
కొత్త ఏడాదిలో కొత్త కొలువులు
- త్వరలో నోటిఫికేషన్లు జారీ
- టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
- నియామకాల్లో ప్రతిభకే పట్టం కడతాం
- పారదర్శకతకు పెద్దపీట
- రాజకీయ జోక్యానికి తావుండదు
- కమిషన్ చైర్మన్‌గా ఘంటా బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని, కొత్త ఏడాది కొత్త ఉద్యోగాలతో నిరుద్యోగ సమస్య కొంత పరిష్కారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టి ప్రతిభా వంతులకే ఉద్యోగాలిస్తామని స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా నియమితులైన చక్రపాణితో గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్ సభ్యులుగా నియమితులైన సి.విఠల్, బానోతు చంద్రావతితో చక్రపాణి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా వారిని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమానికి కమిషన్ మరో సభ్యుడు మతీదుద్దీన్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా చక్రపాణి విలేకరులతో మాట్లాడారు. అనంతరం గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, నాంపల్లిలోని టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కమిషన్ ఉద్యోగులు నిర్వహించిన స్వాగత కార్యక్రమంలో చక్రపాణి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతాం.
నేటి నుంచే పని ప్రారంభిస్తాం. నియామకాల విధానంపై రెండు మూడు రోజుల్లో చర్చిస్తాం. నాలుగైదు నెలల్లో నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుంది’’ అని చెప్పారు. వివిధ శాఖల్లో విభజన పూర్తి కాలేదని, ఆ ప్రక్రియ పూర్తయితే మరిన్ని ఉద్యో గ ఖాళీలు వస్తాయన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల భర్తీకి ప్రయత్నిస్తామన్నారు. నియామకాల్లో పైరవీలకు అవకాశం ఇవ్వబోమని, ఎవరి మాటా వినకుండా ఉంటాను కాబట్టే సీఎం తనకు ఈ బాధ్యతలు అప్పగించారన్నారు.
‘‘సీఎం చెప్పినా వినకుండా నిజాయితీకి పట్టం కడతా. కమిషన్ పరంగా గతంలో జరిగిన పొరపాట్లు తెలంగాణ కమిషన్‌లో జరగవు. ఇంటర్వ్యూలకు మినహా నిరుద్యోగులు కమిషన్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు చేపడతాం. దరఖాస్తులు, హాల్‌టికెట్లు అన్నీ ఆన్‌లైన్ చేస్తాం. ఒత్తిళ్లకు లొంగకుండా, అవినీతికి తావు లేకుండా ఆదర్శ వ్యవస్థగా కమిషన్‌ను నిలబెడతాం’’ అని చెప్పారు. కమిషన్ సభ్యుడు విఠల్ మాట్లాడుతూ... పైరవీలు చేస్తే ఉద్యోగాలు వస్తాయన్నది గతమన్నారు. ఇకపై అలా ఉండదన్నారు.
గతంలో నియామకాల్లో తెలంగాణ బిడ్డలకు అన్యాయం చేశారని, ఇంటర్వ్యూల్లో ఏపీవారికి 80 మార్కుల వరకు వేస్తే తెలంగాణ వారికి 15 నుంచి 20 మార్కులే వేసి అన్యాయం చేశారన్నారు. తండ్రి పేర్లతో తెలంగాణ వారిగా గుర్తించి మరీ తప్పిదాలకు పాల్పడ్డారన్నారు. సభ్యురాలు బానోతు చంద్రావతి మాట్లాడుతూ అభ్యర్థుల ఆశలకు అనుగుణంగా నోటిఫికేషన్లు జారీ అవుతాయని చెప్పారు. నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో ఉండాలని సూచించారు. తెలంగాణ సర్వీసు కమిషన్‌ను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ బాల్క సుమన్ మాట్లాడుతూ విద్యార్థుల ఆశలకు అనుణంగా సీఎం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల్లో ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. గతంలో జరిగిన తప్పిదాలు జరక్కుండా కమిషన్ చూడా లని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రూపు-1 అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్ తదితరులు మాట్లాడారు. త్వరలోనే గ్రూపు-1, గ్రూపు-2 నోటిఫికేషన్లు ఇవ్వాలన్నారు.
టీఎస్‌పీఎస్‌సీకి చాంబర్ సమస్య
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు వసతి సమస్య ఎదురైంది. రాష్ట్ర విభజన తరువాత కూడా ఏపీపీఎస్సీలోని ఉద్యోగులను, భవనాలను విభజించకపోవడంతో తెలంగాణ చైర్మన్‌కు, సభ్యులకు గదుల కొరత ఏర్పడింది. ఆగస్టు 8న టీఎస్‌పీఎస్‌సీని ఏర్పాటు చేస్తూ టీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినా ఏపీపీఎస్సీలోని ఉద్యోగులను, కార్యాలయ భవనాన్ని విభజించలేదు. మంగళవారం టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శిని, బుధవారం కమిషన్ చైర్మన్‌తోపాటు సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది.
ఏపీపీఎస్సీలో చైర్మన్, కార్యదర్శి, కొందరు సభ్యుల పోస్టులు ఖాళీగా ఉన్నందున వారి చాంబర్లను తీసుకోవాలని, బాధ్యతల స్వీకరణ ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీ అధికారులకు స్పష్టం చేసింది. అయితే వారంతా గురువారం కార్యాలయానికి వెళ్లేసరికి అక్కడ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇన్‌చార్జి చైర్మన్‌గా కమిషన్ సభ్యుడు శివనారాయణ, ఇన్‌చార్జి కార్యదర్శిగా కమిషన్ అదనపు కార్యదర్శి రమాదేవిలు ఇన్నాళ్లూ తమ చాంబర్లలోనే (సభ్యునిగా శివన్నారాయణకు కేటాయించిన చాంబర్‌లో, అదనపు కార్యదర్శిగా రమాదేవికి కేటాయించిన చాంబర్‌లో) ఉన్నారు.
కాని గురువారం టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌గా నియమితులైన ఘంటా చక్రపాణి, కార్యదర్శి సుందర్ అబ్నార్ కమిషన్ కార్యాలయానికి వెళ్లగా ైచైర్మన్ చాంబర్‌లో శివనారాయణ, కార్యదర్శి చాంబర్‌లో రమాదేవి ఆసీనులయ్యారు. అయితే ఘంటా చక్రపాణి వెళ్లగానే ఏపీపీఎస్సీ ఇన్ చార్జి చైర్మన్ ఆ చాంబర్ నుంచి వెళ్లిపోయారు. కాని ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి మాత్రం ఆ చాంబర్‌ను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇదివరకు మీ చాంబర్‌లోనే ఉన్నారు కదా, మేము వచ్చేసరికి ఇందులోకి వచ్చారేంటని టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి అడిగినా కుదరదని చెప్పారు.
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తేనే ఇస్తామన్నారు. పక్క గదిలో కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉన్నందున ఈ చాంబర్‌ను ఇవ్వబోమన్నారు. కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఉన్నగదికి తాళం వేసి సీల్ వేసుకొమ్మని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి సూచించినా వినిపించుకోలేదు. ఎట్టకేలకు గురువారం సాయంత్రం కార్యదర్శి చాంబర్‌ను టీఎస్‌పీఎస్‌సీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.