రస్తుత విధానంతో సమస్య తీరనుంది. వేతనాలు, ఇతర బిల్లులను ఈ – కుబేర్ విధానంలో ఆన్లైన్లో పొందుపరిస్తే ఖజానా అధికారులు బిల్లులను పరిశీలించి ఆయా బ్యాంకులకు నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటారు. ఉన్నతాధికారులదే బాధ్యత జిల్లాలో జిల్లా ఖజానా కార్యాలయం, 15 ఉప ఖజానా కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 26400 మంది ప్రభుత్వోద్యోగులకు ప్రతి నెలా రూ.96 కోట్లను వేతనాల రూపంలో చెల్లిస్తున్నారు. 23500 మంది పింఛనర్లకు ప్రతి నెలా రూ.54 కోట్లు చెల్లిస్తున్నారు. ఇవే కాకుండా ప్రతి నెలా రూ.25 నుంచి రూ.30 కోట్ల ఇతర బిల్లులను మంజూరు చేస్తున్నారు. ఈ – కుబేర్ విధానంలో వేతనాలు, బిల్లులు అధికంగా లేదా తక్కువగా చెల్లించినా దానికి ఉన్నతాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. జిల్లా ఖజానా, సబ్ ట్రెజరీ అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుతం ఒకట్రెండు శాఖల మినహా అన్ని శాఖల ఉద్యోగుల వేతనాలు, పింఛన్లను చెల్లించారు. ఇతర బిల్లుల చెల్లింపులో జాప్యం జరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు ఆన్లైన్లో బిల్లుల చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోంది. ఏ సెక్షన్ వారు ఏయే శాఖల బిల్లులు చెల్లిస్తున్నారనే వివరాలను సేకరించాల్సి ఉంది. సెక్షన్ల వారీగా సంబంధిత అధికారులు, ఉద్యోగులకు పాస్‌వర్డ్‌ను కేటాయించాల్సి ఉంది. దీని తర్వాత శాఖల వారీగా ప్రత్యేక నంబర్లను కేటాయించి పూర్తి వివరాలను ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. ప్రక్రియ పూర్తి కావడానికి 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఈ నెల 20 తర్వాత పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపు ప్రక్రియ యథావిధిగా జరగనుంది. ప్రక్రియ ద్వారా అక్రమాలు జరిగే అవకాశం లేకపోయినా ఈ – కుబేర్‌లో లోపాలను కనుగొని మామూళ్లు వసూలు చేసే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైసలిస్తే కానీ బిల్లులు కదలని శాఖలో ఈ – కుబేర్ ఎంత వరకు ఫలితాలను తీసుకొస్తుందో వేచ్చి చూడాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ప్రభుత్వోద్యోగుల వేతనాల చెల్లింపు, పింఛన్లను ఈ నెల రెండు నుంచి ఈ – కుబేర్ విధానంలో చెల్లిస్తున్నాం. ఒకట్రెండు రోజులు జాప్యం జరిగినా వేతనాలు, పింఛన్లను చెల్లించాం. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. సెక్షన్ల వారీగా ప్రత్యేక పాస్‌వర్డ్‌లను కేటాయించాల్సి ఉంది. ప్రక్రియ పూర్తయి బిల్లులు మంజూరు చేయడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. –ఉదయలక్ష్మి, జిల్లా ఖజానా శాఖ డీడీ -
గ్రామాల్లోనూ ‘ఆధార్’
ఆదిలాబాద్ : ప్రభుత్వం ఇక నుంచి ఆధార్ నమోదును అంగన్వాడీ కేంద్రాలకు అప్పగించనుంది. దీంతో ఆధార్ నమోదు ప్రక్రియ సులభతరం కానుంది. ఇకపై ప్రధాన అంగన్వాడీ కేంద్రాలన్నీ ఆధార్ కేంద్రాలుగా మారనున్నాయి. ప్రస్తుతం మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసుల్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శాశ్వత ప్రత్యేక కౌంటర్లో మాత్రమే ఆధార్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో ఈ కేంద్రాలు లేకపోవడంతో ప్రజలంతా మండల కేంద్రాలు, సమీపంలోని పట్టణాలకు వెళ్లి ఆధార్ నమోదు చేయించుకోవాల్సి వస్తోంది. అంతేగాక చంటి పిల్లల ఆధార్ నమోదు తల్లిదండ్రులకు ఇబ్బంది కరంగా మారుతోంది. మరోవైపు ఆధార్ నమోదు కోసం రుసుం, రవాణా చార్జీలు, సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహకులకే ఆధార్ నమో దు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయిం చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు ఆధార్ రిజిస్ట్రేషన్ అధికారాలు ఇవ్వాలని భావి స్తోంది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో ఉన్న ఐసీడీఎస్‌లను ఆధార్ నమోదు ఏజెన్సీలుగా అభివృద్ధి చేయనుంది. ఈ ఏజెన్సీల పర్యవేక్షణలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు ఆధార్ నమోదును నిర్వహించనున్నాయి. గ్రామీణుల చెంతకు.. జిల్లాలో 18 మండలాల్లోని 243 గ్రామ పంచాయతీల పరిధిలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 1256 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 90 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం, జనాభా ఆధారంగా అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో 8 నుంచి 10 కేంద్రాలు ఉండగా, చిన్న గ్రామాల్లో ఒక్కో కేంద్రం చొప్పున కొనసాగుతున్నాయి. తాజాగా ఐసీడీఎస్ పరిధిలోని సీడీపీఓ(శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి)కు ఆధార్ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో జిల్లా వ్యాప్తంగా ఆధార్ ఏజెన్సీలు ఏర్పాటు కానున్నాయి. ఏజెన్సీలో ఎంతమంది ఆపరేటర్లను ఏర్పాటు చేయాలనే అంశాలపైనా ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్రతి గ్రామానికి ఒక కేంద్రం నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్న ఆ శాఖ ఆ ప్రకారం ప్రణాళికలు రూపొందించేందుకు సిద్ధమైంది. ప్రతి కేంద్రానికి ఒక ఆధార్ ఎన్రోల్మెంట్ కిట్ ఇవ్వనున్నారు. పథకాల్లో పారదర్శకత.. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో ఆధార్ కీలకంగా మారింది. ఆసరా పింఛన్లు మొదలు బాలమృతం పథకానికి ఆధార్‌ను కీలకం చేసింది. శిశువుల పౌష్ఠికాహార పథకాల్లో ఆధార్ సంఖ్య కావాల్సి ఉన్నప్పటికీ చిన్నపిల్లలకు కార్డుల జారీలో ఎదురవుతున్న సమస్యల దృష్ట్యా వాటిని మినహాయింపు ఇస్తోంది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలకు వెంటనే ఆధార్ నమోదు చేపట్టి కార్డులు జారీ చేస్తే పథకాల అమలు పారదర్శకంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతోపాటు ప్రస్తుతం పథకంతోపాటు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నా.. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా.. పాన్‌కార్డు, రేషన్‌కార్డు, హెల్త్‌కార్డు.. ఇలా ప్రతీదానికి ఆధార్‌కార్డు అవసరం ఉంటుంది. ఈ ఆధార్ నమోదు కోసం దూర ప్రాంతాలైన గ్రామీణులు పట్టణాలకు రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. రోజంతా కూలీ పని మానుకొని వస్తారు. ఇలాంటి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం గ్రామాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా వారి ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఈ విషయంపై ఐసీడీఎస్ డీడబ్ల్యూఓ మిల్కాను వివరణ అడుగగా ఇంకా తమకు ప్రభుత్వం నుంచి ఇంకా సర్క్యూలర్ రాలేదన్నారు. -
మచ్చుకైనా లేని పారదర్శకత!
విశ్లేషణ విజిలెన్స్ అంటే అప్రమత్తంగా ఉండటం. తప్పు జరగకుండా నిరోధించడం. అందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని, వాటిని సక్రమంగా అమలు చేయడం.. కాని వ్యవస్థలే అవినీతికి దోహదం చేస్తే దాన్ని నివారించడం అసాధ్యం. అవినీతి, లంచగొండితనాన్ని ఏ విధంగా తగ్గించాలనే విషయంలో చర్యల కన్న ఎక్కువగా చర్చలే జరుగుతుం టాయి. ఆ చర్చల పర్యవసానం పెద్దగా ఉండకపోయినా, చాలామందిలో కొంత ఆలోచన వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అక్టోబర్ చివరివారంలో విజిలెన్స్ వారోత్సవం జరుపుతారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆవిర్భవించిన సందర్భంలో ఈ వారోత్సవాలు నిర్వహించాలి. ఈ సంవత్సరం ‘నా కల అవినీతి రహిత భారతం’ అనే అంశం మీద చర్చలు సమావేశాలు, పోటీలు జరిపించాలని విజిలెన్స్ కమిషన్ సూచించింది. లంచాలు లేని సమాజం వినడానికి ఊహించడానికి చాలా బాగుంది. కాని అవినీతి అంటే కేవలం లంచాలు తీసుకోవడం మాత్రమే కాదు. నోటికొచ్చినట్టు అబద్ధం ఆడటంతో మొదలై, ఒక రీతి రివాజు లేకుండా అడ్డదిడ్డంగా వ్యవహరించడం, ఆలోచనా వివేకం లేకుండా తగాదాలు పెట్టుకోవడం, ఎప్పుడూ మరొకరిని ఏడిపిస్తూ వినోదించడం, పరోపకారం మాట అటుంచి అవసరమైన సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేవి దారుణమైన వ్యక్తిత్వాలు. ఇదంతా అవినీతి. విజిలెన్స్ అంటే జాగరూకత, అప్రమత్తంగా ఉండటం. తప్పు జరగకుండా నిరోధించడం. అందుకు వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడం, ఆ వ్యవస్థలు ఉంటే వాటిని సక్రమంగా అమలు చేయడం.. కాని వ్యవస్థలే అవినీతికి దోహదం చేస్తే దాన్ని నివారించడం అసాధ్యమవుతుంది. ఉదాహరణకు హైవేల మీద పౌరులకు జాగ్రత్తలు తెలియజేసే వ్యవస్థ లేకపోవడం, రెండుమూడు మైళ్లదాకా కనీస వైద్య సదుపాయాలు సమాచార ప్రసార వ్యవస్థ లేకపోవడం తీవ్రమైన లోపాలు. శరవేగంగా వెళ్లగల జాతీయ రహదారులు ప్రగతికి మార్గాలే. కాని వాటి నిర్వహణలో అనుబంధ సేవల కల్పనలో నియమాలు పాటించకపోవడం వల్ల అవి మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఏటా వందల మంది ప్రాణాలు కోల్పోతుంటే ఎవరూ ఏమీ చేయడం లేదు. రైళ్లు పట్టాలు తప్పుతూ ఉంటే, ప్రమాదాలు జరుగుతూ ఉంటే పట్టించుకునే వాడు లేడు. రోడ్డు దాటే వంతెనలు లేక, మెట్రో, లోకల్ రైల్వేస్టేషన్ల ద్వారా జనం అవతలి పక్కకు వెళ్లడానికి ప్రయత్నిస్తూ రద్దీలో ఇరుక్కుపోయి తొక్కిసలాటలో ప్రాణాలు పోతుంటే గాని పాదచారుల వంతెనలు రోడ్డు పక్కన కాలిబాటల అవసరాలు గుర్తుకు రావడం లేదు. ఇవన్నీ అక్రమాలు, ఇదంతా అవినీతి. వర్షాలకు అవిభాజ్య కవల సోదరులు వరదలు. రోడ్డుమీదనుంచి నీళ్లు ఎటుపోవాలో ప్రణాళికలో ఉండదు. అసలు వానలే రావనే నమ్మకంతో రోడ్ల నిర్మాణం చేస్తున్నారు. అభివృద్ధి పనులకోసం పౌరుల భూములు ప్రభుత్వం స్వీకరిస్తుంది. దాన్ని సేకరణ అంటారు. నిజానికి అది స్వాధీనం చేసుకోవడమే. అవసరం ఏమిటో వారు నిర్ధారించి, వారే నష్టపరిహారాన్ని నిర్ణయించి, తప్పనిసరిగా భూమిని ఇచ్చేయాలని ఆదేశించడానికి కావలసిన అధికారాన్నిస్తూ భూసేకరణ చట్టం ఒకటి బ్రిటిష్ కాలంలో రూపొందించారు. దాన్నే 2013దాకా అమలు చేశారు. కాని అందులో అన్యాయంగా ప్రభుత్వం ప్రజల భూములను స్వాధీనంచేసుకుంటూ ఉంటే పరిష్కారం లేకుండా పోయింది. కోర్టుల్లో ఏళ్లతరబడి పోరాడితే న్యాయం దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి నెలకొన్నది. ఎన్నెన్నో ప్రాజెక్టులకోసం భూములు స్వాధీనం చేసుకున్నారు కాని పరిహారాలే ఇవ్వలేదు. వ్వజూపిన పరిహారం సరిపోదని వాదిస్తే కోర్టులెక్కాల్సి వచ్చేది. కోర్టుల్లో ఇరవై ఏళ్ల తరువాత కనీసం పది శాతం కూడా ధర పెరిగేది కాదు. ఖర్చులతో పోల్చితే పరిహారం పెంపు మరింత నష్టం కలిగించేది. ఈ చట్టం స్వతంత్ర భారత దేశంలో ప్రతిజిల్లాలో అవినీతిని పెంచి పోషించింది. వందల వేలు లక్షల కోట్లరూపాయల లంచగొండితనాన్ని ఈ చట్టం కనుసన్నల్లో ప్రజలు కళ్లారా చూసారు. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టు భూములను స్వాధీనం చేసుకుని తమకు అనుకూలంగా వాడుకున్న సందర్భాలు కోకొల్లలు. భూసేకరణ నోటిఫికేషన్ లు జారీ చేయడం కూడా భారీ కుంభకోణాల పుట్టగా తయారైంది. ఫలానా చోట ప్రాజెక్టు వస్తుందని ముందే సమాచారం లోపాయికారిగా కొందరికే చెప్పి, చుట్టు పక్కల భూములు తామే తక్కువ ధరకు కొని, ప్రాజెక్టు వల్ల భూమి ధర పెంచి లక్షల కోట్ల రూపాయలు దండుకొనే అవినీతి అసలు పట్టుకునే అవకాశమే లేదు. ఈ దుర్మార్గపు చట్టం నుంచి విముక్తికోసం పోరాటాలు ఉద్యమాలు జరిగాయి. చివరకు ఎన్నో నియమాలను ప్రతిపాదించి, ఎందరితోనో చర్చించి 2013లో ఒక కొత్త చట్టాన్ని రూపొందించారు. లోపాలేమీ లేవని చెప్పడానికి వీల్లేకపోయినా ఈ చట్టం కింద భూమి కోల్పోయే వారికి కావలసినంత నష్టపరిహారం కోరే అవకాశం లభించింది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే మొత్తం భూమి స్వాధీన వ్యవహారాలు పారదర్శకంగా సాగించాలనే నియమం. ఏ ప్రాజెక్టుకోసం ఎవరి భూమి ఎంత మేరకు, ఎంత ధర ఇచ్చి తీసుకుంటున్నారనే ప్రతి అంశాన్ని ప్రతిదశలో ప్రజలకు తెలియజేసే పారదర్శకత ఉండాలని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. కాని ఆ పారదర్శకతను కూడా పాటించకుండా ఈ చట్టాన్నే పక్కకు బెట్టి భూములు సేకరించే విధానాలను కనిపెట్టారు. అవినీతికి ఆస్కా రంలేని పారదర్శక విధానాలు లేకుండా నిఘాలు, విజి లెన్స్‌లు ఉపయోగపడవు. -మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
చైనా కంపెనీలే వరస్ట్ ...
హాంగ్ కాంగ్ : పారదర్శకతలో భారత సంస్థలే బెస్ట్ అట..చైనా సంస్థలు వరస్ట్ అని సర్వేలు తేల్చాయి. భారత్ లో అత్యంత పారదర్శకత కలిగిన కంపెనీలు ఉన్నాయని.. అదే చైనా సంస్థలలో పారదర్శకత లోపించిందని గ్లోబల్ యాంటీ-గ్రాప్ట్ వాచ్ డాగ్స్ సర్వే సోమవారం వెల్లడించింది. బ్రెజిల్, మెక్సికో, రష్యా, భారత్ లాంటి 15 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 100 కంపెనీలను ఈ రిపోర్టు కవర్ చేసింది. ఈ రిపోర్టులో పారదర్శకతలో భారత కంపెనీలే టాప్ లో ఉన్నట్టు తేలింది. కఠినతరమైన ప్రభుత్వ నిబంధనలు, వివిధ దేశాల్లో ఆపరేట్ చేసే కంపెనీలకు ఇచ్చే సబ్బిడరీల వల్ల పనితీరు మెరుగ్గా ఉన్నట్టు తెలిపింది. టెలికాం కంపెనీ భారతీ ఎయిర్ టెల్ 10 మార్కుల స్కోరులో 7.3 దక్కించుకుని టాప్ ప్లేస్ లో నిలిచినట్టు రిపోర్టు నివేదించింది. టాటా సంస్థ ఆరు యూనిట్లు, టెక్నాలజీ కంపెనీ విప్రోలు టాప్ లో చోటు దక్కించుకున్నాయి. అయితే కేవలం ఒకే ఒక్క చైనా సంస్థ జడ్ టీఈ, టాప్ 25లో ఉన్నట్టు వాచ్ డాగ్స్ రిపోర్టు పేర్కొంది. సర్వేలో అతిపెద్ద గ్రూప్ గా తీసుకున్న చైనా 37 కంపెనీల పనితీరు చాలా బలహీనంగా ఉన్నట్టు తేలింది. మూడు కంపెనీలైతే 10 మార్కుల స్కోరులో జీరోను నమోదుచేశాయని తెలిపింది. ఆటోమేకర్ చెర్రీ, అప్లియన్స్ తయారీదారి గాలాంజ్, ఆటో పార్ట్ ల తయారీసంస్థ వాంక్సియాంగ్ గ్రూప్ లు జీరోను నమోదుచేసిన చైనా కంపెనీలుగా నిలిచాయి. పారదర్శకత లోపించి దిగువన నమోదైన 25 కంపెనీలు చైనావే. 2013 కార్పొరేట్ రిపోర్టింగ్ సర్వేతో పోలిస్తే ఈ సర్వేలో మొత్తంగా పారదర్శకత స్కోర్ పడిపోయింది. 10లో 3.4 ఫ్రాక్షన్ కిందకు జారింది. కంపెనీల మూడు త్రైమాసికాలు సగం కంటే ఎక్కువగానే పతనమైనట్టు సర్వే తేల్చింది. రిపోర్టు కనుగొన్న అంశాలు చాలా విషాదకరంగా ఉన్నాయని.. పెద్ద బహుళ జాతీయ కంపెనీలు అవినీతితో మరింత పోరాడాల్సినవసరం ఉందని సర్వే పేర్కొంది. కంపెనీలో అవినీతి వాతావరణం పెరగడం ప్రమాదకరమని బెర్లిన్ కు చెందిన ఈ వాచ్ డాగ్ సర్వే హెచ్చరించింది. -
హెచ్-1 బి వీసా లాటరీ పద్ధతిపై పిటిషన్
వాషింగ్టన్: హెచ్-1బి వీసాల జారీ ప్రక్రియపై అమెరికాకు చెందిన రెండు టాప్ అమెరికన్ ఇమ్మి గ్రేషన్ సలహా సంస్థలు ఫెడరల్ ప్రభుత్వంపై పోరాటానికి దిగాయి వీసాల జారీ ప్రక్రియలో పారదర్శకతను పాటించాలంటూ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ కౌన్సిల్, అమెరికన్ లాయర్స్ అసోసియేషన్లు, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, అమెరికా పౌరసత్వం మరియు ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కు వ్యతిరేకంగా ఈ ఒక పిటిషన్ దాఖలు చేశాయి. లాటరీ పద్ధతి ద్వారా వీసాను మంజూరు చేసేపద్ధతిని సమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈఎంపిక విధానాన్ని పూర్తిగా ప్రజలకు వివరించకుండా అమలు ప్రక్రియను ప్రకటించారని ఇవి ఆరోపించాయి. మొదటినుంచీ, చివరివరకు జరిగే వీసా జారీ ప్రక్రియ, చట్టబద్ధంగా జరుగుతుందా లేదా అనేది అమెరికా ప్రజానీకానికి బహిరంగ పర్చాలనేది తమ ఉద్దేశమని లీగల్ డైరెక్టర్ మెలిస్సా క్రో తెలిపారు. కాగా 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బి వర్క్ వీసాలకోసం దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 1 నుంచి మొదలుకాగా ఇంతవరకు వీసా జారీ ప్రక్రియ మొదలుకాలేదు. అమెరికా కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రోగామింగ్ వంటి అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్-1బి వీసాలను వినియోగిస్తుంటాయి. వీరిలో ఎక్కువమంది భారతీయులే . ఈ సం.రం నిర్దేశిత సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. అయితే 65వేలకు పైగా దరఖాస్తులు అందుతాయని ఆశిస్తున్నట్టు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. ఒకవేళ యూఎస్సీఐఎస్ అనుకున్నదానికంటే ఎక్కువమొత్తంలో హెచ్-1బి దరఖాస్తులు అందినట్లైతే కంప్యూటర్ అధారిత లాటరీ విధానం ద్వారా దరఖాస్తులను ఎంపిక చేస్తామన్న సంగతి తెలిసిందే. -
పారదర్శకత.. పదేళ్ల పాఠం
సమకాలీనం ఈరోజు, రేపు... రెండురోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న ‘సమాచార హక్కు జాతీయ వార్షిక సదస్సు‘లో ఆర్టీఐ క్షేత్రస్థాయి కార్యకర్తల్ని భాగస్వా ముల్ని చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇది ఉద్దేశపూర్వక చర్య, కేంద్రంలోని ఎన్డీయే విభిన్న వైఖరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా సాగుతున్న పద్ధతికి తిలోదకాలిచ్చి, కేంద్ర-రాష్ట్ర కమిషనర్లు, ప్రభుత్వాధికారులకు తోడు పౌర సమాజం నుంచి ఎంపిక చేసిన కొందరు పెద్దల్ని మాత్రమే ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆర్టీఐ కార్యకర్తల్ని ఆహ్వానించకపోవడం వల్ల చట్టం అమలుపై జనాభిప్రా యం సదస్సులో చర్చకు వచ్చే అవకాశం పోతోంది. లోగడ జరిగిన వార్షిక సదస్సులలో వారు భాగస్వాములు. వారిచ్చే సమాచారం ఆధారంగా చర్చ, కొన్ని నిర్ణయాలూ జరిగేవి. చట్టం అమలు మొదలై పదేళ్లు పూర్తయిన సందర్భంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇటువంటి చర్య ఉపేక్షించదగింది కాదనేది విమర్శ. ఈ పదేళ్లపాటు దేశంలో, అనేక ప్రతిబంధకాల నడుమ ఆర్టీఐ సజీవంగా ఉండటానికి కార్యకర్తలే ముఖ్య కారణం. రెండు తెలుగు రాష్ట్రాలుసహా, దేశంలో పదేళ్ల ఆర్టీఐ ప్రస్థానాన్ని పరిశీలిస్తే రెండంశాలు స్పష్టమౌతున్నాయి. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతకు పట్టంకట్టిన సమా చార హక్కు చట్టం విజయవంతమైంది. కానీ, దాని అమలే విఫలమై పలు విధాలుగా భంగపడింది, భంగపడుతూనే ఉంది. పదేళ్లు చిన్న సమయమా? పెద్ద సమయమా? అంటే, వేళ్లూనుకు పోయిన దుర్వవస్థను సమూలంగా సంస్కరించడానికి ఇది పెద్ద సమయం కాకపోవచ్చు. కానీ, ఆశించిన లక్ష్యాల సాధన దిశలో సరైన పంథాలోనే ఉన్నామా అని సమీక్షించుకోవడానికి పదేళ్లు సముచిత సమయమే! వాడుకున్నోళ్లకు వాడుకున్నంత పిండికొద్ది రొట్టె వంటిది ఆర్టీఐ చట్టం. ఉపయోగిస్తేనే ప్రయోజనాలు. దర ఖాస్తుదారు ఆశపడ్డట్టే సంబంధిత అధికారులు స్పందిస్తేనే ఫలితం. మొదట్లో అంతగా లేదు కానీ, రానురాను వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్టీఐ దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి దాదాపు 50 లక్షలకు చేరింది. రాష్ట్రం లోనూ, మొదటి ఏడాది 2005-06లో 8 వేల పైచిలుకున్న దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి సగటున 1.7 లక్షలకు చేరింది. గతంలో గోప్యంగా ఉండే రకరకాల సమాచారం ఆర్టీఐ పుణ్యమాని ఇప్పుడు తేలికగా ప్రజా బాహుళ్యం లోకి వస్తోంది. పౌర సదుపాయాలతోపాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారుల ప్రయోజనాలు- హక్కులు, ప్రజాపంపిణీ, భూయాజమాన్య హక్కులు, పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు వంటి విషయాల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అధికార యంత్రాంగం సహజ వైఖరి, గోప్యంగా ఉంచే తత్వంవల్ల సాధారణ పరిస్థితుల్లో నిరాకరించే సమాచారాన్ని కూడా ఈ చట్టం కింద కోరినపుడు ఇవ్వాల్సి వస్తోంది. వేగం, ప్రభావం పెరగాలి పౌర కార్యాలయాల స్థాయిలోనే సమాచారం తేలిగ్గా లభించాలి. ఆ మేరకు అధికారుల్లో స్పందన, బాధ్యత-జవాబుదారీతనం పెరగాలి. అది లోపించిన పుడు కఠిన చర్యలు తీసుకునేలా సమాచార కమిషన్లు బలోపేతం కావాలి. అప్పీళ్లు, ఫిర్యాదుల్ని పరిష్కరించడంలో వేగంతో పాటు అధికార యంత్రాం గంపై వారి తీర్పులు, ఆదేశాల ప్రభావం పెరగాలి. వారి ఆదేశాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో సహకరించాలి. రెండూ జరగట్లేదు. చట్టం స్ఫూర్తిని పరిరక్షిస్తూ జనహితంతో ఆలోచించి, స్వతంత్రంగా వ్యవహరించే వారిని కమిషనర్లుగా నియమించాలి. గత పదేళ్ల అనుభవం మాత్రం ఇందుకు భిన్నం. చాలా రాష్ట్రాల్లో కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు నియమితులైన కమిషనర్లలో 76 శాతం మంది రిటైర్డ్ అధికారులని ఒక అధ్యయనం చెబుతోంది. సర్వీసులో ఎక్కువమార్లు ప్రజలకు సమాచారం నిరాకరించి పారదర్శకతకు మంగళం పాడినవారు, పునరావాస కేంద్రంలో భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం భ్రమే అన్నది నిపుణుల అభిప్రాయం. ఆర్టీఐ అప్పీళ్లు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయి. సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (సీఈఎస్) అధ్యయనం ప్రకారం, ఇప్పుడున్న వేగంతో వాటిని పరిష్కరిస్తే ఒక్కో రాష్ట్రంలో కేసుల పరిష్కారానికి 20, 30, 40 సంవత్సరాల కాలం పట్టొచ్చు. ఈ పంథా మారాలి. అన్ని కీలక పదవులు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లకే అప్పగించనవసరం లేదు, ఆయా రంగాల్లో నిపుణులైన బయటి వ్యక్తులకు ప్రాధాన్యమివ్వండని 2011, 2013లో సుప్రీంకోర్టు సుస్పష్టంగా చెప్పింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. భద్రతకు భరోసా కావాలి! ఆర్టీఐ పదేళ్ల ప్రస్థానంలో కార్యకర్తలపై జరిగిన హత్యలు ప్రమాద సంకేతం. ఓ పరిశీలన ప్రకారం, దేశవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలపై 260కి పైగా దాడులు జరిగి 49 మంది హత్యకు గురయ్యారు. వేళ్లూనుకున్న పాలనా దాష్టీకాలకు, రాజకీయ-అధికార యంత్రాంగానికి, అక్రమార్కులకూ మధ్య చీకటి సంబంధాలకు ఇది ప్రతీక! చాలా సందర్భాల్లో... దరఖాస్తుదారు సమాచారం కోరిన సంగతి, అక్రమాలతో సంబంధమున్న అసాంఘికశక్తులకు పౌర సమాచార అధికారు (పీఐవో)లే చేరవేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ‘వ్యాపం’కేసులో, ఆర్టీఐ కార్యకర్త నిర్దిష్ట సమాచారం కోరినట్టు పీఐవో ద్వారా విషయం తెలుసుకున్న ఓ డాక్డర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సతీష్శెట్టి హత్యకేసు విచారిస్తూ, ఆర్టీఐ కార్యకర్తలకు తగిన రక్షణ కల్పించా లని 2010లో ముంబై హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అంతకు ముందే, 2009లో ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒక ఉత్తర్వు ఇప్పించింది. సమాచారం కోరే ఆర్టీఐ కార్యకర్తలపై అధికారులుగానీ, వారి పనుపున అసాంఘికశక్తులుగానీ బెదిరిం పులు, భౌతికదాడులకు పాల్పడ్డపుడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సత్వరం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి. ఆ ఆదేశం ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది, అమలు మాత్రం అనుమానమే! ‘సమాజ వైతాళికుల రక్షణ చట్టం’ (డబ్లూబీపీఏ)కు పట్టిన గ్రహణం వీడటం లేదు. సమాజ హితం కోరి ఆర్టీఐనో మరో ప్రగతిశీల చట్టాన్నో వాడే కార్య కర్తల రక్షణ కోసం విజిల్ బ్లోయర్స్ యాక్ట్‌ను ప్రతిపాదించారు. 2011లో అప్పటి యూపీయే ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. 2014 మే 9న అది ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది. అటుపై అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభు త్వం దాన్ని కనీసం నోటిఫై చేయకుండా ఉంచింది. సవరణలతో నీరుగార్చి బలహీనంగా తెచ్చే యోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నీరుగార్చే వైఖరివల్లే అనర్థాలు ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచీ దాన్ని నీరుగార్చే యత్నాలు సాగు తున్నాయి.. చట్టం పుట్టి ఏడాది గడవకముందే, 2006లో ఫైళ్లలో రహస్యాల్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించేందుకు జరిగిన యత్నాన్ని పౌరసమాజం తిప్పికొట్టింది. మధ్యలో చాలా కుతంత్రాలు జరిగాయి. పర్యవేక్షణ విభాగ మంటూ, సిబ్బంది-శిక్షణ (డీవోపీటీ) మంత్రిత్వశాఖ పేరిట చట్టం స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి గండికొట్టిన సందర్భాలెన్నో! ఒక కేసులో సీఐసీ ఉత్త ర్వుల్ని ధ్రువపరుస్తూ, ‘మీరు సమాచారం ఇవ్వాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వంచించేలా రాజకీయ పక్షాల్ని పరిధి నుంచి తప్పించే చట్ట సవరణ యత్నాలు సాగుతున్నాయిపుడు. అంతకన్నా ప్రమాదకరంగా, మంత్రివర్గ సమావేశ పత్రాలు, ఆర్థికవ్యవహార పత్రాలు వంటి కీలక సమా చారాన్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించే ముసాయిదా ప్రతిపాదనలు వేచి ఉన్నాయి. అర్థంపర్థంలేని దరఖాస్తుల (ఫ్రీవోలస్)ని ముద్రవేసి వినతులకు పురిట్లోనే సంధి కొట్టడానికి, కార్యకర్తల్ని భయపెట్టడానికి ఇంకో యత్నం సాగుతోంది. ఇలా అసంబద్ధ దరఖాస్తులు చేసిన వారిపై 30 వేల రూపాయల వరకు జరిమానా, 3 మాసా లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నారు. పౌరసమాజం మరింత చైతన్యవంతమై ఆర్టీఐని కాపాడుకోవాల్సిన అవసరాన్ని పదేళ్ల చరిత్ర నొక్కిచెబుతోంది. పాలనలో పారదర్శకత పెంచి వ్యవస్థను జవాబుదారుగా నిలిపే క్రమంలో.. సమాచార సాధన చేయాల్సిందే, ఆర్టీఐ చట్టాన్ని ఉపకరణంగా వాడాల్సిందే! దిలీప్ రెడ్డి ( వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్). dileepreddy@sakshi.com